తెలుస్తూనే ఉంది

 Rekha

నాకు తెలుస్తోంది

నా వీపు తాకుతున్న ఆ కళ్ళు
తడిబారి ఉన్నాయని,

ఒక్క అడుగు వెనక్కి వేసినా ,
ఆమె కన్నీటి సరస్సులో నా మునక తప్పదని

ఒక్కసారి, ఇంకొక్కసారి అనుకొని
లెక్కలేనన్ని సార్లు చూపుల తడిమి తడిమి
నా రూపుని తన కంటి పాపపై చెక్కుకొని
తనివి తీరక చివరికి,
కన్నీరై కరుగుతోందని తెలుస్తోంది

వేల వేల భావగీతాలు పంచుకున్న తర్వాత
వీడ్కోలుకు ముందు ఇరువురం స్తబ్దుగా మిగిలిన
ఆ కొన్ని క్షణాల్లోనే ఉంది ఆర్ద్రత అంతా
ఆ కాసిన్ని నిరక్షర కవనాలలోనే ఉంది వేదనంతా
ఆమె నన్ను ఆపకుండా ఎలా ఉంటుంది ?
ప్రాణం పోతుంటే పోరాడని వారు ఎవరుంటారు?

మరోసారి, ఎన్నోసారో మరి
ఆ చేయి నొక్కి ధైర్యాన్ని ఇస్తున్నానో, తీసుకుంటున్నానో
తెలియని శూన్యావస్థలో వెనుదిరిగాను

ఆఖరి కరచాలనంలో
వేళ్ళ చివరనుంచి జారిపోతున్న ప్రాణాన్ని పట్టుకొని,
విడవలేక, విడవలేక మళ్ళీ పట్టుకొని
చివరికి, ఓ సాలీడు తన గూడు లో నుంచి
జర్రున జారిపోయినట్టు వెనుదిరిగాను

నాకు తెలుస్తూనే ఉంది

పెనుగాలికి రాలిన పొగడ పూలను
భద్రంగా మాల గుచ్చుకుంటుందని,
ఈ దూరాన్ని కుదిపి కుదిపి గాయం చేసుకొని
దాచుకుంటుందని తెలుస్తోంది

చేయగలిగిందేమీ లేదు,
తల వంచుకొని ఈ వీధి మలుపు తిరగడం తప్ప

నిజానికి
ఆమె కళ్ళెత్తి చూసినప్పుడు విరిసే ఓ కాంతి పుంజంలో
నన్నూ నా జీవితాన్ని ఒక్క క్షణం చూసుకుంటే చాలు అనుకొని వచ్చాను

ఇదేంటి? ఈ వెలుగు శాశ్వతం కాలేదని నిరాశతో వెనుదిరుగుతున్నాను

రాక రాక ఆమె వాకిలికొచ్చి పొందానా?
మరోసారి నన్ను నేను పోగొట్టుకున్నానా?

– రేఖా జ్యోతి

Download PDF

36 Comments

  • ఎంత హృద్యంగా రాసారూ..!

  • suresh says:

    పెనుగాలికి రాలిన పొగడ పూలను
    భద్రంగా మాల గుచ్చుకుంటుందని,
    ఈ దూరాన్ని కుదిపి కుదిపి గాయం చేసుకొని
    దాచుకుంటుందని తెలుస్తోంది

    నిజానికి
    ఆమె కళ్ళెత్తి చూసినప్పుడు విరిసే ఓ కాంతి పుంజంలో
    నన్నూ నా జీవితాన్ని ఒక్క క్షణం చూసుకుంటే చాలు అనుకొని వచ్చాను

    ఇదేంటి? ఈ వెలుగు శాశ్వతం కాలేదని నిరాశతో వెనుదిరుగుతున్నాను

    రాక రాక ఆమె వాకిలికొచ్చి పొందానా?
    మరోసారి నన్ను నేను పోగొట్టుకున్నానా?

    అక్షర లక్షలండి….అల్ ది బెస్ట్

  • Prasuna says:

    ఎంత సుందరమైన కవితండీ.

  • lakshmi says:

    aaj jaaneki jidd naa karoo, mere pehloo me baithe rahooo……..chala bagundi mee kavitha. wah. hrudayanni thakindi.

  • అమ్మా, చక్కటి అనుభూతిని కలిగించింది మీ కవిత. ప్రియమైన వారు దూరం అవుతుంటే అనుభవించే నిశ్శబ్ద వేదన అంటా ఇందులో చక్కగా చూపారు. కొన్ని పాదాలు గుండెను పట్టుకునేలా ఉన్నాయి.
    కన్నీరై కరిగినది ఎవరి కంటిపాపో కానక్కరలేదు, చదివిన హృదయం కూడా అలానే ద్రవించేలా వ్రాసారు.
    ఇందులో కొన్ని మహాద్భుతంగా ఉన్నవి:

    ‘నా రూపుని తన కంటిపాపపై చెక్కుకుని …కన్నీరై కరుగుతోంది’
    ‘ఆ కాసిన్ని నిరక్షర కవనాలోనే ఉంది వేదనంతా’ (నిరక్షర కవనాలు – ఎంత బాగుంది ఈ మాట!)
    ‘వీడ్కోలుకు ముందు ఇరువుర స్తబ్దుగా మిగిలిన ఆ కొన్ని క్షణాల్లోనే ఉంది ఆర్ద్రత అంతా’
    ‘ఆమె కళ్ళెత్తి చూసినప్పుడు విరిసే ఓ కాంతిపుంజం లో నన్ను, నా జీవితాన్ని ఒక్క క్షణం చూసుకుంటే చాలు’
    ‘ఆఖరి కరచాలనం లో వేళ్ళ చివరినించి జారిపోతున్న ప్రాణాన్ని పట్టుకొని’

    ఆ వీడుకోలు మీరు ఎవరికీ చెప్పారో వారు ఎంత స్నేహశీలో కదా!
    చాలా మంచి కవిత చదివించారు , తరుచూ రాస్తుండవచ్చు కదా! శుభమ్.

  • narayana sharma says:

    ఈకాలపు కవిత్వంపై మనోవైఙ్ఞానిక ప్రభావం ఎంతగా ఉందో మీ కవితచెబుతుంది..వీడుకోలు యాంత్రికంగా జరుగుతుందనుకునే ఆఒక్క క్షణాన్ని అనేక శకలాలుగా అనుభవించడం..అంతే గొప్పగా కవిత్వీకరించడం బావుంది..ప్రతి వాక్యం హృదయాన్ని ఆవిష్కరించింది..
    నాకు తెలిసి ఈ సంఘటన వెనుక ఉండే స్తబ్దదృశ్యాన్ని కవిత్వం చేసిన కవులు/కవయిత్రులు,సాహిత్యం తక్కువే.బహుశ: లేరేమో..పదిలంగా ఒక స్త్రీ గొంతుక ధ్వనిస్తుంది అన్ని వాక్యాలలో…

    మీరు కవితకు ఎన్ను కున్న శీర్శిక ఈ కవిత హృదయాన్ని ప్రసారం చేగలగలేదనిపిస్తుంది..

  • మైథిలి అబ్బరాజు says:

    ” వేళ్ళచివరనుంచి జారిపోతున్న ప్రాణం ” ఇటువంటి ఎన్ని- చెప్పే వీలు లేని భావాలకి , అక్షరాలు ఇచ్చారు రేఖా… అపురూపమైన హృదయం , అది కరిగి నీరైన మాటలు…ఈ గాయాన్ని దాచుకుంటాను.

  • Elanaaga says:

    కవిత బాగుంది. అభినందనలు.

  • nmraobandi says:

    అద్భుతంగా వ్రాశారు …
    అభినందనలు …

  • rachakonda srinivasu says:

    చాల బాగుంది .భావాలూ జాలువారాయి

  • NS Murty says:

    రసవత్తరమైన కవిత. హృదయపూర్వక అభినందనలు.

  • Swathi says:

    Adbhuthamaina hrudhyamaina padaprayogam… Mee nunchi inka illantivi chala kavithalu aasisthunnam Akka…

  • ” పొందానా?
    పోగొట్టుకున్నానా?” – చాలా బావుందండీ కవిత. అభినందనలు

  • నిశీధి says:

    చాల కాలం కి ఒక మంచి పోయెమ్ చదివిన ఫీలింగ్ .

  • చాలా మంచి కవిత రాశారు. అబినందనలు.

  • madhavi mirapa says:

    రేఖ గారు కవిత చాల బావుంది. పొందడం పోగొట్టుకోవడం ఒకేసారి జరిగినపుడు కలిగే ఆనందం బాధ మధ్య దూరాన్ని కుదిపి కుదిపి గాయం చేసుకోవడం ఎంతమందికి సాధ్యమవుతున్దంటారు ? నిరక్షర కవనాలలోనే ఉంది వేదనంతా… ప్రియమైన వారిని వీడి పోయే ముందు ఉండే ఆర్ద్రతంతా మీ కవితలోనే ఉంది …….చేయగలిగింది ఏమి లేదు వీధి మలుపు తిరగడం తప్ప …..మనల్ని నిత్యం వెంటాడే కవితల్ని గుండెల్లో దాచుకోవడం తప్ప…చేయగలిగినది ఏమి లేదు…… వేళ్ళ చివరనుంచి జారిపోతున్న ప్రాణాన్ని పట్టుకొని…

  • AMAZING పోయెమ్!!
    మొదటినించీ చివరివరకూ అద్బుతం!!!

  • Mohanatulasi says:

    ‘వీడ్కోలుకు ముందు ఇరువుర స్తబ్దుగా మిగిలిన ఆ కొన్ని క్షణాల్లోనే ఉంది ఆర్ద్రత అంతా’ – కుదిపేసే క్షణాన్ని మాటలో పట్టుకున్నారు.

    చాలా బాగుంది రేఖా గారు!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)