‘ఎగిరే పావురమా!’–మొదటి భాగం

 

my pic 3

రచయిత్రి , కళాకారిణి కోసూరి ఉమా భారతి
రచయిత్రి – శ్రీమతి. కోసూరి ఉమాభారతి Director – Archana Fine Arts Academy, U.S.A కూచిపూడి నృత్య కళాకారిణి, నాట్య గురువు, నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి. ఆంధ్రప్రదేశ్ నుండి సాంస్కృతిక రాయబారిగా ఉమాభారతి దేశావిదేశాలు పర్యటించారు. కళ ద్వారా స్వచ్చంద సమాజసేవకి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు, అవార్డులు పొందారు. చలన చిత్రాల్లో నటించి, నృత్య సంబంధిత చిత్రాలని నిర్మించి, దర్శకత్వం వహించారు. 1982లో హ్యూస్టన్, టెక్సాస్ లో ‘అర్చనా డాన్స్ అకాడెమి స్థాపించారు. శాస్త్రీయ నృత్యరూపక రచనలకి అవార్డులు పొందారు. రచనానుభావం : శాస్త్రీయ నృత్య సంభందిత వ్యాసాలతొ పాటు, పలు నృత్యరూపకాలు రచించి దేశవిదేశాల్లో ప్రదర్శించారు. వాటిల్లో ప్రేక్షకుల ఆదరణ, అవార్డులు పొందినవి – ‘భరత ముని భూలోక పర్యటన’ (తాన మహా మహా సభలు 1998) , ‘అమెరికాలో అనసూయ’, ‘ఈ జగమే నాట్యమయం’ (ఆటా తెలుగు సభలు), ‘తెలుగింటి వెలుగు’, ‘లయగతులు’ (తానా 2002) ‘పెళ్లిముచ్చట’, ‘కన్య’, ‘మానసపుత్రి’ …… ‘భారతీయ నృత్యాలు'(డాకుమెంటరీ), ‘ఆలయ నాదాలు’ (టెలిఫిలిం), ‘రాగం-తానం-పల్లవి’ (శాస్త్రీయ నృత్య టెలిఫిలిం) లకు కాన్సెప్ట్, కొరియాగ్రఫీ, & డైలాగ్ సమకూర్చారు. ఇతర రచనలు: గత రెండేళ్లగా – ప్రవాసాంద్రుల జీవన విధానాన్ని ప్రతిబింబించే వ్యాసాలు, కుటుంబవ్యవస్థ లోని మానవ సహ సంబంధాలు ఇతివృత్తంగా, ఆమె చేసిన నృత్యేతర రచనలు నలభైకి పైగా పలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 2012, 2014 లో వంగూరి ఫౌండేషన్, USA వారి ఉగాది ఉత్తమ రచన పురస్కారం అందుకున్నారు. 2013 లో ‘విదేశీ కోడలు’ కథాసంపుటి వంగూరి వారి ముద్రణగా ‘తాన సభల్లో ఆవిష్కరించబడింది. ‘రాజీ పడిన బంధం’ ఆమె రచించిన తొలి నవల కాగా, ‘సారనగా సాహిత్య పత్రికలో’ జూలై నుండి ప్రచురింపబడుతున్న తొలి ’ సీరియల్ గా ‘ఎగిరే పావురమా!’

నా మాట ….

 

…… మహారాష్ట్రలో కొద్దిమంది గ్రామీణులు తమ ఆడపిల్లకి “నకూసా” అని పేరు పెడతారని మీకు తెలుసా? ‘నకూసా’ అంటే ‘అవాంఛిత’ అని అర్ధం. ‘నకూస’ వద్దంటే పుట్టిన ఆడపిల్ల, చంపేయలేక వదిలేసిన ఆడపిల్ల. ఆ పిల్ల జీవిత పర్యంతం, తానో అవాంఛితనని ప్రకటించుకుంటూ బ్రతికి, అవాంఛితగానే మరణిస్తుందని   మీకు తెలుసా?….(విహంగ పత్రిక – జనవరి 2012)

 

ఆడపిల్ల పుట్టిందన్న నిరాశతో, ఆ పసికందుని చంపారనో, వదిలేసారనో వార్తల్లో విన్నప్పుడల్లా – ఓ నాలుగు మాటలనడమో లేదా బాధపడ్డమో చేసేదాన్ని. కాని ‘నకూసా’ గురించి చదివినప్పుడు చాలా కలవరంగా అనిపించింది. “ఇంతటి అన్యాయం ఎలా సాధ్యం?’ అని జీర్ణించుకోలేక పోయాను. ప్రేమకి, త్యాగాలకి ప్రతిరూపాలు తల్లితండ్రులని నమ్మే నన్ను ‘నకూసా’ గురించిన విషయం ఎప్పుడూ బాధిస్తూనే ఉంటుంది….

ఆ స్పందనే ‘ఎగిరే పావురమా!’ రాయడానికి ప్రేరణ అయింది.

చదివి ఆదరిస్తారని, మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తాను.

….. ఉమాభారతి

 

 

 

 

కోవెలలోని రావిచెట్టు నీడనే, అలవాటుగా నేను కూకునే నా స్థానం.
చీకటితో తలార స్నానాలు చేసి తయారయ్యాక, పొట్టి చక్రాల బండి మీద నన్ను గుడికాడికి తెస్తాడు తాత. గుడివాకిళ్ళు తెరవక మునుపే, మేము అమ్మవారి గడపల్లోకి చేరుకుంటాము.

కోవెల వెనుకనుండి వస్తే తిన్నగా రావిచెట్టు కాడికే చేరుతాం.
వస్తూనే చెట్టుపక్కనున్న కొళాయి నీళ్ళతో మళ్ళీ ముఖం కడిగించి, నా నుదుటిన అమ్మవారి కుంకుమెడతాడు తాత.

“బొట్టెడితే మాలక్ష్మివేనే. వేడుకున్నా పలకని ఆ దేవత కన్నా పలకలేని నీ నవ్వులే నాకు చాలమ్మా,” అంటూ నా తలమీద ముద్దెట్టుకొన్నాకే ఆ దేవుడికి దణ్ణాలెట్టుకుంటాడు తాత.

రావిచెట్టు నీడనున్న అరుగు మీద నన్ను కూకోబెడతాడు.
నా కాళ్ళ చుట్టూ కంబడి కప్పి, నాకు కావాల్సినవన్నీ అందేలా సర్దుతాడు.

“దట్టంగా విస్తరించిన ఈ రావిచెట్టుని చూడు,” అంటాడు తాత ఒక్కోప్పుడు.
“అన్ని వైపులనుండి నీ అరుగుని చేతులతో కాపాడుతున్నట్టుగా ఉందిరా, గాయత్రీ,“ అంటాడు నాతో.

నాకేమో, నా అరుగు సాంతం ఆ రావిచెట్టు పొట్టలో ఉన్నట్టుగా అగుపించి నవ్వొస్తది.
దాని పెద్దపెద్ద కొమ్మలేమో అరుగుకి చుట్టూ కాపలాగా ఉన్నట్టనిపిస్తది.

నేను కూకున్న మేరకు, అరుగుకి దిట్టమైన పైకప్పేసే ఉంది. ఆ చెట్టు నీడన కూకుంటే వానచినుకుల తడి గాని, ఎండవేడి గాని అంతగా నన్ను తాకవు. ముంచెత్తే వానలైతేనే అరుగు తడుస్తది.

బుద్ధి తెలిసిన కాడినుండి – చంద్రం పిన్ని సాయంతో పొద్దు మొదలై, నా జీవనం ఆ రావిచెట్టు నీడనే గడుస్తది. పగలంతా గుడిలో పంచే ప్రసాదాలతోనే నా కడుపు నిండుతది.

**

రోజూ నేను అరుగుమీద చేరిన కాసేపటికే, చీకట్లు పోయి ఎలుగొచ్చేస్తది. సూరీడి ఎలుగులతో పాటే, ఆకాశంలో నుండి సూటిగా నా వైపుకే ఎగిరొస్తాయి పావురాళ్ళు. నా భుజం మీదగా పోయి అడుగులేస్తూ ఒకింత దూరంగా నంచుంటాయి, ‘మేమొచ్చాము’ అన్నట్టు. అవి అట్టా బారుతీరి రోజూ అదే సమయానికి రాడం బాగనిపిస్తది..

నేను చిమ్మిన గింజల్ని, అవి ముక్కులతో ఒక్కోగింజ ఏరుతుంటే, చూస్తూ నా పూల పని మొదలెడతాను…..
**
మా ఊరు గంగన్నపాలెం లోని ‘గాయత్రి’ అమ్మవారి గుడి అది. ‘శ్రీ గాయత్రీ కోవెల’ అంటారు.
గుడి చుట్టూ పెద్ద ఆవరణ. తెల్లారేలోగా ఆ మేరకు శుభ్రం చేస్తాడు తాత.

పూజారయ్య వచ్చినాక, నా ముందు బల్లపీటేసి, అమ్మకానికి దేవుని బొమ్మలు, పూజసామాను, పుస్తకాలు, జపమాలలు, లక్ష్మికాసులు దాని మీద సర్డుతాడు.
అందరు అంటకుండా వస్తువులు కాగితాల్లో చుట్టే ఉంటాయి. వస్తువుల ధరలు రాసిన పలకలు రావిచెట్టుకి కట్టుంటాయి.

సామాను తీసుకున్నోళ్ళు, నా పక్కనే భూమిలోకి దిగేసున్న ‘గుడి హుండీ’లో వాటికి సరిపడా డబ్బులేస్తారు. చీకటిపడ్డాక మాత్రం పూజసామాను గుడిలో పంతులుగారి కాడ తీసుకోవాల్సిందే.

పూజసామాను కొనడానికి వచ్చినోరు కొందరు నాతో నవ్వుతూ మాట్లాడతారు కూడా.
“నీ తేనెరంగు కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా పాపా?” అంటారు.
“నీవు నవ్వితే నీ బుగ్గన చొట్టలు ఎంత ముద్దుగా ఉంటాయో తెలుసా గాయత్రీ?” అంటారు.

నాకు సిగ్గనిపిస్తది.

**

తాతతో పాటు గుడి పనులకి రాములు ఉంది. కోవెల్లో ‘స్వీపరు’గా చాన్నాళ్ళగా పని చేస్తుందంట.
నేను అరుగు మీద చేరగానే పూలబుట్టలు, ఓ చెక్కపెట్టి తెస్తుంది. చెక్కపెట్టిని నాకు మరో పక్కన కాస్త ఎడంగా పెట్టి, పూలబుట్టలు నా ముందుంచుతుంది.

గుడి చెట్ల నుండి కర్వేపాకు, పూజారయ్య ఇచ్చే కొబ్బరిచిప్పలు సంచులకేసి, అమ్మకానికి దారవతల కూరలబడ్డీ కాడికెళ్ళి కూకుంటాడు తాత.

“కాస్త నా బిడ్డని సాయంత్రం వరకు చూసుకోవే రాములు,” అంటాడు తాత బయటకి పోయే ముందు.
“అట్టాగేలే సత్యమయ్యా, బంగారు తల్లి మన గాయత్రి. దానికి అందరూ చుట్టాలే,” అంటది బదులుగా రాములు ప్రతిసారి. రాములు అసలు పేరు రాములమ్మ. ఎప్పుడూ నవ్వుతుండే ఆమెని అందరు ‘రాములు’ అనే పిలుస్తారు. ఆవరణలోనే రావిచెట్టుకి అవతల పెంకుటింట్లో ఉంటది.
ఇంకా ఈడ కొలువు చేసే మిగతా వాళ్ళ గురించి కూడా చెప్పాడు తాత. వాళ్ళే – అర్చకులు పంతులుగారు, గుడి కాపలాదారు నాయుడన్నా.
వాళ్ళు కూడా కుటుంబాలతో రాములు పెంకుటిల్లు ఎనకాలే మిద్దెల్లో ఉంటారు.

ఇక, ఈ కోవెలకే కాదు – మా ఊరిక్కూడా పెద్దదిక్కు, పూజారయ్య సోమయాజులుగారేనంట.
వీధవతల పెద్ద ఇంట్లో ఉంటారు పూజారయ్య కుటుంబం. ……

”గుడి వ్యవారాలన్నీ చూస్తూ, అందరికి మేలు చేసే పూజారయ్యని చుట్టూ ఊళ్ళవాళ్ళు కూడా గౌరవిస్తారు. మంచిమనిషి మన పూజారయ్య,” అంటాడు తాత.
**
ఇక ఇప్పుడు ‘దసరా’ మూలంగా గుడి అవరణ రోజంతా జనంతో కిటకిటలాడుతుంది. ఈ యేడు పూజలకి, ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారని తాత, చంద్రం పిన్ని అనుకున్నారు.
పిన్ని, ఆమె పెనిమిటి – రాంబాబాయి మా పక్క కొట్టాంలోనే ఉంటారు.

“నా చంద్రమ్మ చెల్లికి మనమీద గొప్ప ప్రేమరా గాయత్రి. యేడకీ పోకుండా మనకోసం పక్కనే చిన్న కొట్టంలో వుండిపోయారు పిన్ని వాళ్ళు,” అంటాడు తాత.

“రాంబాబాయి మనకి చుట్టాలబ్బాయవుతాడులే. అందుకే సాయంగా తోడుగా ఉంటాడు,” అంటుంది పిన్ని.

పండుగ పూజలకని ఇంకాస్త పెందరాళే నిద్ర లేపుతున్నాడు తాత.
పొద్దున్నే సాయం చేయడానికి వచ్చే పిన్ని, దసరాపూజలు జరిగినన్నాళ్ళు నాకొకింత ముస్తాబు చేసి మరీ కోవెలకి పంపుతుంది.
**
పండుగ ఆఖరి రోజున అమ్మవారి పూజలకి ఆడోళ్ళంతా ఎర్రరంగు దుస్తులు ఏసుకోవాలంట. పిన్ని నాచేత ఎర్రచుక్కలంచు పరికిణీ, ఆకుపచ్చ జుబ్బా వేయించింది. ఎర్రటి బొట్టు, గాజులతో సహా.

సాయంత్రం జరగబోయే పాటకచేరి-డాన్సు ప్రోగ్రాంల గురించే ఊరంతా చెప్పుకుంటున్నారంది పిన్ని. పాట-డాన్సు చూడాలని నాకూ ఉత్సాహంగా ఉంది.
ఈ గుళ్ళో నేను చూస్తున్న మూడో దసరా ఇది. మొదటిసారి దసరాకి నాకు ఐదేళ్ళంట.

“అందంగా బొమ్మల్లే ఉన్నావే,” తల దువ్వడమయ్యాక, నా బుగ్గలు నొక్కింది పిన్ని.
“పద, పద, ఇకెళ్ళండి. తయారయి నేనూ పెందరాళే వచ్చేస్తా” అంటూ నన్ను, తాతని బయలుదేరదీసింది.
**
గుళ్ళో అడుగు పెడుతూనే, రాములు నీళ్ళ బిందెతో ఎదురుబడ్డది.
జాప్యం లేకుండా పనులు చకచకా జరగాలన్నాడు తాత, మాతో.

రాములు తెచ్చిన ఐదు బుట్టల పూలు విడదీసి, గుట్టలుగా పోసుకొని పని మొదలెట్టాము. తొడిమలు తీసి, కాడలు కత్తిరించి నేను పూలని బుట్టకేస్తుంటే, అరుగుల మధ్య గింజలేరుతున్న పావురాళ్ళని గమనిస్తూ మాలలు కడుతుంది రాములు.

“ఆ చిన్నగువ్వలు నీకు మల్లేనే ముద్దుగా, బొద్దుగా ఉన్నాయి కదూ,” అంటూ వాటికి మరో గుప్పెడు గింజలు చిమ్మిందామె.
అట్టా అన్నందుకు తల వంచుకొని నేను కోపం నటించాను.

“అబ్బో, మా గాయత్రి బుంగమూతి ఎంత ముద్దుగా ఉందో, ఇయ్యాల చేతులకి గాజులు, కాళ్ళకి పట్టాలెట్టి, గువ్వపిట్టల్లె సక్కగా ఉంది పిల్ల,” అంటూ నా నెత్తిన మొట్టింది. ఇద్దరం నవ్వుకున్నాం.

రాములుకి నేనంటే ప్రేమని ఎరుకే. ఎప్పుడన్నా నా జడ కుదరకపోతే, పనులయ్యాక కబుర్లాడుతూ మళ్ళీ జడేస్తుంది..

రాములు, తాత కూడా రోజూ కాసేపు కబుర్లు చెప్పి నన్ను నవ్విస్తుంటారు.
నాకెన్నో సంగతలు తెలిసేలా ఇవరంగా చెబుతారు.
తిరిగి నేనూ ఏదైనా అన్నా, నా సైగలని తెలుసుకునేది తాతతో పాటు రాములు, చంద్రం పిన్నే.

మధ్యానాలు గుడి తలుపులు మూసాక, ఒక్కోమారు కాసిన్ని బొరుగులు తెచ్చిచ్చి, పక్కనే కూకుని, కథలు చెబుతూ చక్కని బొమ్మలు కూడా గీస్తుంది రాములు. దగ్గరుండి చూసినా నాకు ఆమెలా బొమ్మేయడం చాతవలేదు.

ఇట్టా రాములు గురించే అనుకుంటూ పూలపని ముగించేప్పటికి, ఆమె దండలు కట్టడం కూడా అయినట్టుంది.

“ఏయ్ గాయత్రి, ఏమంతగా ఆలోచన? పండుగపూట, చకచకా పనులు కానీమన్నాడుగా తాత ! నీ పూలిటియ్యి, అన్ని దేవుళ్ళకి అందించాలి,“ అంటూ నా కాడి పూలు కూడా కలిపి నాలుగు బుట్టలకేసి, ఆవరణలోనే ఎడంగా ఉన్న చిన్నగుళ్ళ వైపుగా కదిలింది.
**
రాములు కాళ్ళకెట్టిన మువ్వల చప్పుళ్ళు వింటూ ఆమె వంకే చూసాను. పండుగ ముస్తాబుగా కళ్ళనిండా కాటుకెట్టి, చేతులకి రంగురంగుల మట్టి గాజులేసింది రాములు. కడియాలు, ముక్కెరతో సహా.
‘ఎన్ని గాజులో! ఎన్ని రంగులో! చూడ్డానికి బాగున్నయి. రాములు ముస్తాబే కాదు – నాకు ఆమె చెప్పే కథలు కూడా బాగుంటయి’ అనుకుంటూ అరుగు మీద చిందరవందరగా పడున్న తొడిమలు, కాడలు, రాలిన ఆకులు అందినంత మేరకు బుట్టకెయ్యడం మొదలెట్టాను.
కోవెలకి వచ్చినోళ్ళందరూ రాములుతో ప్రేమగా మాట్టాడుతారు. నాకే కాదు, రాములంటే అందరికీ ఇష్టమే. ఆమె చిరకాల స్నేహితులు – సుబ్బి, మాణిక్యం. ఒక్కోప్పుడు గుడికొచ్చి కాసేపు ఆమెకి కబుర్లు చెప్పి పోతుంటారు.

రాములు గురించి అనుకుంటూ నా చుట్టూ ఉన్న అరుగంతా శుభ్రం చేసేసాను.
ఇంతలో బుట్టెడు పత్తి తెచ్చి నా ముందుంచింది రాములు.

“పండుగలు కదా! ఎన్ని వొత్తులైనా చాలడం లేదు. పంతులుగారికి ఇంకా వొత్తులు కావాలంట,” అంటూ పక్కనే కూకుంది.
సగం పత్తి విడదీసి తన ముందేసుకొని, “ఏమాలోచిస్తున్నావు? అడిగింది నా వంక చూస్తూ…

‘నీ గురించే,’ అని సైగ చేసాను.
నా చెవి పిండింది రాములు. “తిన్నగా ఎనిమిదేళ్ళు లేవు నీకు. నా గురించి ఆలోసించేంత పెద్దదానివా? పని కానీయ్,” అంది తనూ నవ్వుతూ.

“చేతిలో పనయ్యాక నీ జడలోకి మల్లె చెండు కడతాలే,” అంది.
ఇద్దరం వొత్తులు చేయడం మొదలెట్టాము.
**
సాయంత్రం పండుగ సంబరాలకి సుబ్బి, మాణిక్యం సహా చాలా జనం వచ్చారు.
పాట కచేరి – డాన్స్ మొదలయ్యాయి.

నా ఈడు ఆడపిల్లలు అందంగా అమ్మవారికి మల్లేనే తయారయి, కాళ్ళకు గజ్జెలు కట్టి – అందంగా ఆడుతున్నారు. మధ్యమధ్యలో నాకన్నా చిన్న కూనలు గొంతెత్తి, కీర్తనలు… దేవుని పాటలు – తాళమేసి మరీ పాడుతున్నారు. జనాలు మెచ్చుకుంటున్నారు.

డాన్సులు చూస్తూ పాట వింటుంటే, వాళ్ళకు మల్లే నేనెందుకు ఆడలేనని – ఈ తడవ మరింత నిరాశగా అనిపించింది.
అసలెందుకు కదలలేనని దిగులుగా అయిపోయాను.
ఇట్టా నా ఈడువాళ్ళు పట్టుపరికిణీలు వేసి పరుగులెట్టడం చూసినప్పుడల్లా, నాకూ వాళ్ళలా పరిగెట్టాలనిపిస్తది. నా అరికాళ్ళు చీమలు పాకినట్టుగా చిమచిమలాడతాయి.
బొద్దుగా కనబడినా నడువలేవు నా కాళ్ళు. కావలసినప్పుడు చేతుల సాయంతోనే నేల మీద కాస్త దూరం మెసలగలను. సాయం పడితే, పైకి లేచి కొంత దూరం గెంతుతూ కదలగలను.

నా ఆసరా కర్ర ఎప్పుడూ నాతోనే ఉన్నా కదలడానికి మరొకరి సాయం ఉండాలి. ప్రతిరోజూ నాకు సాయం పట్టి, “ఇంకోమారు, మరోమారు,” అంటూ నన్ను అరుగుల చుట్టూత తిప్పుతది రాములు.

నా ఈడు వాళ్ళలా చిలుకల్లె పలుకలేను. దేవుని ముంగిట గొంతెత్తి పాడనూలేను.
అందరిలా నేనూ పలకాలనీ, పాడాలనీ కష్టపడ్డప్పుడల్లా గొంతు మంటెట్టి, నొప్పెట్టి కన్నీళ్ళొస్తయి.

‘అ, మమ్, మ, ఉమ్’ అని మాత్రమే శబ్దాలు చేస్తది నా గొంతు.
ఎప్పుడన్నా కష్టంగా తోచి గట్టిగా అరవాలనిపిస్తది కూడా.

‘అంతకన్నా ఏం చెయ్యగలను, ప్చ్,’ అనుకుంటూ తలొంచుకొని ఉండిపోయిన నా భుజంమీద ఎవరో తట్టారు. తిరిగి చూస్తే చేతిలో ప్రసాదాలతో పిన్ని.

“అట్టా చూస్తూండిపోయావేరా? అలిసిపోయావా? లోన పూజ ముగిసి హారతి ఇవ్వడం కూడా అయ్యిందిలే,” అంటూ ప్రసాదం అందించింది పిన్ని.
“కళ్ళకద్దుకొని తినేసెయ్యి. ఇంక ఇంటిదారి పడదాము. తాత మనకోసం మెట్లకాడ ఉంటాన్నాడు,” అంటూ పక్కనే కూకుంది.
“ఎందుకా దిగులు మొహం? కాస్త నవ్వు. ఈ పండుగనాడు నీ ఈడు పిల్లలందరిలో నువ్వే ముద్దుగా ఉన్నావంట తెలుసా? మన వీధి అమ్మలక్కలంతా అంటున్నారు,” అన్నది నన్ను నవ్వించాలని పిన్ని.
నా నవ్వులు బాగుంటాయని తాత అంటాడు. రాములు కూడా నాకు చక్కిలిగింతలు పెట్టి మరీ నవ్విస్తది. ……………
(ఇంకా ఉంది)
**

Download PDF

17 Comments

 • మణి వడ్లమాని says:

  మొదటి వారం లోనే ఆకట్టుకొంది మీ సేరియాల్ ఉమాభారతి గారు..నోటి తో పలకలేని మనసున్నఅందాల బొమ్మ మీ గాయత్రి పాత్ర

  • Kosuri Uma Bharathi says:

   ధన్యవాదములు మణి గారు… మీరు చదువుతున్నందుకు హ్యాపీ…

 • Sita says:

  great start! You raised your bar so you took up a great task ahead as its not easy to be consistent at this level. Of course I wanted even more from you. Your story is like a script cum screen play

  I ఎంజొయెద్!

  • Kosuri Uma Bharathi says:

   Sita garu ,

   I am grateful for the confidence you have in me… I hope this piece of work justifies your trust in my writing capabilities…. please keep reading and giving me your feedback…so I can learn from it…
   Uma Bharathi

 • Uma says:

  Congratulations, on thinking about this delicate, important, very hurtful social phenonmenon. I am so glad and proud to know, I live and breath in the same age, space as you are! Hats off you for your effort, response. You have a wonderful place you created for yourself, in resonating with the social phenonmenon and presenting them in art and literature.

  అభినందనలు ఉమాభారతి గారూ!
  ఇలాగే ఇంకా ఇంకా మీరు రచనలను అందించాలని, మా అబిమాన రచయిత్రి గా నిలవాలి మా హృదయంలో సదా.
  మీ అభిమాని
  ఉమా

  • Kosuri Uma Bharathi says:

   Uma Garu, From the bottom of my heart I am grateful for your kind words, encouragement and support. I hope this serial, as it unfolds – satisfies your interest in reading the delicate subject matter of the story.
   Uma Bharathi

 • bhasker.koorapati says:

  ఆరంభం లోనే ఆకట్టుకుంది మీ రచన. అభినందనలు ఉమ గారూ.
  పోయిన సంవత్సరం నేను హౌస్టన్ లో ఉండగా నెల నెల వెన్నెల మీటింగ్ లో మిమ్మల్ని కలవడం, మాట్లాడడం తలచుకుంటే ఆనందంగా ఉంది. మీరు బహుముఖ ప్రజ్ఞాశాలురు. అల్ ది బెస్ట్ అండి!
  —భాస్కర్ కూరపాటి.

  • Kosuri Uma Bharathi says:

   భాస్కర్ గారు, మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు…. మీరు చదివినందుకు, మీకు నచ్చినందుకు సంతోషం….తప్పక రాబోయే భాగాలు కూడా చదివి మీ స్పందన తెలియపరుస్తుంటారని ఆశిస్తాను. ఇక్కడ నెల నెల వెన్నెల మరింత చక్కగా నిర్వహిస్తున్నారు…నమస్తే….

 • Anupama says:

  హలో ఉమా,
  కథ మొదలు పెట్టడమ మంచి శైలితో మొదలైంది. నకుస అన్నది వినలేదు. మంచి ఇన్ఫర్మేషన్. మీ కథ మరింత ఉత్సాహంగా, చెప్పాలనుకున్న మెసేజ్ అందేటట్లుగ రాసి మరొక పురస్కారం అందుకోవాలని ఆశిస్తున్నాము. విష్ యు అల్ ది బెస్ట్.
  అనుపమ.

  • ఉమా భారతి says:

   అనుపమ గారు,
   చాలా సంతోషం మీకు సబ్జెక్ట్ నచ్చినందుకు… మీ కాన్ఫిడెన్స్ కి థాంక్స్ … కృతజ్ఞతలు….పూర్తిగా చదివి మీ ఫీడ్బాక్ ఇవ్వాలని రిక్వెస్ట్..
   ఉమాభారతి

 • usha says:

  Congratulations! Very good start.
  You picked up a reality to give life to your pen.
  Interesting script and flow.
  All the best,

  Usha

 • jayanthi says:

  Congratulations on your story line such as plot, setting, and character.Your voice is bright and new . After all the work you put in , you should be well recognized. If there is any justice, the success of your story will keep you going well beyond the second, and third.I look forward to reading your next story. Best wishes in your work .

  • ఉమా భారతి says:

   ఉష,
   మీ సపోర్ట్ కి, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు…వెరీ హాపి…
   ఉమా భారతి
   .

   జయంతి,

   మీ వ్యాఖ్యలకి మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. సీరియల్ అన్ని భాగాలు చదివి అభిప్రాయం అందించగలరని ఆశిస్తాను….

   ఉమా భారతి

 • BHUVANACHANDRA says:

  ఉమా భారతి గారూ నమస్తే ………చాలా చక్కని కధ అందిస్తున్నారు .”నకూస”’గురించి వినడం నాకూ మొదటిసారే . చాలా చక్కని ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు …..కధని అద్భుతంగా నడిపిస్తున్నారు ……చాలా సంతోషం , రొటీన్ కధలనించి భిన్నంగా తీసుకువెళుతున్నందుకు ……..వొచ్చే సంచిక కోసం ఎదురుచూస్తూ ……శుభాకాంక్షలతో ……భువనచంద్ర

  • ఉమా భారతి says:

   భువనచంద్ర గారు,
   నమస్తే… మీరు చదివినందుకు, మీ వ్యాఖ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
   పూర్తిగా చదువుతూ, మీ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకుంటారని, ఆశిస్తాను.

   రెండవ భాగం నిన్న అచ్చయ్యింది.

   ఉమాభారతి

 • -ఆర్.దమయంతి. says:

  భాష బావుంది. శైలి బావుంది. మీరెంచుకున్న కథాంశం కూడా వాస్తవికమైనది కావడం తో విభిన్నం గా వుంది, పాట్హకుల చేత చదివిస్తుంది.
  ముఖ్యంగా యాస ..పసందుగా అనిపించింది నాకు.
  (వ్యక్తిగతం గా – అన్ని యాసల్లోకి నాకు తెలెంగాణా యాస అంటే ఇష్టం. మరీ మోటు గా కానిదీ, వాడుకలోని యాస మాత్రమే ఇష్టం).
  అభినన్దనలండి మీకు, ఉమా భారతి గారు.

  • Kosuri Uma Bharathi says:

   థాంక్స్ దమయంతి గారు…సమయం తీసుకొని చదివినందుకు…మీ వ్యాఖ్యలకి కృతజ్ఞతలు …

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)