దారిలో కాఫీ

                   అలెక్స్ లా గ్యూమా పరిచయం

    అలెక్స్ లా గ్యూమా (1925 – 1985)సౌతాఫ్రికా దేశపు నవలాకారుడే కాక, South African Coloured People’s Organisation (SACPO)కు నాయకుడు. ప్రభుత్వం పట్ల ద్రోహం కేసులో నిందితుడైన యితడు చేసిన రచనలు వర్ణ / జాతి వివక్ష (Aparthied) కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని బాగా ప్రభావితం చేశాయి. స్పష్టమైన శైలి, ప్రత్యేకమైన సంభాషణలు, పీడిత వర్గాల పట్ల నిజమైన సానుభూతిపూర్వక దృక్పథం ఇతణ్ని సౌతాఫ్రికా దేశంలోని ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ రచయితల్లో ఒకనిగా నిలబెట్టాయి. 1957 లో మొట్టమొదటిసారిగా Nocturn అనే కథను రాశాడు. 1966 లో స్వంత దేశాన్ని వదిలి శేషజీవితాన్ని ప్రవాసంలో గడిపాడు.

ఇతని రచనలు:

 1. A Walk in the Night and Other Stories (1962)
 2. And a Threefold Cord (1964)
 3. The Stone-Country (1967)
 4. In the Fog of the Season’s End (1972)
 5. A Soviet Journey (1978)
 6. Time of the Butcherbird (1979)

      1969లో ఈయనకు Lotus Prize for Literature వచ్చింది.

 

                                               అనువాదం: ఎలనాగ

 

         వాళ్లు మొక్కజొన్న తోటల్ని దాటి, చదునైన ప్రదేశాలూ ఏటవాలు భూములూ వున్న సగం ఎడారి లాంటి ప్రాంతాన్ని చీలుస్తూ పోయే రోడ్డుమీదుగా కార్లో ప్రయాణం చేస్తున్నారు. దక్షిణం వైపు పరచుకుని వున్న ఆ భూమి,ముళ్లపొదలు నిండిన చిన్నపాటి అడవి లాగా, ఊడ్వని అతిపెద్ద తివాచీలా ఉంది. కుడివైపున చాలా దూరంలో గాలిమరల లోహపు రెక్కలు ఉదయపు గాలుల తాకిడికి బడలికతో పిసినారి భూమిలోంచి నీళ్లను తోడే డ్యూటీని చేయటంకోసం అయిష్టంగా మేల్కొన్నాయా అనిపించే విధంగా తిరుగుతున్నాయి. తారురోడ్డు మీద గర్జిస్తూ కారు వేగంగా సాగిపోతోంది.

“నాకు యింకో సాండ్విచ్ కావాలి ప్లీజ్” అన్నది జైదా. వెనుకసీట్లో సూట్ కేసుల మధ్య, బ్యాగుల మధ్య ఒదిగి కూచున్నది ఆమె. ఆరేళ్ల వయసున్న ఆ అమ్మాయి కారులో ఆ దూరప్రయాణం చేస్తుంటే అలసిపోయింది. బయటి దృశ్యాల పట్ల ఆమెకు మొదట వున్న ఆసక్తి మాయమైంది.వెనక్కి పరుగెత్తుతున్న ఎండిపోయిన వాగులనూ గిడచబారిన చెట్లనూ చూడకుండా, తలగడలవంటి బ్యాగుల మధ్య అలసటతో ముందుకు వంగి కూర్చుంది ఆ అమ్మాయి.

స్టీరింగు వెనకాల వున్న స్త్రీ తన దృష్టిని రోడ్డు మీంచి మరల్చకుండా “టిన్నులో కొంచెం సాండ్విచ్ వుంది. నీ అంతట నువ్వే తీసుకోగలవు కదా” అని,“నువ్వు కూడా ఇంకొంచెం తింటావా, రే” అని అడిగింది.

“నాకు ఆకలిగా లేదు” అన్నాడు ముందర పక్కసీట్లో కూచున్న అబ్బాయి. అతడు వెనక్కి పరుగెడుతున్న ఇనుపతీగ కంచెను తెరిచివున్న కిటికీలోంచి చూస్తున్నాడు.

సాండ్విచ్ నములుతూ “కేప్ టౌన్ పట్టణం ఇంకా యెంత దూరంలో వుంది అమ్మా?” అని అడిగింది జైదా.

“రేపు మధ్యాహ్నం మనమక్కడ చేరుతాము” అన్నది ఆ స్త్రీ.

“నాన్న మనకోసం యింట్లో వేచివుంటాడా?”

“ఔను”

“అదుగో, కొన్ని మేకలు కనపడుతున్నాయక్కడ” అన్నాడు రే. గోధుమరంగున్న ఏటవాలు మైదానంలో అక్కడక్కడా చదరాల ఆకారాల్లోవున్న సాదా ఫామ్ హౌజ్ లు కనిపించాయి.

రాత్రంతా కారు నడపటంవల్ల ఆ యిద్దరు పిల్లల తల్లి బాగా అలసోయింది. కనురెప్పల కింద ఇసుకరేణువులున్నాయా అన్నట్టు ఆమె కళ్లు గరగరమంటున్నాయి. గతరాత్రి రోడ్డు పక్కన కొంచెంసేపు ఆగారు వాళ్లు. ఒక చిన్న ఊరవతల ఖాళీ ప్రదేశంలో కారును నిలుపుకున్నారు. రాత్రంతా ఆగుదామంటే అందుకు సరిపడే ఊరే కనిపించలేదు. ఒకటిరెండు వూళ్లలో హోటళ్లు కనిపించాయి కాని, అవి కేవలం తెల్లవాళ్ల కోసమే. నిజానికి ఆ వూళ్లలో తెల్లవాళ్లే నివసిస్తున్నారు. పనిమనుషులు తప్ప మిగిలిన నల్లవాళ్లందరూ శిథిలమౌతున్న ఇండ్లలో, ఊరికి దూరంగా బతుకుతున్నారు. పైగా ఆ ప్రాంతంలో ఆమెకు తెలిసినవాళ్లెవరూ లేరు.

తెల్లవారగానే ఆందోళన, నైరాశ్యం, చిరాకు కలిగినాయి ఆమెకు.పిల్లలున్నారు కనుక వాటిని ఆపుకుంది ఆమె. మధ్యరాత్రి ఆ ఖాళీ ప్రదేశంలో కొంతసేపు ఆగింతర్వాత, ఆమె మళ్లీ కారు నడపటం ప్రారంభించింది. ఇంకా రాత్రిగానే వుండటం వల్ల పిల్లలు కార్లోనే నిద్రపోయారు.

ఆమెకు తలనొప్పి కూడా మొదలైంది.“నాకొక మీట్ బాల్ కావాలి మమ్మీ” అని జైదా అడగ్గానే “అబ్బా యేం విసిగిస్తావే పిల్లా. అక్కడే వుంది తీసుకుని తిన్లేవా?” అన్నదామె చిరాకుగా, అసహనంగా.

బయటి దృశ్యం సినిమా రీలు లాగా వెనక్కి పరుగెత్తింది. ఆ దృశ్యం వివిధ రంగుల్లో వున్న పల్చని పొదలతో, బండరాళ్లతో అలంకృతమై వుంది. తూర్పువైపున చాలా పెద్ద సైజులో వున్న కొండరాళ్ల వరుస ఇసుకనేల మీద అకస్మాత్తుగా పైకి లేచింది. ఊదా, నీలం రంగుల వరుసల్లో వున్న కేకు మీద చాక్లెట్ రంగున్న పైపొర లాగా కనిపిస్తున్నాయి ఆ రాళ్లు. కారు కంకరరాళ్ల పట్టీ మీంచి దూసుకుపోయింది. మంటల్లోంచి పైకెగసే రంగుపొగలా కారు వెనకాల ఎర్రని దుమ్ము లేచింది. రిబ్బనులాంటి పొడవైన తోక వున్న పక్షి వొకటి రోడ్డు అంచు వెనకాల కారంత వేగంతో పరుగెత్తుతూ మాయమైంది.

“ఆ వింతైన పక్షిని చూడు మమ్మీ” అని సంతోషంతో అరిచి, మూసివున్న గాజు తలుపుకు ముఖం ఆనించాడు రే.

ఆమె పట్టించుకోకుండా స్టీరింగు వెనకాల కొంచెం రిలాక్స్ అవటానికి ప్రయత్నించింది. ఆమె అనాలోచితంగా వున్నా, డాష్ బోర్డు కిందున్న పెడళ్ల మీద ఆమె పాదాలు నైపుణ్యంతో కదులుతున్నాయి. రైల్లో వచ్చివుంటే బాగుండేదనుకున్నది ఆమె. కాని తన భర్త ఐన బిల్లీ తాను చాలా మందిని కలవాల్సి వుందనీ,అందువల్ల తనకు కారు అవసరం అనీ ఉత్తరం రాశాడు. కేప్ టౌన్లో తమ వ్యాపారం బాగా ఉండి వుంటుందని ఆశించిందామె. ఆమెకు తలనొప్పి వస్తోంది. ఆమె అనాలోచితంగా కారు నడుపుతోంది. సాధ్యమైనంత త్వరగా ప్రయాణాన్ని ముగించాలని నిశ్చయించుకుంది ఆమె.

“నాకు కాఫీ కావాలి” అన్నాడు రే. డాష్ బోర్డు కింద వున్న ఫ్లాస్కు కోసం చేయి చాచాడు అతడు. రే తన సంగతి తానే చూసుకుంటాడు. చిన్నచిన్న పనుల్ని అతనికోసం ఇతరులు చేయాల్సిన అవసరం లేదు.

“నాక్కూడా యివ్వు కొంచెం కాఫీ” వెనకాల బ్యాగుల మధ్య కూచునివున్న జైదా అన్నది.

“అంత దురాశ పనికిరాదు. ఎప్పుడూ తినడం తినడం తినడమే నీకు” అన్నాడు రే.

“నాది దురాశ కాదు. నాక్కొంచెం కాఫీ కావాలి అంతే”

“పొద్దున్నే తాగావు కదా కాఫీ”

“ఇంకొంచెం కావాలి నాకు”

“దురాశ”

“పిల్లలూ అల్లరి ఆపండి”అన్నది తల్లి నీరసంగా.

“వాడే మొదలుపెట్టాడు” అన్నది జైదా.

“ఇంక చాలు, నోర్మూసుకో” అన్నది తల్లి.

రే ఫ్లాస్కు మూతను తెరిచాడు. లోపలికి చూసి,“అమ్మా ఇందులో కాఫీ లేదు” అన్నాడు.

తల్లి “అయ్యో, మన ఖర్మ” అన్నది.

“నాకు దాహంగా వుంది. నాక్కొంచెం కాఫీ కావాలి” అని అరిచినట్టుగా అన్నది జైదా.

తల్లి నీరసంగా “ఓ… సరే, కానీ కొంచెం ఆగాలి నువ్వు. ముందుకు పోయింతర్వాత రోడ్డు పక్కన కాఫీ దొరుకుతుంది మనకు. అంతవరకూ ఆగాలి. సరేనా” అన్నది.

నీలి ఆకాశం మీద ఎర్రని రాగిపూతలా ఉన్నాడు సూర్యుడు.ఆ పల్లెప్రాంతం కాలిన పెద్ద టోస్టు బ్రెడ్ లా పొగమంచులో కదులుతూ, పసుపు కలిసిన గోధుమరంగులో వుంది. ఎండిన కాయలోపల గింజ కదిలినట్టు తలలోపల మెదడు కదుల్తున్నట్టనిపిస్తుంటే, ఆమె అలసటగా కారు నడుపుతోంది. ఆమె పెట్టుకున్న కళ్లద్దాల వెనక కళ్లు ఎర్రబడి, నల్లని విశాలమైన, అందమైన రెడిండియన్ ముఖం వుంది. తన శరీరం మొత్తం వీణమీద బిగుసుకున్న తీగల్లా బిగువుగా ఉన్నట్టూ, చేయి తాకితే వాటిలోంచి ఒక తీగ తెగిపోతుందా అన్నట్టూ అనింపించింది ఆమెకు.

మైళ్లు సర్రుమంటూ కూనిరాగం తీస్తూ, మధ్యమధ్య గర్ర్ మంటూ వెనక్కి పోతున్నాయి. మట్టిరంగులో వున్న గుట్టలూ, రెండువైపులా రేగడి మట్టితో సెలయేర్లూ, రాతి అంచులతో వున్న చిన్నచిన్న కొండలూ కనపడ్డాయి. ఒక చిన్న కొండ అంచున పశువులకాపరి గుడిసె, వొక ఒంటరిజీవిలా కనిపించింది. అప్పుడప్పుడు ఎదురుగా వస్తున్న కార్లు దూసుకుపోతుంటే, జిప్ జిప్ మని వాటి శబ్దం వినపడుతోంది. గాలి మరుగుతోందా అన్నట్టు తీక్ష్ణమైనఎండపొడ కదులుతోంది.

“నాక్కొంచెం కాఫీ కావాలి.మనకు కాఫీయే లేదు” అన్నది జైదా చిరచిరలాడుతూ.

ఆమె తల్లి “కొంత దూరం పోయాక కొందాం. ఇక నీ యేడుపు ఆపు. ఇంకో సాండ్విచ్ తిను” అన్నది

“నాకు సాండ్విచ్ వద్దు. కాఫీయే కావాలి”

పగిలిన డబ్బాల్లాగా శిథిలావస్థలో చెల్లాచెదరుగా వున్న కొన్ని గుడిసెలు రోడ్డు పక్కన గోతిలో కనిపించాయి. మట్టికొట్టుకుపోయి నగ్నంగా వున్న పిల్లలగుంపు వొకటి మేకలదొడ్లోంచి పోలోమంటూ బయటికి వచ్చి, రోడ్డుపక్కలకు చేరి, కారును చూస్తూ కేరింతలతో చేతులు వూపింది. రే కూడా చేతులు వూపుతూ నవ్వాడు. క్షణంలోనే వాళ్లు కనుమరుగయ్యారు. నీళ్లను పైకి లాగే ఒక గాలిమర కూడా కనిపించి వెంటనే మాయమైంది. ముగ్గురు నల్లవాళ్లు రోడ్డుపక్కన ఒకే వరుసలో నడుస్తున్నారు.వాళ్లు చిరిగిపోయి దుమ్ముపట్టిన కంబళ్లు కప్పుకుని, వాతావరణాన్ని లెక్కచేయకుండా అగోచరమైనభవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నడుస్తున్నారు.తలలమీది నలిగిపోయిన టోపీలే వాళ్లకు నీడనిస్తున్నాయి. వాళ్లు కారు వైపు చూడలేదు. చేతులు ఊపలేదు. తదేక దృష్టితో ముందుకు చూస్తూ నడుస్తున్నారు.

ఇనుప వంతెన మీదికి రాగానే కారువేగం తగ్గింది. రాళ్లుతేలిన వాగుమీంచి కారు పోతుంటే గడగడమనే శబ్దం వచ్చింది. మట్టికొట్టుకుపోయిన నల్లని బొచ్చున్న గొర్రెలు కొన్ని పెద్ద రాళ్ల మధ్య తుమ్ముతుంటే, వాటి కాపరి దిష్టిబొమ్మలా నిశ్చలంగా వాటినే చూస్తున్నాడు.

కొంచెం దూరం పోయాక వాళ్లు యూరోపియన్ల కాలనీని దాటారు. తర్వాత నల్లవాళ్ల యిళ్లు వచ్చాయి. ఆ మట్టిగోడల యిళ్లకు చెక్కపలకల చూర్లున్నాయి. ఏటవాలుగా వున్న గోధుమరంగు మైదానంలో ఆ యిళ్లు రంగు వెలిసిన పాచికల్లా వున్నాయి. చిన్నచిన్న మనుషులతో పాటు చీమల్లాంటి కుక్కలు కదుల్తూ కనిపించాయి వాళ్లకు. మరో ఏటవాలు స్థలంలో వెల్లవేసిన పెద్ద రాయి మీద ఒక ఊరిపేరు రాసివుంది.

రైలుమార్గం పక్కన వున్న దొడ్లలో గొర్రెలు ఒకదానిమీద ఒకటి పడుతున్నాయి. వాటిని దాటుకుని, కారు రైల్వే క్రాసింగు మీదుగా మళ్లీ రహదారి మీదికి చేరింది. ఒక యూరోపియన్ సైకిలు మీద పోతున్నాడు. వేగం తగ్గిన కారుతమాషాగా వున్న ఒక రైల్వే హోటలు ముందుభాగాన్నీ, దుకాణాల వరుసనూ దాటుకుంటూ పోయింది. తర్వాత ఒక చోట డచ్ కొలోనియల్ హోటల్ లాగా కంచెగల ప్రాంగణంలో ఎండ సోకి ఎర్రబడిన ముఖాలతో కొందరు యూరోపియన్లు టేబుళ్ల ముందు కూర్చుని తాగుతున్నారు. కంకరా, దుమ్మూ నిండిన మరో వీధిలో ధూళిపేరుకుపోయిన కార్లూ,దెబ్బతిన్న పికప్ ట్రక్కులూ, వ్యాన్లూ నిలబడి వున్నాయి. ఒక యూరోపియన్ వృద్ధుడు దుకాణం ముందు ఊడుస్తున్నాడు. పుల్లల చీపురుతో అతడు ఊడుస్తుంటే బుస్ బుస్ మంటూ గ్యాసు బయటికి వస్తున్నట్టు శబ్దం వస్తోంది.

గులాబీవర్ణం ముఖంతో, బంగారురంగు వెంట్రుకల్తో, ఖాకీ చొక్కాలు, లాగులు తొడుక్కున్న ఇద్దరు యూరోపియన్ యువకులు కారు వైపు చూశారు. ఫ్యాక్టరీనుండి అప్పుడే బయటికి వచ్చినట్టు తళతళ మెరుస్తున్న ఆ కారునూ, దాంట్లో స్టీరింగు వెనకాల ఉన్న నల్ల స్త్రీనీ చూడగానే అకస్మాత్తుగా వాళ్ల కళ్లలో ప్రతికూల భావం చోటు చేసుకుంది. వెనకాల ఒక చిన్న ధూళిమేఘం లేచింది.

“ఈ వూరి పేరేమిటి మమ్మీ?” అని అడిగాడు రే.

“నాకు తెలియదు. కర్రూ ప్రాంతంలోని ఏదో వొక వూరు” అన్నదామె. కారు వేగాన్ని తగ్గించగలిగినందుకు సంతోషపడింది.

కారు కిటికీ గుండా బయటకు చూస్తూ “ఆ మనిషేం చేస్తున్నాడు?” అని అడిగింది జైదా.

“ఎక్కడ? ఏ మనిషి?” బయటికి చూస్తూ అడిగాడు రే.

“అతడు వెనక్కి మాయమయ్యాడు. నేనన్న వెంటనే చూళ్లేదు నువ్వు” అన్నది ఆపిల్ల. తర్వాత,“మనకు కాఫీ దొరుకుతుందా యిక్కడ?” అని అడిగింది.

“దొరకొచ్చు. మీరిద్దరూ అల్లరి చెయ్యకుండా బుద్ధిగా వుంటే కాఫీ దొరుకుతుంది. కూల్ డ్రింక్ తాగుతావా?”

“అది తాగితే తర్వాత వెంటనే దాహమేస్తుంది” అన్నాడు రే.

“సరే, ఎక్కువగా మాట్లాడకుండా ఓపికతో వుండండి” అన్నది తల్లి.

కొంచెం ముందర ఖాళీ ప్రదేశంలో ఒక రెస్టారెంటు కనిపించింది. దాని ముందరి నీడలో, కిటికీల దగ్గర పేవ్ మెంటుకు ఎదురుగా, స్టీలు కుర్చీలూ టేబుళ్లూ వేసి వున్నాయి. దాని ముఖభాగం కోకాకోలా తాలూకు బొమ్మలతో అలంకరించబడి వుంది. తినుబండారాల ధరలను సూచించే ఒక పట్టిక వుంది. చారలున్న డేరా ఒకటి టేబుళ్ల మీద నీడను పరుస్తోంది. ఖాళీ ప్రదేశానికి ఎదురుగా వున్న గోడలో ఒక చదరపు అడుగంత కిటికీ వుంది. అది నల్లవాళ్ల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్. మురికిగా వున్న నల్లవాళ్లు కొందరు మట్టిలో నిలబడి, ఒకరి తలలు మరొకరికి తగుల్తుంటే, ఆర్డరిచ్చినవాటి కోసం ఓపికతో వేచి వున్నారు ఆ కిటికీ దగ్గర.

ఆమె కారును రెస్టారెంటు ముందుకు తీసుకుపోయి ఆపింది. లోపల ఒక రేడియో మోగుతోంది. కిటికీలకు వేలాడుతున్న వెనేషియన్ బ్లైండ్స్ దుమ్ము లేకుండా శుభ్రంగా వున్నాయి.

“ఫ్లాస్కు ఇటివ్వు” అని పిల్లవాని దగ్గర నుండి దాన్ని తీసుకుంది ఆమె. కారుతలుపును తెరిచి,“మీరు కదలకుండా కూర్చోండి. నేనిప్పుడే వస్తాను” అన్నది.

కారు తలుపును తెరిచి, ఒక్క క్షణం పేవ్ మెంటు మీద నిలబడింది. దాంతో కండరాలు వదులై చెప్పలేని హాయిని అనుభవించింది.నిటారుగా నిలబడి, దాదాపు ఇంద్రియభోగం లాంటి సుఖాన్ని పొందింది. కాని తలనొప్పి ఇంకా బాగా వుండటంతో క్షణికమైన ఆ సుఖం చెడిపోయిన అనుభూతిని పొందింది. ఆమె మెదడు మళ్లీ అలసటకు లోనై, శరీరం మళ్లీ బిగుసుకుపోయిన స్ప్రింగులా మారింది. నలగటం వల్ల కోటుమీద ఏర్పడ్డ గీతల్ని ఆమె సాఫుచేసింది. కానీ లోపలి జాకెట్ కు వున్న పైగుండీలను పెట్టుకోకుండా అలానే వుంచింది. తర్వాత ఫ్లాస్కును పట్టుకుని పేవ్ మెంటు మీదుగా లోపలికి ప్రవేశించి, ప్లాస్టిక్, స్టీలు కుర్చీల మధ్యలోంచి రెస్టారెంట్ లోపలికి చేరుకుంది.

లోపల చల్లగా వుంది. గ్లాసుకేసుల్లో సీసాలు, టిన్నులు, ప్యాకెట్లు చక్కగా అమర్చబడి, మ్యూజియంలా అనిపించింది. రెస్టారెంటు వెనకాల నుండి బంగాళాదుంపలు వేపుతున్న వాసన, చప్పుడు వస్తున్నాయి. ఒక గాజు అరలో పెట్టిన ఎలెక్ట్రిక్ ఫ్యాను తిరుగుతోంది. గోడకు ఆనుకుని టీతో, కాఫీతో నిండివున్న రెండు పాత్రలు మెరుస్తున్నాయి.

అక్కడ వున్న ఒకేఒక్క మరో మనిషి చిన్న యూరోపియన్ పిల్లవాడు. అతని ముఖం ఆపిలుపండు లాగా, వెంట్రుకలు గోధుమరంగులో వున్నాయి. అతని ముక్కు కారుతోంది. అతడు వెలిసిపోయిన డిజైనున్న చొక్కా, ఖాకీ లాగూ తొడుక్కున్నాడు. మట్టికొట్టుకుపోయిన అతని నగ్న పాదాలు లేత పసుపు వర్ణంలో, పగిలిన ఆనెకాయలతో నిండి వున్నాయి. అతని గులాబీరంగు నోరు ఒక లాలీపాప్ ను చప్పరిస్తోంది.వైరుబుట్టలో పెట్టివున్న పాత పత్రికల్ని చూస్తున్నాడు ఆ అబ్బాయి.

గ్లాసు కౌంటరు వెనకాల ఆకుపచ్చని జుబ్బా తొడుక్కున్న ఒకావిడ, పక్కగోడ లోని చతురస్రాకారపు కిటికీ గుండా అడుగుతున్న నల్లని ముఖాల్ని పట్టించుకోకుండా రెస్టారెంటు లోపల వున్నవాళ్లకు సమాధానమిస్తోంది. ఆమె బుజాలు గుండ్రంగా, ముఖం ఎర్రగా వున్నాయి. ముఖంలోని అవయవాలు విడిపోయి దూరందూరంగా ఉన్నట్టున్నాయి. చెక్కిళ్లు గుండ్లలాగాఉండి,ముక్కు తాలూకు ఎముక రెండు బూడిదరంగు చెంపల్ని వేరు చేస్తోంది. ఆమె నోరు ఒక ద్వేషపూరితమైన బల్లినోరు లాగా తెరుచుకుని వుంది. నోట్లో గులాబీరంగు చిగుళ్ల నుండి బయటకు వచ్చిన పలువరుస రంపపు అంచులా తోచింది.

అమె తలెత్తి పైకి చూసి ఏదో అనబోయింది. ఎదురుగా వున్న నల్లజాతి స్త్రీని చూడగానే ఒక్క క్షణం సేపు ఆమె కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చాయి. బక్కపలుచని యూరోపియన్ పిల్లవాడు పురుగులాగా కదిలాడు.

“ఈ ఫ్లాస్కునిండా కాఫీ పోసిస్తారా ప్లీజ్” అన్నది ఆ నల్ల యువతి.

ఆ యూరోపియన్ స్త్రీ నోరు తెరుచుకుని, ఒక రాయికి లోహపు వస్తువు గీరుకుంటున్నట్టుగా గరుకైన, కటువైన శబ్దం చేస్తూ,“కాఫీయా? లార్డ్, జీసస్, దేవుడా.ఒక పాపిష్ఠి కూలీ అమ్మాయి ఇక్కడికెలా వచ్చింది?” అన్నది. ఖరీదైన షోకైన కళ్లద్దాలు పెట్టుకున్న ఆ అందమైన ముఖాన్ని చూసి తర్వాత,“కూలీలు, కాఫిర్లు, మోటు మనుషులు బయట వుండాలని తెలియదా? ఇంకా ఇంగ్లీషు కూడా మాట్లాడుతున్నావా నువ్వు?” అని అరిచింది. నల్ల స్త్రీ ఆమె వైపు చూసి ఉక్రోశానికి వచ్చింది. ఆమెకు మనసులోపల యెక్కడో మండినట్టవడంతో అకస్మాత్తుగా స్ప్రింగులాగా ఎగిరి కోపంతో కేకలు వేస్తూ ఫ్లాస్కును ఆ యూరోపియన్ స్త్రీ ముఖం మీదికి విసిరింది.

“తెల్ల ముండా, నువ్వే కూలీవి” అని అరిచింది.

ఆ యూరోపియన్ స్త్రీ ఫ్లాస్కును చేత్తో వేరే దిక్కుకు కొట్టిపారేసే లోపలే,అది ఆమె కనుబొమ్మకు తాకి పడిపోయింది. ఫ్లాస్కులోపలి గాజుసీసా పగిలిన శబ్దం వినిపించింది. ఆ తెల్ల స్త్రీ అరుస్తూ,రక్తం కారుతున్న నుదుటికి చేయి పెట్టుకుని, వెనక్కి తూలింది. ఆ చిన్న పిల్లవాడు లాలీపాప్ ను కింద పడేసి, బయటికి పరుగెత్తాడు. పక్కగోడ లోని కిటికీ దగ్గరున్న మనుషులు నోరు తెరిచి, రెస్టారెంట్ లోపలి వైపు చూశారు. ఆ నల్ల స్త్రీ వెనుతిరిగి కోపంతో బయటకు నడిచింది.

ఎర్రబడి బిగుసుకుపోయిన ముఖంతో ఆమె కారు వైపు నడిచి, కోపంగా కారుతలుపును తెరిచింది. తలుపును మళ్లీ గట్టిగా మూసి కారును స్టార్టు చేస్తుంటే, కిటికీ దగ్గరున్న నల్లవాళ్ల గుంపు అక్కడికి వచ్చి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది.

స్టీరింగును గట్టిగా పట్టుకుని ఆమె పిచ్చిఆవేశంతో కారును వేగంగా నడుపుతుంటే,చేతులు పచ్చరంగును పులుముకున్నాయి. తర్వాత తేరుకుని జాగ్రత్తగా కారు వేగాన్ని తగ్గిస్తూ కొంచెం రిలాక్సయింది. మళ్లీ అలసట, చిరాకు. ఊరిబయటికి చేరటానికి ఆమె త్వరపడక, కొంత సమయం తీసుకుంది. పిల్లలు నోళ్లు వెళ్లబెట్టారు. ఏదో జరగరానిది జరిగిందని అర్థమైంది వాళ్లకు.

“కాఫీ దొరికిందా మమ్మీ? ఫ్లాస్కేదీ? అని అడిగాడు రే.

“కాఫీ దొరకలేదు. అది దొరకకున్నా మనం సరిపెట్టుకోవాలి” అన్నది ఆమె.

“కాఫీ అడిగాన్నేను” ఫిర్యాదు చేస్తున్నట్టుగా అన్నది జైదా.

“నువ్వు బుద్ధిగా వుండాలి. అమ్మ అలసిపోయింది. ఏమీ వదరకు” అన్నదామె.

“ఫ్లాస్కు పోయిందా?” అడిగాడు రే.

“ఏమీ మాట్లాడకు. నిశ్శబ్దంగా వుండు” అన్నది తల్లి. పిల్లలిద్దరూ మౌనంగా వుండిపోయారు.

వాళ్లు ఊరి పొలిమేరల్ని దాటారు. సెంట్రీ గార్డుల్లా నిలుచున్న ఎర్రని పంపులున్న పెట్రోలు బంకును దాటారు. తల మీద పెద్ద ఎండుకట్టెల మోపును పెట్టుకుని నడుస్తున్న మనిషిని దాటారు. ఊరి చివర్న వున్న యిళ్లను దాటారు. ఆ యిళ్లు వెల్లవేయబడి తెల్లగా వున్నాయి. ముంగిళ్లలో కోడిపిల్లలు మట్టిని కెలుకుతున్నాయి. గొర్రెల బొచ్చు గుట్టలుగా పడివున్న కొట్టాలు అపరిశుభ్రంగా కనపడ్డాయి. ప్రహరీగోడ మీద కూర్చున్న ఒకతను ఆ కారు మీద దృష్టి నిలిపి పరీక్షగా చూశాడు.

రోడ్డు మళ్లీ పల్లెప్రాంతం లోకి ప్రవేశించింది.దారిలోని ఆకుపచ్చని చెట్లు మాయమయ్యాయి. ఏ భావమూ లేక బోసిపోయిన నేల మీద సూర్యకాంతి నర్తించింది. నల్లని తారు మీద టైర్లు మంద్రస్వరంలో సంగీతాన్ని వినిపిస్తున్నాయి. ముందర కొంత రద్దీ కనపడింది. కాని ఆమె నిర్లక్ష్యంగా రద్దీని దాటిపోయింది.

నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ రే,“నాన్న మనను కార్లో డ్రైవ్ కు తీసుకుపోతాడా?” అని అడిగాడు.

“తప్పక తీసుకుపోతాడు. నాకు తెలుసు. ఇకె మామయ్య కారుకన్నా నాకు మన కారే ఎక్కవిష్టం ”అన్నది జైదా.

“నిజానికి నాన్న యెన్నోసార్లు మనను కార్లో తీసుకుపోయాడు”అని,“అదుగో అప్పుడు చూసిన గమ్మత్తైన పక్షి మరొకటి పోతోంది” అన్నాడు రే.

“అమ్మా, తర్వాతైనా మనకు కొంచెం కాఫీ దొరుకుతుందా?” అని అడిగింది జైదా.

“ఏమో, చూద్దాం”

ఎండిపోయి దుమ్ము నిండిన భూమి వెనక్కి పరుగెడుతోంది. ముందర పలుచగా వున్న వాహనాల వేగం తగ్గటంతో, ఆక్సెలరేటర్ మీంచి ఆమె తన పాదాన్ని మెల్లగా పైకి లేపింది.

“ఆ కొండను చూడు. అది మనిషి తల ఆకారంలో వుంది కదా” అన్నాడు రే.

“అది నిజమైన మనిషి ముఖమా?” అని అడిగింది జైదా బయటకు చూస్తూ.

“పిచ్చిదాన్లా మాట్లాడకు. నిజమైన ముఖమెలా అవుతుంది? కేవలం ముఖంలాగా వున్నదంతే”

కారు మెల్లగా పోతోంది. కిటికీలోంచి తలను బయటపెట్టి ఆమె ముందుకు చూసింది. ముందర రోడ్డు బ్లాకు అయివుంది.

African Kadhalu_title

అక్కడ ఒక చిన్న పోలీసు వ్యాను ఆగివుంది. దాని కిటికీలకూ, హెడ్ లైట్లకూ తీగలతో చేసిన కన్నాల ప్లేట్లు వున్నాయి. ఆ వ్యానుకు పక్కనే మరో వాహనాన్ని నిలిపారు. దాంతో ముందుకు పోవటానికి కేవలం ఒక కారు పట్టేంత స్థలం మాత్రమే మిగిలింది. ఖాకీ చొక్కా, ప్యాంటు, టోపీ తొడుక్కుని తొడలకు అడ్డంగా ఒక స్టెన్ గన్ తో ఒక పోలీసు ఆ వాహనానికి ఆనుకుని వున్నాడు.మరొక పోలీసు కారు స్టీరింగు దగ్గర కూచుని వున్నాడు. మూడవ పోలీసొకాయన ఆ వాహనం పక్కన నిల్చుని,డ్రైవర్లను పరీక్షిస్తూ ముందుకు పంపుతున్నాడు.

వాళ్ల ముందున్న కారు అక్కడికి పోగానే ఆగింది. పోలీసు ఆ డ్రైవరు ముఖాన్ని పరీక్షగా చూసి, ముందుకు పొమ్మన్నట్టుగా చేయి ఊపి వెనక్కి జరిగాడు. ఆ కారు రయ్యిమని దూసుకుపోయింది.

తర్వాత పోలీసు, వీళ్ల కారు దిక్కు తిరిగి ఆగమన్నట్టుగా సంజ్ఞ చేశాడు. ఆమెకు అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె బ్రేకు వేసింది. ఖాకీ గుడ్డలు తొడుక్కున్న పోలీసు ఆమెవైపు అడుగులు వేశాడు.

అతని ముఖం యువకుని ముఖంలా ఉంది.తలమీద తోలుటోపీ పెట్టుకున్నాడు. అతడు చిరునవ్వు నవ్వాడు కాని, అతని కళ్లు గ్రనైటు రాయిలా కర్కశంగా వుండటంచేత, వాటిలో ఆ నవ్వు ప్రతిఫలించలేదు. అతని నడుము దగ్గర ఒక తోలుసంచీలో పిస్టల్ వుంది. వేరే పోలీసులవైపు తిరిగి,“ఇదే ఆ కారనుకుంటా” అన్నాడతడు.

స్టెన్ గన్ పట్టుకున్న పోలీసు నిటారుగా నిలబడ్డాడు. కానీ ముందుకు రాలేదు. కార్లో కూచున్న మరో పోలీసు ఆమెనే చూస్తున్నాడు.

రోడ్డు మీదున్న పోలీసు నవ్వుతూ,“మేం నీకోసమే చూస్తున్నాం. ఆ వూర్లోని పోలీసులు మాకు ఫోన్ చేస్తారని తెలియదా?” అన్నాడు.

కార్లో వున్న పిల్లలు నిశ్చలంగా కూచుని గుడ్లప్పగించి చూస్తున్నారు. ఆమె పోలీసుల్తో “ఏమిటిదంతా?” అన్నది.

“ఏమిటో అంతా తెలుసు నీకు” అన్నాడు పోలీసు. ఆమెను మళ్లీ పరీక్షగా చూసి,“గోధుమరంగు కోటు తొడుక్కుని… నల్లకళ్లద్దాలు పెట్టుకున్న నల్లమ్మాయి….. నిన్ను అరెస్టు చేస్తున్నాం” అన్నాడు.

“మీరు చేస్తున్నదేమిటి?” అని మళ్లీ అడిగిందామె. ఆమె గొంతులో ఆందోళన లేదు. కాని పిల్లల గురించి విచారం కలిగిందామెకు.

“నీకే తెలుస్తుంది. ఇక్కడ ఒక గుంపు గొడవ చేస్తోంది విను” అని ఎర్రబడ్డ కళ్లతో ఆమెను చూశాడతడు.“కారును పక్కకు తీసుకో. వెధవ వేషాలెయ్యకు. ముందర మా కారూ, దానివెనక వ్యానూ పోతుంటుంది. బాగా గమనించు” అన్నాడు మెల్లగా. కాని అతని గొంతు బెదిరిస్తున్నట్టుగా వుంది.

“మమ్మల్నెక్కడికి తీసుకుపోతున్నారు? నా పిల్లల్ని కేప్ టౌనుకు తీసుకుపోవాలి నేను” అన్నదామె.

“అదంతా నాకనవసరం. ఈ ప్రాంతంలో నువ్వు సమస్య తెచ్చావు కనుక, ఇక్కడే పర్యవసానాన్ని అనుభవించాలి నువ్వు” అని వెనక వున్న పోలీసుకారు లోని వాళ్లకు చేయి ఊపాడు. దాని డ్రైవరు స్టార్టు చేసి, కారును రోడ్డు మీదికి పోనిచ్చాడు.

“డ్రైవ్ చేస్తూ ఆ కారు వెనకాల పోవాలి నువ్వు. మనం వెనక్కి పోతున్నాం” అన్నాడు.

ఆమె ఏమీ మాట్లాడకుండా తన కారును స్టార్ట్ చేసి, పోలీసుకారు వెనకాల పోవటానికి సిద్ధమైంది.

“ఏ విధమైన పిచ్చి వేషాలు వెయ్యకు” అన్నాడు ఆ పోలీసు. మళ్లీ అతణ్ని చూసిందామె. ఆమె చూపులు కూడా యిప్పుడు ప్రశాంతంగా వున్నాయి. అతడు పోయి, పోలీసు వ్యానులో ఎక్కి కూచున్నాడు. ముందరి కారు వేగాన్నందుకోవటంతో ఆమె కూడా వేగంగా నడుపుతూ వెనకాల వెళ్లింది.

“మనం ఎక్కడికి పోతున్నాం అమ్మా?” అని అడిగింది జైదా.

“నువ్వు నోర్మూసుకుని బుద్ధిగా వుండు” అన్నది తల్లి కారు నడుపుతూ.

మట్టిరంగున్న పల్లెప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్లింది కారు. అంతకుముందు తాము చూసిన దృశ్యాలు మళ్లీ కనపడ్డాయి వాళ్లకు. చిక్కని నల్లని ఆకాశం నాట్యం చేస్తూ ఊగింది.సూర్యుని పసుపుపచ్చ కాంతిలో పొదల్తో నిండిన ఇసుకప్రదేశం వాళ్ల ముందు పరుచుకుని వుంది.

“కొంచెం కాఫీ దొరికితే బాగుండేది” అన్నది జైదా.

 

***

 

 

 

Download PDF

6 Comments

 • bhasker.koorapati says:

  డియర్ ఎలనాగ గారు,
  మీ అనువాద కత నిజంగా చాలా బావుందండి. ఒక్క పాత్రల పేర్లు తెలుగులోకి మార్చితే ఇది నిజంగా తెలుగు కథనే అనుకునేంత సరళంగా ఉంది.అనువాద కళ మీకు బాగా అబ్బినట్టుగా ఉంది. మంచి పట్టు సాదించారు.
  అభినందనలు. మరిన్ని మంచి అనువాదాలు మీ కలం నుండి ఆశిస్తూ…
  మీ సాహితీ మిత్రుడు,
  -భాస్కర్ కూరపాటి.

 • Elanaaga says:

  భాస్కర్ కూరపాటి గారూ,

  నా అనువాద కథ మీకు నచ్చినందుకు సంతోషం, కృతజ్ఞతలు.

 • Lalitha P says:

  కథలో వర్ణన ఎంత అందంగా ఉందో అనువాదమూ అంత బాగా ఉంది. మంచి కత ను అందించినందుకు ధన్యవాదాలు ఎలనాగ గారూ !

 • Elanaaga says:

  లలిత గారూ

  నా అనువాద కథ మీకు నచ్చినందుకు సంతోషం, కృతజ్ఞతలు.

 • Manasa says:

  వర్ణనలన్నీ చాలా సహజంగా కథలో ఇమిడిపోయాయండీ..మనుష్యుల స్వభావాలూ, అక్కడి ప్రకృతి వర్ణనలూ కూడా ఒకటికి రెండు సార్లు చదివించాయి ఈ కథని.

  మొక్కజొన్న తోటల్ని దాటక ఎదురైన ఏటవాలు భూములూ, ఊదా, నీలం రంగుల వరుసల్లో వున్న కేకు మీద చాక్లెట్ రంగున్న పైపొర లాగా కనిపించిన రాళ్ళూ, రెండిండియన్ ముఖాలూ, రాళ్ళు తేలిన వాగు మీద కారు ప్రయాణపు అనుభవాలూ- నన్నింకా విడిచిపెట్టని కొన్ని దృశ్యాలు.

  రచయిత పరిచయమూ, ఇతర రచనలూ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వీలైతే సాధించి చదివే ప్రయత్నం చేస్తాను.

 • Elanaaga says:

  మానస గారూ,

  నా అనువాద కథ మీకు నచ్చినందుకు సంతోషం, కృతజ్ఞతలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)