కనుగొంటి కనుగొంటి…

drushya drushyam-23తీసిన కన్నే అయినా కొన్ని చిత్రాలు జరూరుగా మళ్లీ కళ్లల్లో పడి కలవరపెడతాయి. గుండెను కలుక్కుమనిపిస్తాయి.
‘మో’ అన్నట్టి “బతికిన క్షణాల’ను యాతనకు గురి చేస్తూ ఉంటాయి. ‘అజంతా’లా ఒకే కవితను పదే పదే చెక్కినట్టు, ఒక ఫొటోయే మనిషిని గతం కోసం వర్తమానం కోసం భవిష్యత్తు కోసం కూడా కొద్దికొద్దిగా చెక్కి విడిచిపెడుతుంది! కనాలని, వినాలని!

‘వెన్నుపూస’ కనిపిస్తున్న ఈ ముసలమ్మ ఫొటో నావరకు నాకు అలాంటి జలదరింపే.
ఉదయం లేవగానే నా పాదాలకు నేను నమస్కరించుకున్నాననే కవి సమయం వంటిదే!
ఒక ప్రాతఃస్మరణీయ అస్తిత్వం.

చివరాఖరికి ఎవరి చిత్రమైనా ఇదే.
అనాధగా ఉన్న స్థితిని చెప్పే ఈ ఫొటో, అదే సమయంలో-తానే కాదు, ఎవరికి వారు ఆత్మస్థైర్యంతో నిలబడతారనీ చెబుతుంది. చెప్పక తప్పక చూపడం. అంతే!

+++

ఎందుకనో తిరిగి తిరిగి ఈ చిత్రం వద్దకే వచ్చి నా చూపు ఆగిపోతుంది.
మన బుగ్గలని తన గరుకు చేతులతో తడిమిన ముసలమ్మలు ఒకరొకరుగా గుర్తుకు వస్తారు, చూస్తూ ఉంటే.

అంతెందుకు చూస్తూ ఉంటే, మా ఇంట్లో మా తాతమ్మ రమణమ్మ యాదికొచ్చి ఆమె దేవుడి అర్ర తలుపు తెరుచుకుంటుంది. లేదంటే తన పాన్ దాన్ తెరుచుకుంటుంది, ఆ వెన్నుపామును కన్ను తడుముతుంటే!
చూడగా చూడగా ఆ రయిక, ఎర్రెర్రని చీర. వయసు పెరుగుతుంటే మెలమెల్లగా బాబ్డీ హెయిర్ అయిన జుట్టు…అట్లట్ల మనుషులు తప్పుకుని, గొడ్డో గోదో…పశుపక్ష్యాదులో రక్షణగా లేదంటే జీవస్పర్శగా మారిన వైనం తెలిసి వస్తంది. లోపలి చీకట్లని చీల్చే ఒక బైరాగి తత్వాన్ని ఆలపిస్తుంది.

+++

అట్లా చూస్తూ ఉంటే, తెలిసిన ముసలివాళ్లు, వాళ్ల జీవన వ్యాపకాలన్నీ కళ్లముందు తారాడి, వాళ్ల దగ్గరి తంబాకు వాసనో, పాన్ వాసనో…ఇంకేవో ముసురుకున్న జ్ఞాపకాలై మెదిలే ఏదో పచ్చటి జీవధాతువు స్పర్శ….
మనిషిని పొయ్యిమీంచి పెనంపైకి చేర్చినట్లాంటి ఒక చిత్రమైన కల్పన…
నేను తీసిన చిత్రమే ఒక అధివాస్తవిక చిత్రంగా మారిపోతుంది చిత్రంగా,.

చాలాసార్లు మనిషి ఉండడు. తప్పుకుంటాడు, ఏదో కారణంగా.
కానీ, ఒక వెన్నుపామైతే ఉంటుంది, బతికినంత కాలం, ఎవరికైనా, జీవచ్ఛవంగా బతికినప్పటికీ!
దానిపై చూపు నిలపడం అన్నది నా చేతుల్లో లేదు. నా ప్రణాళికలో లేదు. కానీ ఇదెలా వచ్చింది?
అదే చిత్రం.

ఒక స్థితీ గతీ ఆవిష్కరిస్తూ, ఎలాగో ఎలా తెలియదు. కానీ, హఠాత్తుగా ఒక దృశ్యం నా చేతుల్లో అలా బందీ అయి నన్ను విడుదల చేస్తుంది, గతంలోకి! తద్వారా నాతో మీరు, మీతో నేను. మనందరం ఒక చిత్రం వద్ద ఆగి ‘ఓ హెన్రీ’ కథలోలా ‘ఆఖరి ఆకు’ను చిత్రించాలేమో ఇలా. ఈ ముసలమ్మలు దీనంగా చావకుండా.

+++

నిజానికి, ఎలా బయలుదేరుతాం? చిన్నప్పుడు కాదు, పెద్దయ్యాక. చాలా మామూలుగా బయటకు బయలు దేరుతాం. మనసులో ఎన్నో తిరుగుతాయి. ఆయా పనుల గురించి, ఎటునుంచి ఎటు వెళ్లి ఆ పనుల్ని చక్కబెట్టుకోవాలో కల్పించుకుంటూ బయలుదేరుతాం. అలాగే పనిచేసే చోటుకు వెళ్లాక అక్కడ కూచుని ఏం పనులు చక్కబెట్టుకోవాలో కూడా సోంచాయించుకుంటం. దానికి తగ్గట్టు బయట ఎవర్ని కలవాలో ముందుగానే కలుసుకుంటూ వెళతాం. అయితే, ఇదంతా ఇంట్లోంచి వెళ్లడానికి ముందు మనసులో చేసుకునే గునాయింపు. కానీ, అడుగు బయట పెట్టగానే లోకంలో అప్పటిదాకా మనమెంత మాత్రం ఊహించనివి మనకు కానవస్తాయి.

అంతా మంద. గుంపు. అందులో ‘కాటగలవకుండా ఉండేందుకా’ అని ఇంట్లోనే కొన్ని అనుకుని బయలు దేరుతాం. కానీ ఏమవుతుంది? కొత్తవి కనబడతాయి. పాతవే సరికొత్తగా తారసపడతాయి. తెలియకుండానే అవి మళ్లీ పరిచయం అవుతాయి. మెలమెల్లగా మరింత సన్నిహితం అవుతాయి. కొన్ని పరిచయాలు ఇంకాస్త దగ్గర అయి మనతో ఉంటాయి. కొన్నేమో అలా వచ్చి ఇలా వెళతాయి. కానీ, ఏదీ మనం ప్లాన్ చేసుకోం. నిజానికి మనం ప్లాన్ చేసుకున్నవి సఫలమయ్యాయో, విఫలమయ్యాయా విచారించుకుంటే నూటికి తొంభై లేదంటే యాభైశాతం ఫెయిల్ అవుతాయి. మొత్తంగా ప్లానింగ్ వృథాయే అవుతుంది. కానీ, అంగీకరించం. వేరే కొత్తవేవో ముందుకు వచ్చి పడతాయి. వాటితో ఆ క్షణాలు, ఘడియలు సరికొత్త గంతులేసుకుంటూ అట్లా దొర్లిపోతాయి. కానీ ఆ కొత్తవాటిని సరిగ్గా చూసి, అభిమానంగా దర్శించుకుంటే ఎన్నో పాత విషయాలు. నా వరకు నాకు, అందులో ఈ వృద్ధతేజం కూడా ఉంటుంది.

సరిగ్గా చూస్తేగానీ తెలియదు. అప్పటిదాకా మన నాయినమ్మని మనం సరిగ్గా చూడం. మన తాతమ్మను మనం సరిగ్గా కానం. కానీ, బయట చూసింతర్వాత లోపలికి చూసుకోవడం పెరిగిందా అది మళ్లీ కొత్త జీవితానికి చిగుర్లు తొడుగుతుంది.
అందుకు దారిచూపేది కళే.

+++

నృత్యమా గానమా సంగీతమా సారస్వతమా ఛాయాచిత్రమా అని కాదు, ఏదో ఒక కళ.
జీవితం ఆవహించిన కళ.

కళ ఒక సూక్ష్మ దర్శిని.
ఇందులో చూడగా కలగలసి పోతున్న, కాటగలసి పోతున్న జీవనదృశ్యాలన్నీ వేరుపడతయి.
మళ్లీ నిర్ధిష్టమై మనల్ని మనకు అప్పజెప్పుతయి.

ఈగలు ముసిరిన కొట్టమే కాదు, అక్కడొక శునకమే కాదు, ఆవు మాత్రమే కాదు, వెనకాల మనిషి మాత్రమే కాదు, మన నాయినమ్మ కూడా కనబడుతుంది.
నాయినమ్మో తాతమ్మో ఆమె తనని తాను నిలదొక్కుకునే చేవను కోల్పోయినప్పటికీ, వొంగి నడుస్తున్నప్పటికీ- ఆమె వెన్నుపూస తళుక్కున మెరుస్తుంది, క్షణమాత్రమే!
ఆ క్షణం కెమెరాకు చిక్కడం ఎప్పుడు జరిగుతుందీ అంటే బయటకు వెళ్లినప్పుడు! ఇల్లు దాటి బయటకు వచ్చినప్పుడు! మనలో మనమే ఉండకుండా ఏమీ కాకుండా, ఊరికే ప్రయాణిస్తూ ఉండినప్పుడు. అదే కళ.

+++

మనకెన్నయినా పనులు ఉండనీ, పనిలో పనిగానైనా మనల్ని చకితుల్ని చేసే జీవన ధాతువుకోసం విరామంలో ఉండాలి. లక్ష్యం కన్నా గమ్యంలో, గమనంలో ఉండటమే కళ. అలా అనుకున్నప్పుడు, ఈ చిత్రం నా నిర్లక్ష్య అసంకల్పిత యానంలో ఒకానొక క్షణభంగుర రహస్యం. హైదరాబాద్ లోని లోయర్  టాంక్ బండ్ దిగువన ఉన్న మార్వాడీ గోశాల దగ్గర ఆఫీసు ఎగ్గొట్టి ఒక పూట ఉండిపోయినప్పటి చిత్రం ఇది. ఏవేవో మనసులో అనుకుని బయలుదేరి,  ఇక్కడి స్థల మహత్యానికి నేను బలహీనుడ్ని అయిపోయి, ఈ బలమైన శక్తివంతమైన జీవితాన్ని కనుగొన్నాను. అందుకు ధన్యుణ్ని.

-తొలుత కెమెరా ప్రపంచాన్ని చూపిన నాన్నకు, అటు తర్వాత జీవితంలో ఉండేందుకు అలక్ష్యంగా ఉండటమే మేలని నేర్పిన రఘురాయ్ గారికి, నా ‘వెన్నుతట్టిన’ ఇటువంటి ఎందరో తల్లులకూ వందనాలు, అభివందనాలు.

మొదటికి, మళ్లీ మళ్లీ జీవితాన్ని కనుగొనాలనే ఇదంతా.

~ కందుకూరి రమేష్ బాబు

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)