ఈమె…అలిశెట్టి ప్రభాకరూ…

drushya drushyam-alisetti

అదృష్టమో దురదృష్టమో నగర జీవితంలో ఉంటూ ఉండటం వల్ల ఎన్ని చిత్రాలని!
కానైతే, ఉంటున్నఈ ‘సిటిలైఫ్’ ని ఎంత చూసినా, మరెంత చదివినా, ఎన్నెన్ని దృశ్యాదృశ్యాలుగా చేసినా ఒకరు మాత్రం రోజూ గుర్తుకు వస్తూనే ఉంటారు.

ప్రతి ఛాయాచిత్రం ముగింపులో ఆయన్ని తల్చుకుంటూనే ఉంటాను.
ఆయనే ప్రభాకర్. అలిశెట్టి ప్రభాకర్.

‘మరణం నా చివరి చరణం కాదు’ అన్న కవి కావడం వల్ల కాబోలు, జీవితంలోని ఏ ఘడియను చిత్రించినా, సామాన్యుడి స్థితీ, గతీని ఎలా చిత్రికపట్టినా ఆయన గుర్తుకు వస్తూనే ఉంటాడు.

ఇదొకటే కాదు, ఇలాంటి నా దృశ్యాదృశ్యాలను జీవితంగా చదువుకోవడానికి నేను చాలు.
కానీ, ఇవే చిత్రాలను విప్లవీకరించడానికి మాత్రం అలిశెట్టిని మించిన దృశ్యకారుడిని తెలుగు నేల ఇంకా కనలేదు. చూడనూ లేదు.

నిజానికి అతడు ఒకరే.
పేరుకు కవీ, చిత్రకారుడూ. ఫొటోగ్రాఫరూ.
కానీ, ఆయన పనంతా ఒకటే. ఒక దృశ్యం పరచడం.

కవిత్వంలోనూ, చిత్రాల్లోనూ, తీసిన ఛాయాచిత్రాల్లోనూ ఒకే ఒక అంశం అంతర్లీనం.
అదేమిటీ అంటే కళ్లకు కట్టడం. మంట పెట్టడం. మన లోవెలుపలి నెగడు ఆవరణ అంతా కూడా కాలిపోయేటట్టు అందులోంచి మన ఆత్మలు లేచి శత్రువు మెడను పట్టుకునేటట్లు చేయడం.

దృశ్యాన్ని విప్లవీకరించడం.
మనలో జీవితాన అదృశ్యంగా ఉన్న విప్లవశక్తిని చేతనలోకి తేవడం.
అవును మరి. ఆయన ఒక దృశ్య పాతర.

చిత్రమేమిటంటే, తీస్తున్న నా ప్రతి చిత్రంలో జీవితాన్ని మించి విప్లవం కనిపిస్తే నేను చిత్రించడం ఆపేస్తాను.
ఎందుకూ అంటే అది వేరు. అది ఆయన పని. ప్రతి ఒక్కరూ విప్లవకారులు కాలేరు. నిజం.
alisetti photo frame ion his home
ఇంకో విషయం. ఎవరు కూడా ఆయనంత ఆరోగ్యంగా ఉండలేరు. నమ్మండి.
కావాలంటే ఆయన కవిత్వాన్ని చదవండి. బొమ్మలు చూడండి. తీసిన ఫొటోలనూ గమనించండి.
అతడొక లైఫ్. రెడ్ సల్యూట్.

నిజానికి తెలుగు నేలపై ఒక మనిషి విప్లవాన్ని జీవితం స్థాయిలో బతికించాడూ అంటే అది ఆయనే. ఆయనకు నా దృశ్యాంజలి.

ఒక్కమాటలో ఆయన సామాన్యత విప్లవం
నా పరిమితి సామాన్యతే.
అందుకే దృశ్యాదృశ్యం వేరు. ఒక విప్లవ దృశ్యాదృశ్యం వేరు.
అది ఆయన.

క్లుప్తంగా చెప్పాలంటే…ఎర్ర పావురాలు. మంటల జెండాలు. చురకలు. రక్తరేఖ, సంక్షొభగీతం, సిటీలైఫ్. మరణం నా చివరి చరణం కాదు- ఇవన్నీ ఆయన కవితా సంపుటులు. చిత్రలేఖనాలు. ఛాయా చిత్రణలు.

ఒక పరంపరగా ఆయన రచనా దృశ్యాలు ఒక శర పరంపర.

+++

తాను ఒక కవిత రచించినా, చిత్రం గీసినా, ఛాయాచిత్రం చేసినా దాన్ని కొల్లోజ్ చేసి మరొకటి చేసినా ఒకటే చేశేవాడు. ఆ వస్తువు ఇతివృత్తం మార్చేవాడు. దాన్నికొత్త అర్థాలతో విప్లవీకరించేవాడు. అందుకే అనడం, నేను చిత్రిస్తున్న ప్రతి చిత్రం ప్రభాకర్ ను గుర్తు చేస్తుందని!  కానీ ఆయన దాన్ని ఎంత గొప్ప కవితగా మలిచేవాడూ అంటే అది చదివితే మళ్లీ నేను చూపే దృశ్యాదృశ్యాలను పదే పదే చూడాల్సిన అవసరమే లేదు.

ఉదాహరణకు వేశ్య గురించి ఆయన రాసింది ఎవరైనా మర్చిపోయారా?
లేదు.

నిజం.
ఎందుకంటే ఆయనది విజువల్ మీడియం.
చలనగీతం.

నాది జీవితం.
నిశ్చలన చిత్రం.

+++

చిత్రం ఒకటి చేస్తుంటే ఆ చిత్రంలో జీవితం యధాతథంగా ప్రతిఫలించడమే పనిగా పెట్టుకుని రచన గావిస్తుంటే అది దృశ్యాదృశ్యం. నేను.

కానీ, అదే దృశ్యాన్ని విప్లవీకరిస్తే అది వేరు. ఇక్కడే మనిషికీ విప్లవకారుడికీ ఉన్న తేడా అవగతం అవుతుంది. అది అలిశెట్టి ఫ్రభాకర్.

ఇద్దరిదీ జీవితమే.
కానీ, ఆయనది కల. నావంటి వారిది ఇల.

మొహమాటం లేదు. గులాంగిరీ లేదు. భద్రజీవి కానేకాదు.
అందుకే అతడు లేడు. ఉంటాడు. బతికే చరణం.

సమాజంలో వర్గకసిని ఆయన అంత తీవ్రంగా చెప్పనోడు మరొకడు కనిపించడు.
అట్లే, జీవితంలోని ద్వంద స్వభావాన్ని ఆయన అంత నిశితంగా ఎద్దేవా చేసినవాడూ మరొకడు లేడు.
అయినా ఆయన ఎంచుకున్నది మాత్రం సామాన్యమైన వస్తువును. మనిషిని. అధోజగత్ సహోదరులను.

జనవరి 12 న ఆయన జయంతీ, వర్థంతి.
ఒకటే రోజు చావు పుట్టుకల మనిషాయన.
ఆయన్ని గుర్తు చేసుకోవాలి.

జీవితాంతం తన వాక్యాన్ని, చిత్రాన్ని, ఛాయాచిత్రాన్ని పూర్తిగా దృశ్యాదృశ్యాల పరంపరగా రచించాడని చెప్పడానికి కూడా ఆయన్ని గుర్తు చేసుకోవాలి.

కొత్త సంవత్సరమే. కానీ, ప్రతి కొత్త చిత్రం తీస్తున్నప్పుడూ ఆయనుంటాడని చెబుతూ, దినదినం మరణించకుండా జీవిస్తున్న ప్రతి చిత్రంలోనూ ఆయనుంటాడని గుర్తుచేస్తూ, ఆయన సారస్వతాన్ని దృశ్యాదృశ్యంగా భావించడం నాకు ఎప్పటినుంచో తెలుసని కూడా మనవి చేస్తూ ఈ మహిళ ఛాయా చిత్రం ఈ వారం.

చూస్తూనే ఉండండి.
దారికి ఇరుపక్కలా ఇలాంటి చిత్రాలను చూస్తూనే ఉండండి.
అవి విప్లవిస్తే అలిశెట్టి లేకపోతే ఇవే. ఇంతే.

కానీ, ఈ వేళ, ఈ మహిళా మూర్తిని చూస్తూ ఉంటే, ‘మరణం నా చివరి చరణం’ కాదన్న అలిశెట్టి ప్రభాకర్ ఆమెనే కాబోలనే అనిపిస్తుంది.

ఒక నిద్ర. దీర్ఘనిద్ర.
ఎర్రగా మేలుకొలుపే చిత్రం.

కందుకూరి రమేష్ బాబు

(షొటో క్యాప్షన్…అలిశెట్టి ఇంట్లో అలిశెట్టి ప్రభాకర్ ఫొటోఫ్రేం)

Download PDF

7 Comments

 • చిత్రమేమిటంటే, తీస్తున్న నా ప్రతి చిత్రంలో జీవితాన్ని మించి విప్లవం కనిపిస్తే నేను చిత్రించడం ఆపేస్తాను.
  ఎందుకూ అంటే అది వేరు. అది ఆయన పని. ప్రతి ఒక్కరూ విప్లవకారులు కాలేరు. నిజం.
  నిజం సర్… ఇప్పటికీ ఆయనతో పరిచయం లేకపోయినా ఆయన కవిత్వ చరణాలు చెఇవిలొ మర్మోగుతుంటయి.

  నిజానికి నేను మీ వెంట పడడానికి కారణం ఆయనే. మీ దృశ్యాదృశ్యం లో ఆయన కనిపించడమే.

 • kandu kuriramesh babu says:

  కెక్యూబ్ వర్మ గారు. ‘నిజానికి నేను మీ వెంట పడడానికి కారణం ఆయనే’ అని చెప్పి నాకు సంతోషం మూట గట్టారు ఈ న్యూ ఇయర్ లో.థాంక్ యు సో మచ్. నిజం. అలిసెట్టి ప్రభాకర్ గారు నిజంగా మారు మోగే కవి.

  ‘ప్రతి ఒక్కరూ విప్లవకారులు కాలేరు’ అని నేను ఎంతో ఆవేదనతో ఆ వాక్యం రాసాను. ఎందుకంటే, జేవితం వేరు విప్లవ జీవితం వేరు.

  కాని, ప్రభాకర్ వంటి విప్లవ కవులు మనకు ఎంత గొప్ప చూపును ప్రసాదించారో! ముక్యంగా ‘విజువల్ నరేటివ్’ ఒకటి ఆయనలో ప్రత్యేకం అని గట్టిగా చెప్పాలని ఈ కథనం ఎంచుకునాను.

  అదీగాక, ‘మై సిటీ మై పీపుల్’ పేరుతో నేను ఛాయా చిత్రాలు పేస్ బుక్ లో పోస్ట్ చేసే ముందే నాకు తెలుసు, ‘సిటీ లైఫ్’ అన్నది ఒక ‘సంక్షోబ గీతం’ అని. అయన అడుగు జాడ వేరు, నా వంటి వారిది వేరని! కాని కాలం కొత్త చిత్రకారులను కంటుంది. విప్లవ చాయను కూడా. అందుకే నేను మనుషుల వెంట పడతాను, ఎలా వున్నారో చూద్హమని, చూపుదామని.

  సి యు బ్రదర్.

 • NS Murty says:

  రమేష్ బాబూ గారూ,

  చాలా గొప్పగా ఉంది మీ presentation.

 • Satyanarayana Rapolu says:

  ‘అలిశెట్టి’ని గుర్తు చేసికొన్న ప్రతిసారీ హృదయమ్ ‘మెలి పెట్టి’నట్లుంటది.

  • Naveen Achari says:

   Very nicely presented about alishetty Prabhakar. Really it narrates a deep insight view of the philosophy of the poems of him. nicely carved ramesh babu sir.

 • bharath says:

  చివరి క్షనము వరకి కరెన్సీ నొటుని కాక కలాన్ని నమ్మిన ఒకె ఒక వ్యక్తి మన “అలిషెట్టి”

Leave a Reply to Satyanarayana Rapolu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)