The couplet

coup1 (2)

Kadha-Saranga-2-300x268

“ రా రా స్వామి రా రా..

యదువంశ సుధాంబుధి చంద్ర “

పాట మంద్రంగా వినిపిస్తోంది.  అప్పుడే బయట నుంచి వస్తున్న మాయ కు లోపల ఏం జరుగుతోందో  తెలుసు కాబట్టి నెమ్మదిగా శబ్దం చేయకుండా తలుపు తెరిచి అక్కడే చూస్తూ నిలబడిపోయింది. వైష్ణవి డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె తన లో తాను లీనమైపోయి నృత్యం చేస్తోందన్న సంగతి ని అర్థం చేసుకుంది మాయ. చిన్న పాటి అలికిడి కూడా చేయకుండా తాను నిల్చున్న చోటనే ఉండి తదేకంగా వైష్ణవి ని చూడసాగింది.

పదేళ్లుగా క్రమబద్ధంగా నృత్యం సాధన చేయటం వల్ల వైష్ణవి శరీరం చక్కటి అంగ సౌష్టవంతో ఉంది. వైష్ణవి ది ఛామన ఛాయ. ఆమె ధరించిన తెల్లటి సల్వార్ కమీజ్ ఆమె ఒంటికి పట్టిన చెమట తో తడిసి ముద్దైపోయి మరింత శరీరాన్ని అంటిపెట్టుకు పోయింది. ఒక్కో భంగిమ లో ఆమె వక్షోజాలు ఎగిరెగిరి పడుతున్నాయి సముద్రం లోని అలల్లాగా.  వైష్ణవి ఏ పాట కు నృత్యం చేస్తోందో ఆ పాట కు అర్థం ఏమిటో మాయ కు తెలియదు. కానీ వైష్ణవి ముద్రలు, భంగిమలు, కళ్ళతో పలికిస్తున్న భావాలు అన్నీ మాయకు  ఏదో అర్థమవుతున్నట్లే అనిపిస్తోంది. ఆమె హావభావాలు చూస్తున్న కొద్దీ  మాయ లో ఏదో అలజడి.

పాట ఆగిపోగానే వైష్ణవి ఐ పాడ్ దగ్గరకెళ్ళి   మరుసటి పాట ప్లే కాకుండా పాజ్ చేసి మాయ వైపు తిరిగి సన్నగా చిరునవ్వు నవ్వింది. కౌచ్ మీద కూర్చొని  టవల్ తీసుకొని ఒంటి మీదున్న చెమట ను తుడుచుకుంటోంది. నృత్యం ఆపేసినా ఇంకా ఆమెకు ఆ రొప్పు తగ్గలేదు.

‘ హాయ్ బేబీ ‘ అంటూ వైష్ణవి ని పెదాల మీద చిన్న గా ముద్దాడి “ ఏమైనా తాగుతావా?” కిచెన్ లోకి వెళ్ళింది మాయ.

రిఫ్రిజిరేటర్  తెరిచి అందులో నుంచి ఆరెంజ్ జ్యూస్ రెండు గ్లాసుల్లో పోసి ఒకటి  వైష్ణవి చేతికి ఇచ్చి మరొకటి కాఫీ టేబుల్ మీద పెట్టి   వైషు ని మళ్ళీ గట్టిగా దగ్గరకు లాక్కుంది . “ ఎంత బాగా చేస్తావో ఆ డాన్స్. డాన్స్ చేయటానికే పుట్టినట్లు ఉంటావు.”

మాయ పొగడ్త కు నవ్వేసింది వైషు. “ వొళ్ళంతా చెమట. స్నానం చేసి వస్తానే “

“ నా బేబీ కి నేను స్నానం చేయించనా?” మాయ మాటల్లో ఓ కవ్వింపు .

సిగ్గు గా నవ్వుతూ “ రిలాక్స్ అవ్వు. చిటికె లో వచ్చేస్తాను “ వైషు షవర్ లోకి వెళ్ళింది.

***

2.

“ బుక్ ఉమన్” ఒక చిన్న కమ్యునిటీ  ఫెమినిస్ట్ బుక్ స్టోర్. సమ్మర్ రీడింగ్ సిరీస్ లో భాగం గా టెక్సాస్ ఉమన్ రైటర్ ఒకామె తన కొత్త బుక్ గురించి అక్కడ మాట్లాడుతున్న మీటింగ్  లో మొదటి సారి మాయ, వైషు  కలుసుకున్నారు.

వైష్ణవి కూచిపూడి నృత్యానికి, ప్రపంచం లోని ఇతర నృత్య రీతులకు వున్న పోలికలు, వైరుధ్యాల గురించి రీసెర్చ్ చేయాలనే ఉద్దేశ్యం తో అండర్ గ్రాడ్యుయేషన్ లో అందుకు సంబంధించిన కోర్సులు చేస్తోంది. వైష్ణవి కి 13 ఏళ్లప్పుడు గ్రీన్ కార్డ్ మీద వైష్ణవి కుటుంబం అమెరికా కు వలస వచ్చింది. వైష్ణవి కి చిన్నప్పటి నుంచి నృత్యం అంటే ప్రాణం. ఎంత ఇష్టం అంటే నిద్ర పోతున్నపుడు కూడా నృత్యం చేస్తున్నట్లు కాళ్ళు కదుపుతూ ఉండేది. దాన్ని చూసే ఆమె తల్లితండ్రులు ఆమె కు నృత్యం నేర్పించారు. అమెరికా వచ్చేసినా సరే, వైష్ణవి నృత్య సాధన కొనసాగించింది. డా. వెంపటి చినసత్యం గారి శిష్యురాలు రాధికా రెడ్డి దగ్గర వైష్ణవి ప్రైవేట్ గా నృత్యాన్ని అభ్యసిస్తోంది. డార్మ్స్ లో ఉంటే నృత్య సాధనకు వీలు కాదని వైష్ణవి తల్లితండ్రులు కొంచెం డబ్బు ఖర్చు అయినా సరే విడిగా ఇల్లు తీసుకోమన్నారు. చిన్నప్పటి నుంచి అనేక ఆంక్షల మధ్య పెరిగిన వైష్ణవి హైస్కూల్లోకి వచ్చేసరికి ధైర్యం గా తానేది అనుకుంటే అదే చెయ్యటం మొదలుపెట్టింది. ఇండియన్ కమ్యూనిటీ లో నిత్యం టీనేజీ పిల్లల గురించి రకరకాల కథలు విని వైష్ణవి ని మరింత కట్టడి చేయాలని తల్లితండ్రులు ప్రయత్నించి , వైష్ణవి తీవ్రం గా ఎదురు తిరగటం తో ఏం చేయాలో తెలియక ఇక కొన్ని విషయాల్లో వైష్ణవి నిర్ణయాలను అంగీకరించారు. తల్లితండ్రులు డాలస్ లో ఉండటం తో , ఆస్టిన్ లో ఇల్లు తీసుకున్నాక వైష్ణవి కి జీవితం లో మొదటి సారి స్వేచ్ఛ, అందులోని ఆనందం తెలిసింది .

 

మాయ మెక్సికన్ అమెరికన్ అమ్మాయి. అమెరికా లో పుట్టి పెరిగిన మాయ చిన్నప్పటి నుంచి చదువులోనే కాకుండా స్పోర్ట్స్ లో కూడా బాగా చురుకుగా ఉండేది. మాయ తల్లి తండ్రులిద్దరూ చిత్రకారులు. ఇద్దరూ ఆర్టిస్ట్ లు కావటం తో మాయ ని స్వేచ్ఛ గా తనదైన వ్యక్తిత్వం తో ఉండేలా పెంచారు . మాయ కు మిడిల్ స్కూల్లోనే తన సెక్సువాలిటీ పట్ల కొంత అవగాహన ఉంది. మగపిల్లల కంటే ఆడపిల్లలంటేనే ఇష్టంగా ఉండేది కానీ ఆ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. హైస్కూల్లో కి వచ్చాక ఫుట్ బాల్ టీం లో ఉన్న అబ్బాయిలతో డేటింగ్ చేసింది కానీ ఏనాడూ దాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది. “Woman’s Body-Feminism-Sculpture” ప్రధానాంశంగా శిల్ప కళ మీద పరిశోధన చేయాలని మాయ ఆకాంక్ష. శిల్పాలు చెక్కటానికి అనువైన వాతావరణం, విశాలమైన స్థలం, ఓ ప్రశాంత ఏకాగ్రత ఉండాలంటే డార్మ్ లో కంటే విడిగా ఇంట్లో ఉండటమే మంచిదనుకుంది మాయ.

షార్ట్ హెయిర్ కట్ , టీ షర్ట్ , షార్ట్స్ తో ‘ టాంబాయి’ లుక్ తో ఉన్న  మాయ మొదటి పరిచయంలోనే వైష్ణవి కి ఆసక్తికరంగా అనిపించింది. ముక్కు సూటి గా మాట్లాడే మాయ తత్త్వం నచ్చింది. మాయ మాట్లాడుతున్న విషయాలు , ఒంటి మీద పచ్చబొట్లు చూసి ఫెమినిస్ట్ అని ఊహించింది . మాయ కూడా యూటీ లో అండర్ గ్రాడ్ లో చేరుతోందని , విడి గా ఇల్లు తీసుకోవాలనుకుంటోందని తెలిసి ఆసక్తి కనబరిచింది .

జీన్స్, ఇండియన్ టాప్ , లాంగ్ హెయిర్ తో ఉన్న వైష్ణవి ఇండియన్ డాన్సర్ అని తెలియగానే బోలెడు ఎక్సైట్ మెంట్ ని  చూపించింది  మాయ. మీటింగ్ కాగానే ఇద్దరూ పక్కనే ఉన్న థాయ్ రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తూ ఇద్దరూ కూడా రూమ్ మేట్స్ కోసం వెతుకుతున్నట్లు  తెలుసుకున్నారు.

బొట్టు పెడితే అచ్చు నువ్వు ఇండియన్ లాగానే ఉంటావు అన్నది వైష్ణవి .

నువ్వు షార్ట్స్ వేసుకున్నప్పుడు పొడవు జుట్టు ని ఇలా వదిలెయ్యకుండా వేరే హెయిర్ స్టెయిల్ చేసుకో, ఇంకా బావుంటుందని సూచించింది  మాయ.

మ్యూజిక్, ఆర్ట్, బుక్స్, సినిమాలు, హెయిర్ కట్ లు,మేకప్ లు, ట్రెండీ డ్రెస్సుల గురించి మాట్లాడుకున్నారు. బాయ్ ఫ్రెండ్ ల ప్రవర్తన గురించి ఇద్దరూ జోకులు వేసుకున్నారు. ఇద్దరికీ అవతలి వాళ్ళతో ఇల్లు షేర్ చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరం కనిపించకపోవటం తో కలిసి ఇళ్ళు వెతుక్కున్నారు. చుట్టూ పీకాన్ చెట్లు , విశాలమైన హాలు , ఇంటి ముందు, వెనుక బోలెడంత స్థలం ఉన్న ఆ ఇల్లు కాంపస్ కి దగ్గరగా ఉండటంతో ఇద్దరికీ బాగా నచ్చింది. ఇంట్లో వాళ్లకు ఒక మాట చెప్పి వైష్ణవి లీజ్ పేపర్ల మీద సంతకం చేసింది. ఆడపిల్ల తోనే కాబట్టి కలిసి ఉండేది పెద్దగా భయపడాల్సింది లేదనుకున్నారు వైషు తల్లితండ్రులు. అటు మాయ పేరెంట్స్, ఇటు వైష్ణవి పేరెంట్స్ ఇద్దరూ కూడా వచ్చి ఆ ఇంటి ని చూసి మంచి సెలెక్షన్ అని మెచ్చుకున్నారు.

***

 

ఆకాశం అంచు మీద కారుమబ్బులు అటూ ఇటూ నడుస్తున్నాయి. వైషు, మాయ ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు కాసేపు అలా సాయంత్రం పూట వాకింగ్ చేయటానికి.

తలెత్తి ఆకాశం వంక చూసి “ అబ్బ, ఎంత బాగుందో వెదర్. రోజూ ఇలా ఉంటే బావుంటుంది కదా”

“ రోజూ ఇలా ఉంటే ఈ ఎక్సైట్మెంట్ ఉండదు కానీ “ కాక్టస్ కెఫే ” కి వెళ్దామా ? “ మాయ అడిగిన దానికి

“ మళ్ళీ క్యాంపస్ కా? రోజంతా అక్కడుండి మళ్ళీ అక్కడికే వెళ్ళాలంటే బోర్ కానీ, మొజార్ట్స్” కి వెళ్దాం. నాకు చచ్చేంత క్లాస్ రీడింగ్ ఉంది ” వైష్ణవి చెప్పినదానికి ఒప్పుకుంది మాయ.

ఇద్దరూ కాసేపు వాకింగ్ చేసి ‘ లేక్ ఆస్టిన్’ మీదున్న మొజార్ట్స్ కాఫీ షాప్ లోకి వెళ్ళారు.

డెక్ మీదున్న ఆ కాఫీ షాపు వాళ్ళకిష్టమైన ప్లేసుల్లో ఒకటి .

వాళ్ళిద్దరూ అక్కడకు వెళ్లేసరికి ఆకాశం ఇంకా మబ్బుల ప్రేయసి ని ముద్దాడుతూనే ఉంది.

వైషు “ పంప్కిన్ స్పైసీ కాఫీ లాటే” ఆర్డర్ చేసింది. అప్పుడు టైం చూస్తె సాయంత్రం ఆరున్నర దాటింది, “ సారీ, చెప్పటం మర్చిపోయాను. ఓన్లీ డీ కాఫ్ ప్లీజ్” అంది బారిస్తా తో .

“ నీకు రాత్రి నిద్ర పట్టకపోవటమే మంచిది. అయినా నిన్ను ఎలా నిద్ర పుచ్చాలో, ఎలా మేల్కొలపాలో నాకు తెలుసుగా ” కొంటె గా నవ్వుతూ వైషు ను దగ్గరకు లాక్కుంది మాయ.

ఒక్కసారిగా మాయ ను పక్కకు తోసేసింది. తమను ఎవరైనా చూసారేమో, ఆ మాటలు పక్కనెవరైనా విన్నారేమోనని అటూ ఇటూ ఆందోళన గా చూసింది వైషు.

వైషు తనను తోసెయ్యటం, ఆ మొహం లో ఆందోళన, కంగారు చూసేసరికి మాయ మొహం పాలిపోయింది.. “ నాతో బయటకు రావటం ఇష్టం లేకపోతె ఆ విషయం నేరుగా చెప్పు” విసురు గా డెక్ మీదకు వెళ్లి ఖాళీ గా ఉన్న టేబుల్ ముందు కూర్చొంది మాయ. సాయం సంధ్య లోకి జారిపోతున్న సూర్యుడి కిరణాల వెలుగు లో లేక్ మరింత అందంతో మెరిసిపోతోంది. కానీ మాయ కళ్ళు ఆ అందాన్ని చూసే స్థితి లో లేవు. లోపల నుంచి బాధ తన్నుకు వస్తుంటే కింది పెదవిని దానికి అడ్డం వేసి ఆపుతున్నట్లు కొరుకుతూ కూర్చుంది మాయ. ఊపిరందక గిలగిలలాడిపోతున్న ఫీలింగ్. గుండెల మీద బరువు గా ఏదో పెద్ద బండ రాయి. లోపల అనేక ఆలోచనలు, బాధ, దుఃఖం అన్నీ కలగలిసి మాయ ను లోపల నుంచి సన్నటి రంపం తో కోసేస్తున్నాయి. వైషు ని ప్రేమించి తప్పు చేసానా? ఈ రిలేషన్షిప్ పట్ల అసలు వైషు కు గౌరవం లేదు, కొద్దిపాటి ధైర్యం కూడా చేయటం లేదు అనుకోగానే మాయ కు కోపం తో పాటు బాధ కలిగింది. వైషు పట్ల ఇష్టాన్ని, ప్రేమ ను కేవలం నాలుగు గోడల మధ్య మాత్రమే చూపిస్తూ బయట తానెవరో పరాయి వ్యక్తి లాగా దూరం దూరం గా తిరగటం తన వల్ల కావటం లేదు. కానీ వైషుకి తన బాధ, తన ప్రేమ ఎందుకర్థం కావటం లేదు? వైషు మొదట్లో భయపడితే ధైర్యం చెప్పింది. ఆలోచించుకుంటాను, టైం కావాలంటే ఎదురుచూస్తానని ఒప్పుకుంది. కానీ రోజులు గడుస్తున్నా అరంగుళం కూడా ముందుకు నడవటానికి ఇష్టపడకపోతే ఏమనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? వైషు మీద కోపం మొత్తం జాతి మీదకు మళ్ళింది . స్టుపిడ్ ఇండియన్స్ కసిగా తిట్టుకుంది లోపల.

ఇంతలో ఒక చేత్తో కాఫీ ని, మరో చేత్తో మాయ కు ఇష్టమైన హైబిస్కస్ హెర్బల్ టీ ని తీసుకొని వచ్చి ఎదురుగుండా కూర్చొంది వైషు.

“ ఐ యాం సారీ. ఇక్కడంతా మన యూటీ స్టూడెంట్సేగా ఉండేది . ఎవరైనా మనల్ని అలా ఇంటిమేట్ గా చూస్తే   బావుండదనుకున్నాను . అంతే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు ” మాయ చేతి మీద చెయ్యి వేసింది వైషు, చేసిన తప్పు కు పశ్చాత్తాపం అన్నట్లు గా…

“ నీతో వచ్చేటప్పుడు మాస్క్ వేసుకొని రావాలని తెలుసు. కానీ ఒక్కోసారి ఆ విషయం మర్చిపోతుంటాను “. మాయ మాటలు సూటి గా చురకత్తుల్లా ఉన్నాయి. ఆ మాటల్లో వ్యంగం, బాధ, కోపం.

“ పబ్లిక్ లో మనమెలా ఉండాలి అన్న విషయం మొదట్లోనే మాట్లాడుకున్నాం. ఒక ఒప్పందం కూడా చేసుకున్నాము. అదంతా మర్చిపోయావా?” అన్నీ ఒప్పుకొని మళ్ళీ తప్పు తనదే అయినట్లు మాయ మాట్లాడటం చూసి వైషు కి కూడా చిరాకొచ్చింది.

“ అవును ఒప్పందం చేసుకున్నాము . అంతమాత్రానా మనిద్దరి మధ్య ఉన్నది కేవలం కాంట్రాక్టా? నేనొక మాములు మనిషి ని. నీ మీద ప్రేమ ను పెంచుకోవటమే తప్ప దాచుకోవటం నాకు తెలియటం లేదు . ఇంట్లో ఒక లా, పబ్లిక్ లో మరోలా ఉండటం నాకు రావట్లేదు . నీతో బయటకు వస్తోంది నేనేనంటావా? నా మొహం మీదున్న మాస్క్ నాకు తెలుస్తోంది. నీకు తెలియటం లేదా? Don’t you feel it baby? ఇంట్లో నీతో ఎలా ఉంటాను? ఇక్కడెలా ఉండమంటున్నావు? “ ఒక్కో మాట మాయ గొంతు లోంచి వస్తుంటే ఆమె శరీరం మొత్తం ఒక జలదరింపు కు గురైనట్లు వణికిపోతోంది . ఆమె తెల్లటి మొహం మరింత ఎర్రగా కందిపోయింది. కళ్ళల్లోంచి నీళ్ళు. మనసు బాధ శరీరానిదై పోయింది.

మాయ అంత ఎమోషనల్ అవటం ఎప్పుడూ చూడలేదు వైషు. అది కాదు రా అంటూ మాయ చేతుల మీద చెయ్యి వేసి ఏదో చెప్పబోయింది కానీ వైషు ని మాట్లాడనివ్వలేదు. ఆ చేతిని విసురుగా తోసేసింది .

“ నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తే ఇంటికెళ్లే వరకు ఆగాలి. అది కాంపస్ కాకూడదు. పబ్ కాకూడదు. పక్కన మన ఫ్రెండ్సో, క్లాస్ మేట్సో ఎవరూ ఉండకూడదు. క్యాంపస్ లో మనిద్దరం రూమ్ మేట్స్ గా మాత్రమే తెలియాలి. ఇలా ఎక్కడికక్కడ నన్ను నేను కట్ చేసుకుంటూ నీకు తగ్గట్లు గా, నీకనుకూలం గా ఉండాలి. ఇదంతా నాకెంత సఫోకేటింగ్ గా ఉందో నీకర్థమవుతోందా? నువ్వెప్పుడైనా నా వైపు ఆలోచించావా? నా ఎదురుచూపులు నీకు నా చేతకానితనం గా కనిపిస్తోంది కదూ . ” లోపలి ఏడుపు మొత్తం ధారధారలు గా కొంచెం కళ్ళ నుంచి, కొంచెం గొంతు లోంచి బయటకు వస్తోంది. తెల్లటి శరీరం మీద పైకి ఉబికి వచ్చిన నరాలు స్పష్టం గా కనిపిస్తున్నాయి.

వైషు కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాయ కు ఎలా సర్ది చెప్పాలో తెలియలేదు. నడి రోడ్డు మీద ఎవరో తనను ముక్కలు ముక్కలుగా నరికేస్తున్న ఫీలింగ్. మాయ విసురుతున్న మాటలు ఒకొక్కటి గా దూసుకొని వచ్చి వైషు మనసు ని ఛిద్రం చేసేస్తున్నాయి. మొదట్లో తన సంకోచాలు చెప్పినప్పుడు దగ్గరకు తీసుకొని ఓదార్చిన మాయ , ఇప్పుడు అన్నీ తప్పులు తనవే అయినట్లు నిందిస్తుంటే, అవేమీ తనను కాదన్నట్లు, తనకంటూ మాట్లాడటానికి ఇంకేమీ లేదన్నట్లు అలా శిలావిగ్రహం లా నిలబడి ఆ నిందలు మోయటం కష్టమనిపించింది. అసలు తప్పు మాయ దే , నన్ను రెచ్చగొట్టి లోబర్చుకుందనిపించింది.

మాయ నిందిస్తుంటే, వైషు మాయ ను తప్పు పడుతోంది. ఒకరినొకరు మాటలతో బాధ పెట్టుకుంటున్నారు. కలిసి ప్రేమ ను పంచుకున్న ఇద్దరూ ఒక అనిర్వచనీయమైన అనుభూతి ని కత్తులతో సమూలంగా రెండు వైపుల నుంచి నరికేసుకుంటున్నారు.

మాయ మాటలకు బాధ , తర్వాత చిరాకు, కోపం, అసహనం అన్నీఒక దానివెంట ఒకటి కలగలిసి వస్తుంటే , “ నాకు ఇంకొంచెం టైం కావాలి, మన విషయం ఇంట్లో కానీ, బయట కానీ తెలియటానికని నిన్ను రిక్వెస్ట్ చేసాను. నువ్వు దానికి ఒప్పుకున్నావు. నా కోసం వెయిట్ చేస్తానన్నావు. మళ్ళీ ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తావెందుకు?” ఏడుస్తూ , తనకు తెలియకుండానే పెద్ద గొంతు తో అరిచేసింది.

తన బాధ ను , ప్రేమ ను , ఎదురుచూపులను అర్థం చేసుకోకుండా తిరిగి తననే తప్పు పడుతున్న వైషు మీద మాయ కు మరింత కోపం వచ్చింది.

“ ఇప్పటికి ఏడాదికి పైగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో, ఒకే మంచం మీద పడుకుంటున్నాము. ఇంకెంత టైం కావాలో చెప్పు. అండర్ గ్రాడ్ అంతా అయ్యాక చెప్దామా? అప్పుడు మాత్రం ఎందుకులే, ఇలాగే గ్రాడ్ స్కూల్ కూడా పూర్తి చేసేద్దాం. ఆ తర్వాత కూడా “ స్ట్రైట్ “ గా పెళ్ళిళ్ళు చేసుకొందాము. పిల్లలను కందాము. అప్పుడు తీరిక గా కూర్చొని ఆలోచిద్దాము. సరేనా ? “ మాయ మాటల్లో వ్యంగానికి వైషు కు కోపం కన్నా చిరాకు అనిపించింది. అయినా సరే కంట్రోల్ చేసుకుంటూ “ నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు” అంది.

“ అవును. నేనెక్కువ కలలు కంటున్నాను. మనం పెళ్లి చేసుకుంటామని, కలిసి పిల్లలను పెంచుతామని ఇలా అనేక రకాలు గా ఊహిస్తున్నాను. నేనే పిచ్చిదాని గా నీ ప్రేమ కోసం, నీకు అనువైన టైం కోసం ఎదురు చూస్తున్నాను. ఒక్కటి చెప్పు, నేను అబ్బాయి అయితే , నువ్వింత ఆలోచించే దానివా? నిన్ను పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంటే తోసేసేదానివా? ఆలోచించి చూడు. నేనేం మాట్లాడుతున్నానో, నేనెందుకు హర్ట్ అవుతున్నానో నీకు తెలుస్తుంది.”

మాయ అడిగిన దానికి వైషు కు వెంటనే ఏం చెప్పాలో తెలియలేదు.

“ నీకు నాతో రహస్యంగా సెక్స్ కావాలి కానీ నేనక్కర లేదు. నా ప్రేమ అక్కరలేదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే పర్వాలేదు. కానీ నన్ను కూడా మోసగిస్తున్నావు నువ్వు , నా దగ్గర నటిస్తున్నావు. ఇంట్లో గర్ల్ ఫ్రెండ్, బయట బాయ ఫ్రెండ్. నీలా నటించటం నాకు చేత కావటం కాదు. ” లోపలి అగ్నిపర్వతాలు మొత్తం ఒక్కసారి విస్ఫోటనం చెందినట్లు లోలోపలి నుంచి ఎప్పటి నుంచో తనకే తెలియకుండా తన లోపల దాగి ఉన్న అనేక ఆలోచనల్ని, అనుమానాల్ని మొత్తం బయటకు వెళ్ళగక్కింది మాయ .

మోసం, నటన లాంటి మాటలు వినేసరికి వైషు కు కోపం తారాస్థాయి కి వెళ్ళింది. అప్పటి వరకూ మాయ ఎన్ని మాటలు అన్నా కొంతైనా సహించ కలిగింది కానీ తనను అనుమానించటాన్ని, రాహుల్ కి , తనకు మధ్య ఏదో ఉందని అనటాన్ని మాత్రం సహించలేక పోయింది. మాయ తనను అనుమానించటం తన జీవితం లో జరిగిన పెద్ద అవమానం గా తోచింది వైష్ణవి కి.

“ నేను చేస్తోంది నటనా? నాకు బాయ్ ఫ్రెండా? రాహుల్ గురించా నువ్వు మాట్లాడుతోంది? అతను నా క్లాస్మేట్ , మంచి ఫ్రెండ్. నాలుగైదు సార్లు బయటకు వెళితే అతను నాకు బాయ్ ఫ్రెండ్ అయిపోతాడా? నీ స్థాయి ఇదన్న మాట. అయినా అసలు నీకెందుకింత వివరణ ఇవ్వాలి? నాకు ఇష్టమైతే నీతో పడుకుంటాను. లేకపోతే లేదు. నువ్వెవరు నన్ను క్వెశ్చన్ చేయటానికి…

అసలు నీతో ఇన్ని మాటలు అనవసరం. వుయ్ ఆర్ డన్ . ఐయాం ఔట్. ఔట్ ఆఫ్ దిస్ రిలేషన్ షిప్” బ్రేకప్ ప్రకటించేసింది వైషు. కోపం తో ముక్కుపుటాలు అదురుతున్నాయి. మాటలు, ఏడుపు అన్నీ కలిసిపోయాయి హటాత్తుగా వైషు నోటి నుంచి వచ్చిన ఆ నిర్ణయం లో.

“ ఫ*…యు…ఐ డోంట్ వాంట్ యు ….ఐయాం మూవింగ్ ఔట్.” విసవిసా అక్కడనుంచి వెళ్ళిపోయింది మాయ.

coup1 (2)

                   చిత్రం: మాహీ బెజవాడ

ఉన్నట్లుండి మారిపోయిన పరిస్థితి ని షాక్ తిన్నట్లు అలా చూస్తూ ఉండిపోయింది వైషు. దెబ్బతిన్న పక్షిలా ఆమె మనస్సు గిలగిలా కొట్టుకొంటోంది. అవమానం తో, బాధ తో వైషు మొహం పాలిపోయింది. ఇన్నాళ్ళు మాయ తన మీద చూపించిన ప్రేమ అంతా ఒక్క సారిగా దూదిపింజే లా ఎక్కడికో ఎగిరిపోయినట్లనిపెంచింది. కళ్ళమ్మట నీళ్ళు .

మాయ అన్న మాటలు ఒకొక్కటి గా అప్పుడు మళ్ళీ వినిపిస్తున్నాయి, మరింత అర్థం అయ్యేటట్లు గా.. తానన్న మాటలు కూడా తనకే మళ్ళీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. టేబుల్ మీద కాఫీ, టీ రెండూ ఎవరూ తాకకుండా అలా ఒక దాని పక్కన ఒకటి పెట్టి ఉన్నాయి. కోపం తో వెళ్ళిపోయిన మాయ తిరిగి వస్తుందేమో అన్నట్లు మాయ వెళ్ళిన వైపే చూస్తోంది వైషు.

ప్రవహించి ప్రవహించి అలసిపోయిన లేక్ నెమ్మదిగా పారుతోంది . దూరం నుంచి వస్తున్న బోట్ లో అమ్మాయి, అబ్బాయి ముద్దాడుకుంటూ కనిపిస్తున్నారు. కొంచెం దూరం గా ఉన్న మరో టేబుల్ మీద ఎవరో ఇండియన్ జంట కూర్చొని కాఫీ తాగుతున్నారు. వాళ్ళు తమ వంకే చూస్తున్నట్లనిపించి మరో వైపు కు తల తిప్పేసింది. వాళ్ళు ఇందాకటి నుంచి ఉన్నారా? ఇప్పుడే వచ్చారా? మాయ, తానూ పోట్లాడుకున్నది వాళ్ళు చూసారా? అసలు మాయ అలా ఎలా అనగలుగుతుంది ఇలాంటి మాటలు ? తన భయాలు, తన ఫామిలీ బాక్ గ్రౌండ్ అన్నీ చెప్పింది. కొంచెం టైం కావాలి అని అడిగింది. అన్నింటికి సరే అన్నది. ఇప్పుడు పబ్లిక్ గా ఇలా సీన్ చేసి తనను వదిలేసి ఎలా వెళ్ళిపోగలిగింది? మొదటి నుంచి తామిద్దరి మధ్య జరిగిన విషయాలు,అన్నీ ఒకొక్కటి గా గుర్తుకు వస్తున్నాయి . తుడుచుకున్న కొద్దీ బయటకు వస్తున్నాయి కన్నీళ్లు లోపలి ఆలోచనల్లాగా…

***

4.

ఒక శుక్రవారం సాయంత్రం. అప్పుడప్పుడే చీకటి పడుతోంది. శుక్రవారం సాయంత్రాలు ఆ కాంపస్ చుట్టుపక్కలంతా, ముఖ్యం గా ఆ నైబర్ హుడ్ అంతా కోలాహలం గా ఉంటుంది. అదంతా స్టూడెంట్ లోకాలిటీ . పార్టీ ల హడావిడి తో వీధి అంతా కళకళ లాడుతోంది. వచ్చే పోయే స్నేహితులు, కార్లు, బైకులు అంతా ఓ ఉత్సాహకరమైన వాతావరణం నిండి ఉంది . వేగం గా వెళ్తున్న కార్ల లో నుంచి రకరకాల సంగీతం పెద్ద గా వినిపిస్తోంది. ఇల్లంతా ఇండియన్ స్పైసెస్ వాసన ఘుప్పు మంటోంది. కాంపస్ నుంచి వచ్చిన మాయకు , వైష్ణవి కిచెన్ లో అప్పటి దాకా ఏవో స్పెషల్స్ చేసిందని అర్థమై వైష్ణవి కోసం వెతికింది. వైష్ణవి షవర్ లో ఉన్నట్లు అర్థమై , ఇంటి ముందున్న పెకాన్ చెట్టు కింద వికర్ కుర్చీ వేసుకొని బీర్ తాగుతూ అటూ ఇటూ వచ్చే పోయే వాళ్ళను చూస్తూ రిలాక్స్ అవుతోంది .

అటూ వెళ్ళే వాళ్ళు, ఇటు వచ్చే వాళ్ళు బయట కూర్చున్న మాయ కు హాయ్ చెప్తున్నారు, చేతులూపుతున్నారు. పెద్ద పెద్ద ఉడతలు వచ్చి కింద పడిన పెకాన్ కాయలను తీసుకెళ్తున్నాయి. మాయ చెట్టు కిందనే కూర్చోవటం తో రావాలా, వద్దా అని కాసేపు అవి తటపటాయించి మాయ ను చూసి మన ఫ్రెండే అనే నమ్మకంతో గబుక్కున వచ్చి ఒక్కో కాయ ను తీసుకుపోతున్నాయి. ఉడతల కిచకిచలకు, అటూ ఇటూ దొంగ చూపులు చూస్తూ కింద రాలిపడిన ఆకుల మీద పరుగెడుతూ చేసే శబ్దానికి మాయ వాటినే గమనించసాగింది. కాసేపయ్యాక లేచి లోపలకు వెళ్ళింది.

వైష్ణవి హాల్లో లేదు. కిచెన్ లోకి వెళ్లి చూసిన మాయ ఒక్క క్షణం చిత్తురువు లా ఉండిపోయింది.

లేతాకుపచ్చ జార్జేట్ చీర కట్టుకొని కిచెన్ లో అల్యూమినియం ట్రే ల్లోకి ఫుడ్ ని సర్దుతోంది వైష్ణవి . తల స్నానం చేసిన కురులను స్త్రైటేన్ చేసి పైనొక చిన్న క్లిప్ పైన పెట్టి వదిలేసింది. వెనుక నుంచి చూస్తె లేయర్స్ తో ఉన్న ఆ పెద్ద జుట్టు అంచెలంచెలుగా దూకే జలపాతం లాగా ఉంది. ఆ నల్లటి జలపాతం నుంచి వైషు శరీరాన్ని అంటిపెట్టుకున్న డిజైనర్ జాకెట్టు కి పైన, కింద అర్థనగ్నపు వీపు కనిపిస్తోంది. ఎడమ వైపు నడుము వొంపు , తనమీద ఎవరైనా ఒక్క సారి చెయ్యి వేస్తె బాగుండన్నట్లు ఎదురుచూస్తోంది. అటూ ఇటూ తిరిగినప్పుడల్లా వైష్ణవి కాలి మువ్వలు సన్నటి శబ్దాన్ని చేస్తున్నాయి. చెవులకు వేలాడే జుంకీలు, వాటికి చెంప స్వరాలూ వైష్ణవి తల తిప్పినప్పుడల్లా అటూ ఇటూ ఊగుతున్నాయి.

“ హే, స్టన్నింగ్ బ్యూటీ ! ఏంటీ స్పెషల్? ఎంత సెక్సీ గా ఉన్నావో తెలుసా ఈ డ్రెస్ లో?” దగ్గరగా వచ్చి వైష్ణవి చీరకట్టు వంక ఆశ్చర్యం గా చూస్తోంది మాయ.

“ దీన్ని చీర అంటారు. ప్రపంచం మొత్తం లో అతి సెక్సియస్ట్ డ్రెస్ ఇదే తెలుసా?” ఆ మాటల్లో ఒక ఇండియన్ ప్రైడ్. ఒక చేతిని పక్కకు వొంచి పమిట ను దాని మీద జార్చి ఓ భంగిమ లో నిలబడింది. ఆ అందము చీరదో, అలా నిలబడ్డ వైష్ణవి దో తెలియనంత గా మాయ మనసు అక్కడ చిక్కుకుపోయింది.

క్యాంపస్ లో చాలా మంది ఇండియన్స్ గాగ్రా చోళీలు, అనార్కలీ డ్రెస్ లు వేసుకోవటం చూసింది కానీ ఈ చీర కట్టు ని ఇంత దగ్గరగా ఎప్పుడూ చూసి ఉండక పోవటం తో అదొక అద్భుతం గా చీర పల్లు ని చేత్తో ముట్టుకొని చూస్తూ అది శరీరం లో ఎటు వైపు మొదలై ఎటు వైపు కు వంపులు తిరిగి ఎక్కడకు వచ్చిందో పరీక్షిస్తోంది మాయ. వైష్ణవి చుట్టూ తిరిగింది .మాయ తనకు అంత దగ్గరగా నిలబడి తనను అన్నీ వైపులా నుంచి అలా ఒక శిల్పాన్ని చూస్తున్నట్లు చూస్తుంటే వైష్ణవి కి అదోలా అనిపించింది. మాయ తనని చేత్తో తాకకపోయినా తాకినట్లే అనిపిస్తోంది.

“ కమాన్ మాయ” వద్దు అన్నట్లు చేత్తో వారిస్తూ .

“ నేను కూడా దీన్ని కట్టుకోవచ్చా? ఎలా కట్టుకోవాలో నేర్పిస్తావా? ప్లీజ్, ప్లీజ్ “ వైషు గడ్డం పుచ్చుకొని బతిమిలాడటం మొదలుపెట్టింది.

“సరే, సరే, నా దగ్గర ఇంకో చీర ఉంది. అది కడతాను.”

ఆ మాట వినగానే గట్టిగా అరుస్తూ ఎగిరి గెంతేసింది మాయ.

“ఇంతకూ ఏంటీ స్పెషల్ ? ఈ చీర, ఈ వంటలు .. “

” క్యాంపస్ లో ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు ‘ ఉగాది తెలుగు న్యూ యియర్ ఫెస్టివల్ ‘ చేస్తున్నారు. నువ్వు కూడా వస్తావా నాతో? ఇద్దరం ఇలా చీరల్లో వెళ్దాము. నీకు ఎలా మేకప్ చేస్తానో చూడు. నువ్వు ఇండియన్ వి కాదంటే ఎవరూ నమ్మలేరు “ .

మాయ కూడా చీర కట్టుకొని తన తో పాటు వస్తుందని తెలిసే సరికి వైష్ణవి కి ఉత్సాహం ఆగటం లేదు. మాయ కు ఎలా మేకప్ చేస్తుందో గబగబా చెప్పేస్తోంది కానీ కానీ అవేమీ మాయ కు అర్థం కావటం లేదు. మాయ మనసు లో వేరే ఘర్షణ . లోపల నుంచి ఒక కాంక్ష మాయ ను నిలువునా ముంచెత్తుతోంది. ఎదురుగుండా సెక్సీ గా నిలబడి, నవ్వుతూ మాట్లాడుతున్న వైషు ని చూస్తుంటే మాయ కు తనని తాను ఇక ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియటం లేదు.

పక్కకు తిరిగి కార్నింగ్ వేర్ లోంచి పసుపు పచ్చ రంగు తో కవ్విస్తూఉన్న చిత్రాన్నాన్ని తీసి కొంచెం నోట్లో వేసుకొంది. స్పైసీ గా ఉండటం తో మాయ కు పొలమారింది.

 

“ సారీ, సారీ నీకు స్పైసీ గా ఉందా?” కంగారు గా గ్లాసు తో నీళ్ళు తీసుకొని మాయ కు దగ్గరగా జరిగి తల మీద చిన్న గా కొడుతూ తాగటానికి నీళ్ళిచ్చింది .

“ నీకన్నా స్పైసీ గా ఏమీ లేదులే ” చిలిపి గా నవ్వుతూ , తనకు దగ్గరగా వచ్చిన వైషు నడుం మీద చెయ్యి వేసి తన వైపు కు తిప్పుకుంది మాయ. పెదాల మీద సుతారం గా ముద్దు పెట్టుకొంది, చెట్టు మీద పండు ను అందుకున్నట్లు వైషు పెదాలను అందుకొంది. అంతా ఒక్క క్షణం లో జరిగిపోయింది. తడి తడిగా ఉన్న మాయ పెదాలను మరింత తమకంతో అందుకుంది వైష్ణవి. ఆ మోహపు ముద్దు వాళ్ళిద్దరినీ మరింత దగ్గర చేసింది.

ఆ ఇద్దరి మధ్య చీర నిమిత్తమాత్రం గా మిగిలింది.

మాయ ఆర్తి గా ముద్దు పెట్టు కొంటుంటే వైషు మరింత గట్టిగా అల్లుకు పోయింది. కళ్ళు మూసుకున్న వైషు మీదకు వొంగి నెమ్మదిగా చెవి లో “ నువ్వు కాసేపు అలాగే కళ్ళు మూసుకొని ఉండు. ఆ కనురెప్పల కి రెక్కలు తొడిగి కలల లోకం లో ప్రవేశించు. అక్కడ అనేక సరస్సులు, వాటిల్లో కలువ పూలు, తామర పూలు, చుట్టూ బోలెడన్ని పూల మొక్కలు, పూల పుప్పొడిని ముద్దాడుతున్న రంగురంగుల సీతాకోక చిలుకలు. మరో పక్క గున్నమామిడి చెట్టు. ఆ చెట్టు కింద మనిద్దరం ఒక బిగి కౌగిలింత లో. లేత మావిచిగురు ని తినిపిస్తుంటే నువ్వు నా వేలి కొస ను నీ నాలిక తో సుతారం గా తాకుతున్నావు. నేను నీ చెవి తమ్మె ను ముద్దాడుతున్నాను. ఆ లోకం లో ఉన్నది మనిద్దరమే. లేదు, లేదు ఒక్కరమే. “ మాటల మంత్రజాలపు యవనిక ను జార్చింది . మరో లోకం లో ఆ దృశ్యాన్ని వైషు అంతఃచక్షువులతో అనుభవిస్తోంది. మాయ పెదాలు వైషు దేహాన్ని మొత్తం చుట్టి వస్తున్నాయి . మూసుకున్న కనురెప్పలను ముద్దాడింది. వైషు పెదాలు సన్నగా వణుకుతున్నాయి. ఆ వణికే పెదాలను ,వాటి చాటున తమకాన్ని అర సెకండ్ విభ్రమ గా చూసింది మాయ. మాయ చేతులలో వైషు శిల్ప శరీరం అనేకానేక వొంపులు తిరుగుతోంది.

మాయ ఊపిరి వెచ్చగా తాకుతుంటే నెమ్మదిగా కనురెప్పలు తెరిచి రెండు చేతులతో మాయ ను దగ్గరకు లాక్కొని “ నీ చేతుల్లో ఏదో మంత్రదండం ఉంది. నీ చూపుల్లో ఇంకేదో శక్తిపాతం . వద్దు వద్దు అనుకుంటూనే నీ దగ్గర పసి పాపనై పోతాను ” వైషు మంద్రస్వరపు మత్తు తో మాట్లాడుతుంటే చూపుడు వేలితో వైషు పెదాల మీద సుతారం గా రాసింది మాయ.

అలా ఆ రెండు దేహ తంత్రులు ఒకదాని నొకటి కొనగోటి తో మీటుకున్నాయి. కాంక్షలు అల్లరిగా ఆడుకున్నాయి. కాసేపటి కి అలసిపోయి ఆడుతున్న ఆట ను ఆపి ఒకరిపక్కన మరొకరు అలా చేతులు పట్టుకొని పడుకుండిపోయారు. పెనవేసుకొన్న రెండు చేతుల స్పర్శ తో ఒకరికి ఊరట, సాంత్వన ,మరొకరికి ధైర్యం, నిశ్చింత.

***

5.

కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చేసిన మాయ కారు తీసి  ఎటు వెళ్ళాలో ఏమీ ఆలోచించుకోకుండా   డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆలోచనల్లోంచి బయటపడి చూస్తె ఎదురుగుండా బుక్ ఉమన్ స్టోర్ బోర్డ్ కనిపిస్తోంది. .

లోపలకు వెళ్ళగానే “ హాయ్ మాయా! వైషు రాలేదా?” బాగా పరిచయమున్న స్టోర్ మేనేజర్ క్యాతీ  అడుగుతుంటే నో అంటూ సంభాషణ పొడిగించ కుండా ముందుకెళ్ళి బుక్స్ చూడటం మొదలుపెట్టింది.

పుస్తకాలు చూస్తోంది కానీ మనసంతా జరిగన విషయాల చుట్టే తిరుగుతున్నాయి. ఏ పుస్తకం తెరిచి చూసినా కొంచెం అమాయకంగా, మరి కొంత సిగ్గుగా నవ్వే వైషు మొహమే గుర్తుకు వస్తోంది. బెడ్ రూమ్ లో ఇంకా తన దగ్గర కొంత బెరుకుతనమే చూపించే వైషు గుర్తుకు రాగానే మాయ మనసు కరిగిపోయింది.

పాపం పిచ్చి పిల్ల! అనవసరంగా తన మనసు నొప్పించాను. నేనే తొందరపడ్డానేమో. తను ఇంకా రెడీ గా లేదని తెలిసి కూడా నేను పుష్ చేసాననుకొని ఒక్క క్షణం బాధ పడింది. ఫోన్ చేసి సారీ చెప్పేస్తాను అనుకుంటూ ఫోన్ తీసింది. వైషు నుంచి తప్పనిసరిగా తన కోసం మిస్స్డ్ కాలో, టెక్స్ట్ మెసేజో ఉంటుందని ఊహిస్తూ ఫోన్ బయటకు తీసిన మాయ కు అలాంటిదేమీ లేకపోయేసరికి మళ్ళీ కోపం వచ్చేసింది. అయినా బ్రేకప్ అంది కదా వైషు. ఇప్పుడు నేను ఫోన్ చేసి సారీ చెపితే నన్నింకా చులకన గా చూస్తుందనుకుంటూ మళ్ళీ ఫోన్ లోపల పెట్టేసింది. కానీ ఆలోచనలు మాత్రం ఆగటం లేదు.

నేను ఊహించిందే కరెక్ట్. ఆ రాహుల్ పరిచయమయ్యే సరికి నేను నచ్చటం లేదు కాబోలు. అందుకనే బ్రేకప్ చెప్పింది. కనీసం ఫోన్ కూడా చేయలేదనుకునే సరికి మాయ బిగుసుకుపోయింది .  చేతిలో ఉన్న పుస్తకాన్ని  అక్కడ పడేసి బయటకు వచ్చి నిలబడింది.  అసలే కోపం, ఆ పైన ఆకలి. వెంటనే  థాయ్ రెస్టారెంట్ లోకి వెళ్లి ఆర్డర్ ఇచ్చి కూర్చొంది.

అసలు వైషు గురించి ఆలోచించకూడదనుకుంటూ బలవంతం గా ఆలోచనలు మరల్చే ప్రయత్నం చేసింది కానీ విఫలమవుతోంది మాయ. ఆర్డర్ చేసిన ఫుడ్ టేబుల్ మీదకు వచ్చింది. కోకోనట్ సాస్ తో చేసిన రెడ్ కర్రీ, రైస్ చూడగానే మళ్ళీ వైషు నే గుర్తుకు వచ్చింది. వైషు కోసమే గా వెజిటేరియన్ ఫుడ్ అలవాటు చేసుకుందనుకుంటూ పంతం గా దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ స్టూవర్ట్ ని పిలిచి మీ దగ్గర బీఫ్ దొరుకుతుందా? అని అడిగింది.

***

6.

నెమ్మదిగా చీకటి తెరలు వచ్చి లేక్ ముంగిట వాలుతున్నాయి ఎదురుగుండా ఉన్న కాఫీ చల్లారిపోయింది ఒక్క సిప్ కూడా చేయకుండానే. చుట్టూ ఉన్న టేబుల్స్ నిండిపోయాయి చూస్తూ ఉండగానే. చాలా టేబుల్స్ మీద స్టూడెంట్స్ కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు. జంటలు గా వచ్చిన వాళ్ళు, పిల్లలు, కుక్కలతో డెక్ అంతా గొడవ గొడవగా ఉంది. కానీ అవేమీ వైష్ణవి మనసు ని తాకటం లేదు. వైష్ణవి ఉన్న చోటు నుంచి పక్కకు కూడా కదలలేదు.

మాయా, తానూ ఇద్దరు అలా పబ్లిక్ లో గొడవ పడటం , ఏడవటం, మాయ తనను అలా వొంటరి గా వదిలేసి వెళ్లిపోవటం అవన్నీ కూడా తలకొట్టేసినట్లు అనిపించింది వైషు కు. అవమాన భారం తో తలెత్తి చుట్టూ ఎవరి వంకా చూడలేక తల దించుకొని కంప్యూటర్ వంక, పుస్తకాల వంక చూస్తూ ఉండిపోయింది.

ఎదురుగుండా “ డివైన్ కామెడీ” బుక్ కవర్ మీద నుంచి డాంటే సూటి గా తన వంకే చూస్తున్నట్లు అనిపించింది వైషు కి.

“ నేనెవరు? “

స్ట్రైట్? లెస్బియన్? బై సెక్సువల్?

మాయ ని ఇష్టపడటమంటే నేను లెస్బియన్ అని పది మంది ముందు ఒప్పుకోవాల్సి ఉంటుంది . రాహులో , ఇంకెవరినో కావాలనుకుంటే “ స్ట్రైట్” అనే లేబుల్ వేసుకోవాలి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుంది? అసలు ఈ విషయం చెప్పటానికి తల ఎత్తి ధైర్యం గా నాన్న ఎదురుగా నిలబడగలనా? అమ్మ కళ్ళల్లోకి చూస్తూ ఏం జరిగిందో, తన మనసు, తన శరీరం ఏం కోరుకుంటున్నాయో అర్థమయ్యేలా చెప్పగలనా? అసలు ఈ విషయం తెలిస్తే తమ్ముడేమనుకుంటాడు? ఫ్రెండ్స్ మధ్య తన ఇమేజి ఏమవుతుంది ? వీళ్ళందరూ నాతో అసలు మాట్లాడతారా? నన్ను వదిలేస్తారా?

సెక్సువాలిటీ అనేది పర్సనల్ బెడ్ రూమ్ వ్యవహారం గా ఎందుకు మిగలలేదో ?

మనసంతా ఒక్కసారిగా తేనెతుట్టె కదిలినట్లయింది . స్మృత్యంతర ప్రవాహం లో కొట్టుకుపోతోంది వైషు.

మాయ తో మొదటి పరిచయం , తోలిసారి మాయ నడుము కింద భాగం లో “ఇంద్రధనుస్సు” పచ్చబొట్టుని ముద్దు పెట్టుకున్న అనుభూతి , ఇంకా అనేక అందమైన అనుభవపు అనుభూతుల సుగంధం మనసుని తాకింది . మాయ తో ఒక్కో అందమైన అనుభవం గుర్తుకు వచ్చినప్పుడల్లా, ఒక విషాద చారిక నిషాదం లా గుండె లో గుచ్చుకుంటోంది .   ప్రతి సారీ మాయామోహపు మంత్రజాలం నుండి బయటకు వచ్చాక తనలో వచ్చే అపరాధ భావన గుర్తుకు వచ్చి మరింత గిలగిల లాడిపోయింది.

ఏది ఎక్కడ మొదలై ఎలా ముగిసిందో ఏం అర్థం కావటం లేదు .

కోర్స్ వర్క్, డాన్స్ ప్రాక్టీస్, పార్ట్ టైం జాబ్, వీకెండ్ పార్టీలు, హేంగోవర్ లు…వీటన్నింటి మధ్య ఇది కావాలని కానీ, ఇది వద్దని కానీ అనుకున్నానా? ఏది చేతికందితే అది తీసుకున్నాను. మాయ కూడా అలాగే ప్రవహించింది ఈ దేహం లోకి.   తన వొంటి ని తనే తాకి చూసుకుంది. ఈ ఒంటి మీద ప్రతి చోటా మాయ స్పర్శ. మాయ కు తెలియని చోటు అంటూ ఈ దేహం మీద ఎక్కడా లేదు. కానీ మాయ కు తన మనసు తెలియలేదు. తన భయాలు తెలియలేదు. తన ఘర్షణ అసలు తెలియలేదు అనుకోగానే గుండెలో ముళ్ళు గుచ్చుకున్న బాధ.

 

స్కూల్లో హోమో సెక్సువల్ రిలేషన్ షిప్ ల గురించి ఫ్రెండ్స్ మాట్లాడేటప్పుడు వొళ్ళు జలదరించేది. అంత అసహజంగా ఎలా ఉంటారో అనిపించేది. కానీ మాయ తనను ముద్దు పెట్టుకున్నపుడు అబ్బాయిలు ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ అయిందో అలాగే లేదా అంతకంటే ఎక్కువ ఫీల్ అయింది. తనలో ఇలాంటి లెస్బియన్ ఫీలింగ్స్ ఉన్నాయని తనకు కలలో కూడా తెలియలేదు. కానీ మాయ తో అనుభవం ఎంత సహజం గా ఉంది, ఎంత ఇష్టం గా అనిపించింది. మనసు కి ఏ తొడుగు లేకుండా ఎంత స్వేచ్ఛ గా ఉంది ఆ సమయం లో !

క్యాంపస్ క్లాసు లు , పార్ట్ టైం ఉద్యోగం తో అలిసిపోయి ఇంటికొస్తే మాయ తో అనుభవం ఒక రిలాక్సింగ్ గా అనిపించేది. బయట అందరికీ తెలిసేలా గర్ల్ ఫ్రెండ్స్ లా ఉందామని మాయ ఇలా పట్టుబడుతుందని అసలెప్పుడూ ఆలోచించలేదు.

 

కంప్యూటర్ స్క్రీన్ మీద పాస్వర్డ్ తో లాక్ చేసిన ప్రైవేట్ ఫోల్దర్ ఓపెన్ చేసి మాయ, తానూ కలిసి తీయించుకున్న ఫోటోలు చూస్తున్న కొద్దీ వైషు లో దుఃఖం ఎక్కువవుతోంది.

ఒక పక్క తన సెక్సువాలిటీ ఏమిటి, తనకేం కావాలి, తన మనఃశరీరాలు ఏం కోరుకుంటున్నాయో ఆలోచిస్తోంది. మరో వైపు అసలు ఈ లేబుల్స్ ఎందుకు? ప్రపంచమంతా కొన్ని లక్షల మంది ఇలాంటి రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు కూడా సమాజం లో ఇంత వివక్ష ఎందుకు చూపిస్తోందని ఆలోచిస్తోంది.

నా సెక్సువల్ ఫీలింగ్స్ మొత్తం నా వ్యక్తిత్వాన్ని, నా కుటుంబాన్ని శాసిస్తాయా? అదేం న్యాయం? అమ్మావాళ్ళు నన్ను వేలెస్తారా? ఎవరివి ఆ చూపులు? ఇంట్లో వాళ్లవా? స్నేహితులవా? ఎవరు వాళ్ళంతా? ఎందుకలా చూస్తున్నారు తన వంక అసహ్యంగా?ప్రశ్నార్థకం గా? మృతదేహాలని మార్చురీలో పెట్టినట్లు నేను కూడా ఈ దేహాగ్ని ని ఐస్ గడ్డల మధ్య చల్లార్చుకోనా ?

ఏమన్నది మాయ? ఇది “ స్ట్రైట్ లవ్” అయితే ఇలా ఉండేదానివా అని కదా అడిగింది. నిజమే. మాయ ప్లేస్ లో రాహులో , ఇంకెవరో ఉంటే ఏం చేసేది? ఆలోచిస్తున్న కొద్దీ ఒకొక్క పొర నెమ్మదిగా తొలగిపోతోంది. మాయకున్నంత తీవ్ర ప్రేమ తనకెందుకు లేదో అర్థం కాలేదు. కానీ మాయ ప్రేమ లోని గాఢత మనసు కు తెలిసింది . అందులోని నిజాయితీ అర్థమయింది . ఈ మొత్తం లో తానెక్కడ నిలబడి ఉందో తెలిసినట్లనిపించింది వైషు కు. తాను రాహుల్ తో ఫ్రెండ్లీ గా ఉంటే మాయ జెలసీ ఫీల్ అయిందని అర్థమయ్యాక గర్వం గా అనిపించింది వైషు కు.

 

కానీ ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఏం కావాలో తెలిసినట్లే ఉంది. భవిష్యత్తు గురించి తలచుకున్నప్పుడు మాత్రం భయంగా అనిపిస్తోంది. ఒక్కో ఆలోచన మెదడు లోని ఒక్కో పొర ను చీల్చుకొని బయటకు వస్తోంది. ఒక్కో చీలిక లోంచి రక్తం బయటకు చిమ్ముకొస్తున్న భావన.

తలంతా విపరీతమైన పోట్లు. లక్షలాది సూదులతో పొడుస్తున్న బాధ. గుండెంతా బరువుగా…

చుట్టూ చీకటి గానే ఉంది. కానీ కళ్ళకు మాత్రం అది భరించలేని వెల్తురు లాగా అనిపిస్తోంది. కళ్ళు ఆ వెలుగు ని తట్టుకోలేక పోతున్నాయి. కళ్ళు విప్పార్చి చూడలేకపోతోంది. మైగ్రైన్ అటాక్ మొదలవుతోందని అర్థమయింది ఇక ఆ నొప్పి ఎంత ఎక్కువవుతుందో, ఏ భాగం నుంచి ఏ భాగం వైపు కు మరలుతుందో తెలుసు కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా క్యాబ్ కి కాల్ చేసింది.

అన్నీ వైపుల నుంచి ఆలోచనలు, నొప్పి శరీరాన్ని నలిపేస్తున్నాయి . టేబుల్ మీద తల వాల్చుకొని పడుకుండిపోయింది. ఎందుకు ఏడుపొస్తోందో తెలియటం లేదు. కానీ అలా కళ్ళు కన్నీళ్లు పెట్టుకోవటం మనసు కి, శరీరానికి తేలికగా ఉంది. క్షణం లో ఇంటికెళ్ళి పోవాలని ఉంది. కానీ క్యాబ్ ఇంకా రావటం లేదు…

మాయ ఇంట్లో ఉందా?

- కల్పనా రెంటాల

Kalpana profile2

 

Download PDF

35 Comments

 • Karimulla Ghantasala says:

  బాగుంది

 • gorusu says:

  కల్పన గారూ … కుండలు బద్దలు కొట్టడం సులువే . మీరు కంచు బిందెలు భళ్ళుమని బద్దలు కొట్టారు . మనసు పూర్తిగా అభినందనలు మీకు. ఆల్చిప్పలలో ముడుచుకుని పడుకున్న రచయితలకు కింద సెగ తగిలించి ప్రపంచాన్ని చూడండని హెచ్చరించారు – గొరుసు

 • ముందుగా కల్పనా గారికి అభినందనలు. ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడని ఒక అంశాన్ని ఎన్నుకొని కధ రాసినందుకు. అయితే ఈ కధ ఇంకా బాగుండటానికి ఇలా రాస్తే బాగుండేది అనిపించింది. ఇది నా అభిప్రాయం మాత్రమే.
  1. కధలో చూపించే పరిసరాలు కూడ ఒక్కోసారి కధలో పాత్రల పాత్ర తీసుకొంటాయి…. కధకు అవసరం అయినంత వరకు మాత్రమే వాటిని వాడుకొంటే. కొద్దిగా ఎక్కువగా మీరు మీకు తెలిసిన వాతావరణాన్ని కధలో ఇంటర్ ప్రెట్ చేసారు. అది కధకు బలం చేకూర్చక పోగా సారాన్ని పలచన చేస్తున్నట్లు అనిపించింది.
  2. ఇక వారిద్దరి మధ్య రొమాన్స్ వర్ణన అంత అవసరం లేదేమో. అది స్త్రీ పురుషులు అయినా సరే, శృంగార వర్ణన కధ స్థాయిని తక్కువ చేస్తుంది. మీరు ఒక కొత్త తరహా సంబంధాన్ని పాఠకులకు పరిచయం చేస్తున్నారు. ఆ సంబంధాలు కొనసాగించడంలో ఒక భారత యువతి పడిన ఘర్షణను ప్రధానంగా మన ఇండియన్ పాఠకులకు తెలియచేస్తేనే బాగుండేది అనిపించింది.

  • Aparna says:

   నాక్కూడా అలాగే అనిపించింది. ఇలాంటి కథాంశాన్నిఎంచుకున్నందుకు చాలా అభినందనలు.

 • SYED KHURSHEED says:

  చాల బాగుంది.కొత్త ప్రపంచాన్ని సైతం రచయితలు చూడాలని ఈ కథ బోధిస్తుంది.కంగ్రాట్స్.

 • raghava says:

  బాగా రాశారు…

 • subhashini says:

  కల్పన గారు… వైషు తాత్కాలికం గా అప్పటికి మళ్ళీ మాయ తోడు ను కోరుకుంది. అది అలా తాత్కాలికమేనా? సమాజాన్ని ఎదిరించి , చెప్పి అందులోనే కొనసాగుతారా? సాంప్రదాయ ఆలోచనలను పక్కన పెట్టి ఈ సంబంధం ను అర్దం చేసుకున్నాం కాబట్టి చివరికి ఏ నిర్ణయం తీసుకున్నారో
  తెలుసుకోవాలని ఉంది.

  • కె.విచలిత says:

   ఈ కథని అర్థం చేసుకోడానికి సంప్రదాయ ఆలోచనలు పక్కన పెట్టడం ఎందుకండీ? సంప్రదాయం లో ఉండికూడా అర్థం చేసుకోవచ్చు . తాత్కాలికమో అతాత్కాలికమో … ఒకరికొకరు ప్రేమను కోరుకున్నంత వరకు కలిసుంటారు . ప్రేమ ఏమయినా ఘనీభూతమా … నిలకడగా వొకే దగ్గర ఉండటానికి . అచంచలం. ప్రేమ వీగిపోయి … లోపిస్తే … వైషు మరో మాయ కోసం చూడొచ్చు .. మాయ మరో వైషు కోసం వెతకొచ్చు. లేదంటే స్వలింగానికి స్వస్తి పలికి పురుషుడిని కూడా జీవితం లోకి ఆహ్వానించ వచ్చు . ఎవరూ దొరక్క పోతే మనల్ని మనం ప్రేమించు కోవడం తప్పదు కదా … ఏ తోడూ లేని నాడు నీ నీడే నీకు తోడని సినారె అన్నట్టు …. వాళ్ళకు కావలసింది మంద మారుతం లాంటి చల్లని మనో స్పర్శ . అరమరికలు లేని ప్రేమ … అందుకే ఈ వెంపర్లాట … ప్రేమకు లింగ బేధం ఏల ? పిల్లలను కనడానికి కావాలి గానీ! ఈ ప్రపంచం లో ఒక గూటి కింద ఉండి, పిల్లలను కంటూ , కాపురాలు చేసే వారంతా స్వలింగ సంపర్కానికి అతీతులేమో గుండెమీద చెయ్యి వేసుకుని చెప్పమనండి చూద్దామ్ ! ఏ పుట్టలో ఏ పాముందో ఎలా చెప్పగలం ? ఏ పుట్టలో ఏ పాము ఉంటే మటుకు ఏం తప్పట ? సమాజం తప్పుగా అనుకున్నంత వరకూ చాపకింద నీరులా ప్రవహిస్తూనే ఉంటుంది ఇది … ప్రకృతి సహజమయిన ఆలోచనలను ఆపడం ఎవరితరం ?

   • subhashini says:

    సాంప్రదాయాలను పక్కన పెట్టకుంటే ఈ కథ ను చదవలేం కదండీ!(పోనీ ఇంకా ఇలాంటి సంబంధాలను అర్దం చేసుకునేంత ఎదగలేదేమో). ప్రేమ అంటే తెలుసు. స్త్రీ, పురుషుల మధ్య రొమాన్సే తెలుసు ఇప్పటిదాకా.కల్పన గారి కథ ముగించిన దగ్గర నా ప్రశ్న మొదలైంది. సమాజం ఆమోదించని సంభందాలలో ఒక సంఘర్షణ ఉంటుంది.ఆ స్ట్రెస్ ను అధిగమించిన వాళ్ళే కడదాకా వాటిని కొనసాగించగలుగుతారు. వైషు, మాయ అప్పటిదాకా రహస్యం గా కొనసాగించిన సంబంధం పెద్ద కస్టపడనవసరం లేకుండా గడిచిపోయింది. ఎప్పుడైతే సమాజం ముందు పెట్టాలి అనుకున్నారో అప్పుడు కష్టాలు మొదలయ్యయి. ఇది వాళ్ళిద్దరు స్త్రీ లు అయినందు వల్లే రాలేదు. మామూలుగా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళకు కూడా ఇది తప్పదు. ఆ పాయింట్ ను దాటి ఎలా , ఎంత కాలం జీవిస్తారు అనేది ముఖ్యం.ఆ మెచ్యురిటీ లేక ఎన్నో ఆదర్శ వివాహాలు కూడా కుప్పకూలాయి. సమాజం నుండి ఇంత వ్యతిరేకత ఎదురయ్యే ఈ సంబందం వాళ్ళు ఎంత ప్రశాంతం గా కొనసాగించగలరు?చాలా కష్టం.ప్రేమే కావాలనుకోవడం , ఆ ప్రేమ రోజూ నిలుపుకోవాలంటే చాలా చాలా ఓపిక కావాలి. లేదంటే ఈ సంఘర్షణ లో పడి వాళ్ళ జీవితోత్సాహం చచ్చిపోతుంది!!!

 • Thirupalu says:

  ఇతివృత్తం కొత్తది. సమాజంలో ఈ సమస్య పెద్దదైనపుడు వాటి గురించి కూడా రచయితలు పట్టించు కోవాలి. కద బాగుంది.

 • DrPBDVPrasad says:

  సంఘర్షణ ఉందంటే ఎక్కడో తప్పు చేస్తున్న భావం ఉన్నట్లే వైష్ణవి సంప్రదాయలను గౌరవించుకొని మాయ పొరల నుండి బయటపడుతుంది
  డా పిబిడివిప్రసాద్

 • challa srinivas says:

  vaishu expressions beautiful kalpana garu…

 • S. Narayanaswamy says:

  రమాసుందరి గారి వ్యాఖ్యతో విభేదిస్తాను. వచనంలో లలితమైన శృంగారం రాయడం అంత సులభం కాదు.
  శృంగార చర్య వర్ణనే కథని ఎలివేట్ చేసింది. లేకపోతే ఇది మామూలు టీనేజి ప్రేమకథే కాదా? తొలిసారి ఇంట్లోనించి, తలిదండ్రుల రక్షణవలయంలోచి బయటికి వచ్చిన ఆడపిల్ల, ఆ స్వేఛ్ఛలో, తన పరిధిని విస్తరించుకునే ప్రయత్నంలో తనని తాను అన్వేశించుకునే తప్పటడుగుల్లో .. అవతలి మనిషి అబ్బాయయితేనేం, అమ్మాయయితేనేం?
  లెస్బియన్ లవ్ అనేది ఒక కాన్సెప్టుగా .. దీపా మెహతా సినిమా ఫెయిర్ వచ్చేసి సుమారు పదిహేనేళ్ళు దాటినాక ఇంకా దాని రిలవెన్స్ ఏంటి? పైన విచలితగారు చెప్పినట్టు ప్రకృతి సహజమయిన ఆలోచనలను ఆపడం ఎవరి తరం?
  ఈ కథని రచయిత్రి చాలా తెలివిగా మలిచారనే ఒప్పుకోవాలి, కానీ కొంత అస్పష్టత, అయోమయము తప్పలేదని నాకు అనిపించాయి. కథలో చిత్రించడానికి ప్రయత్నించిన సంఘర్షణ యవ్వనంలో ఎవరికైనా కలిగే అయోమయమా? తొలిప్రేమ కలిగించే అయోమయమా? ఇంట్లో ఉండే ఇండియన్ వాతావరణానికి వొంట్లో చెలరేగే హార్మోనులకీ మధ్య యుద్ధమా? ఇవేవీ కాక ప్యూర్ అండ్ సింపుల్ స్వలింగ ప్రేమకథా?

  • ఆర్. మంగతాయారు says:

   నారాయణ స్వామిగారూ … ప్రస్తుతానికయితే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్యూర్ అండ్ సింపుల్ స్వలింగ ప్రేమకతే అనిపించింది నాకు . ముఖ్యంగా హాస్టల్స్ ఉండే వాళ్ళు (ఏ లింగామయినా ) యవ్వనోద్రేకం లో ఒకరి మీదా ఒకరు కాళ్ళు పెనవేసుకుని , కావలించుకుని పడుకోవడం … అది ఉద్రేకం కలిగించే చర్య . దీన్ని ఏ లింగం తోనూ పోల్చలేము . కానీ మాయ , వైషు లు ఒకే దగ్గర కలిసి ఉన్నారంటే వాళ్ళది స్వచ్చమయిన స్వలింగ సంపర్కమనే మనం భావించాలి. పైన విచలిత గారు అన్నట్టు ఏ ప్రేమా శాశ్వతం కాదు … భిన్న లింగాలే పిల్లలు పుట్టాక కూడా ప్రేమ రాహిత్యం తో చల్ మోహనరంగా అంటూ విడిపోతున్న ఈ కాలం లో స్వలింగాల కొచ్చిందీ … తంటా! కలిసి ఉన్నన్నాళ్ళూ కలిసి ఉంటాయి. లేకపోతే తలో దిక్కు చూసుకుంటాయి – ఏమంటారు ?

  • Thirupalu says:

   //ప్రకృతి సహజమయిన ఆలోచనలను ఆపడం ఎవరి తరం?//
   ఈ బావాలని చాలా కధల రూపంలో చదివాము, కానీ వాస్తవ జీవితం గురించి తెలియదు. ఇక్కడ ప్రకృతి సహజమయిన ఆలోచనలు అనే మాట చాలా సందర్బాల్లో చాలా అర్ధాలు ఇస్తుంది. అన్ని సందర్బల్లో న్యాయమైనదేనా? అలా అయితే రేప్‌ అనే మాటలోకూడా పసలేదు? ఏక వ్యక్తి ప్రకృతి సహజ మైన ఆలోచనలను రెండో వ్యక్తి అంగీకరించకపోవడమే రేప్‌ ఆ? ఇక్కడతర్కం ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచనలు ప్రకృతి సహజమైనవే కదా? అవునా? మరి దాన్ని అదుపు చేసుకోక పోతే ఏమవుతుంది? రేప్‌ కు దారితీస్తుంది. దాన్ని మనం సమర్దించాలా? ఇది ఆరోగ్యకరమైనది ఎంత మాత్రం కాదు. కొన్ని సందర్బాల్లో ప్రకృతి సహజమైన ఆకలి కూడా అదుపు చేసుకోవాల్సి వస్తుంది. అదుపు చేసుకుంటున్నామా లేదా?
   కధను సింపటికల్‌ గా అర్ధ్స్మ చేసుకోవాలంటే ఈ చర్య వెనుకనున్న సైంటిపిక్‌ రీజన్‌, సైకాజి అర్ధం ఐ వుండాలి. అది తెలియకుండా అర్ధం చేసుకోవతం కస్టం.

   • మంజరి లక్ష్మి says:

    ప్రకృతి సహజము గురించి మీరు చెప్పిన తర్కం బాగుంది. వీళ్ళు చెప్పే విపరీతమైన స్వేచ్చ ఒక వైరుధ్యం అని వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళకు విపరీతమైన స్వేచ్చలు కావాలంటే, వీళ్ళకు తప్ప మిగతావాళ్ళకు అసలు స్వేచ్చలే ఉండకూడదు అన్నట్లే కదా! ఈ స్వలింగ సంపర్కమే అందరు మొదలెడితే, మనుష్యులు ఉద్భవించటమే ఆగిపోతుందనీ , అది ప్రక్రుతికి వ్యతిరేకంగా నడుచుకున్నట్లవుతుంది అనీ మన స్వేచ్ఛ ప్రకృతికి లోబడి ఉంటే మంచిది అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. బాగుంది.

 • subhashini says:

  మామూలుగా ఆడవాళ్ళు అందం గా చీర కట్టుకుని, ఆత్మ విశ్వాసం తో కనపడితే “అబ్బ …ఈవిడ ఎంత బాగుంది” అనుకుంటాం. ఎవరు ఎవరిని చూసి అయినా ఆకర్షణ కు లోనవ్వడం సహజం. ఆకర్షణ వేరు….అది శారీరకం గా కోరుకునే దాకా వెళ్ళడం వేరు. కథ లో వైషు, మాయ సహజం గా ఆకర్షణ కు లోనయ్యారు.ఆ సహజత్వాన్ని తప్పు పట్టడం లేదు.కానీ ఆ సంబంధం ను కొనసాగించడం అంటే నిమిషానికొక నిప్ప్పుకణిక ను మింగడమే.వాళ్ళు కొనసాగించారా ..లేదా?సమాజానికి చెప్పార? లేదా అని సందేహం.

 • Jayashree Naidu says:

  కథలు రచయిత మానస పుత్రికల్లాంటివి. ఇది అందుకు మినహాయిమ్పేమీ కాదు.
  ఎంతో శ్రద్ధ తో మలుచుకున్న నేర్పరి తనం ఈ కథ లోని ప్రతి పదం లోనూ తొణీకిస లాడుతుంది
  ఈ కథ కూడా అలాంటిదే అనిపించింది. కథా వస్తువు కఠినమైనా మీ నేరేషన్ లో ప్రవాహం లా సాగిపోయింది.
  ఎండింగ్ దగ్గర ఇంకొక పేరాగ్రాఫ్ ఉందేమో అనీ ఒక నిముషం పైకీ కిందకీ తిప్పాను. చాలా బాగా రాశారు కల్పన గారూ

 • Kosuri Uma says:

  IT TAKES A KALPANA RENTALA TO…take up such intriguing and may be controversial themes….and pen her thoughts down so interestingly
  Vow – How well written is this story about such a issue?… lot of us know of such matters existing around and some of us secretly making our own judgement…

  If it takes a Mira Nair to make a statement with her realistic bold movies….
  It takes a Kalpana Rentala to render so beautifully such issues that very much exist in society….
  HATS OFF TO YOU, KALPANA>>>>

 • ari sitaramayya says:

  కల్పనా గారూ,
  మరో మంచి కథ రాశారు.
  కథనం బాగుంది. పాత్రల చుట్టూ తగిన వాతావరణాన్ని చిత్రించారు. అభినందనలు.

  నారాయణ స్వామి గారు కథలో కొంత అస్పష్టత, అయోమయము కనిపించాయన్నారు. పాత్రల్లో, ముఖ్యంగా వైషు పాత్రలో చాలా సంఘర్షణ జరుగుతుంది కాబట్టి, అస్పష్టతా అయోమయం కథకు బలాన్నిచ్చాయేమో.

  ఇక నాగొడవ. “మాయ ఇంట్లో ఉందా?” అంటూ కథని ముగించారు. కథలకు ఖచ్చితమైన ముగింపులు ఉండాలనే అభిప్రాయం మీకు బలంగా ఉందో, లేక అలా అనుకునేవారికోసం ఇలా రాశారో తెలియదు. ఈ ముగింపుతో సూచన ప్రాయంగా వైషు మాయా దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించినట్లు చెప్తున్నారు. హృదయంతో రాసిన కథకు మనసుతో రాసిన ముగింపు అతికించారు. వైషులో జరుగుతున్న ఘర్షణను చాలా సమర్థవంతంగా చిత్రించారు, కాని ఈ ముగింపు వైపు ఆ అమ్మాయి ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మనుషులందరూ జంటలు జంటలుగా ఉండాలని ఆశించే వారిని సంతృప్తిపరచటానికి చేసిన ముగింపు లాగా ఉంది నాకైతే. అయ్యో అంత పెద్ద నిందా? అనిపిస్తే క్షమించ వలసిందిగా మనవి.

 • నిశీధి says:

  ఫైనల్లీ , ఇండియన్ తెలుగు రచనలలో కుడా కొంత వైవిధ్యం . కొంత అన్న పదం సరి అయినది కాదు ఏమో .,.. చాలా వైవిద్యం అన్న పదమే ఆప్ట్ ఇక్కడ , కోరిక అన్నది ఆడ మగా ఇద్దరికి సమానంగా అంతే ఉదృతంగా ఉంటుంది అన్న విషయమే బుర్రలోకి ఎక్కించుకోవటం కష్టం అయిన సమాజాలలో పుట్టి పెరుగుతూ గే షిప్స్ పై కథ రాయటమే ముందస్తు గొప్ప విషయం , ఫిజికల్ ఇంటరెస్ట్ కంటే కుడా గే రిలేషన్షిప్స్ లో మానసిక అవసరాలు ( ఇంకో జెండర్ ని నమ్మని అభద్రతా భావాలు ) ఎక్కువ ఉంటాయి . మీ నెక్స్ట్ స్టోరీ లో ( ఇది ఒక సిరిస్ ఆఫ్ స్తోరిస్ గా రాస్తే , పై నుండి ఎక్కువ మంది రాయగలిగితే చాల బాగుంటుంది ) ఆ పాయింట్ పై ఎక్కువ రాస్తే బాగుంటుంది .

 • ఆర్.మంగతాయారు says:

  మంజరి లక్ష్మి గారూ … ఈ కథలో కల్పన గారు చెప్పింది “స్వేచ్చ” గురించి కాదు. వట వృక్షం లాంటి జీవితం లో స్వలింగ సంపర్కం అనేది ఒక చిన్న ఊడ అని. ఇలాంటి ఊడలు కూడా ఉన్నాయని చెప్పారు. అంతే కానీ ఓల్ మొత్తంగా ప్రపంచాన్ని అంతా స్వలింగ సంపర్కులు అయిపొమ్మని కాదు.

  • మంజరి లక్ష్మి says:

   నేననేది అదేనండి తాయారుగారు. ఊడలకు స్వేచ్చ ఇచ్చి అవి నేలలోకి వెళ్ళి వేళ్లూని ఒకో వటవృక్షం గా మారితే ఫలితం ఎలా ఉంటుంది, దాన్ని మనం సమర్ధించ కూడదు కదా అనే నే చెప్పేది. సాహితి గారు చెప్పినట్లు ఫెమినిజం చివరికి ఇలా దారి తీయకూడదు కదా! నిశీధి గారు చెప్పినట్లు ( ఫిజికల్ ఇంటరెస్ట్ కంటే కుడా గే రిలేషన్షిప్స్ లో మానసిక అవసరాలు ( ఇంకో జెండర్ ని నమ్మని అభద్రతా భావాలు ) ఎక్కువ ఉంటాయి) అటువంటి మానసిక పరిస్థితులు ఉన్న వాళ్ళకు ఎటువంటి ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ ఇప్పించాలీ, ఎలా ధైర్యాన్ని ఇవ్వాలి అని అటువంటివి చర్చిస్తే బాగుంటుంది. ఇంతకీ పైకి ఇద్దరు స్త్రీలే అయినా ఒకరు మొగవాళ్ళ లాగా అనుమానం, అసూయా, ఆధిపత్యం చూపిస్తూ ఉంటే ఇంకోళ్ళు ఆడవాళ్ళ లాగా ఉక్రోషం ఏడుపు, భయాలనే వ్య క్తీకరించారు. ఇంతోటి దానికీ, ఈ ప్రకృతి విరుద్ధమైన సంబంధం వల్ల ఒరిగిందేమిటీ?

   • మంజరీ లక్ష్మీ గారు,
    మానసిక కౌన్సిలింగ్ లతో తీరే సమస్యలు కావండి ఇవి. ఒక మనిషి సెక్సువాలిటీ ఆడ, మగ అనే కాకుండా మధ్యలో ఎన్నో రకాలుగా ఉంటుంది. ఈ విషయాల మీద రీసెర్చి జరుగుతుంది. ఈ డిఫరెంట్ వ్యక్తులు సాంప్రదాయకమైన సెక్స్ ని అనుభవించలేరు. భారతదేశం లాంటి దేశాలలో ఈ సంబధాలను అర్ధం చేసుకోలేక వీళ్ళు చాలా ఘర్షణలకు గురవుతున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఇళ్ళ నుండి వెలివేయబడుతున్నారు. ఈ సంబధాలను పర్వర్షన్స్ లాగా తీసి పారవేయడం సమంజసం కాదనుకొంటాను. ఇక ఆధిపత్య భావాలు అన్ని సంబంధాలలో ఉంటున్నాయి.( స్నేహితుల మధ్య కూడ) నాకు అర్ధం అయినంత వరకు ఈ కధ ఆ విషయాన్ని ప్రధాన అంశంగా డీల్ చేయలేదు.

 • karunanakar says:

  మానవ సంబంధాలను వ్యవస్థీకృతం చేసిన అనేక అంశాలలో ‘లైంగికత కూడా ఒకటి’.సమాజం అమోదించిన, అమలులో ఉన్న నమూనాకు భిన్నమైనమానవ సంబంధాలు ఎలాంటి న్యుననతను కలిగిస్తాయో కల్పన గారు బాగా చెప్పారు. ఒకే సెక్సుకు చెందిన వారిమధ్యే కాదు భిన్నమైన రంగులు పొదుగులు ఆకారాలు ఉన్న వారి మధ్య కూడా లైంగిక సంబంధాలు సమాజానికి ఆమోదనీయాలు కాదు. ఈ కధలో aasaktikaramaina aMSamEmaMTE మాయ, vaiShNavilu శారీరకంగా ఒకే లింగానికి చెందిన వారైనా లైంగికతలో భిన్నమైన పాత్రలు ధరించారు. టామ్ బాయ్ లా పెరిగిన మాయని ఉద్దీపింప చేసినవి ఎగిసేపడె వైషవి వక్షోజాలు మాత్రమే కాదు ఆమె సబ్మిసివ్ నెస్ కూదా. మరి వైష్ణవికి? మాయ చొరవ, తన శరీరంపై హక్కు ను క్లెయిమ్చేయగలిగిన మాయ possesiveness చూడ్డానికి ఇది ఇద్దరు స్త్రీల మధ్య సంబంధ్ంగా కనపడినా. వాళ్ళ ల్లైంగికతకు ఆధారం అధిపత్యం ఆధారంగా ఉన్న స్త్రీ పురుష సంబంధాలే. ఇక్కడ జరిగింది రోల్ ప్లే మత్రమే. బహుశ ఈ రోల్ ప్లే నే ఇల్లంటి సంభాధాలకు ఉద్దీపన కావచ్చు.

  • nagaraju says:

   కల్పన గారు సమాజంలో ఉన్న జెండర్ రోల్స్ ఎలా ఆధిపత్య భావనలుగా కొనసాగుతున్నాయో రాసారు. వాటికి భిన్నమైన సంబంధాలను రాయడం ద్వారా ప్రేమ, లైంగికతల గురించి ఉన్న చట్రాలను బద్దలు చేసారు. “ఆర్గాజం” చుట్టూ ఉన్న ఆధిపత్య భావాలకు కూడా ఇది ఒక సవాల్. ఈ కత లైంగికత, సెక్స్, హోమోసెక్సువాలిటీ విషయాలను చర్చలోకి తెస్తున్నది. సమాజం ఆమోదించని సంబంధాలలో ఉండే ఘర్షణను వెలుగులోకి తెస్తున్నది.
   అయితే సామజిక ఆమోదం పొందిన జెండర్‍రోల్ కు మారుగా సమాజంలో కొనసాగుతున్న భిన్నమైన సంబంధాలలో కూడా “జెండర్ రోల్” ఏదో ఒక విధంగా వ్యక్తమవడం ఇక్కడ మనం చూస్తున్నం. కతలో ఒకరు లలితంగా, మరొకరు టామ్‍బాయ్లా ప్రవర్తించడం ఇందుకు ఉదాహరణ.
   భిన్నమైనవని మనం అనుకున్నవి కూడా మారు రూపాలతో సమాజపు ఆధిపత్యపు భావాలనే కొనసాగించడం ఒక ఐరనీ. దీన్నే కరుణాకర్ గారు రాసారు.

 • nagaraju says:

  కల్పన గారు సమాజంలో ఉన్న జెండర్ రోల్స్ ఎలా ఆధిపత్య భావనలుగా కొనసాగుతున్నాయో రాసారు. వాటికి భిన్నమైన సంబంధాలను రాయడం ద్వారా ప్రేమ, లైంగికతల గురించి ఉన్న చట్రాలను బద్దలు చేసారు. “ఆర్గాజం” చుట్టూ ఉన్న ఆధిపత్య భావాలకు కూడా ఇది ఒక సవాల్. ఈ కత లైంగికత, సెక్స్, హోమోసెక్సువాలిటీ విషయాలను చర్చలోకి తెస్తున్నది. సమాజం ఆమోదించని సంబంధాలలో ఉండే ఘర్షణను వెలుగులోకి తెస్తున్నది.
  అయితే సామజిక ఆమోదం పొందిన జెండర్‍రోల్ కు మారుగా సమాజంలో కొనసాగుతున్న భిన్నమైన సంబంధాలలో కూడా “జెండర్ రోల్” ఏదో ఒక విధంగా వ్యక్తమవడం ఇక్కడ మనం చూస్తున్నం. కతలో ఒకరు లలితంగా, మరొకరు టామ్‍బాయ్లా ప్రవర్తించడం ఇందుకు ఉదాహరణ.
  భిన్నమైనవని మనం అనుకున్నవి కూడా మారు రూపాలతో సమాజపు ఆధిపత్యపు భావాలనే కొనసాగించడం ఒక ఐరనీ. దీన్నే కరుణాకర్ గారు రాసారు.

 • నిశీధి says:

  మంజరిగారు మానసిక అవసరం అంటే ఆడ మగ మధ్య కూడా ఉంటుంది గా అపుడు మనం అందరికి కౌన్సిలింగ్ చేయించాలి . లోల్ . లేకపోతే అడ మగ మధ్య జస్ట్ ఫిజికల్ అవసరాలే ఉంటాయి అనుకోవాల్సి వస్తుంది . ఇదొక చేంజ్ సమాజం లో . ముఖ్యంగా కట్టుబాట్లు ఎక్కువ పెట్టేకోద్దీ , దాన్ని మించి పోవాలి అన్న ఆలోచన తో వచ్చిన చేంజ్ . ఇప్పటికే చాల దేశాలు అఫీషియల్ గా గుర్తించాయి , వాళ్ళ పెళ్ళిళ్ళను కూడా అక్సెప్ట్ చేస్తున్నాయి . ఇలాంటి అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయం మీద స్టడీ లు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి . నాకు అర్ధం అయింది మాత్రం ఒక్కటే కంఫర్ట్ లెవెల్ ( దానికి వ్యక్తిగత కారణాల కంటే కూడా చాల వరకు సోషల్ రీజన్స్ ఉంటాయి ) ఈ మొత్తం లో చాలా imp . నాలా ఆలోచించే , నాలా స్పందించే వ్యక్తి ఆడ అయితేనేమి మగ అయితేనేమి కంపానియన్షిప్ కి అన్న ఆలోచన ఇక్కడ మానసిక అవసరం గా మారుతుంది . మీకో ఇంకో రహస్యం చెప్పనా ? మామూలు రిలేషన్ షిప్ బ్రేక్ అయితే ఉన్న కష్టం కంటే కూడా ఇలాంటి నమ్మకాలు వమ్ము అయితే తట్టుకోవటం చాలా కష్టం ( బహుశ ఇంకో జెండర్ ని నమ్మలేని తనం లో మొదలయిన అవసరం కాబట్టి
  సేం జెండర్ మీద ఆ నమ్మకం 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది )

  • నిశీధి గారు, మీరు ఈ సంబంధాలకు ఉన్న బయలాజికల్ బేస్ గురించి మాట్లాడటం లేదు. అది లేకుండా ఇంతమంది వ్యక్తుల్లో అది వ్యాపించదు. ఇన్ని ఉద్యమాలు జరగవు. ఇంత ఘర్షణ ఉండదు. మీరు మిల్క్ సినిమా చూసి ఉంటారనుకొంటాను.

 • Thirupalu says:

  సమాజలో మెజారిటికి బిన్నమైన అంశాలను అంత సులువుగా అంగీక రించక పోవడం సహజమే! అసమ లైంగికత సమాజంలో ఎప్పటి నుండో ఉన్నప్పటికి వాటిని సానుభూతితో చూడ బడవు- కారణాలు తెలిసేంత వరకు. కారణాలు తెలిసీ అంగీకరించక పోవడం అంటేనే పర్వర్షన్ అనుకోవాలి. వీటి వలన సమాజానికి ఏ నష్టం లేనంతవరకు ద్వేషించాల్సిన అవసరం లేదు.సానుభూతి చూపించడము వల్ల వారికి మేలు చేసిన వారం అవుతాము. లైంగిక అంశము లోనే కాదు, అంగ వైకల్యాన్ని కూడా అర్ధం చేసుకొని సానుభూతి చూపిమ్చడమ్ అటుంచి వారిని చిన్న చూపు చూడక పోతే అమ్టే మేలు. ఇదొక జీవ వైవిద్యంగానే చూడాలి. ఏ క్రోమో సోమ్ కలయక వల్లో జీనుల వైఉరుధ్యమ్ వల్లో కూడా ఉండి ఉండ వచ్చు.

 • DrPBDVPrasad says:

  కథ ప్రకంపనాలను సృష్టించింది స్పందించిన తీరు చాల చక్కగా ఉంది ఇటువంటి కథల సిరీస్ వస్తే ఫేమినిజం దీనిని డిఫెన్స్ చేసుకోవటానికి బలహీనపడే అవకాశం ఉంది
  కల్పనగారి కథనం పాత్రలు ప్రతీకలుగా ఇంక చాల విషయాలను చెబుతాయి మళ్లీ మళ్లీ చదివితే

 • Lalitha P says:

  కాస్త ఆలస్యంగా ఈ కథ చదివాను. కథ చాలా బాగుంది. వీళ్ళిద్దరి సంబంధంలో ఒక్క లెస్బియన్ బంధం మాత్రమే కాకుండా ఇద్దరి కల్చర్ లో ఉన్న తేడాలు, ఒకరు టామ్ బాయ్, ఒకరు సిగ్గుపడే ముగ్ధగా ఉండటం… లెస్బియన్ ప్రేమకు కావలసిన అంశాలూ, మొత్తం ఏవీ వదలకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రాశారు. పూర్తి స్థాయి హోమోలవ్ లో కూడా శారీరకంగా ఒకరు ఆడ, ఒకరు మగ లాగా ప్రవర్తించడం సాధారణం. jealousy ఎలాగూ ఉండనే ఉంటుంది. హోమో, లెస్బియన్ కాకుండా bisexuals కూడా ఉంటారు కదా. హాస్టళ్ళలో జరిగే లెస్బియన్ లవ్ తరువాత ఎక్కువ ఇబ్బంది లేకుండా ఇష్టంగానే మగవాళ్ళను పెళ్లి చేసుకొని పిల్లలను కనేవాళ్ళు bisexual వర్గానికి చెందుతారు. ఇన్ని వర్గాలు, ఆధిపత్యాలు బయోలాజికల్ లెవెల్ లోనే ఉండగా, సమాజం విధించిన కట్టుబాట్లు మరోవైపు ఉండగా, ఈ కథను judge చేసేయటం అంత సమంజసం కాదు.

  మొనాస్టరీల (nuns అండ్ monks ) లో, జైళ్లలో, ఆర్మీ బారక్స్ లో సంభవించే హోమో, లెస్బియన్ ప్రేమలు ఆడకు మగా, మగకు ఆడా అందుబాటులో లేకపోవడం కారణంగా అవసరార్ధం ఏర్పడేవి. మతం కట్టుబాట్లను కాదనే ధైర్యం లేనివారి శారీరక అవసరాలు ఇలా తీరుతాయి. అలాంటి అవసరార్ధపు ప్రేమలను ఇంత స్పష్టమైన లెస్బియన్ ప్రేమతో కలిపి చూడటం కూడా సరి కాదు. ఈ కథలో వైష్ణవి ఒక బాయ్ ఫ్రెండ్ తో కూడా తన స్పందనలను పరీక్షించుకుని, అప్పటికీ మాయనే ఎంచుకున్నట్టుగా రాసి ఉంటే కథ ఇంకా స్పష్టం అయేదేమో. అలాగని రచయితకు కథను కొంత అస్పష్టంగా ఉంచే అధికారం లేదనికూడా అనలేం.

  ‘Fire ‘ సినిమా నాకు గుర్తున్నంత వరకూ భర్తలు నిర్లక్ష్యం చేసిన ఇద్దరు స్త్రీల సహానుభూతి. దానిలో సెక్స్ కూడా భాగమై పోతుంది గానీ వాళ్ళిద్దరూ సహజమైన లెస్బియన్ లు కారు. మహా అయితే క్రమంగా తమ sexuality ఏమిటో తెలుసుకున్నవాళ్ళని చెప్పొచ్చు. ఈ కథకు అటువంటి accidental element లేదు. పైగా వీరిద్దరూ కళాకారులు, తమ శరీరాల గురించి తమకు బాగా అవగాహన ఉన్నవాళ్ళు. ఒకే ఇంట్లో ఉండి, అభిరుచులు కలిసినంత మాత్రాన అందరూ లెస్బియన్ లై పోరు.

  హోమో సెక్సువాలిటీ మీద తెలుగులో కొన్నికథలు రాసే ప్రయత్నం పదిహేనేళ్ళ క్రితం జరిగినట్టు గుర్తు. Gay poet హోషంగ్ మర్చంట్ వాటిని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయటానికి కూడా పూనుకున్నారు. ఆ తరువాత ఏమయిందో తెలియదు. తెలుగులో ఈ విషయం మీద మొదటగా రాసిన రచయిత్రి కల్పన గారే అనుకుంటాను.

 • సాయి పద్మ says:

  బంధాలకి , జెండర్ అవసరమా ? ఎలాంటి బంధం లో నైన పోజేసివ్ నెస్ లేకుండా ఉండటం సాధ్యం కాదా ? ఈ రెండు విషయాల్ని , కొంతమంది వొప్పుకొని మరెన్నో విషయాల్ని చాలా బాగా చర్చించింది ఈ కథ .. నాకు బాగా నచ్చింది .. కల్పనా గారూ ..!!
  తప్పక చదవాల్సిన కథ ..!! నేనే చాలా లేట్ గా చవిదినట్టు ఉన్నాను

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)