1.
ఎక్కడికో తెలీదు.
కానెప్పటికైనా,
నా ప్రాణాలనిక్కడ్నే వొదిలేసి పోవాలట.
***
2.
అర్ధం కాక అడుగుతానూ,
ఎలా? అసలెలా వెళ్లిపోవడం?
నా చుట్టూ అల్లుకున్న అక్షరాల పందిళ్లను కూలదోసుకుంటూ
జ్ఞాన వికాసాలను ఆర్పేసుకుంటూ
ఆకు పచ్చ చివురాశల్ని రాల్చేసుకుంటూ
ఆ ఏకాకి ఎడారి లోకెలా వెళ్ళిపోడమని?
***
3.
గురుతైన రంగు నెమలీకల్ని
అరచేతుల పూసిన చందమామల్నీ
గుప్పిట మూసిన తళుకు పూల తారల్నీ
గుండె వాకిట దొంతరమల్లె పొదలనీ
విదిలించుకు పోవాలంటే
దుఖమౌతోంది.
4.
నా పుస్తకాలు.
- కంటి పాపలు. చీకటింటి దీపాలు.
నా ప్రపంచ చరాచర సృష్టి కర్తలు.
నైవేద్యమయినా కోరని ఇష్ట దైవాలు.
ఈ కొమ్మన కొలువైన ఇలవేల్పులు
విడిచి పోవాలంటే,
ప్చ్.
గూడు చీకటౌతోంది.
చిక్కటి గుబులౌతోంది.
5.
కరచాలనం కోసం నిలిచిన కొత్త అతిధులు
మరి మరి చవిలూరించు భావోద్వేగాలు
ఎదకెత్తుకున్న కాంక్షలు
- కస్తూరి తిలకంలా భాసిల్లు ఆ స్వరూపాలు
ఆ జాడలు…లయబధ్ధ గుండె శబ్దాలు
అన్నిట్నీ, అందర్నీ ఇక్కణ్నే వొదిలేసి..
నన్ను నేను ఖాళీ చేసేసుకుంటూ
శూన్యమైపోతూ
ఉత్తి చేతులేసుకుని వెళ్లిపోవాలంటే
నిశి గోదారికిమల్లే – మనసు గుభిల్లు మంటోంది.
6.
దాహార్తినైన క్షణాన
గొంతు తడిపిన నదీమ తల్లులు – నా పుస్తకాలు.
గ్రీష్మం లో కురిసిన వెన్నెల వర్షాలు – నా సాహిత్యాలు
మట్టి నిప్పుల పై వానజల్లుకు ఎగజిమ్మే అత్తరు పొగలు – నా పుస్తకాలు.
- పూర్తిగా ఆఘ్రాణించకనే..అనుభూతించకనే
ఎత్తైన ఆనకట్టలమీద నడయాడకనే..ఆకాశాన్ని తాకకనే
వెళ్లిపోవల్సి రావడం ఎంత ఖేదం!
కళకళ లాడు నూతన మధుపర్కాలు
చిలికిన దధి నించి కొత్త జన్మమెత్తిన నవనీతాలు
అదిగో సరిహద్దులవతల నా వారి పొలికేకలు
నేనింకా వినకనే,
నా భాషలోకింకా తర్జుమా ఐనా కాకనే
వెళ్లిపోవాల్సి రావడం ఎంత క్లేశం!
7.
జీవ జల కెరటాల పుటలు
పడవ విహార ప్రయాణాలు
చూపు దాటి పారిపోకుండా
గీటు గీసి ఆపుకున్న ఎర్రవన్నె ఇసుక తిన్నెల వాక్యాలు.
కాదు కాదు. తీపి కన్నీటి కౌగిళ్ళు
అన్నిం టినీ, ఆత్మ బంధువుల్నీవిడిచేసుకుని
నిరాశిస్తూ..నిట్టూరుస్తూ
వెళ్లిపోవాలంటే చచ్చేంత భీతిగా వుంది.
8.
పోనిఇ, అలానే కానీయి..
కొన్నే కొన్నిపూలగుచ్ఛాలను చేత పుచ్చుకుని
కొందరి కొండ గుర్తుల్ని..గోరింటల్ని
గుండె దారాలకు గుచ్చుకుని.. పోదునా?
చితిన పడనీక గుప్పెడు అగరు ధూపాలనయినా చుట్టుకు పోదునా?
లేదు. వీల్లేదు. రిక్త హస్తాలతో పోవాల్సిందే..అనుకుంటే..
ఇప్పుడే చల్లబడిపోతోంది దేహం.
తరచినకొద్దీ
- అదొశిక్షగా, ఏదో శాపం గా.
తలచుకున్నక్షణమల్లా
- చివరి శ్వాసలా, శిలా శాసనంలా
మరణించినట్లుంటుంది.
***
10.
ఆ పై వాడ్ని బతిమాలో బామాలో
ఈ కట్టెకు ఓ పెట్టెని కట్టుకుని
పట్టుమని పది పుస్తకాలు పట్టుకుపో నూ ?
ఎప్పుడనే కబురు తెలిస్తే ఇప్పుడే సర్దేసుకోనూ!
****
నిన్ను -
మెడనలంకరించుకొను హారంలా
నుదుట్న దిద్దుకొను సింధూరంలా
కరకంకణం లా, కర్ణాభరణంలా
ఆత్మను అలుముకున్న అత్తరు సుగంధంలా
పుస్తకమా!
నాలోని నిన్ను
తీసుకుపోని.
నిన్నూ తీసుకుపోనీ నాతో!
- ఆర్.దమయంతి
చాలా చాలా బాగుందండీ దమయంతి గారూ!
నిజంగానా తృష్ణ గారు!?.. :-) చాలా థాంక్సండి.
.
బావుంది దమయంతి గారు!”ఆత్మను అలుముకున్న అత్తరు సుగంధంలా………”
నిన్నూ తీసుకుపోనీ నాతో!
అన్న మీ వాక్యాలు నిజంగా నన్ను తీసుకొని పోయాయి ఎక్కడి కో అది ఎక్కడ వుందో తెలియదు కాని వెళుతూనే వున్నాను భావతరంగాల ను తోడుగాతీసుకొని!!
మణి గారు,
కవిత పై మీ ఈ వ్యాఖ్యానమొక్కటి చాలు – కవిత్వాన్ని మీరెంత గొప్పగా ప్రేమిస్తారో చెప్పేందుకు. ఎక్కడికో వెళ్తూనే వున్నాను భావ తరంగాలను తోడు తీసుకుని అనంగానే వెంటనే అనిపించింది. కవిత్వం లోని మహత్తే అలాటిది కదా అని.
ఒక మాయ చేసే మత్తు అయిన గమ్మత్తైన పరిమళ పుష్పం – కవిత్వం అంటాను నేను. మరో కవి మాజి కల్ మాటలు కూడా గుర్తొస్తాయి గుప్పున. అదేమిటంటే –
‘Poetry is the journal of a sea animal living on land, wanting to fly in the air.’ – Carl Sandburg
ధన్యవాదాలు మణి గారు.
:-)
శుభాకాంక్షలతో..
ఈ కవిత చదువుతుంటే మొన్నీ మధ్యే జాజిమల్లి గారు బ్లాగ్లోకంతో పంచుకున్న వారి “పెద్దక్క ప్రయాణం” గుర్తు వచ్చింది.
“గొంతు తడిపిన నదీమ తల్లులు – నా పుస్తకాలు.
గ్రీష్మం లో కురిసిన వెన్నెల వర్షాలు – నా సాహిత్యాలు” – ఎంత నిజం.
తప్పనిసరి అని తెలిసినా, మనమెన్నటికీ సంసిద్ధులం కాలేని ప్రయాణానికి…బ్రతుకంతా తోడుగా నిలిచినా, ఆ చివరి అడుగులో వెంట రాలేని “నైవేద్యమయినా కోరని ఇష్ట దైవాలకి” వేసిన ఈ కవితా బంధం చదువుతుంటే, ఎందుకో రేవతీ దేవి గారు చెప్పినట్టు దిగులు, దిగులుగా, దిగులు వేస్తోంది :(
జ్యోతి గారు!
ఎంతో చక్కని ప్రశంసలనందచేసినందుకు ముందుగా నా ధన్య వాదాలు మీకు.
రేవతి గారు గుర్తోచ్చారని అనంగానే..చెప్పలేని ఆనందం కలిగిందండి.
కారణం నాకూ అలానే దిగులు వేస్తూ వుంటం మూలాన.
ఒక్కోసారి కొన్ని సాయంకాల క్షణాలు…అడవుల్లో నిశ్శబ్దం గా నడుచుకు పోతున్నప్పుడు మెత్తని అడుగుల చప్పుళ్ళు.. దిగులు పెట్టి చంపేస్తూంటాయి. అదేం చిత్రమో..కోలుకోకముందే..మనసు మళ్ళీ అదే దిగులు కోరుకోడం వింతయిన దిగులుగా వుంటుంది.
అలాటప్పుడు సరిగ్గా మీలానే నేనూ రేవతి దేవి గారిని తలచుకుంటూ వుంటాను.
జ్యోతి గారు! జాజి మల్లి గారి కథ ఇంకా చూడలేదండి. చదవాలి. తప్పక చదవాలి.
శుభాభినందనలతో..
ఒక పెట్టెడు పుస్తకాలైనా తీసుకెళ్లాలనే తమాషా ఆలోచన భలే ఉందే
భలే గా గుర్తు పట్టేసారు మంజరి లక్ష్మి గారు.
పెట్టె ఐతే సేఫ్ అని ఇప్పటికీ నా నమ్మకం. పుస్తకాలు తడవవు కదా. అందుకని.
:-)
ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
ప్రేమతో.
దమయంతి గారూ
చాల చాల బాగుంది…. పుస్తకాల నిండా పుటల నిండా పంక్తుల నిండా శబ్దాల నిండా అక్షరాల నిండా, ఖాళీల నిండా జీవిత సమస్తమూ అల్లుకున్న కన్నీళ్లతో కృతజ్ఞతలు….
పుస్తకమంటే మీకెంత ప్రేమో.. ఈ కన్నీటి పూలే చెబుతున్నాయి.
ధన్యోస్మి వేణు గోపాల్ గారు!
ఎంత బాగా రాసారు దమయంతి గారూ. పుస్తకాల మీద మీకున్న ఆత్మీయతానురాగాలను, ఇష్టాన్ని కాయితం మీద అలతి అలతి మాటల్లో అలవోకగా పరచినట్టుంది మీ కవిత. ఎ గుడ్ పొయెం ఇండీడ్. కంగ్రాట్స్.
మీనించి ఇంత గొప్ప ప్రశంసలనందుకోడం అదృష్టం గా భావిస్తున్నాను ఎలనాగ గారు.
మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
నమస్సులతో..
నా కామెంటుకు పొడగింపు: సూటితనం అన్నది కవిత్వానికి Disqualification కాదని నిరూపించారు మీరు.
నిజమండి. నా మనసులో మాట చెప్పారు ఎలనాగ గారు. కవిత్వం సాధారణ పాఠకునికి కూడా అర్ధం కావాలి. అనుభూతిం చాలీ అని ఆశపడతాను. అందుకు సూటి తనం ఒక సులువైన మార్గం అని కూడా భావిస్తాను.మీ ఈ కామెంట్ నాకు చాలా బాగా నచ్చేసింది. (కామెంట్ పొడగింపు ఇంకా వుంటే బావుణ్ణు కదా అని కూడా అనిపించింది.)
:-)
మరో సారి మీకు నా ధన్య వాదాలు తెలియచేసుకుంటూ,
నమస్సులతో..
ఆశల పుస్తకాలు ఎత్తుక పోవాలని ఎంత ఆశ. ఎక్కడకో పోయ్యె చోటు తెలియదు. చోటు అంటు ఒకటి ఉందో లేదో అసలే తెలియదు. ఈ కవిత్వ దాహంతో , ఈ పుస్తక మోహం తో……….. ఎక్కడకని ఎక్కడకని? చాలా బావుందిండి కవిత.
నేనో సారి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంటికెళ్ళినప్పుడు చూసాను.
విశాలమైన బేస్మెంట్ అంతా లైబ్రరీ గా మార్చుకున్నారు.
ఒక ఇంట్లో అంత పెద్ద లైబ్రరీని చూడంగానే కళ్లు తిరిగాయి నాకు.
అదో గొప్ప అభిరుచి. కాదనలేం. అభినందించకుండానూ వుండలేం.
కానీ హఠాత్తుగా ఆయన ఈ లోకం విడిచి వెళ్లిపోయినప్పుడు మాత్రం..
నాకు వెంటనే ఆ లైబ్రరీనే గుర్తొచ్చింది. అది ఒంటరిదై పోయిందని చాలా బాధేసింది. కొన్నాళ్ళ దాకా నన్నది వెంటాడుతూనే వుంది.
నా కవిత పై మీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలు
thirupala gaaru
దమయంతి గారు
ఈ కవిత రాసే సమయంలో మీ కళ్ళల్లో బాధ కన్నీటి గోదారిలా ఎగిసి ఎగిసి పొంగి పొర్లిందనుకుంటా ??
అన్నిట్నీ , అందరినీ ఇక్కడే వదిలేసి
నన్ను నేను ఖాళీ చేసుకుంటూ . . . . . .
శూన్యమైపోతూ . . . . . . .
మీ కవిత్వం చదువుతూ . . . . . .
నాకు తెలియ కుండానే నేను అందులోకి వెళ్ళిపోయా
నా చివరి క్షణాల్లో ఇంకాసేపట్లో పోతానని తెలిస్తే . . . .
ప్చ్ . . .
కాని కవులు చాలా అదృష్టవంతులు
కవి ఈ ప్రపంచం నుండి సెలవు తీసుకున్న తమ రచనలు
మాత్రం ఈ పుస్తక ప్రపంచంలో పది కాలాల పాటు అందర్నీ పలుకరిస్తూనే ఉంటాయి !!
నవ్విస్తాయి కవ్విస్తాయి ఏడ్పిస్తాయి
చైతన్య దీపిక లా దారి చూపిస్తునే ఉంటాయి !!
కవులు మరణించిన కలకాలం జీవిస్తూనే ఉంటారు !!
ప్రతి ఒక్కరు వెళ్ళిపోవల్సిందే
పోతూ . . పోతూ . . మన జ్ఞాపకాలు ఇక్కడే వదిలి వెళ్ళాలి !!
పట్టుమని పది పుస్తకాలు తీసుకుపోవలన్న మీ ఆశ excellent !!
మీ కవిత్వం చాలా బాగుంది !!
పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది !!
ఎంత అద్భుతం గా చెప్పారు లక్ష్మి నారాయణ గారు.
ఈ కవిత పాఠకులకి పది కాలాలపాటు గుర్తుంటుందన్నారు. ఎంత మంచి మాటన్నారు! ఇంతకు మించిన అవార్డేం కావాలని ఏ కవికైనా!
బహు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ
శుభాభినందనలతో..
దమయంతి గారూ !
చాలా చాలా బాగుందండీ . నా మనసులో మెదిలే భావాలకి మీరు రూపం ఇచ్హారా ? అనిపించింది
..
ఆ పై వాడ్ని బతిమాలో బామాలో
ఈ కట్టెకు ఓ పెట్టెని కట్టుకుని
పట్టుమని పది పుస్తకాలు పట్టుకుపో నూ ?
ఎప్పుడనే కబురు తెలిస్తే ఇప్పుడే సర్దేసుకోనూ!
హ్మం నేనూ అదే మాట అంటాను ,
పట్టుమని పది పుస్తకాలు పట్టుకు పోనూ ?
ప్రతి పదం నచ్చింది, ఏ పాదం ఎత్తి చూపించి బాగంది అని చెప్పాలో అర్ధం కావటం లేదు ..
నిన్నూ తీసుకుపోనీ నాతో ,
అని నేనూ మీ గళం తో నా గళం కలిపి ,కదం కలుపుతాను ..
నవ్యత , గాఢత ,ఎన్ని రకాలుగా మీరు వర్ణించారో అన్ని రకాలుగా అనుభూతి చెందుతూ ..
మీ పుస్తక గంధం ,మీలో ఇమిడి పోవాలని ,
పుస్తకాల పై వ్యామోహం ,చివరి వరకూ నేస్తం లా వేలు విడవక మీతో నడవాలని
నేనూ కోరుకుంటూ ..
వసంత లక్ష్మి ,పి.
నిజం వసంత. పుస్తకాలు మన కున్న నేస్తాలు. విడిచి వుండలేం.అవి చెప్పే ఊసులు వినకుండా ఊపిరి తీయలేం అనిపిస్తుంది కదూ? మర్చిపోయా, మీ ఇంట్లో కూడా భలే మంచి లైబ్రరి ఉంది కదూ?
ఈ కవిత లో నా భావాలతో మీ భావాలు కూడా కలిసాయన్నారు కదూ? మళ్లీ మనం సేమ్ పించ్ :-)
వసంతా, మీకివే నా హృదయపూర్వక ధన్యవాదాలు.
చాలా గొప్పగా వుంది, విమర్సనాత్మకంగా వుంది
చాలా థాంక్సండి జగన్నాధ్ గారు.
అభివందనాలు.
అమ్మా
శ్రీమతి దమయంతి గారు,
నమస్కారములు.
మీ కవిత నిన్నూ తీసుకు పోనీ నాతో! ఇప్పుడే చదివేను.
నిజంగా మీరు మీ అక్షరాల యాత్రలో నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్ళేరు.
నాకు ఎప్పుడూ అనిపిస్తూంటుంది
నేను నా కోసం కొనుక్కున్న కొని చదవకుండా దాచుకున్న పుస్తకాలు నా తరవాత ఏమిటవుతాయో? ఎవరిని చేరుతాయో?
ముఖమును పుస్తకములో దాచుకొని, ముఖ పుస్తకములో లీనమై పోవాలని ఉంది
మీ కవితలు జోహార్లు. అభినందనలు.
జోగారావు
‘ముఖమును పుస్తకములో దాచుకొని, ముఖ పుస్తకములో లీనమై పోవాలని ఉంది’ – ఎంత హృద్యంగా చెప్పారండి జోగారావు గారు.
అందుకోండి మరి నా జేజేలు.
నమస్సులతో..
మీ వెంట వచ్చే పది పుస్తకాల్లో ఒక పేజీ లో నాపేరు వుంటే బావుంటుందని..మీ కవిత్వపు సౌరబాన్ని ఆస్వాదించే అవకాసం వుంటుందనీ..eలాటి ఆsaలు , కలలూ నిజమైతే చూడాలని ఇంకా ఎన్నెన్నో అనిపిస్తున్నాయి. మంచి ఐడియా ఇచ్చారు అందరం ఏమి తీసుకేల్లవచ్చో ఆలోచించడానికి బోలెడన్ని విషయాలు…
నా వెంట వచ్చే పుస్తకాలలో మాత్రమే కాదు.. నా వెన్నెంటి వచ్చే మంచి జ్ఞాపకాలలో కూడా మీరున్నారు లక్ష్మి రాఘవ గారు!
ఎప్పటికప్పుడు నా రచనల పై మీరు వ్య క్తపరిచే స్ఫూర్తి దాయకమైన వ్యాఖ్యలను నేనెప్పటికీ మర్చిపోలేను.
అనేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ
శుభాభినందనలతో..
నమస్కారాలు దమయన్తిగారు
పుస్తకాల మీద మనకుండే వీడలేని ప్రేమ, వాటి సాంగత్యంలో మెరిసిన ఆలోచనలు, కలిగిన భావాలు,
మన జీవనయానంలో వాటి ప్రభావం ఎంత అద్భుతమొగదా!
మీ కవిత “నిన్నూ తీసుకు పోనీ నాతో” చదువుతుంటే కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు!
ఇందులో మీరు ప్రకటించిన భావాలు, ఆ పదబంధాలు మనసు తలుపులను తట్టి తమ స్థానం స్థిరం చేసుకున్నాయి.
“నా పుస్తకాలు- కంటి పాపలు. చీకటింటి దీపాలు.
కరచాలనం కోసం నిలిచిన కొత్త అతిధులు
నైవేద్యమయినా కోరని ఇష్ట దైవాలు.” ఇలా అన్నీ భావాలు నా గుండెలో గూడు కట్టుకున్నాయి,
అద్భుతమైన కవితను అందిచిన మీకు అనేక వందనాలు.
అయ్యగారి భుజంగరావు.
నమస్కారాలు దమయన్తిగారు
* నమస్కారమండి. :-)
పుస్తకాల మీద మనకుండే వీడలేని ప్రేమ, వాటి సాంగత్యంలో మెరిసిన ఆలోచనలు, కలిగిన భావాలు,
మన జీవనయానంలో వాటి ప్రభావం ఎంత అద్భుతమొగదా!
* మీ మాటలు అక్షరాలా నిజమండి. కొన్ని రచనలు చదివాక కలిగిన ఆనందం, విషాద, వైరాగ్యాలు ..మన మనసు మీద గొప్ప ప్రభావం చూపుతాయి. ప్రతి రోజూ మన వాకిట వసమై నిలుస్తాయి.
మీ కవిత “నిన్నూ తీసుకు పోనీ నాతో” చదువుతుంటే కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు!
* మీరిలా మెచ్చుకుంటుంటే నాకూ చెప్పలేనంత ఆనందంగా వుందండి.
ఇందులో మీరు ప్రకటించిన భావాలు, ఆ పదబంధాలు మనసు తలుపులను తట్టి తమ స్థానం స్థిరం చేసుకున్నాయి.
* స్పందించి రాసే రచనల తీరే అంత అనుకుంటాను. అందులో ఇతివృత్తం మనందరికి సంబంధించింది కావడం మూలాన కూడా మనం అందులో నిమగ్నమై పోడం వల్ల..కూడా ఒక కారణం అని చెప్పాలి. ఎంత చక్కని ప్రశంస!
“నా పుస్తకాలు- కంటి పాపలు. చీకటింటి దీపాలు.
కరచాలనం కోసం నిలిచిన కొత్త అతిధులు
నైవేద్యమయినా కోరని ఇష్ట దైవాలు.” ఇలా అన్నీ భావాలు నా గుండెలో గూడు కట్టుకున్నాయి,
* …ఎంత గొప్ప అవార్డ్ అందుకున్నానండి మీ నించి!
అద్భుతమైన కవితను అందిచిన మీకు అనేక వందనాలు.
* మీకు కూడా..నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను భుజంగరావు గారు.
ఉగాది పండగ శుభాకాంక్షలతో..
మంచి పోయమ్ దమయంతి గారు ,కానీ కొంచెం సాగతీసారు.
కాస్త ఎడిట్ చేసి వుండాల్సింది అంటారా?
అలా అయితే మీ కామెంట్ మిస్సయి వుండేదాన్ని కదా?
:-)
ధన్యవాదాలతో..
గ్రీష్మం లో కురిసిన వెన్నెల వర్షాలు – నా సాహిత్యాలు
మట్టి నిప్పుల పై వానజల్లుకు ఎగజిమ్మే అత్తరు పొగలు – నా పుస్తకాలు.
చాలా బాగా చెప్పారు. పుస్తకాలని వదిలి వెళ్ళడం బాధాకరమే. కానీ ఆ పుటలలో కొన్నైనా మనవి అయినప్పుడు కాసింత నిశ్చింత కదా దమయంతి గారు. ఏదీ తోడ్కొని పోలేకపోవడం విషాదమే అయినా కొన్ని జ్ఞాపకాలుగా మిగిలి వెళ్ళే మనుషులుగావడం సాహిత్యకారులకు ఓ అవకాశం కదా? మంచి కవిత. అభినందనలు..
కొన్ని జ్ఞాపకాలుగా మిగిలి వెళ్ళే మనుషులుగావడం సాహిత్యకారులకు ఓ అవకాశం కదా?
* నిజమే వర్మ గారు. అల్లా ఎందరి హృదయాలలోనో జ్ఞాపకాలుగా మిగిలి వెళ్ళే అవకాశం
కేవలం సాహిత్యకారులు మాత్రమే సొంతమవడం ..మరో గొప్ప విశేషం. కాదనలేం.
మీ అభివందనలకు ఇవే నా ధన్యవాదాలు.
ఉగాది శుభాకాంక్షలతో..
దమయంతి గారూ నన్నే కాదు మీ కవిత చదివిన వారినందరిని తీసుకుపోయారు. అను మానమే లేదు. మీ కవిత, మీ భావం మీ మాటల్లొనే ఇందులో వినగలిగితే ఇంకా బాగుండేది. తెలుగు పదాలకు వున్న శక్తి ఎంతో ఏమిటో నేటి యువతకు తెలిసేది. నేటి టీవి లలొ రొజూ ఒక అరగంట అయినా ఇటువంటి కార్యక్రమాలు వుంటే కొంత విదేసీ వ్యామోహం తగ్గేది. మీకు నా శుభాకంక్షలు.
దమయంతిగారు “నిన్నూ తీసుకుపోనీ నాతో! ” అనే అనుభూతి కవితలోని ప్రతి పంక్తిలో పుస్తకంతో మీకున్న విడదీయలేని అనుబంధం జన్మ జన్మల బంధంగా ఆవిష్కృతమౌతుంది. శరీరం నశ్వరమైనది. అక్షరం నాశనం లేనిది. జీవుని వేదన పుస్తకంతో అనుబంధంలోనికి పర్యవసిస్తే మనిషి అమృతత్వాన్ని ఆస్వాదించగలడని మీ కవితలోని ధ్వని. “గ్రంథా మ మాగ్రత సన్తు/ గ్రంథా మే సన్తు పృష్ఠతః // గ్రంథా మే సర్వత స్సంతు / గ్రంథేష్వేవ వసామ్యహమ్ //” “పుస్తకం నా కంటికెదురుగా ఉండనీ. పుస్తకం నా కెప్పుడూ వెన్నుదన్నుగా ఉండనీ. పుస్తకం నా కన్ని చోట్ల సదా కనిపించనీ. నేను నా జీవితాన్ని పుస్తకాలతోనే గడపాలి” అన్నాడొక ప్రాచీన సంస్కృత కవి. భూత, భవిష్యత్ వర్తమానాలుగా మనం ఖండించుకొన్న కాలాన్ని అఖండ కాల స్వరూపముగా దర్శించడానికి పుస్తకమే ఆధారభూమిక, సమన్వయ వాహిక. కనుక మూడు కాలాల్లోనూ జీవింపదలచిన మనిషి ఎల్లప్పుడూ పుస్తక సాంగత్యంతోనే కాలం గడపడంలో సద్యః పర నివృత్తిని అనగా ఆత్మానందాన్ని పొందుతాడు. పుస్తకాలతోనే తన జీవితమంతా గడచి పోవాలని కోరుకొనే పుస్తకాభిమాని తాను జీవితం చాలించాక కూడా ఆ అనుబంధాన్ని కొనసాగించాలని అనుకోవడంలో ఆశ్చర్యమేమీలేదు. ఆ కోరిక స్వభావికం. ఇదే సరస్వతీ ఉపాసన. పుస్తకానికీ పాఠకునకీ ఉన్న సంబంధం భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న పరమాత్మ జీవాత్మ తాథాత్మ్య స్థితి. ఒక మంచి కవితని ఆస్వాదించిన రసానుభూతి కలిగించినందుకు ధన్యవాదాలు.
‘జీవుని వేదన పుస్తకంతో అనుబంధంలోనికి పర్యవసిస్తే
మనిషి అమృతత్వాన్ని ఆస్వాదించగలడని మీ కవితలోని ధ్వని’
* ఎంత గొప్ప విశ్లేషణ నిచ్చారు!
సరస్వతి ఉపాసన ..అన్న మీ మాటలు చదవగానే నా కళ్ళల్లో ఆ తల్లి రూపం కదలాడింది. మనసంతా భక్తి భావం తో నిండి పోయింది శివ రామ ప్రసాద్ గారు.
మీకు నా మనః పూర్వక ధన్యవాదాలు తెలియచే సుకుంటూ,
నూతన సంవత్సర శుభాకాంక్షలతో..
దమయంతిగారు మీ జవాబు చూశాను. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.మీకు, మీ కుటుంబ సభ్యులకు జయనామ సంవత్సర శుభాకాంక్షలు.
మంగు శివ రామ ప్రసాద్, విశాఖపట్నం, సెల్:9866664964
శివ రామ ప్రసాద్ గారు,
మీ శుభాకాంక్షలకివే నా ధన్యవాదాలు.
:-)
ఏ ఇతర భాషలోనూ కనిపించని ఒక గొప్పదనం
మన భాషకే సొంతమైన ఆ విశేష గుణం ఏమిటీ అంటే
– హుందాతనం!
తెలుగులో మరో గొప్ప లక్షణమేమిటంటే
మాట్లాడుతున్నప్పుడు మన పట్ల ఎదుటి వారికి గౌరవాన్ని కలిగించగల సంస్కార గుణం
మన భాషలో సహజసిధ్ధం గా వచ్చి చేరడం మన అదృష్టం.
ఎన్ని జన్మల పుణ్య ఫలమో..మనం తెలుగు వారిలా పుట్టడం.
– కదూ?
విలవైన మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను స్వామి గారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో.
Ammo Deeenni Artham Chesukovataaniki Reading Lo Naakunna Anubhavam Saripodandi :'(
మంచి కాంప్లిమెంట్. చాలా బావుంది.
(కానీ మరీ అమాయకుల్ని చేసి మాట్లాడుతున్నారు.)
మీరు మంచి చదువరి అని నాకు తెలుసులెండి.
:-)
మీకు నా ధన్యవాదాలతో బాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను.
భావనల్ని, తాదాత్మ్య దశలోకి తీసుకెళ్ళారు. అభినందనలు
మీ అభినందనకి ధన్య వాదాలు రామారావ్ గారు.
నమస్సులతో..
Damayanthi garu mee kavita ippude chadivanu. Naa vuddesamlo pustakalu ane phalam nunchi jaaluvaare rasame jnanam. Manam puttinappudu andaramu agjnaanulame. jeevita ardhanni paramardhanni avagahana chesukunenduku saginche prasthaname jnaanveshana. Adi chaduvu valla, anubhavam valla, samayam valla sadhyam. Jnaanaani sampadinchatame jeevana paramardhamu, Agjnaanaaniki parakaashta. Jnaana rahitamaina atma paramatmalo leenamayye vela, rasamulu aasvadinchina phalamu vadali potunnamanna badha enduku.
నిజమేనండి మీరు చెప్పింది కూడా.
ఎంత పానించినా ఆ జ్ఞాన రసమృతం ఇంకా ఇంకా అనే దాహం వుంటూనే వుంటుంది కదూ?
అందుకని..అన్నాను.
నా కవిత చదివి మీ స్పందన తెలియచేసినందుకు ధన్యవాదాలు విజయకుమార్ గారు.
శుభాభినందనలతో..
దమయన్తిగారు చాలా బాగుంది .ఏ మంచి విషయం చదివినా దాన్ని దాచుకుని మళ్ళీ చదవాలన్న పేరాసతో అన్నీ దాచి పెట్టి , కొన్నాళ్ళ తరవాత ఎన్నని ఉంచుతాం… చివరికి ఇవన్ని ఏమి చేసుకుంటామన్న వైరాగ్యంతో బయట పాదేయ్యలేక పెదేస్తున్నప్పుడు ఇదే భావం కలుగుతుంటుంది.చాలా బాగా వ్యక్తపరిచారు. మీకు నా అభినందననలు
నిజం చెప్పారు లక్ష్మి. ఒక పట్టాన పారేయబుధ్ధి కాదు. పాత పుస్తకమైనా సరే.
పుస్తకం మీద ప్రేమ పుస్తకాలని ప్రేమిచే వారికే తెలుస్తుందేమో కదూ?
ఆ బాధయినా, వ్యధైనా
కవిత నచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మి.
దమయంతి గారు మీ కవిత ‘నిన్నూ నాతో తీసుకుపోనీ’ కవిత ఆసాంతం అద్భుతం. పుస్తకంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు మీ కవితలోని ప్రతి వాక్యాన్ని అనుభూతించక ఉండలేరు. అందుకె మీ కవితలోని ప్రతి అక్షరాన్ని మనసు పెట్టె లొ నిక్షిప్తం చేసుకుంటున్నాను.ప్రత్యెకించి ఈ వాక్యాలు నా పుస్తకాలు.
– కంటి పాపలు. చీకటింటి దీపాలు.
నా ప్రపంచ చరాచర సృష్టి కర్తలు.
నైవేద్యమయినా కోరని ఇష్ట దైవాలు.
ఈ కొమ్మన కొలువైన ఇలవేల్పులు
విడిచి పోవాలంటే,
ప్చ్.
గూడు చీకటౌతోంది.
చిక్కటి గుబులౌతోంది.
మాధవి,
మనసు పెట్టెలో దాచుకోడం ..భలే బావుంది ఎక్స్ ప్రెషన్!
కవితపై క్లుప్తమైన మీ వ్యాఖ్య బావుంది. చాలా చాలా థాంక్సండి.
శుభాకాంక్షలతో..
దమయంతి గారూ..
అద్భుతః..చాలా బావుంది..మొదటినుండీ..తుదివరకూ..మనసును కదిలించింది..మీ పుస్తకప్రేమ అమోఘం..అనన్యం. నిన్ను –
మెడనలంకరించుకొను హారంలా
నుదుట్న దిద్దుకొను సింధూరంలా
కరకంకణం లా, కర్ణాభరణంలా
ఆత్మను అలుముకున్న అత్తరు సుగంధంలా
పుస్తకమా!
నాలోని నిన్ను
తీసుకుపోని.
నిన్నూ తీసుకుపోనీ నాతో!
ఎంత బాగా చెప్పారు..హాట్స్ ఆఫ్..
గుండెను కలుక్కుమనిపించి కళ్ళు తడిపిన కవిత. అక్షరాలను దోసిళ్ళతో తోడి కవితార్తిని తీర్చారు. అక్షరకర్తలు అందించిన సాహితీ సుమాలతో ఊపిరికే ఊపిరిలూదిన పుస్తకాలకు అక్షర నమస్సులు.
“ఊపిరికే ఊపిరిలూదిన పుస్తకాలకు అక్షర నమస్సులు.”
అద్భుతం గా చెప్పారు మన వందనాలు.
నిజమే నమో నమః..ఓం పుస్తకాయ నమః ఇలా అష్టోత్తర సహస్ర నామాలతో పూజించుకోవాలనుంది..
ధన్యవాదాలు ఉమా గారు. హృదయపూ ర్వక ధన్యవాదాలు.
నమస్సులతో..
ఉషా గారు..మీ కామెంట్ చాలా బావుంది. మరి మరి చదువుకుని ఆనందించేలా ..
మీ ప్రసంశలకివే నా హృదయపూర్వక ధన్యవాదాలు.