అమావాస్య యెరుగని చంద్రదీపం: ఎం. టి. ఖాన్

10603396_10203693605597290_3827708837853894168_n

1986 – 87 లో అనుకుంటా – విరసం లో సభ్యునిగా సిటీ యూనిట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయం. ఆ రోజుల్లో పేరుకు విరసం లో సభ్యున్నే కానీ దాదాపు అన్ని ప్రజా సంఘాల్లో చురుగ్గా పనిచేసే వాళ్ళం. వాటిల్లో PDSU విద్యార్థి ఉద్యమాలకు చేయూతా, పౌరహక్కుల ఉద్యమం APCLC ముఖ్యం. ఒక వైపు ఇంజనీరింగ్ కాలేజీ లో లెక్చరర్ గా పని చేస్తూ దొరికిన ప్రతి ఖాళీ సమయాన్నీ ఉద్యమాల్లో పనిచేయడానికే ఉపయోగించుకునే వాణ్ణి.

APCLC లో స్నేహితుడు వీరప్రకాష్ సభ్యుడు. ఆయనతో కలిసి ప్రతి APCLC సమావేశానికీ వెళ్ళేవాణ్ణి. ఒక సారి, విరసం లోనూ APCLC లోనూ సభ్యులూ నాయకులూ అయిన ఖాన్ సాబ్ యింటికి వెళ్ళి రావాల్సిన పని బడింది. అప్పటి దాకా ఆయనని చూడడం పలకరించడం తప్ప ఆయనతో ఎక్కువగా చనువు లేదు. ఖాన్ సాబ్ ఇల్లెక్కడ అంటే పురానా పూల్ పక్కనే అని చెప్పారు. నాకేమో అప్పటికింకా హైద్రాబాద్ హస్తసాముద్రికం ఇంకా పూర్తిగా పట్టుబడలేదు. పుట్టింది జజ్జిలిఖాన లో అని మా నాయనమ్మ చెప్పినా పాతనగరం ఎకువగా తెలియని పరిస్థితి. పురానా పూల్ దగ్గర బస్సు దిగి ఎవర్నడిగినా చెప్తారు అన్నారు.

సరే అని బయలుదేరా! బస్సు దిగి వెతుక్కుంటూ ఒకరిద్దరిని అడిగితే అదిగో అని చూపిస్తున్నారు కానీ నేను పోల్చుకోలేక పోతున్నా! సరే ఒకాయన యెవరో వేలు పట్టుకోని ఒక యింటి ముందు నిలబెట్టి ఇదే ఖాన్ సాబ్ ఇల్లు అని చూపించారు. నేను నివ్వెరపోయాను. ఖాన్ సాబ్ ఇల్లంటే యేదో పెద్ద భవంతినో బంగళానో ఊహించుకుంటున్నా! చూడబోతే అదేమో ఒక పాడుబడ్డ గోడలు కూలిన పాత యిల్లు. జంకు జంకుగా సందేహంగా తలుపు మీద కొట్టా! కొంచెం గట్టిగా కొడితే కూలిపోతుందేమో అన్నట్టుందా తలుపు.

కొంచెం సేపటికి ‘ఆ రహా హూ’ అనుకుంటూ తలుపు తెరిచారు ఖాన్ సాబ్. ‘ఆవో ఆవో’ అనుకుంటూ సాదరంగా లోనికి తీసుకెళ్ళారు. నేను యింకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు … ‘హా సాబ్’ అనుకుంటూ లోనికి నడిచాను. చాలా ప్రేమగా లోపలికి తీసికెళ్ళి ‘బైఠో ‘ అంటూ ఒక కుర్చీ చూపించారు. ఆ హాలులో రెండే కుర్చీలు. నేను కూర్చోవడానికి కొంచెం జంకితే ‘కూర్చో నారాయణస్వామీ ‘ అంటూ చేయి పట్టుకోని కూర్చోబెట్టి యెంతో ప్రేమగా సాదరంగా మాట్లాడారు ఖాన్ సాబ్. అంత పెద్ద మనిషి నా లాంటి పిల్లగానిని అంత సాదరంగా కూర్చోబెట్టడం అంత సేపు మాట్లాడ్డం నేను కలలో కూడా ఊహించలేదు. ఉద్యమాల్లో యెన్నో యేండ్లుగా పనిచేస్తూ , అందరిచేతా గొప్పగా గౌరవింపబడే ఖాన్ సాబ్ నన్ను అంత ప్రేమగా పలకరిస్తారని యేనాడూ అనుకోలేదు.

ఆయన ఇల్లుచూసే నివ్వెరపోయిన నేను, ఆయన నడవడి చూసి మరింత ఆశ్చర్య పోయాను. అప్పటికే ఆయన పట్ల యెంతో గౌరవం తో ఉన్న నా దృష్టిలో ఆయన వ్యక్తిత్వం మరింత ఉన్నతంగా యెదిగిపోయింది.

ఖాన్ సాబ్ జీవితాంతం అదే శిథిలావస్థ లో ఉన్న యింట్లోనే జీవించారు. అదే పేదరికంతో, అవే కష్టాలతో అంతే సాదా సీదాగా బతికారు. భౌతిక సుఖాలకు దూరంగా, జీవితమంతా ఒక సూఫీ తత్వం తో , తాను నమ్మిన ఆశయానికి కట్టుబడి, గొప్ప నిబద్దతతో జీవించారు. తాను యేది చెప్పారో అది ఆచరించి చూపించారు. నిష్కల్మషమైన చిరునవ్వుతో యెప్పుడూ యితరులకు ఇవ్వడమే తప్ప యెన్నడూ యేదీ ఆశించని నిస్వార్థంతో ఖాన్ సాబ్ ప్రజా ఉద్యమాలకు అంకితమయ్యారు. తనకంటూ ఆస్తుల్ని కూడబెట్టుకోవడం కానీ, సుఖ భోగాల్ని కోరుకోవడం కానీ అనుభవించడం కానీ, ఖాన్ సాబ్ యెన్నడూ చేయలేదు.

ఖద్దరు లాల్చీ, పైజామా తో, బుజానికి సంచీ తో ఖాన్ సాబ్ ప్రతి సమావేశానికీ ఒక విద్యార్థిలా వచ్చే వారు. తనకేదో తెల్సుకాబట్టి అది బోధించడానికి వచ్చేవారు కాదు. యెప్పుడూ నేర్చుకోవడానికి వచ్చే వారు. ఒక మూలకు నిశ్శబ్దంగా కూర్చుని తన పని తాను చేసుకుంటూ సమావేశాల్లో పాల్గొనే వారు. యెప్పుడూ వినే వారు. తక్కువ మాట్లాడినా యెన్నో విలువైన విషయాలు మాట్లాడే వారు. ఆయన ఉపన్యాసాలు దీర్ఘంగా కాక , చిన్నగా , సూక్తుల్లా గా, సూఫీ పలుకుల్లా ఉండేవి. ధారాళమైన వక్త కాకపోయినా చెప్పే మాటల్లో పదునూ, గ్నానమూ యెంతో ఉండేది. ఆయన రాతల్లో కూడా అంతే! విరసంలోనూ, APCLC లోనూ అంత ఉద్యమానుభవమూ, పరిగ్నానమూ ఉన్నా, పదవులున్నా సాధారణ కార్య కర్తలా పనిచేయగలగడం ఖాన్ సాబ్ కే సాధ్యమైంది. దానిక్కారణం ఆయన సామాజిక నేపథ్యమే! హైద్రాబాదు పాతనగరం (అదే అసలైన నగరం కూడా) లో పేద ముస్లిం కుటంబ నేపథ్యం – అదే నగరానికి పాలుతాపిన గొల్ల అమ్మ వొడిలో పాలు తాగిన సామాజిక నేపథ్యం !

10559901_10203693615637541_4934043015941360340_n

ఖాన్ సాబ్ తో వీవీ

ఖాన్ సాబ్ వెళ్ళిపోయారంటే, కటువైన ఆ వార్తను నమ్మాలంటే చాలా కష్టంగా ఉన్నది. దుఃఖంగా ఉన్నది. ఆయన తరం వాళ్లంతా ఒక్కరొక్కరే వెళ్ళి పోతూ ఉంటే వొంటరి తనమూ, దిగులూ చుట్టుముట్టి, వెంటాడుతున్నాయి. అంత నిర్మలంగా, నిష్కల్మషంగా, నిరాడంబరంగా, సూఫీ తత్వాన్నీ , విప్లవ తిరుగుబాటునూ నరనరానా జీర్ణించుకున్న సాధువులా జీవించిన మహోన్నత వ్యక్తిత్వం , యెంతో గ్నాన సంపన్నత ఉన్నా యేమీ తెలియనితనంతో, యెప్పుడూ నేర్చుకోవాలనే జిగ్నాసతో నిరంతర విద్యార్థిలా, ఉద్యమాలకు నాయకుడైనా, సాధారణ కార్యకర్తలా పనిచేయగలిగిన గొప్ప మానవతామూర్తి ఖాన్ సాబ్ 1935 లో హైద్రాబాద్ లో జన్మించారు.

ఖాన్ సాబ్, మొహమ్మద్ తాజుద్దీన్ ఖాన్ అసలు పేరైనా ఎం టీ ఖాన్ గా అందరికీ సుపరిచితుడు. ఖాన్ సాబ్ జీవితం – ఎనిమిది దశాబ్దాల హైద్రాబాదు సుసంపన్నమైన చరిత్ర – బహుళ సంస్కృతుల సమ్మేళనమైన డెక్కన్ చరిత్ర. సమస్త భారతదేశానికే తలమానికమైన సంపద్వంత తెలంగాణ చరిత్ర. తెలుగు నేలపైన జరిగిన మహోన్నత ప్రజా పోరాటాల చరిత్ర, భారత ప్రజల విప్లవోద్యమ చరిత్ర , విప్ల వ సాంస్కృతికోద్యమ చరిత్ర. తెలంగాణ కోసం జరిగిన మూడు దశల ప్రజాపోరాటాలతో – సాయుధ రైతాంగ పోరాటం, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1994 – 95 లలో తిరిగి ఊపిరి పోసుకుని తెలంగాణ మహాసభ, జనసభ ల తో పుంజుకుని చివరికి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ యేర్పడే దాకా జరిగిన ప్రతి ఉద్యమంతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధాలుండి క్రియా శీలకంగా పాల్గొన్న ఉద్యమకారుడు ఖాన్ సాబ్.

చిన్ననాటినుండే మహాకవి మఖ్దూం మొయినుద్దీన్ తో సాంగత్య మూ, శిష్యరికమూ , ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నడిపిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రభావమూ, యిప్టా (అభ్యుదయ రచయితల సంఘం) కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర ఖాన్ సాబ్ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దినయి. పేద ముస్లిం, దళిత బహుజన సామాజిక నేపథ్యం (అప్పుడా ప్రత్యేక స్పృహ లేనప్పటికీ) ఆయనలోని నిరాడంబర, నిస్వార్థ సూఫీ సాధు తత్వాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాలు, పోరాటాలు తిరుగుబాటు మార్క్సిస్టు తత్వాన్ని ద్విగుణీకృతం చేసాయి.

ఆయన చిరకాల స్నేహితులు, సహచరులు బూర్గుల నర్సింగరావూ, కేశవరావు జాదవ్ గార్లతో ఖాన్ సాబ్ హైద్రాబాద్ లౌకిక ప్రజాస్వామిక సంస్కృతికీ చరిత్రకీ రూపకల్పన చేసారు. హిందూ ముస్లిం మతోన్మాదాలకు వ్యతిరేకంగా, పేద ముస్లిం లకు విద్య కనీసావసరాల కన్నా మసీదుల్లో మైకు లకోసం పాకులాడిన MIM మత రాజకీయాలకు వ్యతిరేకంగా, రాజకీయ విషసర్పాలు పడగ విప్పి బుస కొట్టిన మత కలహాలకు వ్యతిరేకంగా, పేద ముస్లిం, హిందూ ప్రజల ఐక్యత కోసం ఖాన్ సాబ్ చేసిన కృషి సామాన్యమైంది కాదు, అది చిరస్మరణీయమూ మనకందరికీ దారి చూపించేదీ!

బి యే పాసు అయినా కాకపోయినా ఎం యే విద్యార్థులకూ పాఠాలు నేర్పగల దిట్ట, మార్క్సిజం నరనరానా జీర్ణించుకుని, విద్యార్థులకు ముందుగా మనుషుల్లా బతకడం అన్నింటికన్నా ముఖ్యం అని యాకుత్ పురాలోని ధన్వంత కళాశాల లో పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుడు ఖాన్ సాబ్! ఉర్దూ, పార్సీ, తెలుగు, ఆంగ్లం, మరాఠీ – ఐదు భాషల్లో ప్రావీణ్యత సాధించి – అన్ని భాషల్లో రచన సాగించిన ఖాన్ సాబ్ సియాసత్ న్యూస్ టైం లాంటి పత్రికల్లో జీవిక కోసం సంపాదక స్థాయిలో (పదవులు లేక పోయినా ) రాసారు.

భారత కమ్యూనిస్టు పార్టీ జడత్వానికి లోనై, పార్లమెంటరీ పంథా బురద లో కూరుకుపోయినప్పుడు ఉవ్వెత్తున యెగసిన నక్సల్బరీ తో ఉన్నారు ఖాన్ సాబ్! తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం కెరటంలా యెగసి పడుతున్న సందర్భం – నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళ నిప్పురవ్వలు రాజేస్తున్న సందర్బం – పాణిగ్రాహి లాంటి ప్రజాకవులు విప్లవ సాహిత్యానికి బీజాలు వేస్తున్న సందర్భం – విరసానికి కర్టెన్ రైజర్ లాంటి ‘అంటార్కిటా’ పోస్టర్ కవిత ను (వేణుగోపాల్, తేజ్ రాజేందర్ లతో ) రూపొందించారు ! విరసం. APCLC లలో సంస్థాపక సభ్యులు. 1972 లో పిలుపు పత్రికను ప్రారంభించారు. 1973 లో మీసా కింద వరవరరావు, చెరబండరాజులతో అరెస్టయ్యారు. సికింద్రాబాద్ కుట్రకేసులో నిందితుడయారు. ఎమర్జెన్సీ చీకటి రోజులు మొత్తం జైల్లో బందీ గా గడిపారు. అయినా చెక్కు చెదరలేదు. నిర్బంధాలూ, కుట్రకేసులూ, జైలు జీవితమూ , కటిక పేదరికమూ, కష్టాలూ , కన్నీళ్ళూ ఖాన్ సాబ్ ని యేమాత్రమూ మార్చలేదు. ఆయన వెనుకంజ వేయలేదు, దారితప్పలేదు. విరసంలో, APCLCలో చివరి ఊపిరిదాకా కొనసాగారు. AILRC ఉద్యమంలోనూ పాల్గొన్నారు.

1453335_10203693641238181_6506679510882453898_n

హైద్రాబాదులో సెకులర్, ప్రజాస్వామిక, విప్లవ ఉద్యమాలన్నిటిలో అలుపెరుగకుండా జీవితాంతం పాల్గొన్నారు. ఆయన జీవిత చరిత్రను ప్రజాస్వామిక లౌకిక హైద్రాబాద్ చరిత్ర కు ప్రర్యాయ పదంగా మార్చారు. 1992 లో APCLC కి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 90 వ దశకంలో వచ్చిన అస్తిత్వ, ప్రజాస్వామిక ఉద్యమాలకూ మద్దతునిచ్చారు. మలిదశ తెలంగాణా ఉద్యమంలో నిత్య యవ్వనంతో పాల్గొని 60 యేండ్ల తెలంగాణ కల తన జీవిత కాలం లో సాకారమైన నిత్య ఉద్యమ కారుడు ఖాన్ సాబ్!

హైద్రాబాద్ నగరానికి పెద్ద దిక్కు , కఠినమైన పేదరికంలో నూ నమ్ముకున్న ఆశయాలనూ, నడుస్తున్న ఉద్యమ బాటనూ వదలని ఉద్యమకారుడూ, సాహిత్యకారుడూ , పోరాటశీలీ ఖాన్ సాబ్ మనలని వదలి వెళ్ళిపోవడం అత్యంత బాధాకరామూ మనకు తీరని లోటూ! మొన్న చేరాగారూ, నిన్న ఖాన్ సాబ్
– ఒక్కరొక్కరే మనల్ని వదలి వెళ్ళిపోతుంటే తీరని దుఃఖంగా ఉన్నది –

వెళ్ళి పోతున్నారు
అంతా ….
ఒక్కొరొక్కరే

నిశ్శబ్దంగా,
యేమీ చెప్పకుండా
పట్టుకున్న వెచ్చని చేతులని
వదిలిచుకుంటూ
వెళ్ళిపోతున్నారంతా –

ఒకరు వీడిన కన్నీరు ఇంకా ఆరనే లేదు
మరొకరు,
కన్నీటి చుక్కల్ని పొడిపిస్తూ
నిర్దయగా ….

ముళ్ళూ రాళ్ళూ గుచ్చుకున్న పాదాలకు
అనునయంగా పదిలపు లేపనం పూసినోళ్ళు,
కన్ను పొడిసే చీకట్లల్ల
పురుగూ బూసి కరువకుండ జాగ్రత్తల దీపాలైనోళ్ళు,
పెచ్చులూడిన గోడలమీద
వెలిసిపోయిన రంగులని వెతుక్కుంటున్నప్పుడు
మెరిసిన జాజి రంగు నినాదాలైనోళ్ళు,

కష్టమైనా నష్టమైనా వెన్నంటే ఉంటామని
కొండంత అండైనోళ్ళు

వెళ్ళిపోతున్నారంతా …
బయటికి రాని శోకాన్ని పుట్టెడు దుఃఖాన్ని
మన గొంతుల్లో మిగిలించి …..

యెడతెరపిలేకుండా
యెన్నో వెలుతురు ముచ్చట్లు చెప్పి
యెట్లా బతకాలో బతికి చూపించినోళ్ళు

కలలెప్పుడూ యిగిరిపోవద్దనీ,
కంట్లోనూ మనసులోనూ
తడి యెన్నడూ యింకిపోవద్దనీ
కంటినీరు తుడిచినోళ్ళు

యెన్ని పోగొట్టుకున్నా
యెన్నడూ మనిషితనం పోగొట్టుకోవద్దని,
శిథిలమైన బతుకుగోడల మధ్యా
చెదరని చిరునవ్వుతో చెప్పినోళ్ళు

ఒక్కొరక్కరే వెళ్ళిపోతున్నారు
మౌనంగా ….

నెమ్మదిగా తలలూపే చెట్లలాగా,
పొద్దుటి పూట చెమ్మగిల్లిన పూలలాగా,
లేత యెండలో మెరిసే చిగురుటాకుల్లా

నెరవేరని కలలనీ
అలుపెరుగని చిరునవ్వులనీ
మనకు మిగులుస్తూ…

ఒక్కొరక్కరే వెళ్ళిపోతున్నారు
మౌనంగా ….

 

యెన్నో తరాలకు చిమ్మ చీకట్లలో దారి చూపిన ఖాన్ సాబ్ చిరునవ్వు అమావాస్య యెరుగని చంద్ర దీపం!
మన గ్నాపకాల్లో, నెరవేరని కలల్లో ఖాన్ సాబ్ యెప్పుడూ జీవించే ఉంటారు, చిరస్మరణీయులై!

-నారాయణస్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

ఫోటోలు: కూర్మనాధ్

Download PDF

8 Comments

 • gsrammohan says:

  ఖాన్‌ సాబ్‌ సాంగత్యంలో తెలీని ఫ్లేవర్ ఏదో ఉండేది. ఏసుక్రీస్తు ముళ్లకిరీటం మోస్తున్నట్టు భారంగా కనిపించకపోవడమా! ఎంతటి ఒత్తిడి పరిస్థితుల్లోనైనా లైవ్లీగా జోకులేస్తూ ఉండడమా! మేనమామ లాంటి తాతలాంటి చనువుతో కూడిన పలకరింపా!కన్నబీరన్‌తోనూ మన లాంటి వారితోనూ ఒకేరకంగా వ్యవహరించగలగడమా! ఎవరితో ఎలా మాట్లాడాలి అనే అధికార స్వరమార్పు విద్యలు నేర్వని తనమా! బహుశా తన పెద్దరికాన్ని-కొల్లా వెంకయ్య, కొండపల్లి లాంటి వారితో గడిపిన అనుభవాన్ని అధికారంగా మార్చుకుని మనపై చూపకపోవడమేమో! ఏమో!

 • నారాయణస్వామి says:

  ముమ్మాటికీ నిజం రామ్మోహన్! అది ఖాన్ సాబ్ సామాజిక నేపథ్యం నుండి వచ్చిందనుకుంటున్నా – హైద్రాబాదు ‘పాత’ నగరపు ముస్లిం దళిత బహుజన కష్టజీవుల సంస్కృతి గొప్పదనమది!

 • krishnudu says:

  ఏం రాసినవురా భై. పాత దినాల్ యాద్ మర్వకుండ రాసినవ్.

 • కామ్రేడ్ ఖాన్ సాబ్ అందించిన నిరాడంబర వారసత్వాన్ని సామాజిక ఉద్యమ స్ఫూర్తిని అందిపుచ్చుకునే వారసులు నేడున్నారా? తన పూర్వీకుల సూఫీ తత్వాన్ని తన జీవన విధానానికి అన్వయించుకుని తుపాకీ గురిపెట్టిన ఫకీర్ ఖాన్ సాబ్. ఆయన వారసత్వాన్ని కొనసాగించే తరం కోసం పరితపిస్తూ జోహార్లర్పిస్తున్నా. అమర్ రహే కామ్రేడ్..

 • buchireddy gangula says:

  చాల భాగ రాశారు సర్ —మనిషితనం పోగొట్టుకోవద్దని
  గొప్పగా చెప్పారు

  ————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 • ఆర్.దమయంతి. says:

  నెమ్మదిగా తలలూపే చెట్లలాగా,
  పొద్దుటి పూట చెమ్మగిల్లిన పూలలాగా,
  లేత యెండలో మెరిసే చిగురుటాకుల్లా
  ఇలా వెళ్ళిపోవడానికి కూడా !..

 • Rajendra Prasad m says:

  నిరాడంబర జీవి, నిష్కపటి, పసిపిల్లడిలాంటి మనసు ,
  కల్మషంలేని నవ్వు, అప్యాయతగా పలకరించే తత్వం,
  భుజానసంచి , ఇస్త్రీ ఎరుగని లాల్చీ- పైజమా ,
  గతితార్కిక వాదంలో రాటుదేలిన మేధస్సు ,
  సభ ఎక్కడైనా తప్పక హాజరు , బతికినంతకాలం నిజాయితీకి అతనే చిరునామా
  అతని పేరే -ఎం టీ ఖాన్ ..

  లాల్ సలాం లాల్ సలాం — అందుకో అందుకో అమరుడా జోహారులందుకో ..

 • కె. కె. రామయ్య says:

  “ భౌతిక సుఖాలకు దూరంగా, జీవితమంతా ఒక సూఫీ తత్వం తో , తాను నమ్మిన ఆశయానికి కట్టుబడి, గొప్ప నిబద్దతతో ఖాన్ సాబ్ జీవించారు. నిర్మలంగా, నిష్కల్మషంగా, నిరాడంబరంగా, సూఫీ తత్వాన్నీ, విప్లవ తిరుగుబాటునూ నరనరానా జీర్ణించుకున్న సాధువులా జీవించిన మహోన్నత వ్యక్తిత్వం.

  నిర్బంధాలూ, కుట్రకేసులూ, జైలు జీవితమూ , కటిక పేదరికమూ, కష్టాలూ , కన్నీళ్ళూ ఖాన్ సాబ్ ని యేమాత్రమూ మార్చలేదు. ఆయన వెనుకంజ వేయలేదు, దారితప్పలేదు. విరసంలో, APCLCలో చివరి ఊపిరిదాకా కొనసాగారు. “

  మన గ్నాపకాల్లో, నెరవేరని కలల్లో ఖాన్ సాబ్ యెప్పుడూ జీవించే ఉంటారు, చిరస్మరణీయులై! “

  ఖాన్ సాబ్ అమర్ రహే.

  ఖాన్ సాబ్ కి నివాళి సమర్పించిన నారాయణస్వామి గారికి కృతజ్ఞతలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)