అనాది సంభాషణా రూపకం ఆమె!

drushya drushyam-54

ఒకానొక దృశ్యం మనం దైనందిన జీవితంలో ఇమిడిపోయి, అదృశ్యంగా ఉండిపోయిన జీవన ఖండికను మళ్లీ యాది చేస్తుంది. టీకాతాత్పర్యాలు కోరుతుంది. వ్యాఖ్యాన సహిత ప్రవచనం డిమాండ్ చేస్తుంది.

మరొక దృశ్యం ఏమీ చెప్పదు.
రంగులతో మెరుస్తుంది. సుహాసినిగా దర్శనం ఇస్తుంది.
ముక్కెరలా మెరుస్తుంది. గంతే.

అది కిరసనాయిల్ స్టవ్ లేదా బ్యాచిలర్ స్టవ్.
ఇక్కడైతే అది స్టవ్ కాదు. చిన్న ఇడ్లీ బండీ నడిపే ఆమె జీవన సమరం.

కానీ, కాదు.
ఆమె పోస్తున్నది కిరసనాయిలూ కాదు.

ప్రేమ. అభిమానం.
తల్లి ఆమె. భార్య ఆమె. ప్రేయసి ఆమె. స్నేహిత ఆమె.
వదిన, మరదలు. పిల్ల. మనిషి.

నీకూ నాకూ మధ్య ఏ గోడలు లేని, మరే ప్రవర్తనా నియమాలు అడ్డురాని, ఏకైక మాధ్యమంలో ఆమె ఒక నిండు మనిషి. మొబైల్ సంభాషణ వినాల్సిన అవసరం లేదు. ఆమె నిఖార్సయిన ఇండివిడ్యువల్.

లైఫ్.

అలవోకగా చెవికి మొబైల్ ఆనించుకుని స్టవ్ లో కిరసనాయిలు పోస్తున్నఆమె ‘నీ- నా’ కాదు.
తన.

మమత. సమత. దయ. అనురాగ పారవశ్యం.
జీవన లాలస.

పోక రంగు. నీలి రంగు.
ఆకుపచ్చ. నలుపు తెలుపు.
ఆఖరికి మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీవనచ్ఛాయ.

+++

ఒక దరహాసం.
సంభాషణ. దృశ్యాదృశ్యం.

ఆమెను చూశారా?
మళ్లీ మళ్లీ చూశారా?

నేను చూశాను.
వందలు వేల చిత్రాలు తీసి చూశాను.

సంభాషణలో ఆమె సాధించేది, సామకూర్చుకునేది, పొందేది ఎంతో.
చిత్రం వాస్తవం.

అమె ఇప్పుడు పరధ్యానంలో లేదు.
ధ్యాసతోనే రెండు పనులూ చేస్తోంది.

సముఖం.
స్వయంవరం.

+++

జీవన వ్యాపకాల్లో ఇప్పుడు ఆమె ఆమెనే కాదు, అతడు అతడే కాదు, వారు వారే కాదు.
మనిషి ఇప్పుడు ఏకవచనం కానేకాదు. నిజం. మనిషిప్పుడు సహవాసి.

ఎవరి జీవన వ్యాపకాల్లో వారు ఎంత నిమగ్నమైనప్పటికీ, మరెంత ఒత్తిడిలో ఉన్నాగానీ
మనిషి మరొక మనిషి సన్నిధిలో ఉండటం ఇప్పటి దృశ్యం. దృశ్యాదృశ్యం.

+++

ఆమె సామాన్యురాలే.
తనది సామాన్యమైన సంభాషణే అనుకుంటాం.

కానీ, సరసం, పరిహాసం.
సహృదయత, సౌశీల్యం.
సమర్థన, ప్రోత్సహాం.
కోపం, తాపం. ఇంకా ఎన్నో.

మాట్లాడి చూడండి.
మీరు ఎరిగిన మనిషి మీకెంత కొత్తగా అర్థమౌతాడో, లేదా అర్థం చేయిస్తుందో.

తన.
తనతో  మాట్లాడారా?- అదే సంభాషణలోని సౌలభ్యం.
మొబైల్ ఇప్పుడు మానవ సంబంధాలని మానవీయం చేస్తున్న అపురూన వైనం.

ఆమె రంగులు చూడండి. ముక్కెర మెరవడం చూడండి.
పనిలో ఉంది. పాటలోనూ ఉంది.ఏదీ ఆగదు.
జీవితాన్ని క్షణం క్షణం అనుభవంలో వుంచుకోవడం ఒక్క స్త్రీతోనే సాధ్యం.
పరిపూర్ణ జీవన లాలస ఆమె వద్దే పదిలం.

పురుషుడి బిజినెస్ కాదీ చిత్రం.
స్త్రీ పురుషుడిని ఎంగేజ్ చేసే చిత్రం.

పురుషుడంటే ప్రపంచం అనుకుంటే స్త్రీ ప్రకృతి.
ఆమె విశ్వజనీనంగా మాట్లాడుతూనే ఉంది.

వినలేక స్విచ్ఛాఫ్ అవడం సమస్య.
అలా అని ఈ చిత్రం ఆమెదే అనుకోవద్దు.

ఒక సహజమైన జీవనచ్ఛాయకు ఆధునిక రూపం.
అనాది సంభాషణా రూపకం.

దృశ్యాదృశ్యం.
+++అనుకుంటాంగానీ తనలో తాను మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మనిషి వ్యక్తి కాదు, సహచరే.
ఏదో ఒక సహజాతం. దాని వలపోత.

ఆమెనే కాదు, అతడ్ని, వారినీ, వీరిని కూడా, చివరాఖరికి మిమ్మల్ని మీరు కూడా చూసుకొని చూడండి.
ఇలాంటి దృశ్యాదృశ్యాల జాడ మీలోని నవయవ్వనాన్నిగుర్తు చేయదూ? గాంభీర్యాన్ని చెదరగొట్టదూ?

మనిషెప్పుడూ వ్యక్తి కాదు.
సాహచర్యంలోనే మనిషి వ్యక్తిత్వం నిండుగా మూర్తీభవిస్తుంది.

ఛాయ చిత్రాలు అవే చూపుతున్నై మరి!

అన్నట్టు, భుజం ఇప్పుడు మీ చెవికి మరీ దగ్గర.
అది సుతారంగా మొబైల్ ఫోన్ ను ఇముడ్చుకుని వయ్యారాలు పోవడం ఒక చిత్తరువే.

ఒకరంటారు, నా చొక్కా అంతా నీ కన్నీళ్లతో తడిసి పోయిందీ అని.
దానర్థం ఇవతలి వ్యక్తి అవతలి వ్యక్తిని ప్రత్యక్షంగా ఓదార్చినట్టు కాదు.
మొబైల్ పరామర్శ. ఆత్మీయ ఆలింగనం.

అవును.
మానవ సంబంధాలన్నీ ఇప్పుడు మొబైల్ బంధాలు కూడా.

ఒప్పుకుంటే మంచిదే. లేదన్నాసరే.
కానీ చూడండి.

ఒక చేయి మునుపటిలా వెనుకాడట్లేదని చూడండి. నిజం.
అది కన్నీళ్లను తుడిచేందుకో, ఆసన్నహస్తంగా మారేందుకో, ఆసరాగా నిలిచేందుకో, ప్రేమగా చుబుకం ఎత్తడానికో పరాకు చూపనే చూపదు.

ఈ జీవన సాదృశ్యం అదే.
కిరసనాయిలు వలే ఒక చక్కటి పరిమళం. ఒద్దికగా కొంచెం కొంచెం ఇటువంటి దృశ్యాలు మీలోకి వొంపాలనే నా  చాదస్తం. చిరునవ్వులు. ధన్యవాదాలూ.

– కందుకూరి రమేష్ బాబు

Download PDF

10 Comments

  • Prashanth paladugu says:

    ప‌ట్నం లో కాలు పెట్టింది మొద‌లు.. మిల‌మిల మెరిసే అద్దల వైపు మెడ‌లుపోంగ‌,, పైకి చూస్తూ న‌డుస్తం..
    మ‌నిషి పైమెరుగుల‌కు, మెరుపులు త‌ప్ప ఆ క‌ళ్లు వేరేవి చూడ‌వు.. అవి వాటి స్వభావం.. నిజానికి అది మ‌నిషి నైజం..
    అదే నిజం.. కొన్ని క‌ళ్ళు మాత్రం ఏదో ఒక విష‌యాన్ని అణ్వేషిస్తుంటాయి..
    అలాంటిదే మీ దృశ్యా దృశ్యం.. ప్రతి చిత్రంలో సామాన్యుని ఛాయ‌ను ప్రతిబింబిస్తునే ఉంటాయి.. అలాగే ఉండాల‌ని ఆశిస్తూ..

  • Aparna says:

    నిజం. ఈ మధ్య ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే అలాగే ఆలోచిస్తున్న! పర్స్పెక్టివ్ మారి పోతుంది ఇలాగే.. చూసే ద్రుస్యాలవే.. కాని ఇంకా andam…ఆనందం కనిపిస్తుంది. మామూలుగా నడచే దారిలోఇదివరకటి విషయాలే ఇంకా గొప్పగా కానిపిస్తున్నాయ్. ఇంతకీ ఇలాంటి పదాలు ఎలా తెచ్చుకుంటారు? మీ మేజిక్ బాక్స్ ఎక్కడా?

    • అపర్ణ గారు, థాంక్స్.
      మీకు తెలుసు, మామూలుగా నడచే దారిలోనే మేజిక్ బాక్స్ ఉందని.
      దాన్ని పారవేసుకోకుండా ఉండటమే పని, పాట. అంతే. థాంక్ యు ప్లీజ్.

    • అపర్ణ గారు, థాంక్స్.
      మీకు తెలుసు, మేజిక్ బాక్స్ ఎక్కడ ఉందో. మామూలుగా నడచే దారిలో ఉండటమే…కాకపోతే మెలుకువ లో ఉండటమే ఆ రహస్యం.
      థాంక్ యు, ప్లీజ్.

  • తప్పకుండ. విల్ సెలెబ్రేట్ బ్రదర్.

  • S. Narayanaswamy says:

    చాలా బావుంది. హైదరాబాదులో గడిపిన రెండేళ్ళల్లో ఇటువంటి ఇడ్లీబండి చాయ్ బండి మిత్రులు ఎందరో నాకు! ఒక పిల్లగాడైతే జ్వరంతో బయటకి రాలేని నీరసంతో పడున్న నన్ను వెతుక్కుంటూ వచ్చి చాయ్ పోసి రక్షించిన ధన్వంతరి.

  • సామాన్యుల జీవన సమరాన్ని,
    వారి శ్రమ జీవన సౌందర్యాన్ని కెమెరాలో బంధించడం ఓక ఎత్తయితే-
    ఆ చిత్రాన్ని ఎలా చూడాలో, ఆ చిత్రం వెనక ఏయే అదృశ్య నేపధ్యాలున్నాయో
    అసామాన్యంగా వివరించడం మరొక ఎత్తు!

    చాయాచిత్రకారుడు కవీ రచయితా కూడా అయినప్పుడే
    ఇది సాధ్యమవుతుంది!

    మీ చాయా చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూసేట్టు చేస్తోంది మీ వ్యాఖ్యానం!
    మీ వ్యాఖ్యానాన్ని మళ్ళీ మళ్ళీ చదివేట్టు చేస్తోంది మీ అసామాన్య ఛాయా చిత్రం!!

    మీ వ్యాఖ్యానం చదివినతర్వాత మళ్ళీ చాయా చిత్రాన్ని వీక్షిస్తుంటె
    నిజంగా ఆ స్టవ్వులోకి వంపుతున్న గ్యాసునూనె పరిమళం ముక్కుపుటాలను తాకింది !

    మీ చక్కని ఫొటోకూ జై ..
    మీ కవితాత్మక వ్యాఖ్యానానికీ జై !

  • థాంక్ యు Prabhakar Mandaara గారు.

  • ఆమె రంగులు చూడండి. ముక్కెర మెరవడం చూడండి.
    పనిలో ఉంది. పాటలోనూ ఉంది.ఏదీ ఆగదు.
    జీవితాన్ని క్షణం క్షణం అనుభవంలో వుంచుకోవడం ఒక్క స్త్రీతోనే సాధ్యం.
    పరిపూర్ణ జీవన లాలస ఆమె వద్దే పదిలం.

    సత్యం ఇది. శ్రమైక జీవన సౌందర్యం..

Leave a Reply to కెక్యూబ్ వర్మ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)