విదూషకుడు పాడిన విషాద గీతం ‘మూలింటామె’

మూలింటామె‘ నవల చదవడం పూర్తి చేసి పుస్తకం మూతపెడుతూ ‘ఏమిటీ రంకు ముండా గోల? నామినికి మతిపోయిందా యేమి?’ అనుకున్నాను. ‘ఎలావుంది పుస్తకం?’ అని అత్యంత కుతూహలంగా అడిగిన మిత్రుడు మోదుగుల రవికృష్ణతో కూడా ఆ మాటే అన్నాను.

ఐతే, ఈ కథను గురించిన ఆలోచన అక్కడితో ఆగిపోలేదు. కథంతా ముక్కలు ముక్కలుగా గుర్తొస్తూ వెంటాడుతూనే వుంది. ఎందుకో ‘బీభత్సరస ప్రధాన విషాదాంతం’ అని శ్రీశ్రీ కన్యాశుల్క నాటకాన్ని గురించి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆ మాటలు ఆ నాటకానికి వర్తిస్తాయో లేదో గానీ, ఈ నవలకు మాత్రం పూర్తిగా వర్తిస్తాయి.

పుస్తకం మరోసారి చదవడం మొదలెట్టాను. ఇది నామిని రాసిన పూర్వపు గ్రంథాల్లా తమాష తమాషగా నడిచే పుస్తకం కాదు. నామిని గొంతులోని చిలిపితనం మాయమయ్యింది. సీరియస్‌ టోన్‌లో ఈ కథ చెప్తాడు. ఈ మార్పు నామిని రెగ్యులర్‌ పాఠకుణ్ణి కొంచెం చకితుణ్ణి చేస్తుంది. హాస్యం తగ్గించినా వ్యంగ్యం అంతర్లీనంగా నడుస్తూనే వుంటుంది. వర్తమాన వ్యవస్థపైన ఆక్రోశంతో కూడిన వ్10521865_10154366304195385_905769971_nయంగ్యం అది.

 

మూలిల్లు అంగిడిల్లుగా మారడం మూలింటామె నవలలోని యితివృత్తం. మూలిల్లు అంగిడిల్లుగా మారే క్రమంలో పూర్వ సంప్రదాయాలు ఎలా అంతరించి పోతాయో, నైతిక విలువలు కొత్త రూపాన్ని ఎలా సంతరించుకుంటాయో, సమాజంలోని అన్ని రకాల విలువలూ ధన దౌర్జన్యాలకు ఎలా ప్రభావితమౌతాయో ఆసక్తికరంగా వివరిస్తుందీ కథ. వెరసి సంప్రదాయ జీవితాన్ని మార్కెట్‌ శక్తులు ఎలా కబళిస్తాయో, మనుషులెలా పరాయీకరణ చెందుతారో వివరిస్తుందీ కథ.

మూలింటోళ్లది ఒద్దికైన యిల్లు. ముగ్గురాడవాళ్లు. ఒక మగవాడు, ఇద్దరు పిల్లలు… ఆ యింట్లో ఉండే మనుషులు. అందరికంటే పెద్దావిడని మొదుటామె అనీ, ఆమె కూతుర్ని నడిపామె అనీ, ఆమె మనవరాల్ని కొనమ్మి అనీ పిలుస్తారు. మొదుటామె కొడుకు పేరు నారాయుడు. అతని చెల్లెలు నడిపామె. ఈ నడిపామె కూతురు కొనమ్మినే నారాయుడు పెళ్లాడాడు. వీళ్లకిద్దరు పిల్లలు.

మూలింటోళ్లు పెరట్లోనూ, చేనిగెనిమల కాడా ఉన్న చెట్లను చక్కగా సాక్కుంటారు. పెంపుడు జంతువుల్ని కూడా కన్నబిడ్డల్లా ప్రేమిస్తారు. ఆకలో తల్లా అని యింటి కొచ్చిన వాళ్లకు ఉన్నదాంట్లోంచి యింత తీసి పెడతారు. ముప్పొద్దులా చాకిరి చేస్తారు, సంతృప్తిగా జీవిస్తారు. సాటి మనుషుల కొచ్చే కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకుంటారు.

ఇట్లా సుఖంగా జరిగిపోతున్న దశలో ఆ యింటి ఇల్లాలు కొనమ్మి మొగుణ్ణీ పిల్లల్నీ వదిలేసి కళాయి బోస్కునే ఒక అరవ మాదిగోడితో లేచిపొయ్యింది. ఈ విషయం సహజంగానే ముందు ఊళ్లోవాళ్లకు, చివరిగా యింట్లో వాళ్లకు తెలిసింది. ఊళ్లో పెద్దమనుషులు, పతివ్రతలు మూలింటి దగ్గర గుంపుకట్టారు. అనాల్సిన మాటలన్నీ అన్నారు. లేచిపోయిన పిల్లని వెనక్కి తేవాలని తీర్మానం చేశారు. లేచిపోయిందాన్ని వెనక్కి తెచ్చేదెందుకు? రేపు మనగ్గూడా కొంగు పరవక పోతుందా అని పెద్దమనుషులు ఆశ. మనలో మరొకటి చేరుద్దిగదా అని పతివ్రతల కులుకు.

పోయిన పిల్ల మొండిది. ‘నాకు మూదేవి గమ్మి గడప దాటొచ్చేసి తప్పు జేసినా. యింగా గడప తొక్కను. బావ మొకం చూళ్లేను. నేను కర్మురాల్ని. చచ్చిందాంతో సమానమని నన్ను మర్సిపోండి’ అని తలకొట్టుకొని ఏడుస్తూ వెళ్లిన వాళ్లను వెనక్కు పంపేసింది.

ఆడమనిషి ఇలా లేచిపోవడమనేది గుట్టుగా నడుపుకొనే సంసారాల్లో ఎంత కల్లోలం రేపాలో అంతా రేపింది. లేచిపోయిన పిల్ల అత్తకు మనవరాలు మొగుడికి మేనకోడలు. తానులో తాను, ముక్కలో ముక్క. ఆ కుటుంబాన్ని లోకులు పెట్టిన హింసకు పరాకాష్ట రంజకం వొక్కలు ముక్కలుగా మాట్లాడిన మాటలు. ‘ఏమే మొదులా! కొనదానికీ కళాయోడికీ నడిమద్దిన తడిక మాదిర వుండింది నువ్వేనంటనే! కళాయోణ్ణి కోడలితో కులకమని జెప్పి నువ్వు అడ్డాపింటి ముందర కావిలుండే దాని వంటనే! అవరా! అవరా! కొడుకని అన్నా జూసినావా నువ్వు? నీ మనవరాలు జిల్లా పటంగవితే నువ్వు దేశిపటంగివే!’

 

ఎన్ని అవమానాలు జరిగినా మొదలామెకి మనవరాలి మీద మమకారం చావలేదు. ఏదో ఒక రోజుకి తిరిగి ఇంటికి వస్తుందనే ఆశ పోలేదు. అప్పుడు కూతురు (నడిపామె) తల్లికి ఉపదేశం చేసింది. ‘అమా, నీకు పున్నెముంటాది. దాన్ని మర్సిపో. మనం గానీ ఆ యమ్మిని కడుపులోనే పెట్టుకొంటే యింట్లో వుండే లేదర పిలకాయల్ని కూడా సాక్కోలేము, చదివించుకోలేము. అన్నకు మళ్లీ పెండ్లి చేద్దారి’. మొదులామె అంగీకరించలేదు. కానీ ఆమె అంగీకారం కోసం ఎవరూ ఎదురు చూడలేదు.

లేచిపోయిన కొనమ్మికి ఎవరి సానుభూతీ దక్కలేదు. బహిరంగంగా ఆమె చేసిన తప్పును అసహ్యించుకోవడం ద్వారా ఊరు తన పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుంది. కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆమెకు అండగా నిలబడలేని స్థితి. సమాజం కుటుంబంపైనా వ్యక్తిగత విషయాలపైనా ఎంత దౌర్జన్యం చెయ్యగలదో అంతా చేసింది. అంతటి దుఃఖాన్నీ, అవమానాన్నీ దిగమింగుకుంటూ చెట్టూ చేమల్నీ, కయ్యా గనుమల్నీ, పిల్లీ పిచికనీ ఏమరలకుండా సాక్కుంటూనే ఉన్నారు, నడిమింటోళ్లు.

సమాజం లోకువగా ఉన్న మనుషుల్ని ఊరికే వదిలిపెట్టదు. వాళ్ల ఏడుపు కూడా వాళ్లను ఏడవ నివ్వదు. మరీ ముఖ్యంగా బంధువులైతే సానుభూతి మిషతోనో, మేలు చేసే మిషతోనో వాళ్ల వ్యవహారాల్లో వేలు పెడుతూనే ఉంటారు. మొదుటామె అక్క తన తోటికోడలి మనవరాల్ని నారాయుడికి మారు మనువుకి మాట్లాడుకొచ్చింది. నడిపామె కూడా సహకరించింది. మొదుటామెకి ఇష్టం లేకపోయినా నారాయుడి పెళ్లి పందొసంతతో జరిగిపోయింది.

పందొసంత లేచిపోయిన పిల్ల లాగా నోట్లో నాలుక లేనిది కాదు. తనకు నచ్చినపని, తాను చెయ్యాలనుకున్న పని ఎవరు ఔనన్నా కాదన్నా చేసెయ్యగల తెంపరి. మొదుటామె తనకు సానుకూలంగా లేదని వచ్చిన వెంటనే గ్రహించింది. ఐనా ‘ముసిల్దానా! దేనికెప్పుడూ ముటముటా అంటా మూతి నల్లంగా పెట్టుకోనుంటావు? నవ్వతా పేల్తా వుండలేవా నువ్వు? నవ్వు! మా ముసిల్దిగదా, నవ్వు! నవ్వు! నిన్ను ఆ పక్కట్టితో నాలుగు దొబ్బితే గానీ దోవకు రావా ఎట్ట?” అని చక్కిలిగిలి పెడుతూ ఆసికాలాడింది. మొగుడితో గూడా అంతే. మంచం మింద కుచ్చోనుంటే మెడమింద చేతులెయ్యడం, పక్కన పొనుకోని కాళ్లెయ్యడం – ఆ కులుకు నింక చెప్పలేమసలికి. వూరికొచ్చి పద్దినాలు గాకనే దానికి యిల్లిల్లూ తెలిసిపోయింది. సినమ్మా అనాల్సినోళ్లని సినమ్మా అనీ, అత్తా అనాల్సినోళ్లను అత్తా అనీ బావా అనాల్సినోళ్లను బావా అనీ పిల్సుకుంటా ఊరంతా పోయ్‌ అరట్లు దొబ్బేసి వస్తా వుంటింది. ఇంట్లో కడిగిన చెయ్యి ఆమెకు పరావోళ్ళింట్లో ఆరాల్సిందే. మొలకమ్మ యిల్లు మొదులుకోని, రంజకం యిల్లు మొదులుకోని, చాకలోళ్లిండ్లు మొదులుకోని యాడ జూసినా తిరగతానే వుంటుంది. మొదటామెకి ఆమె తిరుగుళ్లు నచ్చక పోయినా ఒకటంటే నాలుగు వినాల్సొస్తుందని గమ్మునుండేది. వూళ్లో మొగోళ్లకూ ఆడోళ్లకూ మాత్రం ‘పందొసంతకు కొత్తా పాతా లేదు. మనూరికి రావాల్సిన బిడ్డే!’ అని పేరెత్తుకొనింది.

Mulintame600

వ్యాపారానికీ, మార్కెట్‌ సంస్కృతి నిలబడటానికీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా ముఖ్యం. పందొసంతలో ఆ స్కిల్స్‌ కొల్ల. ఐతే మార్కెట్‌లో నిలబడాలంటే కేవలం స్కిల్‌ ఒక్కటే చాలదు. ఒక బలమైన అండ ఉండాలి. ఒక గాడ్‌ఫాదర్‌ కావాలి.

రంగబిళ్ల ఆ చుట్టు పక్కలూళ్లల్లో కొంచెం పేరెత్తుకున్నోడు. అతగాడు నారాయుడికి తమ్ముడొరస. పందొసంత కన్ను మొదట అతని మీదే పడింది. ‘రంగబిళ్లా, ఏం మేనమామ కొడకా! మరదాల్ని చూసేసిపోవా? మరదాల్తో మాట్లాడి పోకూవర్తీ కనుక్కోవా?’ అంటా పైయ్యేస్కోని పిలిచేది. ‘నువ్వేంది బావా బీడీలు తాగేది, సిగిరెట్లు తాగు’ అని చెళ్లబడేది. ఒక రోజు సందేళపూట ‘బావా నన్ను ఉప్పు గుర్రం ఎక్కించుకో’ అని రంగబిళ్ల యీపెనకాన ఉప్పుగుర్రం ఎక్కి మిట్ట మిందంతా ఒకటికి పది చుట్లు తిరిగింది. మొదుటామె మనవరాలు లేచిపోయినప్పుడు వొక్కలు ముక్కలుగా మాట్లాడిన రంజకం యిదంతా యీదిలో నుంచి చూసి పకపకా నవ్వేసింది. ‘బావా మరదాలు బలే కులుకు మిందుండారే!’ అని కండ్లారా చూసింది గానీ ఏం యిచ్చిత్ర పోలా!

రంగబిళ్ల కంటే గుడుగుడు చెంద్రడు మరింత శక్తిమంతుడని, లాభకారి అని, పందొసంతలోని వ్యాపార శక్తి కనిపెట్టేసింది. గుడుగుడు చెంద్రడు పది పన్నెండెకరాల ఆసామి. మూడు టాకట్రలకు యజమాని. యాడ టాకట్రు దున్నకం మిందుంటే ఆడికి గుడుగుడు మోట్రమీద పొయ్‌ ఊళ్లు తిరుగుతాడు. అందుకే అతన్ని ఆ పాయకట్టంతా గుడుగుడు చెంద్రడని పిలుస్తారు. సొంత వూళ్లో మాత్రం అతన్ని కర్రెడ్డి అంటారు మనిసి బొగ్గు వర్నంతో వుంటాడు గాబట్టి. పందొసంత మేని వర్ణాన్ని చూసే మనిషికాదు. డబ్బుకు వర్ణభేదం వుండదని తెలిసిన మనిషి. ఆమె చూపు అతని మింద పడిన మరుక్షణం గుడుగుడు మోటారు మూలింటి ముందు ఆగిపోయింది. మంచి మద్యానం వచ్చిన మనిసి రేత్తిరి ఏడు దాకా పందొసంతతో మాట్లాడిన వాడు మాట్లాడినట్టే ఉన్నాడు. నారాయుడు కూడా గుడుగుడు చెంద్రడికి ఎంతో మరేదిచ్చినాడు.

పందొసంత దూరదృష్టి గల మనిషి. క్రైసిస్‌ మేనేజిమెంటు ఆమెకు బాగా తెలుసు. ముందు ముందు వ్యవహారాలు సజావుగా సాగాలంటే గుడుగుడు చెంద్రడికీ నారాయుడికీ మంచి సఖ్యత ఏర్పడాలని గుర్తించింది. అందుకోసం రకరకాల విద్యలు ప్రయోగించింది. మొగుడి బుజాల మింద చేతులేసి పైపైన పడేది. ఏదో ఒగటి మాట్లాడమని గారాం జేసేది. నారాయుడి ముసిముసి నవ్వులు నవ్వతా ఒకటి రెండు మాటలు మాట్లాడగానే ‘పెండ్లాం మాట అట్ట యినాల’ అని చెప్పి ముద్దులు బెట్టేది. గుడుగుడు చెంద్రడొచ్చినప్పుడు అతగాడి దగ్గర సిగరెట్టు పెరుక్కోని మొగుడి కిచ్చేది. ఆ సిగరెట్టు ముట్టించమని గుడుగుడు చెంద్రడికి ఆర్డరేసేది. గుడుగుడు చెంద్రడు ముట్టిస్తా వుంటే, ‘యిప్పుడు పోటాగాన తీస్తే ఎన్టీరామారావుకు నాగేస్పర్రావు ముట్టించినట్టుగా వుంటాది’ అని చెంద్రడి మింద పడిపడి నవ్వేది.

ఒకానొక రేత్రి గుడుగుడు చెంద్రడికి పెండ్లయి పెళ్లాం బిడ్డలుండినా గాజులమండ్యంలో యిల్లూ వాకిలీ వుండినా మూలింటామె యింటి ముందరుండిన టాకట్రను ఎగజూపెట్టుకోని జాగారం చెయ్యాల్సొచ్చింది. నారాయుడు మంచాన్నీ పెళ్లాన్నీ చెంద్రడి కొదిలేసి ఈతాకు చాపమింద వైబోగంగా నిద్దరబొయ్‌నాడు. ఇట్లాంటి వార్తలు ఊరిమీద వేగంగానే పాకుతాయి. మిట్టూరోళ్లంతా మూతుల మింద చేతులేసుకున్నారు. ‘పందొసంత యీ వూరికి కోడలైన పది పదైద్దినాలల్లోనే వూరి పినపెద్ద కొడుకు రంగబిళ్లను పెట్టుకొనింది. నెలైనా వోడితో సావాసం చేసిందో లేదో అష్టతెలువుల్తో పది పన్నెండెకరాలుండి వొకటికి మూడు టాకట్రలుండే గాజులమండ్యం రెడ్డిని ఒళ్లో యేస్కొనింది. అదే యింట్లో పుట్టి పెరిగిన పెవడముండ ఏమి జేసింది? అరవ మాదిగోడితో పూడిసింది. వొకటి మూలింటోళ్లకు తలొంపులు తెచ్చి దాని దోవ అది చూసుకుంటే, యింకొక పున్నాత్మురాలొచ్చి వాళ్ల నెత్తిన కిరీటం పెట్టింది’. అని మూలింటోళ్ల మింద కుళ్లుకున్నారు కూడా!

వ్యాపార సంస్కృతి ప్రబలమయ్యే కొద్దీ సంప్రదాయవాదుల గొంతులు బలం కోల్పోతాయి. పందొసంత వ్యవహారశైలి గురించి చీమంతమ్మ సుకుమార్‌ లాంటి వాళ్లు గొణిగినా వారి నోళ్లను మొలకమ్మ రంజకం లాంటి వాళ్లు తేలిగ్గానే మూయించగలిగారు.

తన చాకచక్యం ఇంటినీ వీధినీ గెలిచిందని పందొసంతకు అర్ధమైంది. తదుపరి కార్యాచరణకు దిగింది. ఇంటి చుట్టూతా, పొలం గట్ల మీదా ఉన్న చెట్లను సామిల్లు వాడికి మంచి రేటుకు అమ్మేసింది. తరతరాలుగా పిల్లలకు కాయా గసురూ అందిస్తూ నీడనిస్తున్న చెట్లను కొట్టేయొద్దని మూలింటామె అడ్డం రాబోయింది. “అడ్డం వొస్తావా! కావాలంటే అరవ మాదిగోడితో దొబ్బుకొని పూడ్సిన నీ మనవరాల్ని కూడా తొడకరాబో? యిద్దురూ చెట్లకాడ అడ్డంగా పొడుకుందురు. పోపోయే ముసిల్దానా! నాలుగు నాళ్లకంతా యింటికాడా, చేనుకాడా కిలీనుగా యిలాశియంగా వుంటాది. నువ్వు పదే ముసిలీ!’ అంటా పందొసంత పకపకా నవ్వుతా ఎనప దూడను జవురుకొన్నట్టుగా జవురుకోని తెచ్చి ముసల్దాన్ని బండమింద మరేదగా కుచ్చనబెట్టింది.

చెట్ల నమ్మిన డబ్బు పన్నెండు వేలలోంచి పన్నెండు వందలు తీసి బంకొకటి తెప్పించి యింటి ముందర అంగిడి తెరిపించింది పందొసంత. మరసట్రోజే బంకు నిండికీ సామానొచ్చేసినాయి. ఒక వస్తవ ఉండాది ఒక వస్తవ లేదు అనాల్సిన పన్లా. కొనుక్కోడానికి డబ్బుండక్కర్లా. సమయానికి డబ్బు లేకపోతే పందొసంత వివరంగా గుర్తు రాసుకోని అప్పిచ్చేస్తాది. వూరి జనానికి పందొసంత అంగిడి వల్ల ఇంత మేలుగా ఉండాది. ఏడున్నరా ఎనిమిది కంతా అంత చారూకూడూ తినేసి పొనుకునే వూరు తొమ్మిదీ తొమ్మిదిన్నరకు అంగిట్లో లైట్లు ఆరినాకనే పొనుకునేది నేర్చింది.

పందొసంత అంగిడి తెరిచే దాంతో ఆగలేదు. ఆ వెంటనే చీరల వ్యాపారం, దాంతో పాటే తండల వ్యాపారం, పనిలో పనిగా చీటీల వ్యాపారం కూడా మొదలేసింది. యిన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నా మొగుణ్ణి నిర్లక్ష్యం చెయ్యలేదు. ఆరుగాలం ఎద్దుల్ని మడికాడకి తోలకపోయి సందేళ వాటి కోసం కసవు మోపును నెత్తిన బెట్టుకోని కాళ్లీడ్చుకుంటూ యింటికి వచ్చే మొగుణ్ణి చూస్తావుంటే ఆమెకు కడుపు రగలకపొయ్యేది. గుడుగుడు చెంద్రడి టాకట్రుండగా ఎద్దుల సేద్యం ఎందుకు చెయ్యాలనిపించింది. బండీ ఎద్దుల్ని ఆరువేలకు అమ్మేసి పట్టిన శని యీడేర్చింది. మొగుడికి మోపెడ్‌ కొనిచ్చింది. నారాయుడిప్పుడు మోపెడ్‌ మీద తిరగతా కొట్లోకి సామాన్లు తెస్తుండాడు. పొరుగూరు పోయి బిలేరి కోడి మాంసం కావాలన్నప్పుడల్లా తెస్తుండాడు.

ఇంక భూమి మిగిలిపోయింది. ఆ రెండెకరాల కయ్యనూ అమ్మితే అరవై వేలన్నా వస్తాయి. ఆ డబ్బు కనుక వొడ్డీల మింద తిరిగితే ఇరై ముప్పై ఎకరాలు సేద్యం చేసే దానికంటే ఎక్కువ మిగల బెట్టుకోవచ్చు. మొగుణ్ణి ఎగదోసింది. ‘నేను నిన్ను బతికినంతకాలం కుచ్చనబెట్టి కూడేస్తాను బావా! నువ్వేంది బావా ఆ మడికాడికి బొయ్‌ వొంగివొంగి పనిచేసేది? నువ్వు కుచ్చుంటే నాకు కుశాల. నువ్వు ఎండలోకి పొయ్‌ చేనులో వొంగితే నాకు బాద” అని కండ్ల నిండికి నీళ్లు పెట్టుకొనింది. గుడుగుడుచెంద్రడితో కలిసి జోరుగా మందు తాగుతున్న నారాయుడు “కయ్యమ్మాలనుకున్నాం గదా. మాయమ్మకు కొంచిం మంచిగా ఉండు. మూకుళ్లలో కూడూ, కోడికూరా దండిగా కలుపుకోని పొయ్‌ పిల్లులకు పెట్టు. చిన్నామున్నుల్లాలా, కానాచ్చుల్లాలా, కొండాచ్చుల్లాలా అని మాయమ్మ యినేటట్టుగా పిల్లుల్ని పిల్చి బండకాడ పిల్లులకు కూడూ కూరా పెట్టేసి రాబో’ అనేసి అన్నాడు ఓ అని నవ్వతా! ఆ ఒక్క మాటతో నారాయుడు తాను తల్లి పక్షం కాదనీ భార్య పక్షమేననీ స్పష్టంగా చెప్పినట్టైంది. ఇది పందొసంతకు గొప్ప విజయం.

ఐతే విజేతకు అడుగడుగునా సవాళ్లు ఎదురౌతూనే ఉంటాయనేందుకు నిదర్శనంగా అప్పుడొక సంఘటన జరిగింది. వాళ్లింటి ముందు గుడుగుడు చెంద్రడి పెళ్లాం ఆటో దిగింది. దిగుతూనే నేరుగా మొగుడి దగ్గరికొచ్చి వాడి మొకాన కేకరించి ఎంగిలూంచి, పందొసంత ఎదుర్రొమ్ము మింద అట్టనే ఎగిసి ఎడం కాల్తో తన్ని, ‘నా మొగుళ్ళంజా! మా కొంప మూడు ముక్కలయ్యే దాకా వీణ్ణొదలవాసేయ్‌’ అంటా ఆగిత్తం పట్టించింది. ఈ గోలకు యింటి ముందు పోగైన జనాన్ని చూసి, ‘యీ వూళ్లో యిట్టాంటి పలుబోటి లంజలు కూడా ఉండాయా! యీ మాదిర్తో వూరోళ్ల మొగుళ్లను పక్కలో యేస్కోని యింటికి రానీకుండా చేసే ఆడదాన్ని ఏం చేస్తే కర్మాలు తీరునో మీరే చెప్పండి. యీనా సవితిని పట్టుకోని నలగ్గుమ్మేద్దామనుండాది’ అని కాసుగ్గాకుండా మాట్లాడింది.

పందొసంతకు జరుగుతున్న అవమానం అక్కడి జనం సహించలేకపోయారు. పందొసంత లాంటి తీరైన మనిషికి, పదిమందికి తల్లో నాలుకలా ఉండే మనిషికి జరగాల్సిన అవమానమా అది? వెంటనే మొలకమ్మ అందుకుంది. ‘పందొసంతకు ఎవురూ సపోరట రారని అనుకోబాక. మేమంతా చచ్చినామా! యిది వూరనుకున్నావా అడివను కున్నావా? నీ మొగ్గుణ్ణి అదుపులో పెట్టుకోవాల్నే గాని వొకమ్మ గన్న బిడ్డిమిందికి వొంటికాలి మింద ఎందుకొస్తావు?” అని మూతి మింద కొట్టినట్టుగా మాట్లాడింది. ఆ వెంటనే రంజకం అందుకుంది. ‘యిందాక పందొసంత ఎదుర్రొమ్ముల మింద తన్నినావంట గదే. నీ కాళ్లల్లో గండుమల్లి పుండు బుట్టదా! యింగొక్కసారి వాళ్ల పనిలో వాళ్లుండగా యీ మాదిర బైసాట్లు చేస్తా వొచ్చినావంటే నీ శిండ చించి, బజిని గుడికాడ కట్టేస్తాం. నీ నాయం నీకుంటే మా నాయం మాకుంటాది’ అనింది. చెంద్రడి పెళ్లాం బిత్తరపోయింది. శత్రువు బలం అర్ధమైంది. ‘మీరు పొండి తల్లుల్లారా! నా బంగారం మంచిది కాదు’. అని మళ్లా మొగుడి మొకాన వూంచి వొచ్చిన ఆటో ఎక్కి మళ్లా తిరుక్కోని పూడిసింది. పందొసంత వూరిని గెలిచింది.

అరవై వేలకు భూమిని అమ్మేందుకు ఒప్పందమైపోయింది. పొలం అమ్మాలంటే మొదుటామె వేలిముద్దరెయ్యాల. ముసల్ది బిగుసుకుపోయింది. పందొసంత చాణక్యాలు ఆమె మీద పనిచెయ్యలేదు.

మార్కెట్‌ శక్తులు తమపని సాఫీగా సాగిపోతున్నప్పుడు ఎంత ఉదారంగా ఉంటాయో వ్యతిరేకత వచ్చినప్పుడు అంత కంతా క్రౌర్యం చూపిస్తాయి. మొదులామె ప్రాణప్రదంగా పెంచుకొనే పిల్లల్లో రెంటికి విషం పెట్టి చంపేసింది పందొసంత. వేలిముద్దరెయ్యకపోతే మిగిలిన వాటికి కూడా అదే గతి పడుతుందని మొదుటామెని హెచ్చరించింది. మొదటామె ఒక నిర్ణయానికొచ్చేసింది. తనబోటి వాళ్లకివి రోజులు కావు. వెంటనే లేచి యింత వొడిశాకు పెరుక్కోని తినేసింది. ముసిల్ది వొడిశాకు తినేసిందని వూళ్లో ఎట్ట తెలిసిపొయ్యిందో గానీ అందురూ యీదిలో వుడ్డ జేరి పొయ్‌నారు. చీమంతమ్మ వొచ్చి ముసిల్దాని తలకాయ వొళ్లో బెట్టుకొంది. ముసిల్దానికి వూపిరి పీల్చేదానికి కష్టిమై ఆపసోపాలు పడుతూ కూడా చీమంతమ్మకు ఒక మాట చెప్పి మరీ కన్నుమూసింది.

“నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతే గానీ మియాం మియాం అంటా నీ కాళ్ల కాడా నా కాళ్ల కాడా చుట్టక లాడే పిల్లిని చంపలేదే!”

ఈ నవల్లో పందొసంత ఆధునికతను అభిమానించే వారు కళ్లకద్దుకోవాల్సిన పాత్ర. వ్యక్తిస్వేచ్ఛ, స్వతంత్ర భావజాలం, సంప్రదాయాలపై తిరుగుబాటు, సంఘ నియమాల ధిక్కరణ, ప్రాక్టికాలిటీ యిలాంటి ఆధునిక లక్షణాలు కలిగి వున్న పాత్ర. మరీ ముఖ్యంగా వ్యక్తి ఔన్నత్యాన్ని డబ్బుతో కొలిచే సంస్కృతికి ప్రతిరూపం యీ పాత్ర. సంప్రదాయవాదులు గొంతు చించుకొనే నీతి నియమాలు ఎంత డొల్లవో అడుగడుగునా నిరూపించడమే కాకుండా నీతి నియమాలకు కొత్త భాష్యాలు చెప్పగలిగిన పాత్ర. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం, అది సాధించేందుకు ఉన్న మార్గాలను కనుక్కోవడం, ప్రాక్టికల్‌గా ఆలోచించడం, తగిన స్ట్రేటజీస్‌ని అమలు చేయడం, అంతిమంగా విజయాన్ని అందుకోవడం…. ఆధునిక కాలంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు బోధించే అనేక పాఠాలు పందొసంత పాత్ర ఆచరణలో చూపుతుంది. పందొసంత వలన మార్కెట్‌ సంస్కృతి పుట్టుకొస్తుందా, మార్కెట్‌ సంస్కృతి పందొసంతల్ని పుట్టిస్తుందా అనేది ఎప్పటికీ తేలని ప్రశ్న.

ప్రాచీన సంప్రదాయాలతో మనుగడ సాగించే దేశాలన్నిటిలో వ్యక్తులు పరిమిత స్వేచ్ఛ కలిగి ఉంటూ ప్రకృతితోనూ తోటి సమాజంతోనూ మమేకమై జీవించడం కన్పిస్తుంది. వలసవాదులు సంప్రదాయ జీవనానికి ఆలవాలమైన దేశాలను ఆక్రమించి ఆయా దేశాలకు మార్కెట్‌ సంస్కృతిని, అందుకవసరమైన వ్యక్తి స్వేచ్ఛను విస్తృతంగా ప్రచారం చేశారు. క్రమేపీ మార్కెట్‌ సంస్కృతి ప్రపంచీకరణకు దారితీసింది. మార్కెట్‌ సంస్కృతి కోరుకొనేది ఒక్కటే! లాభం. యీ సంస్కృతిలో లాభం కోసం చేసే కార్యకలాపాలకే గౌరవం. యీ మార్కెట్‌ సంస్కృతి 1984 నాటికే దేశం నలుమూలలా వ్యాపించిందని మూలింటామె నవలలో రచయిత సూచన మాత్రంగా చెబుతాడు. తేదీల సంగతి ఎలా ఉన్నా యీ సంస్కృతి నేడు దేశం మారుమూలలకూ వ్యాపించిందనేది నిజం. దీని ఫలితంగానే పర్యావరణం, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు నశిస్తున్నాయనేది నిజం. దీనికి వ్యతిరేకంగా పోరాడే వారు కూడా ఆధునికతను అక్కున చేర్చుకోవడం విచిత్రం. మార్కెట్‌ సంస్కృతి వ్యాప్తిని రచయిత నిస్సహాయంగా, విషాదంగా, క్రోధంగా పరికిస్తున్నట్టు నవలలో మనకు సూచనలందుతాయి. నామినిలోని ఒక తాత్త్విక దృక్పథం మొట్టమొదటిసారిగా మనకు పరిచయమౌతుంది. మునికన్నడి సేద్యం నవలలో కూడా యీ ఛాయలున్నప్పటికీ ఇంతటి స్పష్టత లేదు.

గ్రామీణ జీవితంలోని దారిద్య్రాన్ని, బతుకు పోరాటాన్ని హాస్యంతో రంగరించి ఆత్మకథాత్మకంగా తన రచనల్లో యింతకు పూర్వం చిత్రించిన నామిని ఆ వొరవడిలో అనేక మంది నూతన రచయితలు ఆవిర్భవించేందుకు కారణమయ్యాడు. పిల్ల వసుచరిత్రలనేకం పుట్టుకొచ్చాయి. మూలింటామె నవల ఇతరులు అనుకరించలేనిది. గతంలో నామిని లోని విదూషకత్వాన్ని (పాపం శమించుగాక) ఆస్వాదించిన పాఠకులకు గానీ సాటి రచయితలకు గానీ మూలింటామె నవలలోని కథావస్తువు దాన్ని చెప్పేందుకు అతనెన్నుకున్న స్వరం ఒక పట్టాన రుచించకపోవచ్చు. కానీ ప్రపంచీకరణ దుష్ఫలితాల్ని, ఒకానొక మారుమూల గ్రామంలో అవి ప్రతిఫలించిన విధానాన్ని అత్యంత సహజంగా నామిని చెప్పిన తీరు మాత్రం అత్యద్భుతమనే చెప్పాలి. ఒక అంతర్జాతీయ సమస్యను అదే స్థాయిలో అత్యంత ప్రతిభావంతంగా చిత్రించిన నవలగా మూలింటామె నవల విమర్శకుల మెప్పును పొందుతుంది. ఎన్నుకున్న నేపథ్యం, పాత్రల చిత్రణ, ఎలాంటి ప్రతిపాదనలు ఉపదేశాలు చెయ్యకపోవడం, చెప్పదలుచుకున్న అంశం వైపుకే పాఠకుడి దృష్టి ఉండేలా అనవసరమైన విషయాల్ని పరిహరించడం, అతి కొద్ది పేజీల్లో ఒక విస్తృతమైన అంశాన్ని ఆలోచనాత్మకంగా మలచడం ఇవన్నీ నామినిని ఒక అంతర్జాతీయ స్థాయి కలిగిన తెలుగు రచయితగా నిలబెడతాయి. మూలింటామె ప్రపంచ సాహిత్యంలో స్థానం పొందగల రచన. ఈ నవల ఆంగ్లానువాదం కోసం ఎదురుచూడాల్సి ఉంది.

-పిన్నమనేని మృత్యుంజయరావు

Mruthyunjaya Rao

Download PDF

18 Comments

  • gsrammohan says:

    విశ్లేషణ బాగుంది. దాన్నుంచి మీరు తీసిన కొన్ని కంక్లూజన్స్‌ బాగాలేవు. పందొసంత ఆధునికతను అభిమానించే వాళ్లందరూ కళ్లకద్దుకోవాల్సిన పాత్ర అని వ్యంగ్యీకరించారు. పందొసంత ఆధునికతకు పర్యాయపదం కాలేదు. మార్కెట్‌కున్న అమావనీయ లక్షణాలకు సూచికగా చెప్పుకోవచ్చేమో. ఆధునికత అని మీరు దేన్ని అంటున్నారో తెలీదు. ఆధునికత అన్నది ఏకరూపత ఉన్న విషయం కాదు. ఆధునికతలో మనం దేన్ని తీసుకుంటున్నాం అనేది సందర్భం మీద మన దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది. నవలలో మార్కెట్‌ దుర్మార్గపు లక్షణాలను గురించి రచయిత రాశారు. అంతకుముందలి సంప్రదాయ వ్యవస్థలోని దుర్మార్గాన్ని కూడా చిత్రించారు. మొత్తంగానే గతంలో గొప్పను వర్తమానంలో నైచ్యాన్ని చూసే ధ్వని మీ వ్యాసంలో ఉంది. ఈ అంశాన్ని మినహాయిస్తే నవలను విశ్లేషించడానికి మీరెంచుకున్న పద్ధతి బాగుంది.

    • Mruthyunjaya Rao says:

      రామ్మోహన్ గారూ,
      ఆధునికత అన్నది ఏకరూపత ఉన్న విషయం కాదు. ఆధునికతలో మనం దేన్ని తీసుకుంటున్నాం అనేది సందర్భం మీద మన దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది అని మీరన్న మాటలతో ఏకీభవిస్తాను. అయితే ఆధునికతలో మనం దేన్ని తీసుకుంటున్నాం అనేది కాదు నేను చెప్పదలచింది. మనం ఆధునికతను దేని నుంచి తీసుకుంటున్నాం అనే. ప్రస్తుతం విస్తృతంగా చలామణి లో ఉన్న ఆధునికత వలసవాద భావజాలం నుంచి పుట్టినదనేది నా ఉద్దేశ్యం. అలా చూసినప్పుడు పందొసంత విషయంలో వ్యంగ్యమేమీ లేదు, వాస్తవమే ఉంటుంది.

  • amarendra says:

    మంచి పరిచయం..వెంటనే చదవాలన్న తపన కలిగించింది..

    • Mruthyunjaya Rao says:

      ధన్యవాదాలు అమరేంద్ర గారూ,
      ఈ పరిచయ వ్యాసం యొక్క ఉద్దేశ్యం నెరవేరినట్లే భావిస్తున్నాను.

  • Radha says:

    నేను కూడా మూలింటామెని చదివి (పిడిఎఫ్ పంపారు నామిని గారు) ఏమిటీ గోల అనే అనుకున్నాను. కంప్యూటర్ మూసేసిన తర్వాత కళ్ళముందు ప్రతి పాత్ర కళ్ళముందే. ఏదో దిగులు మనస్సుని కుదిపేసి కళ్ళనించి తెలియకుండానే కన్నీళ్ళు కారిపోయాయి. మూలింటామె మనమరాలు (కథలో అంతర్లీనంగా ఉండే పాత్ర) మీద చాలా కోపమొచ్చింది. ఒక్క మనిషి చేసే తప్పు తన కుటుంబం మీద, సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో కదా అనిపించింది. మూలింటామె, మూలింటామె మనమరాలు మర్చిపోలేని వ్యక్తులు. మూలింటామె నవల కాలానికి నిలబడే నవల. నామిని యొక్క మరో కోణాన్ని చూపించిన నవల. మంచి విశ్లేషణ సార్. ధన్యవాదాలు. ఈ సందర్భంగా నామిని గారిని ఇంకా రాయాలని కోరుకుంటున్నాను.

    • Mruthyunjaya Rao says:

      ధన్యవాదాలు రాధ గారూ! నామిని ఇంకా రాయాలని కోరుకొనే వాళ్ళలో నేను కూడా ఒకడిని.

  • ramana kv says:

    మీరు చెప్పిన పధ్ధతి బాగుంది. కానీ 1984 తర్వాతే మన దేశంలోకి మార్కెట్ సంస్కృతి ప్రవేశించిందని ఎలా అంటున్నారు? మార్కెట్ సంస్కృతి అంతకు ముందు లేదా? మార్కెట్ ను మన దేశంలోకి ఇంగ్లిష్ వాళ్ళో అమెరికన్లో ప్రవేశపెట్టారని ఎలా అంటాం? మార్కెట్ మనకు పురాతన కాలం నుంచీ ఉంది. పందోసంత లాంటి కేరక్తర్లు మన సంప్రదాయ సమాజంలో లేవా? ఈ నవలకు గ్లోబలైజేషన్ కు సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. గ్లోబలైజేషన్ లేక పొతే పందోసంత లాంటి వ్యక్తులు ఉండరా? దయచేసి వివరించండి.

  • Mruthyunjaya Rao says:

    ధన్యవాదాలు రమణ గారూ! 1984 తర్వాతే మన దేశంలోకి మార్కెట్ సంస్కృతి ప్రవేశించిందని ఈ వ్యాసంలో నేను అనలేదు. వలసవాదుల ప్రవేశానికి ముందు మార్కెట్ సంస్కృతీ లేదని నిశ్చయంగా చెప్పొచ్చు. మార్కెట్ సంస్కృతీ అంటే ప్రతి పనిలో లాభం వెదకడం. వలసవాదులు రాక ముందు లేదా వారి ప్రభావం సమాజం మీద పూర్తిగా పడకముందు ఇక్కడి మనుషులు ఏ పని చేసినా వారు నమ్మిన ధర్మం ప్రకారం అలా చెయ్యాలి కాబట్టి చేసేవారు తప్ప లాభం కోసం చేసేవారు కాదు. ఉదాహరణకు ఒక రైతు వ్యవసాయం లాభం కోసం చేసేవాడు కాదు, తన ధర్మం అనుకోని చేసేవాడు. అందుకే పోలంతోనూ, పశువులతోనూ, సేద్యానికి సంబంధిచిన ఇతర వర్గాలతోనూ అతనికి ఆత్మిక సంబంధం ఉండేది. ఎప్పుడైతే లాభకాంక్ష పడగ విప్పిందో ఆత్మిక బంధం పోతుంది. వ్యాపార బంధమే మిగులుతుంది. మన భావజాలానికీ పాశ్చాత్యుల భావజాలానికీ ఉన్న మౌలిక భేదం అదేనని నేననుకుంటాను. పందోసంత లాంటి కేరక్తర్లు సంప్రదాయ సమాజంలోనూ ఉంటాయి. షడ్వర్గాలు మనిషి స్వభావంలోనే ఉంటాయి. కానీ పందొసంతలకు సంప్రదాయ సమాజంలో ఉండే స్థానం వేరు.

    • P.Jayaprakasa Raju. says:

      mee sameeksha , mee samaadhaanam baagunnaayi.

      • Mrithyunjaya Rao says:

        ధన్యవాదాలు జయప్రకాశ రాజు గారూ!

    • ramana kv says:

      సమాధానానికి ధన్యవాదాలు మృత్యుంజయరావు గారూ,
      1984 నాటికే మార్కెట్ సంస్కృతి వ్యాపించిందని మీరు అన్నారు. నాదే పొరపాటు. 1984 అని ప్రత్యేకంగా ఎందుకు అన్నారో తెలియలేదు, వలసవాదుల ప్రవేశానికి ముందు మార్కెట్ సంస్కృతి లేదని అన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. వలసవాదులకు ముందు కూడా మనకు మార్కెట్ ఉంది. చరిత్రలోకి వెళ్ళి మార్కెట్ ఎప్పటినుంచీ ఉందో చూడండి. మార్కెట్ ఉన్నప్పుడు మార్కెట్ సంస్కృతి ఉండదు. మార్కెట్ అంటే అమ్మడం, కొనడం. అమ్మడం, కొనడం మధ్య లాభం ఉంటుంది, కనుక ఇక్కడి మనుషులు ఏంచేసినా ధర్మం కోసం చేశారు తప్ప లాభం కోసం కాదని అనడం కుదరదు. రైతు వ్యవసాయం కూడా లాభం కోసమే చేస్తాడు. తను, తన కుటుంబం తిండి కోసం పండించుకోవడం కూడా ఒక లాభమే. తాము తినగా ఇంకా మిగిలినప్పుడు అమ్ముకోవడం వచ్చింది. అమ్ముకునే అవకాశం లేనప్పుడు ఇతరులతో పంచుకుని ఉండవచ్చు. రైతు పండినా పండకపోయినా ధర్మంగా, నిష్కామంగా వ్యవసాయం చేయడు. లాభం లేని పని ఎవడూ చేయదు. ప్రకృతి, పరిస్థితులు అనుకూలించకపోతే అది వేరు. వ్యాపారబంధం ఉన్నచోట ఆత్మిక సంబంధం, ధర్మం ఉండవని ఎలా అంటారు? వ్యాపారం వృత్తి కావచ్చు. వ్యాపారం చేసేవాడు కూడా మనిషే కదా. మనిషికి ఉండే స్పందనలు అతనికీ ఉంటాయి. అతను వ్యాపారంలో గుంజి గుంజి ఎలా లాభాలు సంపాదిస్తాడో అలాగే మరో చేత్తో దానధర్మాలు కూడా చేస్తాడు. పాశ్చాత్య దేశాలలో ఛారిటీ సంస్థలు లేవా? మనిషి ఎక్కుడున్నా మనిషిగా అతనిలో ఉన్న భావజాలం ఒక్కలానే ఉంటుంది. ఇందులో పాశ్చాత్య, తూర్పు తేడాలు ఉండవనుకుంటాను. మీ అభిప్రాయం ఆర్.ఎస్.ఎస్., విశ్వనాధ మొదలైన వార్ల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోంది.

      • ramana kv says:

        ‘మార్కెట్ ఉన్నప్పుడు మార్కెట్ సంస్కృతి ఉండదు’ అనే వాక్యాన్ని మార్కెట్ ఉన్నప్పుడు మార్కెట్ సంస్కృతి ఉండడా?’ అని చదువుకోగలరు.

      • Manjari Lakshmi says:

        నేను చెప్పింది సమగ్రంగా ఉంటుందో లేదో తెలియదు కానీ నాకు చెప్పాలనిపించి చెపుతున్నాను. అప్పట్లో ఫ్యూడల్ వ్యవస్థలో గ్రామాలలో నివసించే వాళ్ళు భూమి మీదే ఆధారపడే వాళ్ళు(చేతి వృత్తుల వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడి బతికేవాళ్ళు). వాళ్ళకు ఆ వృత్తుల నుంచి బయటపడే స్వేచ్ఛ లేదు. అలాగే కుటుంబములో పెద్దలు, ముఖ్యంగా గ్రామ పెద్దలు వీళ్ళందరికీ లోబడి, ఏ స్వేచ్చా లేకుండా వాళ్ళు ఉండవలసి వచ్చింది. అలా లోబడి ఉండేటట్లుగా వాళ్లకు కొన్ని ధర్మాలు ఏర్పాటు చేసారు. కాబట్టి వాళ్ళు ఆ భావాలకే లోబడి వృత్తులు నిర్వహించే వారు. ఇంత ఉత్పత్తి శక్తులు కూడా అప్పుడు లేకపోవటం వల్ల వాళ్ళు వారి జీవితాన్ని తక్కువ స్థాయిలోనే గడిపారు. ఎవరి జీవనం కోసం వాళ్ళు పాటుపడటమే లాభం కోసం అనకూడదు. దాన్ని మించి ఇంకా సంపాదించి ఇంకా పెట్టుబడులు పెట్టి, ఇంకా లాభాలు, దాని ద్వారా గుట్టల గుట్టల డబ్బులు సంపాదించాలన్న స్వార్ధం తన లాభం కోసం ఎదుటివారిని దోపిడీ చెయ్యటం దాన్ని అనాలి. బతుకుతెరువు కోసం పనిచేయటం స్వార్ధం కాదు. కాని వాళ్ళ మీద ఆ ఫ్యూడల్ ఆంక్షలను పెట్టి దాని ద్వారా శ్రమ చెయ్యకుండానే భోగ భాగ్యాలు అనుభావించిన వాళ్ళు మాత్రం దుర్మార్గులే.

  • మీ సమీక్ష బాగుంది. అభినందనలు సర్,. మీ నుంచి ఇంకొన్ని ఆశిస్తూ.,..

  • ramana kv says:

    మంజరి లక్ష్మి గారి అభిప్రాయం పై…
    వలసపాలన, ఫ్యూడలిజం రెండూ దుర్మార్గమైనవే, క్రూరమైనవే. ఒకటి బయటనుంచి రుద్దింది, ఇంకొకటి లోపలనుంచి రుద్దింది. కానీ వలసపాలనను ఖండించేటప్పుడు దేశం లోపలి ఫ్యూడలిజాన్ని దానికి చెందిన విలువలను రోజీగా చూపించడం జరుగుతోంది. ఫ్యూడల్ అణచివేత పీడిత వర్గాలను స్తబ్దంగా, నిస్సహాయంగా ఒక విధమైన కృత్రిమ వాతావరణంలో ఉంచింది. కొన్ని ధర్మాలకు నిర్బంధంగా కట్టుబడి ఉండేలా చేసింది. వలసపాలనను ఖండించేటప్పుడు అలాంటి జీవితాన్ని గొప్పదిగా చిత్రిస్తున్నారు. ఇది సరైన అవగాహన కాదు. హిందుత్వ జాతీయవాదులు, విశ్వనాథ వారసులు కూడా మరో ముసుగులో అదే చేస్తున్నారు. ఇంత ఉత్పత్తి శక్తులు అప్పుడు లేవు కనుక వాళ్ళు తక్కువ స్థాయిలో జీవించారని మీరన్నది నిజమే. అలా ఎందుకు జీవించారో విస్మరించి అలాంటి జీవితాన్ని గొప్ప చేయడం దగ్గరే సమస్య. జీవించడం కోసం చేసే పనిని లాభం అని ఎందుకు అనకూడదో నాకు అర్థం కాలేదు. లాభం అనే మాటను పెట్టుబడిదారీ వాదం, ప్రపంచీకరణ సందర్భంలో డెమనైజ్ చేయడం వల్ల మీకు అలా అనిపించి ఉండవచ్చు. జీవించడం కోసం చేసే పనిలో జీవించడం కూడా లాభమే.

  • ari sitaramayya says:

    Mruthyunjaya Rao says: July 14, 2014 at 1:08 am
    “ధన్యవాదాలు రమణ గారూ! 1984 తర్వాతే మన దేశంలోకి మార్కెట్ సంస్కృతి ప్రవేశించిందని ఈ వ్యాసంలో నేను అనలేదు. వలసవాదుల ప్రవేశానికి ముందు మార్కెట్ సంస్కృతీ లేదని నిశ్చయంగా చెప్పొచ్చు. మార్కెట్ సంస్కృతీ అంటే ప్రతి పనిలో లాభం వెదకడం. వలసవాదులు రాక ముందు లేదా వారి ప్రభావం సమాజం మీద పూర్తిగా పడకముందు ఇక్కడి మనుషులు ఏ పని చేసినా వారు నమ్మిన ధర్మం ప్రకారం అలా చెయ్యాలి కాబట్టి చేసేవారు తప్ప లాభం కోసం చేసేవారు కాదు.”

    ఈ మధ్య నేను శ్రీ పరబ్రహ్మశాస్త్రి గారి “కాకతీయులు” చదివాను. ఆ పుస్తకంలో 232 వ పేజీలో ఇలా రాసి ఉంది: “కాకతి ప్రతాప రుద్రుడు రచించి నట్లుగా ప్రసిద్ధమైన నీతిసారమనే రాజనీతి శాస్త్రగ్రంథం రాజ్యంలో సక్రమంగా వాణిజ్యం జరగటానికి రాజు చేపట్టపలసిన బాధ్యతలను తెలుపుతూ ఉంది. వాణిజ్య సరుకులను రాజు సొంతానికి వాడుకున్నా, సుంకం పెంచినా, వ్యాపారం చేసుకోవటానికి పరదేశి వ్యాపారులకు అనుమతి ఇవ్వకపోయినా, వ్యాపారులు తమ ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచినా చూస్తూ ఊరుకున్నా, బరువులు కొలతలలో మోసాలు జరగనిచ్చినా, దొంగతనాలు కల్తీలు మోసపు తక్కెడలు సాగనిచ్సినా ప్రజలకు వినాశమేనని ఈ గ్రంథం చెప్తుంది. ఒక వ్యాపారి మొత్తం సరుకును తన అధీనంలో పెట్టుకుని ధరపెంచే ప్రయత్నం చేస్తే దాన్ని అతి తక్కువ ధరకు రాజు స్వాధీనం చేసుకోవాలని కూడా నీటి శాస్త్రం చెప్తున్నది.”

    అంటే ఈ జబ్బులన్నీ తెలుగు దేశంలో ఇంగ్లీషువాళ్ళు రాకముందే, ముస్లింలు రాకముందే ఉండేవి.

  • కోటి లక్ష్మీ నారాయణ says:

    మూలింటామే నవల మీద మీ అభిప్రాయం బాగుంది. నామిని గారు ఇదివరకు చేసిన రచనలు కాలాన్ని బట్టి అప్పటి వాస్తవాలను చిలిపిగా హాస్యం తో కూడుకొన్నవి. ఈరోజు వాస్తవాలను ఈ నవల పరిచయం చేసింది. ఒకరకంగా ఇది ఆయన వయసు యొక్క పరిపక్వత కూడా ప్రతిబిస్తుంది.

Leave a Reply to ramana kv Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)