‘నియోగ’ సంతానం…ఓ మపాసా(?) కథ…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

చెహోవ్ తర్వాత…బహుశా చెహోవ్ తో సమానంగా… నేను (నాలా ఇంకా చాలామంది) అభిమానించే మహాకథకుడు గయ్ డి మపాసా. చాలా ఏళ్లక్రితం చదివిన ఆయన కథ ఒకటి ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ కథ పేరు The Legacy అని ఓ బండ జ్ఞాపకం. నా దగ్గర ఉన్న మపాసా కథల పెద్ద సంపుటాలు రెండింటిలో ఆ కథ కోసం వెతికాను. ఆ పేరుతో ఏ కథా కనిపించలేదు. ఇంటర్నెట్ లో గాలించాను. అందులోనూ కనిపించలేదు. నా దగ్గర ఉన్న అన్ని పుస్తకాలనూ శోధిస్తే ఆ కథ ఉన్న సంపుటం దొరుకుంతుందేమో తెలియదు. ఇంతకీ ఆ కథ ఆయన రాసిందా, ఇంకొకళ్లు రాసిందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అయినా, ప్రస్తుత సందర్భానికి సరిపోయేమేరకు అందులోని ఇతివృత్తం గుర్తుంది కనుక ఆ వెతుకులాటను, అనుమానాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ వ్యాసం ప్రారంభిస్తున్నాను…

బాగా ఆస్తిపాస్తులు ఉన్న ఒక వృద్ధ వితంతువు. ఆమెకు యుక్తవయసు వచ్చిన ఓ మనవరాలు. ఒక ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడూ, ఆమే ప్రేమించుకున్నారు. ఆమె నాయనమ్మ(అమ్మమ్మ?) దగ్గర పెళ్లి మాట తెచ్చింది. ఏ కొద్దిపాటి ఆస్తీ లేని ఓ గుమస్తాకు మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత తర్వాత మెత్తబడింది. వారి పెళ్ళికి ఒప్పుకుంటూనే ఒక షరతు పెట్టింది. రెండేళ్లలో(ఒక ఏడాదిలోనేనా?) తనకు పండంటి ముని మనవణ్ణి (మునిమనవరాలినా?) ఇస్తేనే నా ఆస్తి నీకు దక్కుతుందని మనవరాలితో చెప్పింది. ఆమేరకు విల్లు కూడా రాయించింది.

పెళ్లయిపోయింది. అప్పటినుంచీ ఆ అబ్బాయిలో(బహుశా అమ్మాయిలో కూడానా?) ఆస్తికి సంబంధించిన టెన్షన్ మొదలైపోయింది. గడువులోపల తాము ఆ వృద్ధురాలి షరతు నెరవేరిస్తేనే ఆస్తి దక్కుతుంది. వాళ్ళిద్దరూ కలసుకున్నప్పుడల్లా ఆస్తి గురించిన టెన్షన్ దే పై చేయి కావడం ప్రారంభించింది. ఇంకేముంది? వారిద్దరి మధ్య శారీరకమైన కలయిక అసాధ్యమైపోతూ వచ్చింది. తమ మధ్య ఆ సంబంధం కలగడానికి వారు చేయని ప్రయత్నం లేదు. హానీమూన్ కు సరే, ఎలాగూ వెడతారు. ఆ తర్వాత కూడా శృంగారోద్దీపనకు సాయపడుతుందనుకునే ప్రతి ప్రదేశానికీ వెళ్లారు. ప్రతి చిట్కానూ ఉపయోగించారు. ఫలితం శూన్యం.

ఈలోపల రోజులు, మాసాలూ గడిచిపోతున్నాయి. టెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోతోంది. అలా ఉండగా ఒక రోజున వారి ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు. ఆమె గర్భవతి అయింది. మగపిల్లవాడిని(లేక ఆడపిల్లనా?) ప్రసవించింది. ఉయ్యాలలో వేసినప్పుడో, నామకరణం చేసినప్పుడో గుర్తులేదు కానీ స్నేహితులను, బంధువులనూ పిలిచి వేడుక జరుపుకున్నారు.

అయితే పసివాడిలో(లేదా పసిదానిలో) తండ్రి పోలికలు మచ్చుకైనా కనిపించడం లేదని వచ్చినవాళ్లు గుస గుసలాడుకున్నారు.

ఆ దంపతులలో మాత్రం కొండంత బరువు దిగిపోయినట్టు పెద్ద రిలీఫ్. మొత్తానికి గడువులోపల తాము వృద్ధురాలి కోరిక తీర్చారు. అంతకంటే ముఖ్యంగా, ఆస్తి దక్కింది!

ప్రేమ గొప్పదే, అంతకన్నా డబ్బు గొప్పదని చెప్పడం కథకుడి ఉద్దేశమైనట్టు తెలిసిపోతూనే ఉంది. కథనం ఎంతో హాస్యాన్ని, ఉత్కంఠనూ పండిస్తూ సాగిపోతుంది. దానిని అలా ఉంచుదాం. ఇందులో మనకు కావలసిన ఒక ముఖ్యమైన వివరం ఉంది: అది, మన పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్ర ప్రసిద్ధమైన ‘నియోగం’! ఇక్కడ మనవరాలు, ఆమె భర్తా కలసి సంతానం కన్నది ‘నియోగ పద్ధతి’లోనే. కాకపోతే అది రహస్య నియోగం. అది కూడా ఆస్తి కోసం.

1951

తన కోడళ్ళు అంబిక, అంబాలికలకు నియోగపద్దతిలో సంతానం ఇవ్వమని సత్యవతి తన కొడుకైన వ్యాసుణ్ణి పురమాయించడం మనకు తెలుసు. అలాగే, నియోగ పద్ధతిలో తనను సంతానవంతుణ్ణి చేయమని పాండురాజు తన పెద్ద భార్య అయిన కుంతిని ప్రార్థించాడు. ఇలా నియోగ పద్ధతిలో సంతానం కనమనో, లేదా ఇవ్వమనో కోరిన ఉదాహరణలు మహాభారతంలో ఇంకా ఉన్నాయి.

‘నాకు కొడుకులను ఇవ్వు’ అని కుంతిని పాండురాజు చేతులు జోడించి మరీ ప్రార్థించేముందు వారిద్దరి మధ్యా కొంత సంభాషణ జరుగుతుంది. అందులో కూడా దేవధర్మమూ, పురాచరిత్ర రూపంలోని మనుష్యధర్మమూ కలగలసి కనిపిస్తాయి. అందులోకి వెళ్ళే ముందు అసలు ఏం జరిగిందో ఒకింత ముందునుంచీ చెప్పుకుందాం:

అన్న ధృతరాష్ట్రుడు రాజ్యం చేస్తున్నాడు. తమ్ముడు పాండురాజు దండయాత్రలు చేసి, రాజులను జయించి, గొప్ప గొప్ప ధనరాశులు తెచ్చి అన్నగారికి ఇచ్చాడు. అయితే, తండ్రి విచిత్రవీర్యుడిలానే పాండురాజుకు స్త్రీ లోలత్వం ఎక్కువ. దానికి తోడు వేట వ్యసనం. భార్యలు కుంతి, మాద్రులతో కలసి అతను వనవాసం చేస్తూ వేటతో వినోదిస్తూ ఉండేవాడు. తమ్ముడికి అవసరమైన సంభారాలన్నీ ధృతరాష్ట్రుడు అడవికే పంపిస్తూ ఉండేవాడు.

అలా ఉండగా ఓ రోజున పాండురాజు యథావిధిగా వేటకు వెళ్ళాడు. ఒక్క మృగమూ కనిపించలేదు. దాంతో అతనికి కోపం వచ్చింది. అంతలో ఒక లేడి జంట మన్మథవాంఛతో క్రీడిస్తూ కనిపించింది. పాండురాజు కఠినహృదయంతో వాటి మీద బాణాలు ప్రయోగించాడు. అవి కుప్ప కూలిపోయాయి.

వాటిలో కొనప్రాణంతో ఉన్న మగమృగం పాండురాజుతో మనిషిలా మాట్లాడుతూ,’నేను కిందముడనే మునిని. ఈమె నా భార్య. ఈ కీకారణ్యంలో మేమిద్దరం మృగరూపం ధరించి రతిసౌఖ్యాన్ని అనుభవిస్తుండగా మామీద బాణాలు ప్రయోగించావు. వేట రాజుల కర్తవ్యం కనుక మృగరూపంలో ఉన్న మమ్మల్ని నువ్వు చంపడంలో తప్పులేదు. అయితే చూశావూ… కేవలం ఆహారం కోసమే వేటాడే ఎరుకలు కూడా రతిక్రీడలో ఉండి పరుగెత్తలేని స్థితిలో ఉన్నమృగాలనూ, ప్రసవించే మృగాలనూ, రోగంతో బాధపడే మృగాలనూ చంపరు. అలాంటిది, ధర్మం తప్పరని పేరు పొందిన భరతాది రాజుల వంశంలో పుట్టి కూడా ఈ అధర్మాన్ని నువ్వు ఎలా చేశావు?’ అన్నాడు.

ఆ మాటతో పాండురాజుకు కోపం వచ్చింది. ‘శత్రువుల నైనా క్షమించి విడిచిపెడతారు కానీ, మృగాలు కనిపిస్తే రాజులు చంపకుండా వదలరు. నమ్మించి చంపినా, మాయాబలంతో చంపినా తప్పవుతుంది కానీ; ఇలా చంపడం తప్పుకాదు. పూర్వం అగస్త్యముని మృగమాంసంతో నిత్యశ్రాద్ధం చేస్తూ, మృగాలను చంపడం రాజులకు దోషం కాదని నిర్ణయించాడు. ఇందుకు నన్ను ఎలా నిందిస్తావు?’ అన్నాడు.

బాణపు నొప్పితో గిల గిల లాడిపోతున్న ఆ మృగం,సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన రతిసుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో నిరపరాధులమైన మమ్మల్ని చంపావు కనుక, నువ్వు కూడా ఇలాగే నీ భార్యతో సంగమించేటప్పుడు మరణిస్తావు. నీ భార్య కూడా నిన్ను అనుసరిస్తుంది’ అని శపించాడు. ఆ తర్వాత ఆ మృగదంపతులు కన్ను మూశారు.

ఇక్కడ రెండు కారణాల చేత కథకుడికి చేతులెత్తి మొక్కుతున్నాను. మొదటిది, రతిసౌఖ్యాన్ని అనుభవిస్తున్న, ప్రసవిస్తున్న, రోగంతో బాధపడుతున్న మృగాలను; కేవలం ఆహారం కోసమే వేటాడే ఎరుకలు కూడా చంపరని అనడం. రాజులకు వేట కర్తవ్యం అంటూనే కథకుడు ఎరుకలను వారికంటే ఉన్నతులుగా చూపిస్తున్నాడు. కేవలం వినోదం కోసం వేటాడే రాజుల తీరును గర్హిస్తున్నాడు. తిరుమల రామచంద్రగారు ‘హంపీ నుంచి హరప్పా దాక’ అనే స్వీయచరిత్రలో వినోదం కోసం జంతువులను చిత్రహింస పెట్టడంలోని అమానుషత్వాన్ని ప్రత్యక్షసాక్ష్యంతో చిత్రిస్తారు.

ఇక రెండవది, అంతకంటే ఆశ్చర్యచకితం చేసేది,‘సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన రతిసుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో…(సర్వప్రాణులకు సాధారణంబయి ఇష్టంబగు సుఖావసరంబున నున్న మమ్ము…) అనే మాట మృగంతో అనిపించడం! విశేషమేమిటంటే, ఇదే మాటను కథకుడు మరి కొన్ని సందర్భాలలో మరికొందరి నోట అనిపిస్తాడు. తనకు కొడుకులను ఇమ్మని కుంతిని అడిగిన సందర్భంలోనే పాండురాజు ధర్మబద్ధమైన ఒక పురాణ కథ చెబుతాను విన మంటూ,‘పూర్వం స్త్రీలు పురుషుని అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా సంచరిస్తూ అఖిల ప్రాణి సాధారణంబైన ధర్మంబున తమ తమ వర్ణాలలో ఋతుకాలం తప్పకుండా స్వపురుషులతోనూ, పరపురుషులతోనూ సంబంధం పెట్టుకునే వారని అంటాడు. ఆ తర్వాత దానిని ఎలా నిషేధించారో వివరిస్తూ ఒక కథ చెబుతాడు.

అదేమిటంటే, ఉద్దాలకుడనే ముని ఉండేవాడు. అతని భార్య గొప్ప సాధ్వి. వారికి శ్వేతకేతు డనే కొడుకు. అతను తపస్సంపన్నుడు. అలా ఉండగా, అతని తల్లి ఋతుమతి అయింది. అప్పుడు ఒక వృద్ధవిప్రుడు వారింటికి అతిథిగా వచ్చాడు. కొడుకులు లేని ఆ విప్రుడు కొడుకుకోసం ఉద్దాలకుని భార్య పొందు కోరాడు. దాంతో శ్వేతకేతుకు కోపం వచ్చింది. ఇది ధర్మవిరుద్ధమనీ, ఇకనుంచీ స్త్రీలు పరపురుషులతో సంబంధం పెట్టుకోడానికి వీల్లేదనీ, పెట్టుకుంటే సకలపాపాలూ చుట్టుకుంటాయనీ, మనుషులందరికీ ఈ విధమైన కట్టడి చేస్తున్నాననీ ప్రకటించాడు.

మరో సందర్భం చూద్దాం. తన కొడుకు విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత కురువంశానికి నువ్వు ఒక్కడివే మిగిలావు కనుక రాజ్యపాలన చేపట్టి, వివాహం చేసుకుని, సంతానం కనమని భీష్ముడితో సత్యవతి అంటుంది. అందుకు నిరాకరించిన భీష్ముడు,‘దేవరన్యాయం’తో, అంటే నియోగ పద్ధతిలో విచిత్రవీర్యుని భార్యలకు సంతానం కలిగించే మార్గం ఉందని అంటూ దీర్ఘతముడనే ముని గురించి చెబుతాడు.

మమత అనే స్త్రీకి ఉతథ్యుడనే ముని వల్ల కలిగినవాడు దీర్ఘతముడు. అతను తల్లి కడుపులో ఉన్నప్పుడు బృహస్పతి వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. అతడు ‘దేవరన్యాయం’తో మమత పొందు కోరాడు. కడుపులో ఉన్న దీర్ఘతముడు కోపించి, ఇది ధర్మవిరుద్ధమంటూ అడ్డుచెప్పాడు. అందుకు ఆగ్రహించిన బృహస్పతి ‘సర్వభూతేప్సితమైన’ ఈ కార్యంలో నాకు అడ్డు చెప్పావు కనుక పుట్టుగుడ్డివి కమ్మని శపించాడు. అందుకే అతనికి దీర్ఘతముడనే పేరు వచ్చింది.

విచిత్రం ఏమిటంటే, తన తల్లిని బృహస్పతి కాంక్షించడం ధర్మవిరుద్ధమని అడ్డుచెప్పిన ఈ దీర్ఘతముడే సంతానం లేని బలి అనే రాజు కోరిన మీదట అతని భార్యకు ‘దేవరన్యాయం’తో సంతానం ఇస్తాడు. సరే, అది వేరే కథ. ‘మామతేయుడు’, అంటే మమత కుమారుడు అనిపించుకున్న దీర్ఘతముడు మాతృస్వామ్య వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండచ్చని కోశాంబీ అంటారు.

ప్రకృతి సహజమైన లైంగిక సుఖాన్ని ‘సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’గా,‘అఖిలప్రాణి సాధారణంబైన ధర్మం’గా,‘సర్వభూతేప్సితమైన’, అంటే అన్ని ప్రాణులూ ఇష్టపడే కార్యంగా మహాభారత కథకుడు చెప్పడం నాకు ఎంతో అపురూపంగానూ, ఊహల్లో ఒకవిధమైన తాజాదనాన్ని నింపేదిగానూ అనిపిస్తుంది. ఈ చిత్రణ ప్రకృతి అంత సహజంగానూ, సూక్ష్మంగానూ ఉంది. మన పూర్వులు మనిషి సహజాతాలుగా ఆహార, నిద్రా, భయాలతో కలిపి మైథునాన్ని కూడా చెప్పడంలోనూ ఈ ప్రకృతిసహజత్వమే ఉన్నట్టుంది. కాలగతిలో జరిగింది ఏమిటంటే, లైంగిక సుఖాన్ని ఒక అవసరమైన సుఖంగా, సర్వప్రాణిధర్మంగా గుర్తించడం కూడా మరచిపోయే స్థాయికి ఆ మాట నిషిద్ధపదాల జాబితాలో అట్టడుగుకు చేరిపోవడం. సమాజం, కట్టుబాటు, నీతి, న్యాయం లాంటి అనేకానేక పొరల మాటున ‘లైంగిక సుఖం’ గురించిన మౌలిక భావన మటుమాయమైపోయింది. లైంగిక సుఖం అనే మాట చుట్టూ రకరకాల మందమైన పొరలు చుట్టుకుంటూ పోయిన అనుభవంనుంచి చూసినప్పుడు;‘సర్వప్రాణి సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’గా,‘అఖిలప్రాణి సాధారణ ధర్మం’గా,‘సర్వభూతేప్సిత కార్యం’గా చెబుతున్న మన పూర్వులు లైంగిక సుఖాన్ని ప్రకృతికి అతి దగ్గరగా, ప్రకృతిలో భాగంగా; ఎటువంటి ఆచ్ఛాదనలూ లేని ఒక వినిర్మల, స్వచ్ఛ, పవిత్రధర్మంగా చూశారా అనిపిస్తుంది.

లైంగికవాంఛ విషయంలో ఒక కట్టడి, ఒక పరిమితి, ఒక హద్దు తప్పనిసరిగా ఉండవలసిందే. ఇక్కడ విషయం అది కాదు. పెండ్యులం ఒకవైపునుంచి, పూర్తిగా దానికి వ్యతిరేకమైన దిశకు తిరిగిపోవడం. అంటే సమతూకం లోపించడం. లైంగికత్వాన్ని కేవలం ప్రకృతిధర్మంగా అర్థం చేసుకోవడమనే పురాకాలపు ఒక పరాకాష్ట(extreme)నుంచి, లైంగికత్వాన్ని కేవలం ఒక సామాజిక నియతిలో భాగంగా చూసే మరో పరాకాష్టకు పయనించడం. ఆవిధంగా ప్రకృతిధర్మానికి, సామాజికధర్మానికి మధ్య తూకం తప్పిపోయింది. దీని పర్యవసానాలను మనం ఇప్పుడు బహుముఖంగా చూస్తున్నాం.

స్త్రీ-పురుష సంబంధాలు, స్త్రీ శీలం, లైంగికతల విషయంలో మన పూర్వులు నేటి మన ఊహకు అందని, విచిత్రంగా కూడా అనిపించే సువిశాలమైన, వైవిధ్యవంతమైన పరిస్థితితో తలపడ్డారని అన్నది అందుకే.

ప్రస్తుతానికి వస్తే,‘సర్వప్రాణి సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’,‘అఖిలప్రాణి సాధారణ ధర్మం’,‘సర్వభూతేప్సిత కార్యం’ అనడంలో కథకుడు లైంగికతకు చెందిన పురాచరిత్రను కూడా చెబుతున్నాడు. కుంతి-పాండురాజు సంభాషణలో అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

***

చనిపోయిన ఆ మృగదంపతులను చూసి పాండురాజు బాధపడ్డాడు. అతనిలో పశ్చాత్తాపంతోపాటు వైరాగ్యమూ కలిగింది. ఎంత గొప్ప కులంలో పుట్టినా కర్మఫలం అనుభవించక తప్పదనుకున్నాడు. ఇక అన్ని బంధాలనూ విడిచిపెట్టి మునివృత్తిని స్వీకరించి, అన్ని ప్రాణులనూ సమబుద్ధితో చూస్తూ, హింసకు దూరంగా శేషజీవితాన్ని గడపాలనుకున్నాడు. కుంతి, మాద్రులకు తన నిర్ణయాన్ని చెప్పి, వారిని హస్తినాపురానికి వెళ్లిపొమ్మని కోరాడు. మేము చావనైనా చస్తాము కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళమని వారు చెప్పారు. అయితే నాతోనే ఉండండని వారికి చెప్పి, తమ దగ్గర ఉన్న అమూల్య మణిహారాలను, ఏనుగులను, గుర్రాలను, గోవులను, ధనధాన్యాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. ఇంకా మిగిలినవాటిని ధృతరాష్ట్రునికి పంపేశాడు.

ఆ తర్వాత, తనలానే తపస్వులుగా మారిన భార్యలిద్దరితో కలసి ఉత్తరదిశగా ప్రయాణం ప్రారంభించాడు. హిమాలయాలను కూడా దాటి, దేవతలు, సిద్ధులు నివసించే గంధమాదన పర్వతం మీద కొంత కాలం ఉండి, అక్కడినుంచి మరింత ముందుకు వెళ్ళి శతశృంగం అనే ప్రదేశానికి చేరుకుని తపస్సు ప్రారంభించాడు.

ఆ శతశృంగం కూడా ఎందరో దేవతలు, సిద్ధులు, యక్షులు నివసించే ప్రదేశం. స్వర్గానికి వెళ్ళే మార్గం అక్కడికి దగ్గరలోనే ఉంది. దివ్యవిమానం మీద వచ్చిపోయే దేవగణాలతో ఆ మార్గం కోలాహలంగా ఉంటుంది. అక్కడి ఉత్తరభాగంలో పాండురాజు తపస్సు చేసుకుంటూ ఉండగా ఓ రోజున వేలాదిమంది మునులు ఆ స్వర్గమార్గంలో పై లోకాలకు వెడుతూ కనిపించారు.

‘ఎక్కడికి వెడుతున్నా’రని పాండురాజు వారిని అడిగాడు.

‘ఈ రోజు అమావాస్య. ఎక్కడెక్కడి ఋషిగణాలు, పితృదేవతలు బ్రహ్మను సేవించుకోడానికి ఈ రోజున బ్రహ్మలోకానికి వెడుతుంటారు. మేము కూడా అక్కడికే వెడుతున్నా’మని వారు చెప్పారు.

అప్పుడు భార్యలిద్దరితో కలసి పాండురాజు వారి వెనక బయలుదేరాడు. మిట్టపల్లాలతో నిండిన ఆ మార్గంలో వాళ్ళు అతి కష్టం మీద నడుస్తున్నారు. మునులు వెనుదిరిగి చూశారు. కుంతి, మాద్రుల కష్టాన్ని గమనించారు.

‘వీళ్ళు అతి కోమలులు. కొండలు, గుహలతో నిండిన ఈ క్లిష్టమైన మార్గంలో వీళ్ళు రాలేరు. కనుక ఇక్కడ ఆగిపొండి. పైగా ఇవి దేవతలు వెళ్ళే దారులు’ అని పాండురాజుకు చెప్పారు.

‘మునులైనా సరే, సంతానం లేనివారు స్వర్గద్వారాన్ని చేరుకోలేరని విన్నాను. పుత్రులు లేని వారికి స్వర్గం లభించదని వేదం చెబుతోంది. నేను కొడుకులు లేని వాణ్ణి. ఏం చేయగలను?’ అని పాండురాజు మునులతో నిస్పృహగా అన్నాడు.

మునులకు అతని మీద జాలి కలిగింది. యోగదృష్టితో జరగబోయేది చూశారు. ‘నువ్వు పుత్రులు లేనివాడివి కావు. దైవకారణంతో నీకు యమ, వాయు, ఇంద్ర, అశ్వినీ దేవతల వరం వల్ల కొడుకులు కలుగుతారు. నీకు అక్షయలోకాలు సిద్ధిస్తాయి. కనుక సంతానం కోసం ప్రయత్నించు’ అని ముందుకు సాగిపోయారు.

ఆగిపోయిన పాండురాజు ఆలోచనలో పడ్డాడు. ‘మనిషి పుడుతూనే దేవ, ఋషి, పితృ, మనుష్యరుణాలనే నాలుగు రుణాలతో పుడతాడు. ఆ రుణాలను తీర్చుకుంటే తప్ప పుణ్యలోకాలు లభించవు. నేను మొదటి మూడు రుణాలనుంచీ బయటపడ్డాను. చనిపోతే అన్ని రుణాలూ తీరిపోతాయి కానీ; శ్రాద్ధాలతోనూ, సంతానంతోనూ తీరే పితృరుణం చనిపోయినా తీరదు. అదెలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. మృగశాపం వల్ల నాకు సంతానం కలిగే అవకాశం లేదు’ అనుకుని దుఃఖించాడు.

ఒక రోజున కుంతితో ఏకాంతంగా మాట్లాడుతూ తన బాధంతా చెప్పి,‘ఇతరమైనవేవీ ఆలోచించకుండా ధర్మబద్ధంగా నాకు సంతానం ఇచ్చే వేరొక మార్గం చూడ’ మని కోరాడు. పన్నెండు రకాల పుత్రుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు:

  1. ఔరసుడు: తన వర్ణానికే చెందిన భార్య వల్ల తనకు కలిగిన కొడుకు ఔరసుడు. 2. క్షేత్రజుడు: తనకు సంతానం లేనప్పుడు నియోగ పద్ధతిలో అర్హుడైన వేరొక పురుషుని ద్వారా తన భార్యకు కలిగే కొడుకు క్షేత్రజుడు. 3. దత్తుడు: వేరొకరి కొడుకును శాస్త్రోక్తంగా దత్తత చేసుకుంటే అతడు దత్తుడు. 4. కృత్రిముడు: తల్లిదండ్రులు లేని అనాధను చేరదీస్తే అతడు కృత్రిముడు. 5. గూఢజుడు: తన భార్యకు పరపురుషుని వల్ల రహస్యంగా కలిగిన కొడుకు గూఢజుడు. 6. అపవిద్ధుడు: తల్లిదండ్రులు విడిచి పెట్టేసినప్పుడు దగ్గరకు తీసి పెంచితే అతడు అపవిద్ధుడు. 7. కానీనుడు: పుట్టింట్లో ఉన్నప్పుడు పెళ్లి కాకుండా కొడుకును కంటే అతడు కానీనుడు.8. సహోఢుఢు: గర్భవతి అని తెలిసో తెలియకో ఒకామెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు కలిగే కొడుకు భర్తకు సహోఢుఢు. 9. క్రీతుడు: ఇంకొకరి కొడుకును కొనుక్కుంటే అతడు క్రీతుడు. 10. పౌనర్భవుడు: భార్యా, భర్తలు విడిపోయినప్పుడు; లేదా భర్త మరణించినప్పుడు భార్యకు ఆ తర్వాత మరొకరి సంబంధంవల్ల కొడుకు పుడితే అతడు ఆమె అసలు భర్తకు పౌనర్భవుడు. 11. స్వయందత్తుడు: తల్లిదండ్రులు లేనివాడు, లేదా తల్లిదండ్రులు వదిలేసినవాడు తనంతట తాను ఇంకొకరికి అమ్ముడుపోతే అతడు స్వయందత్తుడు. 12. జ్ఞాతుడు: అన్నకో, తమ్ముడికో పుట్టినవాడు వరసకు తనకు కూడా కొడుకే. అటువంటివాడు జ్ఞాతుడు.

పన్నెండో రకం పుత్రుడి విషయంలో తేడాలున్నట్టున్నాయి. వర్ణసాంకర్యం వల్ల కలిగిన కొడుకును పారశవుడిగా, పన్నెండో పుత్రుడిగా మనుధర్మశాస్త్రం చెబుతోంది. మొదటి ఆరు రకాల పుత్రులూ బంధువులు, దాయాదులూ అవుతారనీ; చివరి ఆరు రకాల పుత్రులూ బంధువులు మాత్రమే అవుతారనీ పాండురాజు అంటాడు. దాయాదులకు ఆస్తిలో వాటా ఉంటుంది. పాండురాజు ఇంకో మాట కూడా అంటాడు…బంధువులు, దాయాదులు అయిన కొడుకులందరూ ఔరసునికి ఏమాత్రం తక్కువ కారు. వాళ్లలో క్షేత్రజుడు మరింత శ్రేష్ఠుడు. అందులోనూ దేవరన్యాయంతో పుట్టినవాడు ఇంకా శ్రేష్ఠుడు. కనుక నా నియోగంతో ధర్మమార్గంలో క్షేత్రజులను కనవలసిందని కుంతిని కోరాడు.

మిగతా వచ్చేవారం…

 

 

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)