తిలకము దిద్దరుగా…!

drushya drushyam-35

ఛాయా చిత్రలేఖనంలో వస్తువు ‘జీవితం’ అయినప్పుడు అది ఫొటోగానే మిగిలిపోదు. అనుబంధం అవుతుందని తెలిసిన కొద్దీ ఆశ్చర్యం, ఆనందం. గొప్ప విశ్వాసం.మానవ సంబంధాలను మనుషులు ఎంత బాధ్యతాయుతంగా మలుస్తారో తెలిసిన కొద్దీ ఒక అనురాగం, ఆప్యాయత.నిజం.
ఒకానొక సాయంత్రం, ఒక కిరాణా దుకాణం దగ్గర ఆ ముసలమ్మ నన్ను పట్టుకుని అభిమానంగా అడిగింది, ‘మొన్న నువ్వు కనిపించావుగానీ మందలించలేదు. తప్పే అయింది బిడ్డా..తర్వాత చాలా బాధయింది’ అని!

‘అదేందమ్మా?’ అంటే, ‘అవును బిడ్డా. నువ్వు బండి మీద పోతుంటె చూశాను. పిలుద్దామని అనుకున్నాను. కానీ, పోనీలే…అనుకున్న. తర్వాత గంట సేపటిదాకా ఒక్క మనిషీ సహాయానికి రాలేదు. అప్పుడనిపించింది. అయ్యో…పిలిస్తే మంచిగుండు గదా అనిపించింది!’ అని వివరించిందామె.

అప్పటికీ అర్థం కాలేదు. వివరంగా చెప్పమంటే ఆమె ఇలా చెప్పింది. తన భర్తకు అకస్మాత్తుగా దెబ్బతగిలి పడిపోయాడట. చాపల మార్కెట్ దగ్గర ఎవఎవలో యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయాడట. ఆయన లేవలేని స్థితిలో తాను ఆటో తీసుకుని గాంధీ దవాఖానకు పోదామని అనుకుందట. కానీ, చేతుల చిల్లిగవ్వ లేదట. అప్పుడు కనిపించానట. అడుగుదామనే అనుకుందిట. కానీ, ఆగిపోయిందట. తీరా నేను వెళ్లిపోయిన తర్వాత గంట సేపటిదాకా తెలిసిన వ్యక్తులెవరు కనబడలేదట. ఎంత కష్టమయిందో అంది. అప్పుడనిపించిందట, నన్ను అడిగితే పోయేది గదా అని!

ఇవన్నీఆమె విచారంగా చెబుతుంటే విన్నాక ఆమెతో అన్నాను, ‘అంతటి పరిస్థితిలో ఎందుకు పిలవలేదమ్మా’ అని!
అందుకు ఆమె చిన్నగా అంది, ‘ఒకసారి నువ్వు పోతూ పోతూ మా ఇంటిముంగట ఫొటో తీసింది గుర్తున్నది. అంత మాత్రాన నిన్ను సహాయం అడగటం ఏం బాగుంటుందని అడగలేదు. కానీ, నువ్వు వెళ్లాక తెలిసింది. కొన్ని సమయాల్లో కొద్ది పరిచయం అయినా ఫరవాలేదని!’ ఇట్లా చెప్పిందామె.

ఆమె చెబుతుంటే విన్నాను. విని ఒకింత కోపానికి లోనయి అడిగాను. “అదేంటిదమ్మా? అంత ఇబ్బంది పరిస్థితి ఎదురైతే అడగకుండా ఎట్లా ఉంటవమ్మా? నేను బుల్లెట్ నడుపుతున్న అంటే ఏమిటని అర్థం. చప్పుడు వింటేనే నా దగ్గరకు రావాలె కదా? అంత అవసరం ఉన్నప్పుడు రెండోసారి ఆలోచిస్తరా?’ అని కొప్పడ్డాను. ‘అదీగాక నేను నల్ల షర్టు వేసుకునేదే అందుకాయె! నా పని అవసరం పడితె ఎవరైనా ఆజ్ఞాపించాలి! నువ్వు తప్పు చేసినవు అమ్మా’ అని మందలించాను.

ఇది కాదు ఆశ్చర్యం. అవును. నేను మందలించగానే ఆమె ఒప్పుకుంది. ‘నిజమే బిడ్డా’ అని ఒప్పుకుంది. ఒప్పుకుని ఒక సత్యం చెప్పింది. అప్పటిదాకా అది నాకు తెలియదు.’నిజమే బిడ్డా’….నువ్వు నేను తిలకం పెట్టుకుంటున్నప్పుడు ఫొటో తీశావు. నా భర్తకే ఆపద వచ్చినప్పుడు నిన్నుగాక ఇంకెవరిని అడగాలి. అడగవలసే ఉండె. తప్పే జరిగింది నాయినా’ అని అన్నది.

+++

నాకు నోట మాట రాలేదు. ఆమె ఏమి అంటున్నది? నేను తిలకం పెట్టుకుంటున్నప్పుడు ఫొటో తీశాను గనుక ఆ తిలకానికే ఇబ్బంది ఎదురైతే నేను సహాయం చేయవలసి ఉండిందట!
ఎంత గొప్పగా చెప్పింది. ఎంత బాధ్యత పెట్టింది.

+++

ఈ సంభాషణ గత వారం జరిగింది. అప్పటినుంచీ పదే పదే ఆమె మాటలు గుర్తొస్తున్నాయి. ఎంత బాగా చెప్పింది. నిజానికి తాను నన్ను చూడగానే పిలవాలని ఆనుకున్నది కూడా అందుకేనేమో! తిలకం.

అవును మరి. ఒక జీవనచాయను దృశ్యీకరిస్తున్నప్పుడు, పవిత్రమైన బంధానికి ప్రతీకగా ఆ తిలకం ఉన్నప్పుడు ఒక చూపు అది. ఆ చూపులో ఒక మానవీయత ఉన్నది. మనిషి మరొక మనిషి తాలూకు స్థితిని పట్టిస్తున్నది. ఆ స్థితిని వర్తమానంలోనే కాదు, భవిష్యత్తులోనూ గమనింపులో వుంచుకోవాలి. ఒకవేళ దాని చుట్టూ ఉన్న మంచీచెడుకూ బాధ్యుడనై కూడా ఉండాలి.

– ఇట్లా ఆమె మాటల్లోని తాత్వికత. బోధన అర్థమయింది . అంతేగాదు, హార్డ్ డిస్క్ లో ఉన్న ఈ ఫొటోకూ మళ్లీ జీవితం వచ్చినట్టయింది. తీశాను. పదే పదే చూశాను. ఎంత బాగున్నది. నిజంగా ఆ ముసలమ్మను, వీపు వంగిపోయి ఉంటుంది. నడుస్తున్నప్పుడు ముంగాళ్ల మీద నడుస్తున్నట్టే ఉంటుంది. అటువంటిది కూచున్నప్పుడు తనలో ఎంత ఠీవీ ఉన్నది. తిలకం దిద్దుకుంటున్నప్పుడు ఎంత నిండుగ ఉన్నది. ఎంత కళ ఉన్నది. మరెంత ఆరోగ్యం ఉన్నది. పరిసర ప్రపంచంలో గడ్డి,  ఆ గుడిసె వంటి గృహం తాలూకు పేదరికం…ఇదేలా ఉన్నా ఏమి చెప్పినా తన దుస్తులు, వస్త్రధారణ అంతా కూడా ఒక నిండైన తొణకని తన వ్యక్తిత్వాన్ని చూపెడుతున్నయి. ఈ చిత్రం చూస్తుంటే తన జీవన సహచరుడిని చూడటం అనీ అర్థమైంది. ఒక ముత్తయిదువను చూడటమూ అన్న సంగతి ఇలా నిదానంగా తెలిసి వచ్చింది.

మొత్తంగా నాకొక పిలుపు. అది ఇక ఎప్పుడూ వినిపిస్తుంది.

వెళుతుంటే ఆమెలో ఒక భరోసా.
ఇక ముందు నన్నే కాదు, ఎవరినైనా పిలుస్తుంది కాబోలు, తక్షణం ఏదైనా అవసరం అయినప్పుడు, ముఖ్యం అయినప్పుడు! అనిపించింది.

కానీ నాకైతే ఆమె గొప్ప మేలుకొలుపు. ఫొటోలు తీయడం ఎంతటి పనో తెలిసిన మలుపు.
ముఖ్యంగా జీవితాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఒక అనుబంధం. అది భవిష్యత్తులో నీ బాధ్యతను గుర్తు చేసే బంధమూ కావచ్చని తెలియడం.

తిలక ధారణ అంటే ఇదే!

~ కందుకూరి రమేష్ బాబు

Download PDF

1 Comment

  • కానీ నాకైతే ఆమె గొప్ప మేలుకొలుపు. ఫొటోలు తీయడం ఎంతటి పనో తెలిసిన మలుపు.
    ముఖ్యంగా జీవితాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఒక అనుబంధం. అది భవిష్యత్తులో నీ బాధ్యతను గుర్తు చేసే బంధమూ…

    ఒక ఫోటో తీసినాయనను పిలవడానికి సంకోచించడం, మరల ఆ ఫోటోతో తనకున్న తాత్విక సంబంధమూ ఆ అవ్వ మాటల్లోని ఆత్మీయత అదే సందర్భంలో తనలోని నిస్సహాయతను ఒప్పుకుంటూనే తన నిబ్బరం తెలియచేసాయి. ఇది మీ సామాన్యశాస్త్రంలోనే ముఖ్యమైన ఘట్టం. బంధం కూడాను.

    అభినందనలు సార్..

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)