బహుశా చాలా రోజుల్నించి, కొన్ని నెలల నుంచి నేను యాకూబ్ లోకంలోనే బతుకుతున్నా, ప్రతి కవికీ వాడిదయిన ప్రపంచం వుంది. అనుభవం వుంది. అందరి చుట్టూ అదే ప్రపంచం ఉంది, అనుభవం వుంది. అందరిచుట్టూ ప్రపంచం వున్నా. ఆ కవి అందుకున్న అనుభవం ప్రత్యేకమయింది. ఈ ప్రపంచాన్ని ఆ కవి ఎలా దర్శించాడు, ఘర్షించాడు, ఆనందించాడు, దు:ఖపడ్డాడు. తనదయిన అనుభవ ప్రపంచాన్ని ఎలా సృజించుకున్నాడు, బహుశా అతని ఆశలు ఆవేదనలు ఉద్వేగాలు సర్ధుబాటులు, సమన్వయాలు, తను కొత్తగా కనుగొన్న సత్యం తాలూకు వెలుగు-
ఏమి ప్రపంచమది, మనకందుబాటులో వున్న ప్రపంచాన్న అతనెలా అనువదించాడు, ఎప్పుడూ సుఖంగా వున్నట్టు, లేనట్టూ, రక్తాలోడుతున్నట్టు, అనంతమయిన పూదోటల్లో తిరుగుతున్నట్టు అడవికట్టంబడి నడుస్తున్నట్టు, అకస్మాత్తుగా వాగువెల్లువెత్తినట్టు, దరులు విరిగి పడుతున్నట్టు జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నట్టు- ఎప్పుడూ ఒక ఎదురుచూపు, ఒక ఆరాటం ఒక ఆప్యాయతకోసం అర్రులు చాచటం, ఒక చల్లని స్పర్శకోసం తపించటం, సుదీర్ఘమయిన రాత్రుల్ని కాయితాలుగా మలుచుకోవడం- బర్రెల్నో, గొర్రెల్నో కాయటం, ఏటి ఒడ్డున నడుస్తూ రేగ్గాయల్నో, మరే పిచ్చి కాయల్నో శబరి కొరికినట్లు కొరకటం, నెత్తురులోడే కాళ్ళతో నడవటం – దాహంతో తపించటం- అదంతా ఒక యాత్ర, యులెసిస్ యాత్ర, అదొక ప్రవాహం, ప్రవహించే జ్ఞాపకం. ‘‘ ఇరవై గంటల పొలంలో బంగారం పండించిన వైనాలు, ఏట పెట్టడాలు, ఎగసాయం చేయడాలు, మోటకట్టడాలు, మోపులెత్తడాలూ, కాసెపోసి పంచెకట్టడాలు, ఎలుగు కట్టడాలు, గిత్తఒట్టకొట్టడాలు, తాడుపేనడాలు, చిక్కంవేయడాలు, గుమ్మికట్టడాలు, ఇటుకబట్టీ కాల్చడాలు, మనుంపట్టడాలు, రుణం తీర్చుకోవడాలు, పందిరేయడాలు, పగ్గమేయడాలు- అబ్బా యిదంతా నా వారసత్వపు కథ ’’ (సరిహద్దురేఖ).
ప్రతి కవి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. ఒక పరిక్షకు సిద్ధమౌతాడు. కాలం పరీక్షకు పెడుతుంది. స్థలకాలాల్నుంచి అనుభవాన్ని స్వీకరిస్తూ స్థలకాలాలు దాటి ఎదగటం- ఒక పక్షికుండే స్వేచ్ఛా స్వభావమేదో కవిలో అణువణువునా జ్వలిస్తూ వుంటుంది. ఎన్నిరకాలుగా జీవితాన్ని ప్రపంచాన్ని చూడొచ్చు. ప్రతి అంశనీ, విషయాన్నీ పట్టి పట్టి చూడటం – లోతుల్లోకెళ్ళి మాట్లాడటం- బహుశ యిది ఎవరి కవిత్వానికయినా, ఒక అథెంటిసిటిని, ఒక ఒరిజినల్ టచ్ ని ఇస్తుందనుకుంటా! ‘ప్రవహించే జ్ఞాపకం ’ నుంచి సరిహద్దురేఖ దాటి సువిశాల జీవావరణంలోకి ఈ కవితా సంపుటి ‘ఎడతెగని ప్రయాణం’ తో ప్రవేశించాడు యాకూబ్. అంత submerge అయి ఒక సంయమనంతో అద్భుతమయిన రూపు తీసుకోవటం ఇందులో చూస్తాం. దీనికి బీజాలు ‘సరిహద్దురేఖ’ లోనే వున్నాయి. సంక్లిష్టమయిన, సమరశీలమయిన జీవితాన్నెన్నుకున్నాడు. జీవితమే నేర్పాలి – కవి నేర్చుకోవాలి. కన్ను చెవి బాగా పని చేయాలి. గతం స్మృతులుగానూ, జీవసారంగానూ, దృశ్యపరంపరగానూ కవిత్వమంతటా అల్లుకుంటుంది. సువాసనాభరితమయిన సువర్ణస్పర్శ ఏదో ఈ కవిత్వానికి వుంది. మనల్ని మనం మర్చిపోయి. కవి కనికట్టులో పడిపోతాం- కవి చెప్పేదే నిజమవుతుంది. కవి జీవితం, అనుభవం మన జీవిత మౌతుంది. మన అనుభవమవుతుంది. వస్తువిస్తృతి పెరుగుతుంది. జీవితానికి సంబంధించిన అన్ని పార్శ్వాల్ని, అంచుల్ని అందుకుని అవలీలగా కవిత్వం చేయటం ప్రారంభిస్తాడు. ఒక పరిపక్వదశలోకి ప్రవేశించే సమయంలో పద్యాలు సజీవాలవుతాయి. అవే గమస్తాయి. మాట్లాడతాయి, మన చుట్టూ తిరుగుతాయి. మనలోనూ తిరుగుతాయి.
- యాకూబ్ “ఎడతెగని ప్రయాణం” కోసం శివారెడ్డి రాసిన ముందు మాట