వెన్నెల్లో వెనిస్!

నీటి మీద తేలుతున్న నగరం!

ప్రపంచంలోనే అరుదైన అందమైన నగరం! వెనిస్!

ఇటలీలోనేకాక, ప్రపంచంలోనే ప్రేమికుల ప్రముఖ ప్రణయ నగరం!

ఒక్క రోడ్డు కూడా లేని పెద్ద నగరం. ఊరంతా నీటి మీదే! అక్కడే టాక్సీలు, బస్సులూ, హోటళ్ళ షటిల్ బస్సులూ, స్కూలు బస్సులూ. ‘లాహిరి, లాహిరి’ పాడుకోటానికి గండోలాలు.

ఇదో వింత అనుభవం!

౦                 ౦                 ౦

ఎన్నో కాలువలతోనూ, బ్రిడ్జీలతోనూ, రకరకాల నీటి వాహనాలతోనూ, పో – పియావే నదుల మధ్యన 118 చిన్న చిన్న దీవులని కలిపి, చిందరవందరగా వున్న మనుష్యులను దగ్గరకు తీసిన నగరం. ఇటలీలో వెనేటో ప్రాంతానికి రాజధాని. మొత్తం 160 చదరపు మైళ్ళు లేదా 415 చదరపు కిలోమీటర్ల వైశాల్యం. వెనిస్ గ్రాండ్ దీవి మీద 60,000మంది జనాభా అయితే, మొత్తం 118 దీవులూ కలుపుకుంటే 270,000 జనాభా. సగటున రోజుకి యాభై వేల మంది పైన యాత్రీకులు ఇక్కడికి వస్తుంటారని చెప్పారు.

౦                 ౦                 ౦

మేము వెరోనా అనే నగరం నించీ ట్రెయిన్లో వెళ్లి వెనిస్ నగరంలో దిగాం. అక్కడికి ట్రైన్ ఒక బ్రిడ్జ్ మీదుగా వెడుతుంది. అక్కడ ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వుంది. నీటి పైన ఎగురుతూ వచ్చి ఈ దీవి మీద విమానాలు దిగుతాయి.

ట్రైన్ స్టేషన్లో దిగాక, అదే దీవిలో అయితే కాలి నడక. దగ్గరగా వున్న మిగతా దీవులకీ వెళ్ళాలంటే కూడా బ్రిడ్జిల మీద కాలి నడక. లేదా కొంచెం దూరంగా వున్న దీవులకి వెళ్ళాలంటే టాక్సీలు, బస్సులూ. అన్నీ నీటి మీదే.        అప్పుడే నాకు బాపుగారు వేసిన ఒక కార్టూన్ గుర్తుకు వచ్చింది. ఒక స్వామిగారు నీటి పైన నడిచి వెడుతుంటాడు. అది చూసి ఒకతను అంటాడు, “అరె, చూడు ఆయన నీటి మీద ఎలా నడిచి వెడుతున్నాడో” అని. అప్పుడు రెండో అతను అంటాడు, “పాపం, ఆయనకి ఈత రాదేమోరా.. అందుకే నడిచి వెడుతున్నట్టున్నాడు” అని!

ఇక్కడ ఆ సన్నటి సందులూ గొందుల మధ్య నడుచుకుంటూ వెడుతుంటే ఎంతో బాగుంటుంది. మధ్యాహ్న సమయాల్లో కూడా ఎండగా వున్నా, చల్లటి గాలి తగులుతుంటే నడవటానికి బాగుంటుంది. కాకపొతే అక్కడ వున్న కొన్ని సైన్ బోర్డులు గందరగోళంగా వుంటాయి. అక్కడ ఎవరినైనా అడగటం మంచిది.

venice1

మేము దిగిన హిల్టన్ హోటల్ చాల దూరంగా ఇంకొక ద్వీపం మీద వుంది. గమ్మత్తేమిటంటే, ఆ ద్వీపం వున్నదంతా మా హోటలే. హోటల్లోనించీ ఏవైపు బయటికి వచ్చినా నీళ్ళే. ముందు వైపున నీళ్ళల్లో మాత్రం హోటల్ వారి షటిల్ బస్సూ, టాక్సీలు ఆగటానికి నీళ్ళల్లోనే ఒక బస్టాపు. గ్రాండ్ దీవి నించి మేము హోటల్ వారి షటిల్ బస్ తీసుకుని, హోటలుకి వెళ్ళాం.

ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాల వున్నాయి. అన్నిటిలోకి ముఖ్యమైనది సైంట్ మార్క్స్ స్క్వేర్. దీన్ని ఇటాలియన్ భాషలో శాన్ మార్కో పియాజాజ్ అనికూడా అంటారు. వెనిస్ వచ్చిన ప్రతి యాత్రీకుడు చూడవలసిన ప్రదేశం ఇది. ఎంతో అందంగా కట్టిన కట్టడాలు. మూడు పక్కలా ఎన్నో రెస్టారెంట్లు, ఆరు బయట షామియానాలు, కొన్ని గొడుగులు. వాటి క్రింద జనం కబుర్లు చెప్పుకుంటూ, వచ్చే పోయేవాళ్ళని చూస్తూ, జలపుష్పాల పాస్టా తింటూ, కూర్చుని వుంటారు. ఎక్కడ చూసినా ఇటాలియన్ వైన్ సీసాలు. దాని పక్కనే సైంట్ మార్క్స్ బసీలికా చర్చి. చాల అందమైన కట్టడం. లోపలా, బయటా కూడా బాగుంటుంది. ఆ పియాజాజ్ మధ్యలో ఎన్నో పావురాలు, ఆహారం పడేస్తుంటే అక్కడే ఎగురుతూ ఇంకా ఎంతో అందాన్నిస్తాయి.

venice2

 

ఇక్కడ చీకటి పడేసరికీ అంతా మారిపోతుంది. ఎన్నో వేల లైట్లతో వెలిగిపోతుంటుంది. మూడు నాలుగు చోట్ల, కొంతమంది చిన్న స్టేజ్ మీద పియానో, వయోలిన్, చల్లో, డ్రమ్స్ మొదలైన వాయిద్యాలతో చెవులకి ఎంతో హాయిగా వుండే సంగీతం. కొన్ని చోట్ల ఇటాలియన్ భాషలో మధురమైన పాటలు కూడా పాడుతుంటారు. మేము రాత్రి భోజనానంతరం, ఎనిమిది గంటల నించీ పదకొండు గంటల దాకా అక్కడ తిరుగుతూనే వున్నాం.

venice3

 

అక్కడ చాలామంది బంగ్ల్లాదేశ్ వాళ్ళు లైట్లతో ఎగిరే బొమ్మ విమానాలు, వెలిగే మంత్రదండాలు మొదలైనవి అమ్ముతుంటారు. అవి కొనమని మన వెంటపడతారు కూడా.

మర్నాడు ఆ చుట్టుపక్కల, కొంచెం దూరంగానే వున్న మూడు నాలుగు దీవులకి, ఒక మోటార్ బోటులో టూర్ బుక్ చేసుకుని వెళ్ళాం. వాటిలో ముఖ్యంగా రెండు దీవుల గురించి చెబుతాను. ఒకదాని పేరు మురానో. ఇంకో దాని పేరు బురానో. మా టూర్ గైడ్ అమ్మాయి మురానో, బురానో అంటుంటే ఆ అమ్మాయిలాగానే అందంగా వున్నాయి ఆ మాటలు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇటాలియన్ కూడా అజంతా భాష (మాటలు అన్నీ అచ్చులతో అంతమవుతాయని) కనుక అలా అంటారు కానీ, రెండిటికీ ఆ ఒక్కటీ తప్ప వేరే సంబంధం ఏమీ లేదు. ఏ భాష అందం దానిదే అని నా అభిప్రాయం. నేను మాత్రం ఇటాలియన్ భాషని, తెలుగు ఆఫ్ ది వెస్ట్ అనే అంటాను!

మురానో దీవి గ్లాస్ పరిశ్రమకి ప్రసిద్ధి. ఇటాలియన్లు కేథలిక్ క్రిస్టియన్ మతస్తులు కనుక, వారి చర్చిలలో ఎన్నో రకాల గ్లాసు అద్దాలు, బొమ్మలూ, దీపాలు.. వాటిలో చాలావరకూ ఇక్కడే తయారవుతాయి. మనలాటి యాత్రీకుల కోసం, వాళ్ళు రకరకాల బొమ్మలు (గుఱ్ఱాలు, ఏనుగులు, నెమళ్ళు లాటివి), ప్లేట్లు, కప్పులు, పూల గుత్తులూ, కొవ్వొత్తులు పెట్టికునే స్టాండులు.. ఒకటేమిటి ఎన్నో రకాలవి చేస్తారు. అవి ఎలా ఊడుతూ తయారు చేస్తారో చెబుతూ మాకు ఒక చిన్న ప్రదర్శన కూడా ఇచ్చారు. అది ఎంతో కళాత్మకమైన, నైపుణ్యంతో కూడిన విద్య.

బురానో దీవిలో చూసేది, అక్కడ తరాల తరబడి నివసించే వారి సంస్కృతిని ప్రతిబింబించే భవనాలు, వారి దుస్తులూ, నగలూ మొదలైనవి చూడ ముచ్చటగా వుంటాయి. కొనుక్కునేవాళ్ళకి, ఎంత కప్పుకి అంత కాఫీ!

వెనిస్ వెళ్ళినవాళ్ళందరూ చేయవలసిన పని ఇంకొకటి వుంది. అదే ‘గండోలా’ బోటులో ‘లాహిరి లాహిరి’ విహారం. ఎనభై యూరోలు ఇస్తే దాదాపు నలభై ఐదు నిమిషాలు, మనల్ని ఆ చిన్న పడవలో సందుల గొందుల మధ్య తిప్పుతాడు. అప్పుడే నీళ్ళల్లో ఇళ్ళ ఎలా కడతారో తెలుసుకోవచ్చు. మా గండోలా అతను ఇటాలియన్ యాసలో ఇంగ్లీష్ బాగా మాట్లాడాడు. ఇండియా వెళ్లి ఆగ్రా, జైపూర్ చూసి వచ్చాడుట. మంచి జోకులు కూడా వేశాడు.

venice4

నేను అప్పుడు తెలుసుకున్నదేమిటంటే, నీళ్ళల్లో పూర్తిగా మునిగిన చెక్కలు, ఆక్సిజన్ తగలక పాడవవు. అదే చెక్క నీళ్ళలో బయట వుంటే త్వరగా పాడవుతుంది. అదీకాక నీళ్ళని తగులుతున్న ప్రతి భవనం మొదటి అంతస్తు ఖాళీగా వుంచుతారుట. మనుష్యులు వుండేది రెండు, మూడు, ఆ పైన అంతస్తులలో. ఈ గండోలా విహారం చేస్తున్నప్పుడే చూశాం, నీళ్ళ ఒడ్డునే కట్టిన స్కూళ్ళు, ఆసుపత్రులు, ఆఫీసులు. ఇక్కడ బస్టాపులు, టాక్సీ స్టాండులు కూడా నీళ్ళల్లో తేలుతూ వుంటాయి. మన ఒడ్డు వేపు నించీ ఎక్కి, రెండో పక్కన వున్న బస్సులు ఎక్కుతామన్నమాట! గండోలా విహారం వెన్నెల రాత్రులలో ఇంకా బాగుంటుంది.

ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో ముఖ్యమైనది గాలరీ డెల్ ఎకాడమియా. ఇక్కడ వెనీషియన్ చిత్రకారులు టిటియాన్, టింటరెట్టో మొదలైనవారి చిత్రాలు వున్నాయి.

మేమూ ఆరుబయట షామియానా క్రింద కూర్చుని పిజ్జాలు పాస్టా తిన్నాం. అమెరికాలో తినే ఇటాలియన్ పదార్దాలకీ, ఇటలీలో తినే వాటికీ చాల తేడా వుంది. అమెరికాలో ఇచ్చినన్ని కాయగూరలు ఇవ్వరు వాళ్ళు. చీజ్ మాత్రం ఎన్నో రకాలు. ఒకే పిజ్జా మీద నాలుగు, ఆరు రకాల చీజులు వేస్తారు.

దగ్గరుండి అన్నీ కనుక్కుని వడ్డించింది మాకు సోనియా.

పాత జేమ్స్ బాండ్ సినిమాలో, రోజర్ మూర్ రోజుల్లో అనుకుంటాను, ఒక సినిమాలో జేమ్స్ బాండుకి ఏ దేశంలో ఎక్కడ చూసినా అదే అమ్మాయి కనపడుతుంటుంది. అలాగే ఇటలీలో ఏ వూళ్ళోనయినా సరే, నాకు ఏ వెయిటర్ని చూసినా, ఆ అమ్మాయి పేరు సోనియా అయివుంటుందేమో అనిపించేది!

౦                 ౦                ౦

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)