పెరుగుతున్న గోడలు, కూలుతున్న పూదోటలు

Sketch56104048-2

 

 

బిచ్డే అభీ తో హమ్ బస్ కల్ పర్సో

జీయోంగీ మై కైసే, ఇస్ హాల్ మే బర్సో

మౌత్ నా ఆయీ తేరీ యాద్ క్యో ఆయీ

హాయ్ లంబీ జుదాయీ

చార్ దినోంకా ప్యార్ హో రబ్బా

బడీ లంబీ జుదాయీ, లంబీ జుదాయీ..

https://www.youtube.com/watch?v=hEejj51WJ7s

ఈ పాట నాకెంత ఇష్టం అంటే కొన్ని వందల సార్లు వినివుంటా. టేప్ రికార్డర్లు వుండే రోజుల్లో పదేపదే పెట్టుకు వినేవాడిని. ఇప్పుడిక యు ట్యూబ్ కూడా వచ్చేసింది కాబట్టి ఎప్పుడు కంప్యూటర్ పెట్టుకున్నా ఈ పాట ఒకసారి విని తీరాల్సిందే. అందరిలాగే ‘హీరో’ సినిమాలో పాటలో ఒక విరహగీతం మాత్రమే అనుకునే వాడిని. కానీ, ఆ తర్వాత తెలిసింది ఆ పాట అసలు రేష్మాది అని.
ఆ రస్టిక్, ముతక, గుండెల్ని పిండేసే ఆ గొంతు పాకిస్తాన్ గాయకురాలిదని. అయితే, ‘సోలిటరీ రీపర్’ ఎవరైతేనేం, ఆమె భాష ఏదైయితేనేం, నన్ను ఆ గొంతు వెంటాడింది. వెంటాడుతూనే వుంది. నేను ఆ పాటతో ప్రేమలో పడ్డ రోజుల్లో నాకు అసలు హిందీ ఒక్క ముక్క రాదు. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు కూడా రాదు. హైదరాబాదు వచ్చేవరకూ అంతే. కానీ, ఏదో బాధని, ఇంకెంత మాత్రం భరింప రాని బాధని, పలికిస్తోందని అనిపించింది. అవధుల్లేని దుఖ్ఖం ఆమె హృదయంలోంచి ఉప్పెనలా వస్తోందని అనిపించింది.

ఇక ఆ పదాలకి అర్ధం తెలిసేక ఆ పాట మీద, ఆమె మీద గౌరవం పెరిగిందే కాని తగ్గలేదు. ఏ కవి లేదా కవయిత్రి ఏ దుఖ్ఖాన్ని ఆవాహన చేసుకుని రాసివుంటారు? ఏ తెగిన బంధం గుండెల్ని బద్దలు చేస్తే బెంగటిల్లి వుంటారు?

***

అలాటి ఒక రోజు, మళ్ళీ ఆపాట పెట్టుకుని చూస్తున్నా. ఆ పాటని, లేదా అలాటి కొన్ని పాటల్ని, జీవితాంతం పాడుతూ, పాడుతూ వడలిపోయిన రేష్మా ఎక్కడో స్టేజీ మీదకొచ్చింది. నాలాటి వాళ్ళు కొందరు, అక్కడ కూచుని వింటున్నవాళ్లు, లేచి నుంచుని ఆహ్వానిస్తున్నారు. ఆమె పాడటం మొదలుపెట్టింది. అందరూ పెదవులు కదుపుతున్నారు, తలలు ఊపుతున్నారు.
సరిగ్గా అప్పుడే మా అయిదేళ్ళ పాప వచ్చింది.
“నాన్నా, ఎవరు ఆమె,” అని అడిగింది.
“రేష్మా. చాలా బాగా పాటలు పాడుతుంది. నాకు చాలా ఇష్టం,” అన్నాను.
“ఆమెది ఏ ఊరు”

“పాకిస్తాన్”

“పాకిస్తానా? మరి పాకిస్తాన్ వాళ్ళు చెడ్డవాళ్లు కదా. మన మీద బాంబులు వేస్తారు కదా,” అంది, చాలా ఆశ్చర్యపోతూ.
ఆ ప్రశ్న ఒక షాక్ నాకు. పాకిస్తాన్ మీద, ముస్లింల మీద స్టీరియో టైపు కామెంట్లు మనకి అలవాటే. అందులో మనకి కొత్తేముంది అందులో? కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఇంత చిన్నపిల్లకి ఆ విషయం ఎవరు చెప్పి వుంటారు? ఎందుకంటే, మనం ఎందుకు చెప్తాం అలాటి అన్యాయమైన విషయాలు ఇంట్లో.
అప్పటికి ఏదో సద్ది చెప్పాను అలకి. కానీ, అప్పటినించి ఆ ప్రశ్నే వెంటాడుతుండేది. పిల్లల్ని ఎంత చిన్నప్పటి నుంచి తయారు చేస్తున్నాం, ఒక దేశానికి వ్యతిరేకంగా, ఒక మతానికి వ్యతిరేకంగా? పిల్లల మనసుల్ని ఎంత నిర్హేతుకమైన నిరాధార విషయాలు చెప్పి కలుషితం చేస్తున్నాం?
మొత్తం దేశం దేశమంతా చెడ్డదై పోతుందా? మొత్తం మనుషులు చెడ్డవాళ్లై పోతారా? చేజేతులా పిల్లల దృష్టిని కురచ చేస్తున్నాం కదా. ఈ మకిలి ఆలోచనల్నుంచి, ఈ కనిపించని హింసకి expose కాకుండా పిల్లల్ని కాపాడుకోవడం ఎలా అని అనిపించేది.

***

సరిగ్గా అప్పుడే గోపాల్ మీనన్ ముజఫర్ నగర్ ఊచకోత మీద తీసిన డాక్యుమెంటరీ కాపీ నగరానికొచ్చింది. లౌకిక, ప్రజాస్వామిక, సాహిత్య, సాంస్కృతిక ఫ్రంట్ వాళ్ళు వేస్తే చూడ్డానికి వెళ్ళేం అందరం. అల ఓ వందో, రెండువందలో ప్రశ్నలు అడిగింది, డాక్యుమెంటరీ చూస్తూ, స్వేచ్చ (టీవీ9 ఏంకర్) కూతురుతో ఆడుకుంటూ.
“హిందువులకి ముస్లింలు అంటే ఎందుకు అంత కోపం,” అని.
“ఆ పిల్లలు కూడా ముస్లింలేనా (హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న పిల్లల్ని చూసి),” అని.  బహుశా, పిల్లలని కూడా చూడలేదా అని కావచ్చు.
రిలీఫ్ కేంప్ లో వున్న పిల్లల్ని చూసి, “మరి ఆ పిల్లలు బొమ్మలు తెచ్చుకోలేదా,” అని.
బహుశా పిల్లల బొమ్మల ప్రపంచాన్ని కూల్చివేసిన దృశ్యమేదో ఆమెకి కనిపించి ఉండవచ్చు. ఆ మేరకు కొంత బాల్యపు అమాయకత్వం ఆమె కోల్పోయి ఉండవచ్చు.

***

ఈ ప్రశ్నల్ని కొన్నిటిని ఫేస్ బుక్ లో పెడితే ఒకరిద్దరు well-meaning మిత్రులు నన్ను కోప్పడ్డారు. పిల్లల్ని అలాటి దృశ్యాలకి expose చెయ్యడం తప్పు కదా అని. నిజమే. అందులో సందేహం ఏముంది. ఆ దృశ్యాలు చూసి చిన్న మనసులు బాధపడతాయి కావచ్చు. ఆ డాక్యుమెంటరీలో నిజానికి హింసాయుత సన్నివేశాలు కొన్ని మాత్రమే వున్నాయి. కానీ మిత్రుల సూచనల పై రెండో అభిప్రాయమే లేదు.
కానీ, మనకి ఎప్పుడూ కొన్ని మాత్రమే హింసాయుతంగా కనిపిస్తాయి. తెలుగు సినిమాల నిండా హింస. హింస అంటే కేవలం కొట్టుకోవడం, చంపుకోవడం మాత్రమే కాదు. బూతు, నాటు సంభాషణలు. మతపరమైన సన్నివేశాలు (అంటే దేవుడిని మొక్కడం, ప్రతిజ్ఞలు చెయ్యడం), శృంగార సన్నివేశాలు, అసభ్య నృత్యాలు, పాటలు – ఇవన్నీ మనకి చాలా సహజం అయిపోయాయి. వీటిని చూపించడం, వీటికి పిల్లల్ని expose చెయ్యడం మనకి తప్పని ఎప్పుడూ అనిపించని స్థాయికి వెళ్లిపోయాం.

ఇక సంప్రదాయ భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో చిన్న పిల్లలకి కూడా అన్నీ రసాలూ (శృంగార, బీభత్స రసాలతో) సహా నేర్పిస్తాం. వాళ్ళతో ప్రదర్శనలు ఇప్పిస్తాం. మనం ముచ్చటపడి చూస్తాం. కానీ, అందులో వున్న హింస ఎంత హింస? ముక్కుపచ్చలారని పిల్లలతో వాళ్లకి మరో పదేళ్ళకి గాని సహజంగా కలగని భావాల్ని పిలికిస్తారు ఆ నృత్యాలలో . కానీ, మనకది సహజం అయిపోయింది.  సాంప్రదాయం అయిపొయింది కాని హింస అనిపించలేదు . అనిపించదు.
ఒక హింసకి పోటీగా మరో హింసని చూపించే ప్రయత్నం చెయ్యడం లేదు నేను. హింస ఏ రూపంలో వున్నా వ్యతిరేకించాలి. కానీ, వ్యవస్థీకృత హింస వెయ్యి కనిపించని ముఖాలతో, కాళ్ళతో, చేతులతో మనల్ని ధృతరాష్ట్ర కౌగిలితో నలిపివేస్తున్నది. ప్రస్తుతం అది బలం పుంజుకుంటున్నది. భయపెడుతున్నది. నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తున్నది.
పిల్లలపై సమాజం జరుపుతున్న ఈ హింసతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పెద్దవాళ్ళకి ఏది దారి?

***

రేష్మా నిలదీస్తోంది,

హిజ్రికీ ఊంచీ దీవార్ బనాయీ 

బాగ్ ఉజడ్ గయే ఖిలనే సే పెహ్లే 

పంచీ బిచడ్ గయే మిల్నే సే పెహ్లే 

 

మనుషుల మధ్య చాలా ఎత్తైన గోడల్ని కట్టేస్తున్నాం

పూవులు పూయకముందే తోటల్ని ధ్వంసం చేసేస్తున్నాం
కలవక ముందే మనుషుల ప్రేమల్ని కాలరాసేస్తున్నాం.

 – కూర్మనాధ్ 

Download PDF

4 Comments

  • buchireddy gangula says:

    సర్
    చదువుకున్న దద్దమ్మలు కూడా — ముస్లిమ్స్ అనగానే శత్రువులుగా
    చూడటం — మాట్లాడటం జరుగుతుంది —-యీ దోపిడీ వ్యవస్థలో -?? ఎందుకో ??
    నేటి విద్యా విధానం లో మార్పు అవసరం —-
    ఆర్థిక వత్యాసాలు ఉన్నంత వరకు —–వ్యవస్థ లో మార్పు ?????
    నిజమయిన నాయకులు పుట్టాలి — రావాలి –అప్పుడే
    ———————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  • A says:

    “మనం”, “వాళ్ళు” , “మనవి”, “వాళ్ళవి” అని గీతలుగీసే పెద్దల కొద్ది బుధ్ధులను activeగా నిలదీయకపోతే కలిగే అనర్ధం ఇదే. ఒకప్పుడు ఇలాంటీ వేరుచేసేబుధ్ధి రాజకీయనాయకుల్లోనే ఉండేది. ఇప్పుదు ప్రజల్లోంచి, పిల్లలక్కూడా పాకుతోందన్నమాట.

  • Sreedhar Babu Pasunuru says:

    చార్ దినోంకా ప్యార్ హో రబ్బా… బడీ లంబీ జుదాయీ… అద్భుతమైన పాటను వినిపించినందుకు ధన్యవాదాలు. పెరుగుతున్న గోడలు కాదు.. అందరూ ఎవరికి వారే తమ చుట్టూ ఇరుకిరుకు గదుల్ని మోస్తూ తిరుగుతున్నారనిపిస్తోంది. ఇలాంటి.. సున్నితమైన భావావేశాల ఆస్వాదనే ఆ గోడల్ని ధ్వంసం చేసే సాధనం. ధాంక్యూ కూర్మనాథ్ గారూ.

  • కెక్యూబ్ వర్మ says:

    మనుషుల మధ్య చాలా ఎత్తైన గోడల్ని కట్టేస్తున్నాం

    పూవులు పూయకముందే తోటల్ని ధ్వంసం చేసేస్తున్నాం
    కలవక ముందే మనుషుల ప్రేమల్ని కాలరాసేస్తున్నాం.

    నిజమే సార్. పిల్లల హృదయాలను చిదిమేస్తున్న కాలమిది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)