60 యేండ్ల ఎడతెగని పోరాట ఫలితం ‘తెలంగాణ’. వలసాంధ్ర బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కోసం తెగించి కొట్లాడిన బిడ్డలందరికీ వందనాలు. తెలంగాణను దోసుకుందెవరో? దోపిడీ చేసిందెవరో? అభివృద్ధి నిరోధకులెవరో? అహంకారంతో మెలిగిందెవరో? ఆత్మగౌరవాన్ని దెబ్బతీసెందెవరో? అందరికీ తెలిసిన విషయమే!
ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత సందర్భంలో భవిష్యత్తెలంగాణను ఎలా నిర్మించుకోవాలో? భౌగోళిక తెలంగాణను ‘బంగారు తెలంగాణ’గా ఎలా మార్చుకుందాం అనే అంశంపై దృష్టిని సారించాలి. ఇన్నేండ్లు, ఇన్నాళ్లు మనకు హక్కుగా దక్కాల్సిన వాటాను ఆధిపత్యవాదులు ఎలా కాజేసిండ్రో చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడది ముగిసిన అధ్యాయం. ప్రస్తుతం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలి. అందుకోసం పునాదుల నుంచి వినిర్మాణం జరగాలి. సకల ఆధిపత్యాలను ధిక్కరించే ‘తెలంగాణ’ను నిర్మించుకోవాలి. సాహిత్యంలో సైతం ఈ ఆధిపత్యాన్ని ధిక్కరిద్దాం. కొత్త ప్రతీకలను నిర్మించుకుందాం. విస్మరణకు, వివక్షకు, వక్రీకరణకు గురైన విషయాల్ని ఇకనైనా వెలుగులోకి తెద్దాం. వాటికి చిత్రిక గడుదాం. ఈ వెలుగులో తెలంగాణ సాహిత్య/సామాజిక/సాంస్కృతిక చరిత్రను తిరగ రాద్దాం. ఇన్ని సంవత్సరాలు ఉటంకింపులకు, పాదసూచికలు, బ్రాకెట్ల మధ్యలో నిలిచిన అంశాల్ని చర్చకు పెట్టాల్సిన అవసరముంది.
ఆధిపత్యాల నిర్మూలనలో (వినిర్మాణ) తెలంగాణలోని బుద్ధిజీవులందరూ తమ వంతు కృషి చేసిండ్రు. టాంక్‌బండ్‌పై తమవి కాని విగ్రహాలను తొలగించడంలోనూ అంతే
బాధ్యతతో తెలంగాణ బిడ్డలు పాలుపంచుకుండ్రు. కోడి పందాల స్థానంలో తెలంగాణ బతుకమ్మలను ఆడినం. తెలంగాణ వంటలు వండుకున్నం, ఆటలు ఆడుకున్నం, పాటలు
పాడుకున్నం, ధూంధాంలు ఆదినం. ఇదంతా ఉద్యమంలో భాగంగా, ఎవరికి తోచిన విధంగా వారు, సీమాంధ్ర ఆధిపత్యాలను కూల్చడానికి, స్వీయ అస్తిత్వాన్ని చాటడానికి
ఉద్యమకారులు చేసిన పోరాట రూపాలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో పనిచేయడం కుదరదు. అందుకే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణవాదులు
చేసిన మంచిపనులన్నింటిని జూన్ రెండు నుంచి ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీలు, అకాడెమీలు, సంస్థలు,
గ్రూపులు, వ్యక్తులు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్ని చిరస్మరణీయంగా తీర్చి దిద్దాలి. చరిత్రలో నిలబెట్టాలి.
గత అరవైయేండ్లుగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ‘పద్మ’ అవార్డులన్నీ సీమాంధ్ర వందిమాగధులకే ఎక్కువగా దక్కాయి. వారు మాత్రమే సాహిత్యకారులు,
వారు మాత్రమే సకల కళా పారంగతులుగా వెలిగి పోయారు. 60 యేండ్ల పాటు తెలంగాణ బతుకుల్ని చిత్రాలుగా మలిచిన సిద్దిపేట కాపు రాజయ్య, కొండపల్లి
శేషగిరిరావు, పి.టి.రెడ్డి, ప్రపంచం గొడవను ‘నా గొడవ’గా చేసిన కాళోజి నారాయణరావు, సంగీత, సాహిత్య రంగాల్లో తెలంగాణ ప్రజ్ఞను ప్రపంచ వ్యాప్తం
జేసిన సామల సదాశివ, పాండవ కళాకారిణి తీజ్‌రీ భాయికి ఏమాత్రం తీసిపోని చిందు ఎల్లమ్మ, తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ,
తెలంగాణ సిద్ధాంత కర్త కొత్తపల్లి జయశంకర్ సార్, తెలంగాణ భాషకు పట్టం కట్టిన పాకాల యశోదారెడ్డి, జానపదాల్ని జ్ఞానపదులకు తెలియజెప్పిన
బిరుదురాజు రామరాజు, బహుభాషా కోవిదుడు, రాజకీయ పండితుడు పి.వి.నరసింహారావు, తెలుగు`ఉర్దూ భాషల వారధి హీరాలాల్ మోరియా, తెలంగాణ
ప్రతిభను, సాహిత్యాన్ని, గౌరవాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన పరిశోధకులు గడియారం రామకృష్ణశర్మ, బి.ఎన్.శాస్త్రి, 1969 ఉద్యమాన్ని చట్టసభల్లోనూ,
బహిరంగ సభల్లోనూ నడిపించిన ధీర వనితలు టి.ఎన్.సదాలక్ష్మి, ఈశ్వరీభాయి, సాయుధ పోరాటంలో సమరం జేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని
ధర్మభిక్షం, నల్లా నరసింహులు, సాయుధ పోరాట కాలం నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి కాలం వరకు నిరంతర ప్రతిపక్షంగా నిలిచిన బండ్రు నరసింహులు లాంటి
ఎందరో మహానుభావులకు న్యాయంగా దక్కాల్సిన గౌరవం దక్కలేదు.
తెలంగాణ ఉద్యమ కాలంలో చనిపోయిన వీరి కీర్తి, ఘనత అందరికీ తెలియలేదు. తెలంగాణ ఉద్యమ సందర్బంలో చనిపోయిన వారికే ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందంటే ఇక
అంతకుముందు చనిపోయిన వారికీ, ప్రస్తుతం బతికున్న వారికి కూడా ఎలాంటి గుర్తింపు దక్కలేదు. భారత ప్రభుత్వం తరపున ఇచ్చే పద్మ అవార్డుల్లో ఒక్క
కాళోజి నారాయణరావుని మినహాయిస్తే మిగతా ఎవరికీ దక్కలేదు. ఇక్కడ పేర్నొన్న అందరూ ‘పద్మ’అవార్డులకు అర్హులు. రేపటి తెలంగాణలో ఇలాంటి అన్యాయం
జరక్కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడి భూమి పుత్రులకు న్యాయంగా దక్కాల్సిన గౌరవానికి ఎక్కడా భంగం కలుగకుండా చూడాలి.
1990లకు ముందే దాటుకున్న తరానికి కూడా భవిష్యత్తులో గౌరవం దక్కాలి. తెలంగాణ సాహిత్యంలో ‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి, ఉద్యమాలకు
ఊపిరులూదిన రావి నారాయణరెడ్డి, గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసిన రాజా నాయని వెంకటరంగారావు, సురవరం ప్రతాపరెడ్డి, గుంటక నరసయ్య పంతులు, సంగెం
లక్ష్మీభాయి, బూర్గుల రామకృష్ణారావు, కవిరాజమూర్తి, కొండా వెంకటరంగారెడ్డి, అరిగె రామస్వామి, మాసుమా బేగం, మహేంద్రనాథ్, మర్రి
చెన్నారెడ్డి, మల్లికార్జున్, జయసూర్య, మెల్కోటే, కోదాటి రాజమల్లు, సుద్దాల హనుమంతు లాంటి సాహిత్య సామాజిక రంగాల్లో పనిచేసిన వేలాది మంది
ఇవ్వాళ ‘వాళ్లెవ్వరు?’ అనే ప్రశ్నను ఎదుర్కొంటున్నారు. వారు చేసిన పోరాటాల గురించి కూడా నేటి తరానికి తెలియకుండా పోయింది.
తెలంగాణపై పోలీస్‌యాక్షన్ నాటి గురించి చెప్పుకుంటేనే ఇంత చరిత్ర ఉంది. వీరి కన్నా ముందు సామాజికోద్యమాలు నడిపిన భాగ్యరెడ్డి వర్మతో పాటుగా మత
సహనానికి చిహ్నం మహబూబ్ అలీఖాన్, బందగీ, బండి యాదగిరి, షోయెబుల్లాఖాన్, తుర్రెబాజ్‌ఖాన్, యాదగిరి, లాంటి ఎంతో మంది తెలంగాణ ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేసిండ్రు. వ్యక్తులుగా వీరికి విగ్రహాలు, భవనాలకు పేర్లు, పార్కులు, స్టేడియాలకు పేర్లు పెట్టినంత మాత్రాన పంచాయితీ వొడువదు. ఇన్నేండ్లుగా ప్రజా
ఉద్యమాల్లో సేవ, త్యాగం లక్ష్యంతో సర్వం అర్పించి పోరాటం చేసిన భూమిపుత్రులను ప్రతి యేటా జయంతి, వర్ధంతుల్లో స్మరించుకోవాలి. త్యాగపురుషుల జీవితాలను తెలంగాణ పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలి. సమ్మక్క, సారలమ్మల పోరాటం, సర్వాయి పాపన్న విజయ బావుటా, తుర్రెబాజ్‌ఖాన్ తిరుగుబాటు, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభ, పత్రికోద్యమాలు, సాయుధ పోరాటం, హైదరాబాద్‌పై పోలీసుచర్య, ఆంధ్రప్రదేశ్ పీడ, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సలైట్ పోరు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచిన వైనం, మలిదశ ప్రత్యేక తెలంగాణ పోరాటం, టీఆర్‌ఎస్ ఉద్యమం అన్నీ రేపటి చరిత్ర పుస్తకాల్లో సముచిత రీతిలో రికార్డు కావాలి.
మనం బోనం, బొట్టు, బతుకమ్మ, దసర పండుగ, హోళి, నోములు, వ్రతాలు, పీర్ల పండుగ, సాంస్కృతిక పయనం అన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో చేసుకునే
పండుగలుగా ఆదరించబడాలి. సమ్మక్క సారలమ్మ జాతరలతో పాటు, నాగోబ జాతర, మహాంకాళి, మన్నెంకొండ, కురుమూర్తి, రంగాపూర్ ఉర్సు, కొమురెల్లి మల్లన్న,
ఏడుపాయల దుర్గమ్మ, బడాపహాడ్ ఉర్సు, లింగమంతుల, సిరసనగండ్ల జాతరలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన
చర్యలు. ఇన్నేండ్లు సీమాంధ్ర ఆధిపత్యం మూలంగా స్మరణకు, గౌరవానికి నోచుకోకుండా పోయిన ఉత్సవాల్ని మనమే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. గత 25
యేండ్లుగా తెలంగాణ వాదులు తమ ఉద్యమాలను ఎందుకోసం చేశారో ఆ కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి.
ఇక విశ్వవిద్యాలయాల కొస్తే సాహిత్య, సామాజిక రంగాల్లో విస్తృతమైన పరిశోదనలు జరపాలి. మన ఔన్నత్యానికి చిత్రిక గట్టాలి. 1956కు ముందు వచ్చిన
ప్రతి రచనను అచ్చులోకి తీసుకు రావాలి. అకాడెమీలు ఈ రంగంలో ప్రధాన పాత్ర వహించాలి. అముద్రితంగా ఉన్న తాళపత్రాలను సేకరించి వాటిని ప్రచురించాలి.
గతంలో ప్రచురించబడ్డప్పటికీ ఇప్పుడు అందుబాటులో లేని రచనలను పునర్ముద్రించాలి. అలనాటి తెలంగాణ సాహితీవేత్తల జీవితం, సాహిత్యం రెండిరటిపై విశేషమైన పరిశోధనలు జరిపించాలి. వీటి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలి. ఒక్కోకవి/రచయితకు సంబంధించిన రచనలన్నింటిని సమగ్ర సంకలనాలుగా వెలుగులోకి తేవాలి. రచయితలు, రాజకీయ నాయకులు, ప్రసిద్ధుల జీవిత చరిత్రలను/ ఆత్మకథలను కూడా అచ్చేయాలి. తెలంగాణ పెయింటర్ల జీవితాలు వారి పెయింటింగ్స్ రెండూ అచ్చవ్వాలి.
గుణాఢ్యుడు దగ్గరి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో పుట్టిన ప్రతి ప్రసిద్ధ వ్యక్తి సమాచారాన్ని ‘జీవిత సర్వస్వం’ రూపంలో రికార్డు చేయాల్సిన అవసరముంది. ఇప్పటికే ఇంగ్లీషులో డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీ అని ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తుల జీవిత చరిత్రలను ప్రతి యేటా రికార్డు చేస్తున్నారు. ఆ మాదిరిలో తెలంగాణ వారి జీవిత చరిత్రలను కూడా చరిత్ర
పుటల్లోకి ఎక్కించాలి. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం వారికి పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో పది జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దాంతో మొత్తం జిల్లాల సంఖ్య 20 కానుంది. ఈ ఇరవై జిల్లాల గెజిటీర్లను/ జిల్లా సర్వస్వాలను కూడా ముద్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.
తెలంగాణలోని వ్యక్తుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విధంగా అవార్డులను ప్రముఖ తెలంగాణ వ్యక్తుల పేరిట నెలకొల్పాలి. లలితకళలు, ఫోటోగ్రఫీ, జానపదాలు, సాహిత్యం, సాంస్కృతికం ఇలా అన్ని రంగాల్లోని ప్రతిభావంతుల్ని గుర్తించి ప్రోత్సహించాలి. అవసరమైతే వారికి మెరుగైన శిక్షణ ఇప్పించాలి. నిజాం జమానాలో డాక్టర్ మల్లన్న, రూపాబాయి ఫర్దూంజీ లాంటి డాక్టర్లను విదేశాలకు పంపించి అక్కడ విద్యాభ్యాసం చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డాక్టర్ మల్లన్న అనస్తీషీయాలో నోబుల్ ప్రయిజ్ గెలుచుకున్న జర్మన్ డాక్టర్ దగ్గర పనిచేశారు. ఆయనకు ఆ ప్రయిజ్‌లు రావడంలో ఈయన పాత్ర ప్రధానమైంది. భవిష్యత్‌లో కూడా ఈ పరంపర కొనసాగాలి. రేపటి బంగారు తెలంగాణలో ఇన్నేండ్లుగా విస్మరణకు గురైన శ్రేణులకు సరయిన గుర్తింపు దక్కాలి. వారి ప్రతిభకు ప్రోత్సాహమూ ఉండాలి.
ఎక్కడ కూడా ఆధిపత్య పోకడలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు / గౌరవం దక్కేలా ప్రభుత్వం వ్యవహరించాలి. ఇవన్నీ వాస్తవ రూపం దాల్చాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వ్యవహరించాలి.
తెలంగాణ కళలకు కాణాచి. నిన్నటి వరకు ‘ఎవరెస్టు’ అనే పేరు హైదరాబాద్‌తో సంబంధమున్న ఒక సర్వేయర్‌గానే తెలుసు. కాని ఇవ్వాళ తెలంగాణ పిల్లలు ఆ పేరిట ఉన్న శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ వ్యాప్తంగా మన్ననలందుకుంటున్నారు. భవిష్యత్‌లో సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ పేరు కూడా ‘ఎవరెస్టు’లా నిలిచేందుకు ఆ యా రంగాల్లో ప్రవేశం, తెలంగాణపై అమితమైన ప్రేమ ఉన్న కె.చంద్రశేఖరరావు పై కూడా ఇక్కడి ప్రజలకు అపరిమితమైన ఆకాంక్షలున్నాయి. వీటన్నింటిని కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుస్తాడనే విశ్వాసం కూడా ఉంది. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేలా, కేసీఆర్‌పై ఉన్న నమ్మకం ఇనుమడిరచేలా కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో
ముందడుగేయాలి.
- సంగిశెట్టి శ్రీనివాస్
సర్
చక్కగా చెప్పారు — కాని బాబు గారు .,వెంకయ్య నాయుడు గారు —యిప్పటికి — ఎప్పటికి
మోసం — అన్యాయం — చేయాలని రాజకీయం చేయక మానరు —తెలంగాణా లో
తెలుగు దేశం లేకుండా చేసిన రోజు —మనకున్న శని కొంత కాదు ,–అంత తోలిగిపోతుంది —
రానున్న కొత్త జిల్లాల కు వ్యక్తుల పేర్లు పెట్టడం దేనికి ??
తెలంగాణా లో — మల్లి దొరల రాజ్యం అని అనుకునే లా ఉండకుండా ఉండాలి –
మార్పు అవసరం
——————————————————
బుచ్చి రెడ్డి గంగుల
Very powerful, positive and forward looking article..nice vision sir!
ప్లీజ్ పోస్ట్ ఇన్ తెలంగాణా లాంగ్వేజ్, వే అరె ఇన్ తెలంగాణా now
తెలంగాణా లాంగ్వేజ్? కనీసం తమరు వాడచ్చు కద? ఐన మనకి ఉన్నది తెలుగు భాష మాత్రమె – తెలంగా అనేది బాష కాదు అది ఒక మాండలికం మాత్రమె
Agree with the comment by Don above. Language is the root of any culture and unless it is defined and protected any group/community will continue to get dominated by others, whether it is mughals, british,r andhras or others. Lets build and protect the language and lay the foundation for a great future rather than indulging emotional play in trying to correct the past and wasting time and energy.
“ఫుట్ నోట్” తెలుగు పధం లేదా?
తెలంగాణ సాధన తప్పకుండా ఒక చారిత్రాత్మక ఘట్టం కాని ఇప్పుడు కావలిసింది అభివృద్ధి ద్రుక్పదమే కాని వేరొకరిని దుయ్యబట్టడం కాదు.