కాందిశీకుడి ప్రేమ

charminar
 kurma

రెండునెలలుగా ప్రయత్నిస్తున్నాను తప్పించుకోడానికి. కానీ, ఇక తప్పింది కాదు. అఫ్సర్ పట్టుదలముందు నా ప్రయత్నాలు ఫలించలేదు. కాలమ్ రాయడమంటే సాహసమే కదా. నెలా నెలా రాయాలంటే ఎంత కష్టం. డెడ్ లైన్లను అసహ్యించుకునే అనేకానేక జర్నలిస్టులలో నేను కూడా ఒకడిని. పీకమీదకొచ్చేదాకా అక్షరం కదలదు. అట్లని రాయడానికి ఏమీ లేదని కాదు. కేవలం రాయడం వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తప్పని సరిగా రాయాలి. తమకు మాత్రమే తెలిసిన, తాము మాత్రమే చూసిన, అర్ధం చేసుకున్న ప్రపంచాన్ని తప్పనిసరిగా అందరూ రాయాలి.

ఇంత సంక్లిష్టమైన, విశాలమైన, సుందరమైన, నీచమైన, ప్రేమాస్పదమైన లోకాన్ని గురించి ఎంతెంత మంది, ఎన్నెన్ని తీర్ల చెప్తే తప్ప ఎలా పూర్తిగా వర్ణించగలం?

పతంజలిగార్ని ఏదైనా సభలో మాట్లాడమంటే అనేవారు, మాట్లాడడం ఎందుకండీ అని. “ఏవో నాలుగు ముక్కలు రాసుకోవడం సులభం కదండీ. మాట్లాడే పని ఎందుకు మనకి” అనేవారు.

నన్నోసారి అడిగారు, ఈ మధ్య ఏం రాసేరండీ అని. నేనన్నాను, “రాయడం ఎందకండీ, రాయడం కంటే చదవడం సులభం కదండీ,” అని. గురువుగారికి తనమాటల్నితనకే అప్పచెప్తున్న విషయం అర్ధం అయి నవ్వేరు. ఆయన నవ్వే అందమైనది.

తప్పించుకోడానికి అంటాం కానీ, జర్నలిస్టులకు రాయడం తప్ప ఇంకేం చేతనవుతుంది? కొందరు జర్నలిస్టులు (రచయితలు కూడా అయిన పతంజలిగారి లాటి వాళ్ళ గురించి చెప్పనే అక్కర్లేదు) గొప్పగా రాస్తారు. ఇంకొందరు ఓ మోస్తరు రాస్తారు. కానీ, రాయడం రాయాలి కదా ఏదో ఒకలాగా. జర్నలిస్టు సాక్షి కదా — సమస్త వైతరణీ నదులకూ, హింసా-ప్రతిహింసలకూ, వింతలకీ, వినోదాలకీ, చారిత్రక సంక్షోభాలకీ, వేదనలకీ, ప్రేమలకీ, వంచనలకీ. ఏదో ఒకటి రాస్తూనే వుండాలి, ప్రతిరోజూ.

అందుకే మొత్తానికి రాద్దామనే నిర్ణయించుకున్నాను. నాకళ్లతో చూసింది, నాకు అవగతమైంది, నాకు సాధ్యమైనంతమేర రాద్దామని. సరిగ్గా రాద్దామనుకున్న సమయానికి తెలంగాణా వచ్చేసింది. ఇక తెలంగాణ గురించి కాకుండా ఈ ఉద్వేగభరితమైన సందర్భంలో ఎవరైనా ఇంకేం రాయగలరు? జరిగేది అధికారమార్పిడి మాత్రమే. రాత్రికి రాత్రి ఏదో స్వర్గం వచ్చేస్తుందని కాదుకాని, ఇది ఒక తప్పనిసరి పోరాటం. ఒక అనివార్యమైన మజిలీ.

charminar

నా జీవితంలో దాదాపు సగం హైదరాబాద్ లోనే గడిచిపోయింది. పుట్టి పెరిగి, చదువుకున్న ఉత్తరాంధ్రలో ఎన్ని సంవత్సరాలు వున్నానో, ఇక్కడ కూడా అన్నే సంవత్సరాలు వున్నాను. ఇరవై ఏళ్ల పాటు చాలా దగ్గరి నుంచి చూశాను తెలంగాణాని, ఇక్కడ ప్రజల్ని. జిల్లాల్లో ఎన్నో సార్లు తిరిగాను, రైతులతో మాట్లాడాను. కేవలం జర్నలిస్టు కళ్ళతో మాత్రమే కాదు, విప్లవోద్యమం దృక్కోణంతో కూడా చూశాను. ఇక్కడి అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి తెలంగాణా ప్రజలు ఎదుర్కొనే కనిపించని దాడిని కూడా చూశాను. మా బంధువులు కొందరు, “అదేవిట్రా, వీడికి తెలంగాణా భాష వచ్చేసింది,” అని మొహం మీదే అనడం చూశాను.

“మదర్ టంగ్ కదా, వస్తుంది,” అని అప్పటికైతే వాడు సమాధానం ఇచ్చాడు. కానీ, వాడి మనసు విరిగే వుంటుంది.

ఇలాటి ఎన్నో సందర్భాలకి సాక్షి అయినవారెవరైనా తెలంగాణాకు బేషరతు మద్దతు ఇవ్వకపోతేనే ఆశ్చర్యం గాని, ఇస్తే ఏం ఆశ్చర్యం. ఇక ఈవాదనల్ని చేస్తున్నందుకు అక్కల దగ్గర్నుంచి, కజిన్ల దగ్గర్నుంచి, ప్రాణమిత్రుల్నించి ఎదుర్కొన్న ప్రశ్నలు అన్నీ ఇన్నీ కాదు. ఆస్తికి సంబంధించిన, ఆధిపత్యానికి సంబంధించిన ఎవరివో వాదనల్ని మనం మీదేసుకుంటున్నామని వాదించేను. కొందరు నిజంగానే కలిసివుంటే మంచిది కదా అన్న మానవ సహజమైన, న్యాయబధ్ధమైన వాదన చేశారు. మా ఫాదర్ కూడా అన్నారు, కలిసి వుండాలి అనుకోవడం తప్పెలా అవుతుందని.

అవును, కలిసి వుండాలనుకోవడం తప్పెలా అవుతుంది? మనం మనుషులం కదా. ప్రేమికులం కదా. నలుగురు మనుషులు కలిసి జీవించడాన్ని కలగన్న వాళ్ళం కదా. కానీ, మరి కలిసి వుండడానికి మనం అర్హులం అయివుండాలి కదా. అంటే, కలిసివుండాలి అనుకునేవారు అందరూ అర్హులుకాదని కాదు. ఒక జాతిగా మరో జాతిని ఎలా చూసేం అన్నదాని బట్టి వుంటుంది కదా ఆ అర్హత.

అందుకే, తెలంగాణా వచ్చిన రోజున విజయనగరం నుండి మా ఫాదర్ ఎస్ ఎమ్ ఎస్ ఇచ్చారు, “అభినందనలు” అని. అవును, మాది ఉత్తరాంధ్రనే. మా శుభాకాంక్షలు మా పిల్లలకి, పోరాడినవాళ్ళకి, తెలంగాణకి. వాళ్ళు ఇక మానవీయ, ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం కొనసాగించాలి. మొన్నటి లాగానే, రేపు కూడా మా మద్దతు వుంటుంది.

- కూర్మనాథ్

Download PDF

4 Comments

  • వెల్లంపల్లి అవినాష్ says:

    ఆర్ద్రమైన మీ సహానుభూతికి ధన్యవాదాలు!

  • RAJAN says:

    అందరు గిట్లనే అర్ధం చేసుకుంటే మంచిగా ఉంటది కదా !

  • rachakonda srinivasu says:

    hrudayapu porallonchi vachindhi.Hrudhyamga vundhi

  • kv ramana says:

    “అదేమిట్రా…వీడికి తెలంగాణ భాష వచ్చేసింది” తెలంగాణపై సీమాంధ్రుల ఆధిపత్యం నిజం. తెలంగాణ వారు వేరుపడాలని కోరుకోవడంలో న్యాయం ఉందని కూడా ఒప్పుకోవచ్చు. కానీ ఇలాంటి కారణాలతో వేర్పాటును సమర్థించుకోవడం చాలా అర్థం లేనిదిగానూ, చవకబారుగానూ కనిపిస్తుంది. తెలంగాణ భాష ఆంధ్రావాళ్ళకు వింతగా కనిపించినట్టే, ఆంధ్రా వాళ్ళ భాష తెలంగాణ వాళ్లకూ వింతగానే కనిపిస్తుంది. ఆంధ్రా వాళ్ళు దీర్ఘాలు తీస్తూ, లేదా మాటకు ముందు ఆయ్…అనే మాట చేర్చుతూ(ముఖ్యంగా గోదావరి జిల్లాల వాళ్ళు) మాట్లాడే పద్ధతిని ఇమిటేట్ చేసిన తెలంగాణ మిత్రులెందరో నాకు తెలుసు. నేను హైదరాబాద్ లోనే చదువుకున్నాను. ఉద్యమం వేడిలో ఇలాంటి అర్థం లేని కారణాలు ముందుకు తెచ్చి ఉండచ్చు. తెలంగాణ వచింతర్వాత కూడా వీటిని సాగదీయడంలో అర్థం లేదు. రచయిత అయిన కూర్మనాథ్ గారు ఈ సంగతి గ్రహించాలి.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)