శాంతి-ఆలోచనా పరుల కథ

kaaraa
karalogo
నిర్వహణ: రమాసుందరి బత్తుల

 

కారా కథల మీద రాయొచ్చు కదా, శాంతి గురించి రాయండి అని మిత్రులు అడగ్గానే ఇపుడు కొత్తగా దివిటీ పట్టడమేమిటి అనిపించింది. బహుశా ఈ కాలపు పిల్లలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడం కోసం అడిగి ఉంటారనిపించింది. కారా కథలు మానేసిన తర్వాత(సంకల్పం మినహాయింపు) పుట్టిన పిల్లలం. పెద్దల మాటలు విని ఆ కథలు సేకరించి చదవడం తప్ప ఉడుకుడుకు అక్షరాలు చదివే అవకాశం లేదు. చదవడం వరకే అయితే కథ వేరు. కథలపై అభిప్రాయం చెప్పాలంటే మాత్రం స్థలకాలాల ఇబ్బందిని దాటాల్సి ఉంటుంది.

శాంతి 1971 కథ. 71 అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పాలా! నక్సల్బరీ గాలి శ్రీకాకుళం మీదుగా ఉత్తర తెలంగాణకు వ్యాపిస్తున్న కాలం. శ్రీకాకుళం ఆటుపోట్లమధ్య మిణుకుమిణుకు మంటుంటే ఉత్తర తెలంగాణలో కొలిమంటుకుంటున్న కాలం. సిపిఐ ఎంఎల్‌ ఆవిర్భవించి తొలిఅడుగులు వేస్తున్న కాలం. త్వరలోనే సాధిస్తాం అని ఆ ప్రయాణంలో ఉన్న వాళ్లు చాలామంది నిజంగానే నమ్మిన కాలం. ”కా.రా.గారు, ఐవి కూడబలుక్కుని సమిధలు, సరంజామా సమకూర్చుకుంటున్న” కాలం. కారాగారు సమకూర్చుకున్న సరంజామా ఏమిటో శాంతిలో కనిపిస్తుంది. యజ్ఞం మరి తొమ్మిది కథల్లో కనిపిస్తుంది. శ్రీకాకుళ ఉద్యమానికి అక్షరాండగా రాసిన కథలివి. ఇవి వర్గపోరాట చైతన్యపు కథలు . లోతూ విస్తృతీ ఉన్న కథలు.

కారా మాటలెంత పొదుపుగా సౌమ్యంగా ఉంటాయో రాతలు అంత విస్తారంగా ఘాటుగా ఉంటాయి. వీటిలో కొంత ప్రాపగాండా లక్షణం ఉంటుంది. విషయాన్ని వివరంగా చెప్పేయాలనే తపన ఉంటుంది. అది అప్పటి అవసరం కావచ్చునేమో! “వృత్తాంతం ద్వారా వ్యక్తమయ్యే అసలు విశేషమే కథ” అన్న స్వీయనియమాన్ని నిక్కచ్చిగా నిష్ఠగా పాటించిన రచయితగా కారా ఈ దశలో కనిపిస్తారు. ఏదో ఒక నిర్దుష్టమైన విషయాన్నిప్రతిపాదించడానికో వివరించడానికో సీరియస్‌ ఎజెండా పెట్టుకుని ఈ దశలో వరుసగా కథలు రాసినట్టు కూడా అనిపిస్తుంది. ఒక్కముక్కలో ఆయన కలం కార్యకర్త పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు.

అసమసమాజంలో శాంతి అనే పదం ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందో వివరిస్తుంది శాంతి కథ. స్టేటస్‌కోయిస్టుల శాంతి మంత్రం వెనుక ఉన్న బూటకత్వాన్ని ఎండగడుతుంది. కథనిండా యజమాని- కార్మిక సంబంధాలపై లోతైన చర్చ ఉంటుంది. బలవంతుడి ఎత్తుగడలు, వాటిని చిత్తు చేసేందుకు బలహీనుల స్థిరచిత్తం, వీరిద్దరి మధ్యలో బ్యూరాక్రసీ తెలివితేటలు ఉంటాయి. జ్ఞానం, తెలివితేటలు, చిత్తశుద్ధి, అంకితభావం వగైరా లక్షణాలు మూర్తీభవించిన కార్మిక నాయకుడు, అన్నింట్లోనూ లౌక్యాన్ని చూపే ‘నిస్సహాయపు’ కలెక్టర్‌, ఎలాగైనా ఈ వ్యవస్థ తనకు అండగా నిలబడి తీరుతుంది అనే నమ్మకమున్న ధనబలశాలి మిల్లు యజమాని- మూడు ప్రధానపాత్రలుగా కథ సాగుతుంది.

ఈ కథ చదువుతున్నపుడు అపుడెపుడో సీఫెల్లో చూసిన క్యూబా సినిమా లాస్ట్‌ సప్పర్‌ గుర్తొచ్చింది. 1976లో వచ్చిన ఈ సినిమాలో చిత్రించిన కాలం పద్దెనిమిదివ శతాబ్ది చివరి రోజులకు సంబంధించినది. చెరుకు తోటల యజమాని, అతని బానిసలు, చర్చి ఫాదర్‌ మూడు కేంద్రాలుగా సాగేకథ. ఇక్కడ స్టీల్‌ మిల్‌ యజమాని అయితే అక్కడ షుగర్‌ మిల్‌ యజమాని. ఇక్కడ కార్మికులు అయితే అక్కడ బానిసలు. ఆధునిక కలెక్టర్ స్థానంలో చర్చి ఫాదర్‌. అందులోనూ శాంతి గురించి స్వేచ్ఛ గురించి చర్చ ఉంటుంది. కాకపోతే చర్చే ప్రధానం కాదు.

రెండు వేర్వేరు దేశాల్లో వేర్వేరు సామాజిక దశలకు సంబంధించిన జీవితాన్ని చిత్రించిన వేర్వేరు కళా ప్రక్రియలైనప్పటికీ బలవంతుడు, లేదా వారి ప్రతినిధి శాంతి మంత్రం పఠించే తీరు దాదాపు ఒకే రకంగా ఉంటుంది. యజమాని ఉదారంగా పన్నెండు మంది బానిసలను పిల్చి తనతో సమానంగా టేబుల్‌పై కూర్చుండబెట్టుకుని లాస్ట్‌ సప్పర్‌ జరుపుకుంటాడు. ఈ సందర్భంగా బానిసలకు- యజమానికి మధ్య జరిగే సంభాషణ, వారి హావభావాలు మర్చిపోవాలన్నా మర్చిపోవడం కష్టం. అంతేనా! యజమాని నదిదాకా తీసుకువెళ్లి వారి కాళ్లు కడిగి ఆ ‘పుణ్య తంతు’ కూడా జరిపించిన రెండు రోజులకే వారి తలకాయలన్నీ పోల్స్‌మీద వేలాడదీయడంలో మనకు ఆ నాటి బలవంతుల శాంతి స్వరూపం అవగతమవుతుంది.

లాస్ట్‌ సప్పర్‌ కూడా విప్లవ సినిమానే. కమ్యూనిస్టు సినిమానే. కానీ తొలిరీల్‌నుంచే ఇది కమ్యూనిస్టు సినిమా అనే ఎరుకను మనకు కలిగించరు. సినిమాలో దర్శకుని హృదయం ఎక్కడ ఉందో అర్ఠమవుతుంది, అంతే! బలవంతుడి శాంతి మంత్రం ఎంత బూటకమో కళాత్మకంగానే చెపుతారు. సినిమా పొడవునా మనం నవ్వుతాము, ఏడుస్తాము. పాత్రల వెంట నడుస్తూనే ఉంటాము. సినిమా సరే, రావిశాస్ర్తి కథలో! ఆ కోవకే చెందిన మరికొందరు గత, వర్తమాన, వర్థమాన రచయితల కథలో!

ఆ రచనలు చదువుతున్నపుడు కాసేపు వారి ఆధీనంలోకి వెళ్లిపోతాం. వారు సృష్టించిన పాత్రల వెంట తిరుగుతూ ఆ భావోద్వేగాల్లో భాగమవుతాం. ఆ పాత్రలతో బంధమేర్పడుతుంది. అలాంటి జీవితమే ఉన్న పాఠకుల జ్ఞాపకాలను కదిపి అలజడి రేపుతారు.రచయిత తాడు పట్టుకుని ఆడిస్తూ ఉంటాడు. మనం కోతుల్లాగా ఆడుతూ ఉంటాము. అది ఆర్ట్‌ మహిమ. శాంతి లాంటి కథలతో వచ్చిన చిక్కేమిటంటే ఇందులోని పాత్రలతో అలాంటి అనుబంధమేదీ ఏర్పడదు. పెద్దమనిషి గంభీరంగా విషయాలు చెపుతూ ఉంటే కాస్త ఎడంగా నుంచొని వింటున్నట్టు ఉంటుంది. ఇలాంటి కథలు మన మనసును పెద్దగా తాకవు. మేధనే తాకుతాయి.

ఇవి మన మేధను పెంచడం కోసం, వర్గపోరాట ద్పృక్పథాన్ని పదును పెట్టడం కోసం రాసిన రాజకీయ కథలు. విశాలమైన అర్థంలో రాజకీయం లేకుండా ఏ కళా ఉండదు. పైగా కారా రాసింది పీడితులకు అవసరమైన రాజకీయాలు. కాబట్టే వామపక్ష శిబిరం చాలా యేళ్లుగా ఎత్తుపీట వేసి గౌరవిస్తున్నది. కాకపోతే కళారూపం సమర్థంగా లేకపోతే అది రాజకీయవాసన గాఢంగా ఉన్న జీవులను తప్ప ఇతర జీవులను అంతగా ఆకర్షించదు. మోనోలాగ్‌గా మారిపోయే ప్రమాదం ఉంది. కారా కథలన్నీ అలాగే ఉన్నాయనే దుస్సాహసం చేయబోను. జీవధారను అలా అనగలమా! నోరూమ్‌ని అనగలమా!

కానీ శాంతి కథలో రాజకీయ చర్చల బరువుకు కళారూపం అణగిపోయిందేమో అనిపిస్తుంది. పాత్రల చిత్రణలో కూడా స్టీరియోటైప్‌ లక్షణం కనిపిస్తున్నది. మందు, విందు, పొందుల కలబోతగా నల్లని బొచ్చుశరీరం కలిగిన ఫ్యాక్టరీ యజమాని చిత్రణే తీసుకోండి. భార్యను పట్టించుకోక ఆమెను లైంగిక అసంతృప్తి అగ్గిమంటకు ఆహుతి చేస్తూ అతను మాత్రం రోజొక అమ్మాయితో కులకడం వంటి లక్షణాలు చూస్తే సాధ్యమైనన్ని “దుర్లక్షణాల’తో అతనిమీద కోపం తెప్పించాలనేది రచయిత వ్యూహంగా కనిపిస్తున్నది. కథాక్రమంలో అతని దోపిడిస్వభావం మీద కోపం తెప్పించవచ్చునుగాని కారా వంటి రచయితకు ఈ అడ్డదారేల! కుప్పబోసినట్టు ఇన్ని “దుర్లక్షణాలు’ లేకుండా కూడా ఫ్యాక్టరీ యజమానులు చాలామంది ఉంటారు. ఆధునిక పెట్టుబడిదారుల్లో అనేకులు మందు, చిందుల జోలికి పోకుండా కార్మికుడి కంటే ఎక్కువ గంటలే పనిచేయవచ్చును. వారు దోపిడీదారులు కాకుండా పోతారా!

సత్యమే శివం సినిమాలో సూటూ బూటూ వేసుకుని డాబుగా ఉన్న మనిషి సూట్‌కేస్‌ కొట్టేసే సీన్‌ ఉంది కదా, అదే సరైన రాజకీయ దృష్టికోణం అవుతుంది. సమాజంలో మంచిచెడులకు, ఎక్కువ తక్కువలకు దర్పణాలుగా స్థిరపడిన స్టీరియోటైప్‌ లక్షణాలను ఉపయోగించుకోవడం స్టేటస్‌ కోయిస్టులకు అవసరం. తాత్కాలికంగా మనకు కూడా ఉపయోగపడినట్టు అనిపించినా దీర్ఘకాలికంగా నష్టం చేస్తాయి. బహుశా ఆనాటికి కథలో చిత్రించిన సమాజం ఇంకా పాతదశలోనే ఉంది కాబట్టి ఫ్యూడల్‌ లక్షణాలు బలంగా ఉన్న సమాజంలో మంచిచెడులు ఇపుడున్న సమాజంతో పోలిస్తే బ్లాక్‌ అండ్‌ వైట్లో కనిపించే అవకాశం ఉంది కాబట్టి అప్పటి అవసరాలకు అనుగుణంగా రాశారు అనుకోవాలా!

సాంఘిక దురాచారాలమీద కాని, కొన్ని ప్రభుత్వ విధానాల దుష్ఫలితాల మీదకాని, వ్యవస్థలో కనిపించే కొన్ని దుర్లక్షణాల మీదకానీ లేక ఇదే కోవకి చెందిన మరేదో అవకరం మీదకాని, మన అభిప్రాయాలను కథగా చెప్పాలనుకుంటాము. కొన్ని పాత్రలను ప్రవేశపెడుతూ మొదటి పేరాని కథలా ఆరంభించి క్రమక్రమంగా కథను ఒక చర్చాగోష్టిలా సాగించి, మన అభిప్రాయాలను ముఖ్యపాత్ర ద్వారా చెప్పించేస్తాం. అలా చేస్తే అది కథ ముసుగేసుకున్న చర్చా వ్యాసమౌతుందిగాని కథ కాదు” అంటారు కారా.

ఈ లక్షణం శాంతి కథలో కూడా జొరబడినట్టు అనిపిస్తుంది. అయితే సౌష్టవం కొద్దిగా దెబ్బతిన్నప్పటికీ కథా రూపమైతే ఉన్నది. కుట్రలాగా కథ కాకుండా పోలేదు. కుట్రను కూడ కథ అనే వారు, ఆ మాటకొస్తే గొప్ప కథ అని కీర్తించే వారు ఉన్నారని తెలుసు. ఎవరి దృష్టికోణం వారిది. దృక్పథం లేకుండా భాషా నైపుణ్యంతోనూ క్రాఫ్ట్‌తోనూ చెమక్కుమనిపించి మాయమైపోయే కథలతో ఇబ్బంది ఉన్నట్టే క్రాఫ్ట్‌ను నిర్లక్ష్యం చేసి కథను రాజకీయ ఉపన్యాస వేదికగా మార్చే కథలతోనూ ఇబ్బంది ఉంటుంది. “కారా సాధారణ పాఠకుల రచయిత కాదు, ఆలోచనాపరుల రచయిత అన్న వల్లంపాటి అన్నపుడు కూడా ప్రశంసతో పాటు సున్నితమైన విమర్శనాధ్వని ఉందేమో అని అనుమానం.

 -జి ఎస్‌ రామ్మోహన్‌

 RAM MOHAN _ FB

 

42 సంవత్సరాల శ్రీరామ్మోహన్ గారు రెండు దశాబ్దాలు పైగానే పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఎదురీత, వర్తమానం, వార్త, ఆంధ్రజ్యోతి, ఈటీవీలలో పని చేశారు. ప్రస్తుతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నారు. రష్యన్ సాహిత్యాన్ని ఎక్కువగా ఇష్టపడే రామ్మోహన్ గారు దొస్తోవ్ స్కీ , టాల్ స్టాయ్, మార్క్వెజ్ రచనలను ప్రేమిస్తారు. రావిశాస్త్రి, పతంజలీ, నామినీ, పి. సత్యవతి, బండి నారాయణ స్వామి రచనలు ఎక్కువగా ఇష్టపడతారు. మోహనరాగం పేరుతో ఉండే రామ్మోహన్ గారి బ్లాగ్ అడ్రెస్స్ gsrammohan.blogspot.in

 

వచ్చే వారం : అవ్వారు నాగరాజు ‘స్నేహం కధ’ గురించి పరిచయం చేస్తారు

 

శాంతి కథ ఇక్కడ చదవండి:

Download PDF

2 Comments

  • CHITRA says:

    ఏం రాద్దామన్నా సాహిత్య వర్తమానం భయపెడుతూ ఉంటుంది . ఇది మేష్టారికీ ఉండేదని అనిపిస్తుంది . ఆధారం శాంతి కథే

  • వేణు says:

    రామ్మోహన్ గారూ! కళావిలువల పరంగా ‘శాంతి’ కథ పరిమితులను చెపుతూ విమర్శనాత్మకంగా రాసిన మీ వ్యాసం బాగుంది.

    ‘పాఠం లాంటి కథ’ అని కొడవటిగంటి కుటుంబరావు ఈ కథ గురించి వ్యాఖ్యానించారు. ‘శాంతి కథను కావాలంటే మూడు పేజీలలో చెప్పొచ్చు, కానీ ఆ మూడు పేజీల కథ ఎవరైనా రాయొచ్చు. దానికి విశిష్టత ఏమీ వుండదు. అందులోని ఆర్థిక సాంఘిక రాజకీయ సత్యాలే ఆ కథకు ఆయువుపట్టు’ అని సమీక్షించారు కొ.కు… ‘సృజన’ జులై 1972 సంచికలో!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)