సముద్రం మోసపోతున్న దృశ్యం!

 

 

3211225569_b8f3b4b541

సముద్రం – ప్రపంచ కవులందరూ సొంతం చేసుకున్న గొప్ప కవితా వస్తువు.

సముద్రం నాకు – పోరాటానికి,  తిరుగుబాటుకు ప్రతీకగా కనిపిస్తుంది. ఉత్సుంగ కెరటాలతో వర్థిల్లే సముద్రాన్ని చూసినప్పుడల్లా నాకు గొప్ప ఉత్సాహం కలుగుతుంది. కవితావేశం కలుగుతుంది. రాళ్లను వొరుసుకుంటూ మహా చైతన్యంతో కెరటాలు ముందుకు వస్తుంటే.. కాసిన్ని గవ్వలు వొడ్డుల వొడిలోకి చేరుతుంటే – ఆ అనుభూతిని సొంతం చేసుకోవటం నాకు మరిచిపోలేనిది.

గవ్వల్లో, శంఖాల్లో కూడా సముద్రమే. సముద్రపు ఘోషే ..

కవులు – సముద్రాన్ని ఆసరాగా చేసుకుని బతుకుతున్న శ్రమజీవులను, శ్రమ సౌంధర్యాత్మకతనూ కవిత్వం చేసారు. సహజ సిద్ధమైన వాళ్ల జీవన విధానం -భయాందోలనకు గురవుతున్నప్పుడు – ఎదురుతిరగడాన్ని ప్రవచించారు.

సముద్రం – ఉత్తరాంధ్రాకు గొప్ప వనరు. సముద్ర తీరప్రాంత ప్రజలు – ముఖ్యంగా మత్స్యకారులు సముద్రం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏ వనరైనా ప్రజల ఉమ్మడి ఆస్తి. కానీ యిప్పుడు ఏ వనరును చూసినా వొకే వ్యక్తికి ధారాదత్తమౌతున్న స్థితి.
సముద్రం మీద పెట్టుబడిశక్తులు కన్నేసినప్పుడు.. ఆర్థిక సంస్కరణల మాయా ముసుగు పొర కమ్మేసినప్పుడు..  ప్రజల జీవన స్థితి ధ్వంసమైనప్పుడు – ఒకరిద్దరు వర్తమాన ఉత్తరాంధ్రా కవులెలా స్పందించారన్నది ఈ చిన్న వ్యాసం ఉద్దేశం.

సిరికి స్వామి నాయుడు

సిరికి స్వామి నాయుడు

‘మంటిదివ్వ’ కవితాసంపుటితో ఉత్తరాంధ్రా మట్టిపరిమళపు కవిత్వ సొబగును ప్రపంచానికి తేటపరిచిన  కవి – సిరికి స్వామినాయుడు –

‘ యీ సముద్ర గర్భాన చేపపిల్లలై ఈదులాడుతున్న వాళ్లు
పోటెత్తిన తరంగాల మీద పురుడోసుకున్న వాళ్లు
అలల పయ్యాడ కొంగుపట్టి ఉయ్యాలలూగినవాళ్లు
తీరాన్ని తలకెత్తుకుని……… సాగరగీతమైన వాళ్లు ‘

అని.. వాళ్ల సహజమైన జీవన విధానాన్ని కవితామయం చేస్తారు. సముద్రాన్ని తల్లిగా భావించి, అలలను పయ్యాడ ఉయ్యాలగా చేసుకుని.. నిష్కల్మసంగా బతుకుతూ  బతుకు జీవన పోరాటంలో వాళ్లు తీరాన్ని తలకెత్తుకుని సాగరగీతమవుతుంటారు-
అని అంటారు.

మరో ఉత్తరాంధ్రా కవి-  ఇటీవలనే ‘అస్తిత్వం వైపు’ కవిత్వ సంపుటితో ముందుకొచ్చిన- పాయల మురళీకృష్ణ ‘రేపటి సూర్యోదయానికి ముందు..’ కవితలో… మత్స్యకారులు వేటకి దిగినప్పుడు జరిగే కోలాహలాన్ని కవిత్వం చేస్తూ..

‘ తెప్పల మీదకు చేరిన వలలన్నీ
నడి సముద్రంలో
నడి రాత్రి కూడా చైతన్యాన్ని రెక్కలుగా తగిలించుకుని
ఎంతో విలువైన జల పుష్పాలనందిస్తుంటే
అక్కడెక్కడో అతని హస్త నైపుణ్యం
ఎన్నెన్నో గర్భ గోళాల మీద
పరోక్షంగా తన సంతకాన్ని ముద్రించుకునేది ‘

వొక మత్స్యకార సృజనశీలిని కేంద్రబిందువుని చేస్తారు. యిక్కడ వొక సంఘటనను వొకే దృశ్యశకలంగా కవిత్వం చేయడం గుర్తించొచ్చు.

యీ యిద్దరు ఉత్తరాంధ్రా కవులూ మత్స్యకారుల జీవన పరిశ్రమను వొకింత ప్రేమతో, వొకింత ఆర్తితో కవిత్వం చేసారు.

‘ పుట్టెడు ఆశతో వెళ్లిన తెప్పలన్నీ
కలుషిత జలదేవత విదిల్చిన
అనంతమైన శూన్యాన్ని ఎత్తుకొస్తుంటే
సమస్తాన్నీ కోల్పోయిన
బెస్త బతుకులు పస్తు బతుకులయ్యాయి ‘

– అని ‘మురళీకృష్ణ’ దుఃఖపడితే…..

‘ వాళ్లు కట్టుకున్న గుజ్జన గూళ్ల మీదా
నురగల పరవళ్ల తెల్లని చిరునవ్వుతీరం మీదా
ఓ రాకాసి నీడ కమ్మేసింది
తూరుపు సముద్రపు తరంగాల మీద
తుళ్లిపడే బంగారు బొచ్చెపరిగె సూరీడ్ని
రాహువేదో మింగేసింది’

– అని స్వామినాయుడు కలవరపడతారు.

యిద్దరూ తమ తమ కవితల్లో పోరాట అవసరాన్ని వ్యక్తం చేయడం సున్నితంగా గుర్తించొచ్చు.

‘రేపటి సూర్యోదయం
వాళ్లకు వాళ్ల అస్తిత్వాన్ని ప్రసాదించడమే చూడాల్సి వుంది’
ఇది మురళీకృష్ణ యిచ్చిన ముగింపు.

‘పల్లె వాళ్ల ఆల్చిప్పల కళ్లలోంచి కురిసే కన్నీళ్లు – సముద్రం
చందమామ-
వాళ్ల సామూహిక సమాధి మీద దీపం’
ఒక జీవిత దుఃఖాన్ని ముగింపుగా పలికించారు. లోలోపల అంతర్గతంగా
జ్వలితమౌతున్న కసే – నాకైతే ఈ ముగింపులో కనిపించింది.
దిగులు నుంచే దుఃఖం నుంచే పీడన నుంచే పోరాట పుష్పం విరుస్తుంది.

పైడిరాజు

పైడిరాజు

నేటి ఉత్తరాంధ్రా కవుల వారసత్త్వాన్ని అందుకుంటూ..  పద్నాలగేళ్ల కవి- ఎస్. పైడిరాజు ‘నీళ్లు’ కవితలో ఏమంటున్నాడో చూడండి.

‘విశాలంగా
విన్నూత్నంగా వున్న ఆ నీళ్లలో
జలకాలాడేం వొకప్పుడు..
మరి యిప్పుడో
ఆ నీటి వొడ్డుకు వెళ్లడానికి ఆలోచిస్తున్నాం
ఆ నీరు అనేక ఫ్యాక్టరీలకు ఆధారమయ్యింది

కానీ ఆ ఫ్యాక్టరీ వాళ్లు విశ్వాసం మరిచారు’

వొక  స్పృహని కల్గి వుండడమంటే బహుశా యిదే అనొచ్చు. వర్తమాన సామాజిక స్థితిని అర్థం చేసుకొని కవిత్వం చేయడంలో రేపటి మలితరం సిద్ధంగా తయారౌతుందనడానికి యిదొక రుజువు. మొత్తానికి కవిత్వం ప్రజల కోసం- అనే విషయాన్ని ప్రస్తుతం అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న కవిత్వంలాగానే ఉత్తరాంధ్రా కవిత్వమూ నిరూపిస్తుంది.

బాలసుధాకర్ మౌళి

Download PDF

10 Comments

  • rajaram thumucharla says:

    మోసపోతున్న సముద్రాన్ని కవుల వైవిధ్య దర్శనాన్ని విశ్లేషించిన వైనం బావుంది మౌళి

  • వెల్లంపల్లి అవినాష్ says:

    పద్నాలుగేళ్ళ వయసులోనే సామాజిక స్పృహతో కవిత్వం రాస్తున్న పైడిరాజుకు అభినందనలు. అతని కమిట్మెంట్ ప్రశంసనీయం!

  • సాయి పద్మ says:

    కెరటం నాకు ఆదర్శం ..పడినందుకు కాదు , పడినా లేచినందుకు – అనే కవితా వాక్యం ఒకప్పుడు ఆదర్శం అయితే, ఇప్పుడు పడి లేచే కెరటం కూడా ఆలోచిస్తోంది.. ఎంత కాలుష్యం మూటకట్టి , తన పిల్లలని జీవన్మ్రుతులను చేయాలా అని..

    సంద్రంతో ఆటు పోటులతోనే దుఖపడాలా, లేదా , దుఃఖ సంద్రంగా మారుస్తున్న పారిశ్రామిక కాలుష్యంతో నా అన్నది, ప్రతీ ఉత్తరాంధ్ర కవి దుఖం అయినప్పటికీ బలమైన దుఃఖ శకలాన్ని పరిచయం చేసారు మౌళీ.. మంచి వ్యాసం.. !!

    • E sambukudu says:

      మేడమ్ “కెరటం నాకు ఆదర్శం ..పడినందుకు కాదు , పడినా లేచినందుకు ” అన్నకవి ఆచార్య భావాన్ అనే ఉత్తరాంధ్ర కవే.మినీ కవిత్వం ఉదృతంగా వస్తున్న రోజులలో వచ్చిన ఈ కవిత బహుళ ప్రాచుర్యాన్ని పొందింది .

  • E sambukudu says:

    వ్యాసం బాగుందండి మౌళి గారు,కానీ బొచ్చు పరిగెలు సముద్రములో వూంటాయంటారా,బొచ్చు పరిగెలు,బంగారు పాపలు సముద్రపు చేపలు కావనుకూంటానండి,పైడి రాజుకు అభినందనలు .

  • రెడ్డి రామకృష్ణ says:

    మౌళి,మీ వ్యాసం బాగుంది.సముద్రం..సముద్రంపై జీవించే పల్లెకారులగూర్చి యింకా ఒకరిద్దరు ఉత్తరాంధ్రలోనే సీనియర్ కవులు రాసారు.మీరు ప్రస్తుత తరం కవులను పరిగణలోకి తీసుకున్నారు గనక ఆయా కవులను ప్రస్తావించలేదనుకుంటాను.కానీ యిటీవలే తన తనమొదటి కవితా సంపుటిని ప్రచురించిన మరో ఉత్తరాంధ్ర కవి మొయిద శ్రీనివాసరావు “సముద్రమంత చెమట చుక్క” అని తనపుస్తకానికే సముద్రాన్ని శీర్షికగా పెట్టినకవి.అంతే కాకుండా పల్లె కారుల జీవితాలను గూర్చి మీరు ఉదహరించిన కవిత్వం కంటే బలమైన కవిత్వం రాసాడు. బహుసా మీరు చూసి
    వుండరని యిక్కడ ప్రస్తావించాను.

    “నీటిపై తాబేలులా కదలాడిన పడవ
    అతడు తెడ్డు సాయంతో ఒడ్డుకు చేర్చేసరికి
    చచ్చిన ఏనుగులా చతికిలబడుతుంది

    చితికిన బతుకై వెక్కిరిస్తున్న వలను విదిలిస్తే
    చాలీ చాలని చిల్లర కాసులై
    రాలిపడుతున్న చేపలను చూసి
    వీచే గాలిసైతం విషాదగీతం పాడుతుంది

    ఇంతటి సముద్రన్నే ఈదుకొచ్చిన అతను
    యింటి సముద్రాన్ని ఈదాలంటే
    ఒడ్దున సైతం
    తెడ్డుని తనపిడికిట్లోకి తీసుకోవాల్సిందే”.అన్నాడు.

    తమజీవితాలు మెరుగు పడాలంటే ఏమిచెయ్యలో సూచించాడు.మంచి కవిత.
    మీరు మీ వ్యాసము మొదట్లొ ప్రస్తావించిన పోరాట స్ఫూర్తి నిజంగా ఈ కవితలో చాలా బలంగా వ్యక్తీకరించబడింది.

    మంచి వ్యాసం రాసినమీకు నా అభినందనలు.

  • balasudhakarmouli says:

    థ్యాంక్యూ రెడ్డి రామక్రిష్ణ గారూ.. శ్రీనివాస్ రావ్ కవితా సంపుటిని చదివానండి. సముద్రం మీద తను రాసింది మంచి కవిత. కానీ వ్యాసం మరీ పెద్దది అవుతుందని , చదవడానికి సులువుగా వుంటుందని చెప్పి రెండు కవితలనే తీసుకుని.. కవిత్వం మీద నా కుతూహలాన్ని ఈ చిన్న వ్యాసం రూపంలో రాసానండి. ఇతర కవుల కవిత్వాన్ని అధ్యయనం చేయడం .. ఎంతైనా ఎదుగుదలకు దోహదపడుతుందనీ కూడా రాయడం జరిగిందండి. సముద్రం మీద మీరు ఏడాది కిందట రాసిన పోయెమ్ కూడా చదివానండి. సముద్రం మీదా, మత్స్యకారుల మీద బాధ్యతతో రాసిన స్వామినాయుడయినా, మురళీ అయినా, శ్రీనివాస్ రావ్ అయినా, మీరైనా, నా విద్యార్థి పైడిరాజైనా … మీకు, మీ కవిత్వాలకు నా వేల వేల వందనాలు.
    ప్రతి చిన్న కవిత్వం ముక్కైనా .. దానిలో నిజాయితీ ప్రతిధ్వనిస్తుంటే.. వాటిని గుండెలకు హత్తుకోవడమూ వొక గొప్ప కార్యాచరణే అని అనుకుంటూ….
    ధన్యావాదాలు.

  • వాసుదేవ్ says:

    సముద్రం గురించి ఎవరేం రాసినా నాకు తెలీకుండానే స్పందిస్తాను. అక్కడికేదో ఆ సముద్రం నాదైనట్టూ! “ఎంత సముద్రపొడ్డున పుడితే మాత్రం ఇంత బడాయా” అని మీరు అన్నా నా పధ్ధతి మారాదు సుమా! ఈ వ్యాసాన్ని ఆసాంతమూ చదివి మరీ ఇది రాసాను. ఇది ఓ గొప్ప వ్యాసం అనడంలో ఏమాత్రం సందేహం లేదు

  • balasudhakarmouli says:

    తొలి జీవి సముద్రంలోనే పుట్టింది. జీవపరిణామక్రమం సముద్రం నుంచే మొదలైంది. అంటే తొలి అడుగుకు సముద్రమే కేంద్రబిందువు. అలాంటి సముద్రంను స్వార్థమానవుడు నాశనం చేస్తున్నాడు. మూలాలనే ధ్వంసం చేస్తున్నాడు. అడవి గావొచ్చు.. సముద్రం గావొచ్చు.. ఏదైనా.
    అందుకే మూలకేంద్రం మీద నిలబడి పోరాట అనివార్యతను ప్రకటిస్తున్న వాళ్లకు జయవందనాలు. స్పందించిన ప్రగతి దివ్వెలకు వందనం.

Leave a Reply to వాసుదేవ్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)