మా సత్తెమ్మ తల్లీ, గుళ్ళూ, గోపురాలూ

సత్తెమ్మ తల్లి కి నమస్కారం

chitten raju

మా చిన్నప్పుడూ, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మేము శేరీ పొలం వెళ్ళినా, మొట్టమొదట చేసే పని, చెరువు గట్టు ఎదురుగా రావి చెట్టు క్రింద ఉన్న మా  సత్తెమ్మ తల్లికి మనసారా దణ్ణం పెట్టడం. ఆ తరవాతే పొలం లోకి అడుగుపెట్టినా, ఏ పనులు చేసినా.

ఈ సత్తెమ్మ తల్లి  ని ఎవరు ఎప్పుడు ప్రతిష్టించారో ఎవరికీ తెలియదు కానీ మా లోకారెడ్డి వారి చెరువా ఇస్తువా పంపు అనే శేరీ 1920 లలో మా తాత గారు కొన్నప్పటి నుంచీ, గ్రామాలకి గ్రామ దేవతలా ఈ సత్తెమ్మ తల్లే మా పొలాలకి అధిదేవత. రాతి రూపంలో పసుపు కుంకుమల తో ఉన్న ఈ అమ్మ వారికి రోజూ దీపం పెట్టడం, పూజలు చెయ్యడం లాంటి పూజా పునస్కారాలు ఉండవు.  కానీ ఏడాది పొడుగునా జరిగే విత్తనాలు జల్లి నారు పొయ్యడం, నాట్లు వెయ్యడం, కలుపు తీత, ఎరువులు వెయ్యడం, కోతలు, గడ్డి  కుప్పలు వెయ్యడం, కళ్లం తయారు చెయ్యడం, కుప్ప నూర్పులు, ఆరబెట్టడం, కాటా వేసి రైస్ మిల్లర్లకో వర్తకులకో అమ్మకం చేసి డబ్బు రూపేణా ఫలసాయం పొందే దాకా జరిగే ఏ పని మొదలుపెట్టేటప్పుడైనా సత్తెమ్మ తల్లికి పూజ చేసి, కోడిని కోసి ఆశీస్సులు తీసుకోవడం మా తరతరాల ఆచారం.

ఇక పండగల సమయంలో, ముఖ్యంగా పెద్ద పండగ అయినా, మా పాలికాపుల ఇళ్ళలో పెళ్లి లాంటి ఏ శుభకార్యం జరిగినా మేక ని కొయ్యడం కూడా మా పాలికాపుల ఆచారం.  ఇలా కొలిచిన దానికి  ప్రతిఫలంగా సత్తెమ్మ తల్లి మా పొలం లో ఏ విధమైన దొంగ తనాలు, తప్పుడు పనులు జరగకుండా కాపాడుతుంది అని ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాలలోనూ, మా కుటుంబానికీ నమ్మకం. నాకు తెలిసీ ఇప్పటి దాకా ఒక్కటంటే ఒక్కసారి కూడా ఏ విధమైన దొంగతనం అనేది జరగ లేదు.  ఇటీవల నేను అక్కడికి వెళ్లినప్పుడు మా సత్తెమ్మ తల్లికి దణ్ణం పెడుతూ తీయించుకున్న ఫోటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను. ఈ ఫోటో అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి..మా పిల్లలతో సహా….ఎవరికైనా చూపిస్తే ..ఆ మాట కొస్తే కొంత మంది పెద్ద వాళ్ళు కూడా నవ్వుతారేమో నాకు తెలియదు. “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.నా యిచ్చయే గాక నాకేటి ఎరవు?” అన్నాడు కృష్ణశాస్త్రి.

సత్తెమ్మ తల్లి కి నమస్కారం

సత్తెమ్మ తల్లి కి నమస్కారం

మా సత్తెమ్మ తల్లికి సంబంధించి రెండు సంఘటనలు నాకు ఇంకా గుర్తున్నాయి. మా చిన్నప్పుడు వేసవి కాలంలో రాత్రి నూర్పులు అయ్యాక ధాన్యం కుప్పలు గా వేసే వారు. కుప్పకి సుమారు పాతిక బస్తాల చొప్పున చాలా కుప్పలే ఉండేవి. అప్పుడు నాకూ, మా తమ్ముడికీ, తన పెద్ద బావమరిది వెంకట్రావుకీ ఒక ప్రధానమైన డ్యూటీ వేసేవాడు. అదేమిటంటే ఆ కుప్పలన్నింటి మీదా ఆంజనేయ స్వామి ముద్రలు వెయ్యడం. అంటే మా పొలాలకి ఆంజనేయ స్వామిని అందంగా చెక్కిన ఒక రాజ ముద్రిక ఉండేది. ప్రతీ ధాన్యం కుప్ప మీదా మూడు వరసలలో , ఒక్కొక్క వరసకీ ఐదారు చొప్పున  అర చేతి సైజు లో ఉండే మట్టి పిడకలని మా ఉద్దారుడు…అంటే పెద్ద పాలికాపు….జాగ్రత్తగా సరి అయిన పద్ధతిలో  అతికించే వాడు. ఇక్కడ టెక్నాలజీ ఏమిటంటే ఎవరైనా ఆ కుప్పలో పై నుంచి కానీ, కింద నుంచి కానీ ధాన్యం లాగేస్తే ఈ మట్టి పిడక కిందకి పూర్తిగా జారి పోవడమో, కొంచెం చితికి బీటలు పడడమో జరిగి ఎవరు దొంగతనం చేశారో తెలియక పోయినా ఖచ్చితంగా ధాన్యం దొంగతనం జరిగినట్టు తెలిసిపోతుందన్న మాట.

అందు చేత ఈ పిడకల “ప్లేసింగ్” ని మా పెద్దన్నయ్య స్వయంగా పర్యవేక్షించే వాడు.  కొంచెం దైవ భయం కూడా  జోడించడానికి  కొంచెం తడిగా ఉండే ఈ పిడకల మీద ఆంజనేయ స్వామి ముద్ర “అద్దే” వాళ్ళం. ““అద్దే” వాళ్ళం అని ఎందుకు అనవలసి వచ్చిందంటే,  ఆ ముద్ర గట్టిగా కొడితే మట్టి పిడక చితికిపోతుంది. మరీ సున్నితంగా కొడితే ఆంజనేయ స్వామి కనపడడు.

ఇక ప్రతీ కుప్పా కళ్ళం లో నేల మీద పది, పదిహేను అడుగుల వృత్తులాకారంలో ఉండి ఐదారు అడుగులు ఎత్తు ఉండేవి. ఒక సారి కొత్తగా పని లోకి వచ్చిన ఒక కుర్ర కూలీ అత్యంత లాఘవంగా ప్రతీ కుప్ప నుంచీ ఎక్కడా ఈ “సెక్యూరిటీ” పిడకలు ఏ మాత్రం కదలకుండా కొంచెం ధాన్యం చొప్పున  అన్ని కుప్పల నుంచీ కలిపి అర బస్తాడు ధాన్యం దొంగతనం చేసి మసక చీకట్లో పారిపోతూ మా పొలం సరిహద్దుల దగ్గరకి రాగానే కాలు జారి కాలవ లో పడి లేవలేక పోయాడు. ఐదారు గంటల తరువాత మా పాలికాపులు అతన్ని చూసి బైటకి తీసి దొంగతనం చేస్తున్నాడని తెలుసుకున్నారు. ఇక ఆ చుట్టు పక్కల అన్ని గ్రామాల లోనూ “రామం గారి శేరీ లో దొంగతనం చెయ్యబోతే వాణ్ణి సత్తెమ్మ తల్లి పొలం సరిహద్దులు దాటనియ్యకుండా కట్టి పడేసింది” అని నిస్సంకోచంగా నమ్మారు.

మా ఇంట్లో భోజనం చేస్తున్న కొందరు రైతులు

ఈ ఉదంతం బహుశా “దివాణం” గారి హయాం ..అంటే  మా నాన్న గారి హయాం లోనే జరిగినా, హేతువాద దృష్టిలో ఈ సంఘటన కేవలం కాకతాళీయమే అయినా, గత ఎనభై ఏళ్లగా మా పొలంలో అతి చిన్న దొంగతనం కూడా జరగక పోవడం మా సత్తెమ్మ తల్లి రక్షణే అని అందరి నమ్మకం.  అంతెందుకు,  మా “చిన్న దివాణం” హయాంలో ..అంటే మా పెద్దన్నయ్య హయాంలో ఒక సారి ఒక నక్సలైట్ తుపాకీ తో పొలంలో మా మకాం కి వచ్చి , ఏడాదికి పది వేలు ఇవ్వక పోతే రక రకాల ఇబ్బందులు పెడతానని బెదిరించాడు. అప్పుడు మా రైతులు సత్తెమ్మ తల్లి గురించి వివరంగా చెప్పి, దమ్ముంటే మళ్ళీ శేరీ లో అడుగుపెట్టమని ఛాలెంజ్ చెయ్యగానే దేవుళ్ళనీ , దేవతలనీ నమ్మని ఆ నక్సలైట్ కూడా మళ్ళీ  మా పొలం చుట్టుపక్కలకి రాలేదు.

సిద్దాంతం లో మా పూర్వీకులు కట్టించిన వినాయకుడు గుడి

సిద్దాంతం లో మా పూర్వీకులు కట్టించిన వినాయకుడు గుడి

ఇదంతా చదివి మా వంగూరి వారు గ్రామ దేవతల దగ్గర నుంచీ మనకున్న కోటానుకోట్ల  దేవదేవుళ్ళందరినీ ఆరాధించేస్తూ విపరీతమైన దైవ భక్తులు అని అనుకుంటే “తప్పులో కాలేసినట్టే”.  నాకు తెలినంత వరకూ మాకు మా ప్రాంతాలలో సాధారణ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలలో ఉండే స్థాయి లోనే మా దైవిక పరమైన వ్యాపకాలు ఉండేవి. ఇంచు మించు అన్నీ పండగలు, వ్రతాలు, పెళ్ళిళ్ళు , పేరంటాల చుట్టూ తిరిగినవే.  మతపరమైన అంశాలలో ఎక్కడా “ఓవర్ ఏక్షనూ” లేదు. అలా అని ఆధిక్షేపణ అంతకంటే  లేదు. ఇంటా, బయటా సరి అయిన మోతాదులోనే ఉంటాం.  మా పూర్వీకుల విషయం నాకు స్పష్టంగా తెలియదు కానీ వారు తణుకు దగ్గర సిద్దాంతం గ్రామ కారణాలుగా ఉండే సమయంలో …అంటే 1690 సంవత్సరం ప్రాంతాల నాటి సూరప రాజు  గారి హయాంలోనే, ఆ తరువాతనో మా ముత్తాతలు ఒక వినాయకుడి గుడి కట్టి ఆలయ అర్చకులకి జీవనోపాధికి ఇచ్చారుట.

నేను సుమారు పదేళ్ళ క్రితం మొట్టమొదటి సారిగా మా పూర్వీకుల అన్వేషణలో అక్కడికి వెళ్లి  ఆ గుడి చూశాను. అప్పుడు చాలా పురాతనంగా ఆ గుడి పై భాగంలో “వంగూరి వారు కట్టించి ఇచ్చిన ఆలయము” అని సంవత్సరం కూడా వ్రాసి ఉంది కానీ చదవడానికి వీలులేని స్థితి లో ఉంది. క్రిందటేడు ఆ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మళ్ళీ సిద్దాంతం వెళ్లాను. ఇప్పుడు పురాతన కట్టడాన్ని నిర్మూలించి ఆ గుడిని ధర్మకర్తలు పున:నిర్మాణం చేసి ఆనాటి ఆనవాళ్ళు ఏమీ లేకుండా చేశారు. మూడు దశాబ్దాల క్రితం నాటి “వంగూరి వారి వినాయకుడి గుడి”  ఈ నాటి ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను.

ఇక మా తరానికి వస్తే, ఐదారేళ్ళ క్రితం మా పొలానికి ఆనుకుని ఉన్న చిన జగ్గం పేట  గ్రామంలో ఆ పెద్దన్నయ్య కృష్ణుడి గుడి కట్టించడం చెప్పుకో దగ్గ విశేషమే!  ఈ గుడి కట్టించడానికి మా పెద్దన్నయ్య దైవ భక్తి చిన్న కారణం కానీ అంత కంటే ముఖ్య కారణాలు వేరే ఉన్నాయి.  ఈ చిన జగ్గం పేట  వెయ్యి గడపల గ్రామంలో ఉప్పర్లు, మాలలు, గొల్లలు సమ సంఖ్యలో ఉంటారు. ఈ మూడు కులాల వారు అనేక తరాల నుంచీ మాతో బాటు మా  పొలాన్నే నమ్ముకున్న వాళ్ళే. గత అరవై, డభై ఏళ్లగా మేము ఎప్పుడైనా ఏ పెళ్ళిళ్ళ కొ, చదువులకో కొంత పొలం అమ్మినా, వీళ్ళలో ఏదో ఒక కులం వారు సమిష్టిగా కొనుక్కుని ఇప్పటికీ మా శేరీ లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు.  సుమారు పదిహేనేళ్ళ క్రితం అప్పటి మునసబో, మరెవరో ఆ గ్రామంలో ఒక చిన్న సీతారామస్వామి దేవాలయం కట్టించారు.  ఈ గ్రామం  లో అదే మొట్టమొదటి దేవాలయం.

రామారావు పేటలో శివాలయం

రామారావు పేటలో శివాలయం

పక్కనే ఉన్న తాటిపర్తిలో ఒక ఆలయం ఉంది కానీ, విశేషం ఏమిటంటే ఆ చుట్టూ పక్కల పది గ్రామాలలోనూ దేవుడికి దీపం పెట్టడానికి ఒక్క పూజారి కుటుంబం కూడా లేదు.  ఎందుకంటే, కరిణీకాలు రద్దు చేసెయ్యడం, పంతుళ్ళకి జీతాలు ఇవ్వక పోవడం మొదలైన రాజకీయ కారణాల వలన ప్రస్తుత  గ్రామీణ వాతావరణం  లో పొట్టపోసుకునే అవకాశాలు లేక బ్రాహ్మణ కుటుంబాలు పట్టణాలకో..ఆ మాట కొస్తే అమెరికాకో..వలస పోయారు.  ఇప్పుడు సీతారామస్వామి ఆలయం కొత్తగా చిన జగ్గం పేట లో వెలియగానే, ఎవరో ఒక పూజారి గారిని బతిమాలుకుని ఆయన తాటిపర్తిలో కాపరం ఉండేటట్టూ, రోజూ  అక్కడి గుడికీ, ఇక్కడి గుడికీ సైకిల్ మీద వచ్చి దీపం పెట్టి, ఆరాధన చేసేటట్టూ ఏర్పాటు చేశారు.

అప్పుడు ఈ గ్రామం లో ఉన్న గొల్లలు తమ కుల దైవం అయిన శ్రీ కృష్ణుడి కి కూడా గుడి కట్టిస్తే,  దాని పోషణ అంతా తాము చూసుకుంటాం అనీ, పూజారి గారికి కూడా భుక్తి గడుస్తుంది అనీ మా పెద్దన్నయ్య ని కోరారు. “తరతరాలుగా మన శేరీ నే నమ్ముకున్న  ఈ గ్రామ ప్రజల ఋణం ఇలాగైనా తీర్చుకుందాం” అనుకునీ, తన పేరు అక్కడ కలకాలం నిలబడుతుందనే సంతోషం తోటీ, తన 77 వ ఏట మా పెద్దన్నయ్య , ఆ సేతారామస్వామి గుడిలో కొత్త విగ్రహాలు పున;ప్రష్టాపన చేసి,  పక్క స్థలంలో శ్రీ కృష్ణుడి గుడి కట్టించి పుణ్యం చేసుకున్నాడు. రెండేళ్ళ క్రితం మా పెద్దన్నయ్య పోయినప్పుడు ఆ గ్రామ వాస్తవ్యులు ఆయన విగ్రహం చేయించి, గుడి ప్రాంగణంలో  పెట్టించారు. ఇందుతో ఆ గుడి, మా పెద్దన్నయ విగ్రహం దగ్గర నేనూ, ఆలయ నిర్వాహకుడి ఒకాయనతో ఉన్న ఫోటో జతపరుస్తున్నాను.  అలాగే కాకినాడలో మా పెద్దన్నయ్య సంవత్సరీకాలకి వచ్చి భోజనం చేస్తున్న మా కొంతమంది రైతుల ఫోటో కూడా జతపరుస్తున్నాను.

మా పెద్దన్నయ్య విగ్రహంతో కృష్ణుడి గుడి దగ్గర నేను, నిర్వాహకులు

మా పెద్దన్నయ్య విగ్రహంతో కృష్ణుడి గుడి దగ్గర నేను, నిర్వాహకులు

గుళ్లూ, గోపురాల గురించి మాట్లాడుతున్నప్పుడు , మా కాకినాడ రామారావు పేట లో ఉన్న శివాలయం గురించి ప్రస్తావించకుండా ఉండ లేను.   ఎందుకంటే, నా జీవితంలో సుమారు ఇరవై ఏళ్ళు…అవును..ఇరవై ఏళ్ళు , నేను ఆ శివాలయాని కి వెళ్లి, ఏడడుగుల పొడుగున్న బక్క పలచటి ఆచారి గారు పెట్టే సాతాళించిన శనగలు తినని రోజు లేదంటే అతిశయోక్తి కానే కాదు.  ఆ శివాలయం ఇప్పటి ఫోటో ఒకటి జత పరుస్తున్నాను…ఎందుకంటే, మా చిన్నప్పుడు దేవుడి గుడిలో ఫోటోలు తీయించుకోవడం మాకు తెలియదు.  ఆ శివాలయం లోనే, ఆ వీధిలోనే ఉన్న ఈశ్వర పుస్తక భాండాగారం లోనే నేను కొన్ని వందల హరి కథలు, పురాణాలు, బుర్ర కథలు, ప్రవచనాలు విని తరించాను.

నా దృష్టి లో మానవ మేధస్సు సృష్టించిన రెండు అధ్బుతాల లో ఒకటి దేవుడు అనే సిద్దాంతం. మరొకటి ధనం. దేవుడి మీద నమ్మకమూ, డబ్బు మీద ఆశా, ఈ రెండూ తగిన మోతాదులో ఉంటేనే మన మనుగడ సమపాళ్ళలో ఉంటుంది.  నాకు ఏక్షన్ ఇష్టమే కానీ, ఓవర్ ఏక్షన్ ఇష్టం లేదు కాబట్టి నా ప్రయత్నం ఎక్కువ లేకుండానే  నా  జీవితంలో రెండిటికీ “సమ న్యాయం “ చేశాననే అనుకుంటున్నాను.

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)