చందమామని చూడని వెన్నెల

Chanda

రచయిత పరిచయం

రెండు దశాబ్దాలపాటు సామాజిక ఉద్యమాలలో పాల్గొని ఝార్ఖండ్ లోని హజారీబాగ్ లో ఉన్న కేంద్ర కారాగారం లో నాలుగేళ్ళు గడిపారు. జైలు జీవితం గురించి ఇప్పటివరకు 14 కథలు, ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలలోనూ, మహిళామార్గం లోనూ, అరుణతార లోనూ ప్రచురితమయ్యాయి. ఇతర కథలు మహిళామార్గం పత్రికలలోనూ, సంకలనాలలోనూ ప్రచురితమయ్యాయి.

~

 

“నా పుట్టిన రోజు గురించి నాకో కొత్త విషయం తెలిసింది. తిథిల ప్రకారం అయితే నేను బుద్ధ పూర్ణిమ రోజు పుట్టానట. తెలుసుగా అది చలం పుట్టిన రోజు కూడా. నువ్వు ఇన్నేళ్ళ తరవాత వచ్చావు కనక ఆరోజు ఒక చిన్న గెట్ టు గెదర్ ఏర్పాటు చేస్తున్నా. కొద్ది మంది నా సన్నిహిత మిత్రులు నిన్ను కలవాలనుకొంటున్నారు. ఎగ్గొట్టకు.”

స్వాతి నుంచి వచ్చిన ఆహ్వానం చూసి చాలా సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. చివరికి తాను ఫోన్ చేసి నా అంగీకారంకోసం అడిగితే ఇంక సరే అన్నాను.

నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆశ్చర్యంగా చూస్తున్న నన్ను చూసి నవ్వి “పద. నీకో చిన్న సర్ ప్రైజ్” అంటూ టెర్రస్ మీదకి తీసుకువెళ్ళింది. పైన శుభ్రం చేయించి కింద చాపల మీద పరుపులు వేసి దుప్పట్లు పరిచింది. ఆనుకోడానికి వీలుగా కొన్ని దిండ్లు. దూరంగా ఒక వైపు ఒక బల్ల మీద తిండి ఏర్పాట్లు కాబోలు గిన్నెల మీద మూతలు వేసి ఉన్నాయి. కొన్ని ఖాళీ ప్లేట్లు గ్లాసులు అన్నీ పెట్టి ఉన్నాయి. ఒక మూలగా చిన్నగా వెలుగుతున్న లైట్. దానిని తాత్కాలికంగా ఇప్పుడే ఏర్పాటు చేసినట్టున్నారు. ఆ వెలుగు అంతగా రాని చోట పక్కలు వేసి ఉన్నాయి. చల్లగా కురుస్తున్న వెన్నెల. నాలుగైదు అంతస్తుల పైన కాబట్టి ట్రాఫిక్ గోల అంతగా వినబడడం లేదు.

“ఎంత ప్రయత్నం చేసినా డాబా ఇల్లు, కొబ్బరి చెట్టు ఆకుల సందుల్లోనించి చందమామని చూసే ఏర్పాటు చెయ్యలేకపోయాను. దీనితోనే అడ్జస్ట్ అయిపోవాలి” అంది. “పట్టణాల్లో కరెంటు తీగల మధ్యనుండి తప్ప కొబ్బరాకులెక్కడివిలే” అన్నారెవరో. అందరం నవ్వుకొన్నాం.

పరిచయాలయ్యాయి. అందులో కొందరు నాకు పేర్లు విని ఉన్న పరిచయం. కొందరు అస్సలు తెలియదు. కొద్ది మందిమే ఉన్నాం కాబట్టి ఆ వాతావరణాన్ని ఆనందించడానికి వీలుగానే ఉంది.

ఆ రొమాంటిక్ వాతావరణం చూస్తుంటే వేరే ఏమీ మాట్లాడాలనిపించడం లేదు. సరిగ్గా అప్పుడే స్వాతి మాట్లాడడం మొదలుపెట్టింది. మన పార్టీ లో మొదటి రౌండ్ అందరూ చందమామ మీద కానీ వెన్నెల మీద కానీ పాట పాడాలి.

“పాటలు రాని వాళ్ళు ఏం చెయ్యాలి?” అంది పావని.

“చదవాలి” అంది పద్మ.

“ఛ! ఎంత అన్ రొమాంటిక్ ఆలోచన?” ఒకేసారి స్వాతి, మాధవి అన్నారు.

“ఓకే! పాటలు రాని వాళ్ళు ఒక ప్రేమ కథ చెప్పాలి. నేనసలు దానిని సెకండ్ రౌండ్ కి అనుకొన్నా”. అని సమస్య పరిష్కారం చేసింది స్వాతి.

“మాధవితో షురూ చేద్దాం. అద్భుతంగా పాడుతుంది” అంది పావని. నిజంగానే మాధవి మొదలుపెట్టాక ఇక వంతుల విషయం మర్చిపోయి అది మీరు కోరిన పాటల రూపం తీసుకొంది. అడగడమే ఆలస్యంగా తాను అనేక పాటలు వెన్నెల మీద, చందమామ మీద పాడింది. తనకి తెలియకుండానే రాధిక తోడయ్యింది. కొన్ని పాటలు తను పాడాకా, కరుణ కొన్ని హిందీ పాటలు పాడింది. అందరం ఒక ట్రాన్స్ లో ఉన్నట్టు ఉన్నాం.

ఇప్పుడిక ప్రేమ కథల రౌండ్ అని స్వాతి ప్రకటించింది.

“నేను మా చానల్ కి స్టోరీ కోసం ఒక సారి చాలా దూరం నడవాల్సి వచ్చింది. అప్పుడు ఇలాగే వెన్నెల. ఆ వెన్నెల చూస్తే ప్రేమ కథలు వినాలని మహా సరదా పుట్టింది. నాతో పాటు వచ్చిన కొలీగ్ ని తన ప్రేమ కథ చెప్పమని మస్తు సతాయించాను. ఎంతయినా పక్కన వాళ్ళ ప్రేమ కథలు చెప్పడం సులువు” అని తను విన్న ఆ ప్రేమ కథ చెప్పింది పావని.

తరవాత నా వంతు వచ్చింది. మరో సందర్భంలోనయితే నేను పాటలు పాడడాన్నేఎంచుకొని ఉండేదాన్ని. కానీ అప్పుడు మాత్రం నాకు కథ చెప్పాలనిపించింది.

“నేను ఒక కథ చెప్పాలనుకొంటున్నా” అన్నాను.

“మరొక జైలు కథా?” అంది చప్పున రాధిక.

నేను నవ్వి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. “నేను థీమ్ ని మార్చడం లేదు. నేను చెప్పే కథ కూడా వెన్నెల గురించే. “చందమామని చూడని వెన్నెల గురించి.”

***                                           ***                                           ***

“చందమామ రావే..

జాబిల్లి రావే….”

ఏదో ఒక భాషలో ఈ పాట తెలియని మనుషులు, బహుశా ఉండరు. బహుశా అని ఎందుకన్నానంటే చందమామ మీద పాట లేని భాష ఏదన్నా ఉందేమో మనకేం తెలుసు? కానీ చందమామని చూడని పిల్లలెవరన్నా వుంటారా? క్షణం కూడా ఆలోచించకుండా జవాబు చెప్పగల ప్రశ్న.

“ఉండరు”

నేను రాజకీయ ఖైదీగా జైలు కి వెళ్ళక పోతే బహుశా నేను అదే జవాబుని తడుముకోకుండా చెప్పేదాన్ని. మనకి తెలిసిందే సర్వం కాదు. ఇప్పటి వరకూ… మనకు తెలిసిందే “పరమ సత్యం”. విశ్వంలోని ప్రతీదీ సాపేక్షికమే అనే విషయం తెలియదా, అంటే తెలుసు. కానీ, దానిని ప్రతి ఒక్కదానికి అన్వయించుకోలేని చేతకానితనం నాదని సవినయంగా వొప్పుకొంటున్నాను. కాబట్టి ఏమో ఉండచ్చు అని ఊహించలేకపోయాను. “ఉంటారు” అనేది ఈమధ్యనే తెలిసిన కరకు వాస్తవం.

ఆ పాప పేరు చాందినీ (వెన్నెల). ఝార్ఖండ్ లోని ఒక ఆదివాసీ అమ్మకి ముసల్మాన్ నాన్నకి ప్రేమ గుర్తుగా పుట్టిన ఒక ముద్దులు మూటకట్టే పాప. వాళ్ళిద్దరూ విచారణలో వున్న ఖైదీలు.

వాళ్ళమ్మ చాందినీకి చాలా ఇష్టంగా ఆ పేరు పెట్టింది. ఆదివాసీ జీవితాల్లో ప్రకృతి ఒక భాగం. వాళ్ళ పేర్లయినా, పండగలయినా రోజువారీ జీవితమయినా అంతా ప్రకృతి తోనే ముడిపడి ఉంటుంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి పాటల పోటీల్లో ఒకబ్బాయి వెన్నెల మీద పాడిన పాటకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అతను చాలా అద్భుతంగా పాడాడు. కానీ ఆ పాట ఏమిటో తెలుసా? “కాని చోట కాసావే వెన్నెలా? కారడవుల కాసావే వెన్నెలా!” దానిభావంలోని అసంబద్దత గురించి అర్థం అయ్యే వయసు కాదది. అది అర్థం కావడానికి మరో దశాబ్దం పట్టింది నాకు. అడవుల్లోనూ మనుషులుంటారు. అడివిలోనే పుట్టి పెరిగి అడవినే ఇళ్లుగా చేసుకొన్నవాళ్ళు. వాళ్ళకి మనలాగా ఎలక్ట్రిక్ దీపాలు అవసరం లేదు. ఏదైనా చల్లని ఆ మసక మసక వెన్నెల లోనే. మనుషులు లేని అడవి లోనయినా ఎన్నో జీవాలు, జంతువులు వెన్నెలని ఎంత ఆస్వాదిస్తాయి! వెన్నెలలో తడిసిపోతూ మిలమిలలాడిపోయే ఆకుపచ్చని చెట్లని చూస్తే వాటికి ఎంత గర్వంగా అనిపిస్తుండొచ్చు? సమస్త భూమండలాన్ని తన వెన్నెలతో గుబులు పుట్టించి, అశాంతిని రేపి, మళ్ళీ తానే స్వాంతన కలగ చేసే చందమామ మీద హక్కు ఏ ఒక్కరిదో ఎలా అవుతుంది? బహుశా ప్రతి ఒక్కరూ తమదే అనుకొంటారు. ఎంత అన్యాయమైన పాట కదా అది. ఆ పాట రచయిత ఒక వెన్నెల రాత్రి కారడవిలో గానీ గడిపితే, ఆ పాట రాసినందుకు గుండెలు బాదుకొంటాడు. అడవి కాచిన వెన్నెల అని ఎవరన్నా సామెత వాడితే ఇప్పుడు కేవలం జాలి పడగలం అంతే.

చాందినీని కనక ముందు వాళ్ళమ్మ కూడా అలా వెన్నెల్లో ఆడుకొన్న అడవి పిల్లే. బతుకు తెరువు ఆమెని ఇళ్ళల్లో పని చేసుకొని బతకడానికి ఢిల్లీ చేర్చితే ఆమె మొదటి సారిగా వెన్నెల్లో తాజ్ మహల్ ని చూసింది. షాజహాన్ ప్రేమకథ గురించి మొదటిసారి విన్నది. తాను పని చేసే ఇంటివాళ్ళు ముంబయ్ కి బదిలీ అయితే అక్కడ అదే ఇంట్లో డ్రైవర్ గా పని చేసే జమాలుద్దీన్ ని ప్రేమించింది. నేనిప్పుడు చెప్పబోయేది వాళ్ళ ప్రేమ కథ కాదు. కానీ వాళ్ళ ప్రేమ కథ కి సాక్ష్యం మాత్రం వెన్నెలనే. అలా అడివిలో వెన్నెల దగ్గర మొదలయిన జీవితం వెన్నెల్లో తాజ్ మహల్ సమక్షంలో కొత్త జీవితానికి బాసలు చేసుకొనేవరకూ వెళ్లింది. అమాయకంగా ఒకరికి సాయపడబోయి వాళ్ళిద్దరూ జైలు పాలయ్యారు. జైలులోకి ప్రవేశించాక కానీ తాను తల్లిని కాబోతున్నానని ఆమెకు తెలీలేదు. వెన్నెలతో అల్లుకు పోయిన తన జీవితానికి కొత్త వెలుగు లాంటి ఆ పసిదానికి ప్రేమగా చాందిని అని పేరుపెట్టుకొంది. జైలులో కళ్ళు తెరిచిన ఆ చిన్నారికి చాలా అసహజమైన వాతావరణంలో జీవితం మొదలయ్యింది.

జైలులో సాయంత్రం చీకటి ఇంకా పడుతూ ఉండగానే లాకప్ చేసేస్తారు. సరిగ్గా పక్షులు గూటికి చేరేవేళ. ఆ సుందర దృశ్యాలేవీ కళ్ల నిండుగా చూడకుండానే అందరం ఎత్తైన గోడల వెనుక రాతి కట్టడంలో ఏ వైపునుండీ పొరపాటున కూడా చందమామ కనపడే అవకాశం లేని చోటులో లాకప్ అయిపోతాం. కిటికీలు వుంటాయి. కానీ దానిలోనుండి ఎప్పుడూ కనపడేది కాదు. “చందమామ దూర్ కీ…. పువ్వే పకాయే గూడ్ కీ” అని వాళ్ళమ్మ హిందీలో చాందినీకి పాటలు నేర్పుతోంది. చాందినీ ముద్దుముద్దుగా పాడుతోంది కూడా.

మేమున్న హజారీబాగ్ సెంట్రల్ జైల్లో టీవి వుంది. అయితే చాలా రాష్ట్రాల్లో జైల్లో కేవలం దూరదర్శన్ మాత్రమే వస్తుంది. ఆదివారంపూట వచ్చే హిందీ పాటల కార్యక్రమం రంగోలిని సాధారణంగా మిస్ అయ్యేవాళ్ళం కాదు. పిల్లలైతే చెప్పనక్కర్లేదు. వాళ్ళు ముందు వరసలో కూర్చుని కళ్ళు ఆర్పకుండా చూసేస్తుంటారు. ఖైదీల పిల్లలు 5 యేళ్ళ వయసు వచ్చేవరకు తల్లులతో పాటు ఉండవచ్చు. కాబట్టి ఎప్పుడూ జైల్లో 20-25 మంది పిల్లలు ఉంటూనే వుంటారు. వాళ్ళందరికీ రింగ్ లీడర్ డాలో. చాందినీ వాళ్ళమ్మ, డాలో వాళ్ళమ్మ స్నేహితులు. కాబట్టి డాలో ఎప్పుడూ చాందినీ ని ఎత్తుకొని తిరుగుతూ వుండేది. చాందినీని ఎత్తుకోవడానికీ అందరూ పోటీలు పడేవారు. ఆమె ఎప్పుడు ఎవర్ని కరుణిస్తే వాళ్ళు ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. అలా డాలో చాందినీని వొళ్ళో కూర్చుపెట్టుకొని టీవి చూస్తుండగా ఒక చందమామ పాట వచ్చింది. చూడు చూడమని పిల్లలందరూ పోటీలుపడి మరీ చందమామని చూపించారు. అప్పటికి తనకి వివిధ వస్తువులు చూపించి మాటలు నేర్పిస్తావున్నారు. ఫేనేది? బల్బేది? పిల్లేది? అంటే కిలకిలా నవ్వుతూ చూపించేది. చందమామేది? అంటే టీవి కేసి చూపేది. అందరూ నవ్వేవాళ్ళం. వాళ్ళమ్మ కూడా నవ్వేది. కానీ అప్పుడప్పుడు నవ్వుతో పాటు కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేవి.

చాందినీకి రెండేళ్ల వయసు వచ్చేసింది. అనేకసార్లు చందమామని టీవీ లో చూడగానే గుర్తు పట్టి చప్పట్లు కొట్టి నవ్వి మరీ చెప్తోంది. కానీ ఆకాశంలో మాత్రం చూడనే లేదు. అలాంటి సందర్భంలో హోలీ పండగ వచ్చింది. జార్ఖండ్ లో హోలీ ని చాలా ధూంధాం గా జరుపుకొంటారు. జైల్లో కూడా! ఆ సందర్భంగా ఖైదీలకు ఒక రోజు మీట్ కూడా ఇస్తారు. ఆసారి ఏదో కారణం వల్ల కూర వండడం ఆలస్యం అయ్యింది. పైగా ప్రతి ఒక్కరికీ 100గ్రాముల చొప్పున తూచి ఇస్తారు. కాబట్టి లాకప్ చేసి ఇవ్వడం కుదరదు కనక మహిళా వార్డు లోని మూడు బ్యారక్ లు తెరిచే వున్నాయి. వార్డు ఎప్పుడూ మూసే వుంటుంది. లోపల బ్యారక్లు మాత్రమే తెరిచి వుంచుతారు. ఆరోజు ఎప్పటిలా 5.30 కి కాకుండా 7 గంటల వరకూ పంపకాలు పూర్తికాక కిందా మీదా అవుతున్నారు. అలాంటి సమయంలో అంత అరుదుగా దొరికిన అవకాశంలో కూర కోసం లైన్లో నిలబడడం ఏంటని! చాలా మందిమి ఖుషీగా వెన్నెల్లో చేతులు పట్టుకొని ఒకటే ఎగిరాం. అదిగో అప్పుడు చూసింది చాందినీ. అదీ ‘పున్నమి’ చంద్రుడిని. ఆ రోజు సాయంత్రం “స్వేచ్ఛ” గా ఆవరణలో తిరుగుతుంటే లేత నారింజరంగులోంచి మెల్లగా లేత పసుపులోకి….మారుతూ పైకి ఎగుస్తూ ఆకాశంలోకి ఎగబాకుతున్న చందమామని అందరికన్నా ముందు గుర్తుపట్టింది చాందినీనే! అప్పటినుండి ఎప్పుడడిగినా ఆకాశం వైపు చూపించి విస్మయంగా కళ్ళు పెద్దవి చేసి, చిట్టి చిట్టి చేతులు అందంగా తిప్పుతూ “గాయెబ్” (మాయమయిపోయాడు) అనేది. అదొక్కటే సారి తను చందమామని చూడడం. కానీ ఆ తరవాత ఎప్పుడూ మళ్ళీ తను చందమామ ఏదని అడిగితే టీవీ కేసి చూపలేదు.

చాలా తొందరగా చాందినీకి మాటలు వచ్చాయి. ఏదంటే అది తిప్పి అనేసేది. తనని ఒకటే వాగించి మేము నవ్వినవ్వి వినోదించేవాళ్ళం. ఒక రోజు నేను కమానీ ఘర్ లో కూర్చుని కాగితాలు వెలిగించి ఆ మంట మీద మేగీ చేస్తున్నా. చాందినీ నేను కమాని ఘర్లోకి వెళ్ళడం చూసి నా వెనకాలే వచ్చింది. మూడు రాళ్ళ పొయ్యి వెలిగించగానే పరిగెత్తి గిన్నె తెచ్చుకొంది. “దేనా”…(ఇవ్వా?)అంటూ ముద్దుగా అడుగుతుంటే ఏడిపించబుద్దయ్యి…”నేను ఇవ్వను ఫో!” అన్నాను.

అప్పుడు చాందినీ… “ఉఠాకే ఫేక్ దెంగే తో చందమామా కె పాస్ చల్ జాయెగీ” (ఎత్తి విసిరేశానంటేనా చందమామ దగ్గరికెళ్లి పడతావ్!) అంది.

ఇంత అందంగా ఇప్పటివరకూ నన్నెవ్వరూ తిట్టలేదు. చందమామ అలా అంత బుజ్జి బుజ్జి మనసులని కూడా ఎలా దోచేస్తాడో అని నివ్వెరపోతూ చాందినీని ముద్దుల్లో ముంచెత్తాను.

పుచ్చపువ్వులాంటి వెన్నెల్లో మౌనంగా కథ విన్న అందరి మనసుల్లోనూ ఇప్పుడు వెన్నెల స్థానంలో “చాందినీ”

నిండిపోయిందని వేరే చెప్పనక్కర్లేదు కదా.                                                                       ***

 

-బి.అనూరాధ

కథా చిత్రం: మహీ పల్లవ్

 

Download PDF

20 Comments

 • దాము says:

  అనురాధ గారివి ఆంధ్ర జ్యోతి ఆదివారంలో వచ్హిన జైలు కథలు చదివాను. ఆమె తెలుగులో అరుదైన రచయిత. నాతో సహా అనేకమంది జైలులో వున్నాం కానీ, ఆ జీవితానికి సంబంధించి రాసినవి చాలా తక్కువ. వొక సారి జైలుకి వెళ్ళి వచ్హిన వాళ్ళ జీవితం మీద కొత్త చీకటి ప్రవహిస్తుంది..ఆ చీకటి లోంచి స్రీ ఖైదీల జీవితాల్ని అనురాధ గారు రాయటం వొక wonderful event తెలుగు సాహిత్యంలో. అయితే ఇది కథ కాదు. అంటే fiction కాదు . కానీ fiction లాగ రాయడానికి ప్రయత్నించడం వల్ల అటు కథ కాకుండా ఇటు non fiction కాకుండా పొయే ప్రమాదం వుంది..ఆమె కథ చెప్పదానికి తీసుకున్న నేపధ్యం అంతా అనవసరం అని నా అభిప్రాయం..ఆమె తన జైలు అనుభవాల్ని అలా raw గా చెబితేనె బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఆమె మరిన్ని జైలు జీవితాల్ని అక్షరాల్లోకి తెస్తుందని ఆశిస్తూ..

  • B. Anuradha says:

   దాము గారు,
   థాంక్ యు. అయితే అందులో పార్టి fiction కాదు. ఆ సందర్భాన్ని కూడా కథలో చేర్చడం అవసరం లేదనేది
   వేరే విషయం అనుకోండి. మీ సూచన దృష్టిలో ఉంచుకొంటాను.
   అనూరాధ

   • Raj says:

    దాము గారి వ్యూ తో నేను అంగీకరించినా ఇంకొక విధంగా కూడా అలొచించవచ్చు. మన తెలుగు రాతల్లో ఇంకా experimentation చెయ్యాలి రచయతలు. (sorry for my patchy Telugu, I am trying :- ( ). ఫిక్షన్ మరియు నాన్-ఫిక్షన్ categories మాత్రమే కాకుండా personal memories మరియు ట్రావెల్ experiences, ఇమిగ్రెంట్ ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపి ఇన్నోవేటివ్ గా రాసిన W.G. Sebald రచనలు చూడండి, for example. అనురాధ గారు, I am interested to read more of your writings.

   • B. Anuradha says:

    Sorry for the delay in responding. Thank you for your comments. Do send me your mail.ID. I will send you my other stories.
    anu13ravi@gmail.com

 • అనురాధా !
  ఏడుస్తున్న పిల్ల ల కి చందమామ ని చూపించి అన్నం తింపించని అమ్మ ఉందా ఈ ఇలలో ! అని అనుకుంటాం ..కానీ ,ఇలాగ కూడా ఉంటారు , అని చూపించావు .నీ కథ లాంటి నిజం లో .మనం వెన్నెల అంతా మన కోసమే అని దోచేసుకుని దాచేసుకునే వాళ్ళమే , వీలు ఉంటే , అడవి కి వెన్నెల అవసరమే ,అడవిలో నూ జీవాలు ఉంటాయి ..అవును ఎంత నిజం
  ఇంక నాలుగు బలమైన గోడల మధ్య బంధింపబడ్డ జీవులకి వెన్నెల కూడా అందని చాయ ..చాందినీ అని పేరు లో నె వె్న్నెల దాచుకున్న ఆ పాప ముద్దుల మోము ని తలుచుకుంటే హృదయం ద్రవించింది ..ఈ వ్యవస్థ లో ఇలాంటి వెన్నో ..మనం మౌన ప్రేక్షకులం ..ఈ దారుణాలకి ..
  అనురాధా ..ఇంకా మంచి మంచి కథలు నీ దగ్గరనుంచి రావాలని ..ఆశిస్తూ ..
  వసంత లక్ష్మి

  • B. Anuradha says:

   వసంతక్కా,
   కథ మీకు నచ్చినందుకు సంతోషం. మరిన్ని కథలు రాయగలనో లేదో కాని, తప్పక ప్రయత్నిస్తాను.

 • balu says:

  bathuku cherapadda manishiki vennela o odarpu. cheralopadda manishiki adinishedame. anuradha gari chandamamanu chudani vennela katha . nirbhandam lonu samanya jeevitha konanni chupina goppadananiki vandanam

 • నా మనసులోనూ చాందిని నిండిపోయింది. మంచి కథ చదివాను.

  • B. Anuradha says:

   చాందిని గురించి వింటేనే మనసు నిండిపోయింది కదా! ఇక చూసి తనతో రెండేళ్ళు ఆడుకొన్నాక ఎలా అనిపిస్తుందో ఉహించండి. I miss her a lot. మంచి కథ అని ఎవరన్న మేచ్చుకోన్నప్పుడు నిజానికి ఎక్కడో కలుక్కుమని కూడా అంటుంది ఎందుకంటే జైలు గురించి నేను రాసిన కథలన్నీ సజీవమైన వ్యక్తుల గురించి. చాన్దినీలని మన సమాజం కాపాడుకొంటుందన్న ఆశతో ఈ కథలన్నీ చెప్పడం.
   Thank you.

 • Radha says:

  అనురాధ గారూ, బావున్నారా? నా మనసులో కూడా చాందిని, ఆమెతో పాటు ఆమె చందమామ ఇద్దరూ నిండిపోయారు. ఆ పాప ఇప్పుడెక్కడుందో తెలుసుకోవాలనిపిస్తోంది ఇది నిజం కథ అయితే….. అభినందనలు.

  • B. Anuradha says:

   రాధగారు
   చాందిని కథ నిజమే. మీరు ఆంధ్రజ్యోతిలో వచ్చిన పహచాన్ కథ చదివి ఉంటె చాందిని అందులోని శిల్ప కూతురు.
   unfortunately నేను రాసిన కథలలోని పాత్రలు (వ్యక్తులు ) ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసుకొనే అవకాశం నాకు లేదు. కథ మీకు నచ్చినందుకు సంతోషం.

 • allam rajaiah says:

  chandini tahnanu chandamamanu chudaniyyaka pothe everinina chandamama daggariki visari pareyyagala samrthuralu…dabbu adhikaramu chandamamanu odilipedithe andariki dorukuthayi…kani ayidu yendlalla chandiniki dorikina anubhavamu matallo cheppalenidi…

  • B. Anuradha says:

   రాజయ్యగారు,
   చాందిని కి రెండు సంవత్సరాలే అప్పటికి. అదే ఆశ్చర్యం. అంత చిన్న పాప మీద ఎంత ప్రభావం వేసాడే చందమామ అని.

 • Makineedi Surya Bhaskar says:

  అనురాధ గారూ,
  మీ కథ మనసును కదిలించింది. చందమామను చూడని చిన్నారి ఉంటుందని, ఉండగలదని నా ఉహకు ఎంత మాత్రం అందని విషయం. ఆ పాయింట్ మీద మీ కథనం మనసుకు హత్తుకునేలా బాగా సాగింది. మీకు నా అభినందనలు.
  పోలికైతే లేదు కానీ, కథ చదువుతున్నంత సేపూ నాకు ఎప్పుడో రాసిన నా కవిత ‘చాందినీ’ గుర్తుకు వస్తూనే ఉంది. చాందినీ నా మేనకోడలు. ఇపుడు పదో తరగతి చదువుతోంది. ఆ కవిత మీ కోసం-

  చాందినీ
  మామయ్య పెళ్లి చేయడానికి/ ఈ మధ్యే మా ఇంట పుట్టిందో పాపాయి-/ లేత చాందినీ తునకలా…/పసిమి వెన్న ముద్దలా…
  ఆహ్వాన పత్రాలు అందుకుని/ రెక్కలల్లార్చుకుంటూ /వచ్చారెందరో అతిథులు
  అందరికీ విన్డులయ్యాయి మా పాపాయి బోసి నవ్వులు
  పాపాయి పుట్టి ఎవరెవరికి / ఏ ఏ హోదాలు కల్పించిందో/ మేమంతా మురిసిపోతూ చెప్పుకుంటూ/కలల్లో తేలుతుండగా-
  ఆ సాయంత్రం ఆర్ద్రపూరమైన మేఘ శకలంలా / ఏక ధారగా కురిసి /పెదనాన్నాని తడిపింది/పాపాయి ప్రేమ/ పారిజాతం చెట్టు నుంచి వచ్చే పరీమళంలా /మా పాపాయి కళ్ళ చిరు దివ్వెల మత్తులు/ అందర్నీ కమ్మేయగా…
  పెళ్లి రోజు- దీప తోరణాలు ప్రాంగణమంతా పరచుకున్నా/ చుక్కల దీపాలు ఒక్కటీ… ఒక్కటీ/ ఆకాశంలో మినుకు మినుక్కుమన్నా…/నిద్రపోకుండా పెద్దారిందాలా, రాత్రంతా మేలుకుని /చేతుల్లోంచి మెత్తగా చేతుల్లోకి జారుతూ/’మొఖ’మల్ నవ్వుల కాంతులతో/ కళ్యాణ మండపాన్ని వెలిగించింది.
  పాపాయి నవ్వుల వెన్నెల కాంతి ముందు/ఎంత ముస్తాబైనా వెలవెలబోతూ / పాపం, పెళ్లి కూతురు/ తల వంచుకు కూర్చుంది!
  అత్తను చూసుకుంటూ/మురిసిపోతూ మామయ్య / మూడు ముళ్ళూ వేస్తుంటే- కేరింతల అక్షతలు చల్లి / దీవించింది చిట్టి తల్లి!
  thank you very much – మాకినీడి

 • rajani says:

  అను నీ కథ బాగుందని చెప్పడం కంటే నిజంగా ఆర్ద్రత నిండి పోయింది. జాబిలి కి నీ కథ చదివి వినిపించాను ఇప్పుడే అను నీ జైలు కథలు కూడా చాల బాగున్నాయ్.అను రెగ్యులర్ గ ఇలాంటి కథలు రాస్తూ ఉండు. జీవితానుభవం లోంచి వచ్చిన రచన ఎప్పుడైనా ప్రత్యేకమే అని నా ఉద్దేశం.

  • Anuradha says:

   హాయ్ రజనీ
   తప్పకుండా నాకు పరిచయమైన ఈ కొత్త జీవితాన్ని
   మరిన్ని కథలలో చెప్పే ప్రయత్నం చేస్తాను. నీ స్పందనని తెలియజేసినందుకు చాలా సంతోషం.
   అనూ.

 • devulapalli durgaprasad says:

  మీ కధలోని
  వెన్నెల కిరణాలు, వేదన పవనాలు
  జైలు గోడల జీవితాలు
  జాబిలి జాడ లేని పసితనాలు
  తడిపేసి పోయాయి మది వీధులు
  తరచి చూపిస్తున్నాయి చీకట్లో నీడలు!
  మీ సృజనకు, మీ తపనకు
  అభినందనలు

  • B Anuradha says:

   దుర్గా ప్రసాద్ గారూ,
   నా తపన వరకు నిజమే కాని, అందులో నా సృజన మాత్రం లేదండి. చాందిని వెన్నెలంత నిజం.
   మీ అభిమానానికి కృతజ్ఞతలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)