‘లాల్ బనో ….’ కవి: అలుపెరగని ఎర్ర కవిత!

10801896_10152571579726700_7233801900523835577_n ఒకానొక జనవరి నెల సంక్రాంతి రోజుల యెముకలు కొరికే చలి కమ్ముకున్న ఉదయపు కాలం! దాదాపు 24 గంటల విరసం సర్వసభ్య సమావేశం తర్వాత చర్చల్లో వేడెక్కిన వాతావరణంలో శీతాకాలపు మంచుతెరల్ని చీలుస్తూ ఒక కంఠస్వరం – వొక కవిది ….

“తోటా రాముని తొడకు కాటా తగిలిందాని

చిలుకా చీటీ తెచ్చెరా ఓ విలుకాడ ..”

శివసాగర్ పాట – గొప్ప ఉద్విగ్నత తో పాడుతున్నది – కళ్ళు మూసుకుని పూర్తిగా లీనమై – మూసిన కళ్ళ వెనుక తడి –

మధ్యలో “వాగూ వల వల యేడ్చెరా …” అనే చరణం పాడుతున్నప్పుడు తానే వాగై వల వల యేడుస్తూ .

పాట ప్రవహిస్తోంది –

“చెల్లెలా చెంద్రమ్మా …” అంటూ మరొక పాట శివసాగర్ దే మరింత ఉద్విగ్నతతో –  ఒక చరణం లో

“కత్తి యెత్తి వొత్తి పొత్తి కడుపులో గుచ్చి …”

భూస్వామి కడుపులో చెంద్రమ్మ గుచ్చిన కత్తి కసిని గొంతునిండా నింపుకొని పదునుగా ….

ఆ పాట కాగానే మరొకటి శివసాగర్ దే ….

“మేరిమి కొండల్లో మెరిసింది మేఘం …”

ఉద్యమాల్లో వెనుదిరుగక మునుముందుకే యెన్ని త్యాగాలకైనా సిద్ధమై పడవను నడిపే విప్లవకారుల నుద్దేశించిన పాట –   అట్లా వరుసగా పాడుతూనే ఉన్నారాయన! అలుపు లేదు – గొంతులో అదే ఉద్విగ్నత జీరగా – అరమోడ్పు కళ్ళ వెనుక అదే తడి – అదే ఆవేశం, అదే యెమోషన్ –

ఆయనే యెన్ కే. యెన్ కే పేరు తో కవిత్వం రాసి కవి గా ప్రసిద్దికెక్కిన అతని పూర్తి యెన్ కే రామారావు అని తర్వాత తెలిసింది. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ లాబ్ లో రసాయనాలతో పని చేసే ఆయన జీవిత సత్యాలని మానవ సంబంధాల రసాయనాలతో ప్రయోగాలు చేసి కనుక్కుని వచన కవిత్వం లోనూ పాటల్లోనూ అద్భుతంగా పలికించాడు. ముఖ్యంగా విరసం సమావేశాలకు, ఆయన వస్తాడు పాడతాడు అని, ఆశగా వెళ్ళేవాళ్ళం.

యెందుకంటే మాకు ఆ అవకాశం వేరే సందర్భాల్లో దొరికేది కాదు. ఆయన కనబడగానే యెన్ కే పాట పాడవా అని అడిగామో లేదో ఒక పక్క కూర్చుని కళ్ళు మూసుకుని పాడే వాడు. శివసాగర్ అగ్నాతంలోనుండి రాసి పంపే ప్రతి పాటకు బహుశా తనదైన ట్యూన్ కట్టి గొప్ప నిమగ్నతతో ఉద్విగ్నతతో పాడే వారు యెన్ కే. ఆయన కవిత్వం కూడా అంతే ఎమోషనల్ గా ఉండేది. ఆయన రాసిన పాటల్లోనూ తనదైన ఒక విశిష్టత – ముఖ్యంగా చిత్తూరు లో బూటకపు యెంకౌంటర్ లో పోలీసులచే హత్య చేయబడ్డ నాగరాజు గురించిన పాట

ఒక చేత్తో కన్నీరు తుడుచుకుని

వేరొక చేత్తో ఎర్ర జండ యెత్తుకుని

అంటాము మేము నాగరాజు

గుండెల మండేవు రాజుకుని రోజు రోజు

తెనాలి సభలో ... (జుగాష్ విలి సౌజన్యంతో)

తెనాలి సభలో …
(జుగాష్ విలి సౌజన్యంతో)

యిది యెన్ కే పాడుతుంటే వినడం ఒక అనుభవం. మొదటి సారి విన్నప్పుడే విపరీతంగా నచ్చేసి నాకు వచ్చీ రాని శ్రుతి లయ తాళాలతో పాడడానికి ప్రయత్నించే వాణ్ణి. ఈ పాట నాకూ నా సన్నిహిత మిత్రబృందం సుధాకిరణ్, ప్రకాష్ లకు చాలా యిష్టం కూడా! అట్లే మిత్ర (అమర్ ) కూడా బాగా యిష్టపడేవాడీ పాటను. నా ట్యూన్ మిత్ర నుండే నేర్చుకున్నా (యెన్ కే పాడే ట్యూన్ కొంచెం వేరని తెలుసు, కానీ నాకెప్పుడూ అది పట్టుబడలేదు – ఆ విషయం విమల (కవి) చెప్పే దాకా నాకు తెలియలేదు ).

దూరాన తెరచాప అంచు

క్రమించి నావ తీరమాక్రమించు

ఉదయించే తొలివెలుగుల తూర్పు

ఆర్పలేదు విప్లవాన్ని యే పడమటి గాడ్పు

తెరచాపలు గాలి లోన ఆడుదాక

ఆకాశం యెర్రకాంతులీనుదాక

అంటాము మేము నాగరాజు

నువ్వు అమరుడివీ అమరుడివీ యీ రోజూ యే రోజూ …

 

యెప్పుడు ఈ పాట గుర్తుకొచ్చినా, నాలో నేను పూర్తిగా పాడుకుని యెన్ కే నూ, విప్లవం లో అమరులైన వేలాది మందినీ గుర్తు తెచ్చుకోవడం నాకు అలవాటయిపోయింది. యింక ఆ యెన్ కే గొంతు యెన్నడూ వినబడదంటే చాలా దుఃఖంగా ఉంది. గొంతు కు శాశ్వతంగా యేదో అడ్డం పడ్డట్టుంది. గ్నాపకాలు తేనెటీగల్లా ఝుమ్మంటూ ముసురు కుంటున్నాయి.

గద్వాల విరసం సభ్లలో యెన్ కే ఒక్ అద్భుతం చేసారు. ఆ రోజుల్లో ప్రగతి శీల శక్తులపై యే బీ వీ పి, ఆర్ యెస్సె స్ శక్తుల దాడులు విపరీతంగా ఉండేవి. దాదాపు వారానికి రెండు మూడు సంఘటనలు జరిగేవి. చాలా మంది ఆర్ యెస్ యూ పీ డీ యెస్ యూ కార్యకర్తలు ఆ దాడుల్లో అమరులయ్యారు కూడా! హైదరాబాదు లో వరంగల్ లో చాలా గోడల మీద యే బీ వీ పి వాళ్ళు ‘లాల్ గులామీ ఛోడో బోలో వందే మాతరం’ అంటూ రాసేవారు . దేశభక్తి అంటే తమ స్వంత సొత్తు అయినట్టు వందేమాతరం పై తమదే హక్కు అన్నట్టు యే బీ వీ పీ కార్యకర్తలు ప్రవర్తించే వారు. దౌర్జన్యానికి పాల్పడేవారు. ప్రగతిశీల విద్యార్థులది విదేశీ సిద్దాంతమని వారి ప్రధాన ఆరోపణ! అట్లా మతోన్మాద శక్తులు విచ్చలవిడిగా చరిత్రను వక్రీకరించి వీరవిహారం చేస్తున్న రోజుల్లో వారికి ధీటైన సరైన సమాధానం చెప్పడానికి మేమంతా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ‘లాల్ బనో గులామీ ఛోడో బోలో వందేమాతరం’ అంటూ ఒక అద్భుతమైన దీర్ఘకావ్యాన్ని రాసారు యెన్ కే!

మొత్తంగా ప్రపంచ, భారత దేశ చరిత్రనూ, నాగరికతనూ కవిత్వాత్మకంగా చెప్తూ , జాతీయోద్యమ కాలంలో వందేమాతరం యెట్లా ఉద్భవించిందో అది యెట్లా ప్రగతిశీలమైందో సోదాహరణంగా వివరిస్తూ చాలా ఉద్విగ్నంగా అద్భుతంగా , ఒక్కొక్క కవితా చరణం ఒక గొప్ప నినాదమంత గొప్పగా (కవిత్వం నినాదప్రాయం అవుతుందనే వారు, ఒక చరణం నినాదం కావాలంటే యెంత గొప్ప కవిత్వం కావాలో మనకున్న గొప్ప నినాదాలని పరిశీలిస్తే అవగతమౌతుంది) మొత్తం దీర్ఘ కావ్యం సాగుతుంది. ఆ రోజుల్లో మాకు ఆ కావ్యం గొప్ప ఆయుధం. యెక్కడ మతోన్మాద శక్తులతో తలపడాల్సి వచ్చినా ఆ కావ్యం గొంతెత్తి బిగ్గరగా చదివేది. ఆ కావ్యానికి మా ప్రత్యర్థుల దగ్గర సమాధానం ఉండేది కాదు. అట్లా ఆర్ యెస్సె యెస్ యేబీ వీ పి శక్తుల ప్రాబల్యం చాలా బలంగా ఉన్న గద్వాల లో విరసం మహాసభలు జరిపింది.

చివరి రోజు జరిగిన మహా సభలో పాటలు, ఉపన్యాసాల మధ్య యెన్ కే ను ‘లాల్ బనో గులామీ చోడో ..’   చదవమన్నారు. యేకబిగిన ఒక అరగంట పాటు అరుదైన శైలితో, గొప్ప ఉద్విగత, ఆవేశమూ , తడి నిండిన తన గంభీర కంఠస్వరంతో యెన్ కే కావ్యాన్ని గానం చేసారు. వచన కావ్యమైన ‘లాల్ బనో …; ను లయబద్దంగా యెన్ కే చదువుతుంటే వినడం ఆ రోజు ఒక జీవితకాల అనుభవం! యిప్పటికీ యెప్పటికీ మర్చిపోలేని గొప్ప మహత్తర అనుభవం! దాదాపు పది వేల మందికి పైగా హాజరైన ఆ బహిరంగ సభ మొత్తం నిశ్శబ్దంగా పూర్తి నిమగ్నమై విన్నారా కావ్యాన్ని! అయిపోగానే కెరటాల చప్పుడులా కరతాళధ్వనులు! యెన్ కే ను మనసారా అభినందించి కౌగలించుకున్నాము – ఆ రోజునుండీ ప్రగతిశీల శక్తుల చేతుల్లో గొప్ప ఆయుధమైంది యెన్ కే ‘లాల్ బనో ..’ కావ్యం! మా హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు యెన్ కే !

తర్వాత దాదాపు పదికి పైగా సభల్లో (నేను హాజరైనవి..) యెన్ కే ‘లాల్ బనో ..’ కావ్యాన్ని గానం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ కావ్యం చాలా ప్రాచుర్యం పొందింది. అనేక ముద్రణలు పొందింది. పాపినేని శివశంకర్ సంకలనం చేసిన ‘కవితా ఓ కవితా ‘ లో చోటు సంపాదించుకుంది. మళ్ళీ మతతత్వ శక్తులు పేట్రేగిపోతున్న ఈ రోజుల్లో యెన్ కే ‘లాల్ బనో …’ మళ్ళీ వెలుగు చూడాల్సిన అవసరం యింకా యెక్కువ ఉన్నది. ‘లాల్ బనో…’ కావ్యం ప్రగతిశీల శక్తుల అమ్ముల పొదిలో ఒక విలువైన బాణం.

యెన్ కే సృజన సాహితీ మిత్రుల్లో ఒకరనీ, బహుళ ప్రాచుర్యం పొందిన పాటలూ, కవిత్వమూ అనేకం రాసారని తెలిసి ఆయన మీద గౌరవం పెరిగింది.తర్వాత ఆయనను యెక్కువ ప్రత్యక్షంగా కలవలేకపోయినా ఆయన సమాచారం తెలుస్తూ ఉండేది. ఆయన కవిత్వం, పాటలు యెప్పుడూ గుండెల్లో మార్మోగుతూ ఉంటుంది. అద్భుతంగా అనేక పాటలని తన గొంతులో ప్రతిధ్వనించిన యెన్ కే అనారోగ్యం పాలయ్యారని, సరిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని తెలిసి చాలా బాధ కలిగింది. ఇవాళ్ళ యెన్ కే యింక మనకందనంత దూరం వెళ్ళిపోయారని తెలిసి హతాశుణ్ణయ్యాను. ఆయన కంఠస్వరం. కళ్ళలోనూ మనసులోనూ యెన్నడూ ఆరని తడి, గొప్ప ఆత్మీయతా , స్నేహస్వభావం యెన్నడూ మర్చిపోరానివీ, యెప్పుడూ వెన్నంటే ఉంటాయి.

-నారాయణస్వామి వెంకట యోగి

 

Download PDF

11 Comments

  • Potu rangarao says:

    N కే కి జోహార్ .నారాయణస్వామి గారు పాట gata తన్ని గుర్తు చేసారు.థాంక్స్.

  • Potu rangarao says:

    గతం Kante నేడు మతన్మోదం ప్రమాదంగా మారింది.నేడు మరింత మంది ఎన్ కే లు kavaali .

  • attada appalnaidu says:

    నారాయణస్వామి గారూ ,ఎన్కే ఇక లేరన్న వార్త బాధిస్తోంది.అతని గళం నుంచి మీలాగే నేను ఆ పాటలు ,లాల్ బానో…కవిత అబ్బ ఎంత ఉపెసెవి?ఎన్కే ,నన్ను చూడగానే ‘బిడ్డికోడా'(నా అరణ్య పర్వం కథలో ఒక పాత్ర)అని పిలిచేవాడు…లాల్ సలాం..ఎన్కే…

  • Basith says:

    నిన్న రాత్రి 8 గంటలకు కామ్రేడ్ యెన్ కె కార్డియాక్ అరెస్ట్ తో హనుమకొండ రోహిణి ఆసుపత్రి జరిగి పోయారని తెలియ గానే ఒక్కసారిగా అవాక్కయ్యాను. నిన్ననే , శ్రీ శ్రీ , వి వి , చేరబండ వేదిక మీద కూర్చున్న సభలో యెన్ కె పాడుతున్న ఫోటో ను జుగాష్ విలీ పేస్ బుక్ లో పోస్ట్ చేశారు ఉదయం పూట. రాత్రయ్యే సరికి, ఆ మనిషి పోయాడనే సమాచారం విరసం కార్యదర్శి వరలక్ష్మి ఫోన్ లో చెప్పడం తో మాటలు రాలేదు. ఆయన జీవిత చరమాంకం లో పరిచయ మైన నా లాంటి వారికే ఆయన మరణం విరసానికి,సాహితీ ప్రపచానికి తీరని లోటు అన్పిస్తోంది . అతనితో , విరసం ఆవిర్భావం, అంతకు ముందు మిత్రమండలి , సాహితి మిత్రులు తో ఉన్నప్పటి నుంచి ఉన్న వారికి ఎంతటి దుఖ్ఖాన్ని మిగుల్స్తుందో కదా!
    లాల్ బానో … గులామీ చోడో దీర్ఘ కవిత , మీరన్నట్లు దీర్ఘకావ్యం ఇవ్వాటి బ్రాహ్మణీయ హిందుత్వ సందర్భం లో ఎంత రెలెవెన్స్ ! యెన్ కె కు ఎర్రెర్రని వందనాలు…_
    బాసిత్

    • Satyanarayana Rapolu says:

      వైద్యశాల బదులు ఆసుపత్రి అనే అభాస పదాన్ని అంతటా వాడుతున్నరు. ఆసుపత్రి
      అసలైన తెలుగు పదమైనట్లు భ్రమిస్తున్నరు. హాస్పిటల్ అనే ఇంగ్లిష్ పదానికి
      అనుకరణగా ఆంధ్రా వారు ప్రచారంలోనికి తెచ్చిన పదమది. తెలుగులో సరియైన పదం
      లేక పోతే ఇతర భాషా పదాలను ఆదానం చేసికోవచ్చు. అది దోషం కాదు! అటువంటి
      అప్పుడు కూడా యధాతథంగా తీసికోవచ్చు. ప్రజలు పలుక గలిగిన ‘హాస్పిటల్’ను
      మార్చవలసిన అవసరం లేదు. స్వచ్ఛమైన పదం ‘వైద్యశాల’ ఉండగా ఈ విచిత్ర
      పద ప్రయోగంలో, స్వీకారంలో ఔచిత్యం ఎంత మాత్రం లేదు. ప్రజల మీద రుద్దిన
      అవకర పదం ఆసుపత్రి ని పరిహరించాలె. ‘వైద్యశాల’ మాత్రమే వ్యవహారంలో
      ఉండే విధంగా శ్రద్ధ తీసికోవాలె. వైద్యశాల, దవాఖాన, హాస్పిటల్ సరియైన పదాలు.

      • అభాస అన్న మాట కూడా ఆంధ్ర వారు ప్రచారం లోకి తెచ్చిందే ! ఆంధ్ర శబ్ద రత్నాకరము మొదలైన నిఘంటువులలో చూడొచ్చు !!

  • కెక్యూబ్ వర్మ says:

    ఎన్.కె.అమర్ రహే.. తన జ్ఞాపకాల సృజన స్పర్శను భావోద్విగ్నతతో అందించిన మీకు వందనాలు సార్.

  • నిశీధి says:

    నా లైఫ్ లో విషాదం ఏమిటి అంటే చాల విప్లవ కవులని గురించి ఇంటర్నెట్ అందిస్తే తెలుస్కోనే టైం లో రియల్ కవులు బ్రతికి ఉన్నపుడు తెలియకపోవటం :(

  • Satyanarayana Rapolu says:

    ఎన్.కే.గారికి శ్రద్ధాంజలి! సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు బోధనతో కూడా తనదైన భావజాల ఉద్వేగాన్ని ప్రసారం చేసిన ఎన్.కే. ప్రతి సందర్భాన్ని ఒక వేదికగా మలచు కొన్నరు. కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్.డి.ఎల్.సీ.ఈ. లో బీ.సీ.జే. కోర్స్ కోఆర్డినేటర్ గా అయన సేవలు మరచి పోలేము. నాతో పాటు, దేవులపల్లి అమర్ మొదటి బాచ్ విద్యార్థులకు విస్తరణోపన్యాసమ్ ఇచ్చినప్పుడు, ఎన్.కే. వెంట ఉండి విద్యార్థులకు పరిచయం చేసిండ్రు.

  • వెబ్ మేగజైన్ కాబట్టి వారి గొంతుని వినే అదృష్టాన్ని కూడా కలగజేసి వుంటే బాగుండేది .

  • raghava says:

    ” ………………..”

Leave a Reply to కెక్యూబ్ వర్మ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)