
కానీ, చూడండి. ఇప్పుడు ఇక్కడే ఆ ఎములాడ రాజన్న సన్నిధిలో ఉన్న ఈ తల్లిని చూడండి.
అది నిజంగా దర్శనమే.నిజం.
మనుషులను దైవానికి మోకరిల్లగా చూడాలి.
అదీ దర్శనమే.
ఎంత నిండుదనం.
ప్రేమా, శాంతీ.
తపస్సూ!
+++
విశేషం ఏమిటంటే, దైవ సన్నిధిలో కనిపించినంత నిండుగ మనుషులు మరెప్పుడూ ఇట్లా కనిపించరు!
సకలాంగులూ వికలాంగులూ అని కాదు, ఎవరైనా సరే, దేవుడి ముందు దీపమై వెలుగుతారు.
దీపం కింది చీకటి గురించిన బెంగ లేదు. దాన్ని ఆ భగవంతుడు చూసుకుంటాడనే ఈ ముద్ర.
నిమగ్నత. లీనం. కదలకుండా అట్లా ఆ కాసిన్ని క్షణాలు నిశ్చలమై నిలవడం.
మళ్లీ కదిలితే జీవితం. భక్తి ఆవిరైపోయి మళ్లీ మామూలే. మామూలు చిత్రమే.
అందుకే అనిపిస్తుంది, ఆరిపోని జీవితంలో రెండు చేతులారా ఆ భగవంతుడికి నమస్కరించడంలో ఒక ఆత్మశాంతి.
కానీ, ఒకటి మాత్రం నిజం.
ఆ దైవ సన్నిధిలో ఎవరైనా అసంపూర్ణమే.
బహుశా అందుకే ఆ నిండుదనం కావచ్చును!
+++
నిజానికి దైవ సన్నిధిలోనే కాదు, ఎవరైనా సరే, కళ్లు మూసుకుని తమలోకి తాము చూసుకునే ఏ చిత్రమైనా గమనించి చూడండి. అది ఆ మనిషి స్థాయిని పెంచినట్లే ఉంటుంది. ఒక అలౌకిక స్థితిని దర్శనం గావిస్తుంది. కారణం, లోపలికి చూసుకోవడమే! వెలుపలి నుంచి లోపలికి చేరుకోవడమే. తమ పరిమితిని దర్శించడమే. అందుకే కాబోలు, కళ్లు మూసుకోగా జీవితం విస్తరించి కనబడుతుంది,
ఇక్కడ విస్తరణ, వాకర్.
+++
అవును. వాకర్.
ఆ తల్లి మోకరిల్లడంలో భగవంతుడే కాదు, ఆ వాకర్ పక్కనున్నది. చూడండి.
మూడు కాళ్ల ముసలమ్మకు ఆ వాకరే నాలుగోకాలు. పంచభూతాల్లో కలిసేదాకా కన్నబిడ్డలు వెంటున్నా లేకున్నా ఇప్పుడు ఆ వాకరే తనకు ఆలంబన. గుడి దాటాకా దేవుడు.
ఆమె కళ్లు మూసుకుని దండం పెట్టుకుంటున్నప్పుడు ఆమె నుంచి ఆ వాకరే కంట పడుతున్నది.
ఆమె స్థితీ గతీని ఆవిష్కరిస్తున్నది.
తన పేదరికానికి చిహ్నం అది. అతుకులు వేసుకుని తన రైక కుట్టుకున్నట్టే ఆ వాకర్నీ ఆమె జాగ్రత్త చేసుకున్న తీరు ఒక మహిమ. జీవన లాలస. మానవ ప్రయత్నం.
ఉన్నదాన్ని తనతో పాటు ఉంచుకుని ఈ జీవన సమరాన్ని జయించేదాకా బహుశా అదే తన ఆధారం.
అందుకే కాబోలు, ఆమె ఎంత శ్రద్ధగా దాన్ని చూసుకుంటున్నదో చూడండి.
దాని కాళ్లు చూడండి.
ఆమె కాళ్లూ చూడండి.
ఒక జత ప్రాణాలనిపించవూ అవి!
సరిగా లేవు. అయినా సరి చేసుకున్న తీరు చూడండి.
ఆ ప్లాస్టర్ అతికింపులూ…ఆ సుతిల్ తాడు ప్రయత్నం,
అంతా ఒక శక్తిమేరా ప్రయత్నం.
ఒకప్పుటి ఆమె ధారుడ్యానికి చిహ్నంగా ఉన్న తన చేతులు…
వాకర్ చేతులూ, బాహువులూ చూడండి. అతుకులు పడ్డవన్న భయం లేదు.
ఆమె జాగ్రత్తగా ఉందని చెప్పే ఆ చిన్న చిన్న రిపేర్లనూ చూస్తుంటే మానవ ప్రయత్నం ముందు ఆ దేవుడు చిన్నబోడూ…
లేదూ హమ్మయ్య…తన ప్రయత్నం అక్కర్లేదని ఆనందించడూ!
నిజమే కాబోలు.
భగవంతుడి సన్నిధిలో ఆమె కళ్లు మూసుకుని ఉన్న ఆ దృశ్యం… అనివార్యంగా తనకు రక్షణగా నిలిచిన ఆ వాకర్ తో కలిసి ఒక అపూర్వ సన్నివేశాన్ని వ్యక్తం చేస్తున్నది.
చూడటం కాదు, దర్శించడం. కనిపించేది ఒక్కటి కాదు, రెండు.
అదీ విషయం.
దృశ్యాదృశ్యం అంటే ఇదే మరి!
మరి చిల్లర దేవుళ్లకు వందనం.
వారికి ఊతమిచ్చే వాటన్నిటికీ అభివందనం!
`దృశ్యాదృశ్యంలో’ ఈ కింది వాక్యాలు బాగున్నాయి.
1,ఎవరైనా సరే, దేవుడి ముందు దీపమై వెలుగుతారు.
2 దీపం కింది చీకటి గురించిన బెంగ లేదు. కళ్లు మూసుకొంటే జీవితం విస్తరించి కనబడుతుంది,
3 ఇక్కడ విస్తరణ, వాకర్.-మూడు కాళ్ల ముసలమ్మకు ఆ వాకరే నాలుగోకాలు.
4 జాగ్రత్తగా ఉందని చెప్పే ఆ చిన్న చిన్న రిపేర్లనూ చూస్తుంటే మానవ ప్రయత్నం ముందు ఆ దేవుడు చిన్నబోడూ…
లేదూ హమ్మయ్య…తన ప్రయత్నం అక్కర్లేదని ఆనందించడూ!
గుండెబోయిన శ్రీనివాస్ ,
హన్మకొండ,