మొయిలు నొగులు

savem3

అదంటే నాకు మక్కువ. పడి చచ్చిపోతాను దానికోసం. దానిమేను ఒక్కొక్కసారి కాటుక పసనుతో మెరిసిపోతుంటాది. ఇంకొక్కొక్కసారి సామనలుపుతో మినుకు తుంటాది. అప్పుడప్పుడూ తెల్లటి పొట్లపూవయి విరగబడతుంటాది. అది రానిదే దాని తోడు లేనిదే కునుకు పట్టదు నాకు. పగలంతా ఎక్కడికి పోతాదో తెలియదు, ఉమ్మడికాపురపు కొత్తపెళ్లికూతురిలాగా పగలంతా ఊరించి ఊరించి పొద్దుగూకినాక ఎంతో పొద్దుకు నా దగ్గరకు వస్తాది. అది వస్తానే ఆబగా అబ్బిళించుకొంటాను దానిని. అది చిన్నంగా నవ్వతా నన్ను విడిపించుకొంటాది. అన్నెనక నా తలను గీరతా ఏదో ఒక కతను ఎత్తుకొంటాది. నేను ఊఁ కొడతా ఊఁ కొడతా మరొక లోకానికి పొయ్యేస్తాను.

ఆపొద్దు ఎందుకో రవంత అలసటగా ఉన్నట్టు కనిపించింది. అలతో కలతో తెలియదు కానీ నాకు మటుకు కతను చెప్పలేదు, నోరే విప్పలేదు అది. బతిమాలగా బామాలగా
‘‘ఈపొద్దు నాకేమీ బాగలేదు బా, నువ్వే ఏదయినా కతను చెప్పు నేను వింటాను’’ అనింది.
‘‘నేనా? నాకేం వచ్చు!’’ అన్నాను అచ్చెరపోతా.
‘‘ఏదో ఒకటి చెప్పు. ఉల్లమేమీ మంచిగా లేదు’’ అనింది మళ్లా.
సుంతసేపు తలపోసినాను. గురుతుకొచ్చింది. ‘‘మా చిన్నారవ్వ కతను చెప్పేదా’’ అన్నాను.
‘‘చిన్నారవ్వా, ఎప్పుడూ ఈ పేరునైనా నాతో అన్లేదే నువ్వు. ఎవురబ్బా ఈయవ్వ’’ ఉవ్వాయిగా అడిగిందది.
‘‘మా అమ్మమ్మల్లో ఒకామె లే. ఊరికే చెప్పడం కాదు, పద బయిదేలు, నిన్ను మా చిన్నారవ్వ వాళ్ల ఊరికి తొడకొని పోతాను’’ అంటా రెక్క పట్టుకొని లేపినాను
దానిని.
‘‘ఇప్పుడా ఇంతపొద్దులోనా?’’ అనింది కోక కుచ్చిళ్లను సరుదుకొంటా అది.
‘‘అవును ఇప్పుడే, మళ్లా తెల్లారినాక కనపడవు నువ్వు’’ అని తొందరపెట్టినాను.
‘‘సరే పద’’ అంటా తొడరింది నన్ను.
‘‘చిన్నారవ్వ వాళ్ల ఊరిపేరు ఆదరం. చుట్టూ కొండల నడుమ, గుడ్లమీద గువ్వ మాదిరిగా ముడుక్కొని ఉంటాదా ఊరు. ఆ ఊరికి అల్లంత దవ్వున్నే సుగిలి సెల
కొండలమీద నుంచి దెమదెమ దూకతా ఉంటాది. ఆ సెలే పెద్దదయి కాళంగి ఏరు అవతాది.
పచ్చాపచ్చని అడువుల్ని అబ్బిళించుకొన్న పాలపిట్టంటి ఊరది’’ నేను చెప్తా ఉంటే నా మాటకన్నా ముందు దాని అడుగులు పడినాయి ఆదరం తట్టుకు.
మేము ఆదరానికి పొయ్యేతరికి చిన్నారవ్వోళ్ల ఇంటిముందర మంది గుమిగూడి ఉండారు. ఏవో ఏడుపులు వినిపిస్తా ఉండాయి. గబగబ ఇంటితట్టుకు అడుగులు
వేసినాము.
‘కొడుకా కనలేక కనలేక కంటినే కొడుకా
రొండు పొగుళ్లు రొండు రేత్రిళ్లు నెప్పులుపడి కంటినే కొడుకా
కలిపోసి కడిపెట్టి కడపమాను ఎత్తుకు సాకితినే కొడుకా
ఆ కూలిపొయిన ఎలుంగొడ్డు నిన్ను మట్టగించేసెనే కొడుకా
నిన్ను బొదులు అది నన్ను సంపుండకుడదా కొడుకా…’
గుండెలు బాదుకొని బాదుకొని ఏడస్తుండాది చిన్నారవ్వ. అవ్వ ఒళ్లో సోములు
మామ తల, ఎవురో చితక్కొట్టినట్టు ముక్కూమొకమూ బజ్జిబజ్జి అయిపొయుండాయి.
మామకు ఇంకొకతట్టు కూచోని నోరు కొట్టుకొంటా ఉండాది కిష్టవేణత్త. సోములుమామ మా చిన్నారవ్వ కొడుకు, ఆయనకు ఆలయి వచ్చినామే కిష్టవేణత్త.
మామ పీనిగ చూసేదానికి ఒగ్గాళంగా ఉండాది. ఒళ్లంతా నెత్తుటి గాయాలు, మొకమంతా చితికిపొయుండాది. గుడ్డలన్నీ పేలికలు పేలికలయి పొయుండాయి.
‘‘ఏంది బా ఇదీ, ఈ ఒగ్గాళాన్ని చూడలేకపోతుండాను. ఆయమ్మేనా మీ చిన్నారవ్వ.
అయ్యో ఈ ఈడులో ఆయమ్మకు ఎంత ఇక్కట్టు వచ్చింది’’ వలవల ఏడస్తా నాతో అనిందది. అది ఏడస్తుంటే నా చెంపలు తడిసిపొయినాయి.
‘‘మా సోములుమామ చనిపొయినప్పటి కతలేవే అది. పొరపాటున ఇక్కడ్నించి మొదులు పెట్టేసినాను. ఇంకొంచెం వెనక్కిపోదాం పద’’ అని దానికళ్లను తుడిచి ఎడంగా
తొడకొని పొయినాను.
బోదకప్పిన రెండుదూలాలపట్టు ఇల్లు చిన్నారవ్వ వాళ్లది. ఊరికి ఎడంగా నిలిచి, ఈడిచికొట్టే ఎండతరిలో చల్లంగా, ఎముకలు కొరికే మంచునాళ్లలో
వెచ్చంగా మనల్ని పొదుక్కొనే మట్టిగోడల గుడిసె అది. అందులోనే పరంటిల్లు, నట్టిల్లు అని రెండు అరలు, వంటకోసం బయట ఒక చుట్టుగుడిసె.
మేమిద్దరమూ తలాకిటిని దాటుకొని నట్టింట్లోకి పొయ్యేతరికి, నిట్టాడి పక్కన కూచుని అరిటినారతో మల్లెమొగ్గల్ని కడతా మనవడితో అరుట్లు కొడతా ఉండాది
చిన్నారవ్వ. మొగ్గల్ని జతలు జతలుగా పెట్టి అవ్వచేతికి అందిస్తా ఏదో అడగతా ఉండాడు ఆ మనవడు.
‘అవా అవా, మనూరికి ఆదరం అనే పేరంట ఎట్టొచ్చింది వా?’ అడిగినాడు మనవడు.
‘అంత అరగలి ఎవురికొచ్చి, నిన్నడిగినారు బంగారా?’ మల్లెమొగ్గలను ముడేస్తా నవ్వతా అనింది అవ్వ.
‘ఎవురో ఒకరు అడిగినార్లే, చెప్పువా’ చిరచిరమంటానే బతిమాలినాడు.
‘సరే చెప్తాను రా’ అంటా కట్టిన మల్లెమాలను పక్కనపెట్టి, మనవడిని ఒళ్లోకి లాక్కొంటా మొదులుపెట్టింది అవ్వ.
‘మనూరికి పరంటపక్కన ఉండాదే కొండ, ఆ కొండమీద జరిగే కత ఇది. ఏడాదేడాది వానతరి మొదులవతానే ఏడేడి మొయిళ్లన్నీ వచ్చి ఆ కొండమీద కూచుంటాయి.
మంచిచెబ్బరల్ని మాట్లాడుకొంటాయి. ఏ మొబ్బు ఏ పక్కకు పోవాల, ఏ మొయిలు ఏ దిక్కున కురవాల, ఏ మోడము ఏ చెరువును నింపాల అని తీరుమానానికి వచ్చేది ఆ
కొండమీదనే. మీసరలో వచ్చిన మొయిళ్లు మూలదాకా తరితరికీ ఒకతూరి కమ్ముకొంటాయి మనకొండను. అప్పుడు మనకొండ, వచ్చిన మొయిళ్లకంతా ఉడుకుడుగ్గా కూడొండి
పొరువు చేస్తాది. అందుకే వానతరిలో ఆ కొండ, పొయ్యిగడ్డమీది కూటికుండ మాదిరిగా పొగలు కక్కతా ఉంటాది. అట్ట వచ్చిన మొయిళ్లకంతా వండివార్చి
ఆదరంగా కడుపునింపే కొండ కాబట్టి మనకొండకు ఆదరం కొండ అని పేరు. ఆ కొండకింద ఉండాది కాబట్టే మనూరికి ఆదరం అని పేరొచ్చింది’
అవ్వ చెప్పిన ఊరికతను మనవడితోపాటు అది కూడా వినింది కదా. వినీ ‘‘అబ్బ, పులుగు మాటలయినా ఎంత అందంగా చెప్పిందబ్బా మీ చిన్నారవ్వ. అవునూ ఆ వింటా
ఉండే మనవడివి నువ్వే కదా’’ అని అడిగింది నన్ను.

‘‘అవును నేనే. చిన్నప్పటి నేనే ఆ మనవడిని’’ మారాడినాను. మారాడి ఊరుకోలేదు, మళ్లా మాటాడినాను దానితో ‘‘అవ్వ చెప్పింది పులుగు మాటలు కాదు,
నాకు తెలుసు. వానతరి పెట్టినాక ఏదో ఒకనాడు, ఊరంతా పడకలు పరుచుకొన్నాక, నడిరెయ్యిలో సడీసప్పుడు లేకుండా మెల్లంగా కొండమీదకు ఒరగతాది తెల్లమబ్బు
ఒకటి. దాని వెనకనే రెండు పిల్లమొయిళ్లు దిగతాయి. వాటి వెనకనే నాలుగు నల్లమోడాలు వాలతాయి. తెల్లారి ఊరు లేచేపొద్దుకి కొండ పొగలుకక్కతా ఉంటాది.
ఎన్నితూర్లు చూసుంటాను నేను. నా మాటమీద నమ్మకం లేకపోతే పోతన్నను అడుగుదువు పద’’
‘‘పోతన్న ఎవురు?’’ అది అడగతా ఉండంగానే మందిళ్ల తెరువులోనుంచి పోతన్న గొంతు వినపడిరది. ‘మొయిలా మొయిలా సల్లని మొయిలా/ ఒక్క పొయిలు కురవ
నొస్తివా, నల్ల మొయిలా…’ అంటా మొయిలు పదాన్ని ఎత్తుకొని ఉండాడు పోతన్న.
మేము బిరబిర మందిళ్ల తెరువుకు పొయినాము. పోతన్న పాడతానే ఉండాడు.
‘ఓ మామా, పదం మళ్లా పాడుదువు, ఈపొద్దు మేకల్ని ఏ తట్టుకు తోలతుండావో చెప్పు’ చిన్న మందిడి, దొడ్లోని పింటికల్ని తట్టకెత్తుకొని పొయి దిబ్బలో
పోస్తా అరిచి నాడు.
‘పోతాను పోతాను అల్లుడో, నసిగుండు దాటుకోని… కుసిబండ దాటుకోని…
కందిచేను పల్లాలకు పోతాను పోతాను అల్లుడో…’ పాటతోనే మారు పలికినాడు పోతన్న.
‘‘మా పోతన్నకు పదాలపోతన్న అని మారుపేరు. పొద్దు పుట్టేటప్పుడు పాటను సంకన యేసుకొన్నాడంటే, పొద్దు మునిగినాకనే దానిని దించేది’’ ఇచ్చుకొంటా దానితో
అన్నాను నేను.
‘‘అది సరే కానీ, ఇంతపొద్దులో పాటలేంది?’’ అడిగింది అది.
‘‘పిచ్చిపిల్లా, ఇంకా తెలియలేదా, వాళ్లకు పొద్దుపుట్టేసింది. వెలుగయింది
వాళ్లకు, మనకు కాదు. పొద్దుపుట్టినాక నువ్వు నాకంట పడవని ఎరగనా ఏంది.
అందుకే వాళ్లకు మట్టుకే పొద్దుపుట్టేటట్టు మోడి చేసినాను’’ చెప్పినాను దానితో.
‘‘నేనంటే నీకెంత అనుగురా అబ్బా’’ అంటా నన్ను అబ్బిళించుకొనింది అది. నేను మెల్లింగా విడిపించుకొని ‘‘సరే సరే, చిన్నమందిడి ఏందో చెప్తా ఉండాడు
విను’’ అన్నాను. అది కూడా నాతోపాటు చెవుల్ని నిగిడిచ్చింది.
‘ఓహోహో… ఈపొద్దు మామ బలే కుశాలగా ఉండాడు ఏందో కత’ నవ్వతా అన్నాడు చిన్నమందిడి.
‘అత్త ఊరికి పొయ్యుంటాది. మాపుకూడు సుగిలి చెంగమ్మ ఇంట్లోనేమో’ చిన్న మందిడి నవ్వును అందుకొంటా అన్నాడు గున్నాదుడు.
‘ఎవుర్రా ఆనా బట్టలు. మేమంటే అంత సులకాగా అయిపొయినామా. పొరకెత్తుకొని వచ్చినానంటే ఉంటాది కత’ ఇంట్లోనించే పోతన్న పెళ్లాము అరిచింది. ఆ అరుపును
విని నవ్వుకొంటానే దెబగుబ అక్కడ్నించి కదిలిపొయినారు వాళ్లు.
‘ఒసే బయిటికొచ్చి సూడే. కొండమీద మొయిళ్లు దిగి అరుట్లు పెట్టుకోని కూసోనుండాయి. ఈ ఏడాది మనూరి చెరువును నింపే మొయిలేదో కలిసి సూద్దాం
బయిటికి రా’ అన్నాడు పోతన్న, పెళ్లాంతో.
‘నువ్వు కానీ, నంగినారయ్యవు. మొయిళ్లు అరుట్లు పెట్టుకోనుండాయా లేదా అని నీతో అరుట్లు పెట్టుకొనేదానికి నాకేమీ పంగలేదా. ఇంకొంచెం సేపుటికి
ఆవురావురుమంటా వస్తావే, తట్టలోకి ముద్దెట్ట వస్తాది. బిన్నా పేడకళ్లు ఎత్తేసి కడుక్కోని రా. తినేసి గొడ్లను విప్పుకోని పోవాల కదా’ గయ్యిమనింది
ఇంట్లోనించే పోతన్న పెళ్లాం.
మేమిద్దరం కూడా నవ్వుకొంటా చిన్నారవ్వ దగ్గరకు పొయినాము.
‘అవా అవా, నేనుకూడా గొర్రెల్ని మేపేకి పోతాను వా’ అవ్వను గోజారతా ఉండాడు మనవడు.
‘నువ్వు దేనికి లేరా. మారుగోడు తోలుకొని పోతాడులే. పొగులు పొద్దుగూకులూ బీళ్లల్లో తిరిగితిరిగి పొద్దుపొయినాక ఇళ్లకు తిరుక్కొంటాయి గొర్రెలు.
వాటి వెనకాల పొయి దేనికి అగసాట్లు పడతావు’ అనింది చిన్నారవ్వ.
‘ఊఁ హూఁ, నేను పోతాను…’ అంటా కాళ్లను నేలకు కొడతా సినిగినాడు మనవడు.
‘పొయి రానీలే అత్తా. నాలుగుపనులూ నేర్చుకొంటేనే మంచిది. తోడుకు మారుగోడు ఉండాడు కదా’ అని అవ్వని సరిదింది కిష్టవేణత్త.
అత్త ఒత్తాసుతో అవ్వ దగ్గర మాట నెగ్గించుకొని, ఇచ్చుకొంటా గొర్రెలదొడ్డిలోకి దూరి, ‘మారన్నా, నేను కూడా వస్తుండా’ అన్నాడు
మారయ్యతో.
‘పద పద అబ్బోడా, పుల్లింగినాయనకుంట కాడ పరికిపొండ్లు బలిసిపొయి ఉండాయి. పెరికిస్తాను తిందువు పా’ అంటా దొడ్డి తడికను తీసి గొర్రెల్ని
బయటకి తోలినాడు మారయ్య.
అదే పొద్దుకు ఇలావంతుడి గొర్రెలు కూడా తెరువులోకి వచ్చినాయి. ఆ పక్కనించి చెంగన్న గొర్రెలూ దొడ్డిని దాటినాయి.
‘ఓ ఇలావంతు బావా, ఏ తట్టుకు తోలుకొని పోతుండావా?’ గొంతెత్తినాడు మారయ్య.
‘నేను చిప్పట్లదడికల్లా పోతుండాను, నువ్వెట్ట పోతుండావురా?’ ఎదురుగొంతును వినిపించినాడు బావ.
‘నేను కందిచేనుపల్లాల కాడ ఉండే మడిగుడ్ల దొనతట్టుకు పోతుండాను బావా, అబ్బోడు కూడా వస్తుండాడు నాతో’ మారయ్య గొంతు ఉలివింది.
ఎవురు ఏతట్టుకన్నా పోండి కానీ, పొరకలకుంట తట్టుకు మటుకు పోవద్దు. కుంట పక్కనుండే సీకిరాళ్ల గవిలో ఎలుంగొడ్డు చేరుండాదంట’ చెంగన్న అరిచి చెప్పి,
తన గొర్రెల్ని తెక్కణానికి మలేసుకొని పొయినాడు.
‘ఏడాదేడాదీ ఈ ఎలుంగొడ్లది పెద్ద రంపు అయిపోతా ఉండాదే’ గొణిగినాడు మారయ్య.
పోతన్న అప్పటికే గొడ్లను గమిడి దాటించినట్టు ఉండాడు. ఊరికి పరంటతట్టు నించి లేచింది పోతన్నపాట.
‘పోలుగా పోలుగా నల్లరెక్కల పోలుగా/ మలెయిరా నా ఎనుమునీ, మడినించి/
మలెయిరా నా ఎనుమునీ…’ పాటను వింటా ఆ తట్టుకు మల్లినాయి గొర్రెలు.
‘ఇస్సో… ఉయ్యో…’ అంటా గొర్రెల వెనకనే పరుగులు తీసిన మారయ్యా అబ్బోడూ, కందిచేను పల్లాలకాడకి పొయి నిలిచినారు. గొడ్లూ గొర్రెలూ ఆ పల్లాల్లో
మొలిచుండే పచ్చికసువును పరపరమని మేస్తా ఉంటే, పోతన్నా మారయ్యా అబ్బోడూ ముగ్గురూ ఒక గుంపెనమాను నీడలో కూచున్నారు. మేమిద్దరం కూడా వాళ్లకు
అందినంత దవ్వునే కూచున్నాము. పోతన్న మళ్లా పదాన్ని ఎత్తుకొన్నాడు.
‘పోతులన్నా దున్నపోతులన్నా, పోతులన్నా దున్నపోతులన్నా
ఊరుకుండేదొకటిరా ఊంగులాడేదొకటిరా
కాళ్ల సందుకు తీసుకొంటే కమ్ముకుండేదొకటిరా
పోతులన్నా దున్నపోతులన్నా, పోతులన్నా దున్నపోతులన్నా
ఊరుకుండేదావురా ఊంగులాడేది దూడరా
కాళ్ల సందుకు తీసుకొంటే కమ్ముకుండేది దుత్తరా
పోతులన్నా దున్నపోతులన్నా, పోతులన్నా దున్నపోతులన్నా
పెట్టుకుండేదొకటిరా పట్టుకుండేదొకటిరా
బట్టపైకెత్తుకొని కొట్టుకుండేదొకటిరా
పోతులన్నా దున్నపోతులన్నా, పోతులన్నా దున్నపోతులన్నా
పెట్టుకుండేది కొలిమిరా పట్టుకుండేది కారురా
బట్టపైకెత్తుకొని కొట్టుకుండేది సమిటిరా
పోతులన్నా దున్నపోతులన్నా, పోతులన్నా దున్నపోతులన్నా…’
‘‘చ, ఏందిబా ఆయనట్ట బూతుపాటలు పాడతుండాడా’’ సింగిలించుకొంటా అనిందది నాతో.
‘‘అవున్లేవే, మనవి సోకయిన పేట పుటకలు కదా, పల్లెసింగారం మనకు బూతు మాదిరిగానే వినబడతాదిలే’’ తిరిగి సింగిలించినాను నేను.
మా సింగిలింపుల్ని నెట్టుకొంటా ఇలావంతుడు వచ్చినాడు మేముండే మాను నీడకు.
‘ఏం బావో, చిప్పట్లదడికల్లా పోతానని చెప్పి, ఇట్ట తిరుక్కొన్నావేంది’ మారయ్య అడిగినాడు.
‘అట్నే పోదామని గంగినాయినికుంట దాకా పొయినా, అక్కడ ఎలుంగొడ్డు అడుగుజాడలు కనపడినాయి. ఎందుకులే ఇక్కట్టు అనుకొని ఇట్ట మలేసుకొని వచ్చినా’
చెప్పినాడు.
‘కొండమీదకి మొయిళ్లు దిగితే సాలు, పైనుండే ఎలుంగొడ్లన్నీ ఊరంచుకు చేరతా ఉండాయి. రొండుమూడేళ్లుగా ఇదొక పీడయిపొయింది మనకు’ పోతన్న గొణిగినాడు.
‘పైన మబ్బులకు జడిసి, కిందుండే గవుల్లో ముడుక్కోను వస్తుంటాయి. వస్తే వస్తాయి, మనకేమీ ఇక్కట్టు లేదు. మన తిండ్లు అవి తినేది లే, వాటి మేపులు
మనం మేసేది లే. వానలు కురిసే నాలుగునాళ్లూ ఉండేసి ఆనేక వాటి దోవన అయి పోతా ఉండినాయి. నిరుడు మొరుడునించే కదా ఉబద్దరవ వచ్చి పడిరది’ గాలిని
పొడుగ్గా వదలతా అన్నాడు ఇలావంతుడు.
‘అయినా బెమ్మంగారు చెప్పినట్టు కలిగ్గం కడాకు వచ్చినట్టు ఉండాది. లేకపోతే ఎలుంగొడ్లు ఏంది, ఆడోళ్లను పట్టుకొనిపొయి చెరిచి చంపేసేదేంది!’ అన్నాడు
ఇలావంతుడి మాటలకు వంతగా మారయ్య.
‘అన్ని ఎలుంగొడ్లూ అట్టెందుకు చేస్తాయి. అదేదో ఒకటి మటుకు మరిగుండాది. దాన్నిగాన మట్టగించేస్తే, ఇంక ఈ ఇక్కట్టే ఉండదు. పాపం ఆ మాలోళ్ల
బొసకమ్మి, ఎంత వయినమయిన బిడ్డ. కట్టెలకని అడివిలోకి పొయి ఆ ఎలుంగొడ్డు పాలయి పొయింది’ వెతపడతా అన్నాడు పోతన్న.
‘ఆ బోనుపల్లి నాయుళ్లపిల్ల మటుకూ, సక్కనిసుక్క కదా. అవ్వోళ్ల ఇంటికి సుట్టమయి వచ్చి, ఆ ఎలుంగొడ్డు ఎదాన పడిరదే’ అంగలార్చినాడు ఇలావంతుడు.
‘‘ఏందిబా వాళ్లు మాట్లాడుకొనేదీ. ఎలుంగొడ్డు ఆడోళ్లను ఎత్తుకొని పోతుండాదా?’’ అచ్చెరపోతా అడిగిందది.
‘‘ఊరికే ఎత్తుకొని పొయ్యేది కాదు, అడివిలోకి కట్టెకో కంపకో ఈతపండ్లకో మరటాకులకో పొయిన ఆడోళ్లను పట్టుకొని చెరిచి చంపేస్తుండాదంట. ఇప్పటికి
ముగ్గురు ఆడోళ్లు చచ్చిపొయినారు. అడివిని కాపుకాసేవాళ్లు కూడా ఏమీ చెయిలేక చేతులెత్తేసినారు’’ చెప్పినాను.
మేము మాట్లాడుకొంటా ఉండగానే, అబ్బోడు చడ్డీలో దోపుకొని వచ్చిన పిల్లగోయిని బయిటికి తీసి కూ కూ అని ఊదినాడు. పిల్లగోయి కూతకు అందరి
మాటలూ ఆగిపొయినాయి. గంగినాయినకుంట తావునుండే వెదురుపొదలో పుట్టిన పిల్లగోయి అది. పుట్టినప్పుడు అది ఉత్త వెదురుగోయి అంతే. పోతన్న చేత పడి
పిల్లగోయి అయి, అబ్బోడి పెదాలను తాకి పల్లాయిలు పలకతా ఉండాది.
‘అట్నేనా రా, పిల్లగోయిని ఊదేది?’ అంటా అబ్బోడి చేతిలోని పిల్లగోయిని అందుకొని తాను ఊదినాడు ఇలావంతు బావ. అది పిల్లగోయి పాడినట్టు లేదు.
గూట్లోని బెళవాయి కువకువమన్నట్టు ఉండాది. కట్టుకొచ్చిన పిక్కిలిగువ్వ పోతుగువ్వను పిలిచినట్టు ఉండాది. పచ్చముడ్డి కందిరీగ చెండుమల్లికి
జోలపాడినట్టు ఉండాది. ముంతమావిడి పండుకోసం మునెక్క కూతురు ముదిగారంగా ఏడిచినట్టు ఉండాది. గుబ్బలమానుమీద జోడు జీరంకులు గీపెట్టినట్టు ఉండాది.
పిల్లగోయిపాట సాగతా ఉండంగానే మడిగుడ్ల దొనకు వెనకతట్టు నించి వినిపించింది ఒక ఆడదాని బీతరపు అరుపు. ఇలావంతుడు పిల్లగోయిని నిలిపి దొనతట్టుకు
పరుగులు తీసినాడు. అతడి వెనకాల్నే పోతన్నా మారయ్యా అబ్బోడూ కూడా పరుగులు పెట్టినారు. మేమిద్దరం కూడా వాళ్లవెంట పడినాము.
మడిగుడ్లదొనను దాటుకొని పులికొట్టిన మద్దిమానుకు వెనకుండే అమడగుండ్ల కాడకి పొయి బెప్పరపొయి నిలిచిపొయినారు ఇలావంతుడూ పోతన్నా.
‘మారయ్యా నిలువు నిలువు, అబ్బోడిని తొడకోని రాబాక, దడుసుకొంటాడు’
ఇలావంతుడి గొంతు ఎగిసింది. ఆ మాటతో అబ్బోడిని లాక్కొని ఇవతలకు వచ్చేసినా మారయ్య. మేమిద్దరమూ వాళ్లను నెట్టుకొని ముందుకు పొయినాము. అమడగుండ్లకు నడాన ఒక ఆడామె పడుండాది. ఆమెకు ఒళ్లంతా గాట్లే, మొకం కవుసుముద్ద అయుండాది.
ఒంటిమీది కోక పీలికలు పీలికలుగా చీలిపొయుండాది. దూబలోనించి నెత్తురు కారతా ఉండాది. మా కళ్లెదురుగానే తనకలాడి తనకలాడి చచ్చిపొయింది ఆయమ్మ.
‘ఇలావంతా, మన పిడూరు చిన్రెడ్డి రొండో కోడలు రా. ఎలుంగొడ్డు పొట్టన పెట్టుకొనేసింది రా. బిన్నా ఊర్లోకి పొయి నలగర్నీ పిలుచుకొని రారా’ పోతన్న ఎలుగెత్తి ఏడిచినాడు.
‘‘ఏంబా, మీ చిన్నారవ్వ కతను చెప్తానని చెప్పి తొడకోనొచ్చి, ఇట్టాంటి ఒగ్గాళపు చావుల్ని చూపిస్తా ఉండావే. ఇదేనా మీ అవ్వకత. నావల్ల కాదు, పోదాం
పద బా’’ బోరుమనింది నా ఎదకు తలను ఆనిస్తా అది. నేను దానిని అట్నే పొదువుకొని వెనక్కి తిప్పుకొని వచ్చినాను. గుంపెనమాను కింద కూచోబెట్టి,
వీపు నిమిరి సమాళించినాను. కొంచెంసేపటికి తెప్పరిల్లింది అది.
‘‘ఇంత మెత్తనయితే ఎట్ట బతకతావే. సరే పద, ఇంకొంచెం, కొంచెమే కొంచెం, ఒక్క రెండేళ్లు వెనక్కి పొయి చిన్నారవ్వను పలకరించేసి పోదాము పా’’ అంటా
లేపినాను దానిని.
మేము చిన్నారవ్వవాళ్ల ఇంటికి పొయ్యేతరికి రెయ్యి సంగటిపొద్దు దాటిపొయుండాది. గొర్రెల కాడనించి మేము రెండేళ్లు వెనక్కి వచ్చేసుండాము. అబ్బోడికి
రెండు పిడచలు చేతిలో పెట్టి, ఆ అత్తాకోడళ్లు చెరొక పిడచను నోట్లో వేసుకొని, నట్టింట్లో కూచోనుండారు. అబ్బోడు అవ్వ ఒళ్లో కూచుని తూగితూగి
అక్కడ్నే పడి కునకతా ఉండాడు. మేమిద్దరం కూడా నట్టింట్లోకి పొయి,దడిపాలు కింద నిట్టాడికి ఆనుకొని కూచున్నాము.
‘అత్తా, ఈ పొద్దు మనూరి కొండమీదకి మొయిళ్లు దిగినాయి. నాకేందో బిత్తరగా ఉండాదత్తా’ అనింది కిష్టవేణమ్మ చిన్నారవ్వతో.
‘నేను కూడా అదే అనకొంటా ఉండానమ్మే. ఎప్పుడూ లేనిది వాడు ఇట్ట మారిపొయినాడు ఏందా అని. దేనికయినా మంచిది, నువ్వు పరంటింట్లోకి పొయి తలుపు
చిలుకేసుకో. వాడొస్తే నేను కూడేస్తాను లే’ అనింది చిన్నారవ్వ.
‘ఇప్పటికి రెండుతూర్లు అయిందత్తా. పడకగుట్టు పరంటిల్లు దాటకూడదు అంటారని మొదటితూరి నీతో చెప్పలేదు నేను. ఒళ్లంతా కొరికి, రక్కి, పచ్చిపుండు
చేసేస్తా ఉండాడు. మొయిళ్లు దిగినప్పుడే ఇట్ట చేస్తుండాడు. మొన్న పదినాళ్లప్పుడయితే నేను చచ్చిపొయినాను అనే అనుకొన్నా. ఇంతకుముందు ఇట్టంతా
చేసేది లేదు, ఇన్నెనక ఇన్నెనకనే ఇట్టయినాడు’ కళ్లనీళ్లు పెట్టుకొంటా అనింది కిష్టవేణమ్మ.
‘వీడి అబ్బకు కూడా పెళ్లయిన పదేళ్లకు ` ఇట్టాంటిదే కాదు కానీ, ఏదో ఎరగని నొగులు తగులుకొనింది. అప్పుడు వీడికి ఏడేళ్లో ఎనిమిదేళ్లో ఉంటాయి.
కొండమీదకు మొయిళ్లు దిగితే చాలు, ఆ పొద్దంతా ఉలుకూ పలుకూ లేకుండా కూడూనీళ్లూ మొగించేసి మింటికల్లా చూస్తా ఉండేవాడు. కూటికి పిలిస్తే కూడా
కొట్టడానికి వచ్చేవాడు. అట్ట నాలుగేళ్లు ఏగినా ఆయనతో. అన్నెనక ఒకనాడు మోడాలు ఉరిమేటప్పుడు ఒంటిగా చీకలబయలుకు పొయి మర్రిమాను కింద కూచున్నాడు.
మన మారుగోడి చిన్నాయన అంకయ్య, గొర్రెల్ని మలేసుకొని వస్తా ఆయన్ని చూసి ఇంటికిపోదాం రమ్మంటే కొట్టేదానికి పైపైకి వచ్చినాడంట. అంకయ్య తనపాటికి
తాను తిరుక్కొన్నాడు. ఆ మర్రిమానుమీదనే పిడుగుపడి మానూ మీ మామా ఉరువులేకుండా మాడిపోయె. మీసకట్టు కూడా మొలవని కొడుకుని నా ఎదాన తోసి ఆయన
దోవ ఆయన చూసు కొన్నాడు. ఇప్పుడు వీడికి కూడా అట్టాంటి మొయిలు నొగులే ఏదో తగులుకోనుండాది. వీడి అబ్బే మేలు. మొయిళ్లు దిగినప్పుడు
కిక్కిరిమిక్కిరిమనకుండా ఉండేవాడు. వీడేంది ఇట్ట కొరికి పెడతుండాడే.
మొన్న పదినాళ్లప్పుడు నీ ఒంటిని చూసి నాకే బిత్తర పుట్టిందమ్మే.
కాపుగుట్టు కడప దాటకూడదు అంటారు, వీడిని ఏ ఊరికి తొడకొనిపొయి ఏ వైదిగుడికి చూపించాలనో. అట్ట తొడకొని పొయేదానికి వీడు పసిబిడ్డ కాదే’
నిట్టూరస్తా పాత పురండమంతా కోడలిముందు విప్పింది చిన్నారవ్వ.
వాళ్లిద్దురూ మాట్లాడుకొంటా ఉండంగానే తలాకిటి తలుపును మెల్లింగా తోసుకొని లోపలికొచ్చినాడు సోములు మామ. అంత గబాన వస్తాడు అనుకోని ఆ అత్తా
కోడళ్లు బెప్పరపొయినారు. సోములు కళ్లు చింతనిప్పుల మాదిరిగా ఎర్రంగా మెరస్తా ఉండాయి. అదొకమాదిరిగా ఏదో లోకాన ఉన్నెట్టు,
ఇక్కడెవరు ఉండారో పట్టనట్టు ఉండాడు.
చిన్నారవ్వ కలమేలుకొని, కోడలిని పరంటింట్లోకి పొమ్మని సైగ చేస్తా ‘రేయ్‌ కూడు తిందువురా, చల్లారిపోతుండాది’ అని పిలిచింది. మాట్లాడకుండా వచ్చి
పీటమీద కూచున్నాడు. ఒళ్లో కునకతుండే మనవడిని పక్కన పండబెట్టి, తట్టను తెచ్చి కొడుకు ముందు పెట్టింది చిన్నారవ్వ.
‘ఏమి నువ్వేస్తుండావా, అదేడకి పొయిందా’ ఉరిమినట్టు అడిగినాడు. అప్పటికే కిష్టవేణమ్మ పరంటింట్లోకి పొయి తలుపుచిలుకు పెట్టుకొనేసుండాది.
‘ఆయమ్మికి తలకాయ నొప్పిగా ఉండాదంట. పొయి పణుకొనేసింది. నేను పెడతాను, తినేసి ఈడ్నే పణుకో’ అంటా తట్టలో కూడుపెట్టింది చిన్నారవ్వ.
తట్టను విసిరికొడతా లేచినాడు సోములు. అంతెత్తుకు ఎగిరి కిందపడిన కంచుతట్ట లబలబలబ నోరుకొట్టుకొనింది. ఆ ఉలివుకు ఉలిక్కిపడి లేచినాడు అబ్బోడు. ఏం
జరగతుండాదో తెలవక వెలవరపొయి కూచోనుండాడు. కూటితట్టను కొట్టిన సోములు విరవిర పరంటింటి తట్టుకు పొయి దెబదెబ తలుపును బాదినాడు. అడ్డంపొయిన
చిన్నారవ్వను ఒక్క తోపు తోసినాడు. విసురుకొని పొయి నిట్టాడి మీద పడిరది ఆయమ్మ. నుదుటికి నిట్టాడి కొట్టుకొని బొటబొట నెత్తురు కారతా ఉండాది.
‘‘ఏంబా చూస్తా కూచోనుండావా. పొయి ఆయమ్మని లేపి, మీ సోములు మామని ఇవతలికి లాగు పోబా’’ చివక్కన పైకి లేస్తా అనిందది.
నేను విసవతా ‘‘కూచోవే, ఎప్పుడో నడిచిపొయిన కత అది. నేను లేచి అవ్వ దగ్గరకు పోతా ఉండాను చూడు’’ అన్నాను దానితో.
అబ్బోడు బిత్తరపొయి ‘అవా…’ అంటా పరిగెత్తినాడు చిన్నారవ్వతట్టుకు. అవ్వ పైకిలేచి కారతుండే నెత్తురుని అరచేత్తో తుడుచుకొని, అబ్బోడి తట్టు
చూస్తా ‘అబ్బోడా మీమామకు దెయ్యం పట్టింది. నువ్వు చుట్టింట్లోకి పో, నేను దెయ్యాన్ని వదలగొట్టి వస్తా’ అనింది యెరకల్ని యేలుముడి వేసుకొంటా.
అబ్బోడు చుట్టింట్లోకి పోకుండా నట్టింట్లోనే బిక్కుబిక్కుమంటా ఒక మూలన నక్కినాడు.
‘మేయ్‌ చిలుకు తీస్తావా, తలుపును యిరగ్గొట్టమంటావా’ అంటా తలుపును బాదతుండాడు సోములు. అవ్వ చివక్కన పొయి మూలనుండే గొడ్డలిని ఎత్తుకొని
సివంగిమాదిరిగా కొడుకుమీదకి దూకింది.
‘రేయ్‌, గుట్టుగా బయిటికి పో, లేదంటే కొడుకువని కూడా చూడను. ఒకే యేటుకి నీ తలకాయని ఎగరగొట్టేస్తా. తుమ్మమాకుల్ని నరికిన చేతులియ్యి’ అని అరి
చింది. ఆ మాటతో రవంతసేపు కలుబారి నిలబడిపొయినాడు సోములు. ఆనేక తేరుకొని చివక్కన తిరుక్కొని బయటకి పొయ్యేసినాడు.
‘‘ఇంక మనగ్గూడా ఇక్కడ పనేమీ లేదు పదవే’’ అంటా లేచినాను నేను.
‘‘ఏందిబా, మీ సోములుమామ ఎట్ట పొయినాడో. మీ చిన్నారవ్వా కిష్టవేణత్తల నిలవరం ఏందో, ఆ అబ్బోడికి ` అదే నీకు ` అన్నెనక ఏమయిందో ఏమీ తెలుసు
కోకుండానే పోదామంటా ఉండావే’’ నా వెనకనే అడుగులు వేస్తా అనిందది.
‘‘అయ్యేది ఏముండాదివే. అబ్బోడికి బెదురువేకి తగిలి నాలుగునాళ్లు కాచి చల్లారింది. చీకట్లోకి వెలిబారిపొయిన సోములుమామ మన్నాడు మాపటేళకు ఇల్లు
చేరినాడు. అంతరికే కొండ వండిపెట్టిన కూటిని తినేసి మొయిళ్లు ఎగిరిపొయినాయి. సోములుమామ కుదురుగా ఇంటికి వచ్చిననాటి తెల్లవారి అంబళ్ల
పొద్దుకు, అడివిలో మాలోళ్ల బొసకమ్మిని ఎలుంగొడ్డు చెరిచి చంపేసింది.
అన్నెనక ఇంకొక ఏడాది లోపల మొయిళ్లతరిలో ఇంకొక రెండు ఆడ ఊపిర్లు ఎలుంగొడ్డుకు గావు అయిపొయి నాయి’’ చెప్పినాను.
‘‘అంటే ఏందిబా నువ్వు చెప్పేది, మీ సోములు మామేనా ఆ ఎలుంగొడ్డూ?’’ అడిగిందది.
‘‘ఎరగం వే. నాక్కూడా తెలియదు. నువ్వే విందువు పద’’ అంటా కొన్నాళ్లు ముందుకు నడిపించినాను దానిని.
మింట చిందిన జొన్నబొరుగుల్ని పిల్లలకి తినిపిస్తా ఉండాది పిల్లలకోడి.
ఆకలికో అలమటకో గుడ్లగూబ ఒకటి కొండంచు గుబురుల్లో మూలగతా ఉండాది. మందిళ్ల తెరువులోని ముసిలికుక్కకు ఏమి కనపడిరదో ఓ… అని ఏడుపు ఊళలు తీస్తా
ఉండాది.
ఇంట్లో చిన్నారవ్వా సోములుమామా ఇద్దరే ఉండారు. కిష్టవేణత్త పుట్టినింటికి పొయ్యేసింది. అమ్మ ఒళ్లో పణుకోనుండాడు కొడుకు. చెట్టంత కొడుకు కారస్తుండే
కడవల కన్నీళ్లకు అమ్మ ఒడి తడిసి ముద్దవతా ఉండాది.
‘నన్ను ఏం చెయ్యమంటావు మా. మొయిళ్లు కొండమీదకు దిగితే చాలు, ఏదో ఉమాదం వచ్చి నన్ను చుట్టుకొంటా ఉండాది. అప్పుడు నేనేమి చేస్తా ఉండాననేది నాకు
తెలవకుండానే జరిగిపోతా ఉండాది. అట్టని బొత్తిగా తెలవకుండానే ఉండాదా అంటే తెలస్తానే ఉండాది. తప్పని తెలస్తా కూడా నిలుపుకోలేక
పోతుండా. అప్పుటికీ తిరపతి రొయ్యాసుపత్రిలో చూపించుకొన్నా. పట్నానికి పొయి జెల్లాసుపత్రిలో పదినాళ్లు ఉండివచ్చినా. కసుమూరు దర్గాలో మూడు
నిదర్లు చేసినా. కనపడిన సామికంతా మొక్కినా. ఇంకేమి చేసేది మా’ ఎక్కిళ్లు పెడతా అమ్మను అడగుతుండాడు సోములుమామ.
కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు చిన్నారవ్వ. అన్నెనక గట్టిగా ఊపిరొదిలి నోరిప్పింది. ‘చచ్చిపో కొడుకా. ఏంది అమ్మ ఇట్ట అంటుండాదే అనుకోబాక.
నువ్వు ఏ పుటకలో చేసుకొన్న పాపమో ఇట్ట తగులుకొనింది నిన్ను. ఎట్టన్నా దూరం పొయి బతుకు నాయినా అందామనుకొంటే, మందిలేని చోటు ఏది చెప్పు. నీ కింద
ఇంక నాలుగు ఆడ ఉసుర్లు నలిగిపొయేదానికంటే నువ్వు చచ్చిపొయ్యేదే మేలు కొడుకా. రొండు పొగుళ్లూ రొండు రేత్రిళ్లూ నెప్పులు పడి కన్నాను నిన్ను. ఆ
కడుపుకోత కంటే ఈ గుండెకోతే పెద్దదిగా ఉండాది. నాకంట పడకుండా ఎడంగా పొయి చచ్చిపో కొడుకా..’ అమ్మాకొడుకులు ఇద్దరూ ఆ రెయ్యి ఎంతసేపు అట్ట
ఏడ్చుకొన్నారో తెలియదు. అదికూడా గుండెలు కరిగేటట్టు ఎక్కిళ్లు పెట్టి ఏడిచింది. దాని ఏడుపును
నేను చూడలేకపొయినాను. ‘‘వినిన కత చాల్లేవే, పద మనింటికి మనం పోదాం’’ అన్నాను అలమటగా. ఆ మాటతో అది కళ్లు తుడుచుకొనింది. ఏడుపును నిలిపింది.
‘‘అన్నెనక ఏమయింది బా, మీ సోములుమామ ఎట్ట చచ్చిపొయినాడు?’’ అడిగింది అది.
‘‘ఇంకా నీకు ఈ కతను వినాలనుందా వే. సరే కానీ విను. ఆ రెయ్యి అమ్మా కొడుకులు ఏడుచుకొన్నాక ఇరవయినాళ్లు గడిచినాయి. పుట్టినింటికి పొయుండిన
కిష్టవేణమ్మ తిరిగి వచ్చుండాది. అబ్బోడు కూడా ఎండతరి సెలవలకు ఆయవ్వవాళ్ల ఊరూ ఈయవ్వవాళ్ల ఊరూ తిరుక్కొని కడాన ఆదరానికి వచ్చుండాడు. ఎప్పుడూ మీసర
కడానో ఆదర మొదటనో వచ్చే మొయిళ్లు ఆ ఏడాది మీసర పెట్టీపెట్టకముందే వచ్చేసినాయి. ఆపొద్దు రెయ్యి నడిజాము దాటినాక, కోళ్లను పట్టడానికి వచ్చే
జంగుబిల్లి మాదిరిగా సడీసప్పుడూ లేకుండా సల్లంగా కొండమీదకు దిగినాయి మోడాలు. అదే పొద్దుకు సోములుమామ లేచి ఊరిని వదిలి కొండపక్కకు
వెలిబారిపొయినాడు. పొద్దన్నే అవ్వని బతిమాలుకొని మారయ్యతో కలిసి గొర్రెల వెనకాలనే కందిచేను పల్లాల కాడకి పొయినాడు అబ్బోడు’’
‘‘ఇందాక మనం అక్కడినించే కదబా వచ్చిందీ?’’ అనిందది.
‘‘అవును, మళ్లా అక్కడికే పోవాల పద’’ అంటా పల్లాల తట్టుకు దోవతీసినాను.
‘ఇలావంతా, మన పిడూరు చిన్రెడ్డి రొండో కోడలు రా. ఎలుంగొడ్డు పొట్టన పెట్టుకొనేసిందిరా. బిన్నా ఊర్లోకి పొయి నలగర్నీ పిలుచుకొని రారా’ పోతన్న
ఎలుగెత్తి ఏడిచినాడు.
మరికొంచెం సేపటికి ఊరు ఊరంతా అమడగుండ్లకాడ గుమిగూడిరది. పీనిగయి పడుండే కోడల్ని చూసి, చిన్రెడ్డి ఇంట్లోవాళ్లు గుండెలు బాదుకొంటా ఉండారు.
‘ఇంకెందుర్ని గావు తీసుకొంటాదో అది. మనూరికి పీడయి దాపరించిందే’ ఏడుపుగొంతుతో అన్నాడు పోతన్న.
‘ఏదో ఒకటి చేసి దాన్ని మట్టగించకపోతే ఎట్ట, ఊరు వల్లకాడయి పోదా’ అన్నాడు మారయ్య.
‘మనమేమి చెయ్యగలము, గుంటికోవుల్ని చేతపట్టుకోనుండే కావిలోళ్లే ఏమీ చెయిలేక పోతుంటే’ అంగలారస్తా అన్నాడు ఇలావంతు బావ. ఇట్ట తలా ఒక మాట
మాట్లాడతా ఉండారు.
‘అట్టని గమ్మన్నే ఉండిపోదామా. అడివిలోకి పొయి గాలించయినా సరే దానిని చంపి తీరాల. ఈపొద్దు అదో నేనో తేలిపోవాల’ అంటా అప్పుడే గుంపులోకి వచ్చినాడు
సోములుమామ.
ఆ మాటతో ఊర్లోని మగోళ్లు పదిమందీ బరిసలూ కత్తవలూ ఎత్తుకొని జతలు జతలుగా చీలి, అడివిలోకి దూరినారు ఎలుంగొడ్డును వెతుక్కొంటా. సోములుమామా మారయ్యా
కలిసి ఒక తట్టుకు పొయినారు. మేమిద్దరమూ వాళ్ల వెనకాలనే పొయినాము. వాళ్లు కొండపైకి ఎక్కతా ఉండారు. నడికొండమీదకు పొయినాక, ఒక దగ్గర నేలను చూస్తా
ఆగినాడు మారయ్య.
‘‘సోములయ్యా, ఇయిగో ఎలుంగొడ్డు అడుగుజాడలు. ఇదే దోవన ఇంతకుముందే పొయినట్టు ఉండాది’ అన్నాడు జాడలను చూపిస్తా మారయ్య. అవునన్నట్టు తలూపి
నాడు సోములుమామ. ఇద్దరూ ఆ జాడల్ని గమనిస్తా పదిబారలు ముందుకు పొయి నిలిచినారు. అక్కడ జవురురాళ్లు ఉడ్డపోసినట్టు ఉండాయి. ఆ రాళ్లమీద జాడలు
కనబడవు. దోవ కూడా కుడిఎడమలుగా చీలి ఉండాది అక్కడ.
‘మారా, ఇక్కడ్నించీ నువ్వు జవురురాళ్ల దోవన్నే పొయి అట్ట తిరుక్కొనిరా. నేను పెద్దజర్తి దోవన ఈతట్టునుంచి వస్తాను. ఈ నడుములోనే దొరికిపోవాల
మనకు. కనబడిరదంటే జంకకుండా ఒకే పోటు పొడువు’ అంటా మారయ్యను కుడిదోవన పంపించి, ఎడమపక్కకు తిరిగినాడు మామ.
‘‘పెద్దజర్తి దోవలో బలే మెలపుగా నడవాల. కాలు జారిందంటే ఎముక కూడా మిగలదు. బజ్జయిపోతాము. చూసి నడువు’’ దానితో అంటా, మామ పొయిన దోవలోనే అడుగులు
పెట్టినాను. నన్నంటుకొని నాతోకలాగా నడస్తా ఉండాది అది. సోములుమామ ఆ దోవన ఒడుపుగా నడిచి విరవిరా పోతుండాడు. మేము పలకల పేటుకాడకి
పొయేతరికే ఆయన కరక్కాయ నెత్తిని దాటి మలుపు తిరగతా ఉండాడు. ఆయనకీ మాకు ఇన్నూరు మున్నూరు బారల ఎడం పెరిగింది. మేము కరక్కాయ నెత్తిని దాటి మలుపు తిరిగి నిలబడినాము. సోములు మామ కనబడలేదు మాకు. ఎట్ట పొయినాడా అనుకొంటా అక్కడ్నే నిలిచి చూస్తా ఉండాము.
కొలిగమాను గవిలో నించి సోములుమామ చావు అరుపు బయటకొచ్చింది. బీతరపు కేకలు పెడతానే ఉండాడు. నేను గబగబ గవితట్టుకు కదలబొయినాను. బిత్తరతో నన్ను
అబ్బిళించుకొని వదల్లేదు అది. దానిని వదిలించుకొనే లోపల, సోములు మామ అరస్తా గవి బయటకి పరిగెత్తుకొచ్చినాడు. ఆయన గుడ్డలన్నీ పీలికలు పీలికలు
అయిపొయుండాయి. మొకమంతా కవుసుముద్దయి ఉండాది. ఒళ్లంతా నెత్తురు మండలంగా ఉండాది. పరిగెత్తుకొచ్చిన ఆయన కాలు జర్తిమీద పడి జారింది. అంతే, లోయలోకి
జారిపొయినాడు. ‘సస్తినిరా మారా’ అనే ఒగ్గాళపు కేక లోయలోనుంచి పైకొచ్చి కొండను తాకి నిలిచింది.
‘‘అబా ఏంది బా ఈ గోరమా’’ నోరు కొట్టుకొంటా అనిందది. నేను దానిని అబ్బిళించి పొదువుకొన్నాను. మేము కలుబారిపొయి అట్నే ఉండిపొయినాము
చానాసేపు. నేనే ముందుగా తెపరాయించుకొని దానిని నడిపించుకొంటా కొండదిగి వచ్చినాను.
‘‘ఏంబా సోములుమామని చంపేసింది ఎవురు బా’’ వెక్కతా అడిగిందది.
‘‘ఎరగం వే, నేనూ నీ మాదిర గవికి బయట్నే ఉండిపొయినాను కదా. ఎలుంగొడ్లలో
మదంపట్టిన మగవే కాదు, కడుపు రగిలిన ఆడవి కూడా ఉంటాయివే’’ మారాడినాను.
నేనూ ఆ చీకటిపిల్లా ఆదరం గమిడిని దాటి, తిరుక్కొని పోతా ఉంటే, వెనకాల నించి చిన్నారవ్వ ఏడుపు పాట వినిపించింది.
‘కొడుకా కనలేక కనలేక కంటినే కొడుకా
రొండు పొగుళ్లూ రొండు రేత్రిళ్లూ నెప్పులుపడి కంటినే కొడుకా
కలిపోసి కడిపెట్టి కడపమాను ఎత్తుకు సాకితినే కొడుకా
ఆ కూలిపొయిన ఎలుంగొడ్డు నిన్ను మట్టగించేసెనే కొడుకా
నిన్ను బొదులు అది నన్ను సంపుండకుడదా కొడుకా..
అక్టోబరు 2014

Download PDF

11 Comments

  • జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి. says:

    కథ చెప్పడంలో మీ ఒడుపు మీకే స్వంతం. మీరు కథని చెప్పరు. చూపిస్తారు. పాఠకుడిని వేలు పట్టుకొని మీ వెంట నడిపించుకు వెళతారు. ఎక్కడా తప్పటడుగులు ఉండవు. ఒక్కొక్క దృశ్యాన్నీ కళ్ళముందు ఆవిష్కరిస్తారు. ఆయా దృశ్యాల మధ్య లంకెలు చాలా బలంగా ఉంటాయి. ఎక్కడా తోత్రుపడరు. ఎక్కడా కుతూహలాన్ని సడలనివ్వరు. ఇవన్నీ చూస్తూంటే నాకు ఒకప్పటి కన్నడ జానపద కథన శైలి గుర్తొస్తుంది. ప్రకాష్ రై నటించిన నాగ మండల చూస్తున్నప్పుడు కలిగిన ఒకానొక అద్భుతమైన బీభత్స రస ప్రవాహం మళ్ళీ ఈ కథలో కదం తొక్కింది.
    అది ఆగిన చొట ఒక వేకువ పొడ చూపుతుంది.
    పాఠకుడిని సంభ్రమాశ్చర్యాలలో ఓలలాడించే మీ ఒడుపు మీకే స్వంతం.
    జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి.

  • ari sitaramayya says:

    కథ అల్లటం చాలా బాగుంది. అభినందనలు.

  • జీవితాలలో జరిగే సంక్లిష్ట సంఘటనలకు భాష్యం గోప్యంగా చెప్పి ఒప్పించటం రమేశు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఈ కధలో విషయాన్ని చెప్పి ఒప్పించటం ఇంతకంటే ఎవరు చేయ లేరేమో?

  • నిశీధి says:

    మంచి కథ , నైపుణ్యం తో అల్లిన అల్లిక .

  • S. Narayanaswamy says:

    అద్భుతం. మీకో నూరు దణ్ణాలు!

  • మరోక ఊహాలోకం ఆదరం లోకి తీసుకువెళ్ళిపొయ్యాడు రమేష్. ఈ కథతో.

    ఈ కథలో పాట వింటుంటే నెల్లూరు ప్రభవ లో కథ 2013 అవిష్కరణ సభానంతరం రమేష్ పాడిన పాట గుర్తు వచ్చింది. ప్రభవలో చిన్నారులకోసం చంద్రలత ప్రత్యేకంగా నిర్మించిన పాక (ఠ)శాలలో కూర్చున్నప్పుడు పాడిన పాట ఇది. పాకలో చీకటి. బయటంతా వెన్నెల. ఆ వెన్నలలో స.వెం రమేష్ పాట.ఇదిగో ఇక్కడే వినండి. అదనంగా మీకు ఇక్కడే భగవంతం పాడిన పాటకూడ వినొచ్చు. ముందు భగవంతం పాట. తరువాత స. వెం రమేష్ గీతం.
    http://www.spreaker.com/user/anil/bhagavanthamaandsa-vem-రామేశ్సిన్గాలోంగ్
    ఇంకా ఆదరం పరిసరారలోనే తచ్చాడుతోంది మనసు..

  • ns murty says:

    అద్భుతం రమేశ్ గారూ. కథనం చాలా ఉత్కంఠతో సాగింది. కథ ప్రారంభించిన చోటే ముగించడం … ఈ ఆవృతి బాగా నచ్చింది. అభివాదములు.

  • One of the best i have read in recent times. No comments…only hats off to Ramesh garu. Thanks to saaranga for bringing such wonderful stories to our mouse clicks.

  • Krishnapriya says:

    చప్పట్లు! వాడిన చ(చి)క్కని భాషకి, కథని నడిపి౦చిన తీరుకి, కథావస్తువుకి, అన్ని౦టికీ టోకుగా..
    బ్రేవో..

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)