చిన్నప్పటి బంధువులూ, ఇంట్లో కొన్ని విశేషాలూ

అక్కా, వదినా, కన్నా

 

అక్కా, వదినా, కన్నా

అక్కా, వదినా, కన్నా

చిన్నప్పుడు అంటే నేను ఐదో ఏట ఒకటో క్లాసుతో మొదలు పెట్టి, ఎప్పుడూ పరీక్షలు తప్పకుండా “రాముడు బుద్ధిమంతుడు” లాగా పదహారో ఏట ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి అయ్యే దాకా జరిగిన పది, పదకొండేళ్ళు అన్న మాట. ఒక విధంగా ఈ దశాబ్దం నా వ్యక్తిగత జీవితంలో ఏవిధమైన బాదర బందీ లేకుండా “తెలుగు సినిమా స్వర్ణయుగం తొలి దశాబ్దం” లాంటిది అని చెప్పుకో వచ్చును. అప్పటి కింకా టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్ నెట్ లు, జేబులో కూడా టెలిఫోన్లు లేక అందరి ప్రాణాలూ హాయిగా ఉండేవి.

అందరూ మంచి ప్రమాణాలతో ఉన్న సినిమాలు, రేడియో కార్యక్రమాలు, దసరా నవరాత్రులలాంటి పండగలలో వీధి నాటకాలు, హరి కథలు, బుర్ర కథలు, నెహ్రూ లాంటి దేశ నాయకులు, ఎప్పుడూ నెగ్గే హాకీ టీమూ, ఎప్పుడూ చిత్తుగా ఓడిపోయే ఇండియా క్రికెట్ టీమూ, అతి తక్కువ మోతాదులో లంచాలు, ఉద్యోగం అంటే కేవలం సిఫార్స్ తోటే వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు, బొంబాయి, మద్రాసు లాంటి పెద్ద నగరాలలో తప్ప ఆ రోజుల్లోనే ఏర్పడ్డ ఆంధ్రా మొత్తం మీద కూడా ఎక్కడా లేని ప్రైవేటు ఉద్యోగాలు, అన్నింటికన్నా ఎక్కువగా నేను అనుభవించి ఆనందించిన బందు ప్రేమ, వారి రాక పోకలు ఇవన్నీ వెరసి నా చిన్నప్పటి జీవితాన్ని స్వర్గధామం చేశాయి. ఈ క్షణాన్న నన్ను మళ్ళీ ఎవరైనా ఆ రోజులకి తీసుకెళ్లగలిగితే ఎంత బావుండునో!

మా చిన్నప్పుడు జరిగిన కొన్ని కుటుంబ విశేషాలు నాకు లీలగా గుర్తు ఉన్నా, ఐదారేళ్ళ క్రితం మా పెద్దన్నయ్య “ఒరేయ్, ఇందులో నేను కొన్ని కొన్ని నోట్ చేసుకున్న పాయింట్లు సరదాగా చదువుకో…అంతా మన చిన్నప్పటి సంగతులేలే..రహస్యాలు లేవు.” అని నాకు తన “సంక్షిప్త డైరీ” ని కాపీ తీయించి ఇచ్చాడు. అందుకే ఈ కుటుంబ విషయాలు,తారీకులతో సహా వ్రాయగలుగుతున్నాను.

నాకు కూడా చాలా లీలగా గుర్తున్నది నా పదేళ్ళప్పుడు …ఫిబ్రవరి 2, 1955 నాడు వంద ఎద్దు బళ్ళు కట్టించి దొంతమ్మూరు, వెల్దుర్తి, సింహాద్రిపురం, తిమ్మాపురం, రాయవరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, చిన జగ్గం పేట లో స్వంతంత్ర్య పార్టీ తరఫున మా పెద్దన్నయ్య, హనుమంత రావు బావ కేన్వాసు చేస్తూ తెల్లగా గట్ట నుంచి రాత్రి దాకా జరిగిన ఊరేగింపు. ఆ రాత్రి ఊరేగింపు అయ్యాక దొంతమ్మూరు మేడ ముందు పందిరి వేయించి శశిరేఖా పరిణయం బుర్ర కథ చెప్పించాడు మా పెద్దన్నయ్య. నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఒకే ఒక్క ఉదంతం తప్ప , రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనడం మా ఇంటా, వంటా లేదు. మా నాన్న గారుచిన్నపుడు గాంధీ గారి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో తన   మిల్లు బట్టలు మంటల్లో వేసేసి , జీవితాంతం ఖద్దరు బట్టలే వేసుకున్నారు.

మా చిన్న అన్నయ్య కపిలేశ్వర పురం జమీందారులైన ఎస్. పి. బి. పట్టాభి రామారావు & సత్యనారాయణ రావు గార్లకి ఎలెక్షన్ ఏజెంట్ గా వోట్ల లెక్కింపు లో పాల్గొన్నాడు కానీ ఇవి ప్రత్యక్ష రాజకీయాలలోకి రావు. 1955 జూలై లో మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి పుట్టింది. దాని బారసాల ఆగస్టు ఆరో తారీకున జరిగింది. అ రాత్రి అందరం “రోజులు మారాయి” సినిమాకు వెళ్లాం. ఆ రోజు రిక్షాలో మా నాన్న గారు, ఇంకెవరో సీటులో కూచుంటే, నేనూ, మా తమ్ముడూ ముందు కడ్డీ పట్టుకుని నిలబడి పెద్ద రాజకీయ నాయకులలాగా ఫీలయిపోయాం. ఒక నెల తరువాతే నేను ఇది వరలో ప్రస్తావించిన “అంజలీ దేవి” దర్శనం జరిగింది. అప్పుడు పొలం నుంచి వచ్చిన సవారీ బండిలో నేను, ఆంజీ, జయ వదిన & చెల్లెలు పద్మ, పెద్దన్నయ్య, రంగక్క, అక్క, నారాయణ తాతయ్య గారి కూతురు సత్యవతి అత్తయ్య, దొడ్డమ్మ అనే మా రెండో మేనత్త అందరం కిక్కిరిసి పోయి కూచున్నాం….అంతా అంజలీ దేవిని చూడడానికే!

ఏప్రిల్ 1957 లో మా రాత్తాతయ్య గారు హంసవరంలో పోయారు. ఆయన అసలు పేరు సర్వేశం గారు. మా తాత గారికి స్వయానా సవితి తమ్ముడు గారు. ఆయన భార్య కాంతం బామ్మ గారు లేనిదే మా ఇంట్లో కానీ, మా యావత్ బంధు వర్గం ఇళ్ళలో కానీ ఎటువంటి శుభకార్యమూ జరిగేవి కాదు. వాళ్ళ అల్లుడు మంగా బావ రైల్లో టికెట్ కలెక్టర్ గా పని చేసే వాడు. మహా సరదాగా పేకాట ఆడే వాడు. ఆ ఏడే అక్టోబర్ లో జరిగిన ఘోరం మా అమలాపురం బావ ఏకైక కుమారుడు పెద్ద బుజ్జి గాడు హఠాత్తుగా పోయాడు. వాడు సరిగ్గా నా వయసు వాడే..పన్నెండేళ్ళు. చాలా ఏళ్ల పాటు మేం ఎవరం ఇది తట్టుకోలేక పోయాం.

మే, 28, 1957 న క్రౌన్ టాకీస్ లో నన్నూ, మా తమ్ముడు ఆంజినీ మా పెద్దన్నయ్య “మాయా బజార్” సినిమాకి తీసుకెళ్ళాడు. ఆ సమ్మర్ లోనే కుళాయి చెరువు ఆవరణలో జరిగిన “4వ రాష్ట్ర ఫల, పుష్ప ప్రదర్శన” లో మా తణుకు తాత గారు తాళ్లూరి లక్ష్మీపతి రావు గారు మా అక్క చేత 28 రకాల ఆవకాయలు పెట్టించారు. అందుకు మా అక్కకి ఒక పెద్ద వెండి కప్పు ఆ నాటి వ్యవసాయ శాఖా మంత్రి తిమ్మా రెడ్డి గారు బహూకరించారు. అప్పటి దాకా ఏదో స్కూల్లో బాగా చదువుకుంటే పతకాలు, క్రికెట్ లో నెగ్గితే ట్రోఫీలు ఇస్తారు అని వినడమే కానీ ఆవకాయలు పెట్టి కూడా వెండి కప్పు, రోలింగ్ ట్రోఫీ లి గెల్చుకోవచ్చును అని తెలిసి మేము ఎగిరి గెంతులేస్తుంటే “వెధవల్లారా, చదువు మానేసి ఆవకాయలు, గోంగూరలు మొదలెట్టారంటే చంపేస్తాను” అని మా నాన్న గారు కోప్పడ్డారు.

ఆ రోజుల్లోనే భూ సంస్కరణలు, భూదానం, దున్నే వాడిదే భూమి, ఎవరికీ ఐదు ఎకరాలు దాటి పంట పొలాలు ఉండ కూడదు. ముఖ్యంగా లాండ్ సీలింగ్ ఏక్ట్ అనే అనేక రైతు అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు, ప్రభుత్వ చట్టాలు రావడమో, వచ్చే సూచనలు కనపడడమో ఉండి, అంత వరకూ మా తాత గారి స్వార్జితమైన మా 200 ఎకరాల పై చిలుకు శేరీ పొలానికి మా నాన్న గారు ఏకైక వారసుడే అయినా…ఎందుకైనా మంచిది అని ఆ భూమి అంతా ఆరు వాటాల క్రింద …అంటే మా అన్నదమ్ములం ఐదుగురికీ ఒక్కొక్క వాటా, మా నాన్న గారికి ఒక వాటా చొప్పున చూచాయగా విభజించి ఆ పంపకాల దస్తావేజులని డిశంబర్ 19, 1957 నాడు రిజిస్టర్ చేయించారు మా నాన్న గారు. అప్పటికింకా ఆడ పిల్లలకి కూడా స్థిరాస్థిలో సమాన వాటాలు ఉండాలనే ఆలోచనలు కానీ, చట్టాలు కానే లేవు. సంప్రదాయబద్ధంగా ఆడబడుచులకి కట్న కానుకలు, సారె, నగల రూపంలోనే ఆస్తిలో వాటా ఇచ్చే వారు.

అక్క రంగక్క జయ వదిన

అక్క రంగక్క జయ వదిన

1957 ఆఖరి నెలలలో జరిగిన ముఖమైన విషయం మా చిన్నన్నయ్య ప్రేమలో పడడం. ఆ రోజుల్లో ప్రభుత్వం తరఫున బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, అగ్రికల్చరల్ డిమానిస్త్రేటర్ ధవేజీ గారు, పశువుల డాక్టరు, మరికొందరూ దొంతమ్మూరు వచ్చి మా బావ మేడ లో దిగారు. మా పెద్దన్నయ్యకి, బావలతో సహా ఊళ్ళో ఉన్న యువ రైతులకి వ్యవసాయం ఎలా చెయ్యాలో శిక్షణ ఇచ్చారు. నేను చందమామలు చదువుకుంటూ ఈ తమాషా చూడడం కొంచెం గుర్తు. ఆ తరవాత ఆ ఊళ్ళో మహిళా సంఘానికి ప్రెసిడెంటు అయిన మా రంగక్కే వంద మందకి రైతులకి..అంటే పెద్ద, పెద్ద గుండిగెల కొద్దీ అన్నం, పులుసు, కూరలు, పచ్చళ్ళు వండిపెడుతున్నప్పుడు ఆ ఉళ్లోనే ఉన్న మరో కుంటముక్కుల నరసింహం …పెద్దబ్బాయి గారు అని పిలిచే వారు…ఆయన కూతుళ్ళు కనకం, రాజా లు చాలా సహాయం చేశారు. వారిది 500 ఎకరాలకు పైగా మాగాణీ ఉన్న పెద్ద కుటుంబం. పెద్దబ్బాయి & రామాయమ్మ గారి రెండో కొడుకు పేర్రాజు మా చిన్నయ్య సహాధ్యాయి. ఆయన కూతురు అరుణ, అల్లుడు కవి ప్రభాకర్ మా హ్యూస్టన్ లోనే ఉంటారు. నాకు ఎంతో ఆత్మీయులు.

ఇంతకీ 1957 లో ఆ మూడు రోజులూ మా చిన్నన్నయ్య, రాజా ఆ మీటింగులలో కలిసి తిరుగుతూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ రోజుల్లో దాన్నే ప్రేమించుకోవడం అంటారు. ఆ తరువాత ఎనిమిదేళ్ళకి వాళ్ళిద్దరికీ పెళ్లి అయింది. ఇంకా పెళ్లి కాని ఆ రోజుల్లో మధ్యలో మా అక్క, తన ఎడం పక్క రాజా వదిన, కుడి పక్కన కనకం వదిన ల ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అలాగే మధ్యలో మా మేనత్త రంగక్కకి ఉన్న ఒకటో, రెండో ఫోటోలలో మా అక్క, జయ వదినలతో ఉన్న ఫోటో కూడా ఇక్కడ జత పరుస్తున్నాను.

ఆ రోజుల్లోనే మా అక్కని మా హనుమంత రావు కి చేసుకుందామని మా రంగక్క అనుకున్నా మా అమ్మకి మేనరికాలు ఇష్టం లేక ఒప్పుకో లేదు. దాంతో మాకు దొంతమ్మూరు తో అనుబంధాలు తగ్గడం మొదలు పెట్టాయి. ఆ రోజుల్లో మా అక్కని చూసుకోడానికి లక్కరాజు సుబ్బా రావు గారి కొడుకు శరభయ్య రావడం నాకు తెలిసీ మా ఇంట్లో జరిగిన మొట్టమొదటి పెళ్లి చూపులు. అతను విమానం పైలట్. ఆ సంబంధం కుదర లేదు కానీ మా కుటుంబాల స్నేహం కొనసాగుతూనే ఉంది. ఆ రోజుల్లోనే మాబ్బులు బావకి 240 రూపాయలు పెట్టి మా నాన్న గారు హెర్క్యులెస్ సైకిల్ కొనిపెట్టారు…రోజూ గాంధీ నగరం లో మా ఇంటి నుంచి జగన్నాథ పురంలో పాలిటెక్నిక్ వెళ్ళడానికి.

మా హనుమంత రావు బావ పెళ్లి జగదీశ్వరి అక్కతో జూన్ 16, 1959 నాడు, మూడు రోజుల పెళ్లి దొంతమ్మూరు లో అయింది. మా పెద్దాపురం మామయ్య గారు, బాసు పిన్ని (మా ఆఖరి మేనత్త) స్నాతకం పీటల మీద కూచున్నారు. మా బంధువర్గం సుమారు వంద మందీ వచ్చారు.

ఆ తరువాత మా కుటుంబంలో మొదటి పెద్ద శుభాకార్యం……అంటే మా పెద్దన్నయ్య పెళ్లి , ఆ పెళ్లి చూపులు వివరాలు మరొక అధ్యాయం…..

– వంగూరి చిట్టెన్ రాజు

chitten raju

 

Download PDF

4 Comments

 • buchireddy gangula says:

  ప్రముక నవలా రచయిత — కాశిబట్ల వేణుగోపాల్ గారి ఇంటర్వ్యూ లో
  వారు అన్న మాట

  ***నేను ఆత్మకథా — రాసుకునేంత పెద్దవాన్ని కాదు *****
  —————————————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   నాది కూడా అదే అభిప్రాయం, అన్నా….నేను కేవలం నా గురించి మాత్రమే రాసుకుంటున్నాను అని ముందే రాశాను. నేను అతి సర్వ సాధారణమైన మామూలు మనిషిని. కానీ నా జీవితం గురించి రాసుకోవడం, దాన్ని ప్రచురించడం ఘోరమైన తప్పిదం కాదు. ఆ మాత్రం దానికి గొప్ప వాళ్ళే అవ్వక్కర లేదు. నా బోటి వాళ్ళు కూడా అర్హులే.

   .

 • Ramana Balantrapu says:

  శ్రీ బుచ్చిరెడ్డి గంగుల గారు ఏ ఉద్దేశ్యంతో అది కోట్ చేసారో తెలియదు గానీ, “వంగూరి జీవిత కాలం” లో చిట్టెన్ రాజు గారు వ్రాసే విధానం, శైలి, అప్పటి సామాజిక విశేషాలు, పరిస్థితులు, మనుష్యుల జీవన ధోరణీ ఆలోచనా సరళీ మొదలైన విషయాలు చదవటానికి అద్భుతంగా ఉంటున్నాయి. ఈ కాలంలో మనం ఏమి మిస్ అవుతున్నామో తెలియజేస్తోంది.
  పూర్తీ అయిన తరవాత ఇది గొప్ప ఆత్మకథల జాబితాల లోకి తప్పక చేరుతుందని నా నామ్మకం.
  ఇకపోతే – ఆ మాటకొస్తే ఏ గొప్ప వారి ఆత్మకథ అయినా అది ఎందుకు పతనయోగ్యం పఠనయోగ్యత సంతరించుకుంటుందీ అంటే పైకారణాలవల్లేకదా!

 • నారాయణ. says:

  చిట్టెన్ రాజు గారు, మీ చిన్ననాటి రోజులు అమృత గుళికల్లా ఉన్నాయి.

  ప్రేమలు, ఆప్యాయతలు గురించి చెప్పాలంటే ఆ మనుషుల గురించే చెప్పుకోవాలి.

  ఈ రోజుకీ కుడా నేను చెవొగ్గి ఇష్టంగా ఆశ్చర్యంగా వింటాను.

  మీరు చేస్తున్నన తెలుగు సాహిత్య మరియు భాషా సేవలు ఎంతో విలువైనవి.

  తప్పనిసరిగా మీరు ఆత్మకధ వ్రాయాలి. అందులో ఇలాంటి విషయాలు కూడా భాగమైతే మరింత బాగుంటుంది.

  ధన్యవాదాలతో,
  నారాయణ.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)