కవిత్వపు మెరుపు తీగ జాన్ హైడ్!

 

john1
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు
~*~
ఎన్నడో
నిద్రలోనో, మగతలోనో, మెలకువలోనో
పరిచయమనుకున్న ఓ నవ్వు
ఎప్పుడైనా ఎక్కడైనా
ఒక్కసారి కౌగలించుకున్న స్నేహ హస్తపు స్పర్శ
వదిలించుకున్నామని అనుకున్నా
పెనవేసుకున్నామనుకున్నా వెంటాడుతూనే వుంటుంది

జీవితాన్ని నడిచిన క్షణాలు కొన్ని
ధనుర్మాసపు మంచుకమ్మినట్టు కమ్మొచ్చు
మసక మసక వెలుతురుమధ్య జ్ఞాపకాలు కప్పినప్పినప్పుడు
చలికి మునగదీసుకున్న దేహంలా అనుబంధం కుంచించుకున్నప్పుడు
కళ్ళు చెమర్చమడం మరచిపోతుంది

***

అనుబంధాలు
మమకారాలు
కరన్సీని ఉన్నిగా తొడుక్కున్నాక
మాటలు కలిపి కలబోసుకోవడం కనుమరుగయ్యాక
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

నీవు ఒంటరివై
రాత్రిలోకి నిన్నునీవు దూర్చుకొని
తాగినవన్నీ కన్నీళ్ళే కదా!

రగిలిస్తున్న యెదమంటలను
చల్లార్చడం మధువుకే చేతనౌనని అనుకున్నాక
తలుపులు ఒకొక్కటిగా మూసుకుంటుంటే
తలుపు తెరచి తొంగిచూసే ధైర్యలేనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

కొలమానాల లోకం
బిగించుకున్న చట్రాల చూపుల్లో ఇమడనప్పుడు
నీవు వేసిన అడుగులన్నీ
తప్పుడుగానో, తడబాట్లుగానో కన్పిస్తుంటాయి

ఇక ఏ అనుబంధం ముడిపడనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు

***

నీలో నీవే దాచుకున్న దేహాన్ని విదిల్చుకుని
నీవు అలా వెళ్ళిపోతావు
కన్నీరొలికించలేనివారు కళ్ళలోంచి తీసేస్తారు
గుప్పెడుమట్టిని సమాధిపైవేసి
ఎవ్వరిని పలకరించకుండానే వెళ్ళిపోతారు
నిన్ను కప్పిన మట్టిలో సమస్యలు దాక్కోవు

***

పొద్దు గ్రుంకుతుంది
కాలచక్రం ఎక్కడా ఆగదు
కోలాహలమైన పక్షుల కిలకిలరావాలతో
రాత్రిదుఃఖాన్ని విదిల్చి మళ్ళీ తూర్పున సూర్యోదయం

***

నువ్వు ఎవరైనా
మళ్ళీ మనం కలుస్తామనే ఓ నిరీక్షణయైనప్పుడు
ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు.

john hyde

Download PDF

3 Comments

 • rajaram.t says:

  జాన్ మరణం కవిసంగమ మిత్రులకు తీరని లోటు.నేను అర్ధ రాత్రి తరువాత కవిసంగమానికీ article post చేసి చేయగానే చదివి message లో నేను చేసే ఆలోచనలోని మంచి చెడుల్ని సముదాయిస్తూ చూపించే సహృదయ కవి.ప్రభువు పాదాల చెంతకు చేరబోయే ముందు రాత్రి కూడా తన కవితను నాకు post చేసి అభిప్రాయమడిగాడు.అభిప్రాయం వినకుండానే వెళ్ళి వీడి పోతాడనుకోలేదు.sorry జాన్ గారు మా జ్ఞాపకాల్లో మీ సృజనల్లో మీరెప్పుడూ సజీవులే

 • Saikiran Kumar K says:

  పొద్దు గ్రుంకుతుంది
  కాలచక్రం ఎక్కడా ఆగదు
  కోలాహలమైన పక్షుల కిలకిలరావాలతో
  రాత్రిదుఃఖాన్ని విదిల్చి మళ్ళీ తూర్పున సూర్యోదయం
  ===
  ఏ దిక్కులో ఈయన మళ్ళీ ఉదయించబోతున్నారో!
  May his soul rest in peace.

 • mercy margaret says:

  నువ్వు ఎవరైనా
  మళ్ళీ మనం కలుస్తామనే ఓ నిరీక్షణయైనప్పుడు
  ఎవరైనా ఎందుకు కన్నీరొలికిస్తారు….

  మధ్యాకాశంలో మీరు తిరిగి ప్రభువుతో వచ్చే వేళ మీతో కలిసి ఒక కొత్త కీర్తననెత్తి పాడతాననే నిరీక్షణ గుండె నిండా ఉన్నాక ఎందుకు కన్నీరోలికించడం .. కాని మిమ్మల్ని చాల మిస్ అవ్తున్నా జాన్ హైడ్ గారు .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)