పరాశరుడు…మత్స్యగంధి… 2012, డిసెంబర్ 16

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

మనకు తెలుసు…పురావస్తు నిపుణులు చారిత్రకమైన ఆనవాళ్ళు దొరకవచ్చునని అనుమానించిన చోట తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఆ తవ్వకాలలో ఒక్కొక్కసారి భవనాలు, ఇళ్లేకాక కాక; నగరాలు, పట్టణాలు కూడా బయటపడుతూ ఉంటాయి. కాలగతిలో వాటిని భూమి కప్పేసిందన్నమాట. ఆ కప్పేసిన చోట మరో భవనం, లేదా మరో నగరం, లేదా మరో ఊరు ఏర్పడతాయి. దాని మీద మరొకటి ఏర్పడుతుంది. వాటిని పొరలు (layers) అంటారు. ఒక్కొక్క పొర ఎప్పుడు ఏర్పడిందో పురావస్తు నిపుణులు అంచనా వేస్తుంటారు. ఈవిధంగా అనేక చారిత్రక రహస్యాలను కాలగర్భంతోపాటు భూగర్భం కూడా మోస్తూ ఉంటుందన్న మాట.

ఇప్పుడు ఇదే ప్రక్రియను పురాణ, ఇతిహాసాలకు అన్వయించి చూద్దాం. ఇవి ఇప్పటిలా లిఖిత రూపానికి చెంది, స్థిరమైన ఆకృతిని పొందిన అచ్చుపుస్తకాల వంటివి కావు. మౌఖిక సంప్రదాయానికి చెందినవి. అసలు కథ బీజరూపంలో అట్టడుగున ఉంటుంది. అది ఒక పొర. మాంత్రికతను ఆపాదించే అత్యుత్సాహంతో ఆ కథ ఒక అద్భుతత్వాన్ని సంతరించుకుంటుంది. అది ఇంకొక పొర. ఆ కథ చిలవలు పలవలు తెచ్చుకుంటూ మరింత విస్తరిస్తుంది. ఒక్కొక్కసారి చిన్న కథ కాస్తా పెద్ద కథ, పెద్ద కావ్యం అవుతుంది. ఇదొక పొర. దానిమీద పండితుల భాష్యాలు, వ్యాఖ్యలూ,వివరణలూ మొదలవుతాయి. ఇది వేరొక పొర. కాలంలోనూ, సమాజంలోనూ, విలువల్లోనూ వస్తున్న మార్పులు కూడా ఈ ఒక్కొక్క పొరనే ప్రభావితం చేస్తూ, ఆ పొరలకు ఒక రూపం ఇస్తూ ఉంటాయి.

అయితే భూమిలో కప్పబడే పురానిర్మాణాలకు; పురాణ ఇతిహాసాలకు ఒక మౌలికమైన తేడా ఉంది. పురానిర్మాణాలు లేదా వస్తువులపై మన ప్రయత్నం లేకుండానే పొరలు ఏర్పడుతుంటాయి. పురాణ ఇతిహాసాలు మనిషి బుద్ధికీ, ఊహాశక్తికీ చెందినవి. కనుక వాటి పొరలకు రూపమివ్వడంలో మనిషి ప్రయత్నం ఉంటుంది. అతని ఇష్టాయిష్టాలు పనిచేస్తాయి. పురాణ ఇతిహాసాలు మనిషి విశ్వాసంలో లేదా మతంలో భాగమైనప్పుడు ఈ పొరలు మందంగా మారిపోతాయి. అప్పుడు పొరలు ఏర్పడడం అనే ప్రక్రియే ఆగిపోవచ్చు కూడా. ఏవైనా విశ్వాసంలో, మతంలో భాగమయ్యాయంటే, వాటితో కాలానికీ, సమాజానికీ ఉన్న ముడి తెగిపోతుంది. వాటికి ఒక స్వతంత్ర అస్తిత్వం ఏర్పడుతుంది. విశ్వాసమూ, మతమూ ఆమోదించిన మేరకే వాటి పొరల్లోకి తలదూర్చాలి తప్ప మన ఇష్టానుసారం తలదూర్చడానికి వీలులేదు. అడుగు పొరలనుంచి ఎంత దూరంగా వెడితే అంత క్షేమమన్న అప్రకటిత హెచ్చరిక అజ్ఞాతంగా ఉంటుంది. పొరల చుట్టూ మీద మౌనమనే ఉక్కుతెర వేలాడుతూ ఉంటుంది.

ఇప్పుడు మనం వ్యాసుని జన్మవృత్తాంతం చెప్పుకుని, ఈ పొరల సూత్రం దానికి ఏమైనా అన్వయిస్తోందేమో చూద్దాం.

***

Satyavati

తండ్రి దాశరాజు ఆదేశంతో మత్స్యగంధి యమునానదిలో పడవ నడుపుతుండగా, ఒక రోజున…

వశిష్టుని మనవడు, శక్తి కొడుకు అయిన పరాశరుడు అనే ముని ఆమెను చూశాడు. అప్పుడతను తీర్థయాత్రకు వెడుతున్నాడు. అతను మద మాత్సర్యాలు లేని సాధుస్వభావి. అతన్ని ముల్లోకాలూ పొగడుతుంటాయి. అతను గొప్ప బుద్ధి కలిగినవాడు, తపస్సపన్నుడు. వ్రతనిష్ఠ కలిగినవాడు.

ఏకవస్త్రంతో ఒంటరిగా ఉండి పడవ ఎక్కేవారికోసం ఎదురుచూస్తున్న మత్స్యగంధిని చూడగానే అతనికి ఆమెపై వాంఛ కలిగింది. తన దివ్యజ్ఞానంతో ఆమె ఎవరో తెలుసుకున్నాడు. పడవ ఎక్కాడు. పడవ ప్రయాణిస్తోంది. పరాశరుడు మత్స్యగంధినే చూస్తున్నాడు. ఆమెవి ఎంత అందమైన కళ్లో అనుకున్నాడు. ఆమె చనుదోయిని గిల్లాలని అతనికి అనిపిస్తోంది. ఆమె సన్నటి నడుము అతని మనసులో నిలిచిపోయింది. ఆమె కటి ప్రదేశాన్ని తదేకంగా చూస్తున్నాడు. ఆమె మీద తనకు కోరిక కలిగిందని సూచించే మాటలు ప్రారంభించాడు. ఆమె ఎలాంటి సమాధానం ఇస్తుందో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరాడు. తన మాటలకు సిగ్గుపడుతున్న ఆ కన్య మీద పడి సిగ్గును పోగొట్టడానికి ప్రయత్నించాడు.

ఎంత శాంతులైనా, ఎంత వాంఛను జయించినవారైనా ఆడది ఒంటరిగా కనిపిస్తే వాళ్ళ మనస్సు చెదురుతుంది. మన్మధుడి శక్తిని ఓర్చుకోవడం ఎవరి తరం?!

ఈవిధంగా సిగ్గు విడిచేసి పరాశరుడు తన కోరిక వెల్లడించేసరికి ఆ కన్య సందిగ్ధంలో పడింది. తను ఒప్పుకోకపోతే శాపమిస్తాడేమోనని భయపడింది…

‘నేను జాలరిదాన్ని. నా ఒళ్ళంతా చేపల కంపు కొడుతూ ఉంటుంది. అదీగాక నేను కన్యను. నా కన్యాత్వం అంతరిస్తే నా తండ్రి గడప ఎలా తొక్కగలను? కనుక దోషం అంటకుండా అనుగ్రహించు’ అంది.

మత్స్యగంధి మాటలకు పరాశరుడు సంతోషించాడు. ‘నా కోరిక తీర్చడంవల్ల నీ కన్యాత్వం చెడదు’ అని వర మిచ్చాడు. ‘నువ్వు వసురాజు వీర్యం వల్ల జన్మించినదానివి తప్ప, శూద్రకులంలో పుట్టినదానివి కావు’ అంటూ ఆమె పుట్టుక గురించి చెప్పాడు. చేపల కంపు పోయి ఆమె శరీరమంతా సుగంధాన్ని తెచ్చుకునేలానూ, యోజనం దూరంలో ఉన్నవారికి కూడా ఆ సుగంధం తెలిసేలానూ అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆమె ఒంటి మీద దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలూ వచ్చేలా చేశాడు. మత్స్యగంధి పడవను ఒక ద్వీపానికి చేర్చింది.

అయినా ఒక శంక ఆమెను పీడిస్తూనే ఉంది.

‘అందరూ చూసేలా ఇలా బట్ట బయలు మనం ఎలా కలుస్తాం?’ అంది. అప్పుడు పరాశరుడు తాము ఎవరి కంటా పడకుండా మంచు చీకట్లు కల్పించాడు.

ఉత్తమగుణాలే ఆభరణాలుగా, ఎలాంటి దోషమూ లేని మనోహరరూపంతో ఉన్న సత్యవతికి బ్రహ్మతో సమానుడైన పరాశరమహర్షి వల్ల అప్పటికప్పుడు, సూర్యుని తలపించేలా వేదమయుడు, ఆదిముని, పుట్టుజ్ఞాని అయిన వేదవ్యాసుడు జన్మించాడు.

పరాశరుడు సత్యవతికి కోరిన వరాలు ఇచ్చి తన దారిన తాను వెళ్లిపోయాడు. అప్పుడు కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు జింకచర్మాన్ని ధరించి, ఎర్రని జడలతో, దండకమండలాలతో తల్లి ముందర నిలిచి, ఆమెకు మొక్కి,‘మీకు నాతో పని కలిగితే నన్ను తలచుకోండి, వెంటనే వస్తాను’ అని చెప్పి తపోవనానికి వెళ్లిపోయాడు. మహాభయంకరమైన తపస్సు చేసి వేదాలను విభాగం చేసి, ఆ తర్వాత విశ్వశ్రేయస్సుకోసం పంచమవేదమైన ఈ భారతసంహితను చేశాడు.

***

ఈ కథను నేను ఇంతకుముందు ఒకసారి చదివాను. అది, 2012, డిసెంబర్ 16 కు ముందు! ఇప్పుడు 2014, ఏప్రిల్ లో ఈ వ్యాసంకోసం మరోసారి చదివాను. నిజం చెప్పాలంటే, ఈసారి ఈ కథ చదివిన తర్వాత నేను మరింత ‘డిస్టర్బ్’ అయ్యాను. దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఏ స్థాయిలో నంటే, ఈ వ్యాసాలకు నేను నిర్దేశించుకున్న పరిమితులనుంచి కొంచెం పక్కకు జరిగినట్టు అనిపించినా సరే, ఈ కథ నాలో కలిగించిన అలజడిని దాచుకోలేనంతగా!

2012, డిసెంబర్ 16 అని నేను ప్రత్యేకంగా ఒక తేదీని ఎందుకు ఇచ్చానో ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు. ఆ రోజున ఢిల్లీలో ‘నిర్భయ’గా అందరూ చెప్పుకుంటున్న ఒక అమ్మాయిని అత్యంత పైశాచికంగా చెరచి, హత్యచేసిన ఘటన జరిగింది. ఈ దేశంలో స్త్రీలపై లైంగిక అత్యాచారాలు ఎంతో కాలంగా జరుగుతున్నాయి. వాటిలో చాలా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తూ పత్రికలలో లోపలి పేజీ వార్తలు మాత్రమే అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్భయ ఘటనపై వెల్లువెత్తిన జనాగ్రహమూ, అనంతర చర్యలూ మానభంగాల చరిత్రను, కనీసం భావనలోనైనా కొత్త మలుపుతిప్పాయి.

నిర్భయ ఘటన జరిగిన తర్వాత కూడా దేశంలో మానభంగాలూ, హత్యలూ జరుగుతూనే ఉన్నాయి. అయితే, మానభంగాలపై ఇంతకు ముందు లేనంత ఎక్కువగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. మానభంగాలకు ఇప్పుడు పెద్ద శిక్ష పడుతుందన్న ఒక భావన అయితే ఏర్పడింది. మానభంగాలపై సమాజం స్పందనలో తీవ్రత పెరిగింది.

2009-09-30stolensistersupdatereport

అంతేనా? లైంగిక వేధింపులను, అత్యాచార ఘటనలను సాధారణంగా కప్పిపుచ్చడమే పరిపాటిగా ఉన్న సమాజంలో కొందరైనా ధైర్యం చేసి గతంలో లేదా వర్తమానంలో తమపై జరిగిన లైంగిక అత్యాచారాల గురించి చెప్పుకునే(పేరు బయటపెట్టకూడదన్న పరిమితికి లోబడి) అవకాశం కలిగింది. చివరికి లైంగిక వేధింపుల లేదా అత్యాచార నిందితులన్న ముద్రతో న్యాయమూర్తులను, పత్రికా సంపాదకులను కూడా బోనులో నిలబెట్టడం ఈ సరికొత్త స్పృహకు పరాకాష్ట. జస్టిస్ స్వతంత్ర కుమార్, జస్టిస్ ఎ. కె. గంగూలీ,‘తెహల్కా’ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఉదంతాలు ఈ క్రమంలోనే ముందుకొచ్చాయి. జస్టిస్ ఎ. కె. గంగూలీ తన పదవులను కోల్పోగా, తరుణ్ తేజ్ పాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

***

 

ఇప్పుడు పరాశరుడు-మత్స్యగంధి ఉదంతాన్ని చూడండి. పరాశరుడు వశిష్టు డంతటి మహర్షికి మనవడు, వ్యాసునంతటి మహర్షికి తండ్రి అనే వివరాన్ని కాసేపు పక్కన పెడదాం…కాసేపే!…

పైన చెప్పిన న్యాయమూర్తులు, సంపాదకుని ప్రతిబింబం పరాశరునిలో అచ్చుగుద్దినట్టు కనిపించడం లేదా?!.

ఒక నిర్జన ప్రదేశంలో, ఒంటరిగా అతనికి మత్స్యగంధి కనిపించింది. ఆమెపై అతనికి కలిగిన లైంగిక వాంఛ ఎన్ని రూపాలలో బయటపడాలో అన్ని రూపాలలోనూ బయటపడింది. ఉదాహరణకు, ఆమె కళ్ల దగ్గరనుంచి జఘనప్రదేశంవరకూ కాముకత్వం ఉట్టిపడే చూపులతో అతను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. అది నేత్రపరమైన లైంగిక అత్యాచారం. ఆమె చనుదోయిని గిల్లాలనుకున్నాడు. అంటే, అతని కాముకత్వం క్రియారూపాన్ని ధరించడానికి సిద్ధంగా ఉందన్న మాట. ఆ తర్వాత నిస్సిగ్గుగా తన కోరికను వెల్లడించాడు. అది వాచికమైన లైంగిక అత్యాచారం. అంతేనా, సిగ్గుపడుతున్న ఆమె మీదపడి సిగ్గుపోగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇది కాయికమైన(శారీరకమైన) లైంగిక అత్యాచారం. స్త్రీపై జరిగే అత్యాచారంలో అది ఆఖరి మెట్టు.

పోనీ ఇది పరస్పరాంగీకారం ఉన్న లైంగిక సంబంధమా, కాదు. కాదంటే శపిస్తాడేమోనన్న భయంతోనే మత్స్యగంధి అతని కోరిక తీర్చడానికి అంగీకరించింది. న్యాయమూర్తులు తమ వద్ద శిక్షణలో ఉన్న న్యాయవాద యువతులతో లైంగికంగా చొరవ తీసుకున్నారన్న ఆరోపణను; సంపాదకుడు తన సంస్థలో పనిచేస్తున్న ఒక జర్నలిస్టుపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణను గమనించండి…అక్కడ జరిగింది కూడా; తమ అధికారాన్ని, లేదా తమతో ఆ యువతులకు ఉన్న అవసరాన్ని అడ్డుపెట్టుకుని వారిని భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నమే. పరాశర-మత్స్యగంధుల ఉదంతం ఈ విషయంలో కూడా పై ఉదంతాలతో అతికినట్టు సరిపోతోంది.

***

మన పురాణ, ఇతిహాస కథలను ఎలా అర్థం చేసుకోవాలనే విషయంలో సాధారణంగా సంప్రదాయ పండితులనుంచి ఒక వాదం వినిపిస్తూ ఉంటుంది. వాటిలో పైకి కనిపించే అర్థం వేరు, అంతరార్థం వేరు అన్నదే ఆ వాదం. అంతరార్థం తెలుసు కోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. అందులో తగినంత శిక్షణ ఉండాలి. పరిశ్రమ ఉండాలి. అది కూడా గురుముఖతా జరగాలి. ఆ తర్వాత కూడా అనుమానాలు మిగిలిపోవచ్చు. అప్పుడు గురువాక్యాన్ని, లేదా వేదాన్ని ప్రమాణంగా తీసుకుని అనుమానాలకు అడ్డుకట్ట వేసేయాలి.

ఇప్పుడు పరాశర-మత్స్యగంధుల ఉదంతానికి కూడా ఇదే సూత్రాన్ని అన్వయించే ప్రయత్నం ఎవరైనా చేస్తారేమో తెలియదు. అందులోని ఔచిత్య, అనౌచిత్యాలను ప్రశ్నించే ఆసక్తి కూడా నాకిప్పుడు లేదు. ఒకవేళ ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తే, నా ప్రశ్న ఒకటే: పురాణ ఇతిహాసాలు అందరికీ అందుబాటులో ఉండే ప్రజాక్షేత్రంలో ఈనాడు ఉన్నాయి. ఆ అందరిలో అన్ని వర్గాలవారూ, అన్ని వయసులవారూ ఉంటారు. వారందరికీ అంతరార్థాలు బోధపరచుకునే శిక్షణ ఉండకపోవచ్చు. లేదా అటువంటి అంతరార్థాల సిద్ధాంతాన్ని వాళ్ళందరూ ఒప్పుకోకపోవచ్చు. అటువంటి వారికి పరాశర-మత్స్యగంధుల ఉదంతం ఉన్నది ఉన్నట్టుగా ఇస్తున్న సందేశం ఏమిటి?

పోనీ దీని వెనుక ఏవో అంతరార్థాలు ఉంటాయని మనం మాటవరసకు ఒప్పుకున్నా, నేను పరిశీలించిన టీటీడీ వారి మహాభారత ప్రచురణలో వ్యాఖ్యాతలు ఈ ఉదంతం వెనుక ఏవో అంతరార్థాలు ఉన్నట్టు చెప్పలేదు. అందులోకి వెళ్ళేముందు, మొదటగా పేర్కొన్న పొరల సూత్రం ఈ ఉదంతానికి ఇలా అన్వయించుకుందాం:

పొర: 1

కథకు అట్టడుగున ఉన్న పొర ఇది. ఈ పొరలో జరిగింది ఒకటే. పరాశరుడు అనే పురుషుడికీ, మత్స్యగంధి అనే స్త్రీకీ లైంగిక సంబంధం ఏర్పడింది. వారికి వ్యాసుడు అనే కొడుకు పుట్టాడు. వారిద్దరి సామాజిక నేపథ్యం ఏదైనా కావచ్చు. అది పరస్పరాంగీకారం ఉన్న లైంగిక సంబంధం కావచ్చు, కాకపోవచ్చు. భిన్న సామాజిక నేపథ్యం ఉన్న స్త్రీపురుషుల మధ్య లైంగిక సంబంధం అప్పుడు సహజం కావచ్చు, కాకపోవచ్చును కూడా. అది స్త్రీ-పురుషుల మధ్య సమాన ప్రతిపత్తి గల లైంగిక సంబంధం కావచ్చు; లేదా పురుషుడిది పై చేయి, స్త్రీది కింది చేయిగా ఉన్న అసమ లైంగిక సంబంధం కావచ్చు. ఈ ఘట్టంలో, అది కావచ్చా, ఇది కావచ్చా అనే చర్చలోకే అసలు వెళ్లకుండా ఒక పురుషుడికీ, ఒక స్త్రీకీ మధ్య ఏర్పడిన లైంగిక సంబంధంగానే దీనిని చెప్పుకుందాం. అంటే దీనికి ఎటువంటి సామాజిక, కాలిక, విలువల కోణాన్నీ ఆపాదించకుండానన్న మాట. ఇలా చూసినప్పుడు పరాశరుడికి ఒక న్యాయం జరిగే అవకాశముంది. ఎలాగంటే, తన కులాన్ని, తనకు ఉన్నట్టు తోపించే శాపానుగ్రహశక్తినీ అడ్డుపెట్టుకుని మత్స్యగంధిని అతను భయపెట్టి లొంగదీసుకుని ఉండకపోవచ్చన్న సంశయలాభా(benefitofdoubt)న్ని అతనికి ఆపాదించవచ్చు.

పొర: 2

పొర: 2 దగ్గరికి వచ్చేసరికి కాలం మారింది. సమాజమూ, దాని తాలూకు విలువలూ కూడా మారాయి. అందుకు తగినట్టు మహాభారత కథ చెప్పే కథకుడూ మారాడు. అతని వ్యూహాలు, ప్రాధాన్యాలూ మారాయి. అంటే ఏమిటన్న మాట, మొదటి పొరలోని పరాశరుని, మత్స్యగంధినే తీసుకుని తన వ్యూహ, ప్రాధాన్యాలకు అనుగుణంగా వారిని మలచుకుంటున్నాడన్న మాట. ఆ విధంగా చూసినప్పుడు, దృష్టిపరంగా, వాచికంగా, కాయకంగా పరాశరునిలో చిత్రించిన లైంగిక అత్యాచార ప్రవృత్తి వాస్తవంగా అతనిది కాకపోవచ్చు, కథకుడు ఆపాదించినది కావచ్చు.

ఇక్కడ కథకుడు అన్నప్పుడు వ్యాసునో, నన్నయనో దృష్టిలో పెట్టుకుని అనడంలేదు. వందల సంవత్సరాలపాటు మౌఖిక రూపంలో ఉన్న కథకు ఎందరో కథకులు ఉంటారు. కనుక ఒక కథకుని నిర్దిష్టంగా గుర్తించడం కష్టం.

కథకుడు అలా ఎందుకు ఆపాదించాడన్న ప్రశ్న వేసుకుంటే, అతడు ఏ సామాజిక నేపథ్యం నుంచి ఆ కథ చెబుతున్నాడో ఆ సామాజిక నేపథ్యం అందుకు కారణమన్న సమాధానం వస్తుంది. మొదటి పొరలోని పరాశరుడు వాస్తవంగా ఎలాంటి వాడో, అతనికీ మత్స్యగంధికీ ఏర్పడిన లైంగిక సంబంధం ఎలాంటిదో మనకు స్పష్టంగా తెలియదు. కానీ రెండవ పొర దగ్గరికి వచ్చేసరికి పరాశరుడు ఒక బ్రాహ్మణుడు గానూ, అందులోనూ శాపనుగ్రహశక్తి గల మహర్షిగానూ రూపుగడుతున్నాడు. మరోవైపు మత్స్యగంధి చేపల కంపు కొట్టే ఒక జాలరి యువతి, జానపదస్త్రీ, బ్రాహ్మణుల దగ్గర, ఋషుల దగ్గర ఏవో మహిమలు ఉంటాయనీ, వారిని కాదంటే శపిస్తారని మాత్రమే ఆమె వింది. దాంతో పరాశరుని కోరికకు ఆమె లొంగిపోయింది. ఈ పొర దగ్గరికి వచ్చేసరికి ఇది ఈ విధంగా ఒక అసమ లైంగిక సంబంధమన్న స్పష్టత వచ్చింది.

పరాశరుని పాత్ర చిత్రణలోని వైరుధ్యం చూడండి: అతను మదమాత్సర్యాలు లేని సాధుస్వభావి, శాంతుడు. ముల్లోకాలలోనూ పొగడ్తలు అందుకునే వాడు, గొప్ప బుద్ధి కలిగినవాడు, వ్రతనిష్ఠ కలిగినవాడు, తపస్సంపన్నుడు. తను తలచుకుంటే అప్పటికప్పుడు మంచు చీకట్లు సృష్టించగలిగినవాడు. మత్స్యగంధి ఒంటికి ఉన్న చేపల కంపు పోగొట్టి యోజన దూరం వ్యాపించగల సుగంధాన్ని ఇవ్వగలిగినవాడు. ఆమె ఒంటి మీద దివ్యవస్త్రాలను, ఆభరణాలను తెప్పించగలిగినవాడు. పైగా అతను మత్స్యగంధిని ఎప్పుడు చూశాడు? తీర్థయాత్రకు వెడుతున్నప్పుడు!

ఇలా పరాశరుని శిఖరం మీద నిలబెట్టిన కథకుడే, మత్స్యగంధిని చూడగానే, నేటి భాషలో చెప్పుకునే ‘అత్యాచారా’న్ని తలపించేలా అతి కాముకత్వపు చీకటి లోయలోకి జారిపోయిన వాడిగా చూపిస్తాడు. పైగా ఎంత శాంతులైనా, ఎంత జితేంద్రియులైనా ఒంటరిగా ఆడది కనబడగానే చిత్త చాంచల్యానికి గురవుతారనీ, మన్మథుడి శక్తిని ఓర్చుకోవడం ఎవరి తరమనీ అంటాడు. ఈ మాటలోనే ఎంత వైరుధ్యమో చూడండి…ఒంటరి ఆడది కనబడగానే మనసు చెదిరేవారు కూడా ‘జితేంద్రియులు’ ఎలా అవుతారో తెలియదు.

తను ఎంత వైరుధ్యవంతంగా మాట్లాడినా చెల్లిపోతుందనీ, తన మాట ఎవరూ ప్రశ్నించడానికి వీలులేని శిలాక్షరమనే ఒక ఆధిపత్య ధోరణి కథకునిలో వ్యక్తమవుతోందా? లేక పరాశరునిలోని చీకటి, వెలుగుల కోణాలను రెండింటినీ ప్రదర్శించే సమబుద్ధిని చాటుతున్నాడా? రెండింటికీ కూడా అవకాశముంది. రెండింటికీ సంబంధం కూడా ఉండచ్చు.

మిగతా వచ్చే వారం….

-కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

 

Download PDF

8 Comments

 • భాస్కరంగారు, చాలావరకు వ్యాసాలలో మీ తార్కిక దృష్టిని, అన్ని కోణాలలో నుంచి చూసే దృష్టికోణాలని ఆస్వాదించాను, అభినందించాను కూడా. ఈ వ్యాసం విషయంలో అభ్యంతరాలు వున్నాయి. మొదటి పొర, రెండొవ పొర అని మీరు రాసినవి ఒకటి తరువాత ఒకటి జరిగినట్లుగా(chronology) రాశారు. ఇది పొర – ఇది సత్యం అనే వివరణ ఎలా సాధ్యం అవుతుంది? చర్చ కోసం మరోకొణంలో చూద్దాం. పరాశరుడు మత్స్యగంధిని అత్యాచారం చేశాడనుకుందాం. ఆ తరువాత ఆమెకు కలిగిన కొడుకు వ్యాసుడు (చాలా గొప్పవాడు) కావటం వల్ల అత్యాచార కథను మార్చి అదొక వరంగానూ, సత్యవతి అదృష్టంగానూ చెప్పి వ్యాసుడి/అతని తండ్రి గొప్పదనాన్ని కాపాడేందుకు కథకుడు ప్రయత్నించి వుండవచ్చు కదా. అలా జరిగివుంటే మీరు అన్న మొదటి (కోర్) పొరలో పరాశరుడు దుర్మార్గుడు, రెండో పొరలో అతనికి సంశయలాభం కలగవచ్చు. మరో రకంగా చూస్తే మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంలోకి వచ్చి పురుషాధిక్యం/మతాధిక్యం మనసుల్లో బలపడిన తరువాత ఒక స్త్రీకి పరాశరుడంతటివాడు గౌరవం ఇవ్వాల్సిన పనిలేదనీ, ఆమెను గిల్లినా గిచ్చినా తప్పులేదనే వాదాన్ని/అహంకారాన్ని చొప్పించే ప్రయత్నంలో కథ మారి వుండవచ్చు. కాదు అప్పటికి ఇంకా మాతృస్వామ్యమే (కుంతి/ద్రౌపది వరకు వుందని గతంలో అనుమానించాం కదా) వుండి వుంటే, మత్స్యగంధే పరాశరుడి పొందుకోరి వుండవచ్చు. తరువాత కాలంలో పితృస్వామ్యాన్ని బలపరిచే పనిలో కథపైన కొత్త పొర కప్పడానికి తిరగేసి చెప్పివుండవచ్చు..!! కదా? అసలు మన assumptions తోటి రాబోయే తరానికి కొత్త పొరలు కప్పుతున్నామా అన్న అనుమానం కూడా వస్తోంది…!!

  • కల్లూరి భాస్కరం says:

   సత్యప్రసాద్ గారూ…మీరు నా వ్యాసాలు కొన్నింటిని అభినంధించిన మాట నిజమే. అందుకు మరోసారి ధన్యవాదాలు. అయితే నా వెనకటి వ్యాసాలలో మీకు కనిపించిన తార్కిక దృక్పథం వంటివి ఈ వ్యాసంలోనూ ఉన్నాయనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివి రచయిత మౌలిక లక్షణాలలోకి వస్తాయి. అవే అతని శైలిగానూ మారుతాయి. తన మౌలిక లక్షణాలకు దూరంగా ఏ రచయితా రచన చేయలేడనుకుంటాను. మిగిలిన వాళ్ళ విషయం ఏమైనా నాకైతే కలం ముందుకు నడవదు. అదీగాక నేను మహాభారతంతో సహా కొన్ని విస్తారమైన విషయాల మీద రాస్తున్నాను. కనుక నేను రాసే ప్రతి వ్యాసమూ ఒక మొత్తం(whole)లో భాగం. ఈ వ్యాసంలో మాత్రం మీకు అభ్యంతరాలున్నాయన్నారు. కానీ అవి ఏమిటో నాకు క్లారిటీ రాలేదు. నావైపునుంచి క్లారిటీ ఇవ్వాలని అనిపించినవాటికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
   1. “మొదటి పొర, రెండొవ పొర అని మీరు రాసినవి ఒకటి తరువాత ఒకటి జరిగినట్లుగా(chronology) రాశారు. ఇది పొర – ఇది సత్యం అనే వివరణ ఎలా సాధ్యం అవుతుంది?”

   నేను పొరగా చెప్పడంలో మీరన్నట్టు chronology నే అనుసరించాను. ఎందుకు అనుసరించానో వ్యాసంలో చెప్పాను, మరొకసారి చూడగలరు. ఇది పొర-ఇది సత్యం అనే వివరణ ఎలా సాధ్యమన్నారు. నేను చెబుతున్నది సత్యమని నేను ఎక్కడా అనలేదు. నా వెనకటి వ్యాసాలు కూడా చూడగలరు. నేను మహాభారతాన్ని ఒక మామూలు రేషనల్ బుద్ధికి అందే మేరకూ, ఒకనాటి చరిత్రగానూ మాత్రం చూస్తూ అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను. నా మటుకు నాకు ఇది ఒక వెతుకులాట మాత్రమే. ఇందులో ఫలానాది నిజమని నిర్ధారించడం కుదరదు. అలా దేనినైనా నిర్ధారిస్తే వెతుకులాటకు తెరదించేయడమే అవుతుంది. ఇలాంటి వెతుకులాటలో ఏవైనా కొత్త ఆలోచనలూ, కొత్త చూపు వెలుగు చూస్తే అంతవరకే నా contribution. ఈ విషయాన్ని కూడా నా వెనకటి వ్యాసాలలో చెప్పాను.

   2. “చర్చ కోసం మరోకొణంలో చూద్దాం. పరాశరుడు మత్స్యగంధిని అత్యాచారం చేశాడనుకుందాం. ఆ తరువాత ఆమెకు కలిగిన కొడుకు వ్యాసుడు (చాలా గొప్పవాడు) కావటం వల్ల అత్యాచార కథను మార్చి అదొక వరంగానూ, సత్యవతి అదృష్టంగానూ చెప్పి వ్యాసుడి/అతని తండ్రి గొప్పదనాన్ని కాపాడేందుకు కథకుడు ప్రయత్నించి వుండవచ్చు కదా. అలా జరిగివుంటే మీరు అన్న మొదటి (కోర్) పొరలో పరాశరుడు దుర్మార్గుడు, రెండో పొరలో అతనికి సంశయలాభం కలగవచ్చు”

   నేను ఒకటవ పొర, రెండవ పొర అనడం వెనుక ఒక కాలిక, సామాజిక పరిణామక్రమం ఉంది. కనుక మీరు అన్నట్టు మొదటి పొరలోని పరాశరుడు దుర్మార్గుడు, రెండో పొరలోని పరాశరుడు సంశయలాభానికి అర్హుడు అనడం కుదరదు. మొదటి పొరలోది బీజరూప కథ. అందులోని పరాశర, మత్స్యగంధుల సంబంధానికి నేను ఎలాంటి లైంగిక విలువల కోణాన్నీ ఆపాదించని సంగతిని వ్యాసంలోనే చెప్పాను. అందుకే పరాశరునికి సంశయలాభం ఉండచ్చని అన్నాను. ఇక మహాభారతం నుంచి నేను యథాతధంగా ఉదహరించినది మొదటి పొరలోని బీజరూప కథకు కళ్ళు, ముక్కు, మొహం కల్పించిన విస్తరణ రూపం. ఇందులో కూడా పరాశరుని నేను అత్యాచారిగా చెప్పలేదు. అతనిపై అత్యాచారి అనే ఆపాదన కథకుడిది కావచ్చు నన్నాను.

   3. “మరో రకంగా చూస్తే మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యంలోకి వచ్చి పురుషాధిక్యం/మతాధిక్యం మనసుల్లో బలపడిన తరువాత ఒక స్త్రీకి పరాశరుడంతటివాడు గౌరవం ఇవ్వాల్సిన పనిలేదనీ, ఆమెను గిల్లినా గిచ్చినా తప్పులేదనే వాదాన్ని/అహంకారాన్ని చొప్పించే ప్రయత్నంలో కథ మారి వుండవచ్చు. కాదు అప్పటికి ఇంకా మాతృస్వామ్యమే (కుంతి/ద్రౌపది వరకు వుందని గతంలో అనుమానించాం కదా) వుండి వుంటే, మత్స్యగంధే పరాశరుడి పొందుకోరి వుండవచ్చు. తరువాత కాలంలో పితృస్వామ్యాన్ని బలపరిచే పనిలో కథపైన కొత్త పొర కప్పడానికి తిరగేసి చెప్పివుండవచ్చు..!! కదా?”

   ఇందులో మీరు చేసిన ఈ assumptions కాదనాల్సిన అవసరం నాకు కనిపించలేదు. అయితే, పై కథ మాతృస్వామ్య, పితృస్వామ్యాల సంధి దశకు చెందినదని నా ఉద్దేశం. మాతృస్వామ్య, పితృస్వామ్య కోణాలనుంచి ఎవరు మహాభారత పరిశీలన ప్రారంభించినా ఆ మేరకు నా వ్యాసాలకు గుర్తింపే.

   4. “అసలు మన assumptions తోటి రాబోయే తరానికి కొత్త పొరలు కప్పుతున్నామా అన్న అనుమానం కూడా వస్తోంది”

   ఎలాంటి శోధనలోనైనా assumptions కు ఒక పాత్ర ఉంటుందనే సంగతి మీరు కూడా గుర్తిస్తారనే అనుకుంటాను. అలాంటప్పుడు మీరన్న పై మాట assumptions పనికి రావనే అభిప్రాయాన్ని కలిగించే ప్రమాదముంది. నా ప్రయత్నాన్ని కొత్త పొరలు కప్పడంగా నేను అనుకోవడం లేదు. పొరలను విప్పడంగా అనుకుంటున్నాను. అది కూడా నాకు నేను మహాభారతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే.

 • pavan santhosh surampudi says:

  పురావస్తు ఆధారాలు ఇంత సూక్ష్మ విషయాలు చెప్పవు, ఆనాటి మూల భారతం తెలియదు. ఎవరో చెప్పినదాంట్లో ఎంత చేరిందో ఎంత అసలో తెలియదు. మహాభారతం ఓ అజ్ఞాత మౌఖిక కథకుడు చెప్పిన కథ అనుకున్నా ఆ పరాశరునికీ, మత్స్యగంధికి మధ్య ఏం జరిగాయో విస్పష్టంగా “చూసి” చెప్పలేడు కదా. ఆ కథకుడి స్వకపోల కల్పనా ఎంత ఉందొ(భగవానుడైన వ్యాసుడు కాదనే అనుకుందాం), అది ఏ భాగమో చెప్పనే అక్కరలేదు కదా. ఫలానా ఋషికి, ఫలానా ఆటవికురాలికీ మధ్య జరిగినది ఏమిటో ఆ కథకుడే ఊహించి ఉంటాడనుకుంటే. మీకెలా స్పష్టంగా తేజ్ పాళ్ళు కనిపించేసారో నాకు ఊహకు అందడం లేదు.
  ఒక వేళ వ్యాసుడు ఎవరో చెప్పినదే నమ్మాల్సిన స్థితిలో లేడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహర్షి అని నమ్మితే గొడవే లేదు-ఈ చర్చంతా అనవసరం. అతను భగవానుడు కనుక అన్నీ సక్రమంగానే చెప్పిఉంటాడని అనుకోవాల్సి వస్తుంది. మీ వాదన ఈ రెంటికి చేడినట్టు ఉంది. అది కూడా వాదన కోసమే అన్నట్టు అనిపిస్తోంది.
  మహాభారతం ఒకనాటి సంస్కృతికి నిలువుటద్దం. ఆనాటి సమాజపు మూసలో ఒక మనిషి చేయదగ్గ మహాకార్యం నుంచి మరొక మనిషి ఒడిగట్టగలిగిన మహా అకార్యం వరకూ అన్నీ అందులో వచ్చాయి. మహాభారతాన్ని ఇలాంటి కొత్త కోణాల్లో చూసేవారు ముందు మహాభారతం ఉదాత్తంగా చెప్పిన వ్యక్తిలో ఉదాత్తత ఉందేమో అన్నదాన్నే మొదటి పరిశీలనగా స్వీకరించాలి. ఆ కోణంలో సరైన రచనగా పర్వ ఒకటే కనిపిస్తోంది. సంస్కృతీ అన్న పదమే బూతు అయిపోయిన నేపథ్యంలో అలాంటి రచనలు ఆశించడం కాస్త అత్యాశే కావచ్చు.

  • కల్లూరి భాస్కరం says:

   పవన్ సంతోష్ గారూ…స్పందనకు ధన్యవాదాలు.

   1. “పురావస్తు ఆధారాలు ఇంత సూక్ష్మ విషయాలు చెప్పవు,…”

   ఈ మాటలో క్లారిటీ లేదు. ఈ అభిప్రాయంతో పురావస్తు శాస్త్రజ్ఞులు ఏకీభవించరనుకుంటాను. సూక్ష్మ విషయాలు చెప్పే ఆధారాలు ఆ రంగంలోనూ ఉంటాయి.

   2. “ఆనాటి మూల భారతం తెలియదు. ఎవరో చెప్పినదాంట్లో ఎంత చేరిందో ఎంత అసలో తెలియదు. మహాభారతం ఓ అజ్ఞాత మౌఖిక కథకుడు చెప్పిన కథ అనుకున్నా ఆ పరాశరునికీ, మత్స్యగంధికి మధ్య ఏం జరిగాయో విస్పష్టంగా “చూసి” చెప్పలేడు కదా. ఆ కథకుడి స్వకపోల కల్పనా ఎంత ఉందొ(భగవానుడైన వ్యాసుడు కాదనే అనుకుందాం), అది ఏ భాగమో చెప్పనే అక్కరలేదు కదా. ఫలానా ఋషికి, ఫలానా ఆటవికురాలికీ మధ్య జరిగినది ఏమిటో ఆ కథకుడే ఊహించి ఉంటాడనుకుంటే. మీకెలా స్పష్టంగా తేజ్ పాళ్ళు కనిపించేసారో నాకు ఊహకు అందడం లేదు.”

   ఆనాటి మూల భారతం తెలియదని మీరు కూడా ఒప్పుకుంటే నాకు సమాధానం కొంతవరకు తేలికైనట్టే. మూల భారతంలానే అందులోని పాత్రలు ఎలాంటివన్న సంగతి కూడా పూర్తిగా తెలియదనుకుంటే, వాటికి కళ్ళూ, ముక్కూ, మొహం కల్పిస్తున్న కథకుడే ఇందులో ఒక ముఖ్యపాత్రగా పైకి తేలుతున్నాడన్న మాట. కనుక ఈ వ్యాసంలో నా దృష్టిలో ఉన్నది పరాశరుడు, మత్స్యగంధి కాదు, కథకుడు.
   మీరొకసారి నేను వ్యాసంలో ఇచ్చిన మహాభారత కథను చూడండి, లేదా నన్నయ భారతం చూడండి. నాకే కాదు, ఇందులో మీకు కూడా పైన పేర్కొన్న మన గౌరవనీయ న్యాయమూర్తులు, తరుణ్ తేజ్ పాల్ అనే సంపాదకుడు కనిపిస్తారు.

   3. “ఒక వేళ వ్యాసుడు ఎవరో చెప్పినదే నమ్మాల్సిన స్థితిలో లేడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహర్షి అని నమ్మితే గొడవే లేదు-ఈ చర్చంతా అనవసరం. అతను భగవానుడు కనుక అన్నీ సక్రమంగానే చెప్పిఉంటాడని అనుకోవాల్సి వస్తుంది. మీ వాదన ఈ రెంటికి చేడినట్టు ఉంది. అది కూడా వాదన కోసమే అన్నట్టు అనిపిస్తోంది.”

   వ్యాసుడు మీరు చెప్పిన లాంటి మహర్షి అని నమ్మి ఈ చర్చను అనవసరంగా భావించేవారి స్వేచ్ఛలో నేను జోక్యం చేసుకోవడం లేదు. మహాభారతాన్ని నా మామూలు మేధకు అందే రీతిలో నేను అర్థం చేసుకుంటూ నా ఆలోచనలను, స్పందనలను నా లాంటి పాఠకులతో పంచుకుంటున్నాను. అందుకు నాకు గల స్వేచ్ఛను మీరూ గుర్తిస్తే చాలు. ఇక ఏ రచయిత అయినా తన వాదన కోసమే రాస్తాడు. మీరు నన్ను ఉద్దేశించి (వాదన కోసమే అన్నట్టు అనిపిస్తోంది) అన్న మాటలో ఏం విశేషం ఉందో నాకు అర్థం కాలేదు.

   4. “మహాభారతం ఒకనాటి సంస్కృతికి నిలువుటద్దం. ఆనాటి సమాజపు మూసలో ఒక మనిషి చేయదగ్గ మహాకార్యం నుంచి మరొక మనిషి ఒడిగట్టగలిగిన మహా అకార్యం వరకూ అన్నీ అందులో వచ్చాయి. మహాభారతాన్ని ఇలాంటి కొత్త కోణాల్లో చూసేవారు ముందు మహాభారతం ఉదాత్తంగా చెప్పిన వ్యక్తిలో ఉదాత్తత ఉందేమో అన్నదాన్నే మొదటి పరిశీలనగా స్వీకరించాలి. ఆ కోణంలో సరైన రచనగా పర్వ ఒకటే కనిపిస్తోంది. సంస్కృతీ అన్న పదమే బూతు అయిపోయిన నేపథ్యంలో అలాంటి రచనలు ఆశించడం కాస్త అత్యాశే కావచ్చు.”

   మహాభారతం మీరు అన్నట్టు ఒకనాటి సంస్కృతికి నిలువుటద్దమే కావచ్చు. కానీ నేను మహాభారతం గురించి రాస్తున్నది సంస్కృతి కోణం నుంచి కాదు. ఇక మీకు నా వ్యాసం అభ్యంతరకరంగా కనిపించి, ‘పర్వ’ నవల నచ్చడం విశేషమే. ఈ వ్యాసాలలో చాలాచోట్ల పర్వను ప్రస్తావించాను. కాకపోతే ఇలా ‘రెంటికీ చెడే’ పని మీరు చేయకండి.
   R

 • మంజరి లక్ష్మి says:

  ఇది వరకు దాకా రాసిన వ్యాసాలలో మాతృస్వామ్య వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థగా మారుతున్న నేపద్యంలో భారత కధను కధకుడు మార్చి చెప్పటానికి ప్రయత్నం చేశాడనీ, కానీ అతను చెప్పే కధలోనే మాతృస్వామ్య అవశేషాలకు ఆధారాలు కనపడుతున్నాయని(కధను మార్చినట్లు) ఆ ఆధారాలతో చెప్పారు. కానీ ఇక్కడ చెప్పిన విషయంలో ఆ క్లారిటీ లోపించినట్లుగా, కొంత confusion గా ఉంది. మత్స్యగంధి కొంచం ఇష్టం, కొంత బలవంతం ద్వారా అతనితో వెళ్ళినా, పూర్తిగా బలాత్కారంగానే ఆమెను అతను తీసుకెళ్లినా ఈ వివరణలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం పొర వేసుకున్నదనటానికి ఉదాహరణ ఏముందీ? బలవంతంగా డిసెంబర్ 16 2012 పొరను కూడా కప్పినట్లుంది కానీ అది కూడా అంత అతికినట్లుగా లేదు అని నా కనిపిస్తోంది (పొరపాటేమన్న ఉంటే మన్నించాలి). నాకైతే అంత స్థాయి లేదు కానీ అరిపిరాల సత్య ప్రసాద్ గారిది చదటంతో నా అనుమానం కొంచెం పెరిగింది.

  • కల్లూరి భాస్కరం says:

   మంజరి లక్ష్మి గారూ…స్పందనకు ధన్యవాదాలు. నాకు తోచినంతవరకు మహాభారతంలో 1. మాతృస్వామ్య అవశేషాలను సూచించే కథలు 2. మాతృస్వామ్య-పితృస్వామ్య సంధి దశను సూచించే కథలు 3. కేవలం పితృస్వామ్యాన్ని సూచించే కథలు ఉన్నాయి. పరాశర-మత్స్యగంధుల కథ సంధి దశకు చెందిన కథ. పరాశరుడి శాప భయానికి మత్స్యగంధి లొంగిపోయినట్టు కథకుడు సూచిస్తున్నాడు కనుక ఇందులో పితృస్వామికత కనిపిస్తూనే ఉంది. మాతృస్వామికత గురించి నేను ఇంకా చెప్పలేదు. అది తదుపరి వ్యాసంలో రావచ్చు.

   2012 డిసెంబర్ 16 ప్రస్తావన గురించి…అధికారాన్నో, మరొక దాన్నో అడ్డు పెట్టుకుని స్త్రీని లైంగికంగా లొంగదీసుకోవడం అనే విషయంలో పరాశరుడికీ, న్యాయమూర్తులకూ, సంపాదకునికీ ఉన్న ఆశ్చర్యకరమైన పోలికను చూపించడమే నా ఉద్దేశం. స్త్రీపై లైంగికమైన దాడి చేయడం కేవలం లైంగిక వాంఛే కాక, ఆధిపత్యాన్ని చాటుకునే లక్షణం కూడా ఉంటుందన్నది వింటున్నదే. అత్యాచార సంస్కృతికి మూలాలు ఎక్కడ ఉన్నాయో ఈ కథ ద్వారా తెలుస్తున్నదని నా భావన. నా వ్యాసాలకు నేను విధించుకున్న పరిమితులనుంచి నేను కొంత డీవియేట్ అవుతున్నట్టు ఈ ప్రస్తావన ద్వారా అనిపించవచ్చునని నేను కూడా వ్యాసంలో అన్నాను. అత్యాచార మనస్తత్వం వేళ్ళు ఎక్కడున్నాయో ఈ ప్రస్తావన ద్వారా పాఠకులు గ్రహిస్తే నా ప్రస్తావన అతికినట్టుగానే కనిపిస్తుంది. కనిపించకపోతే ఈ ప్రస్తావను విస్మరించి వ్యాసం చదువుకోవచ్చు.

 • Nageswara Rao says:

  “నిజ కవిత్త్ కిహి లాగహి నీకో –
  సరసు హోవు అథవా అతి ఫీకో ” (తన రచన తనకు గొప్పగా అనిపించడం సహజం .. అది గొప్పది కానీ నీరసంగా ఉండనీ ! – తులసీదాస్)
  తన రచనను సొంత ఆస్తిగా భావించడం – దానిమీద తనకు ఏదో హక్కు ఉన్నట్లు – ఎవరైనా తన భావాలను ఖండిస్తే వెంటనే ప్రతిక్రియకు తలపడడం – నవ్వొస్తోంది..భాస్కరం గారూ ..! మీరంటే వేంటనే ఖండనలు రాయగలుగుతున్నారు..పాపం.. భారతం రాసిన రచయితకి ఆ అవకాశం లేదు కదా..మీకు పరాశరుడిలోనే తరుణ్ తేజ్ పాల్ కనిపిస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇంకా భయంకరమైన ఈవ్ టీజర్స్ కనిపిస్తారు..వాళ్ళ గురించి ఏమి రాస్తారో?! (కీచకుడు, సైంధవుడు వగైరా – కొంపతీసి వాళ్ళ భావప్రకటనా స్వేచ్చను, కళాపిపాసను, సౌందర్య పోషణను పర స్త్రీ గమనం పాపం అంటూ అణగ ద్రొక్కేసిన ఇంకో పొర తగలదు కదా!)

  • కల్లూరి భాస్కరం says:

   నేను ‘ప్రతిక్రియ’కు తలపడడానికి ఒక్క పాయింటు కూడా ఇవ్వకుండా అద్భుతంగా ‘ఖండించా’రు. ధన్యవాదాలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)