తోటివారిని

 

మన తోటివారిని గాజులానో, పూలలానో,
కదలని నీటిపై నిదురించే చంద్రునిబింబంలానో చూడటం నేర్చుకోలేమా

గ్రహాంతరాలలో ఏకాకులమై ఎదురైతే బహుశా
అద్దంలో మన ప్రతిబింబంలా మృదువుగా చూసుకొంటాం ఒకరినొకరం

నిజంగా మనం తెలియనిచోట ఉన్నాం కదా
భూమి ఏమిటో, ఆకాశం ఏమిటో,
మెరిసే ఉదయాస్తమయాలూ, దిగులు కురిసే నల్లని రాత్రులూ
ఎందుకున్నాయో, ఏం చెబుతున్నాయో తెలియని
మంత్రమయ స్థలంలో దారి తెలియక తిరుగుతున్నాం కదా

కనులంటే ఏమిటో, చూడటమేమిటో,
చూపు బయలుదేరుతున్న లోలోపలి శూన్యపు అగాధమేమిటో
ఎరుక లేకుండానే ఋతువుల నీడల్లో తడుముకొంటున్నాం కదా

ఎవర్ని లోపలికంటా తడిమిచూసినా ఏముంటుంది
గుప్పెడు ప్రశ్నలూ, కాస్త కన్నీరూ, ఇంకా అర్ధం సంతరించుకోని ఒక దిగులుపాట మినహా
ఎవరి కథ చూసినా ఏముంటుంది
అంచులు కనరాని కాలపు ఊయలలో ఏడ్చే, నిదురించే పసిబిడ్డ లోపలి నిశ్శబ్దం మినహా

తాకలేమా మరికాస్త కోమలంగా ఒకరినొకరం
చేరలేమా మరికాస్త సమీపంగా ఒకరికొకరం
చూడలేమా ఒకరిలోకొకరం మరికాస్త సూటిగా, లోతుగా, నమ్మకంగా..

-బివివి ప్రసాద్

bvv

Download PDF

4 Comments

  • karlapalem hanumantha ra0 says:

    బివివి ప్రసాద్ సార్ నేటి కవితను పునీతం చేసేస్తున్నారు. బాగుంది అని ఒక్క మాట ముక్తుసరిగా చెబితే సరిపోతుందా! వీరి కవితను చదివినప్పుడల్లా నా అంతరంగం స్పందనకు చాలని భావ అగాధమై పోతుంది.ఎప్పటిలా ఇప్పుడూనూ!

  • Prasuna says:

    చాలా కరెక్ట్ గా చెప్పారు ప్రసాద్ గారు. కవిత చాలా బావుంది.

  • nmraobandi says:

    ఎవర్ని లోపలికంటా తడిమిచూసినా ఏముంటుంది
    గుప్పెడు ప్రశ్నలూ, కాస్త కన్నీరూ, ఇంకా అర్ధం సంతరించుకోని ఒక దిగులుపాట మినహా
    ఎవరి కథ చూసినా ఏముంటుంది
    అంచులు కనరాని కాలపు ఊయలలో ఏడ్చే, నిదురించే పసిబిడ్డ లోపలి నిశ్శబ్దం మినహా …

    అంతరంగాన్ని ఇంతకన్నా ఎవరు చెప్పగలరు, చూపగలరు ?

  • GopalaKrishna S Tangirala says:

    “చూపు బయలుదేరుతున్న లోలోపలి శూన్యపు అగాధమేమిటో”

    చీకటి అనేది ప్రత్యేకంగా ఉండదట ప్రసాద్ గారూ
    వెలుగు లేకపోవటమే చీకటి అంటే.

    అలాగే ఏమీ లేకపోతేనే అది శూన్యం కదా…

    ఎవ్వరూ లేని చోట, మరో మానవుడు కానరాని చోట, ఎవరైనా కనపడితే అపురూపంగా చూసుకుంటాం.

    మరిప్పుడెందుకు నువ్వు వేరు నేను వేరు అనే అగాథం?

    కులం, మతం, ప్రాంతం, అంతస్తు లాంటి అగాథాలను ఎందుకు మనం ఏర్పరచుకొంటున్నాం…?

    ప్రసాద్ గారూ

    మీ కలం కన్నీటిని వాడుతుందా…? తిన్నగా హృదయంలోనికి ప్రవహిస్తోంది?

    అద్భుతమైన ప్రగాఢమైన మీ భావస్రవంతికి జేజేలు

    -గోపి

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)