మా పెద్దన్నయ్య పెళ్ళి కబుర్లు

మా పెద్దన్నయ్య, వదిన పెళ్లి, మే 16, 1960

1960 దశకంలో మా కుటుంబంలో మూడు పెళ్ళిళ్ళు జరిగాయి…మా కుటుంబం అంటే నా స్వంత అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళలో అన్న మాట.

వాటిల్లో మొట్టమొదట జరిగిన శుభకార్యం మా పెద్దన్నయ్య పెళ్లి. తను ఎస్.ఎస్.ఎల్.సి తో చదువు ఆపేసి వ్యవసాయం లోకి దిగిపోయాడు కాబట్టి మా పెద్దన్నయ్య కి చదువుకోని అమ్మాయిల సంబంధాలే వచ్చేవి. నేను ఎస్.ఎస్.ఎల్.సి లో అడుగు పెట్టాక 1959 నవంబర్ లో మా పెద్దన్నయ్య మా ఇంట్లో మొదటి సారిగా పెళ్లి కాకినాడ దగ్గర ఒక పల్లె టూరికి మా అమ్మ, బాబయ్య గారు, జయ వదిన, అక్క, సుబ్బు, మా తమ్ముడు ఆంజిలతో తన మొదటి పెళ్ళి చూపులకి వెళ్ళాడు. టాక్సీ లో చోటు సరిపోక నన్ను తీసుకెళ్ల లేదు అని చూచాయగా నాకు గుర్తు ఉంది కానీ పెళ్లి చూపులు అయ్యాక కాకినాడ వచ్చేసి మా పెద్దన్నయ్య చెప్పిన ఆ తతంగం ఎంత సరదాగా ఉందీ అంటే …నాకు ఇంకా భలే జ్ఞాపకం. ఇందుతో జతపరిచిన అప్పటి ఫోటో లా ఆ రోజుల్లో సినిమా హీరోలా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని షోగ్గా ఉండే మా పెద్దన్నయ్య “అది కాదు రా… మేము వెళ్లి కుర్చీలలో కూచున్నామా…అంతే. ఆ అమ్మాయి బుల్ డోజర్ లాగానూ, ఆ అమ్మాయి తల్లి ఒక రోడ్డు రోలర్ లాగానూ, అన్నదమ్ములు డీలక్స్ బస్సుల లాగానూ, అప్పగార్లు ఎస్.ఆర్.ఎం.టి (అప్పుడు కాకినాడలో తిరిగే టౌన్ బస్సులు) లాగానూ ఉంటే ఉన్నారు కానీ, ఆ అమ్మాయి చెల్లెలు మాత్రం అంబాసిడర్ కారు లాగా నాజుగ్గా ఉంది. నేను ఆ ఎంబాసిడర్ కేసి చూస్తూ ఉంటే వాళ్ళు ఏవో గుండ్రటి పదార్ధాలు టిఫిన్ లా పెట్టారు.

“ఒరేయ్, కొత్త రకం స్వీట్లు” అని జయ వదిన సంబరపడిపోయింది. తీరా తిని చూస్తే అవి తొక్కలు తీసేసిన సపోటా పళ్ళు. టేక్సీ డబ్బులు వేస్ట్ అయిపోయాయి” అని మా పెద్దన్నయ్య చెప్పిన కథకి అందరం ఒకటే నవ్వుకున్నాం. ఆ తరువాత ఆ ‘ఎంబాసిడర్’ కి అప్పుడే పెళ్లి కుదిరిపోయింది అని తెలిసింది. నన్ను తీసుకెళ్ల లేదు అనే నా ఉక్రోషం పోగొట్టడానికి మా పెద్దన్నయ్య నన్ను “బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్” సినిమాకి తీసుకెళ్ళాడు. ఆ ఇంగ్లీషు సినిమా అర్థం అయింది తక్కువే అయినా అంతా కళ్ళకి కట్టినట్టుగా అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఆ సినిమాకి కోకా కృష్ణా రావు, పక్కింటి కీర్తి వారి నారాయణ (జంట కవులు వేంకట పార్వతీశ్వర కవులలో ఓలేటి పార్వతీశం గారి పెద్ద మనవడు) కూడా వచ్చినట్లు గుర్తు.

VSPR Subbalakshmi శుభ లేఖ

కోకా వారు..రమణా రావు, మాధవ్ కాకినాడలో పేరున్న కుటుంబీకులు. మా ఇంటి పక్కనే ఉండే వారు. కోకా సుబ్బా రావు గారు సుప్రీం కోర్ట్ జడ్జీగా చేసి తరువాత ఇండియా ప్రెసిడెంట్ కి పోటీ చేశారు కానీ వారికున్న బంధుత్వం నాకు తెలియదు. ఆ సినిమా చూశాక నేను క్లాసు పుస్తకం కాని నా మొట్టమొదటి ఇంగ్లీషు నవల చదివాను. పెర్రీ మేసన్ నవల అని గుర్తు ఉంది కానీ పేరు గుర్తు లేదు. ఆ వెనువెంటనే చదివిన పుస్తకం ..ఇంకెవరూ…సుప్రసిద్ధ హాస్య రచయిత పి.జి. వుడ్ హౌస్…..కొన్నేళ్లలో నా చేతికందిన వుడ్ హౌస్ నవలలు అన్నీ చదివేశాను. అలాగే అనేక మంది రచయితల ఇంగ్లీషు పుస్తకాలు అన్ని సబ్జెక్ట్ ల మీదా చదివే అలవాటు అయింది. అమెరికా ధర్మమా అని ఇక్కడికి రాగానే ఆ అలవాటు పోవడం నా దౌర్భాగ్యం.

ఇక 1960, ఫిబ్రవరిలో మా చిన్నన్నయ్య, సుబ్బు తప్ప మిగిలిన అందరం కాకినాడ దగ్గర కరప కారణం గారు చాగంటి సుబ్బారావు గారి రెండో అమ్మాయి సూర్య సుబ్బలక్ష్మి ని మా పెద్దన్నయ్య పెళ్లి చూపుల కోసం చూడడానికి వెళ్లాం. అమ్మాయి బావుంది, ఆ కుటుంబం వారి మర్యాదలూ, ప్రతిష్టా అన్నే బాగానే ఉన్నాయి కానీ వెనక్కి తిరిగి కాకినాడ వచ్చాక “ఇంత పొడుగ్గా నా కంటే రెండు అంగుళాలు ఎత్తు ఉండే అమ్మాయిని నేను ఎప్పుడూ చూడ లేదు. పైగా నేను చూసిన వేపు నుంచి బాగానే ఉంది కానీ, రెండో వేపు నుంచి ఎలా ఉంటుందో ?” అని మా పెద్దన్నయ్య అనుమానాలు వ్యక్తం చేస్తే మా అక్కా వాళ్ళు “పోనీ మరో సారి వెళ్లి రెండో వేపు నుంచి చూసి వద్దాం “ అని ఏప్రిల్ నెలలో మా చిన్నన్నయ్య మద్రాసు నుంచి వచ్చాక మొత్తం గేంగ్ అంతా మళ్ళీ కరప వెళ్లాం.

అప్పుడు ఎనభై ఏళ్ళ వయస్సులో ఉన్న పెళ్లి కూతురు తాత గారు వెంకట్రావు గారు, ఆయన పొడుగు ఆరడుగుల పై మాటే…మా అన్నయ్యనీ, ఆవిడనీ పక్క, పక్కనే నుంచోబెట్టి, రెండో పక్క నుంచి కూడా అమ్మాయిని చూపించి అన్ని సందేహాలూ తీర్చారు. ఆయన కూతుళ్ళకి వచ్చాయి. సుబ్బారావు మామయ్యా గారు కూడా ఆరున్నర అడుగుల పొడుగే. ఆయన పోలికలే కూతుళ్ళకి వచ్చాయి.

అన్ని విషయాలూ సరిగ్గా సరితూగేటట్టు ఉన్నా మా పెద్దన్నయ్య కొంచెం తటపటాయిస్తూ ఉంటే “వాళ్లకి మన లాగే వందెకరాల పొలం, పాతిక మంది పాలికాపులు, పశు సంపదా ఉన్నాయి. అన్ని విధాలా నీకు సరిగ్గా సరిపోతారు” అని “ఈ సంబంధం తప్పిపోతే నీకు ఈ జన్మలో పెళ్లవదు” అని మా చిన్నన్నయ్య మా పెద్దన్నయ్యని బెదిరించాడు. మొత్తానికి ఆ కరప వారి సంబంధం కుదిరాక మా మామయ్య గారు పెళ్లి ఏర్పాట్లు మాట్లాడడానికి కాకినాడ రాగానే మా చిన్నన్నయ్య “మా స్టేటస్ కి తగ్గట్టు మీరు మా అన్నయ్య పెళ్ళికి అన్నీ టేబుల్ మీల్స్ పెట్టాలి. చేత్తో వడ్డించకూడదు. గరిటలతోటే వడ్డన జరగాలి” అని ఆంక్షలు పెట్టగానే మా మామయ్య గారు హడిలి పోయి “ఈ సంబంధం మానుకుందామా” అనుకున్నారట.

VSPR హీరో

మా ఇంట్లో మేము నేల మీదే కూచుని తింటాం. అది వేరే సంగతి. కానీ అనుకోకుండా మా చిన్నన్నయ్య కి మద్రాసులో పైలట్ ఇంటర్వ్యూ వచ్చి వెళ్ళిపోయాడు. మద్రాసులో చదువుకునే రోజుల్లో అతను ఎయిర్ లైన్ పైలట్ ట్రైనింగ్ అయ్యే వాడు. మా చిన్నన్నయ్య మద్రాస్ మెయిల్ ఎక్కగానే మా నాన్న గారు వెంటనే కరప కబురు పెట్టి మా మామయ్య గారి భయం పోగొట్టి, మా పెద్దన్నయ్య పెళ్ళికి 1960 మే నెల, 16 వ తారీకు తెల్లారగట్ట ముహూర్తం పెట్టారు. ఆ పెళ్లి శుభ లేఖ ఇందుతో జతపరుస్తున్నాను. నాకు గుర్తు లేదు కానీ, మా పెద్దన్నయ్యకీ, వదిన కీ కామన్ ఫేక్టర్ “సూరీడు”…ఓచ్ ..అంటే పేరులో “సూర్య” అనే మాట అన్నమాట…అని నేను మా స్నేహితులతో చెప్పుకుని మురిసిపోయేవాడినిట. అది విని అందరూ నవ్వుకునే వారుట. ఈ సంగతి మా అన్నయ్య డైరీలో ఉంది.

ఇక పెళ్లి ముందు రోజు నాలుగు బస్సులలో కాకినాడ మా ఇంటికి వచ్చిన బంధువులు, మా పొలం చుట్టూ పక్కల దొంతమ్మూరు, వెల్దుర్తి, సింహాద్రిపురం, రాయవరం, చిన జగ్గం పేట, తాటిపర్తి గ్రామాల నుంచి పెళ్ళికి తరలి వచ్చిన మా రైతులు, ఊరి పెద్దలు సుమారు వెయ్యి మంది … ..అవును…వెయ్యి మంది అన్ని కులాల వారూ కరప తరలి వెళ్లాం. ఇంత మంది మా దివాణం మందీ మార్బలాన్నీ చూసి ఆడ పెళ్లి వారు ఆశ్చర్య పోయారు. అప్పుడు వేసవి శలవులు కనక వాళ్ళందరికీ కరప స్కూల్ లో మకాం ఏర్పాటు చేసి , మా బంధువులందరికీ ఐదారు ఇళ్ళలో విడిది ఏర్పాటు చేశారు. యదావిధిగా పెద్ద బేండ్ మేళం, పెట్రోమేక్స్ లైట్లతో పల్లకీ ఊరేగింపు, అంత మందికీ సకాలంలో టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేశారు.

వంటకాలు ఒకటే అయినా రైతులలో కూడా కులాల వారీగానే భోజనాలు పెట్టడడం ఆనవాయితీ. మా మామయ్య గారు చుట్టలు కాల్చే వారు కాబట్టి పంచె కట్టులో ఉన్న రైతులకి లంక పొగాకు చుట్టలు, బంధువులకీ , లాగులు, చొక్కాలు వేసుకునే షోగ్గాళ్ళకి ఎంతో ఖరీదైన లండన్ ఇంపోర్టెడ్ స్టేట్ ఎక్స్ ప్రెస్ సిగరెట్లు ఇచ్చారు. అప్పటికి అమెరికా పేరు చాలా మందికి తెలియదు. ఎప్పుడూ ఇంగ్లండ్, మహా అయితే జపాను, జర్మనీ, రష్యా ..అంతే! ఎందుకనో భోగం మేళం మటుకు పెట్ట లేదు. మా పెద్దన్నయ్య పెళ్ళికి మద్రాసులో ఉండి పోయిన మా చిన్నన్నయ్య ఒక్కడే రాలేక పోయాడు.

వెంకట్రావ్, కంచి రాజు, పెద్దన్నయ్య, అబ్బులు బావ

వెంకట్రావ్, కంచి రాజు, పెద్దన్నయ్య, అబ్బులు బావ

పెళ్లి అయిన మర్నాడో, రెండో నాడో అందరూ కాకినాడ వచ్చేసి, కొత్త కోడలి గృహ ప్రవేశం చేసి, విఘ్నేశ్వర పూజ, సత్యనారాయణ వ్రతం అయ్యాక అప్పటి మా ఆనవాయితీ ప్రకారం ఏ శుభకార్యం ఆయినా మూడు, నాలుగు రకాల విందులు ఏర్పాటు చేశారు మా నాన్న గారు. ముందు ఇరు పక్కల పెళ్లి వారికీ, బంధువులకీ, స్నేహితులకీ ఒకటి. ఈ రోజుల్లో దీన్ని “రిసెప్షన్” అంటారు. మా పొలంలో రైతులకీ, చుట్టుపక్కల ఊరి పెద్దలకీ ఒకటీ, నాలుగు రోజుల తరువాత మా చిన్నన్నయ్య బెంగుళూరు నుంచి తిరిగి రాగానే ఆ రాత్రి కాకినాడ లో ఉన్న ప్లీడర్లకీ, గుమాస్తాలకీ, జడ్జీలకీ మరొకటీ…ఒక్కొక్క విందుకీ రెండు వందల మంది పైగానే వచ్చారు. మను గుడుపులకి పెద్దన్నయ్య తో పాటు అమ్మ, అక్క, జయ వదిన, అంజి వెళ్ళగా ఆ తరువాత పదహారు రోజుల పండగకి నేను అన్నయ్య తో వెళ్లాను. అప్పుడు అందరం వరసగా “మగ వారి మాయలు”, “మంజిల్”, “అన్నపూర్ణ”, “అన్నా చెల్లెలు” “పైగాం” సినిమాలు చూసేశాం…అంతా మా పెద్దన్నయ్య పెళ్లి సంబడమే !

వీటికి కొస మెరుపు …జూన్ 6, 1960 నాడు వెలువడిన గజెట్ లో చూసి నేను ఎస్.ఎల్.సి.పాస్. అయ్యాను అని తెలిసి అందరూ తెగ సంతోష పడ్డారు. ఎలాగా పాస్ అవుతాను అందరూ అనుకునేదే కానీ..ఆ రోజుల్లో “ప్రతిభ” కి బెంచ్ మార్క్ అయిన 400 మార్కులు వచ్చాయా లేదా అనేది ఆ తరువాత కానీ తెలియ లేదు. నాకు 380 మాత్రమే వచ్చాయి అని నేను భోరుమన్నా ఆ ఏడు కాకినాడ మొత్తానికి ఎవరికీ 400 రాలేదు అని తెలిసి కాస్త తెరిపిని పడ్డాను.

భాను, సీత, పూర్ణ, ఉష

ఎందుకో తెలియదు కానీ, మా పెద్దన్నయ్య పెళ్లి ఫోటోలలో నేను ఎక్కడా లేను. బహుశా ఉండే ఉంటాను కానీ, అవి ఎక్కడా దొరకడం లేదు. మా పెద్దన్నయ్య పెళ్ళికి, పల్లకీలో ఊరేగింపుకీ పెళ్లి కూతురు వళ్ళో మా ఆఖరి చెల్లెలు ఉష కూర్చుంది. అప్పుడు దాని వయసు 5 ఏళ్ళు. ఆ రోజుల్లో తనకి తీసిన ఫోటో అంటే మా కుటుంబం అందరికీ ఇప్పటికీ చాలా ఇష్టం. అది ఇక్కడ జతపరిచాను. పెళ్ళవగానే మా గడ్డి మేటు దగ్గర మా చెల్లెళ్ళు ముగ్గురు, మా వదిన గారి పేద చెల్లెలు సీత తో తీసిన ఫోటో కూడా ఇక్కడ జత పరిచాను. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు. నేను, మా తమ్ముడు నిక్కర్లు వేసుకుని, చొక్కాలు టక్ చేసుకుని టక, టకా మూడున్నర అడుగుల పొడుగ్గా తిరుగుతూ ఉంటే ఆయన ఎత్తులో మూడో వంతు కూడా లేని మమ్మల్ని చూసి మా కరప మామయ్య గారు “అచ్చు దొరల పిల్లల్లా ఉన్నారు” అని మురిసి పోయేవారు. మమ్మల్ని ఆయనా, అత్తయ్య గారూ జీవితాంతం అలాగే, నేను అమెరికా వచ్చేసి పెళ్ళాం, పిల్లల్లతో చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా అంత అభిమానంగానూ ఉండే వారు. మా పెద్దన్నయ్య పెళ్ళితో మా అమ్మ ఆప్యాయత తో సరితూగగలిగే మరొక అమ్మ లాంటి పెద్ద వదిన మా ఇంట్లో అడుగు పెట్టడం ఎంత ముఖ్యమో, ఆవిడ తమ్ముళ్ళు వెంకట్రావు, కంచి రాజు మాకు బంధుత్వం కన్నా స్నేహితులుగా ఆ తరువాత దశాబ్దాల పాటు నిలబడడం అంతే ముఖ్యం.

మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి 5 ఏళ్లప్పుడు

మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి 5 ఏళ్లప్పుడు

నా కంటే చిన్నవాడైన కంచి రాజు కరప సర్పంచ్ గా ఆ గ్రామానికి మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేసి, హై స్కూల్ కట్టించి, రాజకీయంగా పైకి వస్తూ, విధివశాత్తు ఎవరికీ అంతుపట్టని ఊపిరి తిత్తుల వ్యాధితో మూడేళ్ళ క్రితం హఠాత్తుగా మరణించి దేవుడు చేసే అన్యాయాలకి ప్రతీకగా నిలిచాడు. దివంగతులైన కంచి రాజు, పెద్దన్నయ్య, మా అబ్బులు బావలతో వెంకట్రావు ఉన్న ఫోటో ఇందుతో జతపరుస్తున్నాను. ఇప్పటికీ నేను ఎప్పుడు కాకినాడ వెళ్ళినా నా వయసు వాడే అయిన వెంకట్రావు తోటే ఎక్కువ సమయం గడుపుతాను. ఆస్తిపాస్తుల విషయాలలో మా అందరికీ అతనే, ముఖ్యంగా నాకు, ముఖ్య సలహాదారుడు. మామయ్య గారి తరువాత అతనే కరప గ్రామ కరిణీకం చేసి, రిటైర్ అయ్యాడు. ఇప్పుడు అతని కొడుకు విలేజ్ ఆఫీసర్ గా ఉన్నాడు.

ఈ ఫోటోల విషయంలో ఒక చిన్న పిట్ట కథ చెప్పాలి. ఆ రోజుల్లో ఇంట్లో ఫోటోలు తియ్యాలంటే అయ్యగారి సూర్యనారాయణ అనే ఆయన్ని పిలిచే వారు. ఆయనకీ మెయిన్ రోడ్ మీద స్టూడియో ఉన్నా ఇంటిల్లి పాదీ అక్కడికి వెళ్ళే అవకాశమూ లేదు. వెళ్ళినా ఆ చిన్న గదిలో ఇద్దరు, ముగ్గురు కంటే పట్టరు. అంచేత ఫోటో గ్రాఫర్ ఫలానా రోజున ఇంటికి వస్తున్నాడు అనగానే నాలుగైదు రోజుల ముందు అందరూ శుభ్రంగా క్షవరం చేయించుకుని, బట్టలు ఉతికించి, ఇస్త్రీ చేయించి రెడీగా ఉండే వాళ్ళం.

రంగు ఫోటోలు అంటేనే తెలియని ఆ రోజుల్లో ఏ రంగు బట్టలు వేసుకుంటే ఆ బ్లాక్ & వైట్ ఫోటోలలో బాగా పడతారు అనీ, ఆడా, మగా ఫొటోలకి తేడా ఉంటుందా అనీ, వెనకాల బేక్ గ్రౌండ్ తెల్ల గోడా, లేక పువ్వుల డిజైన్లు ఉన్న దుప్పటీలు కట్టాలా అని రక రకాల చర్చలు జరిగేవి. ఇప్పుడు తలచుకుంటే నాకు భలే నవ్వు వచ్చే డైలాగు మా అమ్ముమ్మదే…”అమ్ముమ్మా, రేపు ఫోటోలాయన వస్తున్నాడు” అనగానే మా అమ్ముమ్మ సంతోషపడి పోయి “పోనీ, గారెలు, అరిసెలు చెయ్యమంటారేమిటర్రా?” అంది.

పెళ్ళయి , యాభై ఏళ్ళకి పైగా కాపురం చేసిన మా పెద్దన్నయ్య, పెద్ద వదినల మూడు, నాలుగేళ్ల క్రితం నాటి ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. వారికి పిల్లలు లేరు కానీ, మేం అందరం అలాగే పెరిగాం. “దివాణం” అని పిలవబడే వంగూరి సూర్య ప్రకాశ రావు అనే మా పెద్దన్నయ్య రెండేళ్ళ క్రితం పోయాడు.

 

Download PDF

2 Comments

  • ACHANTA SRIDHARA RAO says:

    మీ “పెద్దన్నయ్య పెళ్లి కబుర్లు “చాలా ఆసక్తికరం గా ఉన్నాయి.
    పూర్వకాలపు మా కుటుంబాల పెళ్లి జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్ళాయి .
    .

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ధన్యవాదాలు, శ్రీధర రావు గారూ….

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)