పక్షి ఎగిరిన చప్పుడు

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

దారి చెదరిన ఒక ఒంటరి పక్షి తెల్లని తన రెక్కలు చాచి

చుక్కలు కాసిన ఆకాశంలో వెతుకుతుంటుంది

ఒక దిక్కు మరొక దిక్కులోనికి ముడుచుక పడుకొనే జాము

కలయతిరిగి కలయతిరిగి

ఎక్కడ తండ్రీ నీ గూడు

నీలినీలి చీకటిలో ఎక్కడ తండ్రీ నీ తెన్ను

పగటి ఎండలో దూసర వర్ణపు వేడిలో వొదిగి వొదిగి దేహాన్ని ఏ చెట్టుకొమ్మకో వేలాడదీసి

క్రమంగా వివర్ణితమై ఒక కెంజాయ ముఖాన్ని చరుస్తున్నపుడు

నీకు గూడు గురుతుకొస్తుంది

దిగ్మండలం మీద చెదురుతున్న పొడలా దారి గురుతుకొస్తుంది

Murder_by_vhm_alex

ఆకాశపు నీలిమ కింద

చుక్కల లేవెలుతురు క్రీనీడల కింద

నీ పూర్వీకులు తిరిగిన జాడల వాసన గురుతుకొస్తుంది

నీలాగే ఇప్పటి నీలాగే తిరిగి తిరిగి లోకం ముంగిట ఒక్క స్మృతినీ మిగిల్చుకోని కఠినాతి కఠినమైన మొరటు మనుషులు

ఆకాశం నుండి నేల వరకూ అనేకానేక లోకాలను తమ నిట్టూరుపులపై నిలబెట్టిన వాళ్ళు

అలుముకపోయిన చీకటిలో ఎక్కడో వెలుతురు

అలసిన నీ రెప్పల వీవెనల కింద వూటలా చెమరింపుల చల్లని తడి

తిరిగి తిరిగి ఇక అప్పుడు

దేహపు ఆవరణలలో పసికందులా రాత్రి నిదురపోతున్నప్పుడు

రెక్కల మీద చేతులు చాచుక ఆకాశం విస్తరిస్తున్నప్పుడు

కదిలినప్పుడల్లా సలుపుతున్న నొప్పిలా పక్షి ఎగురుతునే ఉంటుంది.

-అవ్వారి నాగరాజు

Download PDF

3 Comments

  • కోడూరి విజయకుమార్ says:

    నాగరాజు గారు … పోయెం బాగుంది !

  • Thirupalu says:

    దారి చెదరిన ఒక ఒంటరి పక్షి నా హృ దయం లో దిగులు గూడు కట్టింది.
    బాగుంది మీ కవిత నాగ రాజు గారు.

  • దేహపు ఆవరణలలో పసికందులా రాత్రి నిదురపోతున్నప్పుడు
    రెక్కల మీద చేతులు చాచుక ఆకాశం విస్తరిస్తున్నప్పుడు
    కదిలినప్పుడల్లా సలుపుతున్న నొప్పిలా పక్షి ఎగురుతునే ఉంటుంది…

    చాలా బాగుంది నాగరాజు గారు.. లోలోన తాదాత్య్మం చెంది సలుపుతున్న పురా జ్ఞాపకాల గాయాలను గుర్తు చేస్తూంది పద్యం.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)