“ఇష్ లీబె దీష్!”

1964లో ‘సంగం’ అని ఒక హిందీ సినిమా వచ్చింది. రాజ్ కపూర్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం. ఆరోజుల్లో ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన రంగుల చిత్రం. వైజయంతిమాల, రాజేంద్రకుమార్ ఇతర నటులు. శంకర్ – జైకిషన్ సంగీతం ఈనాటికీ మరచిపోలేం.
ఆ సినిమాలో కొన్ని పాటలు మొట్టమొదటిసారిగా స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో చిత్రించారు. అందులో నాకు బాగా ఇష్టమైనది ఒక పాట. ‘ఇష్ లీబె దీష్!’ అనేది. జర్మన్ భాషలో ‘ఇష్ లీబె దీష్’ అంటే ఇంగ్లీషులో ‘ఐ లవ్ యు’ అని. అది ‘వివియన్ లోబో’ పాడిన చక్కటి పాట. స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వత శ్రేణి దగ్గర వైజయంతిమాల, రాజేంద్రకుమార్లతో చిత్రీకరించాడు రాజ్ కపూర్. ఆ సినిమాలో ఆల్ప్స్ పర్వతాల అందాలు చూసి, ఆనాడే జీవితంలో ఒక్కసారయినా స్విట్జర్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. చాల దశాబ్దాల తర్వాత, ఇన్నాళ్ళకి అక్కడికి వెళ్ళాం.
౦ ౦ ౦
ఇటలీలోని వెరోనానించి రైల్లో, మిలానో మీదుగా స్విట్జర్లాండ్లోని జెనీవాకి వెళ్ళాం. అక్కడినించీ వెంటనే ఇంకొక రైలు తీసుకుని ‘ఎంగెల్బర్గ్’ అనే వూరికి వెళ్లి, అక్కడే ఒక వారం రోజులు వున్నాం. రైలు ప్రయాణాలు ఎంతో సౌకర్యంగా, వేగంగా వుండటం వల్ల, ఒకే వూరిలో బిచాణా పెట్టి స్విట్జర్లాండ్లోని ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూడాలని మా ఉద్దేశ్యం. ఇప్పుడు కొంచెం స్విట్జర్లాండ్ ఎక్కడ వుందో చెప్పటం అవసరం.
పశ్చిమ యూరప్ మధ్యన వుంది స్విట్జర్లాండ్. ఉత్తరాన జర్మనీ, దక్షిణాన ఇటలీ, పశ్చిమాన ఫ్రాన్స్, తూర్పున ఆస్ట్రియా. ఎంతో పెద్దదయిన Alps పర్వత శ్రేణి ఈదేశంలోనే వుంది. ఇక్కడ గమ్మత్తేమిటంటే, జర్మనీ వేపున, ఆస్ట్రియా వేపున వున్న ప్రదేశాల్లో జర్మన్, ఇటలీ వేపున ఇటాలియన్, ఫ్రాన్స్ వేపున ఫ్రెంచ్ భాషలు మాట్లాడుతారు. ఇక్కడ సర్వత్రా వినిపించే భాష, మన అదృష్టం కొద్దీ, ఇంగ్లీష్.
పదహారు వందల చరపు మైళ్ళ వైశాల్యంలో వుండేది, ఎనభై లక్షల జనాభా మాత్రమే. జెనీవా, జూరిచ్ ఇక్కడ వున్న పెద్ద నగరాలు. బెర్న్ అనే చిన్న వూరు ఈ దేశానికి రాజధాని.
ఇక్కడ తల ఒక్కింటికి వున్న సగటు ఆదాయం, ప్రపంచలోనే ప్రధమ స్థానంలో వుంది. ఎక్కువ కాలం ప్రజలు బ్రతికే దేశాల్లో, ఇది రెండవ స్థానంలో వుంది.
వెరోనా నించీ రైల్లో స్విట్జర్లాండ్ వెడుతున్నప్పుడు, మా ఆవిడకి ఒక చిన్న క్విజ్ పెట్టాను, “స్విట్జర్లాండ్ కనీసం ఐదు రంగాల్లో, దేనికి ప్రపంచ ప్రసిద్దమో చెప్పగలవా” అని.
ఆవిడకి చాకొలేట్, ముఖ్యంగా డార్క్ చాకొలేట్ అంటే బాగా ఇష్టం. అందుకని వెంటనే చెప్పేసింది.
“సరే.. చాకొలేట్ ఒకటి. ఇంకా నాలుగు చెప్పాలి..” అన్నాను.
“రెండు ఛీజ్. స్విస్ ఛీజ్”
“బాగా చెప్పావు. మరి మూడోది..”
“స్విస్ బంగారం నాణాలు”
“అవును. స్విస్ క్రూగరాండ్స్. తర్వాత..” అడిగాను.
“రెడ్ క్రాస్. ఇక్కడే మొదలయి, ప్రపంచ వ్యాప్తమయింది” అన్నది.
“గుడ్! స్విస్ జెండా మీద కూడా వుంటుంది ఆ రెడ్ క్రాస్. దీంతో నాలుగు చెప్పావు. మరి ఐదోది..”
“నేను నాలుగు చెప్పానుగా. నువ్వు చెపు ఐదోది” అన్నది.
“ఐదోదా.. స్విస్ గడియారాలు. ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఆరోది కూడా వుంది. ఇండియాలోని రాజకీయ నాయకులు, నల్ల బజారు పెద్ద మనుషులూ, అప్పనంగా ప్రజల సొమ్ము దోచుకుంటున్న గవర్నమెంటు ఉద్యోగులు, సినిమా యాక్టర్లు, బెట్టింగ్ చేసే క్రికెట్ ప్లేయర్లు.. వాళ్ళ కోట్ల కోట్ల కోట్లు – కోట్లు కాదు – రూపాయలు దాచుకుంటున్నవి స్విస్ బాంకుల్లోనే! ప్రపంచ ప్రసిద్ధి మరి!”
“అవును. అవొక్కసారి చూద్దాం ఎలా వుంటాయో…”
“బయటనించీ చూస్తే, మన అమెరికన్ బాంకుల్లాగానే వుంటాయి. కాకపొతే లోపల వుండే డబ్బే! కొందరు మనుష్యుల్లోని మానవత్వానికి మసి పూసిన నల్ల డబ్బు. మనిషి కాపీనానికి నిదర్శనం. బయటనించీ చూడటానికి ఇబ్బంది ఏముంటుంది. జెనీవా వెళ్ళినప్పుడు చూద్దాం” అన్నాను.
౦ ౦ ౦

satyam1
మా రైలు జెనీవా వెడుతున్నప్పుడే చూశాం. జెనీవా సరోవరం. చాల పెద్దది. వెనక తెల్లగా మెరుస్తున్న కొండలతో, నీలం, ఆకుపచ్చ రంగులతో ఎంతో అందంగా వుంటుంది.

జెనీవాలో రైలు దిగి, వెంటనే లుజర్న్ వెళ్ళే రైలు ఎక్కాం. కొండల్లో పైకి వెడుతూ, ఆ రైలు ప్రయాణం ఇంకా బాగుంటుంది. లుజర్న్ వెళ్ళాగానే, మేము వెళ్ళవలసిన ఎంగెల్బర్గ్ రైలు సిద్ధంగా వుంది. వెంటనే ఎక్కేశాం.
ఎంగెల్బర్గ్ రైల్వే స్టేషన్, మా రోజుల్లో గుడివాడ రైల్వే స్టేషన్లా వుంది. రెండే రెండు చిన్న ప్లాట్ఫారాలు. రైళ్ళు అక్కడితో ఆగిపోతాయి.
రైలు దిగగానే, ఎదురుగా ప్రపంచంలో ఎంతో ఎత్తయిన Alps పర్వత శ్రేణిలో భాగామయిన మౌంట్ టిట్లిస్ ఎదురుగా, సూర్య కాంతిలో తెల్లగా మెరిసిపోతున్నది.
ఒక కిలోమీటర్ దూరంలోనే వున్న మా హోటలుకి నడుచుకుంటూనే వెళ్ళాం. కొంచెం చల్లగా వున్నా, ఎండలో నడుస్తుంటే హాయిగా వుంది. హోటల్లో మా గది కిటికీ తెరిస్తే, మౌంట్ టిట్లిస్. దాని మీద దుప్పటిలా కప్పిన తెల్లటి మంచు పొరలు. ఎండలో మెరిసిపోతూ మనోహరంగా వుంది.
మర్నాడు ప్రొద్దున్నే మా కిటికీ తలుపు తెరవగానే చూశాను. వాతావరణం పూర్తిగా మారిపోయింది. విపరీతంగా మంచు పడుతున్నది. సమయం ఎనిమిది దాటినా ఇంకా ఎండ రాలేదు. కొండ మీదికి వెడితే ఆ మంచులోనే వెళ్ళాలి. అందుకే వేడివేడి కాఫీ త్రాగి, వెంటనే మౌంట్ టిట్లిస్ ఎక్కటానికి బయల్దేరాం.

satyam2

టిక్కెట్లు తీసుకుని వచ్చేసరికీ, అప్పటికే ఎక్కెడెక్కడినించో వచ్చిన స్కీయింగ్ చేసే వాళ్ళు, చాలమంది లైన్లలో నుంచుని వున్నారు. కొండ క్రింద నించీ, నలుగురు మాత్రమే పట్టే కేబుల్ కార్లు, కనీసం వందో ఆ పైనో వుంటాయి, వరుసగా ఒక దాని తర్వాత ఒకటి పైకి వెడుతున్నాయి. అంతమంది వున్నా, కొద్ది నిమిషాల్లోనే మేమూ ఒక కేబుల్ కారు ఎక్కాం.
కేబుల్ కారులో, ఆ వర్ణనాతీతమైన ప్రకృతి ఒడిలో, నేనేప్పటి నించో చూద్దామనుకుంటున్న పర్వతాల మీదకి వెడుతుంటే, ఒళ్ళు, బయట చలిగా వున్నా, పులకరించింది. ఆ అందాలు చెప్పే బదులు, చూస్తేనే సరిగ్గా అర్ధమవుతాయి. అందుకే వాటిని వర్ణించే ప్రయత్నం చేయటం లేదు, “ఇష్ లీబె దీష్” అని మరోసారి పాడుకోవటం
తప్ప.
దారి మధ్యలో కేబుల్ కారు ఆగుతుంది. ఆరు వేల అడుగుల ఎత్తున వున్న ట్రౌబ్సీ అనే చోట, ఈ నలుగురు ఎక్కి కూర్చునే కేబుల్ కారు దిగి, నలభై మంద దాకా పట్టే, కేబుల్ బస్సు ఎక్కాం. దానిలో అందరూ నుంచోవాలి. మనుష్యుల మధ్య స్కీయింగుకు వెళ్ళే వాళ్ళ సరంజామా.

satyam3

చివరికి పది వేల అడుగుల ఎత్తున వున్న మౌంట్ టిట్లిస్ మీద దిగాం. విపరీతమైన గాలి, చలి. ఇంకా మంచు పడుతూనే వుంది. కానీ ఆ అద్భుతమైన ప్రకృతి అందాలు చూస్తుంటే, మనసుకి హాయిగా వుంది. అక్కడే ఒక రుచికరమైన సాండ్విచ్ తిని, వేడివేడి కాఫీ త్రాగాం. క్రిందకి చూస్తే ఎంతోమంది, స్కీయింగ్ చేస్తూ మంచులో అలా పరుగులెడుతున్నారు.

ఇక్కడ వున్న పర్వత శ్రేణిలో మౌంట్ టిట్లిస్ పెద్ద పెద్ద శిఖరాలలో ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాటివి ఎన్నో శిఖరాలు వున్నాయి. దీనితోపాటు పడమట జుంగ్ ఫ్రౌ, మ్యూంక్, సాన్టిస్, మోంటే రోసా…, తూర్పున ముట్లర్, పిజ్ ప్లాటా.. ఇలా ఎన్నో వున్నాయి.
ఇంటర్లాకెన్ అనే వూరి మీదుగా రైల్లో వెళ్లి, జుంగ్ ఫ్రౌ శిఖరం కూడా చూసి వచ్చాం. అక్కడ ఒక పక్క తెల్లటి మంచుతో కప్పబడిన శిఖరాగ్రం, మేము వున్న గుట్ట మీద ఆకుపచ్చని లాన్, దాని క్రింద రైల్వే స్టేషన్. రకరకాల రంగులతో, ఎంతో చాల బాగుంటుంది.

satyam6

దాని తర్వాత లూసర్న్ అనే వూరికి వెళ్ళాం. చిన్నదయినా ఎంతో అందమైన నగరం. చూడవలసినవి చాల వున్నాయి ఇక్కడ. ఎంతో షాపింగు కూడా వుంది.
జెనీవాకి కూడా వెళ్ళాం. అక్కడ యునైటెడ్ నేషన్స్ ఒప్పందాలు ఎన్నో జరిగాయి. చక్కటి నగరం.
జెనీవా ఒక పెద్ద వ్యాపార కేంద్రం. ఎన్నో రకరకాల షాపులు. ఇక్కడ అన్నీ ఖరీదులు ఎక్కువే. స్విస్ వస్తువులు అక్కడికన్నా, అమెరికాలోనే చౌక.
జెనీవాలో ఒక నాలుగు రోడ్ల కూడలిలో చుట్టూ చూస్తే, అన్నీ బాంకులే. పెద్ద పెద్ద బిల్డింగులు. వాటి మధ్య నుంచుని వున్నప్పుడు అనిపించింది. మన రాజకీయ నాయకులూ, వాళ్ళ మిత్రులూ, మన ప్రభుత్వ అవినీతి ఉద్యోగులూ దాచిన డబ్బు నా కళ్ళ ఎదురుగా కాకపోయినా, కాలి దూరంలో ప్రతి చోటా వుంది అక్కడ. ఆ బిల్డింగుల సిమెంటు గదులలో ఎన్నో ఏళ్లుగా బంధించబడి వుంది. బహుశా అది దాచుకున్న వాళ్లకు తెలియదేమో, ఏ మతం వాడయినా సరే, చివరికి పైకి వెళ్ళేటప్పుడు, ఏ విధమైన లగేజీ తీసుకువెళ్ళనీయరని. లగేజీ చార్జీలు లక్షల్లో కట్టినా వీలులేదని!
దానిలో కనీసం పదో వంతు, భారతదేశ అభివృద్ధికి ఖర్చుపెడితే, మన దేశం ఎంత ముందుకి వెడుతుందో కదా అని అనిపించింది.
౦ ౦ ౦

Download PDF

4 Comments

 • Pandu Ranga Vajram says:

  సత్యంగారు,

  మీ విహార యాత్ర స్పెషల్లోని అన్నివ్యాసాలు చదివాను. చాలాబాగున్నాయి! నాలాంటి త్వరలో యూరప్ చూడబోయేవారికి గైడ్ లా వ్రాసినందులకు ధన్యవాదములు…

  -వజ్రం పాండు రంగ

  • సత్యం మందపాటి says:

   పాండు రంగ గారు, ఈ శీర్షిక మీకు నచ్చినందుకు సంతోషం. వీటిలో వ్రాసిన విశేషాలు, మీ యూరప్ ప్రయాణంలో ఉపయోగపడితే, అంతకన్నా కావలసినది ఏముంది? Enjoy your Europe trip! Thanks for your comments.

 • venkat says:

  ఈ మధ్యన interlaken వెళ్లాను. చాలా బాగుంది . ఆల్ప్స్ పర్వతాలలో నడవడం నిజంగా ఒక మంచి అనుభవం .
  డబ్బులు కన్నా జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని అర్ధం అయింది .
  ఆ పర్వతాలలో వంద సంవత్సరాల పూర్వమే ట్రైన్ నడిపారంటే చాలా ఆశ్చర్యం వేసింది .
  పర్వతాల లోపల నుండి ట్రైన్స్ ప్రయాణం భలే థ్రిల్లింగ్ గా అనిపించింది . ఆ శుభ్రత , టైం సెన్స్ tourism కి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత నిజంగా గ్రేట్ .

 • సత్యం మందపాటి says:

  అవును, వెంకట్ గారు. వాళ్ళ రైల్వే సిష్టం చాల బాగుంది. సమయ పాలన, శుభ్రత.. అన్నీను. అక్కడికి వెళ్ళాక భూతల స్వర్గం అంటే ఇలా వుంటుందా అనిపించింది. మీ ఉత్తరానికి ధన్యవాదాలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)