ఎగిరే పావురమా! – 13

egire-pavuramaa13-banner

ఆలోచిస్తూ ఆయమ్మ పెట్టెళ్ళిన బన్ను తిని నీళ్ళు తాగాక వెనక్కి జారిగిల బడ్డాను…

 

మొదటినుండీ నా పట్ల ఈ అక్కాతమ్ముళ్ల వైఖరి తలుచుకొని మనసంతా హైరానాగా అయిపొయింది….

పాలెం వదిలేసి, రైలెక్కి అరపూట ప్రయాణం చేసాక, ‘రాణీపురం’ అనే ఈ ఊళ్ళో దిగిన దగ్గరినుండి…వారి పోట్లాటలు, వాదులాటలతో మనసుకి శాంతన్నది లేకపోవడం ఒకెత్తయితే, నేనెదుర్కున్న ఇబ్బందులు, నిస్సహాయతలు మరో ఎత్తు.

గుర్తు చేసుకోగానే, కన్నీళ్లు ఆగలేదు……

 

“ఏమ్మాయి చాలా నొప్పిగా ఉందా కాలు? ఏడ్చేస్తున్నావు,” అంటూ మందులందించింది ఆయా.

 

‘డాక్టరమ్మ వచ్చే టైం’ అంటూ నా కాలి కట్టు మార్చి వెళ్ళిందామె.

**

పొద్దున్న తొమ్మిదవుతుండగా, నన్ను డాక్టరమ్మ పరీక్ష చేసేప్పుడు వచ్చారు కమలమ్మ, గోవిందు. కాస్త ఎడంగా బెంచీ మీద కూచున్నారు.

 

తను రాసిన కొత్త మందులు వెంటనే మొదలెట్టమని నర్సుకి చెప్పి,

“మీ పెద్దవాళ్ళెవరన్నా వచ్చారా?” అనడిగింది డాక్టరమ్మ.

అది విన్న కమలమ్మ లేచి గబగబా మంచం కాడికొచ్చింది….

 

“చూడండమ్మా, అమ్మాయి ఆరోగ్యంగా ఉంది కాబట్టి బాగానే కోలుకుంటుంది.. ఎల్లుండి ఇంటికి వెళ్ళవచ్చు… మళ్ళీ వారానికి తీసుకు రండి. చూస్తాను. ఆ పై వారానికి కొత్తకాలు కూడా వచ్చేస్తుంది… అంతా బాగుంటే, దాన్ని అమర్చే విషయం చూడవచ్చు,” అందామె కమలమ్మతో…..

 

“పోతే గాయత్రి, కూర్చుని ఏ పనైనా ఎంత సేపైనా చేయవచ్చు.   అప్పుడప్పుడు మాత్రం నీ క్రచ్చస్ తోనే కాస్త తేలిగ్గా అటు ఇటూ మెసలాలి. మందులు   మాత్రం ఇంకా వేసుకోవాలి. నీకు సాయం చేయడానికి ఎవరైనా ఉంటారుగా!” అడిగిందామె నన్ను.

 

“ఎందుకుండమూ? ఎవరో ఒకరు కంటికి రెప్పలా కాసుకునుంటామమ్మా,” పలికింది కమలమ్మ.

డాక్టరమ్మ వెళ్ళాక నా దగ్గరగా వచ్చాడు గోవిందు.

“ఈడ ఉన్నన్నాళ్ళు నీకు పొద్దుపోతదని ఈ పుస్తకాలు తెచ్చా,” అంటూ రెండు పత్రికలందించాడు.

 

ఎదురుగా కూచుని నా చేయి తన చేతిలోకి తీసుకొంది కమలమ్మ…

“ఇదో గాయత్రి, రెండు రోజులు కాస్త నిమ్మళంగా ఈడనే ఉంటావుగా!

బాగయిపోతావుగా! నువ్వు క్యాంటీన్ లో పనికి లేవని, పాపం జేమ్స్ ఇబ్బంది పడుతున్నాడు…

ఇయ్యాల జేమ్స్ అసలు మాతో రావాల్సింది. నిన్ను చూడలేదని చాలా ఆతృత పడుతున్నాడు.   ఏదో పని తగిలిందంట. తనకోసం ఆగొద్దని మమ్మల్ని పంపాడు.   మేము తిరిగెళ్ళి   అతనికి వాన్ అప్పజెప్పాక, ఏదో ఒక టైంకి వస్తాన్నాడు,” అంది.

 

….ప్రహ్లాద్ జేమ్స్… నన్ను చూడ్డానికి ఒక్కడే వస్తాడనగానే, నాకు కడుపులో తిప్పేసింది…

అందరితో కలిసి ఎందుకు రాలేదు? అట్లా రాడు. శని లాగా ఒక్కడే వస్తాడు. అవకాశం దొరికితే వెకిలి వాగుడుతో నరకం చూపిస్తాడు కూడా అని తలుచుకోగానే మనసంతా అసహ్యంతో నిండిపోయింది…

‘నేను ఒంటరిగా దొరికితే, వాడి వెటకారం నుండి, వాడి అసభ్యకర మాటల నుండి ఎలా తప్పించుకోవాలి?… నాలాంటి అవిటిని కూడా వేధించే వాడిది ఎంతటి దిగజారిన మనస్థితి!!…

కోపంతో నా పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

 

“ఏందాలోచిస్తుండావు? ఏమన్నా తింటావా?” అడిగాడు గోవిందు మంచం ఎదురుగా నిలబడి..

ఏమొద్దని సైగ చేసాను…

అయినా, ఇప్పుడే వస్తానని బయటకి పోయాడు గోవిందు.

కాస్త అవతలికి పోయి, చుట్టూ ఉన్న వాళ్ళతో కబుర్లల్లో పడ్డది కమలమ్మ. ఆమె గొంతు బిగ్గరగా వినబడుతూనే ఉంది.

నన్ను జేమ్స్ కాడ పనికి పెట్టిన ఆమెకి గాని, టెంపోలో కూరలు, సామగ్రి తెచ్చాక, రోజూ క్యాంటీన్ లోనే తినెళ్ళే గోవిందుకి గాని – జేమ్స్ మాటలతో నన్ను వేధిస్తాడని – తెలీదు..

రోజూ సాయంత్రం ఏడింటికి, అతికష్టంగా పని ముగించి, మా ముగ్గురికి రాత్రికి సరిపడా తిండి తీసుకొని బయటపడేదాన్ని మొదట్లో, సత్రం క్యాంటీన్ లో పని చేసినన్నాళ్ళూ.

 

సాగుతున్న ఆలోచనలు గోవిందు పిలుపుతో ఆగాయి…. ఎదురుగా చేతిలో తిండి పోట్లాలతో నిలబడి ఉన్నాడు…

పక్కనే ఉన్న గుడి నుండి పులిహోర, దద్దోజనం ప్రసాదాల ప్యాకట్లంట, మంచం పక్కన స్టాండ్   మీదెట్టాడు.

వాటితోపాటు తెచ్చిన కుంకుమ వీభూతి పొట్లాలు మాత్రం నాచేతుల్లో పెట్టాడు.

ఎంతో అపురూపంగా అనిపించింది దేవుని కుంకుమ బొట్టు.

 

క్రైస్తవ మతం పుచ్చుకొని, ‘మదర్ తెరెసాలో’ పని చేయడం మొదలైనాక మొహాన బొట్టు పెట్టనే లేదు.

కుంకుమ నుదిటిపై   పెడుతూ తాతని గుర్తు చేసుకున్నాను….

నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి….

“మీ తాతకి ఉత్తరం రాసావుగా! నీ కొత్తకాలు పెట్టే లోగా ఆడనుండి మళ్ళీ ఏదో ఒకటి తెలుస్తాదిలే…,” అంటూ గోవిందు ఇంకా ఏదో చెప్పేలోగా కమలమ్మ వచ్చింది.

 

“ఇక పోవాలిరా గోవిందూ,” అంటూ దగ్గరగా వచ్చి నా పక్కన కూచుంది. కమలమ్మ…

 

నా వంక చూస్తూ, ”ఇదో గాయత్రీ, జేమ్స్ వచ్చినప్పుడు, ఇక మూడు రోజులకి పనిలోకొస్తాని అతనికి భరోసా ఇవ్వు…. సైగలతోనే మంచిగా సెప్పు. మేము మళ్ళీ రేపో ఎల్లుండో కనబడతాము,” ఒకింత ఆగి, నా వంక తేరిపార చూసింది.

“బొట్టెడితే మునపటి గాయత్రిలాగే ఉన్నావు. ఇక్కడున్న ఈ రెండురోజులు సక్కగా పెట్టుకో,” అంటూ లేచి గోవిందుతో పాటు వెనుతిరిగింది కమలమ్మ.

 

ఆమైతే, ఏనాడూ బొట్టు, పూలు పెట్టదు. గుళ్ళో కొలువుకొచ్చాకే, చిన్న నల్ల బొట్టెడం మొదలెట్టానంది అప్పట్లో.

ఊరు దాటగానే అదీ తీసేసింది. తనకసలు బొట్టు, పూలు, పెళ్ళి, పిల్లలు, సంసారం అంటే గిట్టదని ఓ మారు మాటల్లో అన్నది కూడా….

 

అన్నీ ఎడమతం చేష్టలు, వింత పోకడలే కమలమ్మవి. అందుకే జేమ్స్ కి నేను మంచిగా భరోసా ఇవ్వాలని చెప్పి మరీ వెళుతుంది. అవసరమా? తెలిసిందేగా నేను వెంటనే ఆ కిచెన్లో వంట-వార్పు – చాకిరీ మొదలెట్టాల్సిందేనని…మళ్ళీ భరోసా ఇచ్చేదేముంది!

 

గుండెలు, కడుపు రగిలిపోతుంటే గబగబా గుడి పులిహోర తిని, నర్సు ఇచ్చిన నీళ్ళ కాఫీతో కొత్త మందు వేసుకుని వాకిలి వైపుగా తలగడ మీదకి ఒరిగాను.

 

జేమ్స్ మీద అసహ్యం, వాడు ఎప్పుడొస్తాడో అన్న భయంతో అయోమయంగా అనిపించింది.

అసలతను మా జీవితాల్లోకి ఎలా వచ్చాడని గుర్తు చేసుకున్నాను.

సత్రంలో క్యాంటీన్ వోనర్ అయిన జేమ్స్ కాడికెళ్ళి, ఊరికి కొత్తగా వచ్చిన మాకు దారి చూపెట్టమని కమలమ్మ మొర పెట్టుకోడం, లేదనకుండా అతను ముగ్గురికీ బతుకుతెరువు చూపించడంతో మొదలైంది, అతనితో సంబంధం.

egire-pavurama-13

ఇంకేముంది….నా గురించిన సంగుతులన్నీ కమలమ్మ నుండి విన్నాక, జేమ్స్ మా అందరి బలహీనతలు తెలుసుకుని చనువు తీసుకున్నాడు. మొదట్లో జాలిగా ఉన్నా, నాపట్ల వైఖరి మారింది. చెప్పుకోలేని ఇబ్బందులు మొదలయ్యాయి.

టైం దొరికితే పుస్తకాలు-పత్రికలూ చదవాలనుకునే నాకు, పక్కన చేరి, తను భార్యని ఎందుకు వదిలేసాడో, మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదో చెప్పడం మొదలెట్టాడు. అతని సొంత విషయాలు వినడానికి విసుగ్గా ఉండేది.

జేమ్స్ చేయి తిరిగిన వంటవాడే. కొత్తల్లో నాకు వంట నేర్పించే సాకుతో అవసరానికి మించి చేరువగా ఉండేవాడు.

నాతో పాటు పనిచేసే ‘జాన్వి’ టిఫిన్ పొట్లాలు టీ బడ్డీకి జారవేసే సమయాల్లో నాతో బాతాఖానీ వేసేవాడు…. చేతులు, మెడలు పడతానని వెంట పడేవాడు. నా రంగు, నా జుట్టు, నా తేనె రంగు కళ్ళని పొగిడేవాడు.

కొత్తపత్రికల మధ్యలో అసభ్యకరమైన బూతు పుస్తకాలు పెట్టి చదువుకోమని ఇచ్చేవాడు.

ఇలాంటివన్నీ వార్తల్లో, పత్రికల్లో చదువుతూనే ఉన్నాను.   నా పట్ల అతడి వెకిలితనం అర్ధమయిపోయింది…

 

ఇట్లాంటి అడ్డమైన పన్లు   చేస్తున్నా, వాడిని ఏమీ చేయలేక పోయాను. ఎవరికి ఎలా చెప్పగలను. నేను చెప్పినా కమలమ్మ నమ్మదు. కమలమ్మకి జేమ్స్ దేవుడుతో సమానం.

అతడు నా భుజం మీద చేయి వేస్తే, ఒకటి రెండు సార్లు విదిలించాను. దూరంగానే ఉండమని తెలియజెప్పాను. అంతకంటే ఏమి చేయలేని దుస్థితి నాది…

పైగా ఆ కొలువు చేయకపోతే, నా గతేంటి?.. ఆ కొలువు వల్లే మాకు తిండి ఖర్చు లేకపోగా, మొదట్లో ఏడాదిపాటు టీ బడ్డీ వెనకాతల ఉన్న ఓ రేకుల గది, వంటిల్లు బాత్ర్రూం సహా మాకు ఉండడానికి ఇచ్చాడు. …..

 

వాడి ఆగడాల్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి, సత్రం కొలువుతో మొదలైంది.

రెండేళ్లగా మాత్రం ‘మదర్ తెరెసా’ కిచెన్లో, హెల్పర్స్ ఉండడంతో, వాడికి నన్ను వేధించే అవకాశాలు తగ్గాయి.

 

ఇలా ఆలోచనలు సాగుతున్నా, కళ్ళు మూసుకుపోతున్నాయి..కాలు నొప్పి కాస్త తగ్గినట్టే అనిపించింది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాను…

**

“గాయత్రీ, ఇక లే మరి. చాలా సేపయిందట నీవు నిద్రకి పడి,” అంటూ నా చెవిదగ్గరగా వినిపించడంతో, మెల్లగా కళ్ళు తెరిచాను. నా భుజంపై చేయి వేసి రాస్తూ మంచానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు జేమ్స్…

ఒక్కసారిగా కుంచించుకుపోయాను.

భుజం మీద చేయి తీసేసి, లేచి కూచోవాలని ప్రయత్నించాను. కుదరలేదు.   ఆయమ్మ కోసం, చేతికందిన సత్తు గ్లాసుతో బల్లమీద నాలుగు సార్లు శబ్దం వచ్చేలా గట్టిగా కొట్టాను.

నా చేతి నుండి గ్లాసందుకొని, “చూడు, లంచ్ చేసి రమ్మని నేనే ఆయాని పంపాను. నేనొచ్చి ఇరవై నిముషాలయింది. పక్కకొదిగి, ముద్దుగా గువ్వపిట్టల్లే పడుకున్న నిన్ను   చూస్తూ కూర్చున్నాను. బొట్టు పెట్టుకొని చాలా కళగా ఉంది నీ ఫేస్.

ఈ రోజున, మన అసిస్టెంట్ కి డ్యూటీ అప్పజెప్పి సెలవు తీసుకున్నా. ఆయమ్మ రాగానే నిన్ను కూర్చోబెట్టి, లంచ్ తినిపిస్తూ కబుర్లు చెబుతా కూడా,” జేమ్స్ అంటుండగానే వచ్చింది ఆయా.

 

చేతిలో నోట్లు అతినికందించి, “ఏం చేయమంటారు సారూ,” అడిగింది.

ఇద్దరూ కలిసి నన్ను పైకి లేపి కూర్చోబెట్టారు..చుట్టూ కలియజూసాను. గది సగానికి పైగానే ఖాళీ అయింది. దూరంగా ఇద్దరు ముసలాళ్ళు పడుకునున్నారు. మిగతా రోగులు డిస్చార్జ్ అయ్యారేమో!

 

“తిని మందేసుకున్నాక, ఆయాని నీ పక్క మార్చమంటావా లేక ఇప్పుడే సర్దమంటావా? నేను పక్కకెల్తాలే,” అన్నాడు జేమ్స్….

 

‘లేదు తిని మందేసుకుంటానని’ సైగ చేసాను. నేను తినేస్తే, వాడు త్వరగా పోతాడేమోనని..

 

“సరే అయితే. గాయత్రికి నేను తినిపిస్తాలే, నువెళ్ళి పక్కనే ఉండు,” అన్నాడు ఆయాతో.

తెచ్చిన క్యారేజీ విప్పాడు. ప్లేట్, గ్లాస్, ఫ్లాస్క్ బ్యాగ్ నుండి తీసాడు.

 

“సేమియా ఉప్మా, పెరుగువడ, జిలేబి…నీకోసం…స్వహస్తాలతో పోద్దుటినుండి నేనే చేశా,” అంటూ ప్లేట్లో సర్డాడు.

నాకు దగ్గరగా చేరి, తినిపించసాగాడు. రెండు సార్లు అయ్యాక, నేనే తింటానని పళ్ళెం లాక్కున్నాను.

“సరే, అంతా తింటే గాని ఒప్పుకోను,” అన్నాడు జేమ్స్ నవ్వుతూ నా ఎదురుగా కూచుని.

 

వాడెందుకలా మెడలో లావుపాటి బంగారు గొలుసు, పది వేళ్ళకి బంగారు ఉంగరాలు, ఓ చేతికి బంగారు కడియం, మరో చేతికి బంగారు రంగు రిస్ట్ వాచి అలంకరించాడో తెలియడం లేదు.   తెల్లటి సిల్క్ లాల్చీ వేసాడు. వాడి దగ్గర ఘాటుగా అత్తర్ల వాసనలు…

పెద్ద పొట్ట, వెకిలి నవ్వు, బట్టతల, చెంప మీద కత్తి గాటు. పెద్ద రౌడీలా ఉంటాడు.

వాడి రూపం, వేషం కడుపులో తిప్పేస్తుంది.

ఎలాగో తినడం ముగించాను…

 

“నే వెళ్ళి డాక్టర్ని కలిసొస్తాను, నీవీలోగా మందేసుకొని పక్క మార్పించుకో,” అని ఆయాని పిలిచాడు వాడు.

**                                                                 (ఇంకా ఉంది)

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)