అప్పయ్యా!చిదంబర్రెడ్డీ నీ పలక తీసుకురాప్పా!

రాయలసీమ బతుకు – అందునా అనంతపురం బతుకు కరువుతో కన్నీళ్ళతో సహజీవనం. ఆకలిదప్పుల నిత్య మరణం. అలాంటి బతుకులోంచి వచ్చి అక్షరదీపం పట్టుకొని ముందుకు నడిచిన రచయిత సడ్లపల్లె చిదంబర రెడ్డి.  ఆయనలో ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, ఒక మంచి రచయితా అంతకంటే ఎక్కువగా ఒక హృదయ జీవీ కనిపిస్తారు. ఆయన బతుకు పుస్తకం ఈ రచన.

-ఎడిటర్

My First Picture with Hair(scan0002)ఆ పొద్దు తేదీ1.1.1959.

పొద్దున్నే కుడిపక్కలో లేసి,దేవుని పటాలకి మొక్కుకోని,ముకమూ కాళ్లూ కడుక్కొంటి.అట్టవ(అటక) మింద పొదుగుడు కోడి పిల్లలు సేసి నట్లుంటే మా అన్నయ్య,అక్కయ్యా వాళ్లు తట్టిదించి సూస్తావుండ్రి.రెండు మూడు మురుగుడ్లు పడిండివి.మిగిల్న వన్నీ పిల్లలయిండివి.సెయ్యి వాసి మంచిదని మాయమ్మ, మాలోల్ల ముసలమ్మతో మూడు గుడిసెల్లో ఎండుసోగ తెప్పిచ్చి పొదిగి పిచ్చిండె.సన్న పిల్లులు సూసేకి ముద్దుగావుంటే నేను సేతికి తేసుకోని రవ్వన్ని బీము నూకులు తినిపిస్తి.మా యమ్మిచ్చిన గొర్రిపాల కాపీ తాగితి.

     మాయింట్లో పాలు పిండే ఎనుములు వుండే గానీ పాల టోరోల్లకి అమ్ముతావుండ్రి.కొలతలకి తక్కువొచ్చి అన్నీ అయిపోతే కాపీకి మిగల్లేదని– మా అన్నయ్య రప్పాల్లో గొర్రిపాలు పిండుకోనొస్తావుండె.(రప్పం=రాయీరప్పా పదబంధంలోని మాట. గొర్రెల కొట్టం) మా ఇంటికి సుట్టూపక్కా ఇండ్లు శానాతక్కువ.అందుకే జతగాళ్లతో ఆడుకొనేదానికి రప్పాలతాకి యల్లబార్తావుంటి.అవి మాఇంటికి దచ్చినంపక్క వుండివి.ఏడెనిమిది రప్పాల్లో వేలాంతర గొర్రిలు.పొద్దస్త మానమూ క్యార్ బ్యార్ అని అరుస్తావుండె.బారెడు పొద్దెక్కుతూనే సంగటి తిని,సిక్కాల్లో సద్దిగట్టుకోని,సొర్ర బుర్రలో నీళ్లు మోసుకోని,కావిలి కుక్కల్ని యంటబెట్టుకోని గొర్రలు కాసే వోల్లు– మందల్నంతా దిన్న(మెట్ట)కి,పెన్నేటి గట్లోని కానగ సెట్లవనానికి తోలుకు పోతా వుండ్రి.
     మేము ఇద్దరుముగ్గురు పిల్లోల్లు లోపలి రప్పాల్లో వుండే గొర్రి,మేకపిల్లల్తో ఆడ్కొంటావుంటిమి. సన్న పిల్లలకి అగిశాకు,ఆమిదాకు,పుండాకు,బెండాకు,యాపాకు..రకరకాలవి కోసుకొచ్చి నులకల్తో కుచ్చులుకట్టి,రప్పంలో సూర్లకి యాలాడగట్తావుండ్రి.బుడుగు(చిన్న)పిల్లలకి ఆకు అందకుంటే కుచ్చలిప్పి నోటికందిస్తావుంటిమి. రాతి కుడితిలో నీళ్లు తాగిస్తావుంటిమి.(అప్పుడు సినెంటు,గార కుడితెలు వాడుకచాలా తక్కువ.పెద్ద రాతి దిమ్మెలను వులితో తొలిచి తయారు చేసేవారు.ఇప్పుడు వూరంతా గాలించినా కేవలం ఒకటి మాత్రమే కనిపించింది.దాని ఫోటో చూడగలరు) కొత్తగా ఈనిండే గొర్రెల్ని రప్పాల్లోనే ఇడుస్తావుండ్రి.పిల్లులొగ పక్కా మేమొగపక్కా పొదులో పాలు తాగుతావింటిమి.
     ఇంగుగు ఇసిత్రమేమంటే!! ఆకాలంలో వానల కార్తులు ముగుస్తూనే శానామందికి కండ్లకలక రోగమొస్తావుండె.మా ఇంట్లో ఎవిరికి రాకపోయినా నాకొచ్చేది.పొద్దున్నే లేసే టయానికి కన్నురెప్పలు జాలిబంక(తుమ్మబంక) పూసి దారముతో కుట్టేసినట్ల మెత్తుకు పోతావుండె. నేను దుప్పటిగూడా తీయకుండా గుడ్డోనిమాద్రీ ఏడుస్తావుంటి. అపుడు మా అన్నయ్య రప్పాల్లోకి ఎత్తుకుపొయ్యి,గొర్రొకింద పండుకోబెట్టి పొదుగులోనుంచి పాలు సర్ సర్ న పిండుతావుండె.కారం పూసినట్ల మండతావుండే కండ్లమిందకి యచ్చగా పాలు కారితే హా  హా ఆ ఆనందము యా మటల్లో సెప్పల్ల?? సాయంత్రము గొర్రిలు తిరిగొచ్చేకిముందే పిల్లలు మేసి మిగిల్నరమ్మలన్నీ వామికి మోస్తావుంటి. ఎండినంక అవే పొయ్యిలోకి కట్టెలు.
     మా యన్న(నాన్న), మా యమ్మకి ఏమి సెప్పిండాడోకానీ,గుడిసెలోనుంచి పరిగెత్తి పోతావుండే నన్ను”ఒరే! పప్పులు పెడతాను రారా,తినిపోదువు” అని పిడికిలి సూపిచ్చె.దగ్గిరికొచ్చి సూస్తే అది వుత్తది.యనక్కి తిరిగి దౌడుతీసేకి మొదలుపెడ్తి.మా యమ్మ లటుక్కున నా జుట్టుపట్కోని బచ్చల్లోకి ఈడ్సుకుపాయ.బచ్చలంటే అది తడకల్తోనో,గోడల్తోనో కట్టింది కాదు.మా పాకకి యనక తూరుప్పక్క పెద్ద కనకాంబర సెట్టు.పడమరకి దాసవాళం(మందారం)సెట్టు.దచ్చినానికి కంపలు పాతిండే రప్పాల కల్ల(కంచె).ఆసెట్ల సందేమాబచ్చిలి. ఆడ ఒగ రాతిపలకమీద మగోళ్లు పుట్టగోసీలు పెట్టుకోని,వారానికొగసారి నాలుగుసెంబులు దిగబోసుకొంటారు.ఆడోళ్లయితే సీర అడ్డామేసి కుక్కిరికాళ్లతో కూకోని దొంగలమాదిరీ బిరబిర్న అటుకుడు(మట్టిపాత్రడు)నీళ్లు కుమ్మరిచ్చుకొంటారు.
     ఇడిస్తే పరిగెత్తి పోతానేమో అని జుట్టని యడమ సేత్తో పట్కోని,కుడిసేత్తో బుడుంగ్ బుడుంగున నా నెత్తిమీద నీళ్లు కుమ్మరించె.టెంకాయ సిప్పలోని మాసీకాయని ముట్టుకోలేదు.అక్కడిక్కడసూసి మా యవ్వ మర్సిపొయ్యిండే దాన్నే రవంత తీసి నాతలకి రుద్దె.ఇది సూస్తావున్న నాకండ్లు సీకాయిపడి మండిపాయ.గట్టిగా ఏడిస్తి.అంతసేపటికి మా యవ్వ సంజీవమ్మ వూతకట్టి పట్టుకోని కుంటుకొంటా ఒచ్చె.అంతే!! “నోరుముయ్య్! దొంగబడవా” అని మాయమ్మ నా వుత్తపయ్యిమింద నాలుగంటిచ్చె.ఇంకా గట్టిగా ఏడిస్తి.
“ఊరుకో బాశాలీ! పొడ్డూన్నే యాళకి పిల్లోన్ని యాల అట్ల్త పసరమ్మాద్రీ కొడతావుండావు” అని నన్ని ఎనకేసుకొచ్చె.మరిగి(మట్టి గిన్నె)లో మాయమైన సీకాయ మర్సిపాయ.
     నీళ్లు పోసేదయితూనే సీర కొంగుతోనే నా తలకాయ తుడిసి,యడ్లో ఆరబెట్టి, సెక్క దువ్వానితో దువ్వె.ఒంటిజడేసి సెండుమల్లి పూలు ముడిసి అదికిండే అంగీతొడిగె.అంతసేపటికి మాయన్న లోపల్నుండి ఒగ నల్ల బళపమూ,అణాపెట్టి కొనిండే(6పైసాలు)సన్న బోకి పలకా తచ్చి ఇసుకూలుకు ఈడ్సుకుపాయ.
     అపుడు ఇసుకోల్లో ముగ్గురయవార్లు.సింగప్పయివారు,సీనివాసరావు,కొత్తాయప్ప కిస్టునారెడ్డి.పెద్దయివారు సింగప్ప సారుతావ పెద్దబుక్కులో పేరు రాపిచ్చి,నన్ను మా నాయన కిస్టప్పయివారుతాకి పిల్సుకుపాయ.నన్ను సూస్తూనే నాజతగాళ్లు “ఒరే సిదంబరగా” అని పిల్సిరి.అది ఇన్న మా నాయిన అగ్గయిపాయ.”లే!ఎవుడ్రా ఆనాకొడుకు మావోన్ని అట్ల పిలిసింది?ఆ కూత ఇంగొగసారి ఇనిపిస్తే సెప్పు ఇరిగేతట్ల కొడతాను.చిదంబర రెడ్డి అనే పిల్సల్ల.ఇదిగో అయివారూ గురుతుపెట్తుకో” అనీసుకూలు పెంకులు ఎగిరిపోయేతట్ల అరిశ.ఆశబ్దానికి పిల్లోల్లు,అయివారూ అందురూ అదిరిపాయిరి.కరెంటు పోయిన సినిమా మాదితీ అయిపాయ ఇసుకూలు.
అ ఆలు దిద్దించిన కృష్ణా రెడ్డి గారికి చిన్న సత్కారం

అ ఆలు దిద్దించిన కృష్ణా రెడ్డి గారికి చిన్న సత్కారం

     మా నాయిన అట్ల పోతూనే అయివారు”అప్పయ్యా!చిదంబర్రెడ్డీ నీ పలక తీసుకురాప్పా” అనె.అ ,ఆ లు రాసిచ్చె.నేర్సు కొంటి.అయివారు బొలేమెచ్చుకోనె.
   ఆపొద్దు మద్యాన్నం ఇంగరెండచ్చరాలు నేర్సుకొంటూనే ఒంటికిడిసిరి.అవుడు పెద్దపిల్లోల్లంతా పలకమింద కూకొంటావుండ్రి. అవన్నీ గోడకానిచ్చిరి.కొండరు ఒడికిండే పత్తి దారం తీస్కోని సేవామందిరానికి పొయ్యిరి.మిగిల్నొళ్లు సెడుగుడు,కరీప్పాట,మేకాపులాట,దొంగాట,బుర్రాట..ఆడ్రి.లోపలికి బెల్లు కొడుతూనే అందరూ ఒగేతావ కూకొన్రి.ప్రభవ విభవ,చైత్రము,జనవరి,అశ్విని భరణి,ఆని ఆవడి..పద్యాలు,ఒక్కట్లు(ఎక్కాలు)నోటికి నేర్సిన పెద్దపిల్లోళ్లు వర్సగా సెప్పిచ్చిరి.వాల్లలో మాదిగి అస్వత్తప్ప ఒగుడే నాకి తెల్సినోడు.యాలంటే వాళ్ల నాయన నారయణప్ప జతలో మా ఇంటికి ఒస్తావుండె.సిలావరి గలాసు తెచ్చుకోని మాయమ్మ పోసిన కాపీతాగుతావుండె.
     ఈడ ఈళ్ల నాయిన మాదిగ నారాయణప్ప కత రవ్వంత సెప్పల్ల.
    మా ఇంట్లో సన్న సీమనూని బుడ్డీ మాత్రమే వున్నంట.బ్యాటరీలు కొనేకిదుడ్లు,కరెంటుగాని లేని కాలము.ఒగదినము పొయ్యితావ కట్టెలమిందికి బుడ్డీపొర్లుకోని పెద్దమంట లేస్తావున్నంట.అంతపొద్దుకి నారాయణప్ప ఏమిటిదో పనిమింద మాయింటి తాకి వొచ్చిన్నంట.మానాయిన నీళ్లుపోసి అగ్గి అరిపేది సూసినంట.”అమ్మయ్యా!మాది పుడుగోసెలుపు గిడిసె.సన్న గుడ్డిదీపమున్నా సరిపోతుంది.మీది పెద్ద కుటింబుము.వుంచుకొండమ్మ”కొత్తది లాటీని(కిరోసిన్ లాంతర్)తెచ్చిచ్చినంట.అందుకే ఆయప్ప యపుడొచ్చినా మాయమ్మ కాపీ పోస్తావుండె.(మా అమ్మ ఆ లాంతర్ గురించి ఎన్నిసార్లు చెప్పేదో!!దానిమీద మేడిన్ ఇంగ్లాండ్ అని వుండేది.మేము రెండు మూడు వూర్లకు వలసలుపోయి తిరిగి సడ్లపల్లెకు వచ్చి 1975 ప్రాంతంలో ఇంటికి కరెంటు తీసుకొనేదాకా అలాగే వుండేది.సినిమాలో కానీ,బొమ్మల్లోకానీ చేతి ల్యాంపు కనిపిస్తే నాకు మాదిగ నారాయణప్పే గుర్తుకు వస్తాడు.)
    ఇంటికిడుస్తూనే అస్వత్తప్ప నాదగ్గరికొచ్చి అన్నో ఈపొద్దుటినుంచి మనం జతగాళ్లు.నువ్వు బాగ సదువుకో లెక్కలు బాగ నేరిపిస్తాను”అని మా ఇంటిదంకా విచ్చి ఇడిసిపాయ.
-సడ్లపల్లె చిదంబర రెడ్డి
Download PDF

18 Comments

 • rajaram.t says:

  సీమ రచయితల్లో ఒక ప్రత్యేకత వున్న ప్రత్యేక శైలి వున్న రచయిత చితంబరరెడ్డి.తన జీవితంలో ఒక శకలాన్ని కథగా మార్చాడు.చాల బాగుంది కథ

  • అన్నా ఇది కథ కాదు “వెతుకులాటల బతుకు” పేరుతో 80సం.సమాజ మార్పులు చెప్పాలనే వుబలాటం.మీ స్పందనకు ధన్యవాదాలు.

 • srinivas reddy.gopireddy says:

  చాలా బాగుంది.అన్నట్లు రాతి కుడితి తొట్లు ఇప్పుడు కొన్నిచోట్ల అలంకారానికి ఉపయోగిస్తున్నారు.వాటి లో నీళ్ళు పోసి చిన్న నీటి మొక్కలను పెంచుతున్నారు.ఇప్పటికీ కళ్ళ కలక రోగానికి మేకపాల వైద్యం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.

 • క‌థ శానా బాగా రాచ్చివ‌ప్పా చిదంబ‌ర్ రెడ్డి గారు .. మ‌న ప‌ల్లెల్లో కులాల అంత‌రాలు ఉన్న‌ప్ప‌టికి అనుబంధాలు చాలా బాగా ఉండేవి అనే విష‌యాన్ని శానా బాగా చెప్పినారు. క‌థ నా శిన్న త‌నాన్ని మ‌తికి తెచ్చింది. మీకు మీ త‌ర‌హాలో నా మ‌ప్పిదాలు

  • తమ్ముడూ ఇది కథ కాదు.దాదాపు 80సం. సమాజ మార్పును అక్షరాల లోనికి ఒదిగించాలనే చిన్న ప్రయత్నం.

 • Dwarampudi Rama Krishna Reddy says:

  చిదంబర రెడ్డి గారూ, మీరు వ్రాసిన బతుకు ( బడుగు ) కథ చదువు తుంటే హృదయం ద్రవించింది ! నా చిన్న తనం లో ఇటువంటి బతుకు పోరు జీవితాలు బాగా ఎక్కువగా కనిపించేవి ! ఇప్పుడూ …ఉన్నాయ్ …కానీ రూపం తేడా ! మీరు ..గురువుకు చేసిన సన్మానం ( కృతజ్ఞత ) చాలా గొప్పది ! అభినందనలు !-ద్వారం పూడి రామ కృష్ణా రెడ్డి-కాకి నాడ.

 • సోదరా ఇది కథకాదు! దాదాపు 80 సం.రాల మాప్రాంతపు జీవన విధానం,ప్రాంతీయ నుడికారం వగయిరాలు ఒక రకమయిన వివక్షకు గురి అయ్యాయి.దానికి కారణాలు వెదకడం కాదు. మరిచిపోతున్న ఇప్పటి తరానికి గుర్తుచేయడం.నేను రచయితను,కవిని కావడం వల్ల అక్షరాల పొందిక కథనుపోలి వుండవచ్చు. ప్రతినెలా వెలువడే దీన్ని చదవ గలరని ఆశిస్తాను. మీ హృదయానికి ధన్యవాదాలు!!

 • Dr.Ismail says:

  “అప్పయ్యా!”… ఈ మాటలో ఎంత ప్రేమ, ఆప్యాయత దాగి ఉన్నాయో, ఆ పిలుపు చాలా సార్లు విన్న నాకు తెలుసు. మా హిందూపురం ప్రాంతం మాండలికంలో ఓ భాగమది. అనంతపురం జిల్లాలోనే పలు ప్రాంతాల్లో వివిధ మాండలికాలు ఉన్నాయి. తాడిపత్రి వైపు కాస్త కడప మాండలికం కలిసిన వ్యవహారం , మా వైపు కన్నడ మాటల ప్రభావం, అనంతపురం చుట్టూ ఇంకో పలుకుబడి, ఇలా ఎన్ని ఉన్నా ఎవరి ఇంటి భాష వారికి తెలియని ఆనందాన్నిస్తుంది. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన విశేషాలున్నా ‘కండ్లకలకకు మేకపాలు చేసిన మేలు’ చదివాక, నాకో విషయం గుర్తుకు వచ్చింది. నా చిన్నప్పుడు నాకు ఎప్పుడైనా కండ్లకలక వస్తే, అప్పటికి ఇంటి దగ్గర ఎవరేనా పచ్చి బాలింతరాలు ఉంటే వాల్లింటికి పోయి కొన్ని చనుబాలు ఉగ్గుగిన్నెలో అడిగి తీసుకువచ్చేది మా అమ్మ. తర్వాతెపుడో చదివిన చదువుల్లో ఆ పాలల్లో ఉండే IgA యాంటీబాడిస్ వల్ల కాస్త మేలే జరిగి ఉంటుందని అనిపించింది.(Scientific studies suggest that it’s effective against very few pathogens but not all.)

 • buchireddy gangula says:

  రెడ్డి గారు
  మీ బతుకు పుస్తకం లో ఒక్క పేజి తెరిచారు —
  చాల బాగుంది — మిగితా పేజి లు తెరుస్తారని నమ్ము తూ —
  మేక పాలు లాగ —బాలింత పాలు కూడా కన్నుల్లో వేసేవారు —
  యింకా అన్ని రకాల జ్వరానికి యిప్పసత్తు –తేనె కలిపి నాకమని ఇచ్చేవారు ??
  ——————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 • సర్, బాగా ఆసక్తికరంగా ఉంది. మీరు మరిన్ని సంగతులను మాకు సెప్పాల… ఇంగా రొంత స్పీడుగా సెప్పాల…

 • sv. Prasad says:

  శాంతి నారాయణ సారు ఇట్లా రాయల్లని శానా ఏండ్లు నుంచి చెప్తా ఉండారు. కానీ ఆయన తీరిక సేసుకోక పాయె. ఈ కథలు చదవల్లని నాకు బలే మోజు. మహర్షి తరవాత మళ్లా ఆ మాదిరి ( నెమలికన్ను ) మీరు రాస్తా ఉండారు. ఇట్లా ఎవరన్నా రాయల్లని రాస్తే సదవల్లని ఎంత ఆశ పడతావుంటినో. ఇన్నాళ్లకి తీరిపాయ. రాయండి బాగా రాయండి.

  • ఐ విల్ ట్రై బ్రదర్

  • kaasi raju says:

   “అప్పయ్యా!” సడ్లపల్లె చిదంబర రెడ్డి అంటే నిన్నమొన్నటిదాకా పెద్దాయనే అనుకుంటి . యేయో నేను నీమల్లె గేదె పాలు అమ్ముకుని గొర్రెపాలు టీ కాసుకు తాగిన. బతుకును రాస్తుంటే బతుకుతనే ఉంటం.

   • కాసిరాజూ ఇల్లి ఏను బరెదరూ దూప్లికెట్ అంత బర్తాయిదే నమ్మ హళ్లి యల్లి 80 వర్ష దిండ బందిరో మార్పు గలన్నహేల్బెకు అన్నో ప్రయత్నా ప్రతి తింగలూ ఓది అభిప్రాయ తెలిసి —–సంతోష

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)