ద్రావిడ సాహిత్యాల మధ్య వారధి ఇప్పటి అవసరం: నలిమెల

నలిమెల భాస్కర్ తో నారాయణ శర్మ
నలిమెల భాస్కర్ తో నారాయణ శర్మ

నలిమెల భాస్కర్ తో నారాయణ శర్మ

 

నాలుగు భాషలు కలిస్తే నలిమెల భాస్కర్! తెలుగు భాష మీది ప్రేమ ఆయన్ని ఆ భాషకే పరిమితం చేయలేదు, ఇంకో నాలుగు (నాలుగు ఇక్కడ బహువచన ప్రతీక మాత్రమే!) నేర్చుకోడానికి ప్రేరణ ఇచ్చింది. కేవలం నేర్చుకోవడమే కాదు, ఆ భాషల నించి తర్జుమా చేసే శక్తి నలిమెల అపూర్వ విజయం! కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం అందుకున్న సందర్భంగా నలిమెల భాస్కర్ తో నారాయణ శర్మ ముఖాముఖి!

ప్ర 1.మీ అనువాదమెప్పటినించి ప్రారంభమైంది..ఇతర సాహితీ ప్రక్రియల్లో రచనలు చేసినప్పటికీ మీరు అనువాదంపై మక్కువ పెంచుకోవడానికి కారణం ఏమిటీ?

 

  జ నేను 1982 లో అనుకుంటాను ఒక చిన్న తమిళ కవితను అనువదించి తోటమహదేవ్ తీసిన వెల్లువ కు పంపించాను.అయితే వాస్తవానికి మిత్రుడు నందినీ సిథారెడ్డి “మంజీర “కోసం నాతో ప్రత్యేకంగా “పాకిమనిషి కొడుకు”నవలను 1986 ప్రాంతాల్లో అనువదింపజేసుకున్నాడు. ఆ తరువాత ఇప్పటివరకు చాలా అనువాదాలు చేసాను.

సాహిత్యంలో సృజన,అనుసృజనలు అక్కా చెలెళ్లు దేని ప్రాధాన్యం దానిదే. ఇది సమాచారయుగం. మనం ఈ సందర్భంలో ఇరుగుపొరుగు సాహిత్యాల వైపుకు చూడకపోతే వెనకబడి పోతాం. అనువాదలవల్లనే జాతీయ,అంతర్జాతీయ సాహిత్య  పరిణామాలు అర్థమవుతాయి.ఇవాళ పాతతరం పాఠకులని అడగండి.గోర్కీ”అమ్మ”చదువని వాళ్లు ఎవరైనా ఉన్నారా ?అని. దాదాపు కవులు,రచయితలు,సీరియస్ పాఠకులందరూ దానిని అక్కున  చేర్చుకున్నారు. రామాయణ, భారతదులు. ఖురాన్, బైబిల్ మొ.లేకపోతే ఆధ్యాత్మిక వికాసం ఎక్కడిది. మా ఊరు(కరీoనగర్ జిల్లా-నారాయణ పురం)లోని శ్రీరామా చందదారుల గ్రంధాలయంలో నేను చదివిన శరత్, ప్రేం చంద్ లనుండి తెలుగులోకి వచ్చిన అనువాద రచనలుకూడా నాలో అనువాదం పట్ల ఇష్టాన్ని పెంచి ఉంటాయి.

ప్ర2.మీ విద్యార్ధి దశలో మీరెప్పుడైనా అనువాదాలు చేయటంకాని,ఆకర్షితులవటం కాని జరిగిందా..?

 

నేను తొమ్మిదవ తరగతిలో ఉండంగా(1969)బాలసాహిత్యం,అనువాద సాహిత్యాలపట్ల ఆకర్శితుణ్నయ్యాను.మా ఊరి గ్రంథాలయంలో ఉన్న చందమామ కథలు,బాలల బొమ్మల రామాయణం , పంచతంత్ర కథలు నన్నాకట్టుకున్నాయి. అయితే నేను విద్యార్థి దశలో ఎటువంటి అనువాదాలు చేయలేదు.

unnamed

ప్ర3.ఏ అనువాదకుడైనా తనస్వభావానికి దూరంగా అనువాదాలు చేయడని సాహిత్యలోకం భావిస్తుంది కదా,  “స్మారకశిలలు”నవల మిమ్మల్ని ఆకర్షించడానికి కారణం  ?

 కొంతమంది అనువాదకులు తమకు ఏది దొరికితే అది అనువాదం చేస్తారు. అనువాదకుడికి బాగ నచ్చిన తరువాత అనువాదం చేస్తే ప్రయోజన కరంగా ఉంటుంది. అన్ని సందర్భాలలో అనువాదకుడి అనుభవానికి దగ్గరగా ఉండే రచనలు మూలభాషలో ఉండవు. అనువాదాలు మన అనుభవానికి దూరంగ ఉన్నా ,మన సమాజం లోని ఇతర వ్యక్తుల అనుభవానికి దగ్గరగా ఉంటే చాలు.  స్త్రీలు వివక్శకు గురౌతున్నారు కనుక స్త్రీ వాద సాహిత్యాన్ని అనువదించవచ్చు. అట్లాగే దళితులు మొదలైనవారి అనుభవాలకు దగ్గరగా ఉన్న ఇతర భాషల్లోని సాహిత్యాన్ని మనం మాతృభాషలోకి అనువదించవచ్చు. అవే అనుభవాలు లక్ష్యభాషలో ఉన్న స్త్రీలు, దళితులు , మైనారిటీలకు వున్నయి గనుక అలాంటి స్పందనలే ఉంటాయి.

స్మారకశిలలు-నవలను నాచేత కెంద్ర సాహిత్య అకాడెమీయే అనువాదం చేయించింది.ఎంపిక వాళ్లదే.  అందులో నాప్రమేయం లేదు. నాకు తెలిసిన భాషలలో ద్రావిడభాషలంటే బాగా ఇష్టం కనుక ఆనందంగా అనువదించాను.

photo

ప్ర 4. ఆ నవలని సంక్షిప్తంగా పరిచయం చేయగలరా..?

 

పునత్తిళ్ కుంజిబ్దుల్ల రచించిన నవలకు కోళికోడ్ సమీపంలోని ఒకగ్రామం కథాస్థలం.ఆగ్రామంలో మసీదు, సమీపంలో స్మశానవాటిక..ఇందులో ప్రధాన స్థలాలు. పుక్యోయ తంగళ్ అనేవ్యక్తి స్త్రీలోలుడు. ఆయనకు ఆట్టబీబి భార్య.తంగళ్ నీలిని వశం చేసుకుంటాడు. ఆమె ఓ కొడుకుని కని చనిపోతుంది.నీలి ప్రసవించి నప్పుడేతంగళ్ భార్య ఆట్టబీబి కూడా ఒక బిడ్డని కంటుంది. ఆమె పేరు” పూక్యుంజలీ”. తంగళ్ నీలి కొడుకుని చేరదీసి “కుంజాలి”అని నమకరణం చేస్తడు. పూక్యుంజీబి ఈ కుంజాలీని ప్రేమిస్తుంది.ఇద్దరూ పెరిగి పెద్దవాళ్లవుతున్న సందర్భంలో..తంగళ్ ను అతను ఒకస్త్రీతో సంగమిస్తున్నప్పుడు ఆస్త్రీ భర్త వచ్చి కత్తి తో పొడిచి చంపేస్తాడు. తంగళ్ చనిపోయాక అతని తండ్రికి ఉంపుడుగత్తెగావున్న స్త్రీతో జన్మించిన “ఇబ్రాయి” అనే వ్యక్తి ఇంట్లో పాగా వేస్తడు. తంగళ్ భార్య ఆట్టబీబిని పెళ్ళి చేసుకుంటాడు. తంగళ్ కూతురు పూక్యుంజీబీ కుంజాలిని ప్రేమిస్తున్నదని. ఇబ్రాయి ఆమెని క్షయరోగికి ఇచ్చి పెళ్లిచేస్తాడు. దాంతో పూక్యుంజీబి సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.ఆతరువాత కుంజాలి అఙ్ఞాతంలోకి వెళ్లిపోతాడు.

ఈ నవలా రచయిత కుంజిబ్దుల్లకు బాల్యం నుండే దయ్యాలు, పిశాచాల కథలంటే చాలా ఇష్టం. చనిపోయిన వాళ్లే పిసాచాలుగామార్తారన్న అంసాన్ని, ప్రజల్లో ఉండే నమ్మకాన్ని యథా తథంగా చిత్రించాడు.చనిపోయి సంశాన వాటికలో సమాధులుగా ఉన్నవాళ్ల కథలే ఈనవలలో ఉన్నాయి కాబట్టి”స్మారక శిలలు”అనే పేరు చక్కగా సరిపోయింది.

ప్ర5.మీరు పదునాలుగు భారతీయ భాషలను అధ్యయనం చేసారు.అందులోంచి అనువాదాలు తెలుగులోకి ,తెలుగునించి వాటిలోకి చేసారు.ఎక్కువగా ఇతర ద్రావిడభాషలవైపుకి మీరుమొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది దానికి ప్రధాన కారణం ఏదైనా ఉందా?

 

మూలద్రావిడం నుంచి వచ్చిన ఈభాషలన్నీ సొదరభాషలు. వీటి మధ్య సారూప్య సమీప్యాలు ఎక్కువ. ద్రావిద భాషల మధ్య జరిగె అనువాదాలు చాలా సహజంగా ఉంటాయి. వాటి వాక్య నిర్మాణ పద్దతితో బాటు, పదజాలమూ దగ్గర దగ్గరగా ఉంటాయి. అందువల్లే నేను ఎక్కువగా వీటికి సీమితమై చేసాను. పైగా ఈద్రావిడ సంస్కృతి ప్రాచీనమూ,సుసంపన్న మైంది.తెలుగు,తమిళ,కన్నడ ,మళయాల భాషల మీద నేను చేసిన పరిశొధనల ప్రభావం కూడా నా అనువాదాల పై ఉంది.

ప్ర6.మీరు మళయాల తెలుగు సామేతల తులనాత్మక అధ్యయనం పేరుతో పరిశొధనచేసారు.?మీ పరి శోధన మీకు అనువాదం పై మక్కువని పెంచిందా ?లేక ఐచ్చికంగ ఆసక్తి చూపిన అనువాదం పరిశోధనకు పురిగొల్పిందా ?

 

ఎం.ఫీల్ లో నా పరిశోధనాంశం ‘తెలుగు సామేతలు…ఇతర ద్రావిడ భాషలతో పరిశీలన” ద్రావిడ భాషలనగానే గుర్తుకొచ్చేవి తెలుగుతో బాటు ఇందాక చెప్పుకున్న నాలుగు భాషలే.సుమారు నలభైవేల సామేతలు ఇంకొంచం లోతుగా పి.హెచ్ డి పరిశొధన చేయడానికి పుగొల్పాయి. తెలుగు,మళయాలకె పరిమితమయి సంత్రుప్తిగా పరిశొధన ముగించాను. పరిశొధన పూర్తయ్యాక అనువాదాలు ప్రారంభించాను. కనుక పరిశొధనే అనువాదం పై మక్కువ పెరగడానికి కారణం. అయితే నేరుగా ఆయా భాషలనుండి అనువదించాలనే కొరిక ఇంకొక కారణం.

.

ప్ర7.మీరు ఇంగ్లిష్, హింది, సంస్కృతం లాంటి భాషలను అధ్యయనం చేసికూడా వీటిల్లోకి అనువాదాలుతేవడం కాని, వీటినించి ఇతరభాషలకి తేవడంకానీ ఎక్కువగా కనిపించదు..? దానిపై మీ స్పందన..

 

తెలుగు,హింది,ఇంగ్లీష్.సంస్కృతం,ఉర్దూ కూడా తెలిసినవాళ్లు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. త్రిభాషా సూత్రం అమలు అయిన రాష్ట్రం కనుక ఇందాకటి భాషలు తెలిసిన వాళ్ళు ఎక్కువ. తెలంగాణలో ఒకప్పుడు అధికార భాషగా ఉర్దూ ఉండటం వల్ల ఉర్దూ తెలిసిన వాళ్లూ ఎక్కువే. ఈళ్ల సంఖ్యతో పోల్చినప్పుడు తమిళం,మలయాళం,కన్నడం-తెలుగు తెలిసిన వాళ్లు తక్కువ. తెలుగు-మలయాళం రెండు భాషలు వచ్చిన వాళ్లు నలుగురైదుగురు మాత్రమే.  ద్రావిడభాషలు నాల్గింటి మధ్య పరస్పరం జరిగిన అనువాదాల సంఖ్య తక్కువే. ఈ అగాధాన్నిపూరించాలంటే. ఈ ఖాళీ సవరించాలంటే ద్రావిడ భాషలమధ్య పరస్పరానువాదాలు, ఆదాన ప్రదానాలు ఎక్కువగ జరగాలి. ఇంకా చెప్పాలంటే తెలుగు-పంజాబి,అస్సామీ మొ.భాషల్లోకి అనువాదాలు ఇంకా జరగాలి.

 

ప్ర8.చాలావరకు అనువాదకులు (Link Language )సంబంధ భాషనించి చేస్తారు..మీరు మూలభాషనుంచి చేయడానికి పదునాలుగు భాషలను అధ్యయనం చేసారు.ఇందులో ఏ మార్గం సరైనదని భావిస్తారు..? ప్రధానంగా ఎందులో కవిని ,కవిరచనని సంపన్నంగా అందించడానికి వీలవుతుందని భావిస్తారు..?

 

నేరుగా ఆయా మూల భాషలనుండి  లక్ష్య భాషలోనికి అనువాదం చేయడం సరైనది. ఎంతగొప్ప అనువాదమైనప్పటికి మూలం స్వారస్యం మన మాతృభాషలోకి దిగదు. అటువంటప్పుడు వయా అనువాదాలు చేయడం వల్ల నాణ్యత కొరవడే అవకాశం ఉన్నది. కానీ నేరుగా అనువాదం సాధ్యం కానప్పుడు లింక్ లాంగ్వేజ్ నుంచి చేయటం తప్పుకాదు. ఒక మూల భాషలోని గొప్పరచనను ఇంగ్లీష్,హిందీ నుంచి చదివి అది తప్పకుండా లక్ష్య భాష అయిన తెలుగులోకి రావాలనుకున్నప్పుడు చేయడంలో తప్పులేదు. కాని సంబంధ భాషనుండి తేలికగా అనువదించ వచ్చుకదా అనుకుని డైరెక్ట్ అనువాదకులని పట్టించుకోక పోవడం పెద్ద పొరపాటు.

ప్ర9.తెలుగులోకి అనువాద రూపంలో వస్తున్న రచనలసంఖ్యగానీ,తెలుగులోకి ఇతరభాషల్లోంచి వస్తున్న అనువాదల పట్లగానీ మీ అభిప్రాయం ..?

 

తెలుగులోకి అనువాదపరంగా వస్తున్నరచనలు రాసిలోనూ వాసిలోనూ బాగున్నాయి. ఐతే ఇతర భాషలతో పోల్చి చూసుకుంటే ఇవి సంఖ్యా పరంగ తక్కువ అని చెప్పక తప్పదు. తెలుగులో ప్రత్యేకించి “విపుల” పత్రిక చేస్తున్న కృషి ప్రశంసనీయం. సాహిత్య అకాడెమీ,ఎన్,బీ,టీ తదితర ప్రభుత్వ సంస్థల అనువాదాలు సరేసరి. హెచ్ బీ టీ, పికాక్ క్లాసిక్స్ వంటిసంస్థలు అనువాదాలను ప్రొత్సహిస్తున్నాయి. పత్రికలు కూడా ఆదివారం అనుబంధాల్లో కథలు,కవితలకు చోటునిస్తున్నాయి.ఇది శుభపరిణామం. అయితే తెలుగునుండి ఇతరభాషలలోనికి ఎక్కువగా వెళ్లడంలేదు. దీనికి పరిష్కారం ఒక్కటే . మూల రచయితకు తమరచనని అనువాదంలో చూసుకోవాలన్న శ్రద్ధ ఉండాలి. తెలుగునుండి ఇతరభాషలకు తీసుకువెళ్లగలిగిన అనువాదకులని గుర్తించాలి.  ముఖ్యంగా అనువాదకులందరూ కలిసి ఒక వేదికపైకి వస్తే ఫలితాలు బాగుంటాయి. వాస్తవంగ ఆలోచిస్తే ఈ బృహత్తర కార్యాన్ని విశ్వవిద్యాలయాలు చేపట్టాలి.

ప్ర10.మీరు తెలంగాణా పదకోశాన్నిరూపొందించారు..తెలంగణా ప్రజవ్యవహారంలో వచ్చిన సాహిత్యం,ఇతర రచనలు అనువాదనికి లొంగవు అన్న అభిప్రాయంతో మీరెంతవరకు ఏకీభవిస్తారు.?ఇది సత్యమే అయితే దీనికి అనువాదకులుగా ఏదైనా పరిష్కారాన్ని పంచుకుంటారా..?

ఆధునిక ప్రమాణ భాషలో వచ్చిన రచనలు అనువాదానికి సులభంగా లొంగుతాయి.అది నూటికి నూరుపాళ్లు సత్యం.ఒకే రాష్ట్రంలోని ఆయాప్రాంత వ్యవహారం(మాండలికం)లో వచ్చిన రచనలు అనువాదాల్లోకి వెళ్లటం కష్టమైన పనే.కాకపోతే ఏదీ జరగక పోవడం కన్న కొంతైనా జరగడం మిన్న కనుక నిరాశపడవలసింది లేదు. మాండలికంలో ఉన్న రచన ఇతరమాండలికాల్లోకి వెళ్లవలసిన అవసరం ఉంది. అది సాధ్యంకానప్పుడు ఇక్కడి మాండలికరచన అక్కడి మాండలికానికి దగ్గరగ ఉన్న రచనగానైనా లేదా అక్కడిప్రమాణ భాషలోకైనా వెళ్లుతుంది.దీనికి పరిష్కారం ఏమిటంటే ఇలాంటి అనువాదాలకు తెలుగు బాగా తెలిసిన ఇతర భాషల్లోని అనువాదకులని గుర్తించాలి. ఉదాహరణకు తమిళంలో “ఇళంభారతి “ఉన్నారు. ఆయన “అంపశయ్య నవీన్”గారి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డ్ పొందిన నవల “కాలరేఖలు”ను గొప్పగా”కలచ్చువడుగళ్”గ అనువదించారు.

ప్ర11.తెలంగాణా సామాజిక వాతవరణానికి,ఇతర ద్రావిడభాషాప్రాంతాల సామాజిక వాతావరణానికి మధ్య ఏదైనా సారూప్యతలేమైనా మీరు గుర్తించారా..?ఆయ భాషలలో సామాజికంగ వచ్చే సాహిత్యానికి,ఇక్కడి సాహిత్యానికి ఏదైనా పోలికలు మీకు కనిపించాయా..?

తెలంగాణా సామాజిక వాతావరణానికి,ఇతర భాషల సామాజిక వాతావరణానికి సారూప్యతలు ఉంటాయి.ఇదంతా ద్రావిడభాషాసమాజం.ద్రవిడంలో మళయాలానికి ఒక ప్రత్యేకత ఉంది.అక్కడ దాదాపు 1929 వరకు నాయర్లు తదితర కుటుంబాలల్లో బహుభార్యాత్వం ఉంది. మాతృస్వామిక వ్యవస్థ “మరుమక్కత్తాయం”ఉన్నది.ఇక తెలంగాణా సామాజిక వాతావరణానికి హైదరాబాద్ ..కర్ణాటక లో గుల్బర్గా,రాయచూర్,బీదర్ జిల్లాలు 1952 కు ముందు హైదరాబాద్ లో ఉండేవి. తెలంగాణా వెనకబాటుతనంలాగే అయాజిల్లాల వెనుకబాటుతనాలు.సంస్కృతి,సాంప్రదాయాలు కూడ దగ్గరగా ఉంటాయి.కాకపోతె అక్కద వీర శైవం ఎక్కువ.సాహిత్యాల మధ్య పోలికలు చాలా ఉన్నాయి.స్త్రీవాద,దళితవాదం మొ.న సాహిత్యోద్యమాలు అక్కడ ఇక్కడా ముందో వెనకో వచ్చినవే.

ప్ర12.మీరు కథా రచయితగా”మంద””లాంటి గొప్ప కథలని రాసారు,కవిత్వం విషయంలో “సుద్దముక్క”లాంటి గొప్ప కవిత్వమూ ఉంది..అనువాదకుడుగా తమిళంవంటిభాషలలోకి,ఇతరాలకి అనువాదం చేసారు…మిలో మీకు నచ్చిన ..అలా అనడంకంటే మిమ్మల్ని ఎక్కువ సంతోష పెట్టే సాహిత్య వ్యక్తిత్వం ఏమిటి..డా.నలిమెల భాస్కర్ ని ఎలా చూడాలని కోరుకుంటారు.

 

నన్నుబాగా సంతృప్తి పరిచే అంశం అనువాదం. సాహిత్యానికి మాత్రమే పరిమితమై చూసినప్పుడు అనువాదం ఇష్టం.ఇంకా విస్తృతంగా ఆలోచించినప్పుడు నాకు” బోధన”ఇష్టం. అయితే అది ప్రస్తుతాంశం కాదు.  సృజన ఎవరో ఒకరు ఏదో ఒకరీతిలో చేస్తూనే ఉంటారు. అనుసృజన కష్టం. పైగా అది నిష్కామ కర్మ యోగం. ప్రతిఫలాపేక్షలేని పని. మూల భాషలోని రచయిత అనువాదం ద్వారా ఇంకొక భాషలోకి వెళ్లడం. మనిషి ఇరుగుభాషల్లో కి ప్రవహించేగుణం .నన్ను నేను అనువాదకుడుగా ఇష్టపడుతాను.

ప్ర13.చాలావరకు అధ్యయనం కోసం మీఆరోగ్యాన్ని ఫణంగా పెట్టారు.మిమ్మల్ని దగ్గరగా గమంచిన కొంతమందికి ఈ విషయం సుస్పష్టంగా తెలుసు. అయినా మీరు ఇంకా ఇలా(ఆరోగ్యాన్ని లక్షపెట్టకుండా)కొనసాగించడానికి పదిలమైన లక్షమేదైనా ఉందా..?

ప్రత్యేక లక్షం అంటే..అనువాదం విషయానికొస్తే నా దగ్గర వివిధ భారతీయ భాషలకు సంబంధించిన గొప్ప కథలు ఓ యాభై నుండి డెబ్భైవరకు ఉన్నాయి. వాటిని ఆయ కారణాలవల్ల ఇప్పటివరకు అనువదించలేక పోయాను. వాటిని తెలుగు పాఠకులకు అందించాలన్నది ప్రణాళిక…అనువాదాన్నించి బయటికి వచ్చిచూస్తే నేను చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. తెలంగాణా పదకోశాన్ని కనీసం పదిహేనువేలకి తగ్గకుండా తీసుకొని రావడం. నాజీవిత కాలమంతా ఆ నిఘంటువుని అప్ డేట్ చేసుకుంటూ రావడం. పాల్కురికి సోమనాథుడు,భక్తరామ దాసు,పోతన వారి పదప్రయోగ సూచికని తయారు చేయడం. తెలంగాణా సామేతలని ఒక బృహత్సంకలనంగా తీసుకు రావటం…ఇలాంటివి ఇంకా ఉన్నాయి

ప్ర14.యూనివర్సిటీలలో అనువాదన్ని కోర్స్ గా ప్రారంభించి ప్రధానంగా ద్రావిడభాషలనించి అనువాదకులను ఎక్కువగా తయారు చేసుకోవాలన్న ఆలోచనకు మీస్పందన..?

గొప్ప ఆలోచన.అనువాదాలు అప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తాయి.సాహిత్య వికాసానికి,హృదయవికాసానికి,సమాజాభ్యుదయానికి,ప్రాపంచిక పరిణామ పరిశీలనకి అనువాదాలు గొప్ప మాధ్యమాలు.విశ్వవిద్యాలయాల్లో అనువాదం కోర్సుగా ఉండాలి.స్నాతకోత్తర స్థాయిలో అనువాదాన్ని పాఠ్య ప్రణాళిక లో ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టవచ్చు.ప్రత్యేకించి ద్రావిడ భాషల్లో పరస్పరానువాదాలు.ఆదానప్రదానాలకు కారకులైనవరిని గుర్తించి వారిచేత భావితరాలను తయారీకి తోడ్పడాలి.

ప్ర15.”సాహితీ సుమాలు” పేరుతో సాహితీవేత్తలని పరిచయం చేసారు..తమిల తెలుగు సాహిత్యాలని తులనాత్మకంగా అందించే ప్రయత్నం మీనుంచి ఆశించవచ్చా..?

తమిళ తెలుగు సాహిత్యాలను తులనాత్మకంగ అందించే ప్రయత్నంలో భాగంగానే తెలుగు-తమిళ సామేతలను పరిశోధనగ చేసుకొన్నాను.

(తెలుగులో సామేతలు-ఇతర ద్రావిడ భాషలతో తులనత్మక పరిశీలన)అంతే కాదు తెలుగు తమిళ పొడుపుకథలు అంటూ పెద్దవ్యాసం రాసి ప్రకటించాను.భవిష్యత్తులో రెండుభాషల్లోని పొడుపుకథలగురించి ఒక పుస్తకం తీసుకొని రావలన్నది నాసంకల్పం.”భారతీయ సామేతలు” అన్నపేరుతో ప్రచురించిన పుస్తకంలో తెలుగు-మళయాల సామేతల సమానార్థకాలున్నాయి.ఈ సారి అదే పేరుతో వచ్చే గ్రంథంలో “తెలుగు-తమిళ సామేతల సమనార్థకాలుండే అవకాశం ఉంది.

 

ప్ర16.మీకుటుంబ సభ్యులనుంచి,మీ మిత్రులనుంచి ,తెలంగాణా సాహిత్యవాతవరణం నుంచి మీకందుతున్న అభినందనలపై స్పందిస్తారా..?

 

నా అర్థాంగి సావిత్రి సహకారం మరిచి పోలేనిది. అవార్డ్ రావడం పట్ల ఆమె చాలా సంతోషించింది. తను గొప్ప అదృష్ట వంతురాలు అని భావించింది. మా కూతురు చైతన్య , అల్లుడు శ్రీనివాస్  మనుమరాలు ఔచిత్యల ఆనందానికి అంతే లేదు. అమ్మ అనారోగ్యంతో ఉంది కనుక మాట్లాడలేదు. తమ్ముళ్లు,సోదరీ మణులందరూ సంతోషానికి లోనయ్యారు. మిత్రులనుండి ముఖ్యంగా జూకంటి జగన్నాథం,నిజాం వెంకటేశం,అన్నవరం దేవెందర్,పెద్దింటి అశోక్ కుమార్ వంటి ఎందరో మిత్రుల సంభ్రమాశ్చర్యాలకు లెక్కే లేదు. తెలంగాణా నుండి అందుకున్న ప్రతిస్పందన  చూస్తుంటే ఈ అవార్డ్ తెలంగాణాకే వచ్చినంత ఆనందం వేస్తున్నది. తెలంగాణా సాధించుకున్నాక మొదటి జాతీయ పురస్కారం కాబట్టి ఆ బహుమతిని తమకే వచ్చినట్టుగా అందరూ “స్వీయం” చేసుకుంటున్నరు. ఇది అందరికీ ఆనందాన్నిచ్చే సందర్భం కావడం నాకు అందివచ్చిన మంచి అవకాశం.

ముఖాముఖి: ఎం. నారాయణ శర్మ

Download PDF

2 Comments

  • Veldandi Sridhar says:

    మందుగా డా.నలిమెల భాస్కర్ గారికి హృదయ పూర్వక అభినందనలు. ప్రశ్నావళి వాటికి సమాధానాలు ఎంతో పరిణతితో ఉన్నాయనిపించింది. తెలంగాణ కల సాకారమైన సందర్భంలో నలిమెల గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడంతో తెలంగాణ సాహిత్య జీవులంతా సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ నుండి అనువాద రంగానికి రావడం మరింత గర్వకారణం. ఇరుగు పొరుగు రాష్ట్ర్రాలలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన అనివార్య సందర్భంలో కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర్ర ప్రభుత్వంగానీ ఒక అనువాద విశ్వవిద్యాలయాన్నే ప్రారంభించి భవిష్యత్ తరాలను అనువాదకులుగా తీర్యిదిద్దాల్సిన అవసరం ఉంది. అదలా ఉంచితే అనువాదాలకు లొంగని తెలంగాణ తెలుగు లాంటి భాషలు ఇతర భాషల్లోకి విస్తృతంగా వెళ్లడానికి మరింత స్సష్టమైన మార్గాలను బహుభాషా కోవిధులు డా.నలిమెల భాస్కర్ లాంటి వారే సూచించాలి. ఇంటర్వ్యూ చేసిన నారాయణ శర్మగారికి అభినందనలు…

    వెల్దండి శ్రీధర్..

  • dasaraju ramarao says:

    నలిమెల భాస్కర్ గారు తెలంగాణ సాహిత్యానికి అందివచ్చిన అనువాదక వరం. పలుభాషల ప్రావీణ్యాన్ని సొంతం చేసుకోవడం అంత సులువైనపనేమీ కాదు. వారి కమిట్మెంటే వారినాదశకు నడిపించింది. అభినందనీయులు. నారాయణ శర్మ గారు విలువైన ఇంటర్వూ చేశారు. థాంక్స్.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)