మధ్యతరగతి మనస్తత్వాల మీద కోల్డ్ కిక్ “వీరుడు మహావీరడు”

నిర్వహణ: రమా సుందరి బత్తుల
నిర్వహణ: రమా సుందరి బత్తుల

నిర్వహణ: రమా సుందరి బత్తుల

లోకం పోకడ మీద అధిక్షేపణ ఈ కధ. సగటు మనుషులకున్న నిష్క్రియాపరత్వం మీద, ఆ నిష్క్రియాపరత్వం కూడా బలవంతులకు అనుకూలంగా వుండేలా, బలహీనులకు క్రియారహితంగా వుండేలా, వుండటంలో అసమంజసం మీద వ్యంగ్యం. అందుకే యీ కధ చెప్పే కధకుడు (ఇతను సమాజపు సగటు ఆలోచనలకు ప్రతినిధి యీ కధలో) అంటాడూ “బిగ్ పవర్ లో వున్న ఆకర్షణే అది. మనం అనుకుంటాం గానీ యే కాలం లోనైనా ఏ లెవల్లోనైనా బిగ్గూ స్మాలూ తేడాలు వుండనే వుంటాయి…”

లోకమెప్పుడూ బిగ్ వైపే నిలబడాల, బలహీనుడి వైపు న్యాయమున్నా, బలహీనుడు బలవంతుడితో కొట్లాడేటప్పుడు న్యాయం వైపు వున్నాడు కదాని బలహీనుడి వైపు నిలబడకూడదు, బలవంతుడి వెనకాల యింకొందరు బలవంతులుంటారు కాబట్టి వీలైతే బలవంతుడి వైపే వుండి బలహీనుని మీద ఒక దెబ్బ వేయాల. అది కూడా వాడి మంచికేనంటాడు కధకుడు. “అవును గురూ! అలాంటోళ్ళు (వీరులు) ఏటనుకుంటారంటే జనం జూస్తూ అన్నేయాలు జరగనిస్తారా? అనుకుంటారు. అనుకుని-న్యాయం ధర్మం-అని పెద్ద పెద్ద కబుర్లతో చిక్కుల్లో పడతారు. పడి ఒకళ్ళకి తెద్దునా అందరికీ తెద్దునా అని క్రైసీసులు సృష్టిస్తారు. ఒక్క సారి జనం సంగతేటో తెలిస్తే మరింకెప్పుడూ అలాంటి ఎర్రికుట్టి ఏషాలెయ్యడు. అందికే ఆడి మంచికోరే నేను ఆడి మీద ఓ చెయ్యేసీసేను” అంటాడు కధ ముగిస్తూ.

కారా మాస్టార్ గారి ‘వీరుడు మహా వీరడు’ కధ 05-04-1968న ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో అచ్చయింది. మధ్య తరగతి సగటు మనిషి స్వభావాన్నీ, చంచలత్వాన్ని, జారుడుతనాన్నిఅద్భుతంగా పట్టుకుందీ కధ. కధ చెప్పే కధకుడు ఒక నగరవాసి. శ్రీరామ నవమి సంబరాలు జరిగే దినాలలో ఒక రాత్రి జేమ్స్ బాండ్ సినిమా చూద్దామని సెకెండ్ షోకి వెళ్ళి, టికెట్ దొరక్క, వుత్సవాలు జరుగుతున్న పందిళ్ళను చూస్తూ యింటికి వెనుదిరిగే క్రమంలో, ఒక పోట్లాటను చూస్తున్న గుంపులో ఆగి పోతాడు. ఆ పోట్లాట జరుగుతున్నది గంజి పేట రౌడీకీ, అల్లిపురం వస్తాదుకీ. కధకుడు అక్కడక్కడా గంజి పేట రౌడీని ‘వీరుడు’ అని చెప్తూ ఉంటాడు. ఇక మహావీరుడు ఎవడు అనేది పాఠకులు నిర్ణయించుకోవాల్సిందే. నిజానికి గంజి పేట రౌడి యింకొకడితో కొట్లాడుతుంటే, అల్లిపురం వస్తాదు మధ్యవర్తిగా వచ్చి కొట్లాట విడిపించినట్లే విడిపిస్తూ గంజిపేట రౌడీనీ పట్టేసి యింకొకడి చేత తన్నిపించాడనీ, తనకు జరిపిన అన్యాయం పట్ల కసితో గంజిపేట వీరుడు అల్లిపురం వస్తాదుకు సరిసాటి కాకున్నా ఎదిరిస్తూ తన్నులు తింటున్నాడనీ కధకుడికి తెలుస్తుంది. కధకుడికి గంజిపేట రౌడీలోని ఫైటింగ్ స్పిరిట్ నచ్చుతుంది.

“అయితే మనిషికా ఫైటింగ్ స్పిరిట్ వొక్కొక్కప్పుడలా వొచ్చేస్తాది. అలాటప్పుడు న్యాయం నీ పక్క నుండాల. అవతలోడు ఫాలు గేమాడాల. అదేవంటే, దౌర్జన్యానికి దిగాల. సూస్తున్నోళ్ళు సీమ కుట్టినట్టు మాటాడకూరుకోవాల! జనం అవతలోడి బలానికి జడిసి అన్యాయానికి నోరెత్తకుండా వున్నారని నువ్వు గ్రహించాల. ఆ జనం, పిరికితనం చూసి ఆడి జులుం మరీ మరీ పెరిగి పోతుండాల. అదిగో ఆలాటప్పుడు వొచ్చెస్తాది ఎక్కళ్ళేని ఫైటింగ్ స్పిరిటూ. అప్పుడు పిల్లి లాంటోడైన పిల్ల పులైపోతాడు. పులి పిల్లలా ఎగిరి ఏనుగు కుంభస్థళవైనా అందుకోడానికి పంజా చాస్తాడు.” అంటాడు కధకుడు. అట్లాంటి కొట్లాటను వింతగా జూస్తున్న జనం మీద కోపం వస్తుంది కధకుడికి. ఎందుకింత అన్యాయాన్ని జరగనిస్తున్నారని. జనం బలహీనుడైన గంజిపేట వీరుని వైపు నిలబడితే, అల్లిపురం వస్తాదు ఎంత బలవంతుడైనా భూమిలోకి దిగిపోడా అనుకుంటాడు. అయితే అల్లిపురం వస్తాదు ఏనుగంతవాడు. గంజిపేట వస్తాదు వీరుడు, యువకుడైనా వాడి ముందు ఎలుకంత వున్నాడు. కధకుడికి గంజిపేట రౌడీ మీద సానుభూతి వుంది, అతను అన్యాయాన్ని ఎదిరిస్తున్నాడనీ, ఎదురుగా వున్న బలవంతుడికి సమవుజ్జీ కాకున్నా ఎదురిస్తున్నతనికి జనం ఎందుకు సాయపడ్డం లేదనీ అనుకుంటూ తను కూడా గంజిపేట వీరుడితో కలసి వస్తాదుతో కలబడాలనుకుంటాడు. అయితే తను వేసుకొన్న టెర్లిన్ బట్టలు చిరిగిపోతాయని వెళ్లలేక పోతాడు. తను ఎప్పుడూ దెబ్బలాడక పోవడమూ, కసరత్ చేయక పోవడం గురించి చెడ్డ చిరాకు పడతాడు.

సరిగ్గా అట్టాంటి సమయంలో కొత్త పేట శాండో రంగ ప్రవేశం చేస్తాడు. దాంతో కధకుడికి గొప్ప యుద్ధం జరగబోతుందనే భయమూ, గంజిపేట వీరుడికి దన్నుగా నిలుస్తాడనే భరోసా కల్గుతాయి గానీ, కొత్త పేట శాండో గంజిపేట వీరున్నే శాంతించమంటాడు. నన్ను కాదు శాంతించమనాల్సింది, నీక్కలేజా ఉంటే అల్లిపురం వస్తాదుతో దెబ్బలాడమంటాడు గంజిపేట వీరుడు. శాంతించక తననే నిందిస్తున్న గంజిపేట వీరుడ్ని ఆదుకొంటే పెద్ద గొడవైపోతుందని ఎరిగిన కొత్త పేట శాండో, గంజిపేట రౌడీని అల్లిపురం వస్తాదు చేతుల్లోకి తోసేసి తన దారి తను వెళ్తాడు. ఆ నిష్క్రమణలో ఉన్న లాజిక్ తో మన కధకుడికి జ్ఞానోదయం అవుతుంది. బలహీనుణ్ణి సమర్ధించి బలవంతుడితో తంటా తెచ్చుకోవడమెందుకన్నదే ఆ లాజిక్. ఆ తర్వాత అంతవరకూ గంజిపేట వీరుడ్ని సమర్ధించిన వాడు విమర్శించడం ప్రారంభిస్తాడు. గంజిపేట వీరుడికి బలవంతుడితో పెట్టుకోకూడదు అనేది తోచనైనా తోచాల లేదా ఒకరు (కొత్తపేట శాండో లాంటి వాడు) చెప్పినప్పుడు విననన్నావినాల. అట్లా కాకుండా తనవైపు న్యాయముందనీ, జనమంతా తన వైపు రావాలనీ అనుకోవడం .. అనుకొని న్యాయం, ధర్మం అని పెద్ద పెద్ద కబుర్లతో చిక్కుల్లో పడ్డం .. పడి ఒకరికి తెద్దునా అందరికీ తెద్దునా అనుకోవడం తప్పు అంటాడు కధకుడు. అందుకే యిక ముందెప్పుడూ జనాన్ని నమ్ముకొని ఎర్రివేషాలెయ్యకుండా జనంతో కలిసి తనూ వాడి మీద ఒక దెబ్బ వేస్తాడు.

మధ్యతరగతి మనస్తత్వాల మీద ‘కోల్డ్ కిక్’ యీ కధ. ఈ జనం ఎలాంటివారంటే .. న్యాయం, అన్యాయం మీద బలవంతుడు బలహీనుడి మీద పోట్లాడుతుంటే ప్రేక్షకుల్లా చూసి ఆనందించమంటే ఆనందిస్తారు. బలహీనుడి పక్షం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తమ బట్టలు నలుగుతాయనుకొంటారు లేదా క్షణాల మీద తమ అభిప్రాయం మార్చుకొని తనకే మాత్రం అసౌకర్యం కలగకుండా బలవంతుడి వైపైనా నిలబడతారు. ఏ కాలంలోనైనా, ఏ స్థాయిలోనైనా బలవంతులపైనా ఉండే ఆకర్షణ అదేనంటాడు కధకుడు.

ఈ కధతో పాటు, కారా మాష్టర్ గారికి పేరు తెచ్చిన కధలన్నీ (యజ్ఞం, హింస, భయం, శాంతి, చావు, జీవధార, కుట్ర, సంకల్పం) కూడా రచయితకు ఎదురైన దైనందిన అనుభవాల మీద రాసిన కధలు కావు. తను కధ రాసిన కాలంలో నెలకొని వున్న సోషియల్ రియాలిటి చెప్పటానికి, తన కాలపు సోషియో – పొలిటికల్ – ఎకనామిక్ దృగ్విషయాల మీద (కాన్ సెప్ట్స్) లోతైన అవగాహనతో చిత్రించిన యితి వృత్తాలు. ఒక్కొక్క కధా ఒక్కో కాన్సెప్ట్ మీద రాసిందే.

బూర్జువా వర్గపు స్వభావాన్ని చిత్రించడానికి కారా మాస్టర్ వీరుడు మహావీరడు కధ రాశాడని తెలుస్తుంది. మధ్య తరగతి చైతన్యం మీద విమర్శనాత్మక వ్యాఖ్యానంగా యీ కధ నిలుస్తుంది. 1968 కాలానికి తెలుగు నేల మీద, జాతీయ అంతర్జాతీయ వేదిక మీద సామ్రాజ్యవాదపు ప్రభావం – బూర్జువా వర్గపు విస్తరణ, అవి కమ్యూనిష్టు వుద్యమాల మీద చూపుతున్న ప్రభావాల ప్రతిఫలనమే యీ కధ. ఆ కాలపు మధ్య తరగతి స్వభావం ప్రగతిదాయకంగా లేదన్నది రచయిత విమర్శ. అతి సంక్లిష్టమైన విషయాన్ని పాఠకుల ముందు నడిబొడ్డున నిలబెట్టి వీధి రౌడీల యుద్ధంగా చూపిస్తూ మధ్య తరగతి జనాల చైతన్యాన్ని చిత్రించే దృగ్విషయంగా మలచటంలో కారాగారి పరిణత శిల్పవిన్యాసం కన్పిస్తుంది.

చిన్న కధలో పెద్ద సత్యాలు ఆవిష్కరించడం గొప్ప కధా లక్షణం. ఏ సమాజంలోనైనా నిష్క్రియాపరత్వం, అన్యాయాల పట్ల స్పందన లేనితనం .. సమాజాన్ని బలవంతుల రాజ్యంగా మార్చుతుందనీ, ప్రగతిశీల శక్తుల వైపు ఎంత న్యాయమున్నా ఎంత ఫైటింగ్ స్పిరిట్ వున్నా అది వృధా అవుతుందనీ యీ కధ చెప్తున్న సత్యం. తెలుగు నేల మీద అణగారిపోయిన వుద్యమ శక్తికీ, వుద్యమ ఫైటింగ్ స్పిరిట్ కూ మధ్యతరగతిలోని నిష్క్రియా పరత్వమే కారణమైందనీ, యీ కధ 1968 లోనే చెప్తే, అది యీ రోజు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ మితవాదుల్నీ/మతవాదుల్నీ సమర్ధించే స్థితికి తెలుగు సమాజం చేరుకుందని అర్ధమవుతుంది.

కొన్ని దశాబ్ధాలుగా తెలుగు సమాజంలో జరుగుతున్నసకల అన్యాయాల మీద అణచివేతల మీదా వుద్యమశక్తులు ఎంతో పోరాట స్పూర్తితో పోరాడుతున్నాయి. మైదానాల్లోనూ అడవుల్లోనూ వెలుగులు నింపడానికి ప్రతిఘటిస్తున్నాయి. సమాజం వీళ్ళను వీరులూ/ శూరులూ త్యాగధనులూ అంటూ పొగుడుతుంది. వాళ్ళు ఓటు కోసం వస్తే ఒక్క సీటూ రాల్చదు, వాళ్ళు ఎన్ కౌంటర్ అయితే పెదవి విప్పదు. నిజమైన తీర్పు ఇవ్వాల్సి వచ్చినపుడు నిష్క్రియగా స్పందన లేకుండా వుండిపోవడం, వీలైతే రాజ్యం వైపు నిలబడ్డం, వీరుల్ని చూసి నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం మధ్య తరగతికే చెల్లుతుంది. ఈ వైఖరి మీద ఆగ్రహ ప్రకటనే “వీరుడు మహావీరడు” కధ.

 -జి.వెంకట కృష్ణ 

DSCN0059కర్నూలుకు చెందిన జి. వెంకట కృష్ణవి “గరుడ స్తంభం”, “చిలకలు వాలిన చెట్టు” కధల పుస్తకాలు వచ్చాయి. “లోగొంతుక”, “దున్నే కొద్దీ దుఃఖం”, “కొన్ని రంగులు, ఒక పద్యం” అనే కవితా సంపుటాలూ .. ఇంకా “ఒక నదీ – వరదా – మనిషి” అనే దీర్ఘ కవితా పుస్తకాలుగా వచ్చాయి. వెంకట కృష్ణ రచనలు ఎక్కువగా ఆంధ్రజ్యోతిలో, అరుణతారలో ప్రచురింపబడ్డాయి. తన సాహిత్య జీవితం మీద ఒకే ఊరివాడైన బండి నారాయణ స్వామి ప్రభావం ఉందంటారు. తొమ్మిది చదువుతుండగానే రంగనాయకమ్మ నవలలు, తిలక్ కవితలు చదివి వారి మీద అభిమానం పెంచుకొన్నానంటున్నారు. నేటి తరం రచయితలలో ఖదీర్ బాబు, వి. చంద్రశేఖరరావు  అంటే ఇష్టం.

వచ్చే వారం :’తీర్పు’ కధ గురించి ఎ.కె ప్రభాకర్

వీరుడు మహావీరడు కథ ఇక్కడ:

 

Download PDF

1 Comment

  • ఎ. కె.ప్రభాకర్ says:

    “నిజమైన తీర్పు ఇవ్వాల్సి వచ్చినపుడు నిష్క్రియగా స్పందన లేకుండా వుండిపోవడం, వీలైతే రాజ్యం వైపు నిలబడ్డం, వీరుల్ని చూసి నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం మధ్య తరగతికే చెల్లుతుంది. ఈ వైఖరి మీద ఆగ్రహ ప్రకటనే “వీరుడు మహావీరడు” కధ.”
    ధర్మాగ్రహానికి సపోర్ట్ చేయకుండా మౌనంగా వుండడం స్పందన లేకుండా వుండడం వొక ఎత్తైతే , ఆ ధర్మాన్ని వెనక్కి గుంజడం , అధర్మాన్ని వెనకేసుకు రావడం మరో ఎత్తు : ఈ వైఖరిని మానవ ప్రవృత్తిగా చిత్రీకరించం మరో దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని సైతం ఎండగడుతుంది ఈ కథ.
    మంచి విశ్లేషణ అందించారు వెంకట కృష్ణా!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)