ఆ జలగండం గుండె కింద కాస్త తడి!

vijays picture[విజయ్ గజం ,ఆంధ్రా యూనివర్సిటీ లో జర్నలిజం పట్టా పుచ్చుకొని వృత్తి రీత్యా ప్రస్తుతం  TV 10 హైదరాబాదు బ్రాంచ్ లో వర్క్ చేస్తూ ఫేస్బుక్ ద్వారా అడపాదడపా తన ఉత్తేజభరితం అయిన కవితలతో సాహితీ రంగం కి ఇపుడిపుడే తన చమక్కులు  అందిస్తున్న  విజయ్   గారు మొదటి సారిగా తన పూర్తి హుదుద్ అనుభవాలని  కథన రూపంలో మనతో పంచుకుంటూ ఇలా .]

 

 

 

అప్పుడప్పుడు అనిపించేది వెన్నెల వెలుగులో డాబా మీద పడుకోవాలని. చిన్నతనం లో లాగా పిల్లలకు తాతలు, అమ్మమ్మలు కథలు చెపుతుంటే వినాలని. కానీ ఈ రాకెట్ వేగం ఆధునిక యుగం లో ఇదంతా అత్యాశ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలైన నేటి రోజుల్లో ఆత్మీయతలు, అనురాగాలు కొనుక్కునే నేటి రోజులలో ఇదంతా అత్యాశే.

నిజం గా ఎంత సంతోషం కరెంట్ లేని ఆ రోజుల్లో సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి రావడం తోనే పుస్తకాలు విసిరేసి దోస్తులతో ఆడుకోడానికి వెళ్ళిన రోజులు. తుంటరి పనులు చేసి దెబ్బలు తిన్న రోజులు.ఇదంతా ఒక పచ్చని జ్ఞాపకం. చాలా సార్లు అనిపిస్తుంది .నేటి తరం పిల్లలు ఏం మిస్ అవుతున్నారో కదా అని. చికెన్ కోసం కోళ్ళను తయారు చేసినట్లు గుమస్తా గిరి ఉద్యోగాల కోసం నేటి తరం పాకులాడుతున్నారు అని ,కానీ అలాంటి అవకాశమే వరుసగా పది రోజుల పాటు వస్తే వినడానికి అత్యాశే అయినా ఇది నిజం గా హుదూద్ తుఫాన్ పుణ్యమా అంటూ ఈ అవకాశం లభించింది.

ఇప్పటి జనరేషన్ రిపోర్టర్ ఉద్యోగం .క్షణం తీరిక ఉండదు ,దమ్మిడీ ఆదాయం ఉండని ఉద్యోగం. ఎప్పుడు ఏం జరుగుతుందో దేని నుంచి ఎలాంటి వార్త రాబట్టుకోవాలో అని గోతి కాడ నక్కలా వార్తల కోసం కాపుకాసే ఉద్యోగం నాది.అందరికీ పండుగలు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటుంటే అత్యవసర ఉద్యోగాలు చేసే మాలాంటి వాళ్ళకు కుటుంబ సభ్యులందరితో చేసుకోడం ఎప్పుడో కలిగే అదృష్టం అనుకోవాలి.

సరే , విషయంలోకి వస్తే అక్టోబర్ నెల అనగానే తుఫానుల నెల అన్న పేరు ఎలాగో ఉంది దసరా దాటినా ఈసారి  అలాంటి వార్తలు ఇంత వరకు ఏదీ రాలేదు.గత సంవత్సరం ఈ సమయానికి హెలెన్ తుఫాన్ తీరం దాటింది.ఈ సంవత్సరం ఇంతవరకూ ఏదీ లేదు అని చూస్తున్న మాకు దిమ్మ తిరిగి పోయే వార్తను తుఫాను హెచ్చరికల కేంద్రం తెచ్చింది.హెలెన్ కంటే 20 రెట్లు పెద్దదైన తుఫాను బంగాళా ఖాతం లో ఏర్పడిందని సమాచారం. తీరం దాటే సమయం లో కనీ వినీ ఎరుగని ఉపద్రవం వస్తుందని అక్టోబర్ తొమ్మిదవ తేదీ అధికారులు పూర్తి స్థాయి  సమాచారం అందించారు. విశాఖ నగరం కేంద్రం గా ఈ తుఫాను కేంద్రం దాటుతుందని చెప్పారు. ఇంకేముంది చేతి నిండా పని.తుఫాను అనంతరం కూడా దాదాపు పది రోజుల పని ఉంటుందని ఊహించాను.నన్ను నేను నిరూపించుకునేందుకు వచ్చిన మరో అవకాశం.”పోరాడుతూ ఉండు. గెలుస్తామో , మరణిస్తామో కానీ నువ్వు వదిలిన జ్ఞాపకం వేలాది మందికి సంతృప్తినిస్తుంది” అన్న చే మాటలు నన్ను ముందుకు ఉరికేలా చేసాయి.

అక్టోబర్ 11 ఉదయం ఒక సాహితీ వేత్తను ఇంటర్వ్యు చేసేందుకు వెళ్ళే సమయానికి తుఫాను ప్రభావం కనిపిస్తుంది. గాలి వేగానికి నా పాత హీరో హోండా ముందుకు దూకనంటుంది.నా మనస్సాక్షికి తెలుస్తుంది ఏదో పెద్ద విపత్తు సంభవిస్తుందని. విశాఖ సిటీ లో కంటే విశాఖ రూరల్ లో ముఖ్యం గా గ్రామాలకు వెళితే బాగుంటుదని హెడ్ ఆఫీస్ కు చెప్పి ఇంటికి వెళ్ళి ఒక జత బట్టలు, ఒక రెండు పుస్తకాలు తీసుకుని మా కెమెరామెన్ తో కార్ లో బయలు దేరాను.విశాఖ నుండి 60 కిలోమీటర్ ల దూరం లో వస్తుంది పుడిమడక గ్రామం. పూర్తి మత్స్య కార గ్రామం.

విశాఖ నుండి నేను అక్కడికి వెళ్ళే సరికి సాయంత్రం 5 అయింది. ముందు పుడి మడక తీరం దగ్గరికి వెళ్ళాను.అప్పటికి చాలా ప్రశాంతం గా ఉంది గ్రామం. తుఫాను దృష్ట్యా ప్రభుత్వ అధికారులు మత్స్య కారులను పునరావాస కేంద్రాలకు రావాలని ఎంతో నచ్చచెపుతున్నారు.”నాను గంగ పుత్రుడుని ,గంగమ్మ తల్లి నాకేటి సేత్తది ,తుఫాను గురించి నువ్వు మాకు చెప్పొచ్చావేంటి వెళ్ళెళ్ళవోయి” అంటూ మత్స్య కారులను గ్రామం నుండి ఖాళీ  చేయిస్తున్న  అధికారులకు మాటలు వినిపించాయి.మేము అధికారులకు, మత్స్య కారులకు మధ్య లో దూరితే మా పనికి ఆటంకం అని మా పనిలో మునిగిపోయాము.విశాఖ జిల్లా అధికారులు 11 వ తేది సాయంత్రం 7 నుండి 12 వ తేదీ ఉదయం 9 వరకూ జాతీయ రహదారి పై ఎటువంటి వాహనాలు తిరగకూడదని హెచ్చరికలు  జారీ చేసారు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను తుఫాను తీవ్రత గురించి మా హెడ్ ఆఫీస్ కు సమాచారం ఇచ్చి నాకు కొంత అదనపు ఎక్విప్మెంట్ కావాలని కోరాను. ఎందుకో వారు అంతగా పట్టించుకోలేదు.ఒక వైపు తుఫాను అన్ని ఆధునిక ఆయుధాలతో ఉన్న సైనికుడిలా యుద్దానికి వస్తుంటే నాకు మాత్రం ల్యాప్ ట్యాప్ తో పాటు ఎప్పుడు బ్యాలన్స్ అయిపోతుందో తెలియని డాంగిల్ ఇచ్చి పంపారు మా హెడ్ ఆఫీస్ వాళ్ళు.

రాత్రి 9 కల్లా చెయ్యాల్సిన పనులు చేసేసి మా అచ్యుతా పురం రిపోర్టర్ విజయ్,మా కెమెరామెన్ రాజశేఖర్, డ్రైవర్ రిలాక్స్ గా ఉన్నాం.హోటల్ రూంస్ ఖాళీ లేకపోతే ఒక చిన్న బ్యాచిలర్ రూం లో అడ్జస్ట్ అయ్యాము. రాత్రి 12 గంటల నుండి స్టార్ట్ అయ్యింది గాలి తీవ్రత. ఇన్ టైంలో హెడ్ ఆఫీస్ కు విజువల్స్ పంపాలన్న తపన. ఎలాగో పని కానిచ్చేసి రెస్ట్ తీసుకునే సమయం లో ఒకటే గాలి. అసలే రేకుల షెడ్డు కావడం తో డమ డమ సౌండ్.ఎలాగో ఉదయాన్నే లేచి మా స్థానిక రిపోర్టర్ విజయ్ కు ఫోన్ చేస్తే వాతావరణం చాలా ప్రశాంతం గా ఉందనీ..ఎందుకు అక్కడికి అనీ అన్నారు.కానీ నాకు తుఫాను ముందర ప్రశాంతత ఇదే అనిపిస్తుంది.పద వెళదాం అని పుడి మడక మా టీం అంతా బయలు దేరాం. ఇక చూడాలి సడెన్ గా గాలి, వర్షం.పుడిమడక తీరం లొనే గత 30 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడనంత ఉధృతం గా కెరటాలు వస్తున్నాయి.

1413181594hudhud-toofan

మా కళ్ళ ముందే ఒక కెరటం లో మత్స్యకారుల  బోట్లన్నీ కొట్టుకుపోసాగాయి.ఓ కెరటం నన్ను తాకేలోగా మా అచ్యుతాపురం రిపోర్టర్ విజయ్ నన్ను లాగేసాడు.అక్కడి నుండి మళ్ళీ  అచ్యుతా పురం వచ్చేసాము. అధ్భుతమైన  విజువల్స్ తీసాడు మా కెమేరామెన్ రాజ శేఖర్.ఆ విజువల్స్ ను హైదరాబాద్ పంపగలిగితే మేము తుఫాన్ కవరేజీ లో టాప్.అదే సమయానికి సరిగ్గా మా ఇంటర్ నెట్ డాంగిల్ నేను పని చేయను…ఏం చేస్తారు తమరు అని ఎగతాళి చేసింది.ఏం చెయ్యాలి? ఎలాగైనా నన్ను నేను నిరూపించుకోవాలి..కొంతమంది అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి నా పని ద్వారా అన్న కసి తప్ప మరేం కనిపించడంలేదు నాకు.అప్పటికి సమయం ఉదయం 9. 60 కిలోమీటర్ లు. గట్టిగా అయితే విశాఖకు గంటలో వెళ్ళిపోతాము. ఇక నేనే గెల్చినట్లు.మా కార్ డ్రైవర్ బాబ్జీ ని పదండి విశాఖ కు వెళదాం అన్నాను.

కానీ గాలి ఎక్కువగా ఉందని మా రిపోర్టర్ విజయ్ వద్దన్నారు. “ధైర్యే సాహసే లక్ష్మీ” అనుకుని బయలు దేరబోయాను. మీకు పెళ్ళయిందా గుర్తుందా అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది నా అర్ధాంగి.నిజమే నాకు పెళ్ళయింది. ఈ వర్షం లో తని ఇంట్లో ఒక్కతే ఎలా ఉందో అసలే సముద్రం ఎదురు ఇళ్ళు.పక్కన ఎప్పుడు వచ్చే చిన్న పాప స్వాతి అయినా దగ్గర ఉందో లేదో అన్న సంశయం తో ఫోన్ చేసాను.అనుకున్నదే అయింది. ఫోన్ నాట్ రీచబుల్.

మా డ్రైవర్ ను సాధ్యమైనంత  త్వరగా వైజాగ్ తీసుకెళ్ళమని ఆర్డర్ వేసాను.ఆయనకు ఆర్డర్ వేసాను గానీ పరిస్థితి బాలేదు. అర్దం అవుతుంది. ఇంతలో “సైక్లోన్ కైలాసగిరి ని తాకింది. తూర్పు వైపుగా సాగుతుంది” అని నా సెల్ లో మెసేజ్.అంటే తుఫాన్ కి ఎదురు ప్రయాణం చేస్తున్నామన్న మాట.ఈ విషయం మా కెమేరామెన్ కు గాని, మా డ్రైవర్ కు గానీ చెప్పలేదు.అప్పటికి మేం పరవాడ దాటాము. గాలి తీవ్రత కు మా కారు ఊగడమే కాకుండా అనేక చెట్లు పడిపోతున్నాయి. మా డ్రైవర్ అంతరంగం తెలియలేదు గానీ, ఏం చేద్దాం అన్నట్టు చూసాడు. పోనియ్యగలరా అన్నాను. పోనిద్దాం సర్ అన్నాడు.

ఫాస్ట్ గా వెళ్ళమన్న నేను నిదానం గానే వెళ్ళండి మనం సేఫ్ గా ఉండాలి కదా అన్నాను.ఇంతలో రాజశేఖర్ గారు ఆయన పని ఆయన చేస్తారు గాని, మనం ఒక దగ్గర కార్ ఆపి మాక్ లైవ్ చేద్దాం అన్నారు. సరే అని తీరా దిగుతుంటే రాజశేఖర్ గారు గట్టిగా “మీరు దిగొద్దు. గాలికి ఎగిరిపోతారు” అన్నారు.గాలి తీవ్రత తగ్గిందాక ఉండి ఒక మాక్ లైవ్ చేసే బయలుదేరాం. మళ్ళీ ఇంకో సమస్య.స్టీల్ ప్లాంట్ మీదుగా వెళ్ళాలా?హైవే మీదుగా వెళ్ళాలా?అని. మా డ్రైవర్ ని నిర్ణయం తీసుకోమన్నాను.

వెంటనే లంకెల పాలెం మీదుగా హైవే చేరాము. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటి పోయింది.మొబైల్స్ పని చేయడం లేదు. ఈ జడివాన లో వెళ్ళగలమా అనే అనుమానం అందరికీ.కనీసం నాలుగు కల్లా ఆఫీస్ కు విజువల్స్  చేరితే మా చానల్ కవరేజీ లో టాప్.ఎలాగైనా వెళ్ళాలి అన్న మొండితనం తప్ప మరేదీ లేదు.అయితే హైవే పై గాలి వాన మరీ ఎక్కువ కాసాగింది.ఎంతలా అంటే సరక్ సరక్ మని గుండు సూదుల్లా చినుకులు గుచ్చుతుంటే మాకు మాట్లాడడం రావడం లేదు. మాక్ లైవ్ చేయడం రావడం లేదు.కానీ మళ్ళీ మాక్ లైవ్ చేసే బయలు దేరాము. దారిలో అడ్డం పడిన చెట్లను నేను, రాజశేఖర్ గారు తప్పిస్తూ ముందుకు సాగాము. ప్రతి సారి మాకు ఎలా వెళ్ళాలి అనేది సమస్య. ఈ సారి నిర్ణయం నేను తీసుకున్నాను.హెచ్.పి. సి.యల్ మీదుగా వెళ్ళండి అక్కడ చెట్లు ఉండవు అని చెప్పాను.నా వైపు అదోలా చూసిన మా బాబ్జీ కారును దూకించాడు. జాగ్రత్తగా విశాఖ చావుల మదం చేరాము.అక్కడ బ్రిడ్జ్ దగ్గర్ నీరు ఎక్కువ గా ఉంది. పోవడం వీలు కాదని చెప్పాడు డ్రైవర్. సమయం 12. ఎలాగైనా ఇంకో గంటలో చేరితే చాలు మా దగ్గర ఉన్న విజువల్స్ పంపేయవచ్చు.నడుచుకుంటూ వెళదామా అంటే దాదాపు రైల్వే స్టేషన్ నుండే 6 కిలో మీటర్లు వస్తుంది. ఆ అవకాశమే లేదు.

కెమెరా కూడా తడిచిపోతుంది. సరే ,కంచర పాలెం మీదుగా ఫ్లై ఓవర్ ఎక్కించండి అన్నాను. మా దురదృష్టం ఎంతలా వెంటాడింది అంటే అక్కడ హై టెన్షన్ విద్యుత్ వైర్లు పడి ఉన్నాయి. ఇక గాలికి ఒక్కసారిగా మా ఎదురుగా ఉన్న హైటెక్ బస్సు లేచి , తిరిగి మళ్ళీ యధాస్థానానికి వచ్చింది . ఇక మనుషులు ఒకరికొకరు గట్టిగా పట్టుకుంటున్నారు. బ్రిడ్జ్ కిందనుండి వెళ్దామని ప్రయత్నిస్తే అక్కడ రైల్వే గేట్ వేసి ఉంది.టైం చూస్తే 1 దాటింది. నాకు ఒక్కసారిగా ఓడిపొయానన్న నిస్సత్తువ ఆవరించింది.ఏం చెయ్యాలో అర్దం కావడం లేదు. ఇంత కష్టపడిందీ ఎందుకు అనిపిస్తుంది.నా పై విమర్శలు చేసిన వారికి సమాధానం చెప్పలేక పోతున్నానే అనిపించి ఒక రకమైన ఆవేదన,నిర్వేదం లో కూరుకుపోయాను.ఈ లోగా మళ్ళీ ఏదో తెగింపు.

మా డ్రైవర్ ను బ్రిడ్జ్ మీదుగా పోనివ్వమన్నాను.మీది ధైర్యమా, మొండితనమా అని మొహం మీదనే అనేసాడు.మా రాజశేఖర్ కూడా వెళ్ళాల్సిందే అనడం తో బయలు దేరాము.అప్పటిదాకా ఆఫీస్ కు రావాలన్న తొందరలో బయట జరిగిన ప్రకృతి నష్టాన్ని పట్టించుకోలేదు. పచ్చదనం తివాచీ పరిచినట్లు ఉండే వైజాగ్ ఇప్పుడు మోడు గా మారింది.ఎక్కడ చూసినా గాలికి ఒరిగిపోయిన ఇళ్ళు.  సర్వం పోయిన బాధలో కొందరుంటే దొరికింది దొరికినట్టు దోచుకుపోయే వాళ్ళు మరి కొందరు. ఎక్కడ చూసినా విరిగి పోయిన వాటర్ ట్యాంక్ లు,  రేకులు, చెట్లు. చివరకు తాటి చెట్ల పాలెం వద్ద ట్రాఫిక్ లో ఇరుక్కున్నాము. గాలి వీయడం మానలేదు. గట్టిగా నడిస్తే 15 నిమిషాలు. మా కెమెరామెన్ రాజశేఖర్ ను దిగమన్నాను.

గొడుగు ఇచ్చి మీరు ఎలాగోలా ఆఫీస్ కు వెళ్ళి ఫీడ్ ఇవ్వండి అని పంపించాను. నేను మాత్రం నిదానం గా దారిలో తెరిచి ఉన్న ఒక షాప్ లో రెడ్ విల్స్ కొని , గుండె నిండా దమ్ము లాగి ఆఫీస్ కు బయలు దేరాను.అప్పటికి సమయం 2 అయింది.పని చేయని 3జి నన్ను వెక్కిరించింది. ఛీ “ దీనమ్మ బతుకు” ఇంత కష్టపడి వృథా అవుతుందా అనిపించింది. రాజశేఖర్ ఫీడ్ పంపాడు,కానీ నాలో ఓడిపోయాను అనే ఫీలింగ్. ఆఫీస్ ఎదురుగా చెట్లు చూస్తుండగానే ఒరిగిపోతున్నాయి. వాటర్ ట్యాంక్ లు వాటర్ తో సహా ఎగిరి పడుతున్నాయి.మా ఆఫీస్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అప్పుడు సడెన్ గా ఇల్లాలు గుర్తొచ్చింది.తను ఇంట్లో ఎలా ఉందో ? సాయంత్రం 6 గంటలకు చీకట్లు ముసురుకునే సమయానికి అదే భీభత్సం లో విజువల్స్ పంపేసాను.ఇక ఇంటికి చేరాలి. నన్ను నమ్ముకున్న ఆ జీవి ఇంటి దగ్గర ఎలా ఉందో? ఈ గాలి వాన లో వెళ్ళొద్దు అని ఆఫీస్ లో వారిస్తున్నా వినకుండా నడుస్తూనే బయలుదేరాను. సీతమ్మ ధార నుండి చిన వాల్తేర్ 6 కిలో మీటర్ ల దూరం. మామూలుగా అయితే అరగంట నడక.ఇప్పుడున్న పరిస్థితి లో నడుస్తూ వెళితేనే బెటర్ అని బండిని అక్కడే వదిలి బయలు దేరాను.

hudhud-toofan-poor-people

పాత ఈనాడు ఆఫీస్ దగ్గరకు వచ్చే సరికి పరిస్థితి మరీ అద్వాన్నం గా తయారయింది. ఎగిరి వస్తున్న రేకుల షీట్ లను తప్పించుకుని నడక సాగించాను.గాలి అడుగు పడనీయడం లేదు. ఒక షాప్ తెరిచి ఉంచితే క్యాండిల్స్ కావాలి అని 20 రూపాయలు ఇచ్చాను.ఇంకో 10 ఇవ్వమని రెండు మైనపు ప్రమిదలు చేతిలో పెట్టాడు షాప్ వాడు. దోపిడీ అప్పుడే మొదలైందా అనుకుంటూ ముందుకు సాగాను. అదృష్టం ఏంటంటే..సత్యం జంక్షన్ నుంచి మద్ది పాలెం జంక్షన్ వరకు రెండు వరుసలలో లారీ లు ఆగిపోయి ఉన్నాయి.వాటి మద్యలో ఉన్న గ్యాప్ లో చక చకా నడిచాను.రైన్ కోట్ పూర్తిగా తడిచిపోయింది.

సర్రున కోస్తున్న ఈదురుగాలి.నేను ఏ యూ ఇంజనీరింగ్ కాలేజ్ వైపు ..త్రీ టౌన్ స్టేషన్ మీదుగా చిన వాల్తేర్ వెళ్ళాలి. ఏదైనా వెహికిల్ కనిపిస్తే లిఫ్ట్ అడుగుదామని ఆశ. నా పిచ్చి గాని ఈ గాలి వాన లో ఎవరు బయటికి వస్తారు? ఏ యూ లో ఎన్నో ఏళ్ళ నుండి ఉన్న చెట్లు కూలిపోయాయి.చిమ్మ చీకటి. మోకాలు లోతు నీళ్ళు. ఆ నీళ్ళళ్ళో చెట్ల కొమ్మలు, కేబుల్ వైర్లు, విద్యుత్ వైర్లు.ఇంజనీరింగ్ హాస్టల్ దగ్గరకు వచ్చే సరికి కాళ్ళళ్ళో పట్టు తప్పింది. కాసే పు ఎలాగైనా ఆగాలి. ఒక 20 అడుగుల దూరం లో ఒక పార్క్ చేసిన పాల వ్యాన్  కనిపించింది. అక్కడకు పరిగెత్తుకెళ్ళి ఒక అయిదు నిమిషాలు గాలి, వాన ను తప్పించుకున్నాను.

అప్పటికి 7 అయింది. త్రీ తౌన్ మీదుగా,సి.బి.ఐ మీదుగా చిన వాల్తేర్ కు నడుస్తున్నాను.చూస్తే నాపక్కనే ఒక 50 సంవత్సరాల వ్యక్తి నడుస్తున్నాడు. అతను జారిపోబోతే పట్టుకున్నాను. అతను శానిటరీ ఇంజనీర్ అట. వెహికిల్ , వాకీ టాకీ పాడయ్యాయని చెప్పాడు. ఇద్దరం ఒకరి చేయి ఒకరం  పట్టుకున్నాము. ఆ పెద్దాయన మనిషికి మనిషి తోడు అంటే ఇదేనేమో అన్నాడు.నేను వేగం గా నడుస్తూ కరెంట్ వైర్ తగిలి పడిపోబోయాను. ఆయన పట్టుకున్నారు. అప్పుడు అనిపించింది ఆయన చెప్పింది మానవత్వం అని. ఆయన ఇళ్ళు వచ్చింది. వెళ్ళారు. నేను నడుస్తూనే ఉన్నాను.

మా వీథి లో చెట్లు ఉండవు గానీ రేకుల ఇళ్ళు ఎక్కువ. ఎటు చూసినా విరిగిన రేకుల ముక్కలే కనిపించాయి.అలాగే ఇంటికి చేరి తలుపు కొట్టాను. నా అర్ధాంగి తలుపు తీసింది.ఆ కళ్ళల్లో నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళావన్న  బాధ, ఇంత గాలి వాన లో నడిచి వచ్చావన్న బాధ…ఒక్కసారే రెండు కన్నీటి చుక్కలై రాలాయి.ఇళ్ళంతా నీళ్ళతో నిండి పోయింది. కిటికీ అద్దాలు పగిలిపోయాయి.తను పరుపు ఎత్తేసి , ప్రమిద వెలుగులో కుర్చీలో కూర్చుని ఉంది.సరే..అసలు మధ్యాహ్నం నుండీ ఏమైనా తిన్నావా అంటే …ఏమీ తినలేదు అంది. నువ్వు నీళ్ళు ఎత్తు…నేను అన్నం సంగతి చూస్తాను అన్నాను.ఇక ఆ రాత్రి అలా గడిచిపోయింది.

ఇక తెల్లవారి అక్టోబర్ 13. హుదూద్ కష్టాలు మెల్ల మెల్ల గా ప్రారంభమయ్యాయి. పాలు లేవు ,పేపర్ లేదు. వాటికోసం రోడ్ మీదకు వెళితే పాల ప్యాకెట్ 100 రూపాయలు, పేపర్ 10 రూపాయలు అన్నారు. ఇవ్వాళ పేపర్ చదవకుంటే వచ్చిన నష్టమేమీ లేదు అనుకుని ఇంటికి వచ్చాను. ఇంట్లో నీళ్ళ కష్టాలు మొదలు.కరెంట్ లేదు. కుళాయిలు రావు. ఇంట్లో ఉన్న నీళ్ళతో స్నానం చేసి నేను, మా కొలీగ్ జార్జి ఇద్దరం ఆఫీస్ కు బయలు దేరాము. ఏయూ మీదుగా వెళదామా అన్నాడు జార్జి.మనం చదువుకున్న ఆ పచ్చదనం ఇప్పుడు మోడై పోయింది,చూడలేము అనుకుని వేరే రూట్ లో ఆఫీస్ కు వచ్చాము. అక్కడ పరిస్థితి అంతే . కేవలం ఇన్వర్టర్ మాత్రం పని చేస్తుంది.ఇక అప్పటికప్పుడు ఆఫీస్ లోని వ్యక్తులం కేవలం కెమెరా బ్యాటరీ లు మాత్రమే చార్జింగ్ పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఏం చేద్దామన్నా ఫోన్లు లేవు. నెట్ లేదు.

అప్పటికే విద్యా సంస్థ లకు సెలవు ప్రకటించారు. ప్రజలు స్వచ్చందం గా  వారి వీథుల్లో ఉన్న చెట్లను,ఇతర వైర్లను తొలగిస్తున్నారు.ఇలాగే మరో రెండు రోజులు గడిచాయి. పరిస్థితి మరీ దిగజారింది. నిత్యావసర వస్తువులైన పాలు, నీళ్ళ కోసం తన్నుకుంటున్నారు. ముఖ్య మంత్రి ఇక్కడ తిష్ఠ వేయడం తో అధికారులు పరుగులు పెడుతున్నారు.మా నీటి కష్టాలు తీరే లా లేవు. పైగా నా భార్యా మణి తెగ నీళ్ళు పారబోస్తుంది. అప్పటిదాకా పట్టించుకోని బోర్లను రెండు బకెట్ల నీళ్ళ కోసం ఆశ్రయిస్తున్నారు.నేనూ ఆ లైన్ లో దూరి నీళ్ళు మోసే సరికి తల ప్రాణం తోక కొచ్చింది.ఇక మా ఆఫీస్ లో ఫీడ్ పంపించడం అవ్వడం లేదు. మీరేం చేస్తున్నారని హెడ్ ఆఫీస్ నుండి షంటింగ్.

ఇక ఇవన్నీ ఇలా ఉంటే కరెంట్ ఉన్నపుడు రాత్రి 10 అయితే తప్ప ఇళ్ళు చేరని నాలాంటి వాళ్ళు 7 గంటలకల్లా ఇళ్ళు చేరుతున్నాము. టీవీలు లేకపోవడం తో పిల్లలు ఆటలే ఆటలు. తాతలు, బామ్మలు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకోని కథలు చెప్పడం చూసాను. నా మటుకు నేను నా అర్ధాంగి తో క్యాండిల్ లైట్ డిన్నర్. నీళ్ళ ట్యాంకర్ రాగానే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన యుద్దాలు మళ్ళీ కనిపించాయి. ఆ యుద్దాలు చేయలేని నాలాంటి వాళ్ళు దూరం నుండి నీళ్ళు మోసుకున్నాం.

దాదాపు తొమ్మిది రోజులు కరెంట్ లేదు. ఇక ఇదే పని.తల్లిదండ్రులు సాయంత్రం 7 కల్లా రావడం, పిల్లలతో గడపడం.ఉదయాన్నే నీళ్ళు మోయడం మంచి ఎక్సర్ సైజ్ . పిల్లలతో టైం స్పెండ్ చేయడంతో అనుభందం పెరిగింది. నాకైతే పక్కింటి వాళ్ళే తెలియదు. హుదూద్ పుణ్యమా అని అందరూ పరిచయ మయ్యారు. ఇక కబుర్లే కబుర్లు. తీయని ఊసులు చెప్పుకుంటూ క్యాండిల్ లైట్ డిన్నర్లు. నా భార్య రోజూ కరెంట్ పోతే బాగుండు మీరు ఎప్పుడూ ఇలా తొందరగా వస్తారు అంటుంటే తుఫాను లో ప్రమోదం ఇదేనేమో అనిపించింది.

ఇక చూస్తుండగానే కరెంట్ వచ్చింది. డ్రింకింగ్ వాటర్ వచ్చాయి. హుదూద్ పుణ్యమా అని ఈ జనరేషన్ కు కథల విలువ తెలిసిందని నేను అంటే  కాసింత ఆత్మీయత అంటే ఏమిటో కూడా తెలిసినట్టుంది అని నా అర్ధాంగి అన్నది.

నిజమే కదా అనిపించింది నాక్కూడా.

 -విజయ్ గజం

 

Download PDF

3 Comments

  • kondreddy says:

    హుడుద్ త్రీవ్రత బాగా చెప్పారు ఆనుభవ పూర్వకంగాయాసం బాగుంది.

  • నిశీధి says:

    ఇది మీ మొదటి ప్రయత్నం అని ఎవరు అనుకోలేరు విజయ్ గారు . చాల మంచి నెరేషన్ ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో ముందు ముందు మాతో పంచుకోవాలి అని ఆశిస్తూ :)

  • umamaheswari says:

    చాల బాగుంది అన్నయ . all ది బెస్ట్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)