అప్పుడే వెళ్ళిపోవాలా శ్రీనివాస్?

_77686021_160577751

_77686021_160577751

విజయవాడలో కర్నాటక సంగీత కచేరీ అంటే గాంధీనగరం హనుమంతరాయ గ్రంధాలయంలో జరుగుతుండేవి సర్వ సాధారణంగా. ఆ నెల కచేరీ టిక్కెట్లు ఇవ్వడానికి వచ్చిన సభ గుమాస్తా చాలా గొప్పగా చెప్పాడు అమ్మతో, “ఈ సారి కచేరీ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో నండీ. ఫోగ్రాము మా గొప్పగా ఉంటది అన్నారు మా అయ్యగారు.” వరండాలో కూర్చుని ఏదో ఇంగ్లీషు డిటెక్టివు నవల చాలా శ్రద్ధగా చదువుకుంటున్న నా చెవిలో ఈ మాటలు పడి కొంత కుతూహలం కలిగించాయన్నది నిజం. కళాక్షేత్రంలో కచేరీ అంటే మాటలు కాదు. అప్పటికి నాకు తెలిసి అలాంటి కచేరీ జరిగింది సుబ్బలక్ష్మి వచ్చి పాడినప్పుడూ, మళ్ళీ బాలమురళీకి విజయవాడ పౌరసన్మానం జరిగినప్పుడూనూ.

కచేరిలో చెవుల తుప్పొదిలిపోయింది. అసలు అంతకు మునుపు ఎప్పుడూ విని ఎరుగని ధ్వని. విచిత్రంగా ఉన్నది. అటుపైన, ఆ రాగాలాపనల నొక్కులేవిటి, ఆ స్వరప్రస్తారాల మెరుపులేమిటి .. ఇంతా చేసి అంత పెద్ద స్టేజీ మీద ఒక నలుసంత పిల్లగాడు. అటూ ఇటూ పక్క వాద్య విద్వాంసులు సూర్య చంద్రుల్లాగా ఉన్నా ఆకాశంలో కదలని స్థానం నాదేసుమా అని ధీమాగా మెరుస్తున్న ధృవ నక్షత్రం లాగా ఆ చిన్న పిల్లాడు, చేతిలో .. ఒక ఆటవస్తువు లాంటి వాయిద్యం .. దాని పేరు మేండొలిన్-ట! కేవలం కొత్త వాయిద్యం కొత్త రకం నాదం అన్న వైవిధ్యం ఒక్కటే కాదు .. ఆ విద్వత్తు, విద్వత్తుని వెలువరించిన తీరు .. విభ్రాంతి కలిగించాయి అనడం అతిశయోక్తి కాదు. అసలే ఆ రోజుల్లో నాకు ఎవరూ ఒక పట్టాన నచ్చే వాళ్ళు కాదు. కానీ కరిగి ముద్దైపోయాను.

కచేరీ పూర్తయ్యాక, చివరి బస్సు పట్టుకోవాలి అని ఎప్పుడూ ఆరాట పడే అమ్మ, ఆ మాటే ఎత్తకుండా స్టేజివేపుకి దారి తీసి, ఆ పిల్లాడి బుగ్గలు పుణికి పర్సులోంచి ఓ పది రూపాయల కాయితం ఆ అబ్బాయి చేతిలో పెట్టి వచ్చింది. ఎవరో శ్రీనివాసుట .. తెలుగు పిల్లాడేట .. మహా ఐతే పన్నెండేళ్ళుంటాయేమో .. అబ్బ, నిజంగా ఆ మేండలిన్‌తో బిల్లంగోడు ఆడుకున్నట్టు ఆడుకున్నాడు.

1424416_737306813028416_4252700639450257697_n

మరోసారి శ్రీనివాస్ విజయవాడలో కచేరి చెయ్యడానికి వచ్చే సరికి మా అమ్మ బుగ్గలు పుణికే స్థాయి దాటి పోయి చాలా ఎత్తుకి ఎదిగి పోయాడు. చూస్తుండగానే సంగీతం షాపుల్లో కొల్లలుగా కేసెట్లు .. ఎక్కడెక్కడివో రాగాలు .. ఏవేవో పోకడలు .. అడిబుడి రాగాలలో పెద్ద పెద్ద రాగం-తానం పల్లవులు. బాగా తెలిసిన నను పాలింప, నగుమోములకి సరికొత్త రంగులద్దకాలు. ఆ ఉప్పెనలో చెన్నై మునిగిపోయింది. ఒక చెన్నై ఏవిటి, ప్రపంచం మొత్తంలో కర్నాటక సంగీతం వినే వారెవరూ ఆ మంత్రజాలంతో ముగ్ధులు కాకుండా ఉండలేదు.

ఫోటో: ఆర్వీవీ కృష్ణారావు గారి సౌజన్యంతో

ఫోటో: ఆర్వీవీ కృష్ణారావు గారి సౌజన్యంతో

నేను అమెరికా వచ్చాక కూడా ఐదారు సార్లు నేరు కచేరీలు విన్నా. ఇన్ని కర్నాటక కచేరీలలోనూ ఒక పరమాద్భుతమైన అనుభవం డెట్రాయిట్ సింఫొనీ హాలులో జాన్ మెక్లాలిన్ శక్తి బేండుతో కలిసి శ్రీనివాసుని వినడం. నయాగరా జలపాతంలో పడితే అది మహా అయితే ఓ మూణ్ణిమిషాల అనుభవం కావచ్చు. సుమారు గంతన్నరసేపు నయాగరా కింద నిలబడితే ఎలా ఉంటుందో .. ఎదురు పడినా ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఒక మందహాసం. వేదిక మీదినించి మాట్లాడినా . మంద్రస్థాయిలో మృదువుగా, పాటని ఎనౌన్స్ చేసేంత వరకే. ఎప్పుడూ ఏ కాంట్రవర్సీలలోకీ పోలేదు. ఒక సారి అతని అమెరికా టూరుగురించి ఏదో అసంతృప్తి చెందిన కొందరు పెద్ద తలకాయలు కొంత అలజడి సృష్టించినా ఇతను సంయమనం కోల్పోలేదు.

తనివి తీరలేదే .. మా మనసు నిండలేదే .. ఎన్ని రికార్డింగులున్నా .. నేరుగా నీ చిరునవ్వుని చూసిన అనుభవం రాదుగా! అప్పుడే వెళ్ళిపోవాలా శ్రీనివాస్?

-నారాయణ స్వామి

10322847_10202715932672029_5083099762996079386_n

Download PDF

15 Comments

 • Sowmya says:

  :( very sad to know!

 • Madhu Chittarvu says:

  Ownu inka thanivi theeraledu.There is still half an ocean of music to create and listen.It is not fair for God to snatch him away from us.Cruel and depressing.Music is eternal.He should have been eternal..

 • మైథిలి అబ్బరాజు says:

  శాశ్వతం గా ఉండకపోయినా పూర్ణాయుర్దాయమైనా ఉండాలి కదా , ఇది న్యాయమా ???

 • భలే ఫొటో సంపాయించారండీ. బహుశా ఇది నే విన్న ఆ మొదటి కచేరినే అయుండొచ్చు. వయొలిన్ మీద అంపోలు మురళీకృశ్ణగారు, ఘటం నేమాని సోమయాజులు గారు. మృదంగం ఎవరో ముఖం కనబడ్డం లేదు. శ్రీనివాసుకి వెనకాల వాళ్ళ నాన్నగారు.

  • Bhujangarao Ayyagari says:

   శ్రీనివాసుకు మృదంగం పై సహకరిస్తున్నది “ముళ్ళపూడి శ్రీరామమూర్తి” అనుకుంటా!

   మా విశాఖలో తన పదకొండవ ఏట చేసిన కచేరి నుంచి 2010లో చేసిన కచేరి వరకు అన్ని ఒకేసారి తలంపు కు వచ్చి ఆ సునాదభరితమైన మాండొలిన్ వాద్య మధురిమ మరి మనకు లేదనే చేదు నిజం వేదనను మరింత పెంచుతోంది.

   మరల అటువంటి కళాకారుడు జన్మించడం ఎపుడు చూస్తామో!

 • మణి వడ్లమాని says:

  చిన్నపిల్లవాడు,చాల భాద వచ్చేసింది ఫస్ట్ చూసిన నాకు నోట మాట రాలేదు. అయ్యో అయ్యో అని ఎన్నిసార్లు అనుకున్నానో.ఎందుకంటె మా కజిన్ లాస్ట్ మే లో సే ఇతని వయసే ఇలాగె .అందుకే ఇంకా ఎక్కువ దుఃఖం వచ్చింది.

 • నారాయణస్వామి says:

  యేమిటీ మాండలిన్ శ్రీనివాస్ వెళ్ళిపోయారా? నమ్మ శక్యంగా లేదు! ఇది అన్యాయమూ – తీరని విషాదమూ!

 • నాకు బాగా గుర్తు..బాగా చిన్నప్పుడు .. (నేను 1969 నవంబర్ లో పుట్టాను ) మేము పాలకొల్లు కాలేజీ రోడ్ లో వుండేవాళ్ళం. అప్పట్లో(1976..ప్రాంతాల్లో ..) పాలకొల్లు బ్యాండ్ మేళం కి బాగా పేరు . బ్యాండ్ మేళం కి ముందు మాండలిన్ వాయిస్తూ శ్రీనివాస్ ప్రత్యేక ఆకర్షణగా ఉండేవాడు . మా అంత చిన్నపిల్లవాడు వింత వాయిద్యాన్ని అలా వాయిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ..అధ్బుతంగా అనిపించేది .అందరికీ కనపడటం కోసం ఒక్కొక్క సారి రిక్షా లో గాని ,ఏదైనా మోటారు వాహనం మీద కాని కూర్చోపెట్టేవారు శ్రీనివాస్ ని .అలా వరుసగా రెండు -మూడు సంవత్సరాలు చూసాము . అప్పుడే వినడం మాండలిన్ పేరు. అతరువాత అదే ఇంటిపేరుగా మాండొలిన్ శ్రీనివాస్ ప్రపంచ ప్రఖ్యాతి పొందడం మాకు చాలా ఆనందంకలిగించింది ..మేము చూసిన శ్రీనివాస్ అవడం వలన . ఇప్పుడు చాలా బాధగా వుంది ..మా చిన్న శ్రీనివాసే కళ్ళముందు కదులుతున్నాడు .

 • మహానుభావులు….. బాధేస్తుంది ….

 • కర్నాటక సంగీతంలో శ్రీనివాస్ సాధించిన ఒక అద్భుతం చిన్ని చిన్ని రాగాలను పెద్ద ఎత్తుకి ఎత్తడం. ఈ మాటని పైన వ్యాసంలో కూడ ప్రస్తావించాను. ఇవ్వాళ్ళ యధాలాపంగా నా దగ్గరున్న ఒక లైవ్ కచేరీ రికార్డింగు తీసి వినడం మొదలు పెడితే, అందులోనే ఈ అద్భుతానికి చక్కని ఉదాహరణ ఎదురైంది. నాదలోలుడై అనే త్యాగరాజస్వామి కృతి. కళ్యాణ వసంతం రాగం. ఎవరు పాడినా సాధారణంగా ఐదు-పది నిమిషాలకి పాడతారు. ఈ కచేరీలో శ్రీనివాసు ఇరవయ్యొక్క నిమిషాల రాగాలాపన, పదహారు నిమిషాల పాటగా ముప్ఫయ్యేడు నిమిషాల విస్తారంలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇరుకైన రాగాలను విస్తరించ బూనడం అంత సులువైన పని కాదు. సరిగ్గా చెయ్యకపోతే శ్రోతలకి చర్వితచర్వణంగా ఉండి బోరు కొడుతుంది. అలా విస్తరించాలంటే ఆ రాగ స్వరూపంలో లోతులు, సులభంగా కనబడని కోణాలు తెలిసి ఉండాలి. అది సాధన ద్వారానో, ప్రేరణ ద్వారానో మాత్రమే సాధ్యం.

 • Thirupalu says:

  అవును మరి అప్పుడే వెల్లి పోవాలా?
  ఎప్పటికైనా వెల్లేదైనా నిర్వహించాల్సిన పాత్రను మధ్యలో వదిలేసి, పాడాల్సిన రాగం పూర్తిగా పాడకుండా, అకష్మాత్తు గా వెల్లిపోవడం అంటే అందర్ని అదో లోకానికి తోసినట్టు కాదా? శ్రీనివాస్‌!

 • sujala says:

  చాల చక్కగా ఉ౦ది. సరస్వతి తనలోని స౦గీతాన్ని ని౦పి మనల్ని విని తరి౦చమని చెప్పి, మనసు, కడుపు ని౦డకు౦డానే చాలు మీరు విన్నది అ బుజ్జి కన్న నా సృష్టి నేను విన్నాలని తీసుకుపోయి౦దేమో. ఎన్నిసార్లు విన్నానో. ఢిల్లీలో ఏ.పి.భవన్ లో వాయి౦చినప్పుడు అప్పుడు ఇ౦కా పదిహెనేళ్ళేమో. అతని స౦గీత౦ లో నన్ను నేను మరచిన వేళ స్టేజ్ మీద కలిసి మాట్లాడాక నీకు పాదాభివ౦దన౦ అ౦టే అమ్మా మీరు పెద్దవారు అలా అ౦టున్నారేమిటి? అన్నాడు. నీకు కాదు నీలోని సరస్వతికి అన్నాను. చివరిసారి ఢిల్లీ అశొకా హోటల్ లో విన్నాను. వీడని ఆ చిన్నారి జ్ఞాపకాలతోనే జీవి౦చాలి. మీ వ్యాస౦ ఎన్నో పాత జ్ఞాపకాలను వెలికి తీసి౦ది

 • padmaja says:

  దేవుడికి అంత తొందరెందుకో!………..శ్రీనివాస్ కచేరినే వినాలని …?(rest in piece )

 • సత్యవతి says:

  “కచేరీ పూర్తయ్యాక, చివరి బస్సు పట్టుకోవాలి అని ఎప్పుడూ ఆరాట పడే అమ్మ, ఆ మాటే ఎత్తకుండా స్టేజివేపుకి దారి తీసి, ఆ పిల్లాడి బుగ్గలు పుణికి పర్సులోంచి ఓ పది రూపాయల కాయితం ఆ అబ్బాయి చేతిలో పెట్టి వచ్చింది. ఎవరో శ్రీనివాసుట .. తెలుగు పిల్లాడేట .. మహా ఐతే పన్నెండేళ్ళుంటాయేమో .. అబ్బ, నిజంగా ఆ మేండలిన్‌తో బిల్లంగోడు ఆడుకున్నట్టు ఆడుకున్నాడు.’
  ఈ కచేరీకి నేనూ వచ్చాను. ఆవిడ డబ్బివ్వడం కూడా చూశాను, ఈ సంగతి చాలామందికి చెప్పాను ఒకావిడ అట్లా చేశిందనీ.ఆవిడ మీ అమ్మగారని తెలీదు .నాశీ కూడా తెలీదనుకో అప్పుడు, నాకయితే అప్పటి ఆ కచేరీ ఇంకా గుర్తే. చాలా తొందర పడి పోయాడు శ్రీనివాస్

 • Rajesh Yalla says:

  చాలా విచారకరమైన వార్త. శ్రీనివాస్ గారి గురించిన మీ వాక్యాలు చదువుతుంటే మనసు ఆర్ద్రమైంది నారాయణ స్వామి గారూ!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)