మిస్టరీల హిస్టరీ – దేవగిరి

1(1)

 

పెద్ద పెద్ద కోటల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు కలిగే అనుభూతులే వేరు. తక్కువ జనాభా ఉన్న ఆ రోజుల్లో అంత భారీయెత్తు కట్టడాల నిర్మాణానికి అంతమంది మనుషులు ఎక్కడనుండి దొరికారా అనిపిస్తుంది. ఒక రాజు కాస్త స్థిరపడి ఓ కోట కట్టించడం మొదలుపెట్టాడూ అంటే, మనం ఈ రోజుల్లో కట్టే భవంతుల్లా ఇట్టే అయే పని కాదు కదా! రాతిని పగలగొట్టడంనుంచీ ప్రతీదీ చేతులతో చేసుకుపోవాల్సిందే. అందుకే మహా కట్టడాలూ కోటలూ పూర్తిగా రూపు తీసుకునేటప్పటికి చాలా ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి. ఈ లోపున రాజులు కొట్టుకు చావడాలూ, పాత రాజుగారి తల కోటగుమ్మానికి వేలాడటం వంటివి జరిగిపోతూ ఉంటాయి. కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ ఇంటికి మనక్కావలసిన అందాలు దిద్దినట్టు, జయించిన కోటలో నచ్చనివి పగలగొట్టి కొత్త మెరుగులు దిద్దించడానికి పూనుకుంటారు కొత్త రాజుగారు. ఇలా మార్పులు చెందుతూ చివరకు ప్రజాస్వామ్యపు కాలానికొచ్చేసరికి కోట శిథిలావస్థకొచ్చినా ముసలి మంత్రగత్తెలా ఆకర్షిస్తుంది. “మీలాటి అల్పప్రాణాలని ఎన్నిటిని చూశానో” అంటూ మన ఉనికిని తేలిక చేస్తుంది.

దౌలతాబాద్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పేర్లకి అవినాభావ సంబంధం. అక్కడ ఏం చూసి ఆయన దాన్ని దేశ రాజధాని చేసి, ఢిల్లీ జనాన్ని సైతం అక్కడికి తరలించే పని పెట్టుకున్నాడా అని ఆ కోటగురించి ఒక ప్రత్యేక ఆసక్తి నాకు. ఈ మధ్య ఔరంగాబాద్, అజంతా, ఎల్లోరాలు చూడటానికి వెళ్ళినప్పుడు దౌలతాబాద్ కోట కూడా చూశాం. దురాశ, అధికారదాహంతో తమలోతాము యుద్ధాలు చేసుకుంటూనే మధ్య ప్రాచ్యం నుంచీ దేశాన్ని కొల్లగొట్టేందుకు వచ్చినవారితో మరోపక్క తలపడుతూ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించిన మధ్యయుగపు రాజుల నాటి చరిత్రకు మౌనసాక్షి ఈ కోట. ఎనిమిది వందల యేళ్లలో ఎనిమిది రాజవంశాలు పెరిగి విరగడాన్ని చూసిన ఘనమైన కోట ఇది.

2(1)

యాదవ వంశానికి చెందిన ఐదవ భిల్లమరాజు నిధులు దొరకడంతో నిక్షేపరాయుడై, దేవగిరి అనే పేరుతో ఈ కోట కట్టించి రాజ్యం ఏలాడట. మామూలు మనుషుల బతుకులు గాల్లో దీపాల్లా అయిపోయిన ఆ కాలంలోనే సంత్ జ్ఞానేశ్వర్, నామదేవ్, గోరా కుంభార్ వంటివారు మహారాష్ట్ర అంతటా భక్తిని వెల్లువెత్తించారు. జ్ఞానేశ్వర్ ఈ కోటను దర్శించాడు. తరువాత ఇక్కడికొచ్చిన విదేశీ యాత్రీకులు ఇబ్న్ బటూటా, ఫరిష్తా. సిరిసంపదలతో ఠీవిగా తలెత్తి నిలుచున్న ఇలాంటి కోటమీద ఢిల్లీసుల్తాను కన్ను పడకుండా ఉంటుందా! అల్లాఉద్దీన్ ఖిల్జీ, మాలిక్ కాఫుర్ ఈ ప్రాంతపు యాదవులతో యుద్ధాలకు దిగి కొంత వరకూ వారిని లొంగదీసుకున్నారు. పెద్ద పెద్ద కోటలను వశం చేసుకోవటం ఒకేసారిగా కుదరదు కదా! మాలిక్ కాఫుర్ కొన్నాళ్ళు యాదవులను సామంతులుగా చేసుకున్నాడు. ఓడిన యాదవ రాజునే ఢిల్లీకి ప్రతినిధిగా నియమించి భారీ ఎత్తున కప్పం లాక్కుని వెళ్ళాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు రాజు హరపాలదేవ యాదవుడు స్వాతంత్యం ప్రకటించుకున్నాడు. దానితో ఆగ్రహించిన కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ ఈ కోటమీద యుద్ధానికి దిగాడు. అతడు 1318 లో దీన్ని జయించాడు. తిరుగుబాటు చేసిన హరపాలదేవను బతికుండగానే చర్మం వొలిపించి, అతని శరీరాన్ని కోటగుమ్మానికి వేలాడదీయించాడని గాథ. నూట ముప్పై యేళ్ళు పాలించి, అందులో పాతికేళ్ళపాటు ఢిల్లీసుల్తానును ప్రతిఘటించిన యాదవ వంశం అలా విషాదంగా అంతరించింది. తరువాత వరుసగా తుగ్లక్, బహమనీ, నిజాంషాహి, మొఘల్, అసఫ్జాహి, పేష్వాల దర్జాలను ధరించి భరించింది దౌలతాబాద్ (సంపదల నిలయం)గా మారిన దేవగిరి. దేవగిరికి దౌలతాబాద్ గా పేరు మార్చింది తుగ్లక్.

***

అక్టోబర్ నెల దక్కను అంతటా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పరిచింది. దేవగిరి దగ్గర హైదరాబాద్ వాసనే వీస్తోంది. ఈ వాతావరణంలోనే గమ్మత్తు ఉంది. అతిగా చలిలేకుండా, అలాగని ఎండ బాధ కూడా ఎక్కువగా లేని ఈ సమతుల్యత తుగ్లక్ ను ఆకర్షించి ఉంటుందేమో! పైగా దేశం మధ్యలో మంచి కట్టుదిట్టంగా ఉండటంతో ఈ కోటతో ప్రేమలో పడిపోయి, చిన్న చిన్న రాజులందరి మీదా అజమాయిషీ సరిగ్గా చేయొచ్చనుకుని ఇక్కడికొచ్చి ఉంటాడు.

మూడు ప్రాకారాల కోట ఇది. మొదటి ప్రాకారం అంబర్ కోట్. దీనికీ, మహాకోట్ అనే రెండో ప్రాకారానికి మధ్య సామాన్యజనం ఉండేవారట. ఈ ప్రాంతమే ఇప్పటి దౌలతాబాద్ ఊరు. అంబర్ కోట్ దాదాపు శిథిలమయింది. కోటలో ప్రవేశించటానికి మహాకోట్ ప్రాకారపు ద్వారం దాటాలి. దాని చెక్క తలుపునిండా పొడుచుకొచ్చే ఇనుప ములుకులు ఉన్నాయి. అంటే ఏనుగుల తలలతో ఢీకొట్టించి తలుపును ధ్వంసం చేసే టెక్నిక్ ఇక్కడ పనికి రాదన్నమాట. వంచనతోనే తలుపు తెరిపించాలి. ములుకుల రక్షణ ఉన్న ఈ తలుపుల్ని కాలమూ యుద్ధాలూ ఏమీ చెయ్యలేకపోయాయి.

మహాకోట్ రెండోద్వారం ముందు కోటలకు అలంకారంగా కనబడే చిన్న ఫిరంగులు ఇనపబళ్ల మీద కనిపించాయి. వాటి మీద చిన్నపిల్లలు ఎక్కి ఆడుకుంటుంటే తల్లిదండ్రులు ఫోటోలు తీసుకుంటూ మురుస్తున్నారు. అవి దాటి రాళ్ళూ రప్పలమధ్య నుండి ముందుకి నడుస్తూ పోయాం. ఈ దారమ్మటే ఎన్ని ఏనుగులూ, గుర్రాలూ, ఎంతమంది రాజులూ, సామాన్యులూ, వాస్తు శిల్పులూ, కవులూ, జ్ఞానులూ నడిచివుంటారో…

‘బావ్డీ’ అని దక్కనులో పిలిచే బావులను సామాన్య జనం కోసమూ ప్రాసాదంలో ఉండే రాజుల కోసమూ కట్టించారు అప్పటి రాజులు. హాథీ హౌద్ అనే పెద్ద ట్యాంక్ కూడా కనిపించింది. ఇప్పుడు అందులో ఏ నీళ్ళూ లేవనుకోండి. తుగ్లక్ హడావుడిగా రాజధాని మార్చేశాడు గానీ ఆ జనాభాకు తగిన నీటి సదుపాయం సరిగ్గా చూడలేకపోయాడు. కారణాలేమైతేనేం రెండేళ్ళ తరువాత ఢిల్లీకి వెనుదిరిగాడు. తరువాత వచ్చిన నిజాంషాహి గారి వజీరు ‘మాలిక్ అంబర్’ దగ్గరలో ఉండే కొండల్లో చిన్న ఆనకట్టలు కట్టి, అక్కడినుండి పైపుల ద్వారా నీటిని ఈ బావుల్లోకి, ట్యాంక్ ల్లోకి, కందకాల్లోకీ ఎప్పుడూ వచ్చేలా ఏర్పాటు చేశాడట. దక్కను పీఠభూమిలో నీటి కోసం చెరువులు ఏర్పాటు చేసుకుని వాటిని నిర్వహించుకోవటం ముఖ్యమని నిజాం కాలంలో గ్రహించారు. ఇప్పుడు మనకి ఆ జ్ఞానం పోయింది. చెరువులమీద ఇళ్ళు కట్టుకునే మూర్ఖత్వానికి దిగి, నీటికోసం భూమి గుండెల్లో ‘బోరు’ గునపాలతో లోతుగా గాయాలు చేసే నాగరీకం లోకి వచ్చేశాం. నీళ్ళు సరిగ్గా దొరకని చోటినుంచి అన్వేషణ మొదలుపెట్టి సాధించుకున్న టెక్నాలజీ నీళ్ళను సమృద్ధిగా సంపాదించిపెట్టింది. ఇప్పుడు కళ్ళు మూసుకుని పాలు తాగే పందిపిల్లల్లా వాటిని మొత్తం వాడేసుకునే దశలో ఉన్నాం. భూమితల్లి గుండెల్లో నీరెండిపోతోంది. దొరకనితనం లోకి మళ్ళీ వెళ్తున్నాం కాబట్టి ఎంత కొత్త టెక్నాలజీ కనిపెట్టినా వాటితో పాత నిర్వహణ పద్ధతుల వైపు చూడాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో చరిత్ర మనకు పాఠాలు చెప్తూనే ఉంటుంది. అల్లరిపిల్లల్లా మనం విన్నా వినకపోయినా.

ఔరంగాబాద్ లో సూఫీ వేదాంతి బాబా షా ముసాఫిర్ దర్గా “పంచక్కి” అనే చోట ఉంది. ఈయన బుఖారా (రష్యా) నుంచీ వచ్చి ఇక్కడ ఉండిపోయాడు. ఈ దర్గాలో పంచక్కి (పానీ చక్కీ) అనే యంత్ర విశేషం చూడొచ్చు. 17 వ శతాబ్దంలో కట్టిన ఈ పిండిమరతో ఆ దర్గాను ఆశ్రయించుకుని ఉన్న ఎంతోమంది జనాభాకీ, ఇంకా సైనికులకీ కూడా కావలసినంత పిండిని తయారుచేసుకునేవారుట. కొండల్లో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలధారను మంచి ఉధృతితో భూమి అడుగునుండి మట్టి గొట్టాలద్వారా ప్రవహింపజేసి, ఇక్కడో బుల్లి జలపాతం సృష్టించి అక్కడనుంచి వచ్చిన యాంత్రికశక్తితో చక్కీని నడిపిస్తారు. ఇప్పుడిది ఒక అందమైన టూరిస్ట్ స్పాట్. ప్రకృతిని మనిషి అవసరాలకోసం ఉపయోగించుకోవాలనే ఆలోచనల్లోంచి టెక్నాలజీని సృష్టించుకున్న కాలం అది. అక్కడితో ఆగటం చేతకాక, మరిన్ని సుఖాలవేటలో టెక్నాలజీని పెంచుకునే కాలంలో ఉన్నమనం ఇలాంటి ప్రదేశాలు చూడ్డం ఒక మానసిక అవసరం. ఎక్కడినుండి ఎక్కడికి వెళ్తున్నామో బోధపడుతుంది.

3(1)

 

 

కోటలోకి మళ్ళీ వస్తే, హాథీ హౌద్ దాటాక విరిగి పడివున్న శిల్పవిశేషాలు ఏవో కనిపించాయి. అవేమిటో మొదట అర్ధం కాలేదు. ఆ పైన భారతమాత గుడి ఉంటుంది వెళ్ళమని చెప్పారు. గుమ్మటపు ప్రాకారం లోపల అతి విశాలంగా పరుచుకున్న ప్రాంగణం. నీడలు పొడవుగా సాగుతున్న సమయంలో అక్కడకి చేరాం. ఎన్ని ఆధిపత్యపు నీడలు ఇక్కడ ప్రసరించాయో! అసలుకి అదొక జైన మందిరం… యాదవులు కట్టించుకున్న ఈ మందిరాన్ని పడగొట్టించి మసీదుగా మార్పించాడట ముబారక్ ఖిల్జీ. ఆ శిథిలశిల్పాలు జైన మందిరానివే. నిజాంరాజ్యం భారతదేశంలో విలీనమైన వెంటనే అక్కడ భారతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారట.

4(1)

మహాకోట్ తరువాత వచ్చేది కాలాకోట్ ప్రాకారం. ఈ రెండిటికీ మధ్య ‘చాంద్ మినార్’ అనే పెద్ద ఇటుకరంగు కట్టడం ఉంది. బహమనీ సుల్తాను తన విజయసూచకంగా దీన్ని కట్టించాడట. కాలాకోట్ వైపు వెళ్తున్నకొద్దీ ఒక నిగూఢత్వం లోకి నడుస్తున్న అనుభూతి. సాయంకాలపు నీరెండా, పచ్చని చెట్లమధ్య విస్తరిస్తూ మాయమౌతున్న రాతి ప్రాకారపు ఎత్తూ… ఇవి చాలు intrigue ని సాలెగూడులా బుర్రలో అల్లడానికి.

కాలాకోట్ లోపల చీనీ మహల్ కనిపిస్తుంది. చైనామట్టి పలకలతో అలంకరించారు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇప్పుడది శిథిలావస్థలో ఉంది. ఇక్కడ రాజవంశీకులను బందీలుగా ఉంచేవారట. గోల్కొండ తానాషా, బిజాపూర్ ఆదిల్షా, కాకతీయ గణపతిదేవుడు ఇక్కడ బందీలుగా ఉన్నారంటే, ఎంత జీవ వేదనను ఇముడ్చుకున్న కోట యిది! నిజాంషాహీలు కట్టించుకున్న మహల్ కూడా జీర్ణావస్థలో ఉంది. ఈ రెండిటి మధ్యా ఒక ఎత్తయిన వేదిక మీద ‘మెంధా తోప్’ అనే పేరుతో ఒక పెద్ద ఫిరంగి ఉంది. దాని వెనుకభాగం పొట్టేలుతల ఆకారంలో ఉంది. దాని మొదటిభాగంలో అందంగా అరబిక్ లిపిలో ఔరంగజేబ్ రాయించిన కురాన్ శాసనం ఉంటుంది. దీనినీ, ఇంకా పైనున్నఫిరంగుల్నీ పైకి చేర్చడానికి ఎంతమంది శ్రమపడి వుంటారో! ఆ ప్రయత్నంలో కొంతమంది వీటి కింద నలిగిపోయివుంటారేమోనని కూడా అనిపించింది. నిప్పులు కురిపించి ఎంతమంది ప్రాణాలు తీసిందో కానీ, ఈ ఫిరంగి గుండ్రంగా తిరగటానికి వీలుగా ఒక ఇరుసు కూడా ఉందక్కడ.

5(1)

 

ఈ మహళ్ళు దాటి వెళ్ళాక ఒక కందకం, దాన్ని దాటడానికి ఓ ఇనప వంతెనా కనిపిస్తాయి. వీటితో ఆ నిగూఢ వాతావరణం మరింత చిక్కబడింది. ఇక్కడ కోటలోకి శత్రుప్రవేశం ఇంచుమించు అసాధ్యం. లోతైన కందకంగోడలని నున్నగా చేసేశారు. దానితో అవి ఎక్కడానికీ పాకడానికీ వీల్లేకుండా ఉన్నాయి. కందకంలో నీళ్ళతో పాటు మొసళ్ళు కూడా ఉండేవట … ఇప్పుడున్న ఇనప వంతెన స్థానంలో తోలువంతెన ఉండేదట. అవసరాన్నిబట్టి, మడతపెట్టి దాచేసుకునేలాగన్నమాట… దాని కింద ఉండే రెండో వంతెనని అవసరమైతే నీటి స్థాయిని పెంచుతూ నీళ్ళలో ముంచి, శత్రువుకు అది కనపడకుండా వుండేలా జాగ్రత్త పడేవారట. ఇంత పెద్ద ప్రణాళికకు తగ్గ నీటిసరఫరా ఉండేదంటే, ఎంత గొప్ప ఇంజనీరింగ్ టెక్నిక్కో కదా! ఆ వంతెన మీద నిలబడి గొప్పగొప్ప కుట్రల ఊహల పద్మవ్యూహాల్లో కాసేపు విహరించాను. విశ్వనాథ ‘పులిముగ్గు’ లోని intrigue లాటిది కాసేపు నన్ను ఆవహించింది.

వంతెన దాటి లోపలికి వెళ్తే, మరిన్ని రహస్యాల గుసగుసలు. ‘అంధారీ’ అనే మార్గం, బైటకు విశాలంగా కనిపిస్తూ రమ్మని పిలుస్తుంది. తీరా లోపలికి వెళ్తే, కటిక చీకటి నెమ్మదిగా కమ్ముకుంటుంది. కొంతదూరం వెళ్లి, టార్చ్ సాయంతో ఆ చీకటిని జయించలేక వెనక్కు వచ్చేశాం. గబ్బిలాల సామ్రాజ్యం అది. అంతా చిక్కటి కాటుక చీకటి. దారి మెలికలుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినవాడు, దాహార్తుడు నీళ్ళకోసం తపించినట్టుగా వెలుగుకోసం తపిస్తాడు. అంతలో ఒక చిన్న కిటికీ కనిపిస్తుంది. వెలుగుకోసం అక్కడికి వెళ్తే, చక్కగా కందకంలోకి తోసిపడేసేవారట. ఆ పైన మొసళ్ళ బాధ. చచ్చి తీరాల్సిందే. చీకట్లో ఎక్కడైనా నిలబడిపోతే, రాళ్ళవర్షం కురిపించి చంపేవారట. ఇవన్నీదాటి దారి చివరకు చేరుకుంటే, పైనున్న పెద్ద పెద్ద మూకుళ్ళలోంచి ఉడుకుతున్ననూనె వచ్చి మీదపడుతుంది. శత్రువుకు దొరక్కుండా ఉండటం కోసం ఇన్ని హింసామార్గాలు కనిపెట్టి, నిశ్చింతగా ప్రాసాదంలో నిద్ర పోదామంటే ఆ రాజులకు వీలవలేదు. వందలాది సైనికుల శారీరకబలం కంటే శత్రువు పన్నే ఒకే ఒక్క కుతంత్రం చాలు… చీకటి కుట్రలు ఆ సొరంగపు చిమ్మచీకటి కంటే నల్లటివీ భయానకమైనవీ…

అంధారీ పక్కనున్న వేరే మెట్ల దారి మీదుగా పైకి చేరుకున్నాం. నిట్ట నిలువు మెట్లు. అదేమి ఇంజినీరింగో, సేవకులూ, సైనికులూ మోకాళ్ళ నొప్పులతో మూలపడే మాదిరిగా. లేక శత్రు సైనికులు పైకెక్కలేక ఆయాసపడుతుంటే వాళ్ళ పని పట్టేందుకు అంతంత నిలువుగా కట్టేరేమో!  పైన పేష్వాలు కట్టిన గణపతి గుడి, షాజహాన్ కట్టించిన బారాదరీ, మరో పెద్ద ఫిరంగి … మొఘల్ వాస్తు పనితనంతో ఉన్న బారాదరీ చెక్కుచెదరలేదు. అక్కడినుండి చూస్తే సందె వెలుగులో, చిరుగాలుల్లో ఔరా అనిపించే ఔరంగాబాద్ పరిసరాలు… మెట్లెక్కిన ఆయాసం తీర్చుకుంటూ అందరూ కూర్చుంటున్నారు. అంతలోనే కోట మూసేసే సమయం అయిందంటూ కిందనుండి గార్డుల విజిల్స్.

దేవగిరి కోట చెప్పే రహస్యాలను వింటూ… మనుషుల తెలివినీ, సృజనాత్మకతనూ, కాయకష్టాన్నీ, దోపిడినీ, రక్తదాహాన్నీ… అన్నిటినీ చూస్తూ లక్షలసార్లు ఆ కోటవెనుక అస్తమించిన సర్వసాక్షి ఆ రోజూ నారింజ రంగు విరజిమ్ముతూ అస్తమించాడు. చిరు చీకట్లలో చరిత్రను భారంగా మోస్తున్న ఆ కోటను వదిలి ఔరంగాబాద్ చేరుకున్నాం.

 

 

                                                                                      lalitha parnandi    ల.లి.త.

Download PDF

3 Comments

 • కల్లూరి భాస్కరం says:

  “నీడలు పొడవుగా సాగుతున్న సమయంలో అక్కడకి చేరాం. ఎన్ని ఆధిపత్యపు నీడలు ఇక్కడ ప్రసరించాయో!
  కాలాకోట్ వైపు వెళ్తున్నకొద్దీ ఒక నిగూఢత్వం లోకి నడుస్తున్న అనుభూతి. సాయంకాలపు నీరెండా, పచ్చని చెట్లమధ్య విస్తరిస్తూ మాయమౌతున్న రాతి ప్రాకారపు ఎత్తూ… ఇవి చాలు intrigue ని సాలెగూడులా బుర్రలో అల్లడానికి.”పురాతన శిథిల దేవాలయాలను, కోటలను సాయం సంధ్యలోనే చూడాలేమో నండి! అదోరకం అనుభూతి. మీ వాక్యాలు ఆ అనుభూతిలొకి మరోసారి తీసుకెళ్లాయి. నేను నా పదహారో ఏట మొదటిసారి వేయి స్తంభాల గుడి చూసినప్పుడు సాయం సంధ్యకు శిథిల ప్రదేశాల సందర్శనకు ఏదో సంబంధం ఉందని అనిపించింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు వరంగల్లు కోట చూసినప్పుడు, పశ్చిమ గోదావరి జిల్లాలో జీలకర్ర గూడెం లొనూ, సారనాథ్ లొనూ, శాలిహుండం లోనూ బౌద్ధ శిథిలాలను చూసినప్పుదూ అదే అనుభూతి.
  కోట రక్షణ చర్యల గురించి మీరిచ్చిన సమాచారం కూడా ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ తుగ్లక్ ఎందుకు రెండేళ్ళకే రాజధానిని హస్తినకు మర్చేసాడో?!

  • Lalitha P says:

   నిజమే భాస్కరం గారూ, సూర్యోదయ, సూర్యాస్తమయ వేళల్లోనే శిల్పాలూ, దుర్గాలూ దర్శించాలి. magic hour అది.

   మంగోల్ దండయాత్రల బాధ పడలేక రాజధానిని దౌలతాబాద్ మార్చడం ఒక తెలివైన నిర్ణయం అయినా ఢిల్లీ జనాభా మొత్తాన్ని దౌలతాబాద్ కు రప్పించటం పొరపాటు అంటారు. ఆ ప్రయాణంలో చాలా మంది బాధలు పడి చచ్చిపోయారట. తరువాత కొంతమంది మంగోల్ లను కాస్త లొంగదీయటంతోను, కొన్ని సలహాలవల్లా తిరిగి ఢిల్లీకి వెనక్కి తిరిగాడని కొంతమంది అంటే, దేవగిరికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ సరిగ్గా ఏర్పాటు చెయ్యలేక వెనక్కి తిరిగాడంటారు. ఏమైనా తొందరపాటు మనిషి అవటం వల్ల సరిగ్గా అమలవని గొప్ప ప్లాన్స్ లా అనిపిస్తాయి అవి.

 • నాగమణి says:

  నిజంగా దేవగిరి కోట రహస్యాల ఖిల్లా…ఏది ఏమైనా కోట ప్లాన్ వేసినవారికి మాత్రం సలాం కొట్టాల్సిందే…కోటలన్నీ ఒకేరకంగా వుండకపోయినా …ఈకోట మాత్రం చాలా చాలా భిన్నమైనదనిపించింది. ఎంత పైకి ఎక్కినా ఎక్కేవారికి సవాలు విసురుతున్నట్లుగా మెట్లు కనిపిస్తూనే ఉంటాయి. శత్రువులకు భయపడుతూ కోటలు కడుతూ సామాన్య ప్రజలకు కోట గోడల్లో ఘోరీలు కడుతూ సాగిన ఆనాటి ఏలికలకు మాత్రం ప్రశాంతత అనేది వుందానిపిస్తుంది. వారి పేర్లు మాత్రమే తెలుసుకోవాలనుకుంటారు చూడటానికి వెళ్ళినవారు…కానీ ఆ పునాదుల్లో ఎంతమంది సామాన్యుల ఉసురు సమాదైపోయిందో కదా…

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)