వాక్యం ఆగిపోయిన చోట…

1

ఏడుపు కూడా అంత తేలిగ్గా యేమీ రాదు కొన్నిసార్లు!

వొక్కసారి పగలబడి ఏడ్చేస్తే లోపల వున్న దుఃఖమంతా అలల్ని యీడ్చి వొడ్డుకి కొట్టినట్టు వుండేదేమో! ఇవాళ్టికి దగ్గిర దగ్గిర రెండు నెలలు అవుతున్నాయా చే.రా. మాస్టారు వెళ్ళిపోయి!

అప్పట్నించీ లోపలి సజీవమైన అవయవమేదో వున్నట్టుండి నిర్జీవమైపోయినట్టు- లేదూ- వొక వెలితి యింక దేన్తోనూ నింపడానికి వొప్పుకోనట్టు – లేదూ- ఆ మరణపు వొక్క క్షణం అబద్ధమే అని యింకా అనుకుంటూ వున్నట్టుగా వుంది.

మరణాలు కొత్త కాదు. కానీ, ప్రతి మరణమూ కొత్తగా ఏడ్పిస్తుంది. అంతకు ముందు వెళ్ళిపోయిన మనుషులూ తక్కువ కాదు, కాని ఈ క్షణం వెళ్ళిపోయిన ఈ మనిషి యిలా వెళ్లి వుండకూడదనీ, మృత్యువు మరీ ఎక్కువ తొందరపెట్టి లాక్కు వెళ్ళిందనీ అనిపిస్తుంది.

నాన్నగారు పోయినప్పుడు- మట్టి కింద ఆయన్ని నేనే రెండు చేతులా  కప్పెట్టి వచ్చిన తరవాత చాలా రోజులు ఆయన మరణం అంతా అబద్దమనీ, ఆ మట్టి కింద నించి ఆయన వచ్చేస్తారనీ నమ్మేవాడిని. గాఢ నిద్రలో వున్న నిక్షేపంలాంటి మనిషిని తటాలున తీసుకువెళ్ళి మట్టిలో కలిపి వచ్చామనీ అనుకునేవాణ్ణి. అది అబద్దమని తెలిసినా సరే, అలాంటి వొక అబద్దంలో బతికాను కొన్నాళ్ళు. జీవితం ఆయన్ని మళ్ళీ వెనక్కి పిలుస్తుందనీ, “నీ విషయంలో మృత్యువు పొరపాటు చేసింది కౌముదీ!” అని సంజాయిషీ ఇచ్చుకొని, సెకండ్ చాన్స్ ఇస్తుందని కూడా పిచ్చిగా అనుకునేవాణ్ణి.

నాన్నగారు పోయాక చాలా మంది వెళ్ళిపోయారు. కాని, అలా జీవితం వెనక్కి పిలిచి రెండో వంతు ఇస్తుందని ఆశ పడింది వొక్క చే.రా. గారి విషయంలోనే!
అందుకే, యిప్పటికీ ఆయన మరణం నా మనసుకీ నా శరీరానికీ అలవాటు పడని చేదునిజం.

నాన్నగారు పోయినప్పుడు చాలా పత్రికలూ, మీడియా వాళ్ళు ఏమన్నా రాయండీ, చెప్పండీ అని అడిగీ అడిగీ అలసిపోయారు. కాని, ఏమీ రాయలేకపోయాను ఏడాది దాకా!

ఇప్పుడు చేరా విషయంలోనూ అంతే! కూర్చునే కుదురు లేదనీ కాదు, రాయాల్సినవి లేవనీ కాదు. తెలియని మౌనం వొకటి మనసులో కొంత భాగాన్ని తలుపు మూసి వుంచేసింది.

యిప్పటికీ ఈ రాసే నాలుగు వాక్యాల్లో నిగ్రహం వుంటుందని నేను అనుకోవడం లేదు. రాయాలని అనుకున్నది రాయకుండానే మనసూ, కాగితం రెండూ మడత పెట్టుకొని వెళ్ళిపోతానేమో కూడా తెలియదు.

2

టీనేజికీ, సైగల్ పాటలకీ జత కలవదు కానీ, ఎందుకో సైగల్ అలా వచ్చేశాడు అతని మంద్రస్వరంతో నా యవ్వనంలోకి! ఆ “సైగల్ పాట” అనే కవిత రాసి వుండకపోతే, చేరా కూడా నా జీవితంలోకి మరీ అంత నవయవ్వన కాలంలో వచ్చేవారు కాదు. మా యిద్దరి బంధంలో సైగల్ వొక live wire.

నిజానికి అంతకు ముందు నించీ చేరా గురించి folklore కొంత వుండింది మా వూళ్ళో! డబ్బు లేక ఆయన అమెరికాలో వొక ఫ్రెండ్ కి వంట చేసిపెడుతూ కష్టపడి చదువుకున్నారని, ఇక్కడి నించి అంత దూరం ఆయన అమెరికా వెళ్లి తెలుగు వాక్యం మీద రిసెర్చ్ చేసారనీ…ఇలా! నేను డిగ్రీలోకి వచ్చే సరికి ఈ folklore కి ఇంకా కొన్ని juicy details వచ్చి చేరాయి- చేరాగారూ ఆయన ప్రొఫెసరూ కలిసి మందు కొట్టేవారని! ఈ కథ ఎందుకో నాకు అప్పట్లో అంతగా నచ్చలేదు, నాలోపల puritan ఎవడో పీఠం వేసుకొని వుండడం వల్ల! అసలు అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ వొకటి వుందని కూడా ఆ తొలినాటి folklore వల్లనే తెలిసింది. చివరికి నేనూ అక్కడికే చేరుకుంటానని అప్పటికి నా వూహలో కూడా లేదు. సరే, ఈ పుక్కిటి పురాణాల సంగతి పక్కన పెడితే –

58

చిర్నవ్వే చేరా చిరునామా!

సైగల్ పాట కవిత అప్పట్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయింది. బహుశా, అచ్చయిన నా తొలి కవితల్లో అదీ వొకటి. నేను రాసేది కవిత్వమనే నమ్మకం ఆ రోజుల్లో నాకు ఏ కోశానా లేదు. ఈ కవిత అచ్చయిన వారం రోజులకి నాకు చేరా గారి వుత్తరం వచ్చింది.  ఆ ఉత్తరం వచ్చిన వారం రోజులకి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఆయన కాలమ్ “చేరాత”ల్లో దాదాపు సగం పేజీ కేవలం ఆ సైగల్ పాట కవిత మీదే రాసేసరికి ఉత్సాహం కాస్త ఉరకలేసింది.  నా గురించి రాసినందుకు కాదు- పదిహేను లైన్లు కూడా లేని చిన్న కవిత మీద దినపత్రికలో సగం పేజీ రాయడం అంటే మాటలు కాదు. అంటే, వొక చిన్న కవిత వెనక ఇన్ని పెద్ద ఆలోచనలు సాధ్యమా అన్న ఉత్సాహం!

కవిత్వం పట్ల విపరీతమైన మోహం తప్ప కవిత్వ విమర్శ మీద పెద్దగా ఆసక్తి లేని నాకు ఆ వ్యాసం విశాలమైన కనువిప్పు. కవిత్వాన్ని గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ కవిత్వ వాక్యాలనే ఆశ్రయించే వాణ్ని ఆ రోజుల్లో! కవిత్వాన్ని కవిత్వ భాషలో మాత్రమే వ్యాఖ్యానించడం వీలవుతుందని వొక థియరీ కూడా చేసిన వాణ్ని. నా థియరీని రకరకాల పద్ధతుల్లో de-construct చేసి, “లేదు, కవిత్వాన్ని గురించి మనం నిరాడంబర/ నిరలంకార వచనంలో విమర్శ రాయాల్సిందే” అని నన్ను విమర్శ వైపు నెట్టిన నా తొలి ఉపాధ్యాయుడు చేరా.

ఆ రోజుల్లో చేత్తో వుత్తరాలు రాసే అలవాటు ఎక్కువగా వుండడం వల్ల ఎప్పటికప్పుడు తోచినప్పుడల్లా ఆయనకి రాసే వాణ్ని. ఆయన కూడా వెంటనే సమాధానం రాసే వారు. ఈ వుత్తరాలు రాసే అలవాటు నాకు ఎంత లాభించిందో చెప్పలేను. ఇస్మాయిల్ గారి ఉత్తరం ఎప్పుడూ కార్డుముక్క దాటి వెళ్ళేది కాదు. కాని, చేరా గారి వుత్తరం కనీసం మూడు అర ఠావు కాయితాలు వుండేది. చాల వోపిక ఆయనకి ఆ విషయంలో! విషయం డొంక తిరుగుడుగా వుంటేనో, కవితాత్మకంగా వుంటేనో వెంటనే ఆయన్నించి అక్షరాలా మొట్టికాయలు పడేవి. చేరాతో వుత్తరాల వల్ల నా వచనంలో అందమైన కవిత్వం లేకుండా పోతోందని చాలా మంది మిత్రులు ఆ రోజుల్లో బాధపడే వాళ్ళు కూడా! కాని, వచనం అనేది వొక thought process అనీ, rationalization అనీ నేనూ క్రమంగా నమ్మడం మొదలెట్టాక వాళ్ళ బాధ కొంత తగ్గింది. వొక రకంగా చేరాతో సాగిన ఆ వుత్తరాయణం అంతా నాకు వచనరచనలో శిక్షణ అన్నమాట.

సైగల్ పాటతో వొక ఉద్వేగభరితమైన సన్నివేశంతో మొదలైన మా స్నేహం చివరికి అలా ఆలోచనాత్మక దశకి మళ్ళిందన్న మాట.

ఈ స్నేహం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మేం కలిసి సాహిత్య సభలకు ప్రయాణాలు చేయడం మొదలయింది. ఈ ప్రయాణాలు నా సాహిత్య యూనివర్సిటీలు! గంటల తరబడి ప్రయాణాల్లో నిద్ర కూడా పోకుండా రెండు మూడు ఇంగ్లీషు సాహిత్య విమర్శ పుస్తకాలు దగ్గిర పెట్టుకొని, అవి చదువుతూ, నా చేత వాటిని చదివిస్తూ, వాటి సారాంశం వివరిస్తూ, ప్రశ్నలు వేస్తూ, “ఎంతయినా నువ్వు కవివే! అంతే!” అంటూ మధ్యలో నా మందబుద్ధి మీద జోకులు రువ్వుతూ ఆ ప్రతి ప్రయాణం నేను ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం.

అప్పుడే కవిత్వ నిర్మాణ వ్యూహాల మీద ఆయన కొత్తగా మాట్లాడుతున్న కాలం అది. అందులో భాగంగా ఆయన విపరీతంగా చదివే వారు. విదేశాలలో అప్పుడే వెలువడిన కొత్త కవిత్వ విమర్శ పుస్తకం ఏదీ ఆయన చూపు నించి తప్పించుకునేది కాదు. చదివిన వెంటనే దాన్ని గురించి మాట్లాడకపోతే ఆయనకి ఇబ్బందిగా వుండేది. అలాంటి చాలా సందర్భాల్లో నేను ఎలాగోలా దొరికే వాణ్ని – వుత్తరంలోనో, ఫోన్లోనో, సాహిత్య సభల్లోనో, లేదంటే ఆయన ఇంట్లోనో, కొన్ని సార్లు తను ఎంతో బిజీగా వుండే ఆఫీసులో కూడా ఆ పని అంతా పక్కన పడేసి మాట్లాడుతూనో!

గత నలభయ్యేళ్ళలో కవిత్వాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడారు చేరా. సంపత్కుమారతో మొదలయిన వచన పద్య లక్షణ చర్చ నించి ‘చేరాతల’ కాలమ్ దాకా బహుశా ఆధునిక వచన కవిత్వం గురించి అంత విస్తారంగా చర్చించిన మరో విమర్శకుడు మనకు లేరనే అనుకుంటాను. అవన్నీ వొక ఎత్తు, 1985 తరవాత కేవలం కవిత్వ నిర్మాణ వ్యూహాల మీద ఆయన మాట్లాడిన విషయాలన్నీ ఇంకో ఎత్తు. (ఈ కవిత్వ వ్యూహాల గురించి ఆయన కల్పన కవిత్వ సంపుటి “నేను కనిపించే పదం”లో కూడా ప్రస్తావించారు.)

ఆధునిక భాషా వేత్తలు ఇప్పుడు కేవలం భాషకి మాత్రమే పరిమితమై మాట్లాడడం లేదు. భాష చుట్టూరా వుండే ఇతర సామాజిక మానసిక సాంస్కృతిక అంశాలను కూడా కలుపుకొని మాట్లాడుతున్నారు. వొకవిధంగా భాష అనేది సాంస్కృతిక అంశంగా (cultural pattern) గా మారింది. కవిత్వంలో వాడే భాష, వాక్య నిర్మాణాలూ, idiom, కవి తనకంటూ నిర్మించుకునే individual grammar, కవిత్వ వాక్యాల మధ్య వదిలేసే ఖాళీ జాగాలూ ఇవన్నీ ఇప్పుడు కవిత్వ రసనకి అవసరమవుతున్నాయి. అంటే, para-linguistic features కవిత్వ భాషలో భాగమవుతున్నాయి. 1985 తరవాత వొక భాషావేత్తగా చేరా మాస్టారు కవిత్వ విమర్శలో సాగిస్తూ వచ్చిన interventions ని స్థిమితంగా ఆలోచిస్తే, ఆయన్ని గురించి విమర్శపరంగా మనం చేసే ఆలోచనలు అర్థవంతంగా వుంటాయి. ఈ కోణం నించి చేరా అన్వేషణ ముత్యాల సరాల ఛందస్సు మీద చర్చతో మొదలయిందని నేను అనుకుంటున్నా.

1990 లో బెంగళూరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో చేరాతో ఎన్. గోపి, శిఖామణి, కొండేపూడి నిర్మల, నాయని కృష్ణ కుమారి, అఫ్సర్, యాకుబ్.

1990 లో బెంగళూరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో చేరాతో ఎన్. గోపి, శిఖామణి, కొండేపూడి నిర్మల, నాయని కృష్ణ కుమారి, అఫ్సర్, యాకుబ్. (ఫోటో సౌజన్యం: చేకూరి సంధ్య)

నా మటుకు నాకు 1990 లో బెంగుళూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు వ్యక్తిగతంగా మంచి అనుభవం. ఆ మహాసభల వేదిక మీద కవిత్వం చదవమని నాకు ఆహ్వానం రావడం పెద్ద ఆశ్చర్యమైతే, ఆ సభల కోసం హైదరాబాద్ నించి బెంగుళూర్ కి చేరా గారితో రైలు ప్రయాణం, ఆ వూళ్ళో నాలుగైదు రోజులు ఆయనతో కలిసి వుండడం ఇంకా అద్భుతమైన అనుభవం. నాకు తెలిసిన వాళ్ళలో నాయని కృష్ణకుమారి, ఎన్. గోపి గార్లు, శిఖామణి, కొండేపూడి నిర్మల, యాకూబ్ కూడా ఈ సభలకు వచ్చారు.

ఆ ప్రయాణంలోనే చేరాగారు ముత్యాల సరాలు ఛందస్సు మీద మాకు సుదీర్ఘ క్లాస్ తీసుకున్నారు. ముత్యాలసరాలతో గురజాడ గాని, శ్రీశ్రీ గాని ఎందుకు అంత ప్రేమలో పడ్డారో అప్పుడే నాకు గట్టిగా అర్థమైంది. అయితే, అది గురజాడ, శ్రీశ్రీ కంటే ఎక్కువ ఇప్పుడు చేరా విమర్శ గురించి చెప్పే సాధనం.

అప్పటివరకూ వున్న భాషనీ, దాని నిర్మాణాల్ని పడగొట్టి, కొత్త idiom ని కట్టుకుంటూ రావడంతో కొత్త కవిత్వం వస్తుంది. పునాదిలో కొంత పాత వున్నప్పటికీ కొత్త వాక్యం కొత్త గూడులా కట్టుకోకపోతే కవికి చిరునామా మిగలదు. ఆ చిరునామా కోసం వెతుకులాట కేవలం అనుభూతికో, కవిత్వ ఉద్వేగానికో సంబంధించిన విషయం కాదు. అంతకంటే ఎక్కువగా అది భాషకి సంబంధించిన ఉద్వేగం. మొన్నటి గురజాడ గాని, నిన్నటి శ్రీశ్రీ గాని, ఇవాళ్టి కొత్త కవి గాని ఆ పని వున్నపళాన చేయలేరు. వాళ్ళు పాతవాటిలో కొన్నిటికి కొత్త స్ఫురణ యిస్తారు, కొత్తవాటిని బలంగా చెప్పడానికి వీలుగా.

బెంగళూర్ లోనే నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారితో...

బెంగళూర్ లోనే నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారితో…

ఇలాంటి కృషిలో కవికీ, కవిత్వ విమర్శకుడికీ పెద్ద తేడా ఏమీ వుండదు. చేరా తను కొత్తగా చెప్పబోయే వచన కవిత్వ నిర్మాణ వ్యూహాలకు కావలసిన పరిభాష, తాత్విక పునాది ఏర్పర్చుకోడానికే ముత్యాలసరాల దాకా వెళ్ళారని నాకు అర్థమైంది. ముత్యాలసరాల్లో వ్యక్తీకరణకి సంబంధించి వొక linguistic/metrical ease వుంటుంది. అది షేక్స్పియర్ sonnet నించి తీసుకున్న ease లాంటిది. చేరా గారు కూడా కొత్త కవులు భాషలో తీసుకువస్తున్న ఈ linguistic/metrical ease ని చెప్పడానికే ముత్యాల సరాల దాకా వెళ్ళారు. ఇవాల్టి కవి వాడుతున్న భాష వెనక నిర్మితమవుతున్న/ లేదా వినిర్మితమవుతున్న కొత్త వ్యాకరణం అర్థం కావాలంటే ఆ ఇద్దరు మహాకవులూ ముత్యాలసరాలని ఎట్లా చాకిరీ చేయించారో తెలియాలి. ఈ విషయం కొంత నేను ఇదివరకే అచ్చయిన వ్యాస సంపుటి “ఆధునికత- అత్యాధునికత” (1992) లో చర్చించాను కనుక వాటి వివరణలోకి ఇప్పుడు వెళ్ళడం లేదు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం ద్వారా నేనేం సాధించానో నాకు గుర్తు లేదు కాని, ఆ నాలుగు రోజుల పాటు చేరాతో కలిసి వేసిన అడుగులూ, తాగిన కాఫీలూ, భోజన సమయాలూ సాయంత్రపు నడకలూ అటు ఇటు ప్రయాణాల్లో ఆయన విమర్శ హృదయానికీ, ఆయనలోని నిరాడంబర తాత్వికుడికీ దగ్గిరయ్యాను కదా అనిపించింది.

4

అలా దగ్గిరయ్యాక-

2000 లో మాడిసన్ నించి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం ఆహ్వానం వచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా అని విపరీతమైన డైలమాలో వున్నప్పుడు గంటల తరబడి చేరాతో చర్చలు. ఉద్యోగ రీత్యా నేను మంచి స్థితిలో వున్నప్పుడు, యింకా ముందుకు వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నప్పుడు మాడిసన్ వెళ్లి సాధించేదేమిటి అన్నది నా ప్రశ్న. ఇప్పుడు వెళ్ళకపోతే తరవాత repent అవుతావని ఆయన సూటిగానే చెప్పేశారు. చేరాకి మాడిసన్ అన్నా, విస్కాన్సిన్ యూనివర్సిటీ అన్నా ప్రత్యేకమైన ప్రేమ అని నాకు తెలుసు. 2007 లో కూడా నేను వొక గ్రాంట్ మీద ఇండియాలో వుండడమూ, అదే సమయంలో ఇండియా యూనివర్సిటీలలో వొకటి రెండు ఆఫర్లతో వూగిసలాడుతున్నప్పుడు కూడా ఇప్పటికి ఈ వుద్యోగాలు మంచి ఆకర్షణే కాని తరవాత నెమ్మదిగా అసంతృప్తి మొదలవుతుంది అని నీళ్ళు నమలకుండా నన్ను మళ్ళీ అమెరికా వేపు దాదాపూ నెట్టేశారు ఆయన.

మరీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే, హైదరాబాద్ లో వుండగా నేను మానసికంగా ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో వున్నప్పుడు ఆ రెండు రకాలుగా కూడా వొక ఆత్మీయ స్నేహితుడిగానే ఆయన నన్ను ఆదుకున్నారు. ముందూ వెనకా ఏమీ ఆలోచించకుండా నా కోసం పరుగుపరుగున వచ్చారు. సాధారణంగా తెలుగు సాహిత్యలోకంలో ఇలాంటి ఆత్మీయతలు అరుదు.

వొక అక్షర స్నేహం కొన్ని సంవత్సరాల తరబడి కొనసాగినప్పుడు అందులో వ్యక్తిగతం, సాహిత్య గతం అని విభజన రేఖలు సాధ్యపడవు. స్నేహం ఎన్నాల్టిది అన్న ప్రశ్న కూడా వుండదు. కాని, ఏ ఇద్దరు వ్యక్తుల జీవితంలో అయినా ముప్ఫయ్యేళ్ళు అన్నది చాలా దీర్ఘ కాలమే! ముప్ఫయ్యేళ్ళలో ఎన్ని సంభాషణలూ, ఎన్ని కలయికలూ, ఎన్ని ప్రయాణాలూ! వాటన్నిటిని చెప్పుకుంటే పోతే సగం జీవిత చరిత్ర గడిచిపోతుంది.

5

 

2014: హైదరాబాద్ లో కడసారి వీడ్కోలు: అఫ్సర్, గద్దర్, వరవరరావు, సంధ్య, చలసాని ప్రసాద్, చేకూరి శ్రీనివాసరావు.

హైదరాబాద్ లో కడసారి వీడ్కోలు: అఫ్సర్, గద్దర్, వరవరరావు, సంధ్య, చలసాని ప్రసాద్, చేకూరి శ్రీనివాసరావు (ఫోటో: డాక్టర్ కే. రాందాస్)

వొక నిష్క్రమణ గురించి చెప్పడానికి ఎప్పుడూ మనసొప్పదు. భాషా వొప్పుకోదు. కవిత్వమూ రాదు. వచనంలోనా, ఆ వుద్వేగాలేమీ నిలవవు.

వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతారు మనుషులు. ఈలోపు వాళ్ళు అత్మీయులవుతారే…అవుతూ అవుతూనో, మరీ దగ్గిరగా వచ్చి గుండెలో వొక చిన్ని అర కట్టుకొని, వొక వుదయాన చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారే…అక్కడ మొదలవుతుంది pain- ఈ pain అనేది చాలా చిన్న మాట అనిపించే పెద్ద వెలితి.

వున్నట్టుండి వొక మనిషి మన మధ్య నించి వెళ్ళిపోవడం అంటే చూస్తూండగానే అక్కడ ఆ మనిషి లేని జ్ఞాపకం పుట్టుకురావడం! కొన్ని మాటలు ఆగిపోవడం! మనకై విరిసే కొన్ని చిర్నవ్వుల కళ్ళలోంచి చూపుల మెరుపులు రాలిపోవడం!

అంతకంటే pain – అవన్నీ ఇప్పుడు వొట్టి కాగితాల మీద తప్ప కనిపించకపోవడం!

*

Download PDF

25 Comments

 • Venkateshwarlu G says:

  జ్ఞాపకాలు.. ఊటలు కదా..
  అనుకున్నంతగా చేదుకోవడం..
  అనుకున్నట్లుగా పంచుకోవడం కష్టమేనెమో ..
  మనల్ని సెంటిమెంటల్ గా కలచివేసే ఘటనలను స్మృతులను నేమరేసుకోవడం అనుభూతి చెందినట్లుగా వ్యక్తీకరించడం కూడా మరింత కష్టమేమో. థర్డ్ పర్సన్ గా మారినప్పుడే అది సాధ్యమేమో..
  కొన్ని అనుభూతులను అఫ్సరే చెప్పలేకపోతున్నప్పుడు.. సరిగా రాయలేని బద్దకించే నాలాంటి వాళ్ళెం చెప్పగలరు..
  కేవలం కొన్ని జ్ఞాపకాలు.. ఇప్పటికి క్లుప్తంగా పంచుకుంటాను..
  చేరా గారితో నా పరిచయం 1988 చివరలో తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో చేరడానికి వచినప్పటిది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నాకు అప్పటికి బెరుకు పోలేదు. కాని ప్రవేశం కోసం ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు ఉత్సాహాన్నిచింది. ఆంధ్రజ్యోతిలో చేరాతల గురించి నేను ప్రస్తావిస్తే సంబరపడిపోయారు.. (ఆ తర్వాత అనుకుంటా ‘బహుత్ ఖూబ్ యాకూబ్’ విశ్లేషణ) అలాంటివి చదువుతుంటావా అని సంభాషణ పొడిగించారు.. ఈమధ్యే మిత్రులెవరో అన్నట్లు చేర గారిది సంభాషణ తీరు. గంభీరంగా కనిపించినా వయసు భేదాలు పక్కనబెట్టి స్నేహితుడిలా పిల్లల్లా మాట్లాడేవారు. నిజానికి అప్పటికి నా అవగాహనా అధ్యయనం తక్కువే. కానీ అవి పెరగడానికి, పెంచుకోవడానికి ఆ కోర్సు కాలం చాల దోహదపడింది. ఆయన తెలుగు వాక్యాల పాఠాలు భాషపై ఆసక్తిని, మమకారాన్ని పెంచాయి. ఆ ఏడాది ఆయనతోపాటు కాచినేని రామారావు, వరదాచారి, జీ కృష్ణ తదితరుల క్లాసులు విన్నాం. సెమినార్ల సందర్భాల్లో నండూరి రామమోహనరావు , గజ్జెల మల్లారెడ్డి తదితరులను కలుసుకోగలిగాం. అప్పుడే ఎమ్టీ ఖాన్, రత్నమాల తదితరుల అభిప్రాయాలూ తెలుసుకోగలిగాం. ఆ తరువాత ఈనాడులో బూదరాజు రాధాకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి పాఠాలు విన్నాను. చేరా.. ‘బూరా’ ల మధ్య సంవాదాలు సాగేవి. ‘బడు’ వాడొద్దని బూదరాజు గారి పట్టుదల. అలాంటప్పుడు ‘జరుగుడు’ పదాలేన్డుకని చేరా అనేవారు. మొత్తానికి అలాంటివారి సాహచర్యం అక్షరాలమీద బతికేయడానికి డారితీసిందేమో.
  ఇక్కడ ఫీలింగ్ పంచుకోవడం కాకుండా ముచట్లు చెప్పానేమో.. చేరా గారితో ఆ తర్వాత అప్పుడప్పుడు సాహిత్య సమావేశాల్లో కలిసేవాడిని. ఆప్యాయంగా పలుకరించేవారు.. సాహిత్యంలో ప్రత్యక్ష భాగస్వామిని కాకపోవడంవల్ల సుదీర్ఘ సంభాషణలకు వీలుండేది కాదు. చేతిలో పెద్ద బ్యాగు పట్టుకుని చాలాసార్లు చిక్కడపల్లి నుంచి యూనివర్సిటీ వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్ళే చేరా మాస్టారును చూసిన సందర్భాలు దృశ్యాలుగా గుర్తుకొస్తుంటాయి..
  (ఇది ఓ సగటు సాహిత్యాభిమాని, పాఠకుడి స్పందన మాత్రమే..)

  • editor says:

   వెంకట్ గారూ: మీ జ్ఞాపకాలు బాగున్నాయి. వీటిని మరికొన్ని జ్ఞాపకాలతో రాసి వివరంగా చేకూరి సంధ్య గారికి పంపగలరా? చేరా జ్ఞాపకాల గురించి ఆమె వొక సంకలనం ప్రచురిస్తున్నారు.

 • 90ల చివర్లో అయన పిల్లలదగ్గారికి మిషిగన్ వచ్చినప్పుడు సుమారొక మూణ్ణెల్లపాటు ఆయనతో సన్నిహితంగా మెలిగే భాగ్యం కలిగింది. ఎంతో ఆప్యాయంగా ఉండేవారు.

  • అవును, నాసీ! చేరాలో నాకు బాగా నచ్చిన లక్షణం అదే- ఆప్యాయత. ఎందఱో ఆయన మనసుని ఎన్నో సార్లు గాయపరచి వుంటారు. ఎన్నో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి ఆయనకీ. కాని, మనుషుల పట్ల ఆయన ఎప్పుడూ నిరాశావాదంలోకి వెళ్ళలేదు.

 • buchireddy gangula says:

  చాల చక్కగా మీ జ్ఞాపకాల ను గుర్తు చేసారు —బాగా రాశారు సర్
  ——————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 • Manasa says:

  మీ ఈ వ్యాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నిరాశపరచుకుండా ఎన్నో సంగతులు పంచుకున్నందుకు కృతజ్ఞతలండీ..!

 • తిలక్ బొమ్మరాజు says:

  సర్ మీరు ఈరోజు చేరా గారి మీద మీరు రాసిన ఈ వ్యాసం నన్ను కదిలించింది,ఇంత అభిమానాన్నీ బాధను మీ హృదయంలో దాచుకుని వాటిని అక్షరాల్లో పొదగడం ఎంతో నచ్చింది,మీరు నాకు అఫ్సర్ లాగా కంటే వ్యక్తిగా ఉన్నతంగా కనిపించారు/\

 • మైథిలి అబ్బరాజు says:

  ” వొక నిష్క్రమణ గురించి చెప్పడానికి ఎప్పుడూ మనసొప్పదు. భాషా వొప్పుకోదు. కవిత్వమూ రాదు. వచనంలోనా, ఆ వుద్వేగాలేమీ నిలవవు ”…ఎంత నిజం ! ఎలిజీ లు రాసేందుకు సమయం కావాలి ఎన్నో సార్లు , కొన్నిసార్లు జీవితమంతా చాలదు ! ఆర్ద్రమైన నివాళి …

 • nirmala kondepudi says:

  వ్యాసం అనాలా, తలపోతలు అనాలా , ఏదయినా చాలా బావుంది. చేరా ఇంకోసారి పలకరించి నట్టే వుంది .

  నిర్మల

 • కోడూరి విజయకుమార్ says:

  అఫ్సర్ ….
  చేరా గారితో పెనవేసుకున్న మీ జ్ఞాపకాలను పంచుకున్న ఈ వ్యాసం, చేరా గారితో అంతో యింతో అనుబంధం వున్న ఎవరినైనా , మరీ ముఖ్యంగా ఒక సాహితీ వేత్తగా కన్నా ఆయన లోని సహృదయుడైన మానవుడితో దగ్గరి పరిచయం వున్న ఎవరినైనా కదిలిస్తుంది ! … వ్యాసం చివరలో మీరు ముందే సందేహించినట్టుగా ‘మనసూ – కాగితం మడత పెట్టుకుని వెళ్లి పోవడాన్ని ‘ నేను అనుభూతి చెందాను !

 • “నాన్నగారు పోయినప్పుడు- మట్టి కింద ఆయన్ని నేనే రెండు చేతులా కప్పెట్టి వచ్చిన తరవాత చాలా రోజులు ఆయన మరణం అంతా అబద్దమనీ, ఆ మట్టి కింద నించి ఆయన వచ్చేస్తారనీ నమ్మేవాడిని. “

 • N Venugopal says:

  బాగుంది అఫ్సర్ ఎప్పట్లాగే. నిజంగానే రామారావు గారి మీద ఆయన వ్యక్తిత్వమంత సమగ్రమైన వ్యాసం రాయడం కష్టం.

 • Elanaaga says:

  అఫ్సర్ గారూ,

  కవిత్వం ఒక ఆల్కెమీ అని తిలక్ అన్నాడు కాని, వ్యాసరచన కూడా ఓ ఆల్కెమీయేననీ, దాని రహస్యం అఫ్సర్ లాంటి కొద్ది మందికి మాత్రమే తెలుసుననీ భావించేలా చేసింది మీ వ్యాసం. ఇటుక మీద ఇటుకను జాగ్రత్తగా పేర్చుకుంటూ పోయినట్టు వాక్యం తర్వాత వాక్యాన్ని ఒడుపుతో రాస్తూ ఒక విధమైన effect ను build చెయ్యటమనే విద్య బాగానే అబ్బింది మీకు. ఎన్నో సంవత్సరాల విస్తృత అధ్యయనమూ, దీక్షతో కూడిన కృషీ, అభ్యాసమూ చేయటమే కాక, వాటి ద్వారా ఒక clear understanding ను ఏర్పరచుకుంటే తప్ప మీలాగా ease ను సొంతం చేసుకోవడం సులభంగా సాధ్యం కాదు. Traditional style లో చక్కని వ్యాసాల్ని రాసేవాళ్లకు ఈ రోజుల్లో కూడా కొదవ లేకపోవచ్చును కాని, ఇట్లా modern outlook తో modern style లో రాసేవాళ్లు అరుదే. Subject వివరాలకూ వాక్యరచనా సంవిధానానికీ సమానమైన ప్రాధాన్యాన్నిచ్చి, ఆ రెండింటి మధ్య వొక balance ను సాధించటం కూడా వ్యాసరచనకు సంబంధించిన ఒక ముఖ్యమైన aspect అని చెప్పవచ్చు. ఆ aspect ను కూడా సమర్థంగా నిర్వహించి రాణించినందుకు మీరు అభినందనీయులు.

  చేరా గారు తన జీవితపు ఆఖరి రోజుల్లో ఋషిత్వాన్ని అలవర్చుకున్నారు. భాషాశాస్త్రంలో దిగ్గజం అనతగిన ఆయన, సాహిత్య సమావేశాలకు, సభలకు గుట్టుచప్పుడు కాకుండా మెల్లగా వచ్చి వెనకాల యెక్కడో కూచుని, యెవరితోనూ అంతగా మాట్లాడకుండా నిశ్శబ్దంగా unceremonious గా వెళ్లిపోవటం చూసి, గౌరవభావంతో కూడిన ఆశ్చర్యం కలిగేది నాకు. మహానుభావుడు.

 • TOUCHING!!

  ఇష్టమైన మనుషుల గురించీ, వాళ్ళతో పెనవేసుకున్న స్మృతుల గురించీ మీరు చెప్పేవన్నీ అద్బుతంగానే కాదు, మనసుని పట్టి ఊపేస్తాయి, అఫ్సర్ జీ!!

 • మరణాలు కొత్త కాదు. కానీ, ప్రతి మరణమూ కొత్తగా ఏడ్పిస్తుంది. అంతకు ముందు వెళ్ళిపోయిన మనుషులూ తక్కువ కాదు, కాని ఈ క్షణం వెళ్ళిపోయిన ఈ మనిషి యిలా వెళ్లి వుండకూడదనీ, మృత్యువు మరీ ఎక్కువ తొందరపెట్టి లాక్కు వెళ్ళిందనీ అనిపిస్తుంది.

  చాలా హృద్యంగా ఆవేదనగా ఆర్తి నిండిన ఒలపోత వుంది సార్ మీ మాటల్లో.. బతికి వున్నప్పుడు మన సమాజం ఆ వ్యక్తి కృషిని మరింత దగ్గరకు తీసుకుంటే సాహిత్యం మరింత పరిపుష్టమయ్యేది. బాపును చిన్న చూపు చూడడం కాదు కానీ ఇప్పటికీ పత్రికలలో అలా వస్తూనే వున్నాయి. కానీ సినిమా మాయకున్న సాంధ్రత సాహిత్యానికివ్వదీ లోకం. ప్చ్…

 • Thirupalu says:

  గుండెల్లో గుబులు గూడు కట్టుకుంది అప్సర్‌ సాబ్‌!
  /వున్నట్టుండి వొక మనిషి మన మధ్య నించి వెళ్ళిపోవడం అంటే చూస్తూండగానే అక్కడ ఆ మనిషి లేని జ్ఞాపకం పుట్టుకురావడం! కొన్ని మాటలు ఆగిపోవడం! మనకై విరిసే కొన్ని చిర్నవ్వుల కళ్ళలోంచి చూపుల మెరుపులు రాలిపోవడం!/
  ఎంత బాగా అన్నారు! ఆ అనడం ఎంత లోతుగా అన్నారు! చేరా గారి గురించి అందరిహృదయాల్లో గూడుకట్టుకున్న దిగులు కాస్త కస్త కరిగి పోతుందనగా తీరిగ్గా మళ్లీ అందరి హృధయాల్లోకి ఒక దిగులు ఇంజెక్సెన్‌ ఎక్కించారు. మీ ఒక్కొక్క అక్షరం ఒక్క కన్నీటి చుక్కగా వ్యాసరూపంలో ఇక్కడపెట్టి నట్టున్నారు.

 • balasudhakarmouli says:

  చాలా ఆత్మీయంగా రాశారండి. కవిత్వపు కొత్త విషయాలను కూడా తెలియజేస్తూ… నాకు చాలా నచ్చింది ఈ వ్యాసం. చేరా గారి వ్యాసాలు నాలుగైదు చదివాను. అన్నీ చదవాలని వుంది.

 • rajani says:

  vunnattundi manamadhya nunna manishi appatninchi jnapakamgaa maaradam nijamgaa bagundi afsargaru

 • ఆర్.దమయంతి. says:

  మీ అక్షర నీరాజనం ..నన్ను కదిలించేసింది అఫ్సర్ గారు.

 • రాఘవ says:

  అఫ్సర్ జీ! ఏం మాట్లాడతామిక!
  అందరం వెళ్ళిపోతాం తప్పక..కానీ ఇలా ’బతికి’ వెళ్ళిపోవడం ఎందరికి సాధ్యం!
  ఇలా ఇక్కడ తన ఙ్నాపకాలను ఇంత తడితడిగా కుప్పబోసిన ’పసి అఫ్సర్’ ..రాసిన ప్రతి అక్షరం గుండెనిలా చెమ్మగిలజేస్తుంటే..
  అఫ్సర్జీ!ఏమ్మాట్లాడతామిక!..

 • editor says:

  మీ అందరి వ్యాఖ్యలకు ధన్యవాదాలు

 • Jayashree Naidu says:

  **** వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతారు మనుషులు. ఈలోపు వాళ్ళు అత్మీయులవుతారే…అవుతూ అవుతూనో, మరీ దగ్గిరగా వచ్చి గుండెలో వొక చిన్ని అర కట్టుకొని, వొక వుదయాన చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారే…అక్కడ మొదలవుతుంది pain- ఈ pain అనేది చాలా చిన్న మాట అనిపించే పెద్ద వెలితి.

  వున్నట్టుండి వొక మనిషి మన మధ్య నించి వెళ్ళిపోవడం అంటే చూస్తూండగానే అక్కడ ఆ మనిషి లేని జ్ఞాపకం పుట్టుకురావడం! కొన్ని మాటలు ఆగిపోవడం! మనకై విరిసే కొన్ని చిర్నవ్వుల కళ్ళలోంచి చూపుల మెరుపులు రాలిపోవడం!****

  చాలా రోజుల తర్వాత సారంగ వైపు వొచ్చాను. అక్షరాలన్నీ కలిసి ఒక బాధ్యతాయుత వేదనా అభివ్యక్తి ని చూపిస్తే మీ ప్రత్యేక శైలి ఎప్పటిలాగే లిల్లీ పూల సుగంధం లా మంద్రంగా విషాద రాగమవుతుంది. మీ జ్ఞాపకాలని మోసుకొచ్చే అక్షరాలూ సితారు సంగీతం లా వున్నాయి.

 • నా లాంటి వారికి చాలా విలువైన వ్యాసం. ధన్యవాదాలు.

 • Rajesh Yalla says:

  చాలా హృద్యంగా ఉంది అఫ్సర్ గారూ!

 • hema says:

  chala bagundi

Leave a Reply to నిషిగంధ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)