కార్తీక పక్షం

మా ఊరి మంచినీటి చెరువులో
విష్ణుమూర్తి శయనిస్తాడని
బంగారు పట్టీలు వెల వెల బోయిన
రేవులో నీ పాదాలు చూసే క్షణం వరకూ తెలీదు
పాల కడలిలో ముంచి తీసినట్టున్న నీ పాదాలు
దాటి నా కనులు ఒక్క అంగుళం పైకి లేవలేదు
అమ్మలక్కలు ఎవరో ఈ అబ్బాయి సిగ్గరి అన్నారు

అడుగులతోపాటూ మోగిన మువ్వలన్నీ దగ్గరయ్యాక చూస్తే
ఆదీ అంతం తెలీని నల్లని గుప్పిట పట్టని
మడాలకి అంటీ ముట్టని వాలుజెడ
నాకు బిగిసీ బిగియని ఉరితాడు

మర్నాడు ఎవరో పిలుస్తున్నట్టు
ఈపూట నారాత ఏ రాలపాలో ఎంకిపాట
ఆ ఇంటి పెరటి తలుపు తోయగానే
సూర్య చంద్రులని ఏకకాలంలో ధరించిన వదనం
ఎందుకొచ్చారు అనగానే
మూగబోయి మాయమైన వేళ
రాజుగారబ్బయి మజ్జిగకి వచ్చాడని
నోరు పండించుకొంది రంగి

ఒక కథని ఎన్ని కాశీమజలీ కథలుగా చెప్పుకుందో ఊరు
మాది మరో లోకం
తలవెంట్రుకల చివర ముడేసిన వుసిరికాయలు
తింటూ తన వళ్ళో విన్న కథలు
ఇంట్లో మాయం చేసిన గోరింటాకు
అరికాలిలో పెడుతుంటే తను తిరిగిన మెలికలు
రాతి రాత్రి కరగడానికి రాసుకున్న ప్రేమలేఖలు
ఏశీత కన్నుపడిందో అరుగులమీద గాలి ఊరంతా పాకింది

తెల్లవార్లూ పగలూ రాత్రులూ తెరిపి లేకుండా
కోడై మమ్మలని ఊరు కూసిన తరువాయి
ఆమె పెరట్లో నరికిన అరటి చెట్టయ్యాక
ముంగిట్లో పందిరికి నన్ను వేలాడదీసాకా,
మా అమ్మ వీడిని నమ్ముకొని లాభం లేదని పనికిరాడని కొబ్బరిమొక్క నాటింది

అమ్మలక్కలు మాటలు మానేసి తప్పుకు తిరుగుతున్నారు
మీసాలూ గడ్డం కొబ్బరి చెట్టుతో పాటూ కాపుకొచ్చాయి
ఆరు రుతువులూ ఆరు కాలాలు దాటినా
ఆ రేవుకి కార్తీక మాసం రావటం మానలేదు

అతడు ఆ రేవుకు రావడం మానలేదు
ఇప్పుడతను కాళ్ళనుకాక మొఖాలు వెతుకుతున్నాడు
ఆరాత్రి చందమామ రాలేదు
చెరువు నిండా ప్రతిబింబాలతో
పోటీ పడుతున్న దీపాలు కళ్ల నిండా నింపుకొని
రెండుకాళ్ళూ ముంచి ఆఖరి మెట్టుపై కూర్చొని అతడు

అద్బుతం ఏమీ జరగలేదు
తెల్లవారుజాము మంచులో దీపాలన్నీ ఒకేసారి కొండెక్కాయి.

-వర్మ కలిదిండి

Download PDF

4 Comments

  • Nisheedhi says:

    Really a beautiful ……for a moment I as if I stood near the waters searching for the gal . awesome .

  • చక్కని ఎత్తుగడకు అద్బుతమైన ముక్తాయింపు…..
    పాల కడలిలో ముంచి తీసినట్టున్న నీ పాదాలు

    అందమైన పదచిత్రాలు……
    నోరు పండించుకొంది రంగి
    కోడై మమ్మలని ఊరు కూసిన తరువాయి

    కథాంశాన్ని నర్మగర్భంగా చెప్పే వాక్యాలు……
    కోడై మమ్మలని ఊరు కూసిన తరువాయి
    ఆమె పెరట్లో నరికిన అరటి చెట్టయ్యాక
    మా అమ్మ వీడిని నమ్ముకొని లాభం లేదని పనికిరాడని కొబ్బరిమొక్క నాటింది

    చాలా మంచి కవిత. అనుభూతిని అందంగా, రమ్యంగా, మనోహరంగా చెప్పచ్చని, అందులోనే ఒక జీరలాగ కవిత్వాన్ని పలికించవచ్చని నిరూపించే

    నిశీధి గారన్నట్లు ఒక అనుభవాన్ని విస్తరింపచేసి అందించినట్లుంది

    వర్మ గారికి ధన్యవాదాలు
    బొల్లోజు బాబా

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)