బాపూ గారూ- నేనూ అతి క్లుప్తంగా

మా ఇంట్లో బాపూ గారు -1996
మా ఇంట్లో బాపూ గారు -1996

మా ఇంట్లో బాపూ గారు -1996

ఆయన నిర్యాణం వార్త వినగానే ముందుగా కళ్ళ ముందు మెదిలింది ఆయన నవ్వే. అది ఎక్కడా కల్మషం లేకుండా అత్యంత సహజమైన ఆహ్లాద కరమైన, విశాలమైన నవ్వు. విశాలం అని ఎందుకు అంటున్నాను అంటే ….ఆ బూరి బుగ్గలకి ఇవతలి నుండి అవతలి దాకా పూర్తిగా, హాయిగా నవ్వడం, నవ్వించడం ఆయన స్వభావం. ఆయనతో నా పరిచయం కేవలం ముఫై సంవత్సరాల పైనే. వ్యక్తిగతంగా కలుసుకుని ఆయన తో పూర్తిగా గడిపిన రోజులు మహా అయితే 30 ఉంటాయేమో. ఫోన్ లో మాట్లాడినది సుమారు 60 గంటల పైగానే. ఇక ఉత్తర ప్రత్యుత్తరాలు పరవా లేదు.

తన గురించి “గొట్టాం గాణ్ణి” అనుకునే ఏకైక కారణ జన్ముడు, కేవలం తెలుగు జాతి జాతకం బావుండి తెలుగు వాడిగా పుట్టి “పద్మశ్రీ “ బిరుదుతో సద్దుకున్న అసల, సిసలు “భారత రత్న” బాపు గారు. ఆయన ఎంత “సింపుల్” మనిషి అంటే ఆయనకి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు అని తెలిసి ఫోన్ చేసి “గురువు గారూ…మీకు ధన్య వాదాలే కానీ మీకు ఇలాంటివి చాలా చిన్న గుర్తింపులే కదా.” అని అప్రస్తుత ప్రసంగం లాంటిది చేశాను.

దానికి నవ్వేసి “అలా అనకండి. ఇది కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే మొన్నటి దాకా స్వామి దర్శనం చేసుకోవాలంటే పదేసి గంటలు లైన్ లో నుంచో వలసి వచ్చేది. ఇప్పుడు వాళ్ళే వచ్చి, నాకు ప్రత్యేక దర్శనం చేయించారు” అన్నారు.

“కానీ…అదేమిటో, నాకూ, రమణ గారికీ ఒకటే దండ వేశారు. అదేదో గజమాలట. ఈ సభల్లో అన్ని పువ్వులు ఎందుకు వేస్ట్ చేస్తారో?” అని కూడా అనగానే “అవును సుమా” అని నాకు అనిపించి ఆ తరువాత ఆయన వచ్చిన మా సభ కి పువ్వులు బదులు పుస్తకాలు బహుమతిగా ఇచ్చాను. ఆయన భలే సంతోషించి…”తెలివైన వాడివే” అన్నారు.

అదే సభ లో మేము తొలి అంశంగా మేము ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న చాలా జిల్లాల నుంచి ఎంపిక చేసిన “ఉపాధ్యాయుల సత్కారం” అనే కార్యక్రమం తలపెట్టి, అ విషయం ఆ సభ ప్రధాన అతిథులైన బాపు-రమణ లకి తెలియజేశాను. వెనువెంటనే బాపు గారి దగ్గర నుంచి ఎప్పటి లాగానే క్లుప్తంగా ఒక ఇ-మెయిల్ వచ్చింది. అందులో ఒకే ఒక్క మాట….”అద్భుతం”…ఆ తరువాత ఫోన్ లో ఆ ఆలోచన ఎంత బావుందో ఆయనా, రమణ గారూ వివరంగా చెప్పారు.

అదే సభలో రమణ గారి కథ – బాపు గారి బొమ్మ తొలి సారి గా ప్రచురణ కి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా మేము నిర్వహించిన బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి సందర్భంగా మరొక తమాషా జరిగింది. “మీ సన్మానం సందర్భంగా నారాయణ రెడ్డి గారు, మరి కొందరు మాట్లాడతారు” అని నేను ఇంకా ఆ సన్మాన కార్యక్రమం ఎలా జరుగుతుందో చెప్తూ ఉండగా “వాళ్ళంతా మమ్మల్ని పొగుడు తారా?” అని అడిగారు బాపు గారు.

నేను సమాధానం చెప్పే లోగానే “ఒకటే కండిషన్. మా గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేను చస్తే స్టేజ్ మీద కూచోను. ఎందుకంటే వాళ్ళ మైక్ స్టేజ్ ముందు ఉంటుంది. మా కుర్చీలు వెనకాల ఉంటాయి. అంచేత వాళ్ళ వాగుడు అంతా ఆడియన్స్ కే కానీ నాకు వినపడి చావదు. వాడు తిడుతున్నాడో, పొగుడుతున్నాడో తెలిసి చావదు. అంచేత నేను నేనూ, రమణ గారూ కింద కూచుని ఆ వాగుడు వింటాం. అందరి స్పీచ్ లూ అయ్యాక అప్పుడు మమ్మల్ని స్టేజ్ మీదకి పిలు” అన్నారు.

“సరే, సార్.” అని ఆ మాట సి. నారాయణ రెడ్డి గారితో చెప్పాను. ఆయనకి భలే కోపం వచ్చింది.

“బాపుకేం తెలుసూ..వాళ్ళు ఆడియన్స్ లో కూచుని . స్టేజ్ ఖాళీగా ఉంటే నాకు అవమానం. పైగా అది సంతాప సభ అవుతుంది కానీ , సన్మాన సభ ఎలా అవుతుందీ” అని కోప్పడ్డారు.

నేను ఏం చెయ్యాలో తెలియక, ఇద్దరికీ నచ్చ చెప్పా లేక మొత్తానికి “నేను మిమ్మల్ని ఇద్దరినీ ఒకే సారి వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ఆ తర్వాత మీరు, మీరూ చూసుకోండి” అని అలాగే చేశాను. ఆఖరి క్షణంలో నారాయణ రెడ్డి గారు ఎంత బతిమాలినా, బాపు-రమణలు ముందుగా స్టేజ్ మీదకి రాకుండా అన్ని ప్రసంగాలూ అయ్యాకే వేదిక మీదకి వచ్చారు. చికాకులో ఉన్నా, ఆ రోజు బాపు-రమణ ల మీద సి. నారాయణ రెడ్డి గారు అద్భుతంగా ప్రసంగించారు.

డిశంబర్ 31, 2006 – జనవరి 1, 2007 తారీకులలో “మొట్ట మొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” జరిగిన ఆ మహా సభలో నా కథల పుస్తకాన్ని బాపు-రమణ లో ఆహ్వానించారు. ఆ నాటి ఫోటో ఒకటి, 1996 లో బాపు గారు మా ఇంట్లో వారం రోజుల పైగా ఉన్నప్పటి ఫోటో ఒకటి, ఆయన కేవలం నా ఫోటో చూసి వేసి నాకు బహుకరించిన ఒక కేరి కేచర్ ఇందుతో జత పరుస్తున్నాను.

మరొక సారి ఏమయిందంటే…బాపు గారిని మా హ్యూస్టన్ లో ఉన్న నాసా అంతరిక్ష కేంద్రం చూడ్డానికి తీసుకెళ్ళాను. అది ఆయనకీ చాలా నచ్చింది. అక్కడ విజిటర్స్ పుస్తకంలో “ఇందులో తెలుగులో సంతకం పెడితే అదేదో తురకం అనుకుని నన్ను జైల్లో పెడతారా” అని అడిగి, నవ్వేసి ఇంగ్లీషులోనే పొడి సంతకం పెట్టారు.

మరొక సారి అమెరికా ఆహ్వానిస్తే “వద్దు లెండి. మీ అమెరికా ఎయిర్ పోర్ట్ లో బట్టలు విప్పేసి మగాళ్ళ ముందు నగ్నంగా నుంచోడానికి అంత దూరం ఎందుకూ? మా ఇండియాయే బెటరు” అన్నారు. “పోనీ ఆడ సెక్యూరిటీ వాళ్ళని ఏర్పాటు చేస్తాను లెండి” అనగానే అరగంట సేపు నవ్వారు బాపు గారు. నేను అమెరికాలో “శ్రీ రామరాజ్యం” విడుదల ఆట చూసి, హాలు నుంచి బయటకి రాగానే ఆనందం పట్ట లేక బాపు గారికి ఫోన్ చేశాను.

మాములుగా క్లుప్తంగా మాట్లాడే బాపు గారు మహానందపడి ఎన్నడూ లేనిది అనేక విషయాల మీద …ముఖ్యంగా రమణ గారు లేని లోటు గురించి …గంట సేపు మాట్లాడారు.

ఎంతో “సెన్సిటివ్” మనిషి అయిన బాపు గారు, తనకే ఏదైనా విషయం బాధిస్తే, దానిని కార్టూన్ రూపంలో వెలిబుచ్చే వారు. ఉదాహరణకి మొట్టమొదటి సారి ఒక జాతీయ సంఘం అమెరికా పిలిచినప్పుడు ఆయనకి చాలా అవమానం జరిగింది..అని ఆయన చెప్పకుండా చెప్పిన మాటలు. అప్పుడు ఆయన చేత ఆ కన్వెన్షన్ సెంటర్ లో “స్త్రీల మరుగు దొడ్డి” లాంటి సైన్ బోర్డులు బాపు గారు అమెరికాలో మొట్టమొదటి సారి అడుగు పెట్టగానే రాయించారుట. అప్పటి నుంచీ బాపు గారికి అమెరికా రావడం అంటే ఎలర్జీ యే. ఆయన అమెరికా అనుభావాల మీద కొన్ని కార్టూన్ లు వేసి మా బోటి గాళ్ళకి చూపించారు బాపు గారు. అవి చూస్తే ఆయన ఎంత బాధ పడ్డారో తెలుస్తుంది.

అలాగా లూయీ మాలే అనే ఫ్రెంచ్ దర్శకుడు “మహాభారత” అనే సినిమాని ..పాండవులు, కౌరవులు. కృష్ణుడు ఐదు వేల ఏళ్ల క్రితం ఆటవిక జాతుల కుటుంబ కలహంగా, అందులో పాత్రధారులని అసహజమైన రీతిలో చిత్రీకరిస్తూ తీసిన చిత్రం బాపు గారిని చాలా బాధ పెట్టింది. అందులో భీష్ముడి పాత్ర ఒక సౌత్ ఆఫ్రికా నల్ల వాడి చేతా, ఇతర పాత్రలు ఇతర దేశాల నటుల చేతా వేయించి మొత్తానికి హిందువుల మనోభావాలని దెబ్బతినేటట్టుగా ఆ సినిమా ఉంది. దానికి స్పందనగా బాపు గారు ఒక కార్టూన్ లో జంధ్యము, బొట్టు, పిలకా ఉన్న ఒక బ్రాహ్మణుడి ని శిలువ మీద క్రీస్తు గానూ, మిగిలిన పాత్రలని, నల్ల జాతి మొదలైన వారి లా చిత్రీకరించి “ఇది చూస్తే క్రైస్తవ మతస్తులు ఏమనుకుంటారో?” అని అనుమాన పడుతూ ఆ కార్టూన్ పంపించారు. ఆయనకీ అర్థం అవని మరొక విషయం అమెరికాలో విరాళాల మీద ఆధారపడి సాంస్కృతిక కార్యక్రమాలు చెయ్యడం. “నన్ను ఏదో జూలో కోతిని కూచో బెట్టి అందరి చేతా డబ్బులు వేయించినట్టు, మీరు విరాళాలు అడుక్కుని నన్ను పిలవడం ఎందుకూ, ఏదో యాయవారం బ్రాహ్మడికి దక్షిణ పారేసినట్టు నాకు మీ దాన ధర్మాలు ఎందుకూ?” అనే వారు ఎప్పుడు అమెరికా రమ్మని పిలిచినా.

Bapu & Chitten Raju
ఇలా బాపు గారి గురించి వ్యక్తిగతంగా నాకు తెలిసినవి చెప్పుకుంటూ పోవాలంటే చాలా విషయాలే ఉన్నాయి. కానీ మనసు బాగా లేదు. నేను, ఆ మాట కొస్తే తెలుగు వారు ఎంతో అదృష్ట వంతులు. రమణ గారి సాయుజ్యంలో ఇప్పుడు బాపు గారు మళ్ళీ స్వాంతన పొందుతున్నారు. ఆయన జ్జాపకాలు నన్ను ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటాయి. అంత కంటే ఆయనకి ఇవ్వగలిగిన నివాళి ఇంకేమీ లేదు.

-వంగూరి చిట్టెన్ రాజు

Download PDF

12 Comments

  • cbrao says:

    “స్త్రీల మరుగు దొడ్డి” లాంటి సైన్ బోర్డులను ఆంగ్లంలో, అక్కడివారితో వ్రాయించవచ్చు కదా. అతిధి ఐన బాపుగారితో ఇలాంటి బోర్డ్ వ్రాయించటం బాధాకరమే.

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      బాపు గారు ఎంతో సాత్వీకుడు కాబట్టి అటువంటి “అవమానం” తట్టుకున్నారు మరి!

    • dhanikonda ravi prasad says:

      బాపు గారైతే బొమ్మ బాగా వేస్తారని ఆశ పడ్డారేమో.

  • Dusi Dharmarao says:

    fDear Raju garu.
    Your grief is understandable,because of your affinity with him. Not only you but all the Telugu people join you in expressing condolences and pray god to provide ,” punarjanma rahitha saswtha brahmalokam”

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      అవును
      ..ఆయనకీ పునర్జన్మ ఉండదు కానీ అది తెలుగు జాతి కి నష్టమేమో ?

  • Satyanandam Kolluri says:

    It is really your homage to BAPU Garu by sharing your feelings with all of us. Thanks for making us recollect about his works and pay our homage to that great personality … Bharata Ratna.

  • బాలాంత్రపు వేంకట రమణ says:

    అన్నయ్యా –
    బాపు గారి గురించి హృద్యంగా జ్ఞాపకం చేసుకున్నారు.
    ఏదో ఒకటి రెండు సార్లు కలిసిన మాకే ఆ మహానుభావుడి మహా నిష్క్రమణ ఇంత బాధాకరంగా ఉంటే, ఇంక అంత గాఢ స్నేహం ఉన్న మీ దుఃఖం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోగలం. ఏదైనా జాతస్య మరణం ధృవం కదా. మనందరికీ ఒక ఓదార్పు ఏమిటంటే బాపు గారి కాలంలోనే మనమూ పుట్టాం; వారు మెట్టిన నేలనే మనం మెట్టాం. ఈ జన్మకిది చాలు.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

    అంతే….నేను మటుకు ఆ విషయంలో చాలా అదృష్టవంతుడిని.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

    పాఠకులకి క్షమాపణలతో….

    ఈ వ్యాసంలో నేను ప్రస్తావించిన “మహాభార” సినిమా దర్శకుడు పీటర్ బ్రూక్స్ అనీ…లూయీ మాలే కాదు. అనాలోచితంగా దొర్లిన నా పొరపాటుకి క్షంతవ్యుడిని. ఈ విషయం నా దృష్టికి తెచ్చిన మిత్రులు జంపాల చౌదరి గారికి ధన్యవాదాలు.

    వ్యూ

  • చిట్టెన్రాజు గారు, మీ వ్యాసం బావుంది.

    ‘పద్మశ్రీ తో సద్దుకున్న భారతరత్న ఆయన’ అన్నారు.

    అప్లి కేషను పెట్టుకుంటే తప్ప దేవుడికైనా పూలదండ లభించని వ్యవస్థ మనది. పూలదండ కూడా ‘పూల దండగ ‘ అనుకునే కారణ జన్ముడికి ఇవేవీ పట్టక పోయినా మోహన్ బాబు , బ్రహ్మానందం వంటి వారికిచ్చిన తర్వాత బాపూ కి, అదికూడా “పద్మశ్రీ !” ఇవ్వడం(2013) చూస్తే కళాభిమానులకి , బాపూ సమకాలీనులవడం అదృష్టంగా భావించే వారికి బాధకలగక మానదు. . బాపూ ఇక లేరని తెలిసినపుడు ముఖ పరిచయం తప్ప పెద్దగా పరిచయం లేకపోయినా చెప్పలేని దిగులు అలా నాలుగు రోజులపాటు మనసంతా ఆవహించి ఒక void అనుభవం లోకి వచ్చింది.

  • బాపూ గారి మహోన్నత వ్యక్తిత్వాన్ని తెలియజేసే విషయాల్ని అందరితో పంచుకున్నందుకు చిట్టెన్ రాజు గారికి కృతజ్ఞతలు. రాజు గారు జరిపించిన 2006 డిశంబరు-2007 జనవరి 1 నాటి ఫంక్షను లోనే నా అభిమాన జంట శ్రీ బాపూ ముళ్లపూడి గార్లను నేను కలుసుకున్నది. ముళ్ళ పూడి గారిని వారింట్లోనే కలుసుకుని చాలా సేపు ముచ్చటించడం అంతకుముందే జరిగినా, బాపూ గారిని చూడడం కలవడం వారితో మాట్లాడడం కలసి ఫోటో దిగడం అదే మొదటిదీ అఖరుదీను. ఆ సాయంత్రం హాల్లో ఫంక్షను జరుగుతుండగా సన్మానింప బడబోయే వారిద్దరూ బయటే నిలబడి తెలిసిన వారితో ముచ్చటిస్తూ గడపడం- ఆ సమయంలోనే ముళ్ళపూడి గారు పిలువగా బాపూగారు కూడా వచ్చి మా ఫోటోలో దిగడం అందమైన అరుదైన జ్ఞాపకం. దీనిని నా అపురూపం బ్లాగులో సెప్టెంబరు 2011 లో షేర్ చేసుకున్నాను.

Leave a Reply to వంగూరి చిట్టెన్ రాజు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)