‘ఎగిరే పావురమా!’ -18 (చివరి భాగం )

egire-pavuramaa-19

(గూడు చేరిన పావురం..)

 

శ్రావణ శుక్రవారం తొమ్మిదికి ముందే నేను, ఉమమ్మ ఒకేసారి కోవెలకి వచ్చాము. అల్లంత దూరాన్నుంచే, నన్ను చూసి చేయి ఊపి గుడిలోకి వెళ్ళిందామె.

పుస్తకాలయంలో గల్లాపెట్టె సర్డుతున్న నేను, “గాయత్రీ,” అన్న ఉమమ్మ పిలుపుకి తలెత్తి చూశాను. “సోమవారం ఇక్కడ శెలవు చెప్పు. నీకు జరగవలసిన వైద్య పరీక్షలకి మల్లిక్ గారు వాళ్ళ ఆసుపత్రిలో సమయం కేటాయించారు,” అంది ఉమమ్మ.

 

అలాగేనని తలాడించాను. ‘ఇప్పటికీ నామీద అదే శ్రద్ధ, అదే ఆపేక్ష ఆమెకి. కాలం గడిచినా, చెక్కు చెదరని ఆమె అంకితభావం నమ్మలేకపోయాను. ఆమె నుండి నేను నేర్చుకోవలసింది చాలా ఉంది’ అనుకున్నాను.

 

‘ఎప్పుడు వచ్చినా ఓ మంచి వార్తో, మంచి తలంపో వెంట తెస్తుంది ఉమమ్మ. ఆమె కలిసిన ప్రతిసారి నా మెరుగు కోసమే తాపత్రయ పడుతుంది. ఆమె ఋణం తీర్చుకోలేనిదే’ అనుకుంటూ పని మొదలెట్టాను.

**

గుంటూరులోని మల్లిక్ గారి కొత్త హాస్పిటల్లోనే నా వైద్య పరీక్షలు జరిగాయి. నాలుగేళ్ళ క్రితం వంశీ సంస్థ వారు జరిపిన పరీక్షల ఆధారంగా – మరిన్ని పరిశోధాత్మక విధానాలు జరిపించారు అక్కడి నిపుణులు.

 

కాళ్ళల్లో కదలిక విషయంగా – మరింత వైజ్ఞానిక పరిశీలన జరిపించారు.

మాట విషయంగా – నాదతంత్రులుండే స్వరపేటిక పరీక్ష’ నిర్వహించారు.

‘ఇంద్రియ సమన్వయ పరిశీలనా పరీక్షలు’ కూడా జరిపారు.

**

మళ్ళీ వారం, నాకు జరిపిన ఆ సూక్ష్మమైన పరీక్షల వివరణ పత్రం ఇచ్చారు…

 

పసితనంలో కలిగిన తీవ్ర అఘాతము వల్లనే నాకీ అంగవైకల్యం ఏర్పడి ఉండవచ్చని భావించారు.

నడక, మాట కూడా చికిత్సతో తిరిగి వచ్చే అవకాశముందని చెప్పారు ఆ నిపుణులు.

కదలిక విషయంగా – కాళ్ళకి కనీసం నాలుగు ఆపరేషన్లు తప్పవన్నారు. ఆ తరువాత వ్యాయామం, కాయకల్ప చికిత్స కూడా కొంతకాలం జరిపిస్తే క్రమేపీ నడక వస్తుందన్నారు. కమలమ్మ పెట్టించిన కుత్రిమ కుడి కాలు మాత్రం అలాగే ఉంటుందన్నారు.

వాక్చిత్సలో భాగంగా వాక్‌ శిక్షణ, వాక్ పునరుద్ధరణతో పాటు ఆధార-సలహా సమావేశాలు నిర్వహిస్తే మాట సమర్థత ఏర్పడే అవకాశం ఉందని, తద్వారా తప్పక నా అవిటితనాన్ని అధిగమించగల అవకాశం మెండుగా ఉందని అభిప్రాయ పడ్డారు.

 

ఆ వివరణ విని, తాత అనుకున్నట్టుగానే నేను అందరిలా నడిచి మాట్లాడగలిగే అవకాశం ఉందన్నారు అందరూ.

నాకు వైద్యం త్వరలో మొదలవ్వాలని పట్టుదలగా ఉంది ఉమమ్మ.

**

శ్రీ గాయత్రి పుస్తకాలయం’ జమాఖర్చులుతో పాటు కోవెల జమా-ఖర్చులు కూడా నా బాధ్యతగా చూసుకొమ్మన్నారు పూజారయ్య. పుస్తకాలయంలో, అప్పుడే ఆరునెల్లగా నా విధులని సవ్యంగా, శ్రద్దగా నిర్వహిస్తున్నాను.

అప్పుడప్పుడు ఓ క్షణం కమలమ్మ గుర్తొచ్చి వెన్నులోంచి దడ పుడుతుంది.   ఎప్పుడూ తటస్థంగా ఉండే గోవిందు, ఊహించని విధంగా, సమయానికి   నాకు సాయం చేయబట్టే, నా జీవనం నేనాశించిన గమ్యం చేరింది.

మా జీవితాలని మూడేళ్ళ పాటు తన గుప్పిట్లో పెట్టుకున్న జేమ్స్ కూడా గుర్తొస్తాడు.

తండ్రి వయస్సున్న జేమ్స్, నా సంగతంతా తెలుసుకున్నాకయినా, నా పట్ల ఒకింత సానుభూతితో, మానవతతో, నేను తాత వద్దకు చేరడానికి   సహాయ పడుంటే, మరోలా ఉండేది కదా అనిపిస్తది.

**

మరో వారం రోజుల్లో, ఆదివారం నాడు ఉమ్మమ్మ వాళ్ళ ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ వారి కార్యక్రమం జరగబోతుందని ఊళ్ళో సందడి మొదలయ్యింది. ఉచిత వైద్యశిబిరం గురించి అందరికీ తెలియజేసి, ఊరంతా నమోదు పత్రాలు పంచారు.

**

“నీతో ఓ ముఖ్యమైన పనే ఉంది,” అంటూ ఉమమ్మ పుస్తకాలయంకి   వచ్చి, నా ఎదురుగా చెక్క కుర్చీ మీద కూచుంది. వెంట రాములు కూడా ఉంది.

జరగబోయే సమావేశం గురించి మాకు అర్ధమయ్యేలా చెప్పింది ఉమమ్మ.

“స్త్రీ, శిశు సంక్షేమానికి సంబంధించి ఈ సమావేశం జరుగుతుంది.

భ్రూణ హత్యలు, శిశు హత్యలు, ఆడపిల్లల్ని నిర్దాక్షణ్యంగా త్యజించడాలు – మానవజాతికి ముప్పుగా మారుతున్నాయన్న విషయం ప్రస్తావిస్తారు. ప్రసంగించేవారిలో రాజకీయ నాయకుడు, టివి నటి, సంఘకర్తలు ఉండవచ్చు,” అంటూ నా వంక చూసింది ఉమమ్మ.

 

“గాయత్రీ, ఈ సందర్భంగా – నీ సంగతి – అంటే – పసిగుడ్డువైన నిన్ను నీ కన్నతల్లి త్యజించిన వైనం, దాని పర్యవసానం, తాత నిన్నాదుకున్నప్పటి నీ పరిస్థితి గురించి మీటింగులో నేను మాట్లాడవచ్చా?” అని అడిగింది.

 

తదేకంగా ఆమెనే చూస్తూ ఆమె చెప్పేది వింటున్న నేను ఉలిక్కిపడ్డాను. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. నన్నే గమనిస్తున్న ఉమమ్మ వైపు తలెత్తి చూశాను.

కూర్చున్న స్థానం నుంచి లేచి ఆమె చేయందుకున్నాను.   నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టు తల ఊపి హామీ ఇచ్చాను. పక్కనే ఉన్న నోటుపుస్తకం అందుకొని,

‘నేను మీ మనిషిని ఉమమ్మా, మీరు నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. మీకు ఈ కార్యంలో నేను ఏ విధంగా పనికి రాగలిగినా నాకు సంతోషమే’.

అని రాసి అమెకందించాను.

 

“అంతేకాదు గాయత్రీ. నీకు చెప్పాల్సింది మరో విషయం ఉంది,” అంటూ లేచి దగ్గరగా వచ్చి, నన్ను నా స్టూలు మీద కూచోబెట్టింది. నా చేయి తన చేతిలోకి తీసుకుంది.

 

“మన సంక్షేమ సంస్థ సహకారంతో, నీ గతం గురించిన కొని వివరాలు కూడా సేకరించగలిగాము,” అన్న ఉమమ్మ మాటకి మళ్ళీ ఉలిక్కిపడి ఆమె వంక చూసాను.

 

“పందొమ్మిదేళ్ళ క్రితం, జూన్ లో ఓ మూడురోజుల పాటు ఇక్కడ ఉధృతమైన వాతావరణం నెలకొన్నుందంట. ఆ సమయంలో మన ఊళ్ళో జన్మించిన ఆరుగురు పసివాళ్ళలో,   ఐదుగురి ఆచూకి ఉంది.   ఒరిస్సా నుండి పక్క ఊరికి వచ్చున్న మరో స్త్రీ కూడా, ఇక్కడ ఆడపిల్లని కన్నట్టు నమోదైన సమాచారం తప్ప, ఆచూకి లేదు.

కన్న మూడోరోజున పసిబిడ్డని తీసుకొని, ఆ ఉద్రిక్త వాతావరణంలోనే ఆ బాలింత వెళ్ళిపోయిందని మన చిన్నాసుపత్రి సమాచారం. ఆమే పసిబిడ్డని త్యజించి ఊరెళ్ళిపోయుంటుందని అంచనా,” ఆగింది ఉమమ్మ.

 

“ఆ బిడ్డవి నువ్వేనని ఆధారాలున్నాయని తెలిసింది. నీ ఇష్టం. నీకు కావాలంటే   ఆ వివరాలు, ఆధారాలు అడిగి తీసుకోవచ్చు,” అందామె భుజం మీద చేయి వేస్తూ.

మౌనంగా ఉండిపోయాను…

“బాధ పడకు… అలోచించు.. వివరాల వల్ల మనకి ఉపయోగమే లేదు… పైగా అసలావిడ ఈ చుట్టుపక్కల్లో   ఉండే మనిషి కాదు కూడా.     ఆమెకి పక్క ఊళ్ళో ఉన్న బంధువు ఆమె అమ్మమ్మట. ఆ అమ్మమ్మ చనిపోయి కూడా చాలా కాలం అయిందట. …

నీకెందుకు మళ్ళీ జీవితంలో ఓ అయోమయం, అన్వేషణ? సమయం వృధా చేయకుండా, చదువుకొని నీవు ఎదగాలి గాయత్రీ,” అంటూ సముదాయించింది…

**

అలజడి, ఆవేశం, దుఃఖం, అసహనం నన్ను చుట్టేసాయి.

రాత్రంతా కంటి మీద కునుకులేకుండా గడిపాను.

తెల్లారే సమయానికి మనసు కుదుటపడింది.   ‘అయితే ఏమిటి? అది గతం. ఎన్నడూ నాకు అమ్మగా నిలవని ఆమె కోసం పాకులాడే ప్రశక్తే లేదు. అలాగని ద్వేషించి సాధించేదేమీ లేదు’. ‘నాకు తెలియని ‘అమ్మ’ – ఆ స్త్రీ గురించి, నిన్న నేను విన్నది, తెలుసుకున్నదీ నాకు అనవసరం. అదంతా మరిచిపోవడమే నాకు శ్రేయస్కరం,’ అనుకొని పక్క మీద నుండి లేచాను…

**

egire-pavuramaa18-banner

ఆదివారం సమావేశానికి అనుకున్న దానికంటే ఎక్కువమందే హాజరయ్యారు. మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు, పత్రికా విలేఖరులు వచ్చారు. నటి మంజరి వచ్చింది. వారందరి ఉపన్యాసాల వల్ల కొన్ని విషయాలు తెలిశాయి.

వారిలో ఓ సంఘకర్త మాట్లాడుతూ, ఓ పత్రిక నుండి సమాచారం చదివి వినిపించారు…..

‘ఆడశిశువు పుడితే పీక పిసికి చెత్తకుండిలోనో, పొదల్లోనో, డ్రైనేజీలోనో పడేయడం పరిపాటైపోయింది. ఈ క్రియ చదువుకున్నవాళ్ళు, చదువులేని వాళ్ళు అందరూ చేస్తున్నారు. తల్లిదండ్రులకు కొడుకే తలకొరివి పెట్టాలన్న మూఢాచారంతో మగ పిల్లాడిని వారసునిగా ఎంపిక చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో స్త్రీ గర్భం దాల్చాక స్కానింగ్ ఇతరత్రా పరీక్షలద్వారా లింగ నిర్ధారణ చేసుకుని ‘ఆడపిల్ల’ అని తేలితే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన అమానవీయత, మూఢాచారాలవల్ల ‘స్త్రీ’ భ్రూణహత్యల పరంపర కేవలం తెలుగు నాట 2005 నుండి 2013 కి ఎనభై లక్షలని కొత్తగా వెలువడిన ప్రభుత్వ సర్వే తెలియజేసింది.

అంటూ ఆమె ప్రసంగం ద్వారా తెలిపారు.

మరో యువ రాజకీయ నాయకుడు, దానికి కొనసాగింపుగా ..

“ఈ మధ్యన తేలిన విషయం – తల్లిగా స్త్రీని గౌరవించుకునే విషయంలో – భారత దేశం 39 వ స్థానంలో, అదీ పాకిస్తాన్ కంటే ఐదు స్థానాలు దిగువలోనే ఉందని తేలడం విచారకరం. ఏదైనా ‘స్త్రీ-శిశు సంక్షేమం’ అనేది ఓ నిర్విరామ బృహత్తర కార్యక్రమం. ఉమాదేవి చుట్టుప్రక్కల ఎన్నో తాలూకాల్లో ఈ విషయంగా ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రభుత్వం వారు ఆమెకి మరింత సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తున్నాము,”

అని ముగించాడు ఆయన.

 

ఉమమ్మ వంతు వచ్చింది. ఆమెదే ముగింపు ఉపన్యాసం. నేనూ అందరితో పాటు శ్రద్ధగా వింటున్నాను.

 

“తన జీవితానికి అడ్డమ్మొచ్చిందనో, తన కష్టం తీరుతుందనో, కన్నబిడ్డని త్యజించే ముందు – ఆ చర్య వల్ల బిడ్డ భవిష్యత్తు శాపగ్రస్తమౌనేమోనని ఆలోచించవలసిన బాధ్యత ఆ ‘అమ్మ’ కే ఉంది.

ఒక్కోసారి ఆడశిశువు పట్ల వివక్షతో కన్నతల్లే కసాయిలా మారి, ఆ బిడ్డని త్యజించో, విక్రయించో, గొంతు నులిమో వదిలించుకుంటే?

రంగుల హరివిల్లులా అనిపించే ఊసరవెల్లి సమాజంలో, అమ్మ ఆదరణ లేని అడశిశివు యొక్క మనుగడ ఏ రంగు పులుముకుంటుందో? అన్న ఆలోచన చేయవలసిన బాధ్యత ఆ తల్లిదే కాదా?.

మీ అందరిని ఆశ్చర్యపరిచే ఓ సంఘటన చెబుతాను.

‘గాయత్రి’ అని ఓ ఆడబిడ్డ మా కోవెల్లోనే పెరిగింది. ఇప్పుడు పద్దెనిమిదేళ్ళ పడతి. ఆమె తల్లి ఆమెని రోజుల పిల్లప్పుడే నిర్దయగా వదిలేసింది. కేవలం ఆ తల్లి నిర్లక్ష్య, అనాలోచిత చర్య వల్ల ఆ పసిదానికి అవిటితనం ఏర్పడింది. ఓ దయగల పెద్దాయన, ఆ బిడ్డని తెచ్చుకుని, పెంచి పెద్ద చేసాడు. అయినా తల్లి చర్య వల్ల, తల్లి ఆదరణ లేని లోటు వల్ల ఆమె ఇంత చిన్న వయసులోనే జీవితకాలం పాటి కష్టనష్టాలని అనుభవించింది.

మా ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ ప్రయత్నం వల్ల గాయత్రి కన్నతల్లి విషయంగా కొంత సమాచారం సేకరించాం. మొగపిల్లవాడు – వారసుడు కావాలనుకునే ఆమె భర్త, అతని పరివారం నుండి తిరస్కారానికి భయపడి, ఆమె బిడ్డని వదిలివేసుంటుందని అంచనా. అప్పటికే   ఇద్దరాడపిల్లల తల్లి అయిన ఆమె, బరంపురం తిరిగివెళ్ళి బిడ్డ పురిట్లోనే పోయిందని చెప్పినట్టు సమాచారం.

ఎంతో వొత్తిడికి లోనయి ఆ తల్లి అలా చేసుండవచ్చని అనుకున్నా, బాధ్యతా రహితమైన చర్య అని భావించక తప్పదు. ఏమయినా, త్యజించబడిన ఆ నాటి ఆడశిశువే మన ఈ గాయత్రి అని నిర్ధారణకొచ్చాము.  

ఈమెకి మాత్రం – ప్రేమ గల పెద్దాయన ప్రాపకం, శ్రేయోభిలాషుల ఆశ్రయం దొరకడం గొప్ప అదృష్టం.  

అయితే ఇటువంటి అదృష్ట, అవకాశాలు త్యజించబడ్డ మరో బిడ్డకి దొరక్కపోవచ్చు. మరి ఆ బిడ్డల జీవితాలు ఎలా ఉండగలవో ఆలోచించండి,” అని క్షణమాగింది ఉమమ్మ.

అమ్మతనం అద్భుత వరమే! బాధ్యతల వలయం కూడా. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే, కన్న బిడ్డకి కనీసం రక్షణ కల్పించవలసిన బాధ్యత మాత్రం ఆ తల్లికే ఉంది. బిడ్డ బాధ్యత చేపట్టలేని ప్రతికూల పరిస్థితులు, సమస్యలు ఎదురైతే, బిడ్డ క్షేమం కోరి కనీసం సమాజంలో ఉన్న సహాయ, అవకాశాలని ఆమె అంది పుచ్చుకోవాలి.

నేటి పురోగామిక సమాజంలో ఆ అవకాశం మెండుగా ఉంటుందామ్మకు…

ప్రభుత్వ సంస్థల చేయూత సైతం సులువుగా లభ్యమవుతుంది కూడా,” అంటూ,…..

 

”పోతే గాయత్రి ఎవరో కాదు, వాకిట్లో మిమ్మల్ని సాదరంగా నవ్వుతూ లోనికి ఆహ్వానించి, మీ నుండి సంతకం తీసుకుని, మీకు కార్యక్రమ పత్రాలు అందజేసిన ఆ చురుకైన అమ్మాయే,”

అంటూ ఉపన్యాసం ముగించింది ఉమమ్మ.

ఆమె కొత్తగా నా గురించి, నాకు జన్మనిచ్చి వదిలేసిన ఆ తల్లి గురించి చెప్పిన విషయం విన్నాను. నాలో పెద్దగా ఎటువంటి స్పందనా కలగలేదు. ఉదాసీనతే తోచింది.

జరుగుతున్న మిగతా కార్యక్రమం చూడసాగాను.

 

….సంఘం లోని కుళ్ళుని కడిగేయాలంటే ఏమి చెయ్యాలి? ఏమి చెయ్యవచ్చు? అన్న విషయం మొదలుకొని, ప్రభుత్వం నుండి సహాయం ఎలా పొందాలో తెలియజేసే మిగతా వారి ప్రసంగాలతో విజయవంతంగా ముగిసింది ఆ నాటి కార్యక్రమం……

ఆఖరున ప్రభుత్వ సహాయకారి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

**

నా జీవితం, గురించి ప్రస్తావన ఈ విధంగా ఉమమ్మ చేస్తున్న మంచి పనికి సహాయ పడితే నా జన్మ ధన్యమైనట్టేనని భావించాను. నాకు నిజంగా మాట్లాడగల స్థితి వస్తే ఉమమ్మకి నావంతు సహకారాన్ని మాటల ద్వారా కూడా అందించాలని నిర్ణయించుకున్నాను.

అవకాశం అంది పుచ్చుకొని ఉమమ్మలా ‘ప్రత్యేక విద్యా విధానం’ లో పై చదువులు సాగించాలని కూడా ఆశ కలిగింది నా మనస్సులో.

**

కోవెల పైమెట్టు మీదనే నాకలవాటైన నా స్థలం, పురాతన రావిచెట్టు నీడన నేను కూర్చునే నాకిష్టమైన నా స్థానం. శ్రీ గాయత్రి పుస్తకాలయంలోని కొలువునే గౌరవంగా నిలుపుకుంటాను.

తాత ఏర్పరిచిన నా జీవితం నాకు ఒక స్వర్గమే అని భావిస్తాను.

    సమాప్తం

   ***************

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)