‘ఈగ’ చెప్పే కథనం

drushya drushyam 24

 

ఏదీ ముందుగా తెలియదు. అదే చిత్రం.

అవును మరి. మనుషులను చిత్రీకరిస్తున్నప్పుడు మొదట్లో తెలియలేదు గానీ, వారిపై వాలిన ఈగలు నిదానంగా కనిపించడం మొదలైంది. చిత్రానికి సంబంధించిన సిసలైన వాస్తవికతను అవే బహు చక్కగా ఆవిష్కరిస్తున్నవి!

ఇదే కాదు, గత వారం ముసలమ్మ వెన్నుపై కూడా ఈగలు ముసిరినవి. అయినా అంతా ఒక అనివార్య ప్రస్థానంగా ఆ ముసలమ్మ వొంగి అలా నడుస్తూనే ఉండింది. తప్పదు మరి!

ఈ చిత్రంలోనూ అంతే. ఆ మహిళ ఎంత ముద్దుగున్నది. ఎంత హాయిగా నిద్రిస్తున్నది. గదువపై, పెదవి మీద
వేలుంచుకుని ఆ నిద్రాదేవే విస్మయపోయే రీతిలో ఆ తల్లి ఎంత హాయిగా సేద తీరుతున్నది!

కాళ్లు రెండూ చాపుకుని నిద్రించే జాగా కూడా లేని ఆ మహిళ.. ఆ పట్టపగలు…ఇంత తిన్నాక…అట్లే…ఆ ఎండ వడలోనే కాసేపు కునుకు తీయడానికని అట్లా వొరిగి ఉంటుంది! కానీ, ఎంత మంచిగున్నది. ఆ స్థితి గురించి ఈ చిత్రమే మాట్లాడుతుంటే ఎంత బాగున్నది!

ఇదే ఈ చిత్రం విశేషం అనుకుంటే, తలను అలవోకగా చుట్టుకున్న ఆ చేతిపై ఈగ వాలడమూ ఇంకో విశేషం!
ఎట్లా? అంటే కొంత చెప్పాలి.

మొదట్లో ఆయా మనుషుల జీవన స్థితిగతులను – వాళ్లు నిలుచున్న చోటు, కూర్చున్న చోటు, లేదా ఇలా విశ్రమించిన చోటును బట్టి తెలియజెప్ప వచ్చని అనుకున్నాను. కానీ, నగరంలోని అనేక బస్తీలను చుడుతూ ఫోటోగ్రఫి చేస్తూ ఉండగా, ఒక్కో చిత్రాన్ని నాకు నేనే చూసుకుంటూ ఉండగా మరెన్నో రహస్యాలు తెలుస్తున్నవి- ఈ చిత్రంలో మాదిరే!  అవును, వాలిన ఈగ -మనుషుల సమస్థ దుస్థితిని చెప్పకనే చెబుతుందని తెలిసి వస్తున్నది.

ఇదొక అనుభవ పాఠం. అవును. ఇదే మొదటి పాఠం కాదు, అంతకు ముందు ఢిల్లీలో చిత్రించిన ఒక ఫోటో ఈ సంగతిని మొదటిసారి తెలియజెప్పింది. అప్పుడు ఒక మగాయన  చిత్రం తీశాను. అతడొక వర్కర్….చిరునవ్వుతో నా కెమెరా వైపు చూస్తూ ఉంటాడు. తనకూ నాకూ మధ్య ఒక పల్చని ఇనుప స్తంభం ఉంటుంది. దానిపై వాలిన ఒక ఈగ ఆ చిత్రంలో కనబడతుంది. ఆ ఈగ ఔట్ ఫోకస్ లో ఉండగా అతడి చిరునవ్వు మాత్రం క్లియర్ గా కానవస్తూ ఉండగా ఆ చిత్రాన్ని క్లిక్  చేశాను. అందులో నేను తెలియకుండానే చెప్పిందేమిటంటే, అది ఎవరైనా కావచ్చును, ఎక్కడైనా కావచ్చును, వాళ్ల స్థితిగతులు ఎంత దుర్భరంగానైనా ఉండనీయండి. కానీ, పెదవులపై దరహాసం మాత్రం చెక్కు చెదరదు.  అదట్లే ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ చిరునవ్వు ఆరిపోక పోగా జీవన తాత్వికతను అర్థం చేసుకున్న అనుభవంతో, ఆ చిరునవ్వు మరింత హృద్యంగా మనల్ని హత్తుకుంటుంది. మన సంపద్వంతమైన జీవితాన్ని ఆ చిరునవ్వు కసిగా కాటువేస్తుంది. ఉదాహరణకు ఈ చిత్రమే చూడండి.

అదమరచిన ఆ యువతి, పెదాలపై వేలుంచుకుని విస్మయపోతూనే నిద్రించడం. ఆ కళ్లు, కనురెప్పలు, నుదుటిపై పచ్చబొట్టు, చేతికి ఏదో కట్టుకున్న విశ్వాసం…అట్లే తన ఒంటిపైన రంగుల చీర, డిజైన్… అంతా కూడా ఆ స్త్రీ తాలూకు సౌందర్యాభిలాష, సఖమయ జీవన లాలస, వదనంలో ఒకవైపు తొణికే ఉల్లాసం అదే సమయాన రవంత విచారం. చిన్న భయవిహ్వలత…ఏదో తెలియని భీతి.

పదే పదే ఆమె మొహాన్ని చూడండి. అది వాతావరణం వల్ల కావచ్చు, అక్కడి తక్షణ పరిసరాల వల్ల కావచ్చు, లేదా దశాబ్దాల తన ఉనికి వల్లా ఏర్పడిన అసంబద్ధ స్థితి వల్లా కావచ్చును, కాసింత అభేదం. అస్తిత్వ ఘర్షణ…బయట  రోడ్డుమీద జీవిస్తున్న యువతి తాలూకు జీవన నిర్వేదం…అంతా కూడా ఆ చిన్న బండిలోనే..ముడుచుకున్న దేహంలోనే…మూసుకున్న కళ్లతోనే అంతా చెప్పడం…

నిజమే, తప్పదు మరి. ఎందరో ఉన్నారు. వీరిలో కొందరు కాలిబాట మీద బతుకుతారు. మరికొందరు వీధిలొ కాసింత జాగాలో ఎలాగోలా తల దాచుకుని జీవిస్తారు. ఇల్లూ వాకిలీ లేకుండానే ఎంతో మంది పట్టణంలో ఇట్లా జీవించే వాళ్లున్నరు. రేషను కార్డు, ఆధారు కార్డుల అవసరాలూ వీళ్లకు ఉంటాయి. కానీ, అంతకన్నా అవసరమైనది ఒక భద్రత. తల దాచుకునేందుకు ఇల్లు. అది లేనప్పుడు ఎక్కడో ఒక చోట ఎంత మైమరపించే నిద్రే అయినా కొద్దిగా కలవరాన్ని, అపశృతిని పలకనే పలుకుతుంది.అదే బహుశా ఆమెలో నేరుగా కానరాని అశాంతినీ ఆవిష్కరిస్తున్నది. అందుకు ప్రబల సాక్షం – ఈగ.

అవును.  అంత హాయిగా ఒరిగినా, ఉన్న స్థలంలో ఒదిగినా, విశ్రమించిట్లే ఉన్నా, ఏ మూలో ఒక అస్తిరత్వం. అభద్రత. అసహజత్వం. ఆ ఒక్కటి చెప్పడానికి ఈ చిత్రం తప్పక ప్రయత్నిస్తుందేమో అని మనసులో అనుకుంటూ ఉండగా, తనని చట్టుముట్టి బాధించే ‘ఈగ’ రానే వచ్చింది…. చేతిపై వాలనే వాలింది. దాని ఉనికి నాకప్పుడు తెలియలేదుగానీ తర్వాత చూస్తే అది చాలా మాట్లాడుతున్నది. చూస్తూ ఉండగా నాకు అది చాలా విషయాలను వివరిస్తున్నది. అప్పుడనిపించింది, నా వరకు నాకు -అధోజగత్ సోదరసోదరీమణుల జీవితాలను చూపించే క్రమంలో ఒక్క ఈగ చాలు, వాళ్ల నిద్రని అనుక్షణం వాలి దెబ్బతీసేందుకూ అని!

మీరూ ఒప్పుకుంటారనే అనుకుంటాను. లేదంటే ఇంకాసేపు చూడండి…ఇంకొన్ని క్షణాల్లో…ఇంకాసేపు చూస్తే, ఆ మహిళ చేతుల్తో ఆ ఈగను చప్పున కొట్టి మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది. కానీ, ఈగ మళ్లీ ప్రత్యక్షమవుతుంది.

అదే సిసలైన వాస్తవం. ఈ చిత్రం.

~ కందుకూరి రమేష్ బాబు

Download PDF

1 Comment

  • aparna says:

    రమేష్ గారు, మీ ఫోటోలు, వాటితో పాటు మీ వాఖ్యానం జీవితం పై వేరే (ఆల్టర్నేట్) ఔట్లుక్
    ను ఆవిష్కరిస్తాయి. ధన్యోస్మి!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)