ఒక చారిక

drushya drushyam-5

భుజానికి వేలాడే కన్నుతో రోడ్డుమీదో లేదా వీధిలోనో తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో చేయగలం.
ఒక సీతాకోక చిలుక మరణం కలచివేస్తుంది. ఒక దృశ్యాదృశ్యం.
ఒక కప్ప మట్టిలో అణిగిపోయి, విగతజీవి అయి, ఉట్టి దొప్ప కానవస్తూ ఉంటుంది. అదొక దృశ్యాదృశ్యం.
ఎలుకే కాదు, ఒక పిల్లి కూడా నల్లగా మరణిస్తుంది. అదీ దృశ్యాదృశ్యం.
బతికిన క్షణాలే కాదు, మరణించిన క్షణాలూ బతికిస్తూ ఉంటై, కాళ్లకు తగులుతూ ఉంటై.
నడుస్తూ ఉంటే నడకను మించిన చూపు లేదు.
నడువు, కనిపిస్తుంది జీవన రహదారి.

ఇదీ అదే.
ఒక నడక.

చారిక.

నేను నడుస్తూ ఆగిపోయాను.
అది నడుస్తూ ఉంది, నా వైపు.

గల్లీలో ఒక వైపు.
అది ఇటు…నేను అటు.
అప్పటికే అది దెబ్బ తిని ఉన్నట్టుంది.
రెండు అడుగులు వేసి మళ్లీ అగుతున్నట్టు అడుగు వేయక ఆగుతుంది.

మన దృష్టిలో అడుగు చిన్నదే. కానీ దాన్ని అడిగితే తెలుస్తుందేమో!
అడుగుదామనే ఆగాను.
ఆగిందీ. తీస్తే ఇది.
దృశ్యాదృశ్యం.

+++

అడుగడుగునా దాని కదలిక వేరు.
నిశ్శబ్దంగా ఒక చిన్నప్రాణినే చూస్తూ ఉంటే, దాని ఆయసాన్నే గమనిస్తూ ఉంటే….కెమెరా వ్యూ ఫైండర్ లో అది నాకు ఏనుగే అయింది. దాని మహా విగ్రహాన్ని అర్థం చేసుకుని దాని మహాభినిష్క్రమణం ఎప్పుడో తెలియక, బతుకు జీవుడా అన్నట్టు అది కదులుతూ ఉంటే దాన్ని కనులతో పరికిస్తూ ఆ చారలో గుండా దాన్నికెమెరాతో వెంబడించడానికి నాకు పట్టింది ఒక యుగం.

కదలదే!

ఈ మనిషి దానిపై వేసే వేటు చిత్రమే అని దానికి తెలియక ఆగిందనిపించి, వెనక్కి జరిగి, జ్యూమ్ లెన్స్ ఉందని తోచి వెనుకడుగు వేసి మళ్లీ చిత్రంలో అవసరమైనంత బొమ్మను పట్టడమూ ఒక గ్రఫి. ఫొటోగ్రఫి.

చిత్రమేమిటంటే అది ఆ పగిలిన వాకిలిలోని ఒక సన్నని చారను, ఆ ఛాయను ఆశ్రయించి కదులుతూ ఉండటం. ఆగి ఉండటం. నిలబడిందా కూచుందా చెప్పలేను. కానీ, అప్పుడు తీశానీ చిత్రాన్ని.

ఆ తర్వాత కొన్ని అడుగులే వేసింది.
తర్వాత కుడివైపు తిరిగి ఒకరింట్లోకి వెళ్లింది.
ఆ తర్వాత అదృశ్యం. మిగిలిందే ఈ దృశ్యం.

+++

ఇక మనింట్లో వినిపించేవే. మామూలే.
ఎలుక కనబడుతోంది. బోను వెతకాలి.
ఎలుక వచ్చి పడింది. ర్యాట్ పాడ్ కొనాలి. దాని సంగతి చూడాలి.
ఎన్ని మాటలో. ఎంత చికాకో.
కానీ దానికి వినపడుతుందో లేదోగానీ, ఆ ఇంట్లో అది తప్పక కనిపిస్తుంది వాళ్లకు.
అంటూనే ఉంటారు, ఏవేవో!

కానీ చిత్రం.
ఈ చిత్రం వాళ్లింట్లో ఉండదుగానీ మీ ఇంట్లో ఉంటుంది.
మీరు వేరే తరీఖ చూస్తారు. అది నా అదృష్టం. దాని అదృష్టమూ.
అదే దృశ్యాదృశ్యం.

కానీ, చిత్రాతి చిత్రం పాత ఇళ్లు.
పాత వీధులు. పాత నగరాలు…అక్కడే ఇవి ఎక్కువ.
కానీ, కొత్తగా అవి ఎప్పటికప్పుడు తమ సర్వైవల్ గురించి ఆలోచిస్తాయి.
వాటికీ రంగు తెలుసు. వాసనా తెలుసు. ఎక్కడ నుంచి నడవాలి. ఎలా కదలాలి. ఎలా తప్పించుకోవాలీ…అన్నీ తెలుసు. అందుకే చార అనడం. చారలో ఎలుక నిలకడ అనడం.

అయినా గానీ, ఎంత కొత్త నగరమైనా ఎప్పటికైనా పాతబడేదే కదా!
మరి ఎలుక ఖాయం. ఎప్పటికైనా.

అందుకే అనడం, మనుషుల ప్రపంచంలో మనుషులే వద్దని ఈ చిత్రం.
చావుబతుకుల జీవితంలో బతుకూ ఒక చిత్రమే అని ఈ చిత్రం.
ఒక రహస్యం…వీధుల్లో నడిచేటప్పుడు ఎవరి దిష్టి లేకుండా దృష్టి లేకుండా తనను తాను కానరాకుండా చేసుకోవడం ఒక దృశ్యాదృశ్యం.

మన జీవావరణంలో తప్పించుకోలేని వర్ణం ఈ చార- చిత్రమనీ చెప్పడం.

అయితే ఒక మాట.
ఎలుక, సుందెలుక, పందికొక్కు…
ఏదైనా కానీ, కనిపించడం గురించి ఒక మాట.

మనం కాళ్లతో నడవడం, చక్రాలున్న మోపెడ్ పై వెళ్లడం, మూడు లేదా నాలుగు చక్రాల వాహనంపై పయణించడం -బాగానే ఉంది. కానీ, ఎలాగో ఒకలాగ కాదు, నడిచినప్పుడు కనిపించేవి వేరు. ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్లేప్పుడు వేరు. ఎవరైనా తోడు ఉన్నప్పుడు వేరు.  ఇక కార్లలో ప్రయాణించేటప్పుడు ఇంకా వేరు. దృశ్యాదృశ్యం వేరువేరని!

మనం ఉన్నస్థితి ఒక్కటే ప్రధానం కాదు.
మనం వాహికగా ఉండటంతోనే సరిపోదు.
నడవాలి. నడిచినప్పుడు కనిపించేవి వేరు.
నడక వేరుగా ఉంటుందనడానికీ ఈ చిత్రం ఒక ఉదాహరణ.

నా వరకు నేను మనుషులనే చిత్రిస్తానని అనుకోలేదు.
ఎలుకలని కూడా. పిల్లులని కూడా చిత్రిస్తూ ఉన్నాను..
నా నడక ఇది.

ఐతే,, నడక చిత్రం ఒక చెలగాటం.
అవును. ఒక్కోసారి పిల్లీ ఎలకా చెలగాటం.
చూశారా ఎప్పుడైనా.
అదొక సర్కస్.

పట్టుకుని వదిలి… మళ్లీ పట్టుకుని వదిలి…
పిల్లి ఎంత సాధిస్తుందో, ఎంత ఆనందిస్తుందో తెలుసా, ఎలుకని!
దానికి పిల్లలు పుట్టవచ్చుగాక. అది ఆహార సముపార్జనే కావచ్చు. కానీ ఎలుక ఒక ప్రాణి. దానికీ కథ ఉంది.
అది దాచుకుని దాచుకుని బతకడం…ఒక చీకటి చారను చూసుకుని దానిగుండా బిక్కు బిక్కుమంటూ వెళ్లడం ఒక ఛాయ. అందుకే మనిషికి చెప్పడం. నీలాగే దానికీ క్రీనీడల్లోంచి వెళ్లడం తెలుసని!.

ఇంకా చెబితే…
నడిచి చూడు. దానిలాగా అని!
ఆగిఆగి. మెలమెల్లగా కదిలి చూడు…బతుకుతావు పదికాలాలు.
ఇక ఇంట్లోకి వెళ్లు. అదే దృశ్యాదృశ్యం.

 

–  కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

Download PDF

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)