ఈకలు రాలుతున్నాయి

అబ్బా నిద్ర పట్టేసింది.

 

ఇంకా చెబుతూనే ఉన్నావా? ఇన్నిరాత్రులుగా నా చెవిలో గుసగుసగా చెబుతున్న అవే మాటలు. రేపు మాట్లాడుకుందాం ఇక పడుకోవూ! ఊహూ, అస్సల్లేపను. భయమేస్తే ఏడుపొస్తే కూడా. నిద్రలో ఉలిక్కిపడి లేస్తానేమో అని ఎన్నేళ్ళు ఇలా మేల్కొని, మేల్కొని ఉండటం కోసం మాట్లాడుతూ ఉంటావ్, అవే అవే మాటల్ని? ఇదేగా చెబుతున్నావు ఇవ్వాళ కూడా-

1384107_10153291089355363_299593426_n

“బుజ్జి పిట్ట గూట్లోకి దూరి గడ్డి పరకలు అడ్డం పెట్టుకుంది. అన్నీ భ్రమలే దానికి, ఎప్పుడూ ఒకేలాంటివి, దాన్ని ఎవరో పిలుస్తున్నట్టు, కొన్నాళ్లకి అలవాటు పడింది. కొమ్మల్లో చప్పుడైనా అది తన లోపలి అలికిడి అనే నమ్ముతుంది. వర్షం వెలిసిన పూట కూడా తలుపు తియ్యడం మానేసింది. ఏమయిందో తెలీదు చెట్టు కాలిపోయిందో రోజు. నిప్పు ఉప్పెనలా కమ్ముకొస్తే కూడా తలుపు తియ్యడం ఎలానో, తను కాలిపోకుండా ఎందుకుండాలో తెలీలేదు పాపం. అప్పుడందట- రోజూ ఇదే కల నాకు. నిద్రపట్టేస్తుందిలే మళ్ళీ అని”

 

ఇదే కథని ఎన్నాళ్ళు చెబుతావింకా? పోనీ కొత్తగా ఏమైనా చెప్పు. పిట్ట సంగతి మర్చిపో. ఏదోటి చెప్పు, చెరువులో నీరంతా కలువపూలుగా మారేలోపు రాలేకపోయావనో, వచ్చేలోగా ఋతువు మారిపోయిందనో, దారిలో అడ్డంగా అడవి నిద్రపోయి లేవకపోతే మోకాళ్లకి అడ్డుపడి ఆగిపోయావనో. ఇవేం కాదా? దార్లో కనపడ్ద ప్రతీ గూడు దగ్గరా ఏదో వెర్రిఆశతో ఆగుతూ జారిపడ్డ ఒక్కో గడ్డిపరకనీ ఏరుకుంటూ వచ్చావా!

 

చూడు! రాత్రిని తొనలుగా వలిచి చెరిసగం చేసుకోవడం వీలు కాదు. తెల్లారితే నిన్ను చూసే తీరికా ఉండదు. రోజంతా గుట్టలెక్కుతూ గడపాలి. నీకు రూపం లేదు నిజమే, ఐనా భుజాన మొయ్యలేను. అప్పట్లాగా రెక్కలు చాచలేకనే అడిగావు నన్ను. నువ్వు పిట్టగా ఉన్నరోజుల్లో ఐతే, అప్పుడే నా దగ్గరకొచ్చి ఉంటే హాయిగా కలిసి ఎగిరేవాళ్లం కదూ! ఇప్పుడేం చెయ్యగలను. బలం చాలదు ఆజన్మాంతం వెంటాడే నీ దుఃఖపు బరువుని మోసుకు తిరగడానికి. బుజ్జిపిట్టా! వెళ్ళిపో ఎటైనా…

-స్వాతి కుమారి బండ్లమూడి

Artwork: Mandira Bhaduri

Download PDF

8 Comments

 • kcubevarma says:

  బాగుంది స్వాతి గారు.. దుఃఖపు బరువును మోయడానికి బలం చాలదు నిజంగానే..

 • Mohanatulasi says:

  చెరువులో నీరంతా కలువపూలుగా మారేలోపు రాలేకపోయావనో, వచ్చేలోగా ఋతువు మారిపోయిందనో, దారిలో అడ్డంగా అడవి నిద్రపోయి లేవకపోతే మోకాళ్లకి అడ్డుపడి ఆగిపోయావనో. – అస్సలు, టూ మచ్! ఉహలెంత అందంగా ఉండచ్చనే దానికి ఒక అద్భుత ఉదాహరణ!

 • Thirupalu says:

  బాగుంది!

 • savitri says:

  Beauutiful!!

 • రవి వీరెల్లి says:

  Awesome!

 • Ravindra says:

  చాల భాగుంది …

 • మణి వడ్లమాని says:

  స్వాతి! చాల బావుంది . రాత్రి చలం మళ్ళి మ్యూజింగ్స్దు చదువుకొంటున్నాను ,ఆయన చిన్న పడవలో కొల్లేరు వెళుతున్నప్పటి అనుభవం రాసారు. నాకు ఎందుకో అది గురుకొచ్చింది.

 • Prasuna says:

  “చెరువులో నీరంతా కలువపూలుగా మారేలోపు రాలేకపోయావనో, వచ్చేలోగా ఋతువు మారిపోయిందనో, దారిలో అడ్డంగా అడవి నిద్రపోయి లేవకపోతే మోకాళ్లకి అడ్డుపడి ఆగిపోయావనో ” బ్యూటిఫుల్ .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)