మోర్గాన్ కన్నా ముందు వ్యాసుడే చెప్పాడు!

41S2DEZ512L

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

 

సూక్ష్మంగా పరిశీలిస్తే, ద్రౌపది వివాహం కల్పించిన ధర్మసంకటం నుంచి కథకుడు అంత తేలిగ్గా ఏమీ బయటపడలేదు. ఇప్పటి మాటలో చెప్పాలంటే చాలా ‘టెన్షన్’ పడ్డాడు. గుంజాటన పడ్డాడు. నిజమాలోచిస్తే అతనికి ద్రౌపది అయిదుగురిని వివాహమాడడంలోని ‘అసంబద్ధత’ రాను రాను చిన్న గీతగా మారిపోయి, దానిని శాస్త్రానికి నప్పించడం ఎలాగన్నదే పెద్దగీతగా మారిపోయినట్టు అనిపిస్తుంది. ‘దేవధర్మం’నుంచి సమస్యను ఎంత నరుక్కు వద్దామని అతడు చూసినా ‘మనుష్యధర్మం’ తాలూకు చిక్కులు అతని అంతఃకరణను వేధిస్తూనే వచ్చాయి.

ధర్మతత్వం తెలిసిన ధర్మరాజు, కుంతి, ద్రుపదుడు తమలో తాము సమస్యను పరిష్కరించుకోలేకపోయిన స్థితిలో వ్యాసుడంతటి వాడు రంగప్రవేశం చేయడమే చూడండి… సమస్య ఎంత సంక్లిష్టమో అదే చెబుతుంది. విచిత్రమేమిటంటే, వ్యాసుడికి కూడా ఇది దేవధర్మం అని నిష్కర్షగా చెప్పి సందేహాలకు తెరవేయడం సాధ్యం కాలేదు. ఆయన కూడా దేవధర్మం-మనుష్య ధర్మం అనే రెండింటి మధ్యా ఊగిసలాడడం కనిపిస్తుంది. ఆయన కంటె ముందు ధర్మరాజూ అలాగే ఊగిసలాడాడు. దాని గురించి మొదట చెప్పుకుందాం.

ద్రౌపదితో తమ అయిదుగురి వివాహాన్ని సమర్థించుకోడానికి ధర్మరాజు రెండు అంశాలను ముందుకు తెచ్చాడు: మొదటిది, గౌతమ గోత్రీకుడైన జటిలుడనే ఋషి కూతురు(ఆమె పేరు చెప్పలేదు) తపఃప్రభావంతో ఏడుగురు ఋషులకు భార్య అయినట్టు; దాక్షాయణి అనే మునికన్య,‘ప్రచేతసు’లనే ఒకే పేరుతో ఉన్న పదకొండుమందిని వివాహమాడినట్టు కథల్లో వింటుండడం. రెండవది, గురువులలోనూ పరమగురువు అయిన తల్లి ఆదేశాన్ని, విధి నిర్దేశాన్ని అతిక్రమించడానికి వీలు లేదు కనుక.

దీనిప్రకారం, ద్రౌపదిని తాము అయిదుగురూ వివాహమాడడం వెనుక దైవ కారణం లేదా దేవధర్మం ఉందనే సమర్థన సంపూర్ణంగా సరిపోతుందని ధర్మరాజు అనుకోవడం లేదన్నమాట. దానికి మనుష్యధర్మాన్ని కూడా తోడు తెచ్చుకుంటున్నాడు. ఎలాగంటే, జటిలుడనే ఋషి కూతురు గురించి, దాక్షాయణి గురించి చెప్పడంలో మనుష్యసంబంధమైన అటువంటి ఆనవాయితీ ఉందని చెప్పడమే ధర్మరాజు ఉద్దేశంగా కనిపిస్తుంది. గమనించండి…జటిలుడి కూతురు, దాక్షాయణి అనేకమందిని వివాహమాడడం వెనుక దేవధర్మం లేదా దైవకార్యం ఉందని చెప్పడం లేదు. కుంతి, ద్రౌపదుల వెనక అలాంటివి ఉన్నప్పుడు; జటిలుడి కూతురు, దాక్షాయణిల వివాహం వెనక కూడా ఉండి తీరాలి. అప్పుడే ఆ పాత్రల మధ్య సమధర్మాన్ని, సమన్యాయాన్ని స్థాపించినట్టు అవుతుంది. కానీ కుంతి, ద్రౌపదులను మాత్రమే మనుష్యధర్మం నుంచి మినహాయిస్తున్న కథకుడూ, కథకుని పాఠాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్న వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారి వంటి సంప్రదాయ పండితులూ జటిలుడి కూతురు, దాక్షాయణిల విషయంలో ఆ సూత్రాన్ని అన్వయించడం లేదు. అన్వయించకపోగా ఇక్కడ కథకుడు ధర్మరాజు ముఖతా ద్రౌపది వివాహాన్ని సమర్థించడానికి ఆ ఇద్దరినీ వాడుకుంటున్నాడు.

వ్యాసుడు, కర్ణుడు ఒకేవిధంగా(మునుల వరం, సద్యోగర్భం; కర్ణుడికి అదనంగా సూర్యసంబంధం)జన్మించినప్పటికీ ఇద్దరికీ ఒకేవిధమైన ప్రతిపత్తిని ఇవ్వలేదని చెప్పుకున్నాం. ఇక్కడ కుంతి, ద్రౌపదులతో పోల్చినప్పుడు జటిలుడి కూతురు, దాక్షాయణిల విషయంలో కూడా అదే జరిగింది. సంప్రదాయ పాఠం పూరించకుండా విడిచిపెట్టిన ఖాళీలలో ఇది కూడా ఒకటి.

ఇక ద్రౌపదితో తమ వివాహాన్ని సమర్థించుకోడానికి ధర్మరాజు చెప్పిన రెండో కారణానికి వస్తే, గురువులలోనే పరమ గురువు అయిన తల్లి చెప్పింది కనుక ఈ వివాహం జరిగితీరవలసిందే నంటున్నాడు. అంటే ఈ మాటతో అతడు పూర్తిగా సాధారణబుద్ధితో మనుషులందరూ అర్థం చేసుకోగల మనుష్యధర్మంలోకి జారిపోతున్నాడు. తల్లి ఆదేశాన్ని కొడుకు పాటించాలనడం వెనుక ఎలాంటి దేవధర్మమూ, దైవకారణమూ ఉండనక్కరలేదు. అది అసలు సిసలు మనుష్యధర్మం మాత్రమే.

ఆశ్చర్యమేమిటంటే, దేవధర్మం, దైవకారణాలనుంచి అంతిమంగా మనుష్యధర్మంలోకి జారిపోయే ఈ క్రమం వ్యాసుని మాటల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ధర్మరాజు ధర్మతత్వజ్ఞుడు కనుకా, అతడు ధర్మం తప్పే ప్రసక్తి లేదు కనుకా; కుంతీదేవి కూడా అబద్ధమాడే ప్రశ్న లేదుకనుకా; వీరి అభిప్రాయమే దేవతల అభిప్రాయం కూడా కనుకా మరేమీ ఆలోచించకుండా ద్రౌపదిని ఈ అయిదుగురికీ ఇచ్చి పెళ్లి చేసేయమని మొదట ద్రుపదునికి చెప్పాడు. తదుపరి మెట్టులో, దీని వెనుక అసలు రహస్యం వేరే ఉందంటూ నాటకీయంగా ద్రుపదుని చేయిపట్టుకుని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి తాను చెప్పబోయే రహస్యానికి ఒక గంభీర వాతావరణం కల్పించాడు. అది ద్రుపదుడిపై ఆడిన ఒక ‘మైండ్ గేమ్’ అనే సంగతి తెలిసిపోతూనే ఉంది.

ద్రౌపది వెనకటి జన్మలో ఇంద్రసేన అనే పేరు కలిగిన ‘పరమ పతివ్రత’ అంటూ వ్యాసుడు ఆమె కథ చెప్పడం ప్రారంభించాడు. ద్రౌపది అయిదుగురికి భార్య కాబోతోంది కనుక ఆమె పాతివ్రత్యం గురించి శ్రోతలు పరిపరి విధాలుగా ఆలోచించే అవకాశం ఇవ్వకుండా ‘పరమ పతివ్రత’ అనే వ్యూహాత్మకమైన మాట ద్వారా ముందే కట్టడి చేస్తున్నాడన్న మాట. ఆ వెంటనే ఆమె ఎంత పతివ్రతో సోదాహరణంగా చెప్పాడు. ఆ తర్వాత ఆమె కామేచ్ఛ గురించి, ఆమె కోరికపై మౌద్గల్యుడు అయిదు అందమైన పురుషరూపాలు ధరించి ఆమెతో సంగమించడం గురించి, ఆమె అప్పటికీ సంతృప్తి చెందని స్థితిలో అతడు ఆమెను వదిలేసి తపస్సుకు వెళ్లిపోవడం గురించి(సంస్కృత పాఠం ప్రకారం ఆమెకు మరుజన్మలో అయిదుగురు భర్తలవుతారని మౌద్గల్యుడు శపిస్తాడు), ఆమె శివుడి గురించి తపస్సు చేసి అయిదుగురు భర్తలను, కన్యాత్వాన్ని పొందబోవడం గురించి చెప్పాడు.

ravi_varma-draupadi_carrying_milk_honey1

ఇక్కడే ఇంద్రాది దేవతలు పాండవులుగా జన్మించారని అంటూ దానివెనుక ఉన్న దైవకార్యం గురించి కూడా వ్యాసుడు చెప్పాడు. అదేమిటంటే, వైవస్వత మనువు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తూ దీక్షలో ఉండి ప్రాణిహింస మానేశాడు. అప్పుడు మనుషులందరూ మరణం లేకుండా దేవతలతో సమానంగా అమరులైపోయారు. దాంతో దేవతలు దానిని సహించలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మవాళ్ళను భయపడవద్దని చెబుతూ, ఎప్పటిలా యముడు మనుషుల ప్రాణాల తీసే బాధ్యతను నిర్వర్తిస్తాడనీ, ఆ వైవస్వతుని వీర్యంతోనూ, మీ (దేవతల) వీర్యంతోనూ సూర్యతేజస్వులైన అయిదుగురు పుట్టి యముడికి సాయపడతారనీ అంటాడు. అంటే, ఈ మాటల ద్వారా కథకుడు రాబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని సూచిస్తున్నాడన్న మాట.

ఆ తర్వాత ఒకే ఇంద్రుడు అయిదుగురు ఇంద్రులుగా మారి యమ, వాయు, ఇంద్ర, అశ్వినీ దేవతల అంశతో పాండవులుగా జన్మించడం గురించి వ్యాసుడు చెప్పాడు. ఆపైన ద్రుపదుడికి దివ్యదృష్టి ఇచ్చి ద్రౌపదీ, పాండవుల పూర్వదేహాలు కూడా చూపించాడు. ఇలా ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం వెనుక ఉన్న శాపాలు, వరాలు, మహిమల రూపంలోని దేవధర్మాన్ని, దైవ కార్యాన్ని చెప్పిన తర్వాతా; అందుకు సాక్ష్యంగా ద్రౌపదీ, పాండవుల పూర్వ రూపాలు కూడా చూపించిన తర్వాతా వ్యాసునికి కానీ, ద్రుపదుడికి కానీ ఇక సందేహాలు ఉండడానికి వీల్లేదు.

కానీ చూడండి…పై కథనంతో ద్రుపదుడు కాదు సరికదా, స్వయంగా వ్యాసుడు కూడా సమాధానపడలేదన్న అభిప్రాయం అనంతర వాక్యాలను బట్టి అనిపిస్తుంది. ‘మనుష్యధర్మా’న్ని కూడా జోడిస్తే తప్ప పైన చెప్పిన దేవధర్మం, దైవకార్యాలను నమ్మరని వ్యాసుడికే అనుమానం వచ్చినట్టుంది. దాంతో దేవధర్మం అనే మెట్టు మీదనుంచి మనుష్యధర్మం అనే మెట్టు మీదికి ఒక్కసారిగా దిగిపోయాడు. పూర్వం నితంతుడనే రాజర్షి కొడుకులు అయిదుగురు అజిత, అనే రాకుమార్తెను స్వయంవరంలో గెల్చుకుని వివాహం చేసుకుని ఆమె ద్వారా సంతానం పొందారని చెప్పాడు. గమనించండి, ఈ వివాహం వెనుక ఎటువంటి వరాలు, శాపాలు, మహిమలు, దేవధర్మాలు, దైవకార్యాలు ఉన్నట్టు వ్యాసుడు చెప్పలేదు. ఆవిధంగా ఇది పూర్తిగా ‘మనుష్యధర్మం’ కిందికి వచ్చే వివాహమే. అంటే, ఇది కూడా జటిలుడనే ముని కూతురు ఏడుగురు ఋషులను, దాక్షాయణి అనే ఆమె పదకొండుగురు ప్రచేతసులను పెళ్లి చేసుకోడం లాంటిదే.

చివరిగా వ్యాసుడు,‘తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవు గావున…’అన్నాడు.

***

అదీ సంగతి!!!

నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. సంభ్రమాశ్చర్యాలతో కాసేపు అవాక్కునైపోయాను. దూకుతూ దూకుతూ ఉన్న నా మాటల జలపాతం కాస్తా ఎవరో మంత్రించినట్టు మధ్యలోనే స్తంభించినట్టు అయిపోయింది. నా లాప్ టాప్ కీబోర్డు మీద కదలడానికి వేళ్ళు మొరాయించాయి. చీకట్లో తడుముకుంటున్న కళ్ళకు హఠాత్తుగా ఒక మెరుపుతీగ తాకినట్టుగా ఈ వాక్యం నా బుద్ధిని తాకి వేయి వోల్టుల కాంతితో నింపివేసింది!

‘తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవు గావున…’

అంటే ఏమిటన్నమాట…పురాకాలంలో మహాత్ములు ఒకే స్త్రీని వివాహమాడిన చరిత్రలు ఉన్నాయని వ్యాసుడు చెబుతున్నాడు! ఇంకాస్త వివరంగా చెప్పుకుంటే, ఒకే స్త్రీని పలువురు పురుషులు పెళ్లిచేసుకోవడం అనే మనుష్యధర్మం అమలుజరిగిన ఒకానొక పురాచారిత్రక విశేషాన్ని ఈ వాక్యం ద్వారా వ్యాసుడు సూచిస్తున్నాడు!

అంటే, వ్యాసుడు ఈ వాక్యం ద్వారా అక్షరాలా పురాచరిత్రను చెబుతున్నాడు!

మహాభారతాన్ని పురాచరిత్రగా, పురామానవపరిణామ చరిత్రగా, చరిత్రగా చూస్తున్న నా దగ్గర, వ్యాసుడు పలికిన ఈ ఒక్క వాక్యం విలువను తూచగల తూనికరాళ్ళు లేవు. పురాచరిత్ర కోణం నుంచి మహాభారతాన్ని ‘డీకోడ్’ చేసే ప్రయత్నంలో కచ్చితంగా ఈ వాక్యం ఒక విలువైన ‘కీ’. చరిత్రలో ఏ గొప్ప రహస్యచ్ఛేదనానికీ తీసిపోని రహస్యచ్ఛేదనం ఇది. నావరకు నాకు ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు…

వ్యాసుడే కాదు,‘జటిలు డనే ఋషి కూతురు గురించి, దాక్షాయణి అనే ఆమె గురించి కథల్లో వింటూ ఉంటా’మని అంటూ ధర్మరాజు ఉపయోగించిన ‘కథ’ అనే మాట కూడా పురాచరిత్రను సూచించేదే.

ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, వ్యాసుడూ, ధర్మరాజూ కూడా ఒకప్పటి గణవివాహదశ గురించి చెబుతున్నారు. దేవధర్మం, దైవకార్యం లాంటి ముసుగులు అన్నీ తీసేసి మరీ చెబుతున్నారు. ‘ప్రచేతసులనే పదకొండుగురు సోదరులను దాక్షాయణి పెళ్లాడిం’దని చెప్పడంలో ఈ గణసమాజ లక్షణం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సోదరులందరికీ ఒకే పేరు ఉందంటే వారందరూ ఒకే గణానికి చెందినవారని అర్థం.

మహాభారతంలో గణసమాజ చరిత్ర!! ఎంత అద్భుతం!! వేలు, వందల సంవత్సరాలుగా ఈ దేశంలో మహాభారతం పఠన పాఠనాలలో ఉంది. కానీ ఏ ఒక్క పండితుడూ ఈ అద్భుతాన్ని గమనించినట్టు లేదు. ఇది నా పరిశీలనను మరింత ఉత్సాహవంతం, ఉత్తేజభరితం చేస్తున్న కోణం.

41S2DEZ512L

లూయీ హెన్రీ మోర్గాన్ అనే పండితుడు గణ సమాజంపై భగవద్గీతతో, బైబిలుతో పోల్చదగిన ఒక ప్రామాణిక గ్రంథం రాసిన సంగతిని ఇంతకుముందు ఒకసారి ప్రస్తావించాను. దాని పేరు ‘ANCIENTSOCIETY’(పురాతన సమాజం). అమెరికా ఆదివాసుల మధ్య పన్నెండేళ్ళు గడిపి, వాళ్ళతో పూర్తిగా మమేకమై, వారికి దత్తుడుగా వెళ్ళి గణదశలో ఉన్న వారి సమాజాన్ని అన్నివైపులనుంచీ శోధిస్తూ 1877లో ఆయన ఆ పుస్తకం రాశాడు. గ్రీకు, రోమన్ సహా ఇతర గణసమాజాల లక్షణాలతో తన అధ్యయనాన్ని సమన్వయించాడు. భౌగోళిక దూరాలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకనాటి గణసమాజాలు అన్నిటా ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలను వెల్లడించాడు.

చెప్పొచ్చేదేమిటంటే, లూయీ హెన్రీ మోర్గాన్ తన గ్రంథంలో ఏ వివాహదశలనైతే చర్చించాడో వాటిలోని ఒకానొక వివాహదశ గురించే మన వ్యాసుడు, ధర్మరాజు చెబుతున్నారు. ఇంకో ఆశ్చర్యానికి కూడా మీరు సిద్ధం కావాలి. అదేమిటంటే, గణవివాహదశ గురించి 19వ శతాబ్దంలో మోర్గాన్ చెప్పడానికి చాలా ముందే మన వ్యాసమహర్షి చెప్పడం!

మోర్గాన్ చెప్పిన గణసమాజ సంబంధాల గురించి ఎప్పటికప్పుడు చెప్పాలనుకుంటూ ఇప్పటికే అనేకసార్లు వాయిదా వేశాను. మరోసారి వాయిదా వేయక తప్పడం లేదు.

ఇప్పుడు మళ్ళీ ద్రౌపది వివాహం దగ్గరికి వెడదాం.

***

ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం కథకునిలో చాలా ‘టెన్షన్’ పుట్టించిందని మొదట్లో చెప్పుకున్నాం. దానినే మరికొంత విస్తరించుకుంటే…

ద్రౌపది వివాహంలో ఎదురైన ధర్మ సంకటం గురించిన చర్చ వాస్తవానికి రెండు దశల్లో జరిగింది. మొదటిది, పైన చెప్పుకున్న ద్రుపదుడు, ధర్మరాజు, వ్యాసుల మధ్య చర్చ జరిగిన చర్చ. రెండోది, అంతకుముందే కుంతి, పాండవుల మధ్య జరిగిన చర్చ. రెండో దశ చర్చలో వరాలు, శాపాలు వగైరాల రూపంలో ద్రౌపది వివాహాన్ని ఎలాగో ధర్మబద్ధం చేయడానికి కథకుడు ప్రయత్నిస్తే, మొదటి దశ చర్చలో కుంతి అన్న ఒక మాట ద్వారా ధర్మబద్ధం చేయడానికి ప్రయత్నించాడు.

అదేమిటంటే, స్వయంవరంలో గెలుచుకున్న ద్రౌపదితో కలసి భీమార్జునులు ఇంటికి వచ్చిన తర్వాత తామొక భిక్ష తెచ్చామని తల్లితో అనగా, ద్రౌపదిని తెచ్చిన విషయం తెలియక ఎప్పటిలానే ఆహారాన్ని యాచించి తెచ్చారనుకున్న కుంతి,‘మీరు అయిదుగురూ దానిని ఉపయోగించుకోండి’ అనడం.

కథకుడు ఆమాటనే ఉపయోగించుకున్నాడు. అయితే ద్రౌపదిని తెచ్చిన విషయం కుంతికి తెలియక అలా అందన్న కథకుని కల్పన మొత్తం రాతితో గోడకట్టినట్టుగా కాక, ఇసుక గూడులా మారిపోయిన సంగతి మామూలు బుద్ధికే తెలిసిపోతోంది. అదెలాగో చెప్పుకోవాలంటే, కుంతి,పాండవులు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు ద్రుపదుడి నగరం నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చి ద్రౌపది స్వయంవరం గురించి వారికి చెప్పిన దగ్గరనుంచీ ఎత్తుకోవాలి.

ఆ బ్రాహ్మణుడు ద్రౌపది స్వయంవరం గురించే కాక, ఆమె జన్మవృత్తాంతం మొత్తం చెప్పి అర్జునుడికి భార్యకావడం కోసమే ద్రుపదుడు యజ్ఞం చేసి ద్రౌపదిని పొందాడని కూడా చెప్పాడు. అప్పుడు అర్జునుడితో సహా పాండవులు అందరూ ద్రౌపదీ స్వయంవరానికి వెళ్లాలనుకోవడం సహజమే. పైగా స్వయంవరానికి నిర్ణయించిన పరీక్ష కూడా అర్జునుడి లాంటి మేటి విలుకాడు తన ప్రతిభను చాటుకోవడానికి మంచి అవకాశం. అదీగాక, రాచకన్యకు ఏర్పాటు చేసిన స్వయంవరాన్ని ఏ రాచబిడ్డా వదలుకోడు. అది పరువు కూడా కాదు.

కనుక పాండవులు ద్రుపదనగరానికి వెళ్లడానికి ఉత్సాహపడ్డారు. ఆ సంగతిని కుంతి గమనించిందని కూడా కథకుడు ఆ వెంటనే చెబుతున్నాడు. అయితే, స్వయంవరం మాట ఎత్తకుండా,‘ఇక్కడే చాలాకాలం ఉండిపోయాం, ఎంతకాలం ఇక్కడ ఉన్నా ఉపయోగమేముంది, పరుల ఇంట్లో ఎంత కాలం ఉంటాం, దక్షిణ పాంచాలం ఎంతో బాగుంటుందనీ, పాంచాలరాజు ధార్మికుడనీ విన్నాం, అదీగాక అక్కడి గృహస్థులు బ్రాహ్మణులకు అడగకుండానే చక్కటి భోజనం పెడతారట, అక్కడికి వెడదాం’ అంది. పాండవులు సరే, నువ్వు ఆదేశించినట్టే చేద్దాం అని తల్లితో కలసి బయలుదేరారు.

ఇక్కడ కుంతి స్వయంవరం గురించి ఎత్తకుండా, తాము పాంచాలరాజ్యానికి వెళ్లడానికి ఇతర కారణాలు చెప్పింది కనుక; పాండవులు స్వయంవరానికి వెళ్లదలచుకున్నారన్న సంగతి ఆమెకు తెలియదని కథకుడు అనడానికి అవకాశమున్నా అది పొసగదు. రాచబిడ్డలైన పాండవులు స్వయంవరానికి వెళ్ళి తీరతారనీ, వెళ్ళి తీరాలనే రాచసంప్రదాయం కుంతికి తెలియకుండా ఉండదు. అదీగాక, అర్జునుడికి భార్య కావడం కోసమే ద్రుపదుడు ద్రౌపదిని పొందాడనే సంగతి ఆమె కూడా వింది కనుక పాండవులు స్వయంవరానికి వెళ్లదలచుకున్నారన్న సంగతి ఆమెకు తెలియకపోయే ప్రసక్తే లేదు.

సరే, పాండవులు ద్రుపద నగరానికి బయలుదేరి వెడుతున్నారు. అప్పుడు వారికి వ్యాసుడు ఎదురయ్యాడు. ‘ఒక మునికన్య భర్త కోసం తపస్సు చేసిందనీ, శివుడు ప్రత్యక్షం కాగా భర్త కావాలని అయిదు సార్లు అడిగిందనీ, నీకు మరుసటి జన్మలో అయిదుగురు భర్తలవుతారని శివుడు ఆమెకు చెప్పాడనీ, ఇప్పుడామె పాంచాలరాజు కూతురుగా పుట్టి పెరిగిందనీ, ఆమెకు స్వయంవరం ప్రకటించారనీ, మీరు ద్రుపదపురానికి వెడితే మేలు జరుగుతుందనీ’ పాండవులకు వ్యాసుడు చెప్పాడు. అప్పుడు కుంతి అక్కడే ఉంది.

కనుక ఈవిధంగా కూడా పాండవులు ద్రౌపదీ స్వయంవరానికే వెడుతున్నారని కుంతికి తెలుసు!

ఆ తర్వాత మార్గమధ్యంలో వారికి కొందరు బ్రాహ్మణుల గుంపు కనిపించింది. మీరు ఎక్కడికి వెడుతున్నారని పాండవులు వారిని అడిగారు. ద్రౌపదీ స్వయంవరాన్ని చూడడానికి ద్రుపదపురం వెడుతున్నామని చెప్పారు. కుంతి, పాండవులు వాళ్ళతో కలసి ద్రుపదపురం వైపు ప్రయాణం సాగించారు.

కనుక పాండవులు ద్రౌపది స్వయంవరానికి వెళ్లదలచుకున్న సంగతి కుంతికి తెలియకపోయే ప్రశ్న లేదు.

కుంతీ సహితంగా పాండవులు ద్రుపదనగరానికి చేరుకున్నారు. బ్రాహ్మణవేషంలోనే స్వయంవరంలో పాల్గొన్నారు. కుంతి విడిదిలో ఉండిపోయింది. పాండవులు తాము స్వయంవరానికి వెడుతున్నట్టు కచ్చితంగా తల్లితో చెప్పే ఉండాలి. కనుక, వాళ్ళు రోజూలానే ఆహారభిక్షకు వెడుతున్నట్టు కుంతి అనుకునే అవకాశమే లేదు.

అర్జునుడు మత్స్యయంత్రం కొట్టాడు. ద్రౌపది అతణ్ణి వరించింది. ఇంతమంది రాజులను స్వయంవరానికి ఆహ్వానించి, వారిని కాదని ద్రౌపదిని ఒక బ్రాహ్మణుడికి కట్టబెట్టడం రాజులను అవమానించడమే నని కర్ణ దుర్యోధనాదులు ద్రుపదునిపై దండెత్తారు. భీమార్జునులు వారిని ఎదుర్కొన్నారు.

అయితే, ఈ లోపలే, స్వయంవరం ముగిసిన వెంటనే ధర్మరాజు, నకుల, సహదేవులు విడిదికి చేరుకున్నారు. అంటే ఏమిటన్న మాట? అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెల్చుకున్న సంతోషకరవార్త ఆ ముగ్గురూ తల్లికి చెప్పేసి ఉండాలి. చెప్పకపోవడానికి కారణం లేదు.

ఆ తర్వాత, కర్ణ, దుర్యోధనాదులను ఓడించిన భీమార్జునులు ద్రౌపదిని వెంటబెట్టుకుని విడిదికి వచ్చారు. భిక్ష తెచ్చామని అన్నారు. ద్రౌపదిని తెచ్చిన సంగతి తెలియని కుంతి, ఎప్పటిలానే ఆహారాన్ని యాచించి తెచ్చారనుకుని అయిదుగురినీ ఉపయోగించుకోమని అందని కథకుడు చెబుతున్నాడు.

ఈ కల్పన ఇసుకగూడు అన్న సంగతి తెలిసిపోవడంలేదా?

ఇంతకీ కథకుడు ఇంత అమాయకమైన కల్పన ఊరికే చేశాడనుకుంటున్నారా? కాదు. అతను ముఖ్యమైన కొన్ని అంశాలను మరుగుపుచ్చడానికి చేశాడు. వాటి గురించి తర్వాత…

 

 -కల్లూరి భాస్కరం

 

Download PDF

12 Comments

 • Mohan says:

  భాస్కరం గారూ,

  చాల ఇంటరెస్టింగ్ గా నడుపుతున్నారు. మోర్గాన్ పుస్తకం గురించి మీరు ఇంకా రాయాలి.
  ఇతిహాసపు చీకటి కోణం padi కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు.

  • కల్లూరి భాస్కరం says:

   థాంక్స్ మోహన్ గారూ…ఏదీ బాకీ ఉంచకుండా రాద్దామనే ఉద్దేశం. మీ లాంటి వారు చూపుతున్న ఆసక్తే ప్రోత్సాహకరం.

 • మీ వ్యాసం చదువుతుంటే ఇంకో కోణం కనపడుతోంది. మహాభారతాన్ని కథగా రాస్తున్న వ్యాసుడికి నాయక పాత్రలు ధరించిన వారి ప్రతి చర్యను సమర్థించి, “పాఠకుల” ఒప్పుదల సంపాదించాల్సిన అవసరం వుంది కదా! పాఠకులు అంటే పండితులు వుండవచ్చు, పామరులూ వుండవచ్చు. ఆస్థికులూ నాస్థికులూ వుండవచ్చు. అలాంటప్పుడు అందరిని ఒప్పించే ప్రయత్నంలో దేవధర్మమనీ, దైవకార్యమనీ చెబుతూనే మనుష్యధర్మాన్ని కూడా జోడించాడేమో. అలా పరిశీలిస్తే ఈ ఇతివృత్తం వ్యాసుడు “టెన్షన్” లో చేసిన పొరపాటులా కాక, తెలివిగా అందరి ఒప్పుదల కోసం deliberate గా చేసిన ప్రయత్నమని నాకు అనిపిస్తోంది.

  • కల్లూరి భాస్కరం says:

   అన్ని తరగతుల వారినీ ఒప్పించవలసిన అవసరం పౌరాణికునికి ఉన్న మాట నిజమే. కానీ ద్రౌపది వివాహానికి వస్తే దానితో శ్రోతలను లేదా పాఠకులను ఒప్పించడం కన్నా ఎక్కువగా సంప్రదాయానికి, అంటే ప్రస్తుత సందర్భంలో పురుషస్వామ్యానికి నప్పించడం కథకుడికి ముఖ్యంగా మారిందని నా అభిప్రాయం. ఇక ఆస్తిక, నాస్తిక భేదాలకు ఇక్కడ ప్రమేయం లేదనుకుంటాను. ఈ ఘట్టంలో దేవధర్మాన్ని, దైవకార్యాన్ని ఆస్తికులందరూ గుడ్డిగా నమ్మేస్తారనీ, నమ్మని వాళ్ళందరూ నాస్తికులే ననీ అనడం మరీ అతి సాధారణీకరణ అవుతుంది. ఆస్తికుని బుద్ధి కూడా కొంత తర్కాన్ని అనుసరిస్తుంది. ఉదాహరణకు, ఇస్రో సైంటిస్టు తమ ప్రయోగం విజయవంతం కావాలని ఈ దేవుడికి మొక్కుకోవచ్చు. కానీ ప్రయోగంలో మాత్రం శాస్త్రీయమైన తర్కాన్నే అనుసరిస్తాడు. ఇది కథను బిగువుగా, తనదైన ఒక తర్కంతో, ఎటువంటి ఖాళీలకూ అవకాశం ఇవ్వకుండా కథకుడు నిర్మించాడా లేదా అన్న ప్రశ్న వేసుకోవలసిన సందర్భం. దేవధర్మం అంటూనే మనుష్యధర్మం గురించిన ఉదాహరణలు కూడా ఇస్తున్న కథకుని ద్వైధీభావమే ఇక్కడ ప్రశ్నార్థకం అవుతోంది.

 • మహోజస్ మర్రిపూడి says:

  భారతజాతి చరిత్రలో వావి-వరుసల్ని సైతం పట్టించుకోని ప్రాచీన దశ ఒకటుంది. విచిత్రంగా, అది అనాగరిక స్థితిలో కాక, బాగా నాగరికులైన స్థితిలో కూడా కొనసాగింది, ఈజిప్టులో మాదిరే ! ఇందుకు ఆధారాలు మన పురాణసాహిత్యంలో ఇప్పటికీ కనిపిస్తాయి. దాన్తో పాటు అప్పట్లో నలుగురైదుగురు కలిసి ఒకరినే చేసుకోవడం లాంటి వెరైటీలు కూడా చాలా వాడుకలో ఉండేవి. ఆ కాలంవారు దాన్ని తప్పుగా పరిగణించలేదు. ఈ తప్పొప్పులూ, ధర్మాధర్మాల చర్చ అంతా తరవాతి కాలంలో – అంటే కట్టుబాట్లు బాగా బిగుసుకుపోయిన కాలంలో మొదలయ్యాయి. తమ సమాజానికి వావి-వరుసలు లేని దశ ఒకటి ఉండేదని తెలీక, వారు ఆ ఐతిహాసిక గాథల్ని తమకు తోచిన పద్ధతిలో, తమ సమకాలీన పరిజ్ఞానంతో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలోనే కల్లూరి భాస్కరం గారు ఉదాహరించిన నానారకాల సమర్థనల్ని కనుగొన్నారు.

  • కల్లూరి భాస్కరం says:

   స్పందనకు ధన్యవాదాలు మహోజస్ గారూ…

 • hari.S.babu says:

  అద్భుతం, నాకు ఇలాంటివి తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం!

  గణ సంస్కృతిలో ఇంకా చాలా విషయాలు ఉంటాయి.మాతృస్వామ్య వ్యవస్థలో నైతే తల్లి తన కొడుకుల్లోనే తనకు నచ్చిన వాణ్ణి జంటగా యెన్నుకోవదమూ ఉంటుంది, కానీ అప్పుడు అలా చేసారు గాబట్టి ఇప్పుడూ అలా చేయలేము.వాటి వల్ల యేర్పడిన గందరగోళాల వల్ల వాటిని నిషేధించారు.ఒకసారి వొదిలి వేసి వచిన వాటిని మళ్ళీ తగిలించుకోవదం ఇవ్వాళ్టి కాలంలో చెయ్యలేము.

  • కల్లూరి భాస్కరం says:

   ధన్యవాదాలు హరి ఎస్.బాబు గారూ…మీరన్నట్టు ఒకసారి వదిలేసి వచ్చిన వాటిని మళ్ళీ తగిల్చుకోలేమన్న మాట నిజం. కాకపోతే వాటిని చరిత్రగా చెప్పుకుంటాం, అంతే.

   • hari.S.babu says:

    అవును.ఈ చరిత్రని తెలుసుకోవదం వల్ల పెళ్ళి,వైవాహిక వైవాహిక ధర్మాలు వంటి వాటి గురించి మనం మరింత న్యాయంగా ఆలోచించ వచ్చు.కానీ చర్చకు తీసుకొచ్చే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాఖ్యానించేటప్పుడు బాధ్యతగా ఉండాలి.లేదంటే కొందరు పెడర్ధాలు తీసి నైతిక సూత్రాల్ని భ్రష్టు పట్టించే ప్రమాదం ఉంది.ఇప్పటికే (incestకి సంబంధించినవి)నేను కొన్ని విషయాల్ని వార్తలుగా చదివాను.అటువంటి వాటికి సమర్ధనలుగా ఉపయోగ పడే ప్రమాదం ఉంది మరి!

 • anrd says:

  మోర్గాన్ కన్నా ముందు వ్యాసుడే చెప్పాడు!///////////

  ఒకే ఇంద్రుడు అయిదుగురు ఇంద్రులుగా మారి యమ, వాయు, ఇంద్ర, అశ్వినీ దేవతల అంశతో పాండవులుగా జన్మించడం గురించి వ్యాసుడు చెప్పాడు.

  ‘మనుష్యధర్మా’న్ని కూడా జోడిస్తే తప్ప పైన చెప్పిన దేవధర్మం, దైవకార్యాలను .. సామాన్య జనం …. నమ్మరని వ్యాసుడికే అనుమానం వచ్చినట్టుంది. దాంతో దేవధర్మం అనే మెట్టు మీదనుంచి మనుష్యధర్మం అనే మెట్టు మీదికి వచ్చి ఉంటారు.

  ‘తొల్లింటి మహాత్ములయందును నిట్టి చరితంబులు గలవు గావున…’అన్నంత మాత్రాన సమాజంలో అందరూ అలా ఉంటారని , ఈ అతికొద్ది ఉదాహరణలు ఒకప్పటి గణవివాహదశకు సాక్ష్యం అని కానీ అనుకోవటానికి అవకాశం లేదు.

  ఈ రోజుల్లో కూడా మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో , ఒకే స్త్రీ ఒక ఇంట్లోని అన్నదమ్ములను వివాహం చేసుకోవచ్చనే ఆచారం ఉందట. అంతమాత్రం చేత ఇప్పుడు దేశమంతా గణవివాహ దశ లేక ఒకే స్త్రీని పలువురు పురుషులు పెళ్లిచేసుకోవడం అనే పద్ధతి అమలులో ఉందని అర్ధం కాదు కదండి.

  ‘దేవధర్మం, దైవకార్యం లాంటివి దేవతాంశలు కలిగిన కుంతీదేవికి, ద్రౌపదికి వర్తిస్తాయి కానీ జటిలు డనే ఋషి కూతురుకు , దాక్షాయణి అనే ఆమెకు వర్తించకపోవచ్చు. వాళ్ళు ఎక్కువమంది పురుషులను వివాహం చేసుకోవటం వెనుక ఏ కారణాలు ఉన్నాయో ఎవరికి తెలుసు ?

  రామాయణంలో దశరధుడు ఎక్కువ వివాహాలు చేసుకోవటాన్ని గమనిస్తే పితృస్వామ్యం అనిపిస్తుంది. అదే సమయంలో కైకేయి ప్రభావాన్ని గమనిస్తే మాతృస్వామ్యం కూడా కనిపిస్తుంది.

  భారతంలో ద్రౌపది ఎక్కువ వివాహాలు చేసుకుందని మాతృస్వామ్యం అనలేము. ధృతరాష్ట్రుడు, పాండురాజు రెండు వివాహాలను చేసుకున్నారని పితృస్వామ్యం అనీ అనలేము.

  ఏ కాలంలోనైనా పితృస్వామ్యం మాతృస్వామ్యం కలిసే ఉంటాయి.

 • anrd says:

  రామాయణం, భారతం ……….ముందే ఒక ప్రణాళిక ప్రకారం దైవం ఈ కధలు నడిపించారని పెద్దల ద్వారా తెలుసుకున్నాము.
  భూమిపై పాపుల భారం తగ్గించుటకై భారతయుద్ధం జరిగిందని, రావణాసురుని వధ కొరకు రామావతరణం జరిగిందని పెద్దలు చెబుతారు.
  రామాయణ, భారత కధలను దైవం ఇలా చాకచక్యంగా నడిపించటానికి ఎన్నో కారణాలున్నాయని అనిపిస్తుంది.
  భూమిపై దుష్టులను సంహరించాలంటే దైవానికి చిటికెలో పని.
  దైవం తలచుకుంటే రామాయణంలో సీతాపహరణం ………భారతంలో కురుక్షేత్రం సంగ్రామం జరగవలసిన అవసరం లేదు.
  శ్రీరామునికి, శ్రీ కృష్ణునికి కూడా దుష్టులను సంహరించటం పెద్ద పనేమీ కాదు.
  రాజ్యవిస్తరణ మిషతో రాములవారు రావణాసురుని చంపవచ్చు.
  శ్రీకృష్ణుడు కూడా యుద్ధం చేసి దుష్టులైన రాజులను చంపవచ్చు.
  ( పరశురాముడు ఒక్కరే ఎందరో క్షత్రియులను చంపటం జరిగింది కదా ! )

  ఇంకా ఈ కధల ద్వారా, అందులోని వారి జీవితాల ద్వారా రాబోయే తరాలవాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.
  ఇందులోని కధల ద్వారా మానవ జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఉదా.శకుంతల కధ.
  తెలిసీతెలియని యుక్తవయసులో జాగ్రత్తగా ఉండాలని స్పష్టంగా పిల్లలకు చెప్పటానికి పెద్దలకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.
  శకుంతలా దుష్యంతుల వంటి కధల ద్వారా పిల్లలు ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చు.

  ఇవేకాక , కొన్ని ప్రత్యేకపరిస్థితుల్లో తప్ప , ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకోవటం వల్ల సుఖాల కన్నా కష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది.
  ఉదా… రామాయణంలో కైకేయికి మంధర ప్రబోధం వల్ల రామాయణం ఒక పెద్ద మలుపు తిరిగింది.

  భారతంలో సత్యవతీదేవి తండ్రి అయిన దాశరాజు కోరిన కోరికల వల్ల భీష్ముడు రాజ్యాధికారానికి , వివాహానికి దూరంగా ఉండటం భారతంలో ఒక పెద్ద మలుపు.

  బోలెడు పెళ్ళిళ్ళు చేసుకుని కొత్త సమస్యలు సృష్టించుకునేకన్నా , ఉన్న జీవితాన్ని తృప్తిగా గడిపితే చాలు అని కూడా ఈ కధల ద్వారా తెలుసుకోవచ్చు అనిపించింది.

 • కల్లూరి భాస్కరం says:

  anrd గారూ…మీరు చాలా వ్యాసాలపై మీ స్పందన తెలియజేశారు. అన్నింటికీ ఇక్కడే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక కోణం నుంచి మీరు అర్థం చేసుకున్నట్టూ అర్థం చేసుకోవచ్చు. కానీ నాది భిన్న కోణం. కనుక మీ స్పందనలపై ఇంతకు మించి నేను చెప్పగలిగింది ఏమీ కనిపించడం లేదు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)