వెలిగినదొక వానవిల్లు…నిను తలవంచి చూసెనే…

 CMS-when-it-is-raining...!!!(1)
ఎండలు ముదురుతున్నాయ్.. ఎటు వెళ్ళినా విపరీతమైన వేడి, చెమట, చిరాకు. శీతాకాలంలో ఈ చలి ఎప్పుడు వెళ్పోతుందో అని ఎదురుచూస్తామా, ఎండలు రాగానే ఉక్కిపోతున్నాం బాబోయ్ అని గోల పెడతాం. మిగతా కాలాల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి తెల్లారుతూనే ఫుల్ స్వింగ్ తో తన ప్రతాపాన్ని మనబోటి అల్పులపై చూపెట్టేస్తున్న మిస్టర్ సూర్యుడిని చూసి భయపడిపోతున్నాం.  అందుకనే ఈసారి కాస్త వెరైటీగా వాన పాటల వెంట పయనిద్దామని డిసైడయ్యా..:) కాసిని వాన పాటల్ని చూస్తే వాతావరణమెలా ఉన్నా “చినుకు చినుకు చినుకు చినుకు….” అంటూ కనీసం మనసైనా చల్లబడుతుంది కదా అని. ఉరుములు, మెరుపులతో కాలింగ్ బెల్ మోగించి, చిన్న చిన్న చినుకులతో ఎంట్రీ ఇచ్చి, జడివానగా మారిపోయి పుడమిని నిలువెల్లా తడిపేసే వర్షహేలను చూసి పులకించిపోని హృదయం ఉంటుందా?! అసలు వర్షాన్నీ, వెన్నెలనీ ప్రేమించని మనిషులుండరు కదా!  కాకపోతే కిటికీలోంచి చూస్తూ కూచోవడానికి అద్భుతంగా ఉంటుంది గానీ అర్జెంట్ పనులున్నప్పుడు, బట్టలు ఆరనప్పుడు మాత్రం వాన మీద కోపం వస్తుంది.
మన తెలుగు సినిమాల్లో వానపాటలకేం.. బోలెడున్నాయ్. పాత సినిమా పాటల్లో కూడా చిటపట చినుకుల్ని బాగానే కురిపించేసారు మన సినీ కవులు. “మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరునవ్వులు కాబోలు/ ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు..” అంటూ శంకరశాస్త్రి గారితో కూడా పరవశ వర్షానందగానాన్ని ఆలపింపజేసారు వేటూరి. ఇంకాస్త వెనక్కి వెళ్తే, చిటపట చినుకులతో కురిసింది వాన, మెరిసింది జాణ(అక్కా చెల్లెలు), వాన కాదు వాన కాదు వరదా రాజా.. (భాగ్యచక్రం), కరుణించవా వరుణదేవా(రాజకోట రహస్యం), చిరు చిరు జల్లుల చినుకుల్లారా(ప్రైవెటూ మాష్టారు), చినుకులలో.. వణికి వణికి(రహస్య గూఢచారి), వాన వెలిసిన వేళ(ఘరానా దొంగ),వాన జల్లు కురిసింది…లేరా..(సంపూర్ణ రామాయణం), కొండపైన వెండి వాన(ఇంటి దొంగలు), మొదలైన వాన పాటలు వినడానికి చాలా బావుంటాయి. అయితే,  వర్షం పడటం ఎక్కువగా చూపెట్టిన వాన పాటలు అయితే సరదాగా ఉంటుందని అలాంటి పాటల్ని వెతికానీసారి. అందువల్ల బ్లాక్ ఽ వైట్ తో పాటూ కాసిని రంగురంగుల పాటలతో ఈసారి పాట వెంట పయనాన్ని ముస్తాబు చేసాను. మరి ఎలా ఉన్నాయో వినేసి, చూసేసి చెప్పేయండీ…
వానపాటల్లో మొట్టమొదట అంతా చెప్పుకునేది ఈ పాట గురించే! వినడానికి పరమ అద్భుతంగా ఉంటుంది కానీ చూట్టానికే నాకు మనసొప్పదు :( వీరోవిన్ గారి ఆహార్యం ఎందుకో నా ఫ్రేం లో ఇమడదు. అసలు పాత నటీమణుల్లో బి.సరోజ నాకు బాగా నచ్చుతుంది కానీ ఈ పాటలో మాత్రం స్కార్ఫ్, రెండు పూలజడలతో నన్ను భయపెడుతుందావిడ. అందుకని ఈ పాట ఆడియోని మాత్రమే క్రింద ఇస్తున్నాను..:)
కొన్ని పాటలు అలా కళ్ళు మూసుకుని వినడానికి చాలా బావుంటాయి. ఎన్నిసార్లైనా అలానే వినాలనిపిస్తుంది తప్ప చూడాలనిపించదు. అలాంటి పాట ఇది. ఓ ప్రేమ జంట హద్దుల దగ్గర ఆగడానికి పడే పాట్లు, వారి తపన, గుసగుసలు ఈ పాటలో తెలుపుతారు గీతరచయిత రాజశ్రీ.
“వానల్లు కురవాలి వరిచేలు పండాలి
మా ఇంట మహలక్ష్మి చిందెయ్యాలి..” అంటూ సాగే ఈ కొసరాజు గీతం మనల్ని పూర్తిగా పల్లె వాతావరణంలోకి తీసుకుపోతుంది. స్పెషల్ పాటలకు పెట్టింది పేరైన ఎల్.ఆర్.ఈశ్వరి వాయిస్ ఈ పాటలోని విశేషం.
(చిత్రం: అల్లుడే మేనల్లుడు)
“ముత్యాల జల్లు కురిసే, రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే…అమ్మమ్మా”
అంటూ “కథానాయకుడు” చిత్రంలో జయలలిత ఆనందంతో చేసే నృత్యం చూసి తీరవలసిందే! సుశీల గాత్రంలోని గమకాలు కూడా గిలిగింతలు పెడతాయి. అమ్మాయి కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నా ఎబ్బెట్టుగా అనిపించకుండా చిత్రీకరించిన దర్శకుడిని మెచ్చుకుని తీరాలి.
ఇన్ని పాటల మధ్యన ఓ సరదా గీతం కూడా చూద్దామా..
“చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం” అంటూ “ముద్దుల కొడుకు” చిత్రంలో శ్రీదేవి, అక్కినేని చెప్పే ‘అందమైన అనుభవాలు’ భలే సరదాగా ఉంటాయి. ఈ పాటలో బాలూ గాత్రం అచ్చం అక్కినేని పాడుతున్నట్లే ఉంటుంది. ఇలా ఏ హీరోకి పాడితే ఆ హీరో స్వరాన్ని ఇమిటేట్ చేయడం వల్లనే తన పాటలంతగా ఆకట్టుకున్నాయి మనల్ని.
“వానదేవుడే కళ్ళాపి చల్లగా… వాయుదేవుడే ముగ్గేసి వెళ్లగా..”
“కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే… ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే ” అంటూ గీతాంజలిలో గిరిజ చేసే అల్లరి చూసి అప్పటికప్పుడు తానూ వర్షంలో తడవాలని అనుకోని అమ్మాయి ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. తను వేసుకున్న ఆద్దాల డ్రెస్ లు, చెప్పే డైలాగ్స్, పాడే పాటలూ అన్నీ ఒక అబ్సెషన్ లా ఉండేవి అప్పట్లో అమ్మాయిలందరికీ!
ఈ పాటలో “వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి..” అన్న వాక్యం మాత్రం ఇప్పటికీ అర్థం కాదు నాకు :(
పెళ్ళిచూపుల నుండి తప్పించుకోవడానికి ఓ అమ్మాయి కాలేజీ నుండి ఇంటికి రాకుండా ఈ పాట పాడుతూ సాయంత్రాన్ని గడిపేస్తుంది. అంత కష్టపడ్డా ఫలితం దక్కదు. ఆమె వచ్చేదాకా వేచి ఉండి, పిల్ల నచ్చిందని చెప్పి మరీ వెళ్తాడు పెళ్ళికొడుకు. రేవతి అంటే ఎంతో ఇష్టాన్ని పెంచేసిన మణిరత్నం మౌనరాగం ఇది.
“డాన్స్ మాష్టర్” అనగానే కమల్ కన్నా ముందర నాకు గుర్తొచ్చేది ఈ చిత్రంలో రేవతి నటన. అసలు సూపరంటే సూపరే. చలాకీ కాలేజీ పిల్ల గా రేవతి పాడే ఈ పాట తాలూకూ తమిళ్, తెలుగు రెండు వర్షన్స్ బావుంటాయి.
ఇళయరాజా సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంటర్లూడ్స్ తో సహా అన్ని బిట్స్ కంఠస్తం నాకు.
కాస్త కొత్త చిత్రాల వైపుకి వస్తే “వర్షం” చిత్రం మొత్తం వాన గురించే కదా. అందులో నాయిక వర్షంతో చేసే స్నేహం, దెబ్బలాట, కబుర్లు అన్నీ భలేగా ఉంటాయి. అన్ని పాటలూ కొన్నాళ్ళ పాటు తెగ మోగాయి ఇంట్లో. ముఖ్యంగా ఈ పాట… అందులో వాన చప్పుడు, త్రిష పట్టీలు… అన్నీ బావుంటాయి.

 

“వాన” చిత్రంలో  కార్తీక్ అద్భుతంగా పాడిన “ఆకాశగంగ” పాటలో వర్షాన్ని చాలా అందంగా చూపిస్తారు. నేను చిత్రాన్ని ఇంతవరకూ చూడలేదు కానీ అండులో పాటలు, ప్రత్యేకంగా ఈ పాట మాత్రం బోల్డు సార్లు విన్నాను. అసలు కార్తీక్ కాకుండా ఇంకెవరన్నా ఈ పాట పాడితే ఇంత బావుండేది కాదేమో అనిపిస్తుంది కూడా.
చివరిగా కొత్త పాటల్లో నాకు బాగా నచ్చిన ఒక వాన పాట.. “నాన్న” చిత్రంలో సైంధవి పాడిన “వెలిగినదొక వానవిల్లు..”! ఈ పాటకు తియ్యటి సైంధవి గళం ప్రాణమా, ప్రకాష్ కుమార్ సంగీతం ప్రాణమా అంటే తేల్చడం కష్టం. డబ్బింగ్ పాట కావడమే ఈ పాటకు చిన్న లోపం. డబ్బింగ్ పాటల్లో సాహిత్యం కుదరదు కదా సరిగ్గా! అయినా కూడా అలా వింటూ వింటూ ఏవేవో కొత్తలోకాల్లో విహరించి రావచ్చు…
మరి బాగున్నాయా వాన పాటలూ? కాస్తైనా సేద తీరారా? మళ్ళీ మరో కొత్త నేపథ్యంతో మరోసారి కలుసుకుందాంమే…
rajiతృష్ణ.
Download PDF

10 Comments

  • sasikala says:

    ఒక్క సారి మనసు వర్షపు జల్లులో తడిసింది తృష్ణ గారు :)

  • @sasikala:మాకు ఇందాకా నిజం వాన కూడా పడిందండీ..:-)
    ధన్యవాదాలు.

  • G.S.Lakshmi says:

    మీ పాటలకు మురిసి వాన వచ్చిందండీ ఇవాళ …

    • @జి.ఎస్.లక్ష్మి: వ్యాసం పోశ్టయిన రోజు వాన అప్దడం నాక్కూడా సంబరాన్ని కలిగించిందండి..ధన్యవాదాలు.

  • “స్కార్ఫ్, రెండు పూలజడలతో నన్ను భయపెడుతుందావిడ”…నన్ను కూడా :)

    మామూలుగా తెలుగు సినిమాల్లో వాన పాటలనగానే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది మనసులోకి. మీరు ఏరి, కూర్చిన ఈ వాన పాటల లిస్టు ఆ ఇమేజి కి హట్కే గా ఉంది.
    నాకు వాన అనగానే గుర్తొచ్చే ఇంకొన్ని పాటలు…
    “చినుకు తడికి చిగురు తొడుగు” వర్షం కాసేపే అయినా ఆ చిత్రీకరణ, మా తాతని గుర్తు చేసే విశ్వనాథ్ గారు…one of my fav songs.
    “ఎవ్వరినెప్పుడు తన వలలో” చిన్న బిట్టే అయినా ఎందుకో వర్షంలో ఏడిచే ఉదయ కిరణ్ :(( బాగా గుర్తు ఈ పాటలో.

    • జ్యోతి గారూ, ఉష పాడిన మంచి పాటగా నాక్కూడా ఆ పాట ఇష్టం కానీ వర్షం ఎక్కువ ఉండదనే అది పెట్టలేదండి..థాంక్యూ!
      ఇంక ఉదయకిరణ్ ని తలుచుకుని మళ్ళి దు:ఖపడాలని ఆ పాట పెట్టలేదు!

  • ఇందాక కామెంట్లో పెట్టాలనుకుని మరచిపోయా…ఎక్కడో చదివిన గుర్తు “చిటపట చినుకులు” చిత్రీకరించేటప్పుడు, బి.సరోజా దేవి గారికి ఏదో ఆక్సిడెంట్ జరిగి తలకు దెబ్బ తగిలి, ఆ కట్టు కనపడకుండా, తడవకుండా స్కార్ఫ్ కట్టారని.ఇప్పుడు ఆ పాట చూస్తే మీకేమైనా ఆవిడ డెడికేషన్ మీద అడ్మిరేషన్, లేదా జాలి కలుగుతుందేమో…ఒకసారి చూడండి :)
    మరి రెండు పూల జడలకు ఇలాంటి ఏమి రీజన్ ఉందో తెలీదు…

  • వ్యాసంలో రాసినట్లు అసలావిడంటే నాకు ఇష్టమేనండీ.. మీరు రాసినట్లు కాస్త కన్సిడర్ చెయ్యగలనేమో… ఆలోచిస్తాను :-)
    అన్నట్లు, ఆ పాటలో చూసాకే మా అమ్మావాళ్ళందరూ(సిస్టర్స్) రెండు పూల జడలకోసం పేచీలు పెట్టి మరీ వేయించుకునేవారుట :)

  • ఆర్.దమయంతి. says:

    ఎండకెండిన ప్రాణాలకు కాసింత ప్రాణమొచ్చినట్టైంది..తృష్ణ!
    :-)
    కాన్సెప్ట్ బావుంది.

Leave a Reply to తృష్ణ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)