బతికిపో

Bathiki ....Po (600x435)
 Kadha-Saranga-2-300x268
భళ్లుమంటా తలుపులు తెర్సుకునేతలికి ఆమైనే ఉలిక్కిపడతా చూశాడు కుమార్సామి. ఎదురుంగా అపర ఈరబద్రుళ్లా కొడవలి పట్టుకు కనిపిచ్చాడు ఓబులు. ఆ ముసలోడి కళ్లు నిప్పుకణికల మాదిరి ఎర్రెర్రగా మండిపోతన్నాయి. వడ్డీ లెక్కలు రాసుకుంటన్న కుమార్సామి కదలక మెదలక కొయ్యమాదిరి అట్టాగే కూకుండిపొయ్యాడు.
“రేయ్. పీనుగుల్ని పీక్కతినే లమ్డీకొడకా. ఇయ్యాళ నా సేతుల్లో నీకు మూడిందిరో” అంటా ఒక్క దూకు దూకాడు, ఇంకో ఏడుపోతే ఎనభై నిండే ఓబులు. ముసలోడే ఐనా ఇంకా బలంతగ్గని చేతిలో టెంకాయల్ని కసక్కన తెగనరికే కొడవలి మాత్రం అప్పుడే సానబెట్టినట్టు తళతళమంటా మెరుత్తా ఉంది. తల విదుల్చుకుంటా తెలివి తెచ్చుకున్నాడు కుమార్సామి.
“ఏయ్ ముసలోడా ఏం.. ఏం.. జేత్తన్నావ్? సేతిలో ఆ.. కొ..డ..వ..లి ఏంది?” అన్నాడు భయంతోటి గడగడా వొణుకుతా. ‘ఓబులుకీ, నాకూ మజ్జ ఏదైనా అడ్డం ఉంటే బావుణ్ణు’ అనుకున్నాడు. కానీ ఆ గెదిలో చిట్టీలెక్కల పుస్తకాలు, ఆ పుస్తకాలు పెట్టి రాస్కునే డెస్కు తప్పితే ఇంకేం లేవు.
“కనిపియ్యడం లేదురా కొజ్జా నాయాలా. నీ నెత్తురు కళ్లజూడందే వొదలన్రా. ఇయ్యాళ్టితో ఈడ జనానికి నీ పీడ వొదిలిపోద్ది. చావరా జనం నెత్తురు తాగే రాచ్చసుడా” అని కొడవలితో ఒక్కేటు యెయ్యబోయాడు ఓబులు.
చప్పున ఓబులు కాళ్లని ఎవరో గట్టిగా పట్టుకున్నారు. అరచ్చణం ఆలిస్యమైనా కుమార్సామి తలకాయ టెంకాయలా తెగిపడేదే. చూశాడు. దీనంగా చూత్తా కుమార్సామి పెళ్లాం రామలచ్చిమి.
‘నా మొగుణ్ణి చంపి నాకూ, నా బిడ్డలకీ అన్నేయం సెయ్యమాకు’ అంటున్నాయి నీళ్లతో మెరుత్తున్న ఆమె కళ్లు.
“ఏమ్మా. నీ మొగుడు ఊళ్లో ఎంతమెంది ఆడాళ్ల ఉసురు పోసుకుంటన్నాడో తెల్వదా. సోద్దెం చూత్తా ఊరుకుంటివే. నాకు తలకొరివి పెట్టాల్సిన మా పెద్దోడు సాంబుగాణ్ణి పొట్టన బెట్టుకుంది ఈ నీచపు ముండాకొడుకే. ఈ నాయాల్ని నరుకుదామనొత్తే అడ్డం పడ్తన్నావ్. నీ మొగుడి పేణం నీకెట్టానో, ఊళ్లో ఆడాళ్లకి ఆళ్ల మొగుళ్ల పేణాలూ అంతేగా. ఇయ్యాళ నా కొడుకు సావుతో అన్నేయమైపోయిన ఆడి పెళ్లాం పిల్లల గతేంది. దానికి జవాబు సెప్పు తల్లీ. అప్పుడు వొదుల్తాను ఈ పుండాకోరునాయాల్ని” – పళ్లు పటపటా కొరికాడు ఓబులు.
మొగుడి సంగతి తెల్సిందే గాబట్టి ఏం చెప్పాల్నో తెలీక ఓబులు వొంక అట్టాగే దీనంగా చూసిందామె.
“ఏం.. ఏంది బెదిరిత్తన్నావ్. నిజ్జంగా సంపుతావేందీ.. అంత తేలిగ్గా ఉందా, సంపడమంటే. నేనేం జేశాను. బాకీ డబ్బులు టయ్యానికి ఇయ్యకపోడం ఆళ్ల తప్పు. సామ్మూర్తి.. అదే నీ కొడుకూ.. అంతేగా. నోటులో రాసుకున్నట్టు బాకీ కట్టాల్నా, లేదా.. అదేగా నేనడిగిందీ.. నేనేమన్నా సావమన్నానా ఏందీ. తీసుకున్న బాకీ డబ్బులు కట్టడం సేతకాక పిరికోడులా ఉరేస్కుంటే దానికి నాదా బాద్దెత?” – కుమార్సామి, దైర్నం తెచ్చుకుంటా.
“రేయ్.. ఏం కూశావ్‌రా. సాంబుగాడు సచ్చింది బాకీ కట్టలేననే బాత్తో కాదురా. ఈదిలో నువ్‌జేసిన అల్లరికీ, నువ్వన్న ఛండాలపు మాటలకీ రా. పరువుగా, గుట్టుగా ఇంతకాలం సంసారం జేసుకుంటా వొత్తున్న నా కొడుకు అందర్లోనూ అవమానం జెయ్యడాన్ని తట్టుకోలేక మనసులో కుంగిపొయ్యి ఉరేసుకున్నాడ్రా. మాటల్తోటే మనుషుల్ని పీక్కతినే పచ్చి రాచ్చసుడివిరా నువ్వు. నిన్నొక్కణ్ణి యేసేత్తే నేతగాళ్లంతా మనశ్శాంతిగా బతుకుతార్రా” – కొడవలి పైకెత్తాడు ఓబులు.
దాంతోటి కుమార్సామి పైపేణాలు పైనే పొయ్యాయి. వొళ్లంతా సెమట్లు పట్టేశాయి. గుండెకాడ నెప్పి మొదలయ్యింది. ‘చివరికి ఈ ముసలోడి సేతిలో సావు రాసిపెట్టుందా?’ అనుకోంగాల్నే, నాలికి పొడిబారింది. మామూలుగా ఐతే తిరగబడేవోడే. యాభయ్యేళ్ల తనముందు ఎనభయ్యేళ్ల ముసలోడు ఓ లెక్కా. కానీ తను ఉత్త సేతుల్తో ఉన్నాడాయె. పైగా కూకొని ఉన్నాడు. ఓబులు సేతిలో జూత్తే అప్పుడే సానబెట్టిన కొడవలుంది. పైగా నించోనున్నాడు. తను లేచేపాటికి ఒక్కేటుగానీ యేశాడా.. తన తలకాయ పుచ్చకాయలా తెగిపడుద్ది. భయంతో గొంతు పిడచకట్టుకుపొయ్యింది కుమార్సామికి.
*    *    *
ఆ పేట మొత్తమ్మీద కుమార్సామే పెద్ద వొడ్డీ యాపారి. ఓ పక్క చిట్టీపాటలు, ఇంకోపక్క వొడ్డీ యాపారంతో శానా తక్కువ రోజుల్లోనే కోట్లు సంపాదిచ్చాడు. బంగాళాపెంకుల ఇంటిని పడేసి రెండంతస్తుల మేడ బ్రెమ్మాండంగా కట్టాడు. మెట్ట, మాగాణి కలిపి యాభై ఎకరాల పైనే ఉంటుందని పేటలో సెప్పుకుంటా ఉంటారు. ఆటిలో బాకీ కట్టలేనోళ్లు జమచేసిన పొలాలు పదెకరాల దాకా ఉంటాయి. అట్టాగే ఓ పెంకుటిల్లునీ, ఏడు సెంట్ల ఖాళీ స్తలాన్నీ కూడా బలవంతాన లాగేసుకున్నాడు కుమార్సామి. ఆటి యజమానులు ఆయబ్బి కాడ జేసిన బాకీని కట్టాల్సిన టైముకి కట్టకపోడమే దానిక్కారణం. పేటలోని నేతగాళ్లే కాదు, శానామంది షావుకార్లు (మాస్టర్ వీవర్లు) కూడా ఆయబ్బితో ఇబ్బందులు పడతన్నారు. మనసులో ఆయబ్బి మీద ఎంత కోపమున్నా, కసున్నా ఏం జెయ్యలేని పరిస్తితిలో ఉన్నారు. ఎందుకంటే అవసరానికి ఎంతంటే అంత డబ్బు అప్పిచ్చేది ఆయబ్బే కాబట్టి.
ఓబులు కొడుకు సాంబమూర్తి శానా రోజుల్నించే కుమార్సామి కాడ చిట్టీపాటలు కడ్తన్నాడు. పౌర్ణం రోజు వొచ్చిందంటే కుమార్సామి ఇల్లు పాటలు కట్టేవోళ్లతోటి కిటకిటలాడిపోద్ది. మామూలుగా పౌర్ణం రోజు నేతగాళ్లందరికీ ఊరట. అంటే సెలవురోజు. మగ్గం చప్పుడు వినిపిచ్చని రోజు. షావుకార్ల కొట్లు నేతగాళ్లతో కళకళలాడే రోజు. ఆ రోజే నేతగాళ్లంతా తాము ఏ షావుకారికి నేత్తున్నారో ఆ షావుకారు కాడికి నేసిన గుడ్డల తానులు తీసకపొయ్యి కొత్త ‘ఎంట్లు’ (పడుగు, పేక నూలు, పాగళ్లు) తెచ్చుకుంటారు. ఆటితో పాటే ఆటి తాలూకా కూలీ డబ్బులు కూడా. అంటే ఉజ్జోగం చేసేవాళ్లకి జీతాలొచ్చే రోజు ఎట్టాగో నేతగాడికి పౌర్ణం రోజు అట్టాగా. ఆ రోజంతా నేతగాళ్ల ఇళ్లల్లో పండగ సందడే. నేతగాళ్ల కాడ డబ్బులాడేది అప్పుడ్నే కాబట్టి కుమార్సామి చిట్టీ పాటలు పెట్టేది అప్పుడ్నే.
పాటలు పాడుకోడానికి వొచ్చినోళ్లతోటీ, బాకీ చెయ్యడానికి వొచ్చినోళ్లతోటీ కుమార్సామికి అయ్యాళ చెణం తీరికుండదు. ఎవరైనా పాట డబ్బులు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా ఆయబ్బి ఊరుకోడు. ఆ తెల్లారే ఆ కట్టనాళ్లింటికాడికి పొయ్యి నానా యాగీచేసి, డబ్బులు వసూలు చేస్కుంటాడు. ఏదైనా అవసరానికి పనికొత్తాయి కదా అని నేతగాళ్లంతా కుమార్సామి కాడ చిట్టీపాటలు కడ్తుంటారు.
శానా యేళ్లనుంచీ ఆయబ్బి కాడ పాటలు కడ్తన్నాడు సామ్మూర్తి. ఎప్పుడైనా పౌర్ణం రోజు పాట డబ్బులు కట్లేకపోతే ముందుగాల్నే ఆ సంగజ్జెప్పి, గడువడిగి, ఆ లోపల కట్టేసేవోడు. అట్టాంటి నమ్మకమైన మనిషైన సామ్మూర్తి ఆమజ్జ కుమార్సామి కాడ యాభయ్యేలు అప్పుజేశాడు. పెద్ద కూతురి పెళ్లిని ఎట్టాగో ఎవరికాడా బాకీ పడకుండా జేశాడు కానీ రెండో కూతురి పెళ్లికి అప్పుజెయ్యక తప్పలేదు. అబ్బాయి ఆర్టీసీ కండట్టరుగా గవర్మెంటు ఉజ్జోగం జేత్తుంటం వల్ల, కూతురికి బవిష్యెత్తులో నేతనేసే పని తప్పుతుందనే ఆశతోటీ, వొచ్చిన మంచి సంబంధాన్ని సేతులారా వొదులుకోవడం ఎందుకనే ఉద్దేశంతో సేతిలో డబ్బులు అంతగా లేకపోయినా బాకీచేసి ఆ పెళ్లి జేశాడు.
వొందకి రెండ్రూపాయల వొడ్డీ లెక్కన ఆ అప్పు తీసుకున్నాడు సామ్మూర్తి. మూడేళ్లలో అసలు, వొడ్డీ కలిపి బాకీ మొత్తం తీరుత్తానని ఆయబ్బి చేత నోటు రాయించుకున్నాడు కుమార్సామి. అంటే మూడేళ్లలో వొడ్డీతో కలిపి ఎనభై యేలు కట్టాలన్న మాట. ఒకేళ ముందుగాల్నే కట్టేత్తే వొడ్డీ తగ్గుద్ది. అయితే నేతగాడికి అంత డబ్బు చెల్లిచ్చాలంటే అయ్యే పనేనా?
ఇంట్లో నేతనేసేది సామ్మూర్తి వొక్కడే. షుగరొచ్చి ఆయబ్బి పెళ్లాం జెయమ్మ శానా కాలం నుంచీ పైపనులు మాత్రమే జేత్తంది. కొడుకు కాలేజీలో సదూకుంటన్నాడు. ఓ పక్క కొడుకుని సదివిత్తా, ఇంకోపక్క పెళ్లాం రోగానికి డబ్బులు ఖర్చుపెడతా ఉంటే బాకీ డబ్బు చెల్లిచ్చడం ఎంత కనాకష్టమో సామ్మూర్తికి తెలవంది కాదు. మనసులో బయం రోజురోజుకీ పెరుగుతున్నా, వొంటి గురించి పట్టిచ్చుకోకుండా రేయింబవళ్లూ కష్టపడ్తా వొచ్చాడు. నిద్రలేచాక ఆరింటి కాణ్ణించీ మగ్గం గుంటలోనే సామ్మూర్తి జీవితం. మజ్జలో అన్నాలు తింటానికీ, బయటేమన్నా పన్లుంటే యెళ్లిరావడానికీ తప్పితే రేత్రి తొమ్మిది, పదింటిదాకా గుంటలోనే ఉంటన్నాడు.
“ఇట్టా అదేపనిగా నేత్తే నీ వొళ్లు పాడవుద్దయ్యా” అని దిగులు పడ్తుంటుంది జెయమ్మ.
“నాకేందే.. నాది ఉక్కొళ్లు” అని నవ్వుతా అంటాడే గానీ తనొళ్లు ఇంతకు ముందులా తన మాట వింటంలేదనే యిష్యం ఆయబ్బికి తెలుత్తానే ఉంది. నలబై ఐదేళ్లనుంచీ అదేమైనుగా మగ్గం గుంటని అంటిపెట్టుకొన్న బతుకు ఆయబ్బిది. నిన్న మొన్నటిదాకా పేట మొత్తమ్మీద స్పీడుగానే గాకుండా శానా అందంగా నేసే నేతగాడని అందరూ అనేవోళ్లు. వొయసులో ఉన్నప్పుడు ఓబులు కూడా తన కొడుకులా నేసినోడు కాదు.
కాలం గిర్రున తిరుక్కుంటా పోతంది. సామ్మూర్తి కొడుకు ఇప్పుడు బీయస్సీ మూడో యేడు సదూతున్నాడు. ఆ మజ్జలో రెండో కూతురు పురుడు కోసమని పుట్టింటికొచ్చింది. కాన్పు మామూలుగా అయిపోతందనుకుంటే ఆఖర్లో బిడ్డ అడ్డం తిరిగిందనీ, ఉమ్మ నీరు పోతన్నదనీ జెప్పి పొట్టకోసి బిడ్డను బయటకి తీసింది డాక్టరు. ఆ ఆపరేషన్‌కీ, ఇంకొన్ని ఖర్చులకీ పదేల దాకా ఐపోయాయి. కూతురు కదా తప్పదయ్యే. ఇట్టాంటియ్యే మజ్జమజ్జలో ఎయ్యో ఖర్చులు రావడం, అప్పటిదాకా దాచుకున్న డబ్బు ఖాళీ ఐపోడంతో కుమార్సామి కాడ చేసిన బాకీకి వొడ్డీ తప్పితే అసలు చెల్లిచ్చలేకపొయ్యాడు సామ్మూర్తి. కుమార్సామి సంగతి తెల్సు కాబట్టి మనసులో పీకుతానే ఉంది సామ్మూర్తికి, ఏం గొడవ జేత్తాడోనని. మూడేళ్లైపొయ్యాయి. వొడ్డీ ఇద్దామని యెళ్లిన ఆయబ్బిని నానా కూతలూ కూశాడు కుమార్సామి. వొడ్డీ తీసుకుని అసలు కూడా అప్పటికప్పుడు చెల్లిచ్చాల్సిందేనని పట్టుబట్టాడు.
“ఏంది సామీ. నా సంగతి నీకు తెల్వదా. ఎన్నేళ్లబట్టి నీకు పాటలు కడ్తన్నాను. ఎప్పుడైనా నావొల్ల తేడా వొచ్చిందా? ఇప్పుడంటే రెండో దాని పెళ్లి తర్వాతనే కదా కాత్త ఇబ్బంది పడ్తన్నా. అబ్బాయి సదూకోసమనీ, ఇంటిదాని వైజ్జం కోసమనీ ఖర్చవుతా ఉంది. వొడ్డీ అయితే ఆపకుండా ఇచ్చేత్తన్నా కదా. అబ్బాయి సదువైపోతే ఆడికి ఏదో వొక ఉజ్జోగం రాకపోదు. అప్పుడు నాకింత కష్టం ఉండదు. నీ బాకీ అణాపైసల్తో తీర్చేత్తా. మళ్లా నోటు రాయి” అని బతిమాలాడు సామ్మూర్తి. అప్పు తీసుకున్నోళ్ల బాధల్ని ఇని దయచూపితే ఆయబ్బి కుమార్సామి ఎట్టా అవుతాడు? ఆస్తులు ఎట్టా పోగేసుకుంటాడు?
“నాకీ కతలన్నీ చెప్పమాక సామ్మూర్తీ. టయ్యానికి బాకీ కట్టని పెతోడూ నీ మాదిరి కతలు చెప్పేవోడే. అయ్యన్నీ ఇనుకుంటే నేను యాపారం జేసినట్టే. నువ్వేం తిప్పలు పడ్తావో, ఏ ఇంటికి కన్నం యేత్తావో నాకు తెల్వదు. పది రోజులు టైమిత్తన్నా. నా బాకీ కడితే సరే. లేదంటే బజారుకీడుత్తా” అని కచ్చితంగా చెప్పేశాడు.
ఇదంతా ఓబులికి తెల్సినా కొడుక్కి ఏం సాయం చెయ్యలేని ఇదిలో ఉన్నాడు. కొద్ది రోజులు పెద్దకొడుకు కాడా, కొద్ది రోజులు చిన్నకొడుకు కాడా రోజులు నెట్టకొత్తున్నాడు. పైపనుల్లో సాయం తప్పితే ఆయబ్బి పోగేసుకున్నదేం లేదు.
కుమార్సామి ఎంత గట్టిగా జెప్పినా, ఆయబ్బి యెట్టాంటోడో ఎరిగినా మంచోడిగా, పరువు  మర్యాదలు ఉన్నోడిగా తనకున్న పేరువల్ల కొంత దయ సూపుతాడేమోనని ఆశపడ్డాడు సామ్మూర్తి. పైగా ఎన్నో ఏళ్లబట్టి తను ఆయబ్బి కాడ పాటలు ఆగకుండా కడతా వొత్తున్నాడాయె.
పది రోజులెళ్లిపొయ్యాయి. కుమార్సామి ఇంటిమీదికి వొత్తాడేమోనని మనసులో బితుకుబితుకుమంటన్నా పైకి నిబ్బరంగా ఉంటానికి పెయత్నిత్తున్నాడు సామ్మూర్తి.
ఆ రోజు మజ్జాన్నం మొగుడూ పెళ్లాలు అన్నాల కాడ కూకోబోతన్నారు.
“ఏవయ్యా సామ్మూర్తీ” అన్న కేక, ఇంటి బయట్నించి. అది మామూలు కేక కాదు. అది మామూలు గొంతూ కాదు. బీరకాయ కూరతో అన్నం కలుపుకొని, ముద్ద జేత్తన్నాడు సామ్మూర్తి. ఇంకా ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేదు నోట్లో.
Bathiki ....Po (600x435)
“సరిగ్గా టయ్యానికి వొచ్చేశాడే దొంగనాయాలూ” అని, “నేను మాట్టాడొత్తా. నువ్వు తింటుండు” పెళ్లాంతో చెప్పి కంచం కాణ్ణించి లేచాడు.
“ఈ మడిసికి యేళాపాళా ఉండదా. నువ్వు కూకో. కాసేపాగి రమ్మని సెప్పొత్తా” అంటా లేవబోయింది జెయమ్మ.
“ఏం జేత్తన్నావ్ పెద్ద మనిషీ.. లోనా” అంటా పంచాలోకి వొచ్చాడు కుమార్సామి.
“ఇప్పుడే అన్నానికి కూకుంటన్నాం సామీ. వొత్తన్నానుండు” అంటా గబగబా దొడ్లోకి పొయ్యి చేతులు కడక్కొచ్చాడు సామ్మూర్తి.
“ఎట్టా తినబుద్దేత్తందయ్యా కూడు. నాకియ్యాల్సిన బాకీ డబ్బులు ఇయ్యకుండా కూడెట్టా సయిత్తందనీ. నిద్రెట్టా పడతందీ అంటా?” గట్టిగా అరిచాడు కుమార్సామి. ఆయబ్బి కేకలు చుట్టుపక్కలాళ్లకి ఇనిపిత్తన్నాయి. ఇనిపిచ్చాలనే అట్టా అరవడం కుమార్సామికున్న గుడిసేటి గుణం. ఊహ తెలిసినాక ఎప్పుడూ ఎవరికాడా ఇట్టాంటి మాటలు పడని సామ్మూర్తికి ఇది శానా అవుమానంగా అనిపిత్తంది. కుమార్సామి మాటలు బరిసెల మాదిరిగా గుండెల్లో గుచ్చుకున్నాయి.
“సామీ ఎందుకట్టాగా నోరు పారేసుకుంటన్నావ్. నేను బాకీ డబ్బులు కట్టనని సెప్పానా. నా ఇబ్బంది సెప్పుకుని, మళ్లా నోటు రాయిమన్నా కదా. నేనెట్టాంటోణ్ణో నీకు తెల్వదా. ఎంత కాలం నించి నీకు పాటలు కడ్తన్నానో తెల్వదా. వొడ్డీ డబ్బులు ఆపకుండా కడ్తానే వొత్తున్నాగా. ఆమాత్రం ఆగలేవా?” కొంచెం గట్టిగానే మొదలుపెట్టి, చివరికొచ్చేతలికి బతిమిలాడతన్నట్టు అడిగాడు సామ్మూర్తి.
“ఏందోయ్ మాటలు రేగుతున్నాయే. నేను నీకు బాకీ పడ్డానా. నువ్వు నాకు బాకీపడ్డావా? నేను నోరు పారేసుకుంటన్నానా? కడుపుకి కూడు తింటన్నావా, గడ్డి తింటన్నావా? అంత రోషమున్నోడివి టయ్యానికి నా బాకీ డబ్బులు  కట్టెయ్యాలి గదా. ఇత్తే నేను నీ ఇంటిదాకా ఎందుకొత్తాను? నా టైమెందుకు వేస్టు జేసుకుంటాను? వొడ్డీ డబ్బులు కట్టేత్తే అయిపోద్దా. అసలు డబ్బుల సంగతేంది? మీ అయ్యిత్తాడా?” పెద్దగొంతుతో రంకెలేశాడు కుమార్సామి.
సామ్మూర్తికి నోట్టోంచి మాటలు పెగల్లేదు. ఆ యబ్బికి సిగ్గుగా ఉంది. అవమానంగా ఉంది. చుట్టుపక్కల జనాలు ఇళ్లలోంచి బయటకొచ్చి సోద్దెం సూత్తనేతలికి ఆయబ్బికి తల కొట్టేసినట్టుగా ఉంది. తలెత్తి అట్టా ఇట్టా సూడ్డానికి కూడా ఇబ్బందిగా ఉంది.
సామ్మూర్తి మౌనంచూసి మరీ రెచ్చిపొయ్యాడు కుమార్సామి. “కూతుళ్ల పెళ్లిచెయ్యగానే సంబడం కాదు. బాకీ కట్టాలన్న ఇంగిత గేనం కూడా ఉండాలి” అన్నాడు. సామ్మూర్తి వంశాన్నంతా తిట్టాడు. మజ్జమజ్జలో బూతులు కూడా. ఆడ జెయమ్మ కూడా ముద్ద నోట్లో పెట్టుకోలేకపొయ్యింది.
“ఆకర్సారి సెబ్తున్నా. వొచ్చే నెల్లోగా బాకీ మొత్తం కట్టేత్తే సరి. లేపోతే నీ ఇంటి కాయితాలు నాకాడ పెట్టుకుంటా” అని గర్జించి యెళ్లిపొయ్యాడు కుమార్సామి.
ఆయబ్బి యెళ్లిపొయ్యినా సామ్మూర్తి తలొంచుకొని కదలకుండా మెదలకుండా కొయ్యలా అట్టాగే నిల్చుండిపొయ్యాడు. తల్లో సుత్తుల్తో కొడతన్నంత బాధ. గుండెల్లో బరిసెలు గుచ్చుతున్నంత నెప్పి. జెయమ్మ వొచ్చి “ఏందయ్యా అట్టా రాయిలా నించున్నావ్” అని కుదిపి కదిపేదాకా అట్టాగే ఉన్నాడు.
పెళ్లాంవొంక జూశాడు సామ్మూర్తి. ఆయబ్బి మొహంలోని ఆలోచనలూ, కళ్లల్లోని నీళ్లూ ఆమెకి తెలిశాయి. మొగుణ్ణెప్పుడూ అట్టా సూడలేదామె.
“ఊరుకోయ్యా. ఆ సామి సంగతి తెలీందా. దా. బువ్వ తిందూగానీ” అంది బుజంమీద సెయ్యేత్తా.
‘ఆకలి సచ్చిపొయ్యిందే’ అందామనుకున్నాడు. ఆమె కూడా బువ్వ తినని సంగతి గేపకమొచ్చింది. మూగోళ్లా యెల్లి కంచంముందు కూకున్నాడు. నాలుగు మెతుకులు గెతికాడు.
ఆ రోజంతా యెట్టానో గడిచింది ఆ ఇద్దరికీ. మొగుడికి దైర్నం సెప్పాలని సూసింది జెయమ్మ. సామ్మూర్తి “ఆ.. ఊ..” అంటన్నాడే గానీ మనసెక్కడ్నో ఉంది. మగ్గాలోకెళ్లి ‘వాటు’ యేత్తన్నాడే గానీ అందులో ఉషారు లేదు. నాడి తగులుకొని పోగులు తెగుతున్నాయి.
“ఈ పూటకి లేచిరాయ్యా. మనసు బావోలేనట్టుంది” అంది జెయమ్మ. లోసొచ్చి నులకమంచం మీద పడుకున్నాడు.
పెద్దకొడుకు ఇంటిమీదికొచ్చి కుమార్సామి గొడవ జేసెళ్లాడని చిన్నకొడుకు కాడున్న ఓబులుకి తెలిసింది. వొచ్చాడు. మజ్జింటో నులకమంచం మీద కళ్లు మూసుకొని పడుకోనున్న కొడుకుని సూశాడు.
కుమార్సామి ఎన్ని మాటలన్నాడో, ఏం కూతలు కూశాడో సెప్పింది కోడలు.
“వొరే సాంబూ. ఆ కుమార్సాంగాడు ఏవేవో అంటంటాడు. ఆడి సంగతి మనకు తెలీందేముంది. నువ్వు దిగులు పెట్టుకోమాక. ఏదో ఓటి సేద్దాంలే” అని దైర్నం సెప్పాలని సూశాడు ఓబులు.
ఏదో గొణిగాడు సామ్మూర్తి. ఓబులుకి అదేందో సరిగా ఇనిపించలేదు. అయినా ఇనిపించినట్టే ఏందని అడగలేదు. ఆ రేత్రి మామూలు రేత్రిలా లేదు. ఆ సంగతి జెయమ్మకి కూడా బాగా తెలుత్తోంది. పక్కన నులకమంచం కిర్రుకిర్రుమంటా సప్పుడు సేత్తంది మాటిమాటికీ. అంటే మొగుడు నిద్రపట్టక అటూ ఇటూ పొర్లుతున్నాడన్న మాట. ఆమె మనసులో దిగులూ, భయమూ.. రెండూ ముసురుకున్నాయి. ఎందుకో గుండెలో గిలిగా ఉంది. దడగా ఉంది. ఆమెకు ఏ అర్ధరేత్రో నిద్రపట్టింది.
తెల్లారింది. రోజూ తెల్లారినట్లు లేదు ఆ తెల్లారడం. భయంకరంగా తెల్లారింది. భీతిపుట్టేలా తెల్లారింది. ఐదున్నరకి లేచింది జెయమ్మ. పక్కన మొగుడు లేడు. ఐదింటికే లేచి, తలుపు దెగ్గిరగా యేసి, చెంబు తీసుకొని రైలుకట్టకాడికి పోతాడు కాబట్టి అట్టాగే పొయ్యాడనుకుంది.
జుట్టు ముడేసుకుంటా దొడ్డి తలుపు తీసింది. ఆమైనే ఒక్కసారిగా ఒళ్ళు జలదరిచ్చిపొయ్యింది. ఎదురుగా ఏదో నల్లగా ఆకారం, గాల్లో యేళ్లాడతా ఉంది. ఇంకా యెల్తురు పూర్తిగా రాలేదు. జెయమ్మ కళ్లు నులుంకుంటా సూసి గావుకేక పెట్టింది. ఆ కేక ఉంత భయానకంగా ఉందో! యేపసెట్టుకి యేలాడ్తన్న ఆ ఆకారం సామ్మూర్తిది. కంటిగుడ్లు పైకి పొడసకొచ్చి, నాలికి బయటకొచ్చి…
*     *     *
“నిన్నిట్టా ఊరకే వొదిలేత్తే ఇంకెంతమంది పేణాలు తీత్తావో, యెంతమంది ఉసురు పొసుకుంటావో. నువ్వు పోతేగానీ ఈ పేటకి పట్టిన శనీద్రం పోదురా కుక్కా” అంటా కుమార్సామి జుట్టు పట్టుకున్నాడు ఓబులు.
గడగడా వొణికిపొయ్యాడు కుమార్సామి.
‘ఐపోయింది. ఈ ముసలాడి సేతిలో నాకు మూడింది’ అంది ఆయబ్బి మనసు.
“అయ్యా. మా ఆయన్ని ఏం సెయ్యమాకు. ఆయన సెడ్డోడు నిజిమే. ఇకనుంచీ దుర్మార్గం పనులు సెయ్యకుండా నే సూస్కుంటాగా. నన్నూ, నా పిల్లల్నీ అన్నేయం సెయ్యమాకు. నీకు దణ్ణం పెడ్తన్నా. నీ కాళ్లు మొక్కుతన్నా” అని కాళ్లు పట్టేసుకుంది కుమార్సామి పెళ్లాం.
ఆమొంక సూశాడు ఓబులు. తడిగా ఉన్న ఆయమ్మి కళ్లూ.. భయమూ, దిగులూ కలిసిన మొహమూ.. ఆయబ్బిలోని జాలిపేగుని కదిలిచ్చాయి. సప్పున ఓబులు గుండెలో దయ మొలకలెత్తింది.
“రేయ్ సామిగా. నిజ్జింగా నిన్ను నరికి పోగులుపెట్టి మన పేటకి దాపురిచ్చిన పీడని వొదిలిద్దామనే వొచ్చాన్రా. కానీ నీ పెళ్ళాం పిల్లల్ని సూసి వొదిలేత్తన్నా. ఆడదాని వొల్ల బతికిపొయ్యావ్ పోరా కొడకా. రేయ్. ఒక్కటి మాత్రం గేపకం పెట్టుకో. ఈసారి ఎవురింటి మీదకైనా వొచ్చి గోలసేసినట్టు తెల్సిందా.. అక్కడ్నే పాతేత్తా నాయాలా. ఇదుగోమ్మా.. నీక్కూడా సెబ్తున్నా. నువ్ సెప్పిన మాట నిలబెట్టుకోకపొయ్యావో.. ఇంకోసారి.. నీకిట్టా బతిమాలుకొనే అవకాశం కూడా ఇయ్యను. ఛీ.. నీదీ వొక బతుకేనట్రా” అని ఖాండ్రించి కుమార్సామి మొహాన ఉమ్మేశాడు ఓబులు.

-బుద్ధి యజ్ఞమూర్తి

 

Download PDF

1 Comment

  • Koti Nageswara Rao says:

    నేటి హ్యాండ్ లూం వీవర్స్ జీవితాలకు అద్దం పట్టినట్లుగా ఉంది. చక్కని కథ.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)