పుస్తకాలు గతమా, వర్తమానమా, భవిష్యత్తా?

Aelita_Puppala Lakshmanarao(ed)_001

venu

అనేకానేక వ్యక్తిగత, సామాజిక కారణాలవల్ల రెండు మూడు నెలలు నా ఈ శీర్షికకు అంతరాయం ఏర్పడింది గాని ఇటు ‘సారంగ’ ఒత్తిడి వల్లా, ఈ శీర్షికలో రాయదలచిన విషయం పట్ల అభినివేశం వల్లా ఇది రాయవలసి ఉందని ఏ ఒక్కరోజూ మరచిపోలేదు. ఈ శీర్షికలో రాయదగినవీ, ఆలోచించదగినవీ ఎన్నెన్నో తట్టాయి, కనిపించాయి. అలా తోసుకొస్తున్నవాటిలో మిగిలినవాటిని పక్కనపెట్టి ఈసారి పుస్తకాల గురించి రాయదలిచాను. ఒక పుస్తకం అంటే గతంలో రాసినదో, గతం గురించి రాసినదో, గతంలో అచ్చయినదో, గతంలో ఈ కళ్లమీద ప్రవహించి, ఈ మునివేళ్లను ముద్దాడి, ఈ మనసులో స్థిరపడినదో గాని అది గతమేనా? గతమైనా వర్తమానమా? అసలు ఎన్నటికీ తుడిచివెయ్యలేని నిగూఢ భవిష్యత్తా?

‘ఇంతకాలమూ కాయితాల్తోనే గడిచిపోయింది, కన్నీటి కాయితాల్తోనే గడిచిపోయింది’ అని మో అన్నట్టు ఒకసారి పట్టుకున్నదంటే పుస్తకం మనిషిని జీవితపర్యంతం శాసిస్తుంది, ఆ మనిషి తననే శ్వాసించేలా చేస్తుంది. మనిషిని నడిపిస్తుంది, మనిషి వెంట నడుస్తుంది. అటువంటి పుస్తకానుభవాల గురించి ఎన్నోసార్లు రాశాను గాని అనిల్ బత్తుల అనే ఒక కొత్త పుస్తక ప్రేమికుడు వచ్చి నా పుస్తకాల జ్ఞాపకాల కందిరీగల తుట్టెను భూకంప సదృశంగా కదిలించాడు. మూడు వారాల కింద తాను ఏర్పాటు చేసిన పుస్తక జ్ఞాపకాల సభలో మాట్లాడమని నాలుగైదు వారాల కింద అడిగినప్పుడు, ఆ నిప్పురవ్వ నా మనసులో ఇంత దావానలమవుతుందని నేను ఊహించలేదు.

ఇంతకూ అసలు పుస్తక జ్ఞాపకాల సభ ఏర్పాటు చేయడమే ఒక విశిష్ట ఆలోచన. అది సోవియట్ యూనియన్ లో ప్రచురితమైన తెలుగు పుస్తకాల గురించి తలచుకునే సభ. సోవియట్ యూనియన్ అనేది భూగోళం మీది నుంచి చెరిగిపోయి నిండా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచింది. అంటే ఒక కొత్త తరం పుట్టుకొచ్చింది. బహుశా ఆ తరంలో కూడ పుట్టుకొస్తున్న పుస్తక పాఠకులు ఎప్పుడూ ఎక్కడా ఏ దుకాణంలోనూ ఈ పుస్తకాలు చూసి ఉండరు. అనిల్ బత్తుల కొద్ది ముందుగా పుట్టాడేమో గాని ప్రధానంగా ఆ తరానికి చెందినవాడే. సహజంగానే ఆయన మిత్ర బృందమూ అలా ఈ పుస్తకాలు దుకాణాలలో చూసి ఉండినవాళ్లు కారు.

అక్కడ మాట్లాడడానికి ఆలోచిస్తూ ఉంటే సోవియట్ పుస్తకాలు నా పఠనం లోకీ, అధ్యయనం లోకీ, అవగాహనల లోకీ, జీవితం లోకీ వచ్చిన నాలుగున్నర దశాబ్దాల కిందటి పురాస్మృతుల సుప్తాస్ఠికలు ‘బతికిన దినాల తలపోత బరువుచేత’ కదిలాయి. నేను సోవియట్ పుస్తకం మొదటిసారి ఎప్పుడు చూశాను, ఎప్పుడు ముట్టుకున్నాను, ఎప్పుడు చదివాను, ఆ పుస్తకాలు ఎట్లా పోగేసుకున్నాను, ఆ పుస్తకాలు మాత్రమే కాదు, ఆ పుస్తకాలకు జన్మనిచ్చిన ఒక అద్భుతమైన సామాజిక ప్రయోగం ఎట్లా కుప్పకూలి పోయింది, ఒక పావుశతాబ్ది గడిచాక ఇప్పుడు ఆ చితాభస్మం లోంచి ఏమి ఏరుకుంటాము, అటువంటి లాభాపేక్ష లేని, చైతన్య విస్తరణ కాంక్షతో మాత్రమే పుస్తక ప్రచురణ అంత పెద్ద ఎత్తున సాగే మరో ప్రపంచం మళ్లీ వస్తుందా…. ఎన్నెన్నో ప్రశ్నలు, ఆలోచనలు.

పుస్తకం గురించి తలచుకోవడమంటే, పుస్తకం రూపురేఖల గురించీ, రచయిత గురించీ, పుస్తకంలోని విషయం గురించీ తలచుకోవడం మాత్రమే కాదు. ఆ పుస్తకం ఉండిన చెక్కబీరువానూ, ఇనుపబీరువానూ, అటువంటి మరెన్నో బీరువాలు నిండిన గదినీ, ఆ గదిలో తలుపు పక్కన నిరామయంగా కూచుని కునికిపాట్లు పడుతూనో, ప్రేమపూర్వకంగా పుస్తకాలను పరిచయం చేస్తూ చెవిలా జోరీగలా వెంట తిరుగుతూనో ఉండే దుకాణదారు గుమస్తానూ, ఆ పుస్తకాలు పట్టుకుని తెరిచి లోపల వాసన చూసి, ఆ తర్వాత దాని విషయ సూచికా, అట్ట మీద వ్యాఖ్యలూ, ధరా చూసినప్పటి సంభ్రమాన్నీ, అంత తక్కువ ఖరీదైనా కొనుక్కోలేని నిస్సహాయ దైన్యాన్నీ, ఎలాగో ఒకలాగ కొనుక్కున్న సంతోషాన్నీ, ఆ పుస్తకాల దుకాణంలోకి మీతోపాటు నడిచి వచ్చిన మిత్రులనూ, ఆ పుస్తకం చదివినప్పటి అనుభూతులనూ, ఆ పుస్తకం గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు పొందిన ఉత్సాహాన్నీ… ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పుస్తకాన్ని గురించి తలచుకోవడమంటే ఒక జీవిత శకలాన్ని మళ్లీ అరచేతుల్లోకి తీసుకుని నాలుగువేపుల నుంచీ దర్శించడం.

అలా సోవియట్ పుస్తకాల గురించి తలచుకోవడమంటే బహుశా నా తరానికీ, నా ముందరి తరానికీ ఆత్మకథాత్మక సామాజిక చరిత్ర మననం చేసుకోవడమే.

IMG_20141002_174238

ఊహ తెలిసినప్పటి నుంచీ పుస్తకాలు చూస్తూ వచ్చాను. మా బాపు కొనుక్కున్న ఆధ్యాత్మిక పుస్తకాలు, పురాణాలు, కావ్యాలు మాత్రమే కాదు, సృజనకు సమీక్షకు వచ్చిన పుస్తకాలు, వరవరరావు గారి పుస్తకాలు కొన్నయినా మా రాజారం ఇంటికి చేరుతుండేవి. అలా హనుమకొండ చదువుకు రాకముందే సోవియట్ పుస్తకాలు చూసి ఉంటాను గాని మొట్టమొదట చూసిన సోవియట్ పుస్తకం ఇమాన్యువల్ కజకేవిచ్ ‘మిత్రుని హృదయం’ అని గుర్తు. వరవరరావు గారికీ, మా అక్కయ్య హేమలతకూ పెళ్లి జరిగిన సందర్భంగా 1964లో అది ఎవరో మిత్రులు కానుకగా ఇచ్చినట్టు గుర్తు. దాదాపు మూడు వందల పేజీల నీలి రంగు క్యాలికో బౌండు పుస్తకం. దాని మీద బంగారు రంగులో ఉబ్బెత్తుగా పుస్తకం పేరు, రచయిత పేరు. నలభై సంవత్సరాలు గడిచిపోయాక కూడ ఇప్పటికీ కళ్ల ముందు ఆడుతున్నాయి.

1973లో చదువుకు హనుమకొండ వచ్చాను, ఆ సంవత్సరమే విరసం మొదటి సాహిత్య పాఠశాల జరిగింది. ఆనాటికి కొన్ని పుస్తకాలు ప్రచురించడం కోసం డా. రామనాథం గారి ప్రోత్సాహంతో శ్రామికవర్గ ప్రచురణలు అనే చిన్న ప్రచురణ సంస్థ ప్రారంభమయింది. రామనాథం గారి ప్రోత్సాహంతోనే శ్రామికవర్గ ప్రచురణలు పేరుతో ఒక ప్రత్యామ్నాయ పుస్తకాల దుకాణం వరంగల్ లో ప్రారంభమయింది. ఆ దుకాణం నిర్వహణ బాధ్యత మా అన్నయ్య రాంగోపాల్ ది. నేనూ సాయంకాలం వేళల్లో ఆ దుకాణంలో ఎక్కువ రోజులే కూచోవలసి వచ్చేది. వరంగల్ లో సోవియట్ పుస్తకాలు అమ్మిన మొదటి దుకాణం అదేననుకుంటాను. అక్కడ ఆ పుస్తకాలు చెక్క బీరువాల్లో పేర్చి పెట్టడం నుంచి, తిరగేయడం, చదవడం దాకా సోవియట్ పుస్తకాలతో నా దోస్తీ మొదలయింది. ఎమర్జెన్సీతో ఆ దుకాణం మూతబడిపోయింది.

ఎమర్జెన్సీలోనో, ఎమర్జెన్సీ తర్వాతనో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ దుకాణం వరంగల్ మండీబజార్ లో మొదలయింది. సృజన ప్రూఫులు దిద్దడానికి ప్రెస్ కు వెళ్లి, ఆ పని అయిపోయినతర్వాత మండీబజార్ దాకా నడిచి విశాలాంధ్రలో కాసేపు పుస్తకాలు చూసి, తిరగేసి, కళ్లనిండా మనసు నిండా నింపుకుని ఇంటికి రావడం అలవాటుగా మారింది. ఆ మండీ బజార్ విశాలాంధ్ర దుకాణం రెండు మడిగెల ఇల్లు. లోపల ఎన్నెన్నో సోవియట్ పుస్తకాలు. కొన్ని పాత ఫారిన్ లాంగ్వేజెస్ పబ్లిషింగ్ హౌజ్ పుస్తకాలతో పాటు గుట్టలుగా ప్రొగ్రెస్ పబ్లిషర్స్. ప్రగతి ప్రచురణాలయం, మిర్ పబ్లిషర్స్ పుస్తకాలు. అప్పటికింకా రాదుగ ప్రచురణలు ప్రారంభం కాలేదు. దాదాపు అన్నీ క్యాలికో బౌండ్ పుస్తకాలే. మార్క్స్ ఎంగెల్స్ రచనలు, ముఖ్యంగా లెనిన్ రచనలు పేపర్ బ్యాక్ లు ఉండేవి. లోపల దళసరి తెల్లని తెలుపు కాగితం. సన్నని అక్షరాలు. పిల్లల పుస్తకాలైతే చెప్పనక్కరలేదు. రంగురంగుల బొమ్మలు. పెద్ద పెద్ద అక్షరాలు. చదువుతుంటే భాష కొంచెం చిత్రంగా ఉన్నట్టుండేది గాని దానిలోనూ ఒక సొగసు, ఒక ఆకర్షణ ఉండేవి.

ఆ తర్వాత విశాలాంధ్ర వరంగల్ మండీబజార్ నుంచి హనుమకొండ అశోకా కాంప్లెక్స్ లోకి వచ్చింది. అప్పటికి ఇంటర్మీడియట్ ఒకసారి తప్పి పూర్తి రికామీగా పుస్తకాలే ప్రపంచంగా ఉన్నాను. ఆ తర్వాత బిఎ లో చేరినా, సృజన, రాడికల్ విద్యార్థి సంఘం, సభల దగ్గర పుస్తకాల దుకాణం పెట్టడం లాంటి పనులెన్ని ఉన్నా సోవియట్ పుస్తకాల మైకం ఒకటి ఎప్పుడూ కమ్మి ఉండేది. సోషల్ సామ్రాజ్యవాదం అని విమర్శిస్తూనే, వాళ్లు పుస్తక ప్రచురణ ద్వారా ప్రపంచానికి చేస్తున్న మేలును అంగీకరిస్తుండేవాణ్ని. అక్కా అని పిలిచే ఒక కుటుంబ మిత్రురాలి దగ్గర నెలకు వంద రూపాయల దానాన్ని వరంగా పొంది అదంతా విశాలాంధ్రలో ఖర్చు పెడుతుండేవాణ్ని. (ఆరోజుల్లో అది ఎంత పెద్ద మొత్తమో, సోవియట్ పుస్తకాల ధరలతో పోలిస్తే అది మరెంత పెద్దమొత్తమో!)

Aelita_Puppala Lakshmanarao(ed)_001

పేదజనం – శ్వేత రాత్రులు, అజేయ సైనికుడు – ప్రశాంత ప్రత్యూషాలు, అమ్మ, జమీల్యా, అయిలీత, అన్నా కెరెనీనా, తండ్రులూ కొడుకులూ…. మొదటిసారి రాక్ లోంచి తీసి, అటూ ఇటూ ప్రేమగా తడిమి, తెరిచి వాసన చూసి, అతి భద్రంగా అప్పటి మేనేజర్ విజయప్రసాద్ బల్ల మీద పెట్టి…. ముప్పై ఐదు సంవత్సరాలు దాటిపోయినా ప్రతి క్షణమూ ఇప్పుడే అనుభవిస్తున్నట్టుగా ఉంది. పుష్కిన్ కవిత్వం, మరీ ముఖ్యంగా వాట్ మీన్స్ మై నేమ్ టు యు, ఇట్ విల్ డై ఆజ్ డజ్ ది మెలాంకలీ మర్మర్ ఆఫ్ డిస్టాంట్ వేవ్స్ అని గొంతిత్తి చదువుకుంటూ, ఆ పద్దెనిమిదో, పందొమ్మిదో ఏట, అది పుష్కిన్ నాకోసమే రాశాడనుకున్న గుండె సవ్వడి ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. బాలసాహిత్యమో, కవిత్వమో, కథో, నవలో, జానపద గాథలో, సాహిత్య విమర్శో, తాత్విక, రాజకీయార్థిక విషయాలో మాత్రమే కాదు, ఏదైనా సరే అసలు అది ప్రపంచానికి తెరిచిపెట్టిన ఒక కిటికీ. హృదయాన్ని వెలిగించిన ఒక మెరుపు. మనశ్శరీరాలను ముద్దాడి అలౌకిక అనుభూతిని అందించిన వెన్నెల. ఆ ప్రచురణలే లేకపోతే టాల్ స్టాయ్, డాస్టవిస్కీ, గోగోల్, కుప్రిన్, గోర్కీ, షొలఖోవ్, పుష్కిన్, గమ్జతోవ్, కజకేవిచ్, మయకోవస్కీ, లూనషార్స్కీ, సుఖోమ్లిన్స్కీ, మకరెంకో, క్రుపస్కయా, కొల్లోంటాయ్ లాంటి వందలాది పేర్లు మన కుటుంబ సభ్యుల పేర్లంత సన్నిహితమై ఉండేవేనా?

కేవలం రష్యన్ రచయితలు మాత్రమే కాదు, ఎందరో యూరపియన్ రచయితలు కూడ నాకు మొదట తెలిసింది ప్రొగ్రెస్ పబ్లిషర్స్ పుస్తకాల ద్వారానే. షేక్స్పియర్ మాక్ బెత్, ఆస్కార్ వైల్డ్ కథలు, లూయి కారొల్ ఆలిస్ ఇన్ వండర్ లాండ్ మాస్కో మీదుగానే నా కళ్లకు చేరాయి. యూరీ బోరెవ్ ఈస్ఠటిక్స్, యూరీ ఖారిన్, థియొడర్ ఒయిజర్మన్ ల తత్వశాస్త్రం, చేగువేరాతో సహా ఎందరివో జీవితచరిత్రలు, రాజకీయార్థిక శాస్త్రం, విద్యా ప్రయోగాలు, రెండో ప్రపంచ యుద్ధ అనుభవాలు… ఎన్ని జ్ఞాపకాలు….

ఇక నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం, రసాయన మూలకాల రహస్యాలు, చక్షువు-జగచ్చక్షువు లాంటి విజ్ఞాన శాస్త్రాల పుస్తకాలు, గణిత శాస్త్ర పుస్తకాలు, చివరికి చదరంగం మీద పుస్తకాలూ… ఆ పుస్తకాలే లేకుంటే ఏమయ్యేవాళ్లం? ఇట్లా ఉండేవాళ్లమేనా?

తన చరిత్ర పట్ల ఎంత మాత్రమూ స్పృహ లేని, తన చరిత్రను తాను నమోదు చేసుకోవాలనే స్పృహలేని తెలుగు జాతి స్వభావం గురించి ఇదివరకు రాశాను గాని, అనిల్ ఈ సోవియట్ తెలుగు పుస్తకాల గురించి మాట్లాడమన్న తర్వాత తారీఖులు, దస్తావేజుల కోసం తవ్వకం మొదలుపెడితే యాభై సంవత్సరాలకు మించని చరిత్ర కూడ మనకు ఖాళీలు లేకుండా, గందరగోళం లేకుండా, సవ్యంగా, స్పష్టంగా నమోదై లేదని మరొకసారి తెలిసివచ్చింది.

ప్రగతి ప్రచురణాలయం మాస్కో ప్రచురణలు ఎప్పుడు మొదలయ్యాయి, మొదటి పుస్తకం ఏమిటి, సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రగతి ప్రచురణాలయం వెంటనే మూతపడిందా, చివరి పుస్తకం ఏమిటి, నిలువ ఉండిన పుస్తకాలు ఏమయ్యాయి…. ప్రశ్నలే ప్రశ్నలు, సంతృప్తికరమైన సమాధానాలు లేవు.

ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా గిడుతూరి సూర్యం, జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి, కొండేపూడి లక్ష్మీనారాయణ, ఉప్పల లక్ష్మణ రావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, నిడమర్తి ఉమారాజేశ్వరరావు, ఆర్ వెంకటేశ్వర రావు (ఆర్వియార్) పని చేశారు. వీరిలో లక్ష్మణరావు గారు తప్ప మిగిలినవారెవరూ తమ ఆత్మకథలు రాసుకున్నట్టు లేరు. కనీసం సోవియట్ అనుభవాలు రాసుకున్నట్టు నా దృష్టికి రాలేదు. లక్ష్మణరావు గారి బతుకు పుస్తకంలో ప్రగతి ప్రచురణాలయం, మాస్కో తెలుగు ప్రచురణలు ప్రారంభమైన సంవత్సరం 1967 అని ఒకచోట అచ్చయింది. అది కచ్చితంగా అచ్చుతప్పు కావచ్చు. ఎందుకంటే మరికొన్ని పేజీల తర్వాత ఆయనే తాను తెలుగు అనువాదకుడిగా ప్రగతి ప్రచురణాలయంలో 1958లో చేరానని రాశారు. ఇంటర్నెట్ మీద కొంచెం పరిశోధిస్తే ప్రోగ్రెస్ పబ్లిషర్స్ మలయాళ విభాగం 1956లో మొదలయిందని ఒక లీలామాత్ర సమాచారం దొరికింది. మొత్తానికి తెలుగు విభాగం కూడ 1950ల మధ్యలో మొదలై ఉంటుందనుకుని ఆ కాలంలో కమ్యూనిస్టుపార్టీలో క్రియాశీలంగా ఉండినవారిని అడిగితే వారూ కచ్చితంగా చెప్పలేకపోయారు.

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ తోనూ, పీపుల్స్ పబ్లిషింగ్ హౌజ్ తోనూ చిరకాలం గడిపిన పిపిసి జోషి గారిని అడిగితే ఆయన కూడ, ‘నేనూ కచ్చితంగా చెప్పలేను గాని, కొన్నేళ్ల కింద నేను స్వెత్లానా వ్యాసం ఒకటి అనువాదం చేశాను. స్వెత్లానా అంటే అప్పటి ప్రగతి ప్రచురణాలయం బాధ్యురాలు. విశాలాంధ్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆమెను వ్యాసం రాయమంటే, ఆమె ఇంగ్లిషులో పంపిన వ్యాసంలో కొన్ని తేదీలు, పేర్లు పొరపాటు ఉన్నాయని, అవి దిద్ది అనువాదం చేయమని నాకిచ్చారు. నేను కాపీ కూడ పెట్టుకోకుండా అనువాదం, అసలు వ్యాసం వారికిచ్చేశాను. ఏ కారణం వల్లనో ఆ వజ్రోత్సవ సావనీర్ వెలువడలేదు. ఆ వ్యాసం ఏటుకూరి ప్రసాద్ దగ్గర ఉండవచ్చు. అడిగి తీసుకో’ అన్నారు.

నిజంగా ఆ వ్యాసం మన సామాజిక చరిత్రకు, సోవియట్ తెలుగు పుస్తకాల చరిత్రకు సంబంధించి ఒక విలువైన దస్తావేజు. దాని ప్రకారం సోవియట్ తెలుగు ప్రచురణలు 1956 డిసెంబర్ లో మొదలయ్యాయి. మొదటి పుస్తకం సుతయేవ్ రాసిన ‘ఎవరు మ్యావ్ అన్నారు’ అనే పిల్లల పుస్తకం.

అప్పటి నుంచి 1989 దాకా మాస్కో నుంచి తెలుగులో మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనల అనువాదాలతో సహా కనీసం మూడు వందల పుస్తకాలైనా వెలువడి ఉంటాయని నా అంచనా. అవన్నీ ఎక్కడైనా ఒక్కచోట ఉన్నాయా? అసలు జాబితా అయినా దొరుకుతుందా? ఆ మూడువందల పుస్తకాలు కొన్ని లక్షల ప్రతులు అచ్చయి ఉంటాయి. వాటిని ముట్టుకున్న, చదివిన, పంచుకున్న, వాటితో కదిలిపోయిన లక్షలాది మంది అనుభవాలన్నీ ఏమవుతాయి? అదంతా పతనమైపోయిన సోవియట్ యూనియన్ లాగ భూతకాలంలో కలిసిపోయిందా? అది విషాద వర్తమానమా? ఉజ్వల భవిష్యత్తా? అనిల్ బత్తుల వంటి ఔత్సాహికుల వల్ల, అపార అవకాశాలు ఇస్తున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అవన్నీ మళ్లీ ఈ అంతర్జాలం మీద కనబడతాయా? ఆ మాయాజాలం మళ్లీ వికసిస్తుందా?

సోవియట్ యూనియన్ కూలిపోయి ఉండవచ్చు కాని తన వనరులలో గణనీయమైన భాగాన్ని వెచ్చించి ప్రపంచానికంతా ఇంత జ్ఞానదానం చేసిన స్ఫూర్తి సంగతి ఏమిటి? వందలాది భాషలలో కోట్లాది పుస్తకాలు ప్రచురించి దేశదేశాల పాఠకుల అవసరాలను తీర్చడానికి, వారి కొనుగోలుశక్తిని దృష్టిలో పెట్టుకుని కారుచవకగా అందించడానికి, సోవియట్ ప్రజానీకం తమ శ్రమ ఎంత వెచ్చించి ఉంటారు? ఆ స్వార్థత్యాగం గతమా, వర్తమానమా, భవిష్యత్తా? రెండు కోట్ల మందిని బలిపెట్టి హిట్లర్ దుర్మార్గం నుంచి ప్రపంచాన్ని కాపాడిన ఆ మహాత్యాగ శక్తిని అప్పటి కవి ‘కోటి గొంతులు నిన్ను కోరి రమ్మన్నాయి’ అని పిలిచాడు. ఆ పుస్తకప్రచురణ స్ఫూర్తినైనా మళ్లీ కోరి రమ్మనడానికి కోటిగొంతులు పలకవలసిన అవసరం లేదా?

-ఎన్ వేణుగోపాల్

Download PDF

12 Comments

 • kurmanath says:

  రాదుగ, ప్రగతి పుస్తకాలు ఓ రెండు మూడు తరాల వారి జీవితాల్లో ఓ ముఖ్యమైన భాగం. అవి ఎంత గొప్ప ప్రపంచాన్ని మనకి పరిచయం చేసాయో చెప్పలేం. తల్లి భూదేవి, అమ్మ, పిల్లలకే నా హృదయం అంకితం, యమకూపం, నిత్యజీవితంలో భౌతిక శాస్త్రం, నా బాల్య సేవ….ఇలా ఎన్ని పేర్లైనా చెప్పొచ్చు. ఆ పుస్తకాల్లో పాత్రలు ఇప్పటికీ ఎవరో మన బంధువులైనట్టు, మిత్రులైనట్టు అనిపిస్తుంటారు.
  ఆ పుస్తకాలు లేని జీవితాన్ని ఊహించడం చాలా కష్టం. కస్టాల్లోనూ, సుఖాల్లోనూ, పోరాటాల్లోనూ ఈ పుస్తకాలు ఇచ్చిన నైతికబలం తక్కువ కాదు.
  అనిల్ మళ్ళీ వాటిని ఈ తరంకోసం గుర్తుచెయ్యడం చాలా బాగుంది. వేణు చెప్పినట్టు ఇప్పుడిక ఆ సాహిత్యాన్ని మన తర్వాత తరాలవారికి అందివ్వాల్సిన బాధ్యత మనమీద వుంది.

 • ari sitaramayya says:

  వేణుగోపాల్ గారూ,
  సోవియట్ యూనియన్ వల్ల పుస్తకాల ప్రేమలోపడ్డ వాళ్ళలో నేనూ ఒకడిని. కాలేజీ రోజుల్లో సోవియట్ పుస్తకాల ద్వారానే గోర్కీ, మయకోవిస్కీ, గోగోల్, ముఖ్యంగా నా ప్రియ రచయిత తుర్గేనేవ్ లాంటి రచయితల పుస్తకాలు చదివాను. ఇప్పుడు అనిల్ బత్తుల గారి స్వార్థరహిత ప్రయత్నాల వల్ల చాలా కాలం తర్వాత మళ్ళా ఆ పుస్తకాల గురించి చదువుతున్నాను. మీకు సోవియట్ పుస్తకాలతో ఉన్న పరిచయాన్ని చక్కటి వ్యాసంగా మలిచారు. అభినందనలు. అంత మంచి పుస్తకాలను అంత తక్కువ ధరతో అంత చక్కగా వేలమైళ్ళ దూరంలో ఉండే వారికోసం ప్రచురించే సోవియట్ యూనియన్ లాంటి దేశం మరొకటి ఎప్పుడైనా మళ్ళా వస్తుందా? “ఆ పుస్తకప్రచురణ స్ఫూర్తినైనా మళ్లీ కోరి రమ్మనడానికి కోటిగొంతులు పలకవలసిన అవసరం లేదా?” ఉంది. అలాంటి ఆశలు తీరే రోజు వస్తే ఎంత బాగుంటుందో కదా!

 • raghava says:

  అబ్బా! ఏం మనిషండీ మీరు..కళ్ళ నీళ్ళు తెప్పించారు,దేహాన్నిలా రోమాంచితం చేశారు-మీర్రాసింది ప్రోజా?పొయెట్రీ నా…!అక్షరాక్షరం లో మీ గుండె చప్పుడు వినిపిస్తోంది..మీ వ్యాసమంతా పుస్తకాల పురా వాసనేస్తోంది…-అన్నం తింటూ చదివిన పుస్తకాలు, చదువుతూ చదువుతూ కనులమీద బోర్లించుకుని నిద్రపోయిన పుస్తకాలు, పూరింటి పంచ లో నులకమంచమ్మీద బోర్లా పడుకుని పొద్దంతా చదివిన పుస్తకాలు…పో సామీ! ఇంత ఉద్వేగ తీవ్రత తో ఏమ్మాట్లాడగలన్నేను!….

 • raamaa chandramouli says:

  వేణూ,
  చాలా పాత జ్ఞాపకాల పొరల్లోకి తీసుకుపోయినవ్.
  మండిబజార్ విశాలాంధ్ర..జనధర్మ..హనుమంతరావు ప్రజామిత్ర..మండిబజార్ దేవయ్యది ఒక పత్రిక..విజయప్రెస్ పల్లా రామకోటార్య..వేంకటరమణ ముద్రణాలయంలో సృజన..ఎన్ని పత్రికలో..
  సోవియట్ ప్రచురణల్లో..జీవితాంతం పనిచేసిన నిడమర్తి ఉమామహేశ్వరరావు గారిని బెంగళూరు లో కలువడం..జోషి గారితో అనుబంధం..అన్నీ ముసిరే జ్ఞాపకాలై.,
  ఏదో అవ్యక్త ఆనందోద్విగ్నత.
  రామా చంద్రమౌళి,వరంగల్లు

 • N Venugopal says:

  కూర్మనాథ్,
  ఆరి సీతారామయ్య గారు,
  రాఘవ గారు,

  కృతజ్ఞతలు.

  చంద్రమౌళి గారూ,

  వరంగల్ జ్ఞాపకాలు తడి ఆరని నా కనురెప్పలు. ‘ఇక్కడి నేల మీద ప్రతి రేణువునూ/ మన పాదాలు ముద్దాడి మేల్కొలిపాయి/ ఇక్కడి గాలిలో ప్రతి తెమ్మెరనూ/ మన ఊపిరి రాజేసింది’ అని 1997లో వరంగల్ మీద రాసిన ఒక కవితలో రాశాను. 1970ల, 80 ల వరంగల్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ కాజీపేట కాంచీట్ నుంచి వరంగల్ లేబర్ కాలనీ వరకూ అడుగడుగూ నడిచి నిజంగానే ప్రతి ఇసుకరేణువునూ నా పాదాలతో ముద్దాడాను. ఎప్పటికైనా వరంగల్ సాంఘిక చరిత్ర రాసి ఆ అద్భుత నగరపు రుణం తీర్చుకోవాలని చిరకాలపు కోరిక. ఈ జ్ఞాపకాలు మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు….

 • Papineni Sivasankar says:

  ఒకే సారి మనస్సును, హృదయాన్ని తాకిన వ్యాసం. ముఖ్యంగా చివరి వాక్యాలు.
  ఏ పరిణామాలు ఎట్లా ఉన్నా ఆ పుస్తకాల సారం కోట్ల మందిలో జీర్ణించి, జీవించి ఉంది గదా!
  వేణూ! అభినందనలు.
  వరంగల్ చరిత్ర తప్పకుండా రాయి. గొప్ప కృషి అవుతుంది.

 • N Venugopal says:

  శివశంకర్ గారూ,

  ‘ఆకులాడని అడవి నిద్ర లేచింది/ ఆకలెత్తిన అడవి నిద్ర లేచింది’ అనే మీ కవిత్వం చదివిన నాటినుంచీ ఇరవై ఐదేళ్లుగా మీరు నా అభిమాన కవి. మీకు వ్యాసం నచ్చినందుకు కృతజ్ఞతలు. వరంగల్ సాంఘిక చరిత్ర రాయడం నా బాధ్యత అనుకుంటున్నా.

 • లామకాన్ లో ‘సోవియట్ సాహిత్యంతో ఆ సాయంత్రం’ వేళ మీ ప్రసంగం విన్నాను. ఇప్పుడీ వ్యాసం ద్వారా మీ వ్యక్తిగత కోణంతో పాటు మరిన్ని విశేషాలు తెలిశాయి.

  >> ఒక పుస్తకాన్ని గురించి తలచుకోవడమంటే ఒక జీవిత శకలాన్ని మళ్లీ అరచేతుల్లోకి తీసుకుని నాలుగువేపుల నుంచీ దర్శించడం. >> నిజమే కదా!..

  ఈ వాక్యం ఒక్కటే కాదు, సోవియట్ యూనియన్ పతనమైనా ఆ స్ఫూర్తి సంగతేమిటని ప్రశ్నిస్తూ.. వ్యాసం మొత్తం మనసుకు హత్తుకునేలా రాశారు. కళాత్మకంగా, శ్రద్ధగా తీర్చిదిద్దిన ఆ ఉత్తమశ్రేణి పుస్తకాలతో ఒక తరం పాఠకులు తమ ఆత్మీయ అనుబంధపు జాడలను తడుముకునేలా చేేశారు!

 • N Venugopal says:

  వే ణు గారూ,

  కృతజ్ఞతలు.

 • Thirupalu says:

  అప్పుడే అయిపోయిందా? చెపుతుంటే హృధయ స్పందనా ఎంత హాయిగా అనిపించింది. ఏదో ఒక తాత్వికతకు లోనయ్యాము. అద్బుతమైన బాహుకుత, ఆర్ధ్రంగా చెప్పారు. మళ్లీ మళ్లీ చదవాలనిపించే వ్యాసం.

 • Anil battula says:

  వేణు గోపాల్ గారు, మనసుని హత్తుకొనే వ్యాసం రాసారు…సోవియట్ పుస్తక స్పూర్తిని కొనసాగిద్దాం….

 • N Venugopal says:

  తిరుపాల్ గారు,

  అనిల్ బత్తుల,

  కృతజ్ఞతలు….

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)