అలసిన వేళల చూడాలీ…

drushya drushyam 40

నీడ గురించి మాట్లాడుకుంటాం ఫొటోగ్రఫీలో.
వెలుగుతో పాటు నీడ గురించి ఎంతైనా చర్చించుకుంటాం.
సరికొత్తగా అర్థం చేసుకునే ప్రయత్నమూ చేస్తాం.

కానీ, మనల్ని వెంటాడేది నీడ మాత్రమేనా?
కాదు. విశ్రాంతి కూడా.

నిజం. జీవితాన శ్రమతో పాటు విశ్రాంతీ ఒక వెలుగు. అది నీడలా వెన్నాడుతూనే ఉంటుంది
లేదా సమ్మిళితమై జీవితం పొడవునా నిశ్శబ్ద రాగాలు ఒలుకుతూ ఉంటుంది.
వాటిని పట్టుకున్నఒకానొక బంగారు క్షణం ఈ చిత్రం.

ఒకపరి చూసి, మళ్లీ చదవరారండి,.

+++

మీకు తెలియంది కాదు. కానీ చెప్పడం. నిజానికి శ్రమైక సౌందర్యం అంటం. అది కూడా కేవలం శ్రమ గురించి మాత్రమే కాదు! అది విశ్రాంతిలో విరిసే ఇంధ్రధనుస్సే. విశ్రాంతి నీడన పెరిగే కానుగ చెట్టు నీడ కూడా.
ఈ తల్లి చిత్రం అదే.

ఇది ఒక మిట్ట మధ్నాహ్నపు జీవన చ్ఛాయ.
మనందరం కార్యాలయాల్లో ఉండగా, కార్యభారం నుంచి వైదొలిగిన ఒక చిన్నపాటి కునుకు.
నీడ. ఒక స్వప్నలిపి. అలౌకిక ధార.

ఇంకా చెబితే, ఒక తెలంగాణ తల్లి.
పనంతా అయినాక జారగిలబడి, నిమ్మలంగా సేదతీరిన ఒక ‘అమ్మ’ నవల.
ఒక అత్తమ్మ లీల. ఒక గృహిణి స్వతంత్రంగా ఊపిరి తీసుకునే జీవన లాలస.

+++

చిత్రం ఇంకా చాలా మాట్లాడుతుంది.
చూస్తూ వుంటే చదవనక్కరలేదు. చదివి చూస్తే కూడా కొత్త చిత్రమే.

స్థలం గురించి కూడా చూడాలి.
ఆమె అట్లా ఒరిగినప్పుడు ఆ ఇల్లు కాస్త ఎత్తుమీదన ఉన్నది.
నాలుగు గజాల దూరం నుంచి తీశాను. నా ఎత్తున ఉన్నది ఆమె తల.
దగ్గరకు వెళ్లితే కొంచెం వొంగిని తీయాలి. కానీ, ఉన్నచోటు నుంచే, చూసిన కాడనుంచే తీశాను.
తర్వాత మళ్లీ ఏమి తీసినా ఇంత విశ్రాంతి ఉండదు.
అందుకే వెనుదిరిగాను.

+++

అయితే, మళ్లీ చూశాను.
ఆమె ఒరిగిన గడప, కిందన ఉన్నది అరుగు. అవును. అది ఎత్తైనది. కిందుగా అటూ ఇటూ మెట్లు.
నడుమ మళ్లీ కాసింత జాగా. అక్కడ ముగ్గు. తర్వాత గడప. ద్వారం. దాటితే మల్లెసార. ఇంకా అన్నీ.

ఇల్లు అంటే అన్నీ.
స్త్రీ నిర్మాణ కౌశలం.

ఇక్కడ అన్నిటికీ అంతటా ఒక నిర్మాణం ఉన్నది.
ప్రతి దానికీ ఒక వాస్తు ఉన్నది. అన్నిటికన్నా మిన్నకళ ఉన్నది. ఆమే ఉన్నది. కళావతి.
బయట ఉన్నఇంట్లో లేకపోవచ్చు. కానీ, నా లెక్కన ఆమెనే వెలుతురు. వెలుగు…నీడా.
ఇక భయం లేదు.

ఆమె ఒక ఇల్లాలు.
బహశా కోడలు… కాదు కాదు… అత్తమ్మ లేదా తల్లి.
నిర్వాహకురాలు.

తనకు పిల్లల భారం తీరవచ్చు, తీరకనూ పోవచ్చు.
కోడలూ రావచ్చు రాకనూ పోవచ్చు. కానీ వయసు మీద పడ్డా పడకపోయినా ఆమె ఒక ఇల్లు.
తనంతట తాను ఒక సౌందర్యం. పోషణ. సాంస్కృతిక సౌజన్యం.

ఇవన్నీకానవస్తుండటం ఈ చిత్రం మహిమ.
ఈ చిత్రాన్ని బంధించినాక ఒక తృప్తి.

+++

నిజానికి ఆ తల్లి కాసేపు అలా ఒరిగింది గానీ, బహుశా ఆమెకు కన్నంటుకున్నదిగానీ, అదమరచి నిద్రపోలేదు. ఏమరుపాటుగానే ఉన్నది. అందుకే, ఆమె దర్వాజ దగ్గరే గడప మీదే తల వాలుస్తది.

ఒక చేయి ఇల్లు.
ఇంకొక చేయి వాకిలి.

ఆ చేతి గాజుల సవ్వడి…అది జీవన సంగీతం.
ఇలాంటి ఘడియలో ఆ గాజుల నిశ్శబ్దం…అదీ సంగీతమే.
కొమ్మమీది ఒక సీతాఫలం వంటి చేయి.
ఒక మధుర జీవన ఫలం తాలూకు గాంభీర్యం.

కష్టమూ సుఖమూ…
అక్కడే ఇంటిద్వారం మధ్యే నడుం వాల్చడంలో ఒక ధీమానూ…
ఇవన్నీకానవస్తుంటే ఇంటిముఖం పట్టాను.
ఇంట్లోకి వెళితే మళ్లీ ఆమె.
ఇంకో స్త్రీ.

అప్పుడర్థమైంది. అంతటా ఉన్నదే.
చూడగా తెలిసిందీ అని!

బహుశా ఒకసారి చూడాలి.
తర్వాత ఆ చూపు మనల్ని విస్తరింపజేస్తుందేమో!

ఇదలా వుంచితే, మళ్లీ ఆ చిత్రం.

+++

అలంకరించబడ్డ గడప. పసుపుతో వేసిన చిత్రలిపి. పక్కన ఏదో మొక్క. చేతులకు నిండైన గాజులు.
అవిశ్రాంతగా పనిచేసే మనిషని చెప్పకనే చెప్పే ఆ బంగారు తల్లి కన్నుల చుట్టూరా క్రీనీడలు. వలయాలు.
అయినా శాంతి. విశ్రాంతి.

నాకైతే ఎందుకో ఒక వేపచెట్టు రెల్లలులా ఆమె శాంతిని పంచుతున్నట్టనిపించింది.
బహుశా ఇది బోనాల సమయం కదా… అందుకే ప్రకృతే అలా సేద తీరిందా అన్నప్పటి చిత్రం లాగున్నది.
అంతకన్నా ముఖ్యం, ఆమె అమ్మవారిలా అలా ఒరిగి కనిపించింది.

ఈ రీతిలో తల్లి దర్శనభాగ్యం కలిగినందుకు ధన్యుణ్ని.

+++

నిజం. ఒక్కోసారి భగవంతుడిని దర్శించుకుంటాం.
కానీ, జీవితాన్ని కూడా దర్శించుకున్నప్పటి విశ్రాంతి ఇది.

 

– కందుకూరి రమేష్ బాబు

ramesh

Download PDF

3 Comments

  • nmraobandi says:

    నా చిన్నప్పుడు పల్లెటూళ్ళో
    ఈ దృశ్యాన్ని తరచూ చూస్తుండేవాణ్ణి …
    మా మామ్మ కూడా ఇలా విశ్రమించడం …

    సేద తీరడానికి చల్లగాలి రాక కోసం
    అదే సమయంలో పరులెవరూ ఇంట చొరబడే
    వీలునివ్వని ఓ రక్షణ కవచం తీరుగా
    గుమ్మానికి అడ్డంగా పడుకునేవాళ్ళిలా …
    (ఫుట్ బాల్ గోల్ కీపర్ డిఫెన్సు గుర్తొస్తోంది కదూ?)

    గ్రామాల్లో కేవలం వీధి లైట్లూ
    మోతుబరుల ఇళ్ళలో మాత్రమె కరెంట్
    ఉన్న రోజులవి …

    … … … … …

    ఎద కదిలెను జ్ఞాపకం …
    మది నిండెను సంతసం …

    ఎంతో అద్భుతమైన వర్ణ చిత్రం …
    అంతే అద్భుతం మీ వర్ణనం …

    మీ అభిరుచికిది సంతకం …
    అందుకోండి గౌరవం … వందనం …

  • sujala says:

    నిద్ర సుఖమెరుగదు…అన్న మాట గుర్తొస్తుంది మీ ఈ ఫొటో చూస్తుంటే…మనలో ఎంతమంది ఇంత హాయిగా విశ్రమించగలుగుతారు…ఎప్పుడో చిన్నప్పుడు ఊర్లల్లో చూసిన జ్ఞాపకం…మీ ఫొటోతో మళ్లీ సజీవంగా కళ్లముందు కదలాడింది..పదినిముషాలు అలా రెప్ప వేయకుండా చూస్తుంటే…ఆ ఫోటోలోకి అలా వెళ్లిపోయి..నేరుగా ఆమెను చూస్తున్నట్టు..ఆ పరిసరాల్లో ఉన్నట్టు అనిపించింది..ఎప్పటిలాగే మీ వ్యాఖ్యానం కూడా బాగుంది…

Leave a Reply to nmraobandi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)